March 28, 2023

తమసోమా జ్యోతిర్గమయ

రచన: గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం

ఆ ఊరు మరీ పెద్దది కాదు గాని, నేరాలకు రాజధానిగా పేరు బడ్డాది. సీతాలు, సింహాద్రి దంపతులు, ఆ ఊళ్ళో కూలీ నాలీ చేసుకు బ్రతుకుతున్నారు. వారికి పెళ్లయిన ఆరేళ్ళ తరువాత, మొదటి సంతానం మొగ బిడ్డ కలిగింది. అప్పట్లో, ఆ ఊళ్ళో ఒక బాబాగారుండే వారు. ఆయన మీద ఉన్న భక్తి, గౌరవాల సూచకంగా, ఆ దంపతులు పిల్లాడికి ‘బాబా’ అని పేరు పెట్టుకొన్నారు. ముద్దుగా పెరుగుతున్న బాబా, హద్దుకు మించిన అల్లరులు చెయ్యడం మొదలు పెట్టేడు. తెలిసిన టీచరమ్మ సలహాకు, బడిలో వేసేరు బాబాని. కాని అది హాజరుపట్టీలో పేరు చేర్చడానికి మాత్రమే పనికొచ్చింది. నిజానికి, రోజూ బాబా హాజరు, ఊరి చివర, మామిడి తోటలో, గోళీ కాయలు ఆడే అల్లరి జట్టులోనే. క్రమేపి జట్టు వాళ్లంతా బాబాని, బాబూరావుగా మార్చేరు.
బాబూరావు పదవ ఏటనే, తండ్రి సింహాద్రి దేహం చాలించేడు. సీతాలు నిస్సహాయతతో, బాబూరావు అడ్డదారులు త్రొక్కడం మొదలు పెట్టేడు.
ధనార్జన మీద ఎక్కువ మక్కువ ఉండడంతో, పదహారు పదిహేడేళ్ల వయసులో బాబూరావు నాటు బాంబులు చెయ్యడం నేర్చుకొన్నాడు. బాబూరావు బాంబులకు గిరాకీ పెరిగింది. ఆ పరిణామాలతో, బాబూరావు, ‘బాంబుల బాబూరావు’ గా పేరుపడ్డాడు. సుమారు అయిదారు సంవత్సరాలు, బాంబుల బాబూరావు బిజీగా ఉండేవాడు. తరువాత తల్లి పోవడం, బిజినెస్ మూత పడడం జరిగేయి. బాబూరావు బాంబులు చెయ్యడం మానేసాడు.
ఆ పరిస్థితిలో బాబూరావుని, ఎవరయినా ‘బాంబులు చెయ్యడం ఎందుకు ఆపీసేవు?’ అని అడిగితే,
“ఇప్పుడేటో కొత్త రకం బాంబులొచ్చినాయి. బాంబునెక్కడో దూరంగా ఎడతారట, సేన దూరం నుండి ఎదో మీట నొక్కితే, ఈకాడ, బాంబు, ఢాం, అని పేల్తాదిట. అట్టాటి బాంబులు సేయడానికి, నాకంత సదువు నేదుగా. ” అని, శాస్త్ర ప్రగతిని తట్టుకోలేక ప్రక్కకు తప్పుకొన్నానని, వాడి భాషలో వాడు ఇచ్చే జవాబు.
బాబూరావుకు, ఓ మేనమామ ఉన్నాడు. వాడి పేరు అప్పలస్వామి. కొందరు, ‘స్వామీ’ అని, మరికొందరు ‘సామీ’ అని సంభోదిస్తారు వాడిని. అప్పలస్వామి ఓ పెద్ద గేంగ్ లీడరు. వాడి ఖ్యాతి ప్రక్కనున్న మూడు, నాలుగు జిల్లాల దాకా వ్యాపించి ఉంది. వాడి గేంగులో, కొందరు కబ్జాలు చెయ్యడంలో సిద్దహస్తులు. కొందరు కిడ్నాపింగులలో ఆరితేరిన వాళ్ళు. మరికొందరు మొండిబకాయిలు వసూలు చెయ్యడంలో నేర్పరులు. ఇలా వాడి యాజమాన్యంలో డిపార్టుమెంటు వైజు స్పెషలిస్టులు ఉన్నారు.
స్వామి వారి సామ్రాజ్యంలోని రాజకీయ నాయకుల మనుగడ ఆయన ఆశీర్వచనాలపై ఆధారపడి ఉంటుంది. గత ఎలక్షన్లలో ప్రస్తుతం ప్రక్క ఊరిలో ఉన్న ఎం. ఎల్. ఏ. గురునాధం గారికి, మొదట్లో పార్టీ టిక్కెట్టు దొరకలేదు. అతని కన్నా ఎక్కువ డబ్బు సమర్పించుకొంటానన్న మరో ‘ప్రజా సేవకుడు’ కు ఖరారయింది. వెంటనే గురునాధం గారు ‘త్వమేవ శరణం’ అని స్వామి వారిని ఆశ్రయించేరు. స్వామివారు అభయ హస్తమిచ్చేరు. గురునాధం గారికి ఇక్కట్లు లేకుండా టిక్కెట్టు దొరికింది. ఎం. ఎల్. ఏ. గురునాధం గారు, స్వామి వారికి ఆ ఋణం ఎదో ఒక రూపంలో తీర్చుకొనేవారు.
ఊరి పొలిమేరలలో ఉన్న మురికివాడలలో ఉన్న జనానికి స్వామి వారు ఓ దేముడు. ప్రతి సంవత్సరం మండు వేసవిలో మునిసిపలు కుళాయిలు రెస్టు తీసుకొన్న రోజుల్లో ట్యాంకర్లు ద్వారా వాళ్లకు త్రాగు నీరు ఉచితంగా అందజేస్తారు. వాళ్లలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ‘సామీ’ అని ఆయన వద్ద మొర పెట్టుకొంటారు. తన భక్తుల ద్వారా స్వామి వారు వారికి ఊరట కలిగిస్తారు.
మన కథానాయకుడు, బాబూరావు మేనమామ, అప్పలస్వామి స్టోరీ విన్నారు కదా. ఇప్పుడిహ, మళ్ళీ, బాబురావు దగ్గరకెళదామా.
“బాంబులు చెయ్యడం మానేసావు గదా, ఇప్పుడేమిటి చేస్తున్నావు” అని బాబూరావుని అడిగితే,
“ఇపుడయితే నలుగురం పెండ్స్ ఉన్నాం. రేత్రిల్లు ఏకాడయినా డూటీ ఎతుక్కొని సేస్తాం. (వాడి భాషలో ‘డూటీ’ అంటే దొంగతనం) డూటీలో దొరికిపోనామంటే జేలుకాడకి ఎల్తామ్. ఎల్లినా, తోడనే బెఇలు మీద బయటకి ఓచిత్తామ్. ఏటిసెప్పేది, ఇది నా బతుకు. ‘ నిరాశతో, బాబూరావు జవాబు.
“బెఇలు మీకింత సుళువుగా ఎలా దొరుకుతున్నాదిరా?” అని ప్రశ్నిస్తే,
“మా కాడ, ఓ సొట్టకాలు ఓకీలు గారున్నారండి. మేము జేలు కెల్లగానే, ఆయనకి తెలస్తదండి. ఎంటనే, ఏవో కాగితాలొట్టుకొచ్చి, ఏలుముద్రలెట్టిస్తారండి. అవి ఒట్టు కెళ్ళి మేట్రీట్ గారి నుండి బెఇలు తెత్తారండి. ”
బాబూరావుకి, వాడి మేనమామ అప్పలస్వామి, ఓ పెద్ద హీరో. అంతటివాడినవ్వాలి, అని కలలు కంటూ ఉంటాడు. ఎప్పుడయినా అప్పలస్వామి విషయం ప్రస్తావనలోకి వస్తే, “అతగాడు సేన పెద్దోడు. పార్టియోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, ఆయన్ని కలత్తుంటారు. ఆయన కాడ సేనమందున్నారు. ఆయన ఏటి సెపితే అది ఎంటనే సేసేస్తారు. ” అని మేనమామ గొప్పలు చెపుతూంటాడు.
ముఫై రెండు క్రిమినలు కేసులలో ఇన్వాల్వయి ఉన్న అప్పలస్వామి జైలులో ఉండక విచ్చలవిడిగా ఎలా తిరుగుతున్నాడని అప్పోజిషను హోమ్ మంత్రిని చట్ట సభలో నిలదీసి అడిగేరు. స్వామికి జైలులోకి వెళ్లక తప్పలేదు.
బాబూరావు కూడా ఒక రాత్రి, ‘డూటీ’చేస్తూ దొరికిపోవడం మూలాన్న జైలులో ఉన్నాడు. మేనమామ, మేనల్లుడు ఒకే జైలులో ఉన్నారు. అప్పలస్వామికి జైలులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేజిస్ట్రేట్ మీద విజిలెన్సు కేసులు రావడంతో సస్పెండు అయ్యేడు. కొత్త లేడీ మేజిస్ట్రేట్ చాలా స్ట్రిక్టు. ఆ పరిణామంతో సొట్టకాలు వకీలుకు గిరాకీ పోయింది. బాబూరావు బెఇలు దొరక్క జైలులో ఉన్నాడు. ఎన్నాళ్ళు ఉంటాడలాగ. బాబూరావు చతుష్టయం సెక్యూరిటీ గార్డ్సుతో చెయ్యి కలిపేరు. రోజు రాత్రి 12 దాటేక జైలులో నుండి బయటపడి, ఆ నలుగురూ ఊరి మీద పడతారు. దొరికిన చోట డూటీ చేసుకొని, తెల్లవారు ఝాము నాలుగు గంటల లోపల, సెక్యూరిటీ వాళ్ళ వాటా సమర్పిన్చుకొని మళ్ళీ సెల్లులోకి పోతారు.
ఒక రోజు రాత్రి డూటీ కోసం వెతుక్కొంటూ, బాబూరావు మునిసిపల్ కాంట్రాక్టరు సివిలు నాయుడు బంగళా దాకా వచ్చేడు. గరాజు తలుపు తీసి ఉంది. డూటీ దొరుకుతుందని గరాజు చేరుకొన్నాడు. గరాజులోనుండి హాలులోకి తలుపు దగ్గరగా తీసి ఉంది. చప్పుడు చెయ్యకుండా లోపలికి తొంగి చూసేడు. నాలుగు పెద్ద సోఫాలు కనిపించేయి. రెండు సోఫాల మీద ఇద్దరు ముఖాలు కనపడకుండా ముసుగు వేసుకు నిద్ర పోతున్నారు. ముసుగుల్లో ఎవరున్నారో తెలీదు. ఒక ముసుగు చిన్నదిగా ఉంది. రెండో ముసుగు బాగా పెద్దది. బాబూరావుకు, ఎక్కడేనా కిడ్నేప్ చేసి, దండిగా డబ్బులు గుంజాలనే కోరిక, చాలా రోజులై ఉంది. తనకి ఇప్పుడు మంచి చాన్సు దొరికింది అనుకొన్నాడు. పెద్ద ముసుగుని మోసుకొని వెళ్లడం కష్టమని, చిన్న ముసుగు మూటని భుజం మీద వేసుకొని, జాగ్రత్తగా బయట పడ్డాడు.
కొంత దూరం వెళ్ళేక, రెస్ట్ తీసుకొందామని, దగ్గరలో ఉన్న కల్వర్ట్ గట్టుమీద కూర్చొన్నాడు. ఆలోచిస్తున్నాడు. ఈ మూటని ఎక్కడికి తీసుకెళ్లాలి, ఫోను ఎవరికి చెయ్యాలి, ఎంత డబ్బు అడగాలి, అని. ఎప్పుడు కిడ్నేప్ చెయ్యలేదేమో, అంతా అయోమయంగా ఉంది. ఇంతలో మోటార్ సైకిలు మీద ఇద్దరు వచ్చి బాబూరావు భుజం మీద ఉన్న మూటని గద్ద లాగ తన్నుకు తీసుకు పోయారు. బాబూరావు బిక్క చచ్చిపోయేడు. మోటారు సైకిలు మీద వచ్చిన ఇద్దరూ ఎవరో తెలీదు. హెల్మెట్స్ పెట్టుకొన్నారు. బాబూరావు భుజం మీద నుండి మూటని అకస్మాత్తుగా లాక్కోవడంలో, మూటలో ఉన్న వాడికి హెల్మెట్ తగిలి, కెవ్వుమని కేక పెట్టేడు. వాడి ముఖం మీద నుండి కప్పు జారింది. వాడి నోరు నొక్కి, ఇద్దరి మధ్య ఇరికించి, మోటారు సైకిలు వాళ్ళు రివ్వున వెళిపోయేరు. మూటలోని వాడి ముఖంమీద నుండి కప్పు జారగానే, బాబూరావు గతుక్కుమన్నాడు. ఆ మూటలో ఉన్న వాడు అప్పలస్వామి బావమరిది కొడుకు, కిట్టిగాడు.
సివిలు నాయుడు, కుటుంబంతో సహా తిరుపతి వెళుతూ, పని వాడికి ఇల్లు అప్పగించేడు. ఆ పనివాడు కిట్టి గాడిని తోడుండమని పిలిచేడు. అందుకూ కిట్టిగాడు సివిలు నాయుడు ఇంట్లో ఆ రాత్రి ఉన్నాడు. బాబూరావు బెంగ ఏమిటంటే జరిగింది జరిగినట్లు చెబితే అప్పలస్వామి తోలు ఒల్చీస్తాడు. చాలాసేపు ఆలోచించేడు. కిట్టిగాడిని, మోటారు సైకిలు మీద ఇద్దరు కిడ్నేప్ చేసి, తీసుకుపోతూ ఉంటే చూసేనని చెప్పి తప్పుకొందామని నిశ్చయించేడు.
బాబూరావు నిరాశతో టైము ప్రకారము సెల్లులోకి వెళిపోయేడు. ఎవరో ఇద్దరు హెల్మెట్స్ తో ఉన్న వాళ్ళు మోటార్ సైకిలు మీద, కిడ్నేప్ చేసి, కిట్టిగాడిని తీసుకుపోతుంటే గత రాత్రి చూసేనని తెల్లవారేసరికి అప్పలస్వామికి తెలియజేసేడు బాబురావు. అప్పలస్వామి S. P. కి ఫోను చేసేడు. వెంటనే కిట్టిగాడిని రక్షించాలని కోరేడు. S. P. నలుగురు కానిస్టేబుల్సుని, నాలుగు దిక్కులా పంపించేడు, వెతకండని. అందులో ఒకడిని, కిట్టిగాడి ఇంటికి వెళ్లి, రాత్రి వాడెక్కడ పడుకొన్నాడో కనుక్కోమన్నాడు. ఆ కాన్స్టెబులు, కిట్టి గాడి ఇంటికి వెళ్లి, రోడ్డు మీద నులక మంచం మీద పడుకొన్న గుంటడిని లేపి,
“ఒరే, కిట్టిగాడు ఈ ఇంట్లోనే ఉంటాడా” అని అడిగేడు.
“అవును. నేనే కిట్టిగాడిని. ఏటి కావాలి. ”
“నిన్నెవరో ఎత్తుకుపోయారని కంప్లెయింట్ ఒచ్చింది. రాత్రి ఎక్కడ తొంగున్నావ్. ”
“సివిల్ నాయుడు ఇంటి కాడ. అద్దరేతిరి ఇద్దరు సచ్చినోళ్ళు నన్ను మోటారు సైకులు మీద ఊరాతలకి ఒట్టుకు పోయి, ‘నీ అయ్య ఫోన్ నంబరు సెప్పు’ అన్నారు. నాకు తెలదన్నా. సెప్పక పొతే నిన్ను సంపేత్తామన్నారు. నన్ను సంపితే, మా మామ మిమ్మలిని ఒగ్గడు. నరికి పారెత్తాడన్నాను. ‘ఓడురా మీ మామ. మమ్మల్ని సంపే మొగోడు’, అని నా జుట్టోట్టుకొన్నారు. ఆల్లకప్పుడు సెప్పినాను. మా మామ గేంగ్ లీడరు అప్పలసామని. సచ్చినోళ్ళకి సమట్లు పట్టినాయి. ‘ఒరే ఈడు మనోడేన్రా’ అని ఇద్దరు నన్ను ఇంటికాడ ఒగ్గీసి పారిపోనారు. ”
నిజానికి వాళ్లిద్దరు అప్పలస్వామి గేంగులో మనుషులు.
కిట్టిగాడు ఇంట్లో క్షేమంగా ఉన్నాడని, కాన్ స్టబుల్ S. P. కి, S. P. అప్పలస్వామికి, ఫోను చేసి చెప్పేరు. బ్రతుకు జీవుడా అనుకొని గండం తప్పిందని, బాబూరావు ఊపిరి పీల్చుకున్నాడు.
ఇది జరిగిన రెండు నెలలకి కొత్త జైలు సూపరింటెండెంట్ కిరణ్మయి, జాయిన్ అయింది. ఆవిడ ‘Criminals are not born. They are made ‘ అన్న సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది. జైలు, కేవలం నేరస్తులు శిక్షననుభవించే, అభేద్యమయిన కట్టడం మాత్రమే కాదని ఆవిడ అభిమతం. అన్యాయ మార్గాలను అన్వేషిస్తూ, చెడుదారులలో పయనిస్తున్న వారిని సన్మార్గంలోనికి మరల్చే పాఠశాల అని జైలు పదానికి ఆవిడ ఇచ్చిన నూతన నిర్వచనం. ఆవిడ తన ఆలోచనలకు రూపురేఖలు దిద్ది ఒక ప్రణాళిక రూపొందించింది. మంచి రోజు చూసి జైలులోని నేరస్తుల సంస్కరణ, పునరావాసం దృష్టిలో ఉంచుకొని, హృదయపూర్వకంగా ప్రయత్నాలు చేబట్టింది. నేరస్తులలో అనేకమంది మనో దృక్పథం మార్చుకొని సమాజంలో సన్మార్గంలో నడవడానికి నిశ్చయించుకొన్నారు. కిరణ్మయి వారికి వివిధ వృత్తి విద్యలలో నైపుణ్యానికి శిక్షణ ఇప్పించింది. అప్పలస్వామి, బాబూరావు ఇద్దరూ వడ్రంగి పనిలో తరిఫీదయ్యేరు. ఏడాది తరువాత, పెరోలు మీద బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టేరు. పట్నం వెళ్లి ఇద్దరూ కలసి, ఒక వడ్రంగి దుకాణం ప్రారంభించేరు. అది త్వరలో వృద్ధిలోనికి వచ్చింది. రెండేళ్ల తరువాత, అప్పలస్వామి, దుకాణాన్ని పూర్తిగా మేనల్లుడు బాబూరావు యాజమాన్యానికి వదిలీసేడు. తను అయిదు ఎకరాల సాగు భూమి కొనుక్కొని, వ్యవసాయం చేసుకో నారంభించేడు. బాంబుల బాబురావు, కార్పెంటర్ బాబూరావుగా మంచి పేరు తెచ్చుకొన్నాడు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2021
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031