April 22, 2024

పరివర్తన

రచన: ప్రభావతి పూసపాటి

“తులశమ్మగారి కొడుకు కోడలు రేపొద్దున బెంగుళూరు వెళ్ళిపోతున్నారుట” తన కోడలు చెపుతున్న మాటలు పక్క గదిలో ఉన్న వర్ధనమ్మ చెవిలో పడ్డాయి. కోడలు చెపుతున్న తులశమ్మగారువాళ్ళు తమ ఇంటి ఎదురు ఫ్లాట్ లో వుంటారు.. “కొడుకు కోడలు బెంగుళూరు రమ్మన్నా, అక్కడికి రాలేను అని తులశమ్మగారు అనకముందే మన అపార్ట్మెంట్ వాళ్లే ఇక్కడ మేమంతా దగ్గర ఉండి చూసుకొంటాము, మీతో బెంగుళూరు వస్తే పగలంతా ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉండవలసి వస్తుంది, ఇక్కడ మేమంతా వున్నాము, మీతో తీసుకు వెళ్ళడానికి వీలు లేదు అని ఖరాఖండి గా చెప్పేసారుట ” అవునులెండి తులశమ్మగారు లేని మన అపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది సబబే అనిపిస్తోంది అని అంటూ కోడలు తలుపు దగ్గరగా వేసిన శబ్దం వినపడింది.
వర్ధనమ్మగారు హైదరాబాద్ లో ఉంటున్న కొడుకు దగ్గరికి రెండు నెలల క్రితం వచ్చింది. వర్ధనమ్మ భర్త, అత్తా మామలతో కలిసి ఊరిలో వుండేవారు. అత్తమామలు కాలం చేసాక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు., ఒక్కగానొక్క కొడుకు చదువు అయిపోయాక మంచి వుద్యోగం లో చేరి పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో స్థిరపడిపోయాడు. పెళ్లి అయినప్పటి నుంచి తమతో కలిసి ఉండమని, కష్టమో సుఖఃమో అందరం కలిసి హైదరాబాద్ లో ఉందామని చాలాసార్లు కొడుకు, కోడలు బ్రతిమాలాడారు. కానీ ఒంటరిగా నేను నా భర్త హాయిగానే ఉంటున్నాము కదా అక్కడికి వెళ్లి సర్దుకొని బ్రతకటం ఎందుకు అనుకోని రానంది. హఠాత్తుగా భర్త మరణించాక, ఇంటి చుట్టుపక్కల చాలా కుటుంబాలు వున్నా ఎవ్వరినుంచి ఆప్యాయంగా పలకరింపులు లేక ఇంక అక్కడ ఉండలేక కొడుకు దగ్గరికి వచ్చేసింది.
వచ్చినప్పటి నుంచి ఎదురు ఫ్లాట్ లో ఉంటున్న తులశమ్మగారిని పరిశీలిస్తూనే వుంది. కోడలి ద్వారా ఆవిడ గురించి తెలిసింది. తులశమ్మగారు కూడాతమ సొంత వూర్లో అత్తమామలతో కలిసి వుండే వారుట, వాళ్ళు కాలం చేసాక ఈ ఫ్లాట్ కొనుక్కొని వచ్చేసారుట, వాళ్ళకి కూడా ఒక్కడే కొడుకుట, ఆతను చదువు కోసం అమెరికా వెళ్లి, పెళ్లి అయిపోయాక కొన్నాళ్ళు అక్కడే ఉండి, ఇప్పుడు ఉద్యోగరీత్యా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇంటిలో, మంచి హోదా, పెద్ద కారుతో బెంగుళూరు లో స్థిరపడిపోయాడు, తల్లితండ్రిని తమ దగ్గరికి వచ్ఛే యమన్నాడు కానీ, ఎన్నాళ్ళొగానో ఇక్కడే అలవాటుపడిపోవటం వలన, అక్కడ భాష రాకపోవటం వలన తులసమ్మదంపతులు కొడుకు దగ్గరికి వెళ్లలేదుట, ప్రతి పండగకి కొడుకు కోడలు, పిల్లలు వచ్చి వెళుతుంటారుట. ఈ మధ్యే తులసమ్మ భర్త గారికి హార్ట్ ప్రాబ్లెమ్ వస్తే, ఆపరేషన్ అయిపోయాక తమతో బెంగుళూరు తీసుకు వెళ్లిపోదాము అనుకొంటే, అపార్ట్మెంట్ వాళ్ళందరూ ససేమిరా తీసుకు వెళ్ళడానికి వీల్లేదు, మేమంతా వున్నాము, వాళ్లు మా అందరికి పెద్ద దిక్కు, వాళ్ళని సొంత అమ్మానాన్నల్లా చూసుకొంటాము అని కోడలు సాయంత్రం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వర్ధనమ్మ ని ఆలోచనలు గతం లోకి నెట్టేశాయి.
వర్ధనమ్మకి చిన్నతనంలోనే పెళ్లి అయ్యి అత్తారివూరు చేరి దాదాపు 50 సంవత్సరాలైంది. చిన్నప్పుడే తండ్రి పోయాడు, తల్లి మేనమామలు అండతో తనను పెంచింది, చాలా మంది పుట్టి చనిపోయాక తను ఒక్కత్తే బ్రతికానని తనని తల్లి అతి గారాబంగా పెంచింది. ఇంట్లో మేనమామ పిల్లలతో ఎప్పుడు సన్నిహితంగా మెలగలేదు, ఎక్కడో వాళ్ళు తమ మీద ఆధార పది బ్రతుకుతున్నారని చులకన భావం వల్లనేమో…. పెళ్లి కూడా తెలిసిన వాళ్ళు అని తనకన్నా వయసులో పెద్ద అయిన అతనికి ఇచ్చి చేశారు, తల్లి ఆర్దిక సహాయం తో ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాక తన జీవితం అంతా బావి లో కప్ప లాగ ఆ ఇంటిలోనే గడిపేసింది., అప్పట్లో తమ చుట్టాలలో సొంత ఇల్లు తామే కట్టుకోవటం వలన” ఇల్లు” జీవిత సర్వస్వం అయిపోయింది. ఇల్లు ఎన్ని ఇటుకలతో కట్టారు, ఎంత ఇసుక వాడారు, ఇలా అవసరం లేని విషయాలు గుర్తు పెట్టుకున్నదే కానీ జీవితములో ముఖ్యమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఏ తల్లి డబ్బు సాయం తో ఇల్లు కట్టుకొన్నామో కనీసం ఆ తల్లిని కూడా చివరి రోజుల్లో కూడా దగ్గరుంచుకొని సేవ చేయలేదు, పాపం ఆవిడ తన సొంత వూర్లో పొతే చుట్టం లా చూచి వచ్చేసింది. తాను ఒక్క కూతురు అవటం వలన, అత్తింటి వైపు కూడా పెద్దగా బంధుత్వాలు, రాకపోకలు లేకపోవటం మూలాన ఎంత సేపు తాను, తన భర్త పనుల వరకే చూసింది తప్ప ఇరుగు పొరుగులతో ఆప్యాయము గా మాట్లాడటం కానీ, వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోవటం కానీ చేయలేదు.
ఎప్పుడూ తాను, తన స్వార్థము తప్పించి , వేరే వాళ్ళ గురించి ఆలోచించటం కానీ, వాళ్ళ ప్రకారం కొంచెం సర్దుకోవటం కానీ ఎదుటి వారి అవసరాలు గుర్తించి వాళ్ళకి చిన్న చిన్న సదుపాయాలు సమకూర్చటం గాని, వాళ్ళకి పెద్దరికం గా నిలబడి ఎప్పుడు ఎటువంటి మాట సహాయంకూడా చేయలేదు. తన ధోరణి తనదే కానీ పక్క వాళ్ళ మనసెరిగి ఎప్పుడు ప్రవర్తించలేదు. మనిషి తన స్వార్థం తానూ చూసుకుంటె తప్పేంటి అనుకున్నది కానీ “పరోపకారం ఇదం శరీరం “అన్న నానుడిని ఎన్నడూ పాటించలేదు.
ఇక్కడకు వచ్చి తులసమ్మ ని చూసాక కానీ ఇంతవరకు జీవితం లో తాను ఇరుగు పొరుగు తో మసలిన తీరు, అప్పుడు తాను చేసిన తప్పులు భూతద్దములో చూపించినట్టు కళ్ళ ముందు కదులుతున్నాయితులసమ్మ అందరికి తలలో నాల్కల, పెద్ద అండగా, వుంటున్నారు, అందరు ఆవిడని అమ్మ అనో, ఆంటీ అనో, పిల్లలు అందరు బామ్మా అని పిలుస్తున్నారు. ఆవిడ సలహా సంప్రదింపులు పాటిస్తూ ఆవిడని గౌరవిస్తున్నారు. ఉద్యోగస్తులు పిల్లలిని ఆవిడ దగ్గర వదిలి వెళుతున్నారు, అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకొంటున్నారు, మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళ అందరికి తల్లిలా ఉండి ఆదుకొంటున్నారు. అందుకే అందరు ఆవిడ కావాలని అనుకొంటున్నారు, తమని వదిలి బెంగుళూరు వెళ్లవద్దని అంటున్నారు, కానీ తన విషయములో పూర్తి వ్యతిరేకముగా జరిగింది. .
తమ ఇంటి పక్కనే ఇంటిని ఆనుకొని పది పన్నెండు కాపురాలు వున్నాయి… విచిత్రం ఏమిటి అంటె తాను ఇల్లు వదిలి కొడుకు తో హైదరాబాద్ వచ్ఛేస్తుంటె ఒక్కళ్ళు కూడా మీరుఎందుకు అక్కడికి వెళ్ళటం మేమంతా లేమా, ఏవైనా అవసరం వస్తే కొడుకు చిటికలో వస్తాడు, మీరు హైదరాబాద్ వెళ్ళ వద్దని కనీసం ఒక్కరు కూడా అనలేదు. నిజమే వాళ్ళు ఆలా అనేలా తానూ ఎన్నడూ ప్రవర్తించలేదు.
ఇక్కడికి వచ్చాక తులమ్మగారిని చూసాక ఆవిడకి తనకి ఉన్న తేడా ఏమిటో తెలుస్తోంది. కొద్దీ రోజులుగా ఆవిడని గమనిస్తూనే ఉంది. ప్రవర్తనలోనే కాదు తులశమ్మగారి కట్టుబొట్టు, మాట నడవడికఇలా ప్రతిదానిలోనూ అపర లక్ష్మీదేవిలా అనిపించిందికి తనకి.
ఇప్పుడంటే బొట్టు లేదు కానీ భర్త ఉన్న రోజుల్లో కూడా తను ఎప్పుడు అందం గా తీర్చి తిలకం దిద్దుకోవడం కానీ, కాటుక తీర్చి దిద్దుకోవటం కానీ చేసేది కాదు,. ఆడవాళ్ళకి ఏంతో ఇష్టమైన గోరింటాకు, గాజులు మీద పెద్దగా మోజు ఉండేది కాదు, కాళ్లపట్టీలు కూడా ఎప్పుడు పెట్టుకోలేదు కోడలు ఎన్నోసార్లు చెప్పినా తనలో మార్పు రావటం లేదని మిన్నకుండి పోయింది.. .
కోడలు చెప్పినట్టు తులశమ్మగారిలా పిల్లలు వస్తారని హడావుడి చేయడం కానీ, వారికి ఇష్టమైనవి చేసిపెట్టటం కానీ, వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చి వారి పసిమనసుల్లో మంచి అనుబంధం ఏర్పరుచుకొనే ఏ ప్రయత్నమూ చేయలేదు, , పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చలేదు. తల్లిగా, అత్తగా, బామ్మగా చేయవలసిన చాలా ధర్మాలు పాటించలేదు అని ఇప్పుడు అనిపిస్తోంది.
ఇప్పుడు కొడుకింటికి చేరాను కానీ వాళ్ళల్లో కలవలేక పోతున్నాను, అన్ని సదుపాయాలు అనుభవిస్తున్నాను కానీ వాళ్ళకి ఏమి చెయ్యలేదు అన్న న్యూనతాభావం మనసుని నలిబిలి చేస్తోంది. అందుకని తులసమ్మగారి ల తాను ప్రశాంతంగా వుండ లేకపోతోంది.
పెద్దరికం అనేది వయసు తో రాదు ప్రవర్తనవల్ల వస్తుంది అన్న దానికి ప్రతీక గా తులశమ్మగారి ని పరిశీలిస్తే తెలిసింది. ఆవిడ గురించి ఆలోచిస్తూన్న కొద్దీ బ్రతకటానికి సరైన అర్థం తెలిసి వచ్చింది. బ్రతికినన్నాళ్ళు పరుల కోసం బ్రతకాలిగాని, నేను నాది అని బ్రతకటం వలన ఎప్పుడు ఒకరికి భారంగానే బ్రతకవలసి వస్తుంది. చావుఅన్నది ఎక్కడ ఉన్న వస్తుంది. నేను ఒక్కత్తి నా కోసమే నేను అనుకొంటూ వంద ఏళ్ళు బ్రతికేస్తే చాలా??? ఇలాంటి బ్రతుకు బ్రతికి ఏమి ప్రయోజనం?ఉన్న వూరిలో మంచిమనిషి అన్న భావము తీసుకు రాలేకపోయాను, కొడుకు ఇంట్లో కూడా ఇమడలేక నా వరకే నా జీవితం చూసుకొంటూ బ్రతకటం లో అర్థం లేదనిపిస్తోంది.
తెల్లవారగానే కొడుకు తో తనని ఊరిలో దింపేయమని అడుగుతాను. నా ప్రవర్తన మార్చుకొని శేష జీవితం అక్కడ చుట్టూ పక్కల వారితో అరమరికలు లేకుండా కలిసి మెలిసి బ్రతికి, నేను వెళ్ళిపోయాక కనీసం ఇరుగు పోరుగైనా తనని గుర్తుచేసుకునేలా బ్రతకాలీ.. అని అనుకున్నాక మనసు తేలిక పడి, మనసులోకలిగిన పరివర్తన మరల మారిపోకముందే, ఆచరించి చూపాలని ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ వెలుగు వైపుకి అడుగు వేసింది వర్ధనమ్మ….

2 thoughts on “పరివర్తన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *