February 22, 2024

తాత్పర్యం – 2. 264 రోజుల జీవితం

రచన: రామా చంద్రమౌళి

ఒకటే ఎడతెగని వర్షం. రెండురోజులనుండి. నగరం తడిచి ముద్దయింది. అంతా నీటి వాసన ఎక్కడికి వెళ్ళినా. రోడ్లూ, చెట్లూ, లక్షలకొద్ది ఇండ్లూ. అన్నీ ఎంతో కాలం తర్వాత తనివితీరా అభ్యంగన స్నానం చేసినట్టు. అంతా శుభ్రంగా. ,
హోటల్ దుర్గా. రిసిప్షన్ కౌంటర్ లో ఏదో రాసుకుంటున్న మాలతి అప్రయత్నంగానే తలెత్తి చూచింది ఎదురుగా ఉన్న గోడ గడియారంవైపు.
ఏడు గంటల పది నిముషాలు. రాత్రి.
‘టైం తెలియనే లేదు. డ్యూటీకి వచ్చి అప్పుడే గంటయింది. నైట్ డ్యూటీ ఈరోజు. ఉదయం ఆరు గంటలకు రిలీవ్. భాషా వస్తే ‘ అనుకుంది.
అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట కురుస్తున్న వర్షం చినుకుల ఒక రకమైన లయాత్మక ధ్వని. ఎదురుగా గోడలోనే ఏర్పాటు చేసిన గాజు కిటికీలో అందమైన జిట్రేగి కర్రతో చేసిన జేవురు రంగు గణపతి విగ్రహం. అందంగా. ముందు ఇరవైనాల్గు గంటలూ వెలిగే నువ్వుల నూనె దీపం. గాజు ఎక్కలో. నిలకడగా దీపపు జ్వాల. ఎర్రగా.
ఇరవై రెండు సంవత్సరాలుగా ఉద్యోగం ఆ హోటల్ లో. రెసిప్షనిస్ట్. ఆ హోటల్ అణువణువూ తెలుసు తనకు. మొత్తం అరవై ఎనిమిది గదులూ. అటాచ్డ్ రెస్టారెంట్. అతి విశ్వసనీయమైన సర్వీస్ ను అందించే మధ్య తరగతి రేట్లున్న పురాతనమైన హోటల్ అది. మూడవతరం యాజమాన్యం. ఒక యాంటిక్ వ్యాల్యూ దానికి. కస్టమర్లు చాలా ఇష్టపడ్తారు తమ హోటల్లో ఉండటానికి. కాని రూంస్ దొరకవు. కనీసం ఒక వారం ముందన్నా బుక్ చేసుకోవాలి.
వెయిటర్ సత్యనారాయణ వచ్చి ‘ నూటా మూడు చెకౌట్. బిల్లు చేయండి మేడం ‘ అని చెప్పి రెస్టారెంట్ లోకి వెళ్ళిపోయాడు. నీలి రంగు యూనిఫాం. నెత్తిపై అదేరంగు టోపీ.
సరిగ్గా ఆ సమయంలో వచ్చి ఆగింది ఆటో హోటల్ పోర్టికో లో. ఆమె దిగుతోంది. సన్నగా. తెల్లగా. ఎత్తుగా. అదే ఎర్ర చీర. కొద్దిగా నెరిసిన జుట్టు. నుదుట ఎర్రగా నిప్పులా మెరిసే బొట్టు. ఉదయం వికసించి. సాయంత్రం వేళకు సడలిపోయినట్టున్న తామరపువ్వులా. జయంతి. సరిగ్గా తను ఈ హోటల్ లో ఉద్యోగంలో చేరినప్పటినుండి. అంటే ఇరవైరెండేళ్ళుగా కస్టమర్. మనిషిని చూస్తే చాలా గౌరవం కలుగుతుంది. ఆమెను చూస్తే పవిత్రమైన దేవుడిముందు దీపంలోకి చూస్తున్న పవిత్ర నిశ్చలానుభూతి.
ఆటో డ్రైవర్ ఆమె చిన్న బ్రీఫ్ కేస్ ను తీసుకుని కౌంటర్ దగ్గరకు వచ్చాడు. వెనుక జయంతి. యాభై ఐదుంటాయేమో ఆమెకు. మాలతి కళ్ళు ఆమె వెంట ఉండవలసిన అతను. విశ్వం కోసం వెదికాయి. కాని అతను లేడు. ఒంటరిగానే వచ్చిందామె. అప్పుడప్పుడలా జరుగుతుంది. సాధారణంగా విశ్వంగారూ, జయంతీ ఇద్దరూ కలిసే వస్తారు. సరిగ్గా ఒక్కరోజే ఉంటారు హోటల్లో. మర్నాడు ఖాళీ. వాళ్ళకు మూడు వందల పదమూడు నంబర్ గదే కావాలి. థర్డ్ ఫ్లోర్. మూలది. కిటికీలోనుండి చూస్తే పెద్ద రావిచెట్టూ. , దూరంగా దుర్గమ్మ గుడీ కనిపించేది.
ఈ సుదీర్ఘ పరిచయంతో జయంతీ, విశ్వం లగురించి తనకు అర్థమైందేమిటంతే. వాళ్ళిద్దరు పెళ్ళాం మొగులు కారు. కాని ఆమె మెడలో మంగళ సూత్రాలూ. మెట్టెలూ ఉన్నాయి. వివాహితే. అతను అమె భర్త కాడు. ఒక పెద్ద ఇంజనీర్. అందమైన. హుందా ఐన ఆరడుగుల విగ్రహం విశ్వంది. సగంకన్నా ఎక్కువే నెరిసిన జుట్టు. ఎప్పుడూ కడిగిన ముత్యంలా శుభ్రమైన నలుగని స్టార్చెడ్ బట్టలు. బహుశా ఆమె విశాఖపట్నం ప్రాంతం నుండి వస్తుంది ఏదో రైలులో. అతను హైదరాబాద్ నుండి. ఇద్దరూ రైల్వే స్టేషన్ లో కలుసుకుని తమ హోటల్ కు క్యాబ్ లో వస్తారు. ఒక్క రోజుండి. ,
అప్పుడప్పుడు వాళ్ళ రైళ్ళ అరైవల్స్ మ్యాచ్ కావేమో. ఆమె రెండు మూడు గంటలు ముందొస్తుంది. అప్పుడు విశ్వం రిసిప్షన్ కు ఫోన్ చేసి చెబుతాడు. జయంతి ఒక్కతే వచ్చి గదిని ఆక్క్యుపై చేసి అతనికోసం ఎదురు చూస్తుంది. తమతో ఎక్కువగా మాట్లాడేది విశ్వమే. కాని ఈసారి జయంతిగారే ఫోన్ లో మాట్లాడి ఒక వారం క్రితం రూం బుక్ చేసింది అప్పుడుకూడా తనే ఉంది డ్యూటీలో.
వీళ్ళిద్దరూ పెళ్ళాంమొగులు కాదని తమ రిసిప్షన్ స్టాఫ్ ఆర్గురికీ స్పష్టంగా తెలిసినా. వాళ్ళిద్దరిపైన చాలా గౌరవంతో కూడిన ఒకరకమైన సాన్నిహిత్యం, ఇష్టం, ప్రేమ ఏర్పడ్డాయి అందరికీ. వాళ్ళు నెలకోసారి వచ్చే ప్రతిసారీ వాళ్లకిష్టమైన మూడువందల పదమూడు గదినే ఇచ్చి సహకరిస్తారు అందరూ.
‘ మనుషుల ముఖాల్లో ఉండే ఏదో వింత కాంతి ఈ రకమైన ఇష్టతను ఏర్పరిచిందా వాళ్లపట్ల. వ్చ్. ఏమో ‘
కస్టమర్ల వివరాలు రాసుకునే రిజిష్టర్ ను ముందుకు తోస్తూండగా జయంతే అంది “గుడీవినింగ్ మాలతి గారూ. బాగున్నరా. “అని. అని చకచకా రాస్తూ,
అదే గంభీరత. అదే హుందాతనం. అదే ఆకర్షణ. కాని ఈ సారి ఏదో వెలితి ఉందామెలో. వర్షం వెలిసిన తర్వాత పులకింతను కోల్పోయిన భూమివలె. అడవి వలె.
“శ్రీనివాస్. మేడం ను మూడువందల. ” అంటూండగానే. “తెలుసు మేడం. ” అని బ్రీఫ్ కేస్ ను తీసుకుని,
జయంతి వెళ్ళిపోయింది. బాయ్ వెంట లిఫ్ట్ వైపు.
మాలతి కుర్చీలో యధాలాపంగా కూలబడి.
“అసలు వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎవరు. ఒక్కసారికాదు రెండుసార్లు కాదు. ఇరవైరెండు సంవత్సరాలుగా ఇలా నెలకొకసారి కలుసుకుంటూ. అప్పుడెప్పుడో తనకు పెళ్ళి కానప్పుడు పరిచయం వీళ్ళు తనకు. ఇప్పుడు తనకు పెళ్ళై. ఇద్దరు పిల్లలు కలిగి. వాళ్ళు కూడా ఇంటర్ చదివే స్థాయికి ఎదిగి. తన పెళ్ళయినప్పుడు జయంతి ఒక ఖరీదైన పట్టు చీరను కానుకగా ఇచ్చింది కౌంటర్ లో. ఒక రకమైన ఆత్మీయత. వీళ్ళంటే. ”
చాలాసార్లు సహజమైన నిగ్రహించుకోలేని ఉత్సుకతతో. ఊర్కే ఏదో పనున్నట్టు వెళ్ళి వీళ్ళిద్దరూ గదిలో ఏమి చేస్తుంటారు అని గమనించింది తను. తను చూచిన నాల్గయిదు సార్లూ. వాళ్ళిద్దరూ కిటికీ దగ్గర బయటికి చూస్తూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చాలా పరవశంతో. సంతోషంగా. తృప్తితో.
కాని ఈ ప్రతి నెలా. వీళ్ళు కలుసుకోవడం. మళ్ళీ విడిపోయి. ఎటువాళ్లటు. ఏమిటిది. ఇన్నేళ్ళు ఇలా కొనసాగుతూండడం. ,
ఫోన్ మ్రోగి. ఎవరో కస్టమర్. చెకౌట్. బిల్ మేకింగ్. అటుప్రక్క శివరావు. కంప్యూటర్ లో. బిల్లులు. ఏవేవో లెక్కలు. , మళ్ళీ ఫోన్లు. ఎక్కడినుండో. రూం బుకింగ్స్. రెస్టారెంట్ వాకబులు. పనిలో పడిపోయింది మాలతి.
కాస్త తెములుకుని. తలెత్తే సరికి. రాత్రి పదకొండు.
‘ విశ్వం గారు వచ్చారా. ‘
అప్రయత్నంగానే రిజిష్టర్ తెరిచి చూచింది. ఉహూ. రాలేదు. ‘ఐనా తనే ఉందికదా కౌంటర్ లో ‘ అనుకుంది.
ఎందుకో. ఒక రకమైన ఆందోళన కలిగి. మాలతి చకచకా లిఫ్ట్ లో బయలుదేరి. మూడువందల పదమూడుకు వెళ్ళి. జాగ్రత్తగా గమనించింది. ప్రక్కనున్న కిటికీ సందులోనుండి. జయంతి ఒక్కతే. బెడ్ ప్రక్కనున్న కిటికీలోనుండి చీకట్లోకి చూస్తోంది. తదేకంగా. వర్షంలోకి.
జయంతి ముఖం స్పష్టంగానే కనబడింది. నిశ్చలంగా. గంభీరంగా. శూన్యంగా.
భయమేసింది మాలతికి అకారణంగానే.
కిందికొచ్చేసింది కౌంటర్ లోకి.
ఆలోచించింది. అలోచిస్తూనే ఉంది. చాలాసేపు తనను తాను కోల్పోయి. ఏదో బాధ. జయంతితో తనకేమీ సంబంధం లేకున్నా. ఏదో గుండెలను పిండుతున్న అవ్యక్త దుఃఖం లాంటి. మౌన వేదన.
టైం చూచుకుంది చాలాసేపటి తర్వాత. ఒంటిగంట దాటింది. విశ్వం ఇంకా రాలేదు. ఎందుకో.
టేబుల్ పై తల ఆనించి. తనకు తెలియకుండానే మాలతి నిద్రలోకి జారిపోయింది.
* * *
మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఆరు గంటలు. ఇంకా వర్షం ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. తెల్లవారినా. మసక వెలుతురు. అంతా చెమ్మ. నీటి వాసన. తడితడిగా.
విశ్వం రాలేదు రాత్రంతా. అనుకుంది.
అప్రయత్నంగానే లిఫ్ట్ లో బయలుదేరి. మూడువందల పదమూడుకు వెళ్ళింది. కిటికీలో నుండి చూచి. అశ్చర్యం.
జయంతి. అలా ఆ కిటికీ దగ్గర కూర్చునే ఉంది. బయటికి రావి చెట్టు దిక్కూ. దుర్గమ్మ గుడి శిఖరం వైపూ చూస్తూ.
చాలా భయమేసింది మాలతికి. బెల్ నొక్కి ఆమెను పలకరిద్దామా అనుకుంది. కాని. సభ్యత అడ్డొచ్చి. ,
కిందికొచ్చి. కౌంటర్ లో కూర్చుని. జయంతి రూం కు ఫోన్ చేద్దామని రిసీవర్ ను తీసుకోబోతూందగా. ఫోన్ మ్రోగింది.
“హలో” అంది.
ఆశ్చర్యం. జయంతే. ” మాలతిగారూ. నా బిల్ చేయండి. స్టేషన్ కు ఒక ఆటో తెప్పించండి. ప్లీజ్. నేను కిందకు వచ్చేస్తున్నా ” అని ఫోన్ పెట్టేసింది.
శివరావుకు చెప్పి బిల్. ,
కాని విశ్వంగారు ఈసారి రాలేదు. జయంతి ఒక్కతే వచ్చి. రాత్రంతా ఒంటరిగానే కూర్చుని. ,
ఐదు నిముషాలు గడిచిందో లేదో. సత్యనారాయణ తో. బ్రీఫ్ కేస్ ను పట్టించుకుని. లిఫ్ట్ లో దిగి. కౌంటర్ లోకి వచ్చింది జయంతి.
బిల్ మొత్తం రెండు వేల ఇరవై. రాత్రి ఒక్క కాఫీ మాత్రమే తాగింది తెప్పించుకుని.
ఐదు ఐదు వందల రూపాయల నోట్లు. ఇచ్చి. ఒక మడచిన తెల్ల కాగితాన్ని చేతిలో పెట్టి,
“విశ్వం గారు ఇక రారు మాలతిగారూ. ఇక ముందు నేనుకూడా. థాంక్యూ. మీరెప్పుడూ జ్ఞాపకముంటారు నాకు”
తలెత్తి ఆమెవంక చూచేలోగానే. జయంతి ఆటోవైపు నడచి వెళ్తూ,
అప్పుడామె. జారిపోతూ అస్తమిస్తున్న సూర్యుడిలా. గంభీరంగా. గుంభనంగా ఉంది.
వర్షంలో. ఆమె ఆటో ఎక్కి. చూస్తూండగానే. ఆటో బయల్దేరి. ,
ఆటో శబ్దం దూరమౌతూండగా,
మాలతి తన చేతిలోని. ఆ తెల్లని కాగితాన్ని విప్పింది. “మాలతి గారూ. ఇరవై రెండు సంవత్సరాలుగా మేమిద్దరం మీ హోటల్ కు వస్తున్నాం. ఈ ఇరవై రెండు సంవత్సరాలు. అంటే. రెండు వందల అరవై నాల్గు నెలలు. నా యాభై నాలుగేళ్ల జీవితంలో. నేను నిజంగా జీవించింది. ఈ రెండు వందల అరవై నాల్గు రోజులే. విశ్వం గారిక లేరు. సెలవు. జయంతి ”
మాలతి కాగితాన్ని మడచి చేతిలో పట్టుకుంది. వెళ్ళిపోయిన ఆటో దిక్కు. పోర్టికో వైపు చూచింది. దుఃఖం ముంచుకొచ్చిందామెకు. ఎందుకో.
వర్షం ఉధృతి పెరిగి. చినుకుల శబ్దం. ఎక్కువై. అంతా తడి వాసన. దుఃఖానికి వాసన ఉంటుందా. ?

2 thoughts on “తాత్పర్యం – 2. 264 రోజుల జీవితం

  1. రామా చంద్రమౌళి గారూ
    ఇది నిజంగా జరిగిన కథ. 40 సంవత్సరాల క్రిందట విజయవాడ నటరాజ్ హోటల్ కు ఇలాగే ఒక జంట ప్రతి నెల వచ్చేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *