April 20, 2024

తామసి – 10

రచన: మాలతి దేచిరాజు

అప్పటి నుంచీ గౌతమ్ నసీమాకి అడుగడుగునా తోడున్నాడు. తనకి ఏ అవసరం వచ్చినా ముందుండే వాడు. షీబాతో కలవడం కొంచెం తగ్గింది. తనతో ఉన్నప్పుడు కూడా ఎక్కువ నసీమా టాపిక్కే మాట్లాడేవాడు. (ఉద్దేశపూర్వకంగా కాదు.) నెమ్మదిగా షీబాకి దూరమవుతున్నాడు, నసీమాకి దగ్గరవుతున్నాడు గౌతమ్. కారణం తెలిసిన షీబా, ఓ రోజు నసీమాని కలవాలనుకుంది. అనుకున్నట్టే కలవటానికి తన స్కూల్ కి వెళ్ళింది.
“మేడం మీ కోసం ఎవరో వచ్చారు…” చెప్పాడు ప్యూన్. టెక్స్ట్ బుక్ చూస్తూ, పాఠం చెబుతున్న నసీమాతో.
“ఎవరూ?” అడిగింది.
“షీబా గారట మేడం” చెప్పాడు ప్యూన్.
షీబా తన కోసం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూనే బయటకి వచ్చి, షీబాని కలిసింది.
“ఏంటి షీబా ఇలా వచ్చావు?”
“నీతో కొంచెం మాట్లాడాలి.”అంది. ఇంతకాలం ఉన్న చనువుతో ఏకవచనంతో సంభోదిస్తూ…
“చెప్పు, ఏంటి విషయం?”
“ఇక్కడ కాదు. వేరే ఎక్కడికైనా వెళ్లి మాట్లాడుకుందాం…” కాసేపు అలోచించి పర్మిషన్ అడిగి వస్తానని వెళ్ళింది నసీమా. ఒక అరగంట గడిచేసరికి ఇద్దరూ ఒక పార్క్ కి చేరుకున్నారు.
**

“ఏదో మాట్లాడాలి అన్నావ్…” అంది నసీమా, షీబా చాలా సేపట్నుంచి మౌనంగా ఉండటం చూసి.
“యాక్చువల్లీ… నిన్ను ఒకటి అడగాలి…” ‘తనకి ఇచ్చేంత సంపద తన దగ్గర ఏముందబ్బా?’
అనుకుని,అడగమంది నసీమా. నిర్మొహమాటంగా, “నాకు గౌతమ్ కావాలి.” అంది షీబా.
పిడుగు పడ్డట్టు వినిపించింది ఆ మాట నసీమాకి.
ఈ మాట తను కలిసిన మొదటి రోజో, రెండో రోజో అడిగుంటే బావుండేది అనిపించింది తనకి.
ఎందుకంటే గౌతమ్ ని ఇక్కడ కలిసిన కొత్తలో తనకి అతనిపై ప్రేమ ఉంది, కానీ అతని జీవితంలోకి అడుగు పెట్టాలనే కాంక్ష లేదు. ఈ రెండు,మూడు నెలల్లో గౌతమ్ కి బాగా దగ్గరైంది. గట్టిగా చెప్పాలంటే అలవాటు పడిపోయింది… తనకి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా, దేవుడే మళ్ళీ తన మనసుకి నచ్చిన వాడ్ని తన దగ్గరకి పంపాడని మురిసిపోతున్న సమయంలో షీబా వచ్చి ఇలా మాట్లాడటం తనని బాధించింది.
ఇంత ఆలోచనలోంచి ఒక్కసారిగా తేరుకుని,
“గౌతమ్ నా దగ్గర లేడు కదా?” అంది. తెలివైన సమాధానం అది.
“కానీ అతని మనసు నీ దగ్గరే ఉంది…” వాస్తవం ఇది.
“నువ్వడిగింది మనిషిని కదా!” కౌంటర్ ఇచ్చింది.
“మనసు లేని మనిషితో కలిసి బ్రతకలేనుగా?” ఇది పంచ్.
“మనసు అడిగితే దక్కేది కాదు… దానిని గెలుచుకోవాలి… ” వేదాంతం.
“అసలు మనసుంటే కదా గెలవటానికి!” వేదన.
“ఇప్పుడు నన్నేం చేయమంటావ్?”తెర దించడం.
“గౌతమ్ అంటే నాకూ ఇష్టం ఉంది, నీకూ ఉంది… నువ్వు లేనంత వరకూ అతను నాకు దగ్గరైయ్యాడు… ఇప్పుడు నువ్వు వచ్చాక నీకు దగ్గరవుతున్నాడు…”
“గౌతమ్ నిన్ను ఇష్టపడుతున్నాడా?” ప్రశ్నించింది నసీమా.
“నా ప్రేమని గౌరవిస్తున్నాడు…”సూటిగా బదులిచ్చింది షీబా.
“ప్రేమ… ఇష్టం నుంచి పుడుతుంది గాని గౌరవం నుంచి కాదేమో…”
“గౌరవమైనా, ఇష్టమైనా రెండూ మనసులోని భావాలే కదా… మనసులో ఏ భావమున్నా అది ప్రేమగా మారుతుంది…”
“తప్పు… గౌరవం ఉంటే అభిమానంగా మారుతుంది… ఇష్టం ఉంటేనే ప్రేమగా మారుతుంది.”
“……”…. షీబాకి మారో మాట తట్టలేదు.

షీబా ఇప్పుడిప్పుడే ప్రేమ, పెళ్ళిలాంటి వాటి గురించి ఆలోచన చేస్తోంది. కానీ నసీమా చిన్నప్పట్నుంచీ గౌతమ్ ని ప్రేమిస్తున్నది. తన మనసును చంపుకుని కన్నవాళ్ళ మాట కోసం ఇష్టం లేని పెళ్ళి చేసుకుంది, అత్తింట్లో అనేకరకాల మనుషుల మధ్య మనో నిబ్బరంతో ఉంటూ సంసారాన్ని నెట్టుకొచ్చింది, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంది… ప్రేమ, పెళ్ళి, బంధం, కష్టం, సుఖం, బాధ్యత ఇలా…
మానవ జీవనానికి సంబంధమైన ఎన్నో వాటి మీద అవగాహన ఉంది. మరి అలాంటి అమ్మాయితో… షీబా మాట్లాడి నెగ్గగలదా!
“అంటే… చివరిగా ఏమంటావ్ సీమా?” ఒక మెట్టు తగ్గినట్టు అనిపిస్తోంది ఆమె పలుకు.
“చూడు షీబా, ఒక మనిషి గురించి అతని ప్రమేయం లేకుండా మనం మాట్లాడుకోవడం సరైనది కాదు…” తనేం చెప్పబోతుందో అర్ధమైంది షీబాకి.
“గౌతమ్ నే అడగాలంటావ్ … అంతేనా?” అవునన్నట్టు తల పంకించింది నసీమా.
ఇప్పుడు ఈ ప్రళ(ణ)య మారుతం గౌతమ్ వైపు వీయడానికి సంసిద్ధమైంది.

***

“ఇది సమస్య కాదు పరీక్ష!” కళ్ళ నిండా శూన్యం నిండినట్టు చెప్పాడు గౌతమ్.
“పరీక్ష అని నువ్వే అంటున్నావ్… పరీక్షల్లో ఉండేది ప్రశ్నలే? ఇప్పుడు నీ ముందు రెండు ప్రశ్నలున్నాయి. కాబట్టి జవాబు నువ్వే చెప్పాలి…” మరింత చిక్కులో పడట్టు అనిపించింది గౌతమ్ కి నసీమా మాటలు వింటుంటే.
“నాకు కొంచెం టైం కావాలి.” తప్పించుకోడానికి ఆడే అబద్ధంలా ఉంది ఆ మాట..
“ఎప్పుడు చెప్పినా జవాబు మారదు కదా గౌతమ్…” అంది షీబా.
“సరైన జవాబు చెప్పాలంటే ఆలోచించుకోవాలి కదా… చదువు లో పెట్టే పరీక్షల్లో కూడా మూడు గంటలు టైం ఉంటుంది… మరి ఇది జీవిత పరీక్ష! కనీసం మూడు రోజులైనా పడుతుందేమో…” అన్ని రోజులు కావాలని చెప్పకనే చెప్పాడు అతను. అది వాళ్ళకీ అర్థమైంది. సరేనని అన్నారు వాళ్ళు కూడా.
“కానీ చిన్న కండిషన్…” అన్నాడు గౌతమ్.
ఇద్దరి కళ్ళలో ఒకే భావం. ఏమిటన్నట్టు చూసారు.
“ఈ మూడు రోజులూ నేను మిమ్మల్ని కలవను, మీరు కూడా నన్ను కలవకూడదు…”
అన్న అతని మాటకి కట్టుబడటానికే సిద్ధపడ్డారు ఇద్దరూ…
కానీ అతనలా ఎందుకు అన్నాడో మూడు రోజుల తర్వాతే తెలిసేది వాళ్ళకైనా…

ఈ విషమ పరీక్ష నుంచి అంత తేలిగ్గా బయట పడటం కష్టమే అని తెలుసు గౌతమ్ కి. కానీ
తప్పదు…

జీవితంలో ఇలాంటి చిక్కు సమస్య ఎదురైనప్పుడే దాన్ని ఎదుర్కొని సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే జీవితాంతం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది.
ఒక మనిషిని చాలా మంది ఇష్టపడతారు. కానీ ఎవరో ఒక్కర్నే తమ జీవితంలోకి రానివ్వగలం. స్త్రీ అయినా పురుషుడైనా దీన్నీ అవలంబించాల్సిందే… ఉదాహరణకి స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ ఒక్కరికి ఒక ప్రేమకథ ఉంటుంది. (వన్ సైడ్ ఆర్ టూ సైడ్.)

ఒక అబ్బాయిని నలుగురైదుగురు ఇష్టపడచ్చు… ఒక అమ్మాయిని నలుగురైదుగురు ఇష్టపడచ్చు… అలాంటి సమయంలో, తమను ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవడం సర్వ సాధారణం. ఒక్కోసారి ఎంత ప్రాణప్రదంగా ప్రేమించినా… అవతల వాళ్ళకి అది రీచ్ అవ్వదు. వాళ్ళ హృదయాన్ని స్పందింపజేయదు. అంత మాత్రాన మన ప్రేమలో లోపముందని అనుకోకూడదు. వాళ్లకి అర్థమయేలా, స్పందన కలిగేలా, మన ప్రేమ చేరలేదు అనుకోవాలి… ఎందుకంటే, ఒకరి దగ్గర విఫలమైన ప్రేమ మరొకరి దగ్గర సఫలం అవ్వచ్చు… అందుకే బ్రేక్ అప్ లో ఉన్న వాళ్ళు త్వరగా ఇంకో మనిషికో, ఇంకో మనసుకో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. చెప్పొచ్చేదేంటంటే… ప్రేమ ఒక్కరితో ఆగిపోదు, కానీ ఇక్కడ గౌతమ్, షీబా, నసీమా సంగతి వేరు.

ఇప్పుడు గౌతమ్ ఇద్దరిలో ఎవర్ని తన జీవితంలోకి ఆహ్వానించాలన్నదే అసలు సమస్య… తను ప్రేమించిన మనిషినే ఆహ్వానించడానికి ఇష్టపడతారెవరైనా… ఎందుకంటే ఒక ఆడ, మగ (జీవితం పంచుకునే వాళ్ళు) విషయంలో మాత్రమే ప్రేమలో స్వార్థం చోటు చేసుకుంటుంది. ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు గౌతమ్. తన నిర్ణయం ఎంత వరకూ సరైనదో… చూడాలి!
*

ఆఫీస్ పని మీద బెంగుళూర్ వెళ్ళవలసి వచ్చింది గౌతమ్. ఎలాగూ మూడు రోజులు వాళ్ళిద్దరిని కలవద్దు అని చెప్పాడు.
కానీ నసీమాని కలవకుండా ఉండగలడా? షీబా సంగతి వేరు… నసీమాని చూడకుండా ఉండటం అతనికి కష్టమైన పనే…
ఈ ట్రిప్ ఏదో తన మంచికే అనిపించింది. అందుకే మేనేజర్ చెప్పగానే కాదనుకుండా సరేనన్నాడు.

బెంగుళూర్ రైల్వే స్టేషన్… ట్రైన్ ఫ్లాట్ ఫాం మీదకు వస్తూ ఉంది. తనని దాటుకుని పోతున్న కంపార్ట్మెంట్స్ ముందు నిలబడి చూస్తోంది మోహన. టైట్ జీన్స్, టాప్… సిల్క్ లూస్ హెయిర్, గుమ్మానికి తోరణాలలాగా వేళాడుతున్న ఇయర్ రింగ్స్, లైట్ గా లిప్స్టిక్, హై హీల్స్, చూడడానికి పాష్ గా ఉన్న అచ్చతెలుగు ఆడపిల్లలాగా ఉంది.
ట్రైన్ ఆగింది. S7 లోంచి దిగాడు గౌతమ్… అతన్ని చూడగానే ఫోన్ లో అతని ఫోటో చూసి కన్ఫర్మ్ చేసుకుని, అతనికి ఎదురెళ్ళింది.

“హాయ్, అయామ్ మోహన…” షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది.
“మీరు…” చేయి అందుకోకుండానే అడిగాడు.
“ఇక్కడ మీరు చేయడానికి వచ్చిన ప్రాజెక్ట్ లో టీం మెంబర్ ని…” చెప్పగానే చేయి అందించాడు.
ఇద్దరూ కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళారు.
“లెవెన్ కి మీటింగ్. ఇప్పుడు టైం టెన్ అయింది. మీరు రెడీ అవడానికి పది నిమిషాలు చాలనుకుంటా?” ఎందుకలా అందన్నట్టు చూసాడతను. అతని చూపు అర్థమై…
“అంటే, లేడీస్ కి అయితే టైం పడుతుంది… జెంట్స్ కి అంత టైం పట్టదు కదా…” నవ్వింది. అతను నవ్వాడు.
“జస్ట్ కిడ్డింగ్… నేను లాబీ లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయండి…” చెప్పి వెళ్ళిపోయింది తను.

కాన్ఫెరెన్స్ హాల్… మీటింగ్ లో మాట్లాడుతున్నారు, ముఖ్యమైన వ్యక్తులు. మీటింగ్ ముగిసింది.
రెస్టారెంట్ లో కూర్చుని డిన్నర్ చేస్తున్నారు, మోహన, గౌతమ్.
“మీకు పెళ్ళి కాలేదు కదా?” ఉన్నట్టుండి అలా అడిగేసరికి, అర్థం కానట్టు చూసాడతను.
“పెళ్ళి అయి ఉంటే, ఈ పాటికి కాల్స్ మీద కాల్స్ వచ్చేవి కదా వైఫ్ నుంచి…” నవ్వింది. తనూ నవ్వాడు.
“గర్ల్ ఫ్రెండ్స్… ఎవరైనా ఉన్నారా?” ఆమె అడగిందే అదునని అనుకున్నాడో ఏమో. తన పరిస్థితి వివరించాడు ఆమెకి.
“హా…హా…హా…హా…హా…” బిగ్గరగా నవ్వింది తను.
“ఎందుకలా నవ్వుతున్నారు?”
“ఇదొక సమస్యా?” వ్యంగంగా అన్నది.
“నాకిది చాలా పెద్ద సమస్య.”
“చూడండి గౌతమ్. ఒక మనిషిని ఎంతో మంది ప్రేమిస్తారు. అలా అని అందరితో జీవితం పంచుకోలేము కదా! అఫ్ కోర్స్… మీ విషయంలో కొంత కాంఫ్లిక్ట్ ఉంది ఒప్పుకుంటా… బట్, ఇలాంటి విషమ పరిస్థితులలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించడమే సరైనదని నా అభిప్రాయం…” నిజమే అనిపించిందతనికి.
ఆమె కొనసాగించింది.
“షీబాతో ఫిజికల్ గా కలిసారు. అది ఇన్స్టెంట్ ఎమోషన్. నసీమాని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నారు. ఇది పర్సనల్ ఎమోషన్. ఎండ్ ఆఫ్ ది డే మనసుకు నచ్చిన వాళ్ళతో ఉండటమే లైఫ్ కి జస్టిఫికేషన్…”
తను చాలా ఈజీగా చెప్పింది. కానీ గౌతమ్ కి షీబా విషయంలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది… అటు షీబా,ఇటు నసీమా ఇద్దరు రెండు కళ్ళలాగా అనిపించారు అతనికి… ఎవరికి న్యాయం చేస్తాడో, ఎవరికి అన్యాయం చేస్తాడో హైదరాబాద్ వెళ్ళాక తెలుస్తుంది.

***

ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు గౌతమ్.
“ఎనీ వే… నైస్ మీటింగ్ యూ… మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు కాల్ చేసి చెప్పాలి మరి…” అంది తను వీడ్కోలు చెబుతూ. ట్రైన్ కదిలింది.
హైదరాబాద్ వచ్చీ రాగానే ఇద్దరికీ ఫోన్ చేసి కలవడానికి రమ్మన్నాడు గౌతమ్.
తన నిర్ణయం ఏదైనా శిరసావహించడానికి సిద్ధంగా ఉంది నసీమా… అతను ఆమెని వదిలి వెళ్ళకుండా ఉంటే చాలని ప్రభువుని ప్రార్థించింది షీబా… మరి గౌతమ్… ఇద్దరి ఆశ నెరవేరేలా నిర్ణయం తీసుకున్నాడా… లేదా అన్నది సాయంత్రం వాళ్ళు కలిసే వరకూ ఇద్దరికీ సస్పెన్సే.
********

అదే ఆఖరు పేజీ… తిప్పడానికి ఇంకా పేజీలు లేకపోయేసరికి కలవర పడ్డాడు ఇజాక్.
అతని మెదడు ఆ సస్పెన్స్ ని తట్టుకోలేకపోతోంది. ఆ మూడు రోజుల తరవాత ఏం జరిగుంటుంది. ఇంతకీ గౌతమ్ ఎవర్ని చేసుకున్నాడు… అబ్బా… ప్చ్! ఇదేం ట్విస్ట్ అసలు ఇది ఎవరు రాసారో తెలీదు… పోనీ దీని పైన టైటిల్ ఉండి ఉంటే ఏ పేపర్ లోనో టీవీ లోనో యాడ్ ఇచ్చి కనిపెట్టచ్చు ఎవరు రాసారో…ఇప్పుడెలా??? అని మథన పడిపోతున్నాడు ఇజాక్… చాలా నిరాశ చెందాడు అతను. చేసేది లేక పుస్తకాన్ని పక్కన పడేసాడు.
ఒక వారం గడిచింది. ఇజాక్ మనసంతా ఆ కథ క్లైమాక్స్ ఏమై ఉంటుంది, అన్న దాని చుట్టూనే తిరుగుతోంది.
అన్నం, నిద్ర అంతగా సహించడం లేదు. ప్రతీ క్షణం అదే ఆలోచన… క్లైమాక్స్ ఏమై ఉంటుంది,ఏమై ఉంటుంది అని. ఆ రోజు కూడా అన్నం తినడానికి కొద్ది సేపు ముందు వరకు అదే ఆలోచన. ఇంతలో అమ్మ పిలుపు.
“బేటా… ఖానా ఖానే ఆవో…” (బాబూ, అన్నం తినడానికి రా!) అయిష్టంగానే వచ్చాడు భోజనానికి… తల్లి వడ్డిస్తోంది. అన్నం వేసింది కూర వేస్తూ.
“మావయ్యని గోంగూరా, పచ్చి రొయ్యలు తెమ్మన్నాను. రొయ్యలు దొరకలేదట.. గోంగూర మాత్రమే తెచ్చాడు. సర్లే, అనుకుని ఇంట్లో ఎండు రొయ్యలుంటే వేసి చేసా… ఎలా ఉంది?” తురకంలో అడిగింది తల్లి, విషయం చెప్పి.
“అచ్చాహే…” అన్నాడు ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ…
“గోంగూరలో ఎండు రొయ్యల కన్నా, పచ్చి రొయ్యలే రుచి… కానీ దొరకనప్పుడు ఏం చేస్తాం! ఉత్తి గోంగూర రుచించదని ఎండు రొయ్యలేసా… ఏదోటి కలవకపోతే గోంగూరతో ముద్ద దిగదు కదా!” అంది.
ముద్ద నములుతూ ఆగాడు ఇజాక్. అతని మస్తిష్కంలో ఏదో మథనం తీవ్రంగా జరుగుతోంది… చప్పున చెయ్యి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు తన రూమ్ లోకి. పైకేదో బావుంది అన్నాడు గాని ఎండు రొయ్యలేస్తే అంతగా రుచించలేదు కాబోలు అనుకుంది తల్లి. ఇజాక్ వెళ్ళిపోవడం చూసి,
పుస్తకం అందుకుని, మళ్ళీ ఒకసారి పైపైన చదువుకుంటూ వెళ్ళాడు ఇజాక్. తనే ఒక క్లైమాక్స్ రాసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఇందుకు కారణం. కానీ క్లైమాక్స్ రాయాలంటే కొంత ఫ్లో కావాలి. సరాసరి క్లైమాక్స్ ఎలా రాయగలం అనుకుని, తనకి ఎక్కడ అయితే మింగుడు పడలేదో… అక్కడ నుంచి తనదైన శైలిలో రాయదల్చాడు.
నవల సాగే విధానం, ప్రక్రియ కొంత అవగాహనకి వచ్చింది, చదవడం వలన. అదే స్ఫూర్తితో, షీబా, గౌతమ్ పుట్టిన రోజు నాడు కేక్ తో తన రూమ్ కి అర్థరాత్రి వెళ్ళిన సన్నివేశం దగ్గర నుంచి మొదలెట్టాడు… దాదాపు వారంలో పూర్తి చేసాడు… తను రాసింది చదువుతున్నాడిప్పుడు… క్రాస్ చెకింగ్.
**
తెల్లవారితే గౌతమ్ పుట్టిన రోజు అనగా ముందు రోజు రాత్రి టైం పది నిమిషాల తక్కువ పన్నెండు కావస్తుంది. కేక్ తీసుకుని గౌతమ్ రూమ్ కి వచ్చింది షీబా. పన్నెండు అవడానికి ఇంకా పది నిమిషాలుంది. తలుపు దగ్గరే నించుని, ‘తను ఎలా స్పందిస్తాడో, థ్రిల్
అవుతాడో లేదో,లేక న్యూట్రల్ గా ఉంటాడేమో! ఇంత సర్ప్రైస్ ఇస్తే ఎక్సైట్ అవకుండా ఉంటాడా!..’ ఇలా ఎనిమిదిన్నర నిముషాలు ఆలోచనలు చేసి తేరుకుని టైం చూసి సరిగ్గా పన్నెండుకి 20 సెకన్ల ముందు తలుపు కొట్టింది. సరిగ్గా పన్నెండు అవుతుండగా తలుపు తెరుచుకుంది.
“హ్యాపీ బర్త్ డే.”అంది నవ్వుతూ ..
షీబాని చూసిన గౌతమ్ ముఖంలో ఏ భావమూ లేదు.
“థ్యాంక్ యు…” అన్నాడు నార్మల్ గా. తన ఆశలపై నీళ్ళు చల్లినట్టు అనిపించింది షీబాకి.

లోపలికి వెళ్లి కేక్ కట్ చేయించింది. ఒకరికొకరు తినిపించుకున్నారు. గిఫ్ట్ తీసి ఇచ్చింది.
“ఇప్పుడెందుకు షీబా ఇవన్నీ?’ అన్నాడతను గిఫ్ట్ అందుకుంటూ.
“మన పరిచయమయ్యాక నీ ఫస్ట్ బర్త్ డే ఇది. గుర్తుండిపోవాలి కదా! అందుకూ.”
గౌతమ్ కి నసీమా కనిపించింది ఆ మాటల్లో. స్కూల్ లో నసీమాతో జరుపుకున్న తన బర్త్ డేను ఇప్పటికీ, ఎప్పటికీ మరచిపోడు తను. ఆ జ్ఞాపకాల్లోకి జారుకుంటున్న తనని కదిపింది షీబా. కళ్ళ ముందు చిటికె వేసి. తేరుకుని నవ్వాడు తనలో తను ఏదో అనుకుని.
“ఎందుకా నవ్వు ?” అడిగింది తను..
“ఏం లేదులే ?” మళ్ళీ నవ్వు.
“చెప్పచ్చుగా?” అంది తను.
“సీమా గుర్తొచ్చింది…” చెప్పాడు.
“సీమా?” ఎవరనే ప్రశ్న తదుపరి మాటదని చెప్పకనే అర్థం అయ్యింది గౌతమ్ కి.
తన గతం చెప్పాడు గౌతమ్..షీబా కి మొదట్లో కాస్త టెన్షన్ కలిగినా.. పోను,పోను కుదుట పడింది,సీమకి పెళ్ళి అయ్యింది అని చెప్పిన దగ్గర నుంచి..గతం అంతా విని..దుఃఖాన్ని గొంతు వెనక ,బాధ ని కళ్ళ వెనక అదిమి పట్టిన గౌతమ్ ని చూసి తనకి జాలేసింది..
ఎంత కాదనుకున్న తొలిప్రేమ,తొలిప్రేమే ఎవరిదైనా..ఒకవేళ గౌతమ్ తనకి దక్కకపోతే తను మాత్రం ఇలాగే బాధపడదా ,ఇంతకన్నా ఎక్కువే పడుతుంది.అనుకుని,
“బాధ పడకు గౌతమ్ ..”అంది ఓదార్పుగా..భుజం పై చెయ్యి వేసి..ఆమె స్పర్శ అతనికి రిలీఫ్ అనిపించింది..తనకి తెలియకుండానే తను ఆమె భుజంపై తల వాల్చాడు. అతన్ని దగ్గరకు తీసుకుంది ఆమె. ఆమె ఒంటి వాసన అతనిలో జ్ఞాపకాల మసక తొలిగించి మోహపు తెర తెరిచింది. అతని నిశ్వాస ఆమె ఒంటిలోకి చొరబడి మైకం కలిగిస్తోంది.
అతని చెయ్యి ఆమె నడుంపై స్థిరపడింది. ఆమె చెయ్యి అతని మెడకి మరింత బిగుసుకుంది. అతని నిశ్వాస ఉక్కిరిబిక్కిరైంది,పెదవుల తడి ఆమె మెడన తగలగానే వాలిన తన రెప్పల పైమెట్టు ఎక్కింది మైకం. అదురుతున్న అధరాలే అందుకు సాక్ష్యం. ఊపిరాడని ఆమె కౌగిలి చెర నుండి విడుదలై, ఈడు వేడిలో తనువు మరిగి, ఆవిరై చెమటలా చేరుకున్న ఆమె ముఖారవిందాన్ని చూస్తున్నాడు అతను. ఆ చూపుల నులివెచ్చని చురకలు తన రెప్పలని తాకీ తాకంగానే కలువల్లా విచ్చుకున్నాయి ఆమె రెప్పలు. ఎదలోని కాంక్ష కళ్ళల్లో కనిపిస్తోంది. మౌన భాష కన్నా మహాబలీయమైనది మోహ భాష.

ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడతను ,ఆమె తనువు తేలికైయ్యింది అరమోడ్పుగా చూస్తూ అతనిలో మానసికంగా ఏకమైంది..ఆ ఏకాంతం అలా సుఖాంతమైంది.
తెల్లవారింది..
అతని ఛాతీపై ఆమె తల వాల్చి ఉంది..ఆమె జుట్టు అతని ముఖాన్ని కప్పేసింది.
కిటికీ అద్దాన్ని చొచ్చుకు వచ్చి పడింది రవికిరణం,ఆమె కన్నుల్లో నిద్రపోతున్న నిద్రపై ..మత్తుగా కళ్ళు తెరిచింది..పూర్తిగా స్పృహలోకి వచ్చి అతని ముఖాన్ని కప్పేసిన తన జుట్టుని తొలగించి కళ్ళ నిండా ప్రేమ నింపుకుని చూస్తోంది తను..మనసుతోనో ,మాటతోనో చెప్పాల్సిన ప్రేమని తనువుతో చెప్పింది.మనసు ఆనతి లేనిదే తనువు చలించదుగా..తను చెప్పడం అయితే చెప్పింది.. మరి అతనికి ఎంత వరకు అర్ధం అయ్యిందో తెలీదు తనకి.

“సెక్స్ ఈజ్ ద అల్టిమేట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ లవ్”..స్పూర్తి పొందటానికి గుర్తు చేసుకున్నట్టుంది ఆ మాట.. ” ప్రేమలో కామం ఉంటుంది గాని కామంలో ప్రేమ ఉండదు…” ఈ మాట తనెక్కడా విని ఉండదు..ఇంకాసేపట్లో వినబోతుంది.
తన ముఖానికి ముఖం దగ్గరగా పెట్టి చూస్తుండటంతో ఆమె నుంచి వెలువడే ఊపిరి సెగలు తగిలి మేలుకున్నాడతను..అతను మేలుకోగానే ఆమె తేరుకుంది.తనపై నుంచి తప్పుకుంది నెమ్మదిగా అతను లేచాడు,ఇరువురి ఒంటిపై కప్పి ఉన్న దుప్పటి, తనతో పాటు కదిలి జరిగింది. ఆమె ఒంటి పై నుంచి..అతని చూపు పడకుండా సర్దుకుంది తను..మెడ వరకు దుప్పటి కప్పుకుని లేచి కూర్చుంది ఆమె భుజం అతనికి తాకింది.
తప్పు,ఒప్పు అనే సందిగ్ధం లేదు తనలో. ఎందుకంటే అది బలవంతం కాదు ప్రేరేపితం.
“క్షమించమని అడగను.ఎందుకంటే ఇది తప్పు కాదు,ఒకవేళ తప్పని నువ్వనుకుంటే అది నాది మాత్రమే కాదు..” చెప్పాడు తను.ఆమె మౌనం వహించింది.

అతనికి ఇంకా ఏదో చెప్పాలనిపించినా, “ఎవరూ ఎవర్ని రెచ్చగొట్టింది కూడా కాదు..ఇదో మ్యాజికల్ మూమెంట్..ఈ పరిస్థితిలో ఎవరున్నా ఇదే జరిగేది..కానీ ఇద్దర్లో ఎవరో ఒకరికి మరొకరిపై మనసైనా ఉండాలి,ఇష్టమైనా ఉండాలి,ప్రేమైనా ఉండాలి..ఇవేవి కాకపోతే చనువైనా ఉండాలి..లేదంటే ఎంత ఉద్వేగం కలిగినా ఇది జరగదు..” అని ఆమెవైపు చూసాడు… ఆమె నుంచి ఏ మాటా లేదు.
“కాబట్టి..నాది చనువు వల్ల కలిగిన భావం..నీదీ అదే భావమైతే మనకి మనం సంజాయిషీ
చెప్పుకోనక్కరలేదు…లేదంటే….”

అతనింకేదో చెప్పబోతుండగా.. “ఐ లవ్ యు గౌతమ్.” అతని మాట పూర్తి కాకుండానే అంది తను… గుండెలో రాయి పడింది అతనికి..
“ఇది ఇప్పుడు ఇలా జరగడం వల్లో , లేక ఇలా జరిగింది కాబట్టి తప్పకో, చెబుతున్నది కాదు..అయిదేళ్ళ నుంచి నా మనసులోనే దాగి ఉన్న మాట ఇది.” తను ఎమోషనల్ అయ్యింది… గౌతమ్ కి ఇప్పుడు ఇంకా పెద్ద చిక్కొచ్చి పడింది.
“క్షమించు షీబా…తెలియకుండా తనువు అర్పించాను అందుకని తెలిసి తెలిసి మనసుని మూల్యంగా సమర్పించలేను.”
“తనువు అర్పించింది నేను గౌతమ్..నువ్వు సుఖం మాత్రమే పొందావు.” అంది తను ఓ మెట్టు దిగి..
నవ్వి… “నువ్వు కూడా పొందావుగా..ఆ మాటకొస్తే..నాది శారీరక సుఖం మాత్రమే నీది మానసికమైనది కూడా…” చాచి కొట్టినట్టు అనిపించింది తనకి ఆ మాట. నిజమే మరి. శృంగారంలో పురుషుడి పాత్ర ఎంతో, స్త్రీ పాత్ర కూడా అంతే. నొప్పి, తీపి ఇద్దరికీ సమానంగానే అందుతాయి కదా! నా సర్వసం నీకు అర్పించాను అని సినిమాల్లో, నవలల్లో, అప్పుడప్పుడు నిజజీవితంలో కూడా ఎవరైనా అమ్మాయిలు అంటుంటే నవ్వొస్తుంటుంది. అలాంటి నవ్వే ఇప్పుడూ వచ్చింది అతనికి.
“ఇప్పుడేమంటావ్?” అడిగింది తను.
“ప్రేమ నుంచి మోహం పుడుతుందేమో గాని… మోహం నుంచి ప్రేమ పుట్టదు. అలా పుట్టిన ప్రేమ మోహం తీరగానే పోతుంది…” ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదన్నట్టు లేచాడు అతను. ప్రశ్నగా మిగిలింది తను.

************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *