April 20, 2024

చంద్రోదయం – 18

రచన: మన్నెం శారద

శేఖర్ యింటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా జరిగిపోయింది.
చాలా ముఖ్యులయిన వాళ్లను మాత్రమే పిలిచేడు శేఖర్.
పనిలోపనిగా పిల్లవాడి బారసాల కూడా జరిపించేడు.
బాబుకి “ఆశాకిరణ్” అని నామకరణం చేసేరు.
సారధి బాబు మెడలో పులిగోరు పతకం వున్న గొలుసు వేసి దీవించేడు.
“ఇప్పుడీ ఖర్చెందుకు?” అంటూ కోప్పడ్డాడు శేఖర్.
“నువ్వు నాకోసం చేసిన ఖర్చులో యిది యెన్నో వంతురా? నా సరదా కూడా తీర్చుకోనీ!” అన్నాడు సారధి నవ్వుతూ.
అందరూ ఉత్సాహంగా భోజనాలు చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత శేఖర్ స్నేహితుడిని చూసిన సంతోషంలో జోక్స్ వేసి తెగ నవ్వుతున్నాడు.
అతను అకస్మాత్తుగా నవ్వటం ఆపి, “ఇంతకీ నువ్వు పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నావ్?” అన్నాడు సారధిని ఉద్ధేశించి.
“ఆ సంగతి నీ చేత అడిగిద్దామనే నేను బయల్దేరి వచ్చేను” అంది సావిత్రమ్మ గట్టిగా.
“అంటే వీడు పెళ్లి చేసుకోనని శపథం చేశాడేం ఖర్మ”శేఖర్ సీరియస్‌గా అన్నాడు.
“అదేదో నువ్వే తేల్చాలి నాయనా!” సావిత్రమ్మ నీరసంగా అంది. సారధి మాట్లాడకుండా భోజనం చేస్తున్నాడు. స్వాతి దూరం నుండి బాబుని జోకొడుతూ సారధిని గమనిస్తోంది.
ఉన్నట్టుంది శేఖర్ ఫెళ్ళున నవ్వేసేడు. అందరూ అతనివైపు ఆశ్చర్యంగా చూసేరు.
“ఆ అసలు సంగతి యిప్పుడు గుర్తొచ్చింది. మనవాడు ఒకసారి ఎవర్నో ప్రేమించేనని చెప్పినట్లు గుర్తు. ఏరా? నీ స్వప్నసుందరి యింకా దర్శనమివ్వలేదా? ఏం కథ?” అన్నాడు సారధిని మోచేత్తో పొడిచి.
“ప్లీజ్! ఊరుకోరా! అందరూ చూస్తున్నారు” సారధి ప్రాధేయపడ్డాడు.
శేఖర్ అదేం పట్టించుకునే స్థితిలో లేడు. “ఈయనగారు సినిమాహాల్లో ఓ సుందరాంగిని ప్రేమించేసేడు. ఆ మైమరపులో పేరూ, ఊరూ అడగడం మర్చిపోయి యింటికొచ్చేసేడు. ఊరంతా గాలించి ఆమె ఎడ్రస్ దొరకక “పేరైనా అడగలేదు” అంటూ సోలోసాంగ్ పాడుకుంటూ ఇలా పెళ్ళి వద్దని భీష్మించుక్కూర్చున్నాడు”అన్నాడు. సారధి తల్లి ఆశ్చర్యంగా చూసింది. “అంటే యిదంతా నిజమేనా అబ్బాయ్!” అంది ఆమె ఆందోళనగా.
“నూటికి నూరుపాళ్లు నిజం పెద్దమ్మగారు!”శేఖర్ ఎడం చేతిని నెత్తిమీద పెట్టుకుని చెప్పేడు.
సారధి ఆందోళనగా చూసేడు శేఖర్ వైపు.
శేఖర్ నవ్వుతూ “ఇంతకీ ఈయన ప్రేయసిగారు ఎప్పుడో పెళ్ళి చేసుకుని పిల్లల్ని కంటూ వుంటుంది. ఈయన మాత్రం ఆవిడ కోసం కలలు కంటూ ముసలాడు అవ్వాల్సిందే” అన్నాడు.
సారధి అనుకోకుండా స్వాతి వైపు చూసేడు.
పిల్లవాడిని ఒళ్ళో వేసుకుని వూపుతున్న స్వాతి కూడా అదే క్షణం అతనివైపు చూసింది.
ఇద్దరి చూపులు ఒక్క క్షణం చిక్కుబడ్డాయి.
స్వాతి కలవరపాటుగా చూపు దించుకుని తల వంచుకొంది.
ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.
అంటే.. అంటే.. ఇతను తనని ప్రేమించే వదులుకున్నాడన్నమాట. అంత అవసరం ఏమొచ్చింది. త్యాగమా? బలహీనతా?
ఆమె మొహం జేవురించింది.
స్వాతి పని వున్నట్లు పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్లిపోయింది.
“ఇంతకీ పెళ్ళి సంగతి తేల్చి చెప్పు” శేఖర్ సారధిని మళ్ళీ రెట్టించి అడిగేడు.
సారధికి పరిస్థితి ఇరకాటంగా వుంది. శేఖర్ ఓ పట్టాన వదిలిపెట్టేట్లు లేడు.
అతను కోపంగా లేచి చేయి కడుక్కొని పందిరిలోని కెళ్లిపోయేడు.
అంతసేపు నవ్వులాటగా వున్న వాతావరణం గంభీరత దాల్చింది.
“వాడికి నిజంగానే కోపం వచ్చేసినట్లుంది!”శేఖర్ ఆందోళనగా అన్నాడు.
“ఇందులో నీవు కాని మాట ఏమన్నావ్ బాబూ. వాడే పెడసరంగా వున్నాడు” అంది సావిత్రమ్మ దిగులుగా.
శేఖర్ మారు మాట్లాడకుండా పందిట్లోకి వెళ్లి సారధి పక్కనే కూర్చున్నాడు.
సారధి జరిగిన సంగతేం గుర్తులేనట్లు పక్కన స్నేహితుడు కూర్చున్న విషయం గమనించనట్లు, వచ్చిన వారితో ఉద్యోగ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాడు.
*****
జానకమ్మతో గొడవ జరిగేక సారధి చాలావరకు గంభీరంగా మారిపోయేడు. అతన్లో ఏదో నిస్తేజం కనిపిస్తోంది.
స్వాతితో కూడా మాట్లాడటం తగ్గించేడు. యాంత్రికంగా తన్ అపనులు తాను చేసుకుపోతున్నాడు.
నానీ విషయం మాత్రం అతను ఎప్పటిలా చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. అతనిపట్ల మాత్రం ఎలాంటి చిరాకునీ ప్రదర్శించడు. ఓపికగా అడిగిన వాటికన్నింటికీ జవాబులు చెబుతాడు. హోంవర్కు చేయిస్తాడు. క్రికెట్ ఆడతాడు.
అతను చెప్పే కబుర్లకి యిల్లెగిరేటట్లు నవ్వుతాడు.
అలా అతను నవ్వినప్పుడు స్వాతి ఆతృతగా హాల్లోకి వచ్చి చూస్తుంది. అంతవరకు వుత్సాహంగా వున్నా స్వాతిని చూడగానే సారధి మళ్లీ గంభీరంగా మారిపోతాడు.
అలాంటప్పుడు స్వాతి నిరుత్సాహంగా లోపలికెళ్లిపోతుంది.
ఆరోజు సారధి పక్కలో పడుకుని కబుర్లు చెప్పి చెప్పి అలానే నిద్రపోయేడు నానీ బాల్కనీలో.
స్వాతి మెల్లిగా సారధి దగ్గరకొచ్చింది.
ఆమె రాకని గమనించి సారధి తల యెత్తి చూసేడు.”బాబుని తీసికెల్దామని…” అంటూ స్వాతి మెల్లిగా గొణిగింది.
సారధి నానీమెద వున్న చేతుల్ని తీసేసి తీసికెళ్లమన్నట్లు చూసేడు.
స్వాతి నానీని తీసికెళ్లి లోపల పడుకోబెట్టి మళ్లీ వచ్చింది.
సారధి కళ్లు మూసుకుని ఈజీచెయిర్లో కూర్చుని వున్నాడు.
“చలిగా వుంది. లోపలికొచ్చి పడుకోకూడదూ!” అంది స్వాతి మెల్లిగా.
అతను కళ్లు తెరిచి”ఫర్వాలేదు” అన్నాడు పొడిగా.
స్వాతి అలాగే నిలబడింది.
సారధి ఆమెకేసి చూస్తూ “నువ్వు పడుకో. నేను లోపలికొచ్చినప్పుడు తలుపులు వేస్తాలే.” అన్నాడు.
“అదికాదు” అంటూ నిలబడిపోయింది స్వాతి
అతను ప్రశ్నార్ధకంగా చూసేడు.
ఆమె ఏదో చెప్పాలన్నట్టుగా అక్కడే మంచం మీద తన కెదురుగా కూర్చుంది.
వెన్నెలలో యిసుక బంగారు పుప్పొడిలా మెరుస్తోంది.
దూరంగా ఎక్కడో రైలు వెళ్తోన్న చప్పుడు.
“మీకు నా మీద కోపంగా వుంది కదూ!” అడిగింది స్వాతి ఎలాగో గొంతు పెగుల్చుకుని.
సారధి ఆమెకేసి అదోలా చూసేడు.
ఆమె బాగా చిక్కిపోయిందనిపించింది. బాగా ఏడ్చినట్లు ఆమె కళ్లు చెప్పకపోయినా తెలుపుతున్నాయి.
“మాట్లాడరేం?” స్వాతి అతని కళ్లలోకి చూసింది.
“మాట్లాడేందుకు నా దగ్గర మాటలేమున్నాయి? నువ్వేమి చెప్పినా నేను వింటాను” సారధి మామూలుగా అన్నా, గొంతు గంభీరంగా వుంది.
“విని మీరు అపార్ధం చేసుకోరుగా?” స్వాతి భయంగా అదిగింది.
సారధి నిర్లిప్తంగా నవ్వి “భయాలతోనూ, అనుమానాలతోనూ జీవితం చాలా వరకు నలిగిపోయింది.. నువ్వేం చెప్పినా అర్ధం చేసుకునేపాటి సంస్కారం మాత్రం నాకున్నదనే నేను భావిస్తున్నాను” అన్నాడు.
స్వాతి కాసేపు మౌనంగా కూర్చుంది. ఆ తర్వాత మెల్లిగా చెప్పటం ప్రారంభించింది.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *