April 20, 2024

నాచారం నరసింహస్వామి గుడి

రచన: రమా శాండిల్య

తెలంగాణాలో, ఇంత మంచి దేవాలయాలు ఉన్నా, అవి ప్రాచుర్యంలో లేకపోవటం విచారించాల్సిన విషయం.
చుట్టూ పొలాలు, చిన్న వాగు, చిన్న గుట్టమీద తాయారమ్మ, ఆండాళ్లమ్మలతో పాటుగా వెలసిన నరసింహస్వామి ఆలయమిది.
ప్రశాంతమైన పరిసరాలతో ఈ గుడి చాలా బావుంటుంది.
ఇక్కడ పెద్దసంఖ్యలో కోతులుంటాయి. అవి, మన చేతుల్లో ఉన్న వస్తువులను లాక్కుపోతూ ఉంటాయి.
ఈ గుడి ఉదయం ఆరు గంటలనుంచీ మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ తెరచి ఉంటుంది. ఒంటిగంటకు గుడి లోపల శాకాహార భోజనం లభిస్తుంది. గుడి బయట కొబ్బరి కాయల దుకాణాలు ఉంటాయి. గుడిలో పులిహోర, లడ్డూలతోపాటుగా మొక్కజొన్న రవ్వతో చేసే ప్రసాదం కూడా చాలా బావుంటుంది. ఈ మొక్కజొన్న రవ్వ ప్రసాదం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది.
ఈ ఆలయం చాలా పురాతన కాలానికి చెందినదైనా, ఉపాలయాలైన సీతారామలక్ష్మణుల గుడి, సత్యనారాయణ స్వామి గుడి, శివాలయము, దత్తాత్రేయుని గుడి, సాయిబాబా గుడి మాత్రం 1985 లో కట్టారట.
ఈ గుడి కొండపైన ఉన్న ఒక గుహలో నిర్మితమైనది. గుహల మార్గంలోనుంచి గిరి ప్రదక్షిణం చేయటం చాలా బావుంటుంది.
ఈ కొండ మీద కట్టిన ఒక మంటపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి.
స్థల పురాణం
ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ‘హిరణ్యం’ అనే నది ప్రవహించేదట. ప్రస్తుతం ఆ నది, వాగుగా: ఆ వాగు చిన్న చెలమగా రూపాంతరం చెందాయి.
హిరణ్యకశ్యపుడిని సంహరించాక, ఆగ్రహోదగ్రుడైన నరసింహస్వామి ఉగ్రస్వరంతో అరుస్తుంటే, అక్కడికి దూరంగా ఉన్న గుహలలోనుండి అదే అరుపు ప్రతిధ్వనిగా వినపడుతుంటే, ఇంకొక సింహమనుకొని స్వామి గుహలలో తిరుగుతూ గర్జిస్తుంటే, లక్ష్మీదేవి చెంచులక్ష్మి రూపంలోవచ్చి ఆయనను శాంతపరచిందని, స్వామి అక్కడే స్థిరంగా వెలసాడనీ స్థలపురాణం.
ఇక్కడ ఎవరికైనా సరే, కోరిన కోరికలు తీరిన భక్తులకు, వారి తలపైన అర్చకులు పగిడీని ధరింపజేసి, దానిపై హారతిని ఉంచి, గుడిచుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయిస్తారు.
ఈ ఆలయం మెదక్ జిల్లాలోని వర్గల్ మండలంలో, తూముకుంట – గజ్వేల్ మార్గంలో ఉంది. వర్గల్ నుండి సరిగ్గా ఇరవై కిలోమీటర్లు దూరములో ఉంది. సికింద్రాబాద్ జూబిలీ బస్ స్టేషన్ నుండి నాచారం నరసింహస్వామి గుడి వరకూ బస్ సౌకర్యం కలదు. తప్పకుండా చూడదగిన ఆలయం. జంటనగరాలు, చుట్టుప్రక్కల నివసించే భక్తులకు దర్శనీయ స్థలమిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *