July 6, 2022

ఔషధ విలువల మొక్కలు

రచన: నాగమంజరి గుమ్మా

1. బృహతిపత్రం

చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి*
జ్వరము, కఫము కట్టు వాంతులున్ను*
వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే*
ఏకదంతుని కిది మోకరిల్లె*

ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే. జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఔషధం. పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు.

2. బిల్వ పత్రం

శివకేశవులకు ప్రీతిగ*
నవలీలగ వేడి మాన్పె డమృత తరువిదే*
శివ పుత్రుడు కపిలుండై*
వివరముగా పూజలందు బిల్వమన నిదే*

ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి అని పూజించే బిల్వ పత్రానికి మరొక పేరు మారేడు. ఈ మారేడు శివునికి, విష్ణువుకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాగే వినాయకునికి కూడా… ఇంక ఔషధ గుణాల విషయానికి వస్తే, మారేడు ఆకులు వేసి, పది నిమిషాలు ఉంచిన నీటిని తాగితే కఫం దూరమవుతుంది. మారేడు పండు గుజ్జు షర్బట్ చేసుకుని తాగితే మండువేసవిలో ఎండదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంకా ఈ మారేడు దళాలను ఒకసారి పూజించిన తర్వాత మరల నీటితో కడిగితే, మరొకసారి కూడా పూజకు ఉపయోగించుకోవచ్చునట.

3. అపామార్గ పత్రం

ఉత్తరేణి పేర నుత్తమౌషధమిది*
పంటి గట్టిదనము పట్టు పెంచు*
పాపల వరదాయి వంధ్యత్వ నాశిని*
పల్లెటూళ్ల నెరుగు బల, హితకరి*

ఓం గజ కర్ణికాయ నమః అపామార్గ పత్రం పూజయామి అని ప్రార్ధిస్తూ వేసే నాల్గవ పత్రం ఈ ఉత్తరేణి. పల్లెల్లో కుచ్చిన పుల్లలు అంటారు. వీటి ప్రయోజనం పల్లె ప్రజలకు బాగా తెలుసు. పసి పిల్లలకు బలం చేకూర్చడం, అన్న హితవు కలిగించడం తో పాటు… ఇంకా ఎన్నో వ్యాధులకు ఈ ఉత్తరేణి మందు. ఈ మొక్కను సమూలంగా (వేళ్ళు కూడా తెగకుండా) తీసి బాగా ఇసుక, మట్టి లేకుండా కడిగి, నీడను ఆరబెట్టాలి (ఎండబెట్టకూడదు). బాగా ఆరిన తర్వాత కాల్చి మసి చేసి ఆ పొడితో పళ్ళు తోముకోవాలి. లేదా ఆ పుల్లలనే పళ్ళు తోమే కుంచెగా ఉపయోగించవచ్చు. పళ్ళు వజ్రాల మాదిరి గట్టిగా తయారవుతాయి. పుచ్చుపళ్ళు మచ్చుకైనా కనిపించవు. ఇంక ఈ గింజలను పాలతో వాడితే పురుషులలో వంధ్యత్వం పోయి ఆ ఇల్లు పిల్లా పాపలతో కళకళ లాడుతుందట. (ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది).

4. కరవీరపత్రం

చేలకు పట్టిన చీడల*
కాలాంతక మౌను పత్రి కరవీరమునన్*
తూలించు వ్రణములన్నియు*
మాలల కనువైన పూలు మరకత మణులై*

శ్రీ గణేశ పూజలో ఉపయోగించే కరవీర పత్రమునే గన్నేరు అంటారు. ఆకులు, కాయలలోని విత్తనములు కషాయం కాచి పైర్ల పై పిచికారి చేస్తే చీడపీడలు మాయం అవుతాయి. అలాగే వేరు, పై పట్ట నూరి లేపనం లా రాస్తే ఎటువంటి మొండి గడ్డలైన, వ్రణము లైనా ఇట్టే తగ్గిపోతాయి. పచ్చని మణుల్లా మెరిసే ఈ పువ్వులు దేవుని పూజకు, మాలకు ఎంతో శ్రేష్ఠము.

5. *మాచీపత్రం*

పసి పిల్లల సంజీవని*
పసిపిల్లల జేజి పూజ ప్రారంభమిదే*
కిసలయముల నూరి యలద*
విసవిసమను వ్రణములన్ని పేరిదె మాచీ*

ఒకప్పుడు ప్రతి ఇంటా గుబురుగా పెరిగి, నేడు కనుమరుగైన మొక్క మాసుపత్రి. దీనినే మాచీపత్రం అనికూడా అంటారు. ఇవి నేలకు జానెడు ఎత్తున మాత్రమే పెరుగుతాయి. పసిపిల్లల అన్నిరకాల అనారోగ్యాలకు చెప్పదగిన మందు. ఈ మొక్క చిగుళ్లను నూరి పెడితే ఎంతటి వ్రణమైనా (కురుపులు/ పుండ్లు) ఇట్టే తగ్గిపోతాయి. శ్రీ గణేశుని పూజలో తొలి పత్రి ఇదే.

2 thoughts on “ఔషధ విలువల మొక్కలు

  1. చక్కటి సమాచారం.. వినాయక చవితి రాబోతున్న తరుణంలో ఉపయుక్తమైన సమాచారం..
    నాగమంజరికి ధన్యవాదాలు..

Leave a Reply to మార్గయ్య Cancel reply

Your email address will not be published. Required fields are marked *