March 30, 2023

కథ విందువా … నా మనసుకథ విందువా…

రచన: కోసూరి ఉమాభారతి

వెన్నెల ఆకస్మిక మరణం, ఆమె నుండి అందిన ఉత్తరంలోని సారాంశం… అమ్మాపిన్ని శారదని విపరీతంగా కృంగదీశాయి. వారం రోజులుగా నిద్రాహారాలు మాని, మాటాపలుకు లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన ఆమెని…. తమకి యేళ్లుగా తెలిసిన డాక్టర్. వాణి మీనన్ వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లారు ఆమె భర్త రామ్, కొడుకు సాయి. విషయం వివరించి, చనిపోయేముందు వెన్నెల… శారదకి రాసిన ఉత్తరాన్ని కూడా డాక్టర్ చేతిలో పెట్టారు.
***
ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండుమార్లు చదివింది, న్యూయార్క్ సైకియాట్రిస్ట్, డాక్టర్ వాణి. కౌన్సెలింగ్ రూములో తన ఎదురుగా కూర్చుని మౌనంగా రోదిస్తున్న స్నేహితురాలు శారదని చూసి బాధపడింది డాక్టరమ్మ.
“చూడు మిత్రమా. . . వెన్నెల ఇలా లోకాన్ని వీడిపోవడం నిజంగానే చాలా శోచనీయం. ఆ అమ్మాయి గురించి అప్పుడప్పుడు నీవు చెప్పగా విన్న విషయాలు ఇప్పుడు నా మనసులోనూ మెదులుతున్నాయి. చావుపుట్టుకలు మన చేతుల్లో లేవు కదా శారదా. నీవు చాలా ఒత్తిడికి లోనయ్యావని నీ భర్త వారం క్రిందటే నాకు చెప్పాడు. వెన్నెల ఫ్యూనరల్ సర్వీస్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు నీవు కాస్త నిమ్మళంగా ఉండాలి.” అంటూ డాక్టర్ వాణి . . తన సీటు నుండి లేచి వెళ్లి. . శారద పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి రోదిస్తున్న శారదని ఓదార్చింది వాణి. “వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఇలా నీరసంగా కొనసాగితే, నీ కుటుంబం ఏమవ్వాలి చెప్పు. అందరం కంగారు పడుతున్నాము. డాక్టర్ గా కాక నన్ను నీ నేస్తం వాణి లాగానే భావించు. నీ మనసులోని భారాన్ని దించేసుకో. ” అంటూ ప్రాధేయపడింది వాణి.
కళ్ళు తుడుచుకుని తలెత్తి చూసి, కొద్ధి క్షణాలకి . . నోరు విప్పింది శారద. “నా ఈ ఆవేదనకి . . నీకు తెలియని ఇతర కారణాలు ఉన్నాయి వాణి. సమర్ధించలేని, సమర్ధించుకోలేని ఆ విషయాలు నన్ను నిద్రపోనివ్వడం లేదు. కొన్ని సున్నితమైన విషయాలని నా వెన్నెలనుండి దాచి ఉంచి చాలా తప్పు చేసాను. చిన్నతనంలోనే ఎంత ప్రేమగా ఉండేదో చిట్టితల్లి. చదువులో వెనుకబడిన వీధిలోని పిల్లల్ని, పనివాళ్ల పిల్లల్ని వారానికి మూడురోజులు ఒక్కదగ్గర చేర్చి, చదువు చెప్పేది. వీధిలోని చాలా మందిని ఒప్పించి వీధి కుక్కలకి రోజూ పెరుగన్నం పెట్టే ఏర్పాటు చేసింది. చదువులో, ఆటల్లో, డిబేట్లలో గెలుచుకున్న బహుమానాలతో అలమారా నిండిపోయిందని నవ్వుకునేవాళ్ళం. మా అత్తగారు దాన్ని నెత్తిన పెట్టుకుని చూసేవారు. ఆడపిల్ల లేని లోటు తీరిందని సంతోషించేవారు. ” అంటూ దుఃఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నించింది శారద.
“ఏడవకు శారదా. మీ మధ్య తల్లీ-కూతుళ్ళ బంధం ఇంతలా బలపడినప్పుడు. ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని మీతోపాటు అమెరికాకి తెచ్చేయవలసింది కదా! అప్పటికే నీవు ఏడేళ్లుగా వెన్నెలని సాకుతున్నావు కూడా. ఆ ఆలోచన రాలేదా?” అడిగింది వాణి.
బేలగా చూసింది శారద. “అయ్యో. అక్కడే . . ఆ మా ప్రయత్నాలు బెడిసికొట్టాయి వాణి. వెన్నెలని దత్తత తీసుంటామని అడగటానికి, గంపెడంత ఆశతో నేను, మావారు, మాఅత్తగారితో సహా మా బావగారిని కలిశాము. మరో ఆరు నెలలకి అమెరికా వెళతామని, వెన్నెలకి బంగారు భవిష్యత్తునిస్తామనీ చెప్పాము. మా ప్రతిపాదన విని ఉగ్రరూపం దాల్చాడు మా బావగారు. వెన్నెలకి మాకూ మధ్యన ఉన్న బంధాన్ని తెగ్గొట్టేందుకే కంకణం కట్టుకున్నాడు. మా ఆశల్ని ఏదో అత్యాశలుగా . . మా అభ్యర్ధనని ఒక అవమానంగా భావించాడు ఆ మహాను భావుడు. ససేమిరా అన్నాడు. ‘ “పిన్నమవని, ఆడపిల్లని సరీగ్గా పెంచుతావని, ఇన్నాళ్లూ నీ వద్ద ఉండనిచ్చాను. ఇప్పుడు చేతికందిన పిల్లని నాకు కాకుండా ఎగరేసుకుపోవాలని చూస్తారా మీరు. తండ్రిని నేను ఉన్నానుగా. నాకు పనులు చేసిపెడుతూ నా కూతురిగా ఇక్కడే ఉంటుంది. ఇలాటి ప్రతిపాదనలతో నా వద్దకు రాకండి. ” అంటూ మమ్మల్ని అవమాన పరచి పంపేశాడు.” అంటూ కళ్ళు తుడుచుకుంది శారద.
ఆశ్చర్యపోవడం డాక్టరమ్మ వంతయ్యింది. “నిజమా? మరి వెన్నెల ఏమనలేదా? తండ్రిని ఎదురించి లేకపోయిందా?” అడిగింది వాణి. .
“ఖర్మ. వాణి… నా ఖర్మ. తూటాల్లాంటి బావగారి మాటలు విని భరించలేక అక్కడినుండి బయలుదేరిపోతుండగా. అన్నది చాలదన్నట్టు. . “చూడండి మనమధ్య ఈ సంభాషణ జరిగినట్టు మరో మనిషికి తెలియకూడదు, ముఖ్యంగా వెన్నెలకి అసలు తెలియకూడదు. ఏమాత్రం సంస్కారం ఉన్నా . మారుమాట్లాడకుండా వెన్నెలని నా వద్దకి పంపించేయండి. భర్త పోయాక మా అక్కయ్య ఇప్పుడు నా వద్దే ఉంది. నా కూతురికి తోడుగా ఉంటుందిలే. “అంటూ లేచి లోనికి వెళ్ళిపోయాడు బావగారు. అంతే. కృంగిపోయిన మనసులతో ఇల్లు చేరాము. దుఃఖాన్ని మింగుకుని, చెప్పలేక, మింగలేక మా అమెరికా ప్రయాణం నెపంగా చూపి అతి కిరాతకంగా నా వెన్నెలని దూరం చేసుకున్నాను. . ఆ తరువాత నేనేమీ చేసినా ఆ పసిదానికి నేను ఒక మనసు లేని మరబొమ్మలా అనిపించానే తప్ప . అమ్మలా నన్ను చూడలేకపోయింది. నన్నెలా అర్ధం చేసుకోవాలో తెలియక అల్లాడిపోయుంటుంది నా బంగారు తల్లి.
ఆ ఎడబాటునుండి బయటపడేందుకే… దానికి ఇరవైయొక్కేళ్లు నిండగానే, మావారికి దగ్గరి బంధువు, సంస్కారవంతుడు అయిన పరంధామకి, వెన్నెలకి పెళ్లి చేసాను. నా బంగారుతల్లి నా కళ్లెదుట ఉంటుందని ఆశపడ్డాను . కానీ నా ప్రయత్నాలన్నీ శాపాలుగా మారి దాన్ని కాటేస్తాయని అనుకోలేదు. ” అంటూ వాపోయింది శారద.
“మరో విషయం తెలుసా? తనకి పదిలక్షలు కానుకగా ఇస్తేనే తన కూతురి పెళ్లి మాటలు సాగనిస్తానని, పరంధామతో వెన్నెల వివాహం జరగనిస్తానని . తండ్రిగా తన అనుమతికి మా వద్ద లంచం కూడా తీసుకున్నారు మా బావగారు. ” మళ్ళీ భోరుమంది శారద.
ముఖం తుడుచుకోమన్నట్టుగా శారద భుజం పై తట్టి, టిష్యు అందించి తిరిగి వెళ్లి తన సీటులో కూర్చుంది డాక్టర్ వాణి.
గదిలో కాసేపు మౌనం తాండవించింది.
“బావగారి మాటకి గౌరవమిస్తూ, తండ్రీ కూతుళ్ల నడుమ అపార్ధాలకి కారణమవకూడదన్న ఏకైక కారణంతో… నేను వెన్నెలకి తన దుర్మార్గపు తండ్రి గురించి చెప్పకుండా ఉండిపోయి తప్పు చేసాను. నా తప్పుల వల్లే వెన్నెల ఈ నాడు ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. నాదే తప్పు. నా చిట్టితల్లిని నేనే చేజేతులా చంపుకున్నాను. ఎలా? అసలెలా జీర్ణించుకోను? ఈ పాపం నన్ను దహించివేస్తుంది. నాకు నిష్కృతి లేదు వాణి. ” అంటూ ఉప్పెనలా పొంగుకొచ్చిన వేదనతో తల్లడిల్లిపోయింది మరోమారు శారద తల్లి హృదయం.
“చూడు శారదా. నీ వేదన, తండ్రి దుర్మార్గాల నడుమ… వెన్నెల జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిందని మనం బాధపడ్డం అటుంచు.
“వెన్నెల నీకు రాసిన ఉత్తరాన్ని కూడా చదివాను కనుక. ఓ సైకియాట్రిస్ట్ గా నేను ఆలోచిస్తున్నాను. ఐదేళ్ల వయసులో . . కన్నతల్లి ఆకస్మిక మరణంతో తల్లడిల్లిపోయిన వెన్నెలకి తండ్రి ఆదరణ కూడా కరువై . . నిరాధారంగా అయోమయావస్థలో ఉన్న సమయంలో… నీవు ఆదుకుని, ప్రేమగా లాలించి, కన్నతల్లిని మరిపించి మరీ ఆ పసిదాని జీవితంలో సంతోషాలని నింపావు. తన మనసున ప్రేమమూర్తిగా చెరగని ముద్ర వేశావు. హాయిగా సాగిపోతూన్న ఆ అమ్మాయి జీవితం నుండి . ఊహించని నీ ఆకస్మిక నిష్క్రమణ మరో శరఘాతమే అయింది వెన్నెలకి. యేడేళ్ల పాటు అల్లారుముద్దుగా సాకిన పిదప, ఎటువంటీ కారణాలు చెప్పకుండా… ఆ అమ్మాయిని తండ్రి వద్దకు పంపించివేసి, మీరు అమెరికాకి వచ్చేయడాన్ని . . ఆ చిన్నారి మనసు అర్ధం చేసుకోలేకపోయింది. కన్నతల్లి, పెంచిన తల్లి కూడా తనని వీడిపోవడాన్ని . తిరస్కారంగా భావించి తల్లడిల్లిపోయింది పన్నేండేళ్ల వయసులో వెన్నెల. తాను ఎవరికీ అక్కరలేని మనిషినని భావించింది. మీ ప్రాపకంలో చక్కని వ్యక్తిత్వం ఉన్న యువతిగా ఎదగవలసిన ఆ అమ్మాయి లేత మనసు . . భావోద్వేగాలకు అతిగా లోనయి, కొంత సమతుల్యతని కోల్పోయింది. . అందువల్లే వెన్నెల నిబద్దత లేని ఆలోచనలతో పోరాడింది, అలాగే వ్యవహరించింది కూడా. నిజానికి ఇటువంటి సమస్యలని నా ప్రాక్టీసులో చూస్తూనే ఉంటాను శారదా. బలహీనపడిన మానసిక స్థితి వల్లే కొందరు . హత్యలు, ఆత్మహత్యలు, ఘోరమైన నేరాలు చేస్తుంటారు. యువతలో ఈ పర్యవసానం కాస్త ఎక్కువగానే కనబడుతుంది. అందుకే కని పెంచే తల్లితండ్రులైనా, పెంపకం బాధ్యతలు చేపట్టే వారైనా, పిల్లల గురించి, వారి మనస్తత్వాల గురించి చాలా సూక్ష్మంగా ఆలోచించి, వ్యవహరించాలి. ప్రేమ, ఆత్మీయతలతో పాటు బాధ్యతాయుతమైన పెంపకం అవసరం. అప్పుడే కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడే పౌరులుగా . పిల్లలు ఎదుగగలుగుతారు. మన వెన్నెల జీవితం. నేటి సమాజంలోని తల్లితండ్రులకి, యువతకి కూడా సందేశాత్మకం అవుతుంది శారదా. ” అంటూ బాధగా నిట్టూర్చింది డాక్టర్ వాణి.

1 thought on “కథ విందువా … నా మనసుకథ విందువా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2021
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031