March 29, 2024

కంభంపాటి కథలు.. ఆవిడేమందంటే..

రచన: రవీంద్ర కంభంపాటి

‘ఏమిటి..నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు?
‘ఆఁ..ఏం లేదూ.. పక్కింటి స్వర్ణ గారి మాటలు గుర్తొచ్చి
‘ఏవన్నారు ఆ స్వర్ణ గారు?’
‘ఆవిడేమందో మీకెందుకండీ అంత ఆసక్తీ?
‘నువ్వేదో అన్నావని అడిగేను గానీ.. ఆవిడ గురించి ఆసక్తీ లేదు.. ఆవిడేమందో వినే శక్తీ లేదూ ‘
‘ఆఁ.. ఏదో అలా పైకంటారు గానీ.. మీకెప్పుడూ అవతలాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అని.. మహా ఇది!.. నిజం చెప్పండి.. అత్తగారి మీద ఒట్టేసి.. మీకాసక్తి లేదని చెప్పండి ‘
‘సరే.. మీ అమ్మ.. అదే మా అత్తగారి మీద ఒట్టేసి చెబుతున్నా.. నాకాసక్తి లేదు ‘
‘ఇక్కడ అత్తగారు అంటే.. మా అత్తగారు.. అంటే మీ అమ్మగారు ‘
‘మరా మాట స్పష్టంగా చెప్పొచ్చు కదా ‘
‘అవును మరి.. మీ ఈ వెఱ్ఱి తెలివితేటలన్నీ నా మీదే ప్రదర్శించటం.. సర్లెండి.. ఇంతకీ ఆవిడేమందంటే.. ‘
‘వద్దు బాబూ.. ఆవిడేమంటే నాకెందుకు.. మళ్ళీ ఆసక్తి అంటూ శక్తిలా నామీదడతావు ‘
‘అంటే.. నేను మీకు శక్తిలా కనబడుతున్నానన్నమాట.. వెక్ వెక్ ‘
‘శక్తి అంటే..అమ్మవారు.. పోలిక మంచిదే కదే.. ఇప్పుడా వెక్ వెక్ అంటూ ఏడుపెందుకూ?’
‘నేనెలా ఏడిస్తే మీకెందుకు లెండి.. ‘
‘నువ్వెలా ఏడుస్తున్నావన్నది కాదు పాయింటు.. ‘
‘అవునులెండి..ఆవిడేమందన్నదే కదా పాయింటు..వెక్ వెక్ ‘
‘ఎహె.. నన్ను పూర్తి చెయ్యనీకుండా.. నీకిష్టమొచ్చినట్టు ఏది బడితే అది అనేసుకుంటావేం?..’
‘అంటే.. నేను ఏది ఎలా అనుకోవాలో కూడా మిమ్మల్ని అడిగి మరీ అనుకోవాలన్నమాట ‘
‘అలా నేనెప్పుడన్నానూ? నీకేదనిపిస్తే అది.. నీకెలా అనిపిస్తే అలా.. నీకిష్టం వచ్చినట్టు అనుకో.. ‘
‘అంతేలెండి.. మీరు చెప్పినట్టే అనుకుంటూ కూచుంటాను.. మీరు మటుకూ హాయిగా ఆవిడేమందో.. ఈవిడేమందో ఆలోచిస్తూ కూచోండి ‘
‘ఆవిడెవరు? ఈవిడెవరు?.. వాళ్లిద్దరూ ఏ గుంపో నాకేం తెలుసు?’
‘గుంపేమిటి?’
‘మంద అంటే గుంపు అనేగా అర్ధం ‘
‘గుంపో.. మందో.. ఇప్పుడా గొడవెందుకు?’
‘నువ్వేగా..ఆవిడే”మందో”.. ఈవిడే”మందో” అన్నావు ‘
‘మీ మొహంలా ఉంది.. ఆవిడేమన్నదో.. ఈవిడేమన్నదో అనడానికి షార్ట్ కట్లా అలా అన్నాను ‘
‘మన మాటల్లో మళ్ళీ షార్ట్ కట్టొకటా.. ముందు అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఏడిస్తే ఎలా?’
‘నేనా? ఏడ్చేనా?
‘అదే..ఇందాక వెక్ వెక్ అన్నావు?’
‘చూసేరా? మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయి ఏడవడం మానేసేను !..వెక్ వెక్ ‘
‘విషయం చెప్పు.. దాన్ని బట్టి నువ్వేడవాలో నేనేడవాలో ఆలోచిద్దాం
‘అక్కడికే వస్తున్నాను.. ఇందాక మీరు నన్నేమన్నారు?’
‘నిన్నా? నేనా?.. ‘
‘భలే అమాయకత్వం నటిస్తున్నారే.. “శక్తిలా నామీదడతావు ” అనలేదూ?’
‘అనలేదని ఎప్పుడన్నానూ?.. అన్నాను ‘
‘శక్తి అంటే అమ్మవారు….అమ్మవారు ఎవరి మీదడతారూ?’
‘రాక్షసుల మీద ‘
‘అంటే..మీకు రాక్షస బుద్దులున్నాయన్నమాట.. చూసేరా? మాటల్లో మీ అసలు రూపం బయటడిపోయిందీ !’
‘ఇదెక్కడి గొడవే? పోనీ.. రాక్షసిలా మీదడతావు అననా? అలా అయితే నీకు ఓకేనా?’
‘అంటే మీరు రాక్షసుడు కాబట్టి.. నేను రాక్షసినవ్వాలా ఏమిటీ?’
‘ఏం?..కాకూడదేమిటి?
‘భక్త ప్రహ్లాద సినిమా చూసేరా?’
‘చూసేను.. అయినా ఆ సినిమా ఇప్ప్పుడెందుకు?’
‘అందులో.. ఎస్వీ రంగారావు గారు రాక్షసుడు.. కానీ అంజలీ దేవి గారు రాక్షసి కాదుగా ‘
‘అవున్నిజమే.. ఆ సినిమాలో అంజలీ దేవి రాక్షసి కాదు ‘
‘.. ఆ సినిమాలో రాక్షసి కాదు ఆంటే.. బయట రాక్షసి అనా?’
‘మరదే.. కీలుగుఱ్ఱం సినిమాలో అంజలీ దేవి రాక్షసే కదా ‘
‘ఏమో బాబూ.. నేనేం అంజలీ దేవి వీరాభిమానిని కాదు.. ఆవిడ ఏ సినిమాలో ఏమిటో గుర్తెట్టుకోడానికి ‘
‘నేను అంజలీ దేవి వీరాభిమానినా? ఎవరు చెప్పేరు?’
‘మీ విషయాలు ఒకరు చెప్పాలా ఏమిటి?..మీకు మీరే బయటడిపోతుంటారు ‘
‘అంటే.. ఆవిడ ఏ సినిమాలో రాక్షసి వేషం వేసిందో చెబితే వీరాభిమానైపోతారా?’
‘ఏమో..మీరు ఆవిడకి ఎందుకు వీరాభిమానైపోయేరో నేనెలా చెబుతానూ?’
‘ఇదంతా తెగేది కాదు గానీ.. బుద్దొచ్చింది.. ఇంకెప్పుడూ మీ స్వర్ణ గారు ఏమందో చచ్చినా అడగను ‘
‘ఆవిడ ఛస్తే మీరు ఆవిణ్ణి ఏమడుగుతారు?’
‘ఆవిడ ఛస్తే కాదు.. నేను ఛస్తే.. హమ్మో..మళ్ళీ.. మీరు ఛస్తే దెయ్యమై ఆవిణ్ణి పట్టుకుని ఏదో అడుగుదామనుకున్నారన్నమాట అంటావు.. సరే.. నేనన్నమాట సరి చేసుకుంటున్నాను… ఇంకెప్పుడూ ఆవిడ టాపిక్ ఎత్తను సరేనా?’
‘సరేగానీ.. ఇందాక మటుకూ.. ఆవిడేమందో కనుక్కోడానికి ఎందుకు అంత ఇంట్రెస్టు చూపించేరండీ?’

*****

1 thought on “కంభంపాటి కథలు.. ఆవిడేమందంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *