March 30, 2023

మార్పు మొదలయ్యింది

రచన: MRVS మూర్తి

“సుజీ, నువ్వూ అబ్బాయి ఎలా వున్నారు ? నేను బాగానే ఉన్నాను. ”
భర్త గొంతు విని సుప్రజ తనువంతా పులకించి పోయింది. నోట మాట రావడంలేదు. పదిహేను రోజులు అయ్యింది ఆయన నుండి ఫోన్ వచ్చి.
భార్య మాట్లాడక పోవడంతో అతను మల్లీ పిలిచాడు ‘సుజీ.. సుజీ ‘ అని. “ఆ వింటున్నానండి “ అంది ఆనందంగా. “మేము బాగానే ఉన్నాము. ఆదిత్య ఇంటర్ పరీక్షలకు చదువుతున్నాడు. ఇప్పుడు అంతా ఆన్లైన్ క్లాసులేగా. మీ ఆరోగ్యం ఎలావుంది. బాగా చలి కదా“
“మా ఉద్యోగం అంటే అన్నీ భరించాలిగా “ నవ్వుతూ అన్నాడు అజయ్ కుమార్. కాసేపు ఊరి విశేషాలు అడిగి ఫోన్ పెట్టేసాడు అజయ్ కుమార్. సుప్రజ దీర్ఘంగా నిట్టూర్చింది. మల్లీ ఎన్నాళ్ళకో ఆ తీయని గొంతు వినేది.
అజయ్ కుమార్ మిలిటరీ లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నాడు. అందుకే సుప్రజ ఆవేదన. నెల రోజులు గిర్రున తిరిగాయి.
ఒక రోజు సాయంత్రం టి. వి. లో న్యూస్ చూస్తూ ఖిన్నురాలై పోయింది.
“కాశ్మీర్లో ఒక ఇంటిలో దాగి ఉన్న నలుగురు తీవ్రవాదులను భారత సైన్యం హతమార్చిందని. అయితే ఈ పోరాటంలో మన వీరులు ఇద్దరు రాజీవ్, అజయ్ కుమార్ అమరులయ్యారని. ”
టి. వి. కేసి చూస్తూ కన్నీరు కారుస్తూ విలపించ సాగింది సుప్రజ. పక్క గదిలోనే ఉన్న ఆదిత్య కంగారుగా హాలులోకి వచ్చాడు. టి. వి. లోంచి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ తనూ చూసాడు. గుండెల్లోంచి ఒక్కసారి బాధ తన్నుకొచ్చింది. “నాన్న ఇంక మనకు లేరా అమ్మా “ అంటూ తల్లిని పట్టుకుని శోకించ సాగాడు.
అరగంట గడిచేసరికి గ్రామంలో అందరికీ విషయం తెలిసిపోయింది. ఒక్కొక్కరే వచ్చి సుప్రజని ఓదార్చి వెళ్ళారు.
నాలుగు రోజులకి అజయ్ కుమార్ పార్ధివ దేహం వెంకటాపురం చేరింది. జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కూడా వచ్చారు. ప్రజలు నివాళులు అర్పించడానికి ఇంటిముందు వేసిన షామియానాలో ఉంచారు పార్ధివ దేహాన్ని. సుప్రజ వెంటనే లోపలకు వెళ్లి టేప్ రికార్డర్ పట్టుకు వచ్చి ఆన్ చేసింది. “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి “ అన్న గీతం వినగానే అందరూ గంభీరంగా మారిపోయారు. అజయ్ కి చాలా ఇష్టమైన గీతం అది అని చెప్పింది సుప్రజ.
తర్వాత ఒక గంట గడిచాకా అజయ్ కుమార్ కొడుకు ఆదిత్య తండ్రికి అంత్యక్రియలు చేసాడు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాకా ఇంటికి తిరిగి వచ్చారు అందరూ. చిన్న సంతాప సభ ఏర్పాటు చేసాడు సర్పంచ్.
జిల్లా మంత్రి కృష్ణ మూర్తికి చాలా ఆశ్చర్యంగా వుంది సుప్రజని చూస్తున్నంత సేపు. ఆమె కంటివెంట ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు భర్త పార్ధివ దేహాన్ని చూసి. ఇంకా ఆదిత్య కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు మంత్రి.
“ప్రతి మనిషికి పుట్టుక ఎంత సహజమో, మరణం కూడా అంతే సహజం. కానీ అజయ్ కుమార్ గారు దేశ విద్రోహులను మట్టుపెట్టి, దేశానికి మహోపకారం చేసారు. ఆ ప్రయత్నంలో వీర మరణం పొందారు. అటువంటి మహానుభావుణ్ణి కన్న ఈ గ్రామం ఎంతో ఉన్నతమైనది. అజయ్ కుమార్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయుంచుకుంది. ముఖ్య మంత్రి గారు వారి కుటుంబానికి చెందిన వ్యక్తికి గజెటెడ్ ఆఫీసర్ హోదా కల్గిన ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు. ఆదిత్య ఇంకా చదువుకుంటున్నాడు. కావున అజయ్ గారి శ్రీమతి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి గారి తరపున నేను మీకు సభా ముఖంగా తెలియజేస్తున్నాను. అజయ్ గారి కుటుంబానికి ఏ అవసరం వచ్చిన మేము ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను. ”
మంత్రి గారి మాటలకు సర్పంచ్, ఇతర గ్రామస్తులకు ఆనందం కలిగింది. దెబ్బతిన్న ఆ కుటుంబానికి ఒక అండ దొరికిందని.
సుప్రజ లేచి నిలబడి అందరికీ నమస్కరించింది.
“గౌరవనీయులైన మంత్రి గారికి నా నమస్కారాలు. మావారి అంత్యక్రియల్లో పాల్గొనడమే కాక మాకు అండగా ఉంటానని తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. నాకు వివాహమై ఈ ఊరు వచ్చినప్పటి నుండి నన్ను వారి కన్నబిడ్డలా ఆదరిస్తున్న ఈ వూరి ప్రజలకు శిరసు వంచి ప్రణామం చేస్తున్నాను.
నా పుట్టిల్లు మిలటరీ రామవరం. అక్కడ ప్రతి కుటుంబం నుండి ఒక మనిషి మిలటరీ లో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. అందుకే మా మావగారు నన్ను ఏరి కోరి, వారి ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవడం మాకు అలవాటు.
మంత్రి గారు నాకు పెద్ద హోదా కల్గిన ఉద్యోగం ఇస్తామని, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున చెప్పారు.
వారికి నా ధన్యవాదాలు. కానీ నేను ఆ ఉద్యోగం స్వీకరించలేనని వినయంగా తెలియజేసు కుంటున్నాను. ఎందుకంటే ఆ ఉద్యోగంలో నేను ఇమడలేను. అక్కడ తగినంత స్వేఛ్చ ఉండదు. మంత్రులు, శాసన సభ్యులు చెప్పినట్లే వినాలి. అది నాకు ఇష్టం లేదు. నేను ఇంగ్లీష్ భాషలో పి. జి. చేసాను. నర్స్ ట్రైనింగ్ కూడా పాస్ అయ్యాను. కావున మిలిటరీ లో నర్స్ గా చేరి దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నాను. మా అబ్బాయి ఇంటర్ పూర్తి కాగానే మా అన్నయ్య సుదీర్ కి అప్పచెప్పి నేను మిలిటరీ లో చేరి మా వారి ఆశయాలు నెరవేరుస్తాను.
కరోనా మనకి చాలా నేర్పింది. డబ్బు, హోదా ఏమీ అక్కరకు రావని చెప్పింది. ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. నా మనసులోని మాట చెప్పాలని అనుకుంటున్నాను. మన తెలుగింటి పేదరికంలో వ్యవసాయానికి ఎద్దులు లేకపోతే, కూతుళ్ళు ఇద్దరు కాడి భుజాల మీద మోస్తే, తల్లి నాగలి పట్టుకుని ఎర్రని ఎండలో భూమి దున్నింది. అయ్యో అన్నవారే లేరు. ఎక్కడో ముంబైలో ఉన్న ఒక మహానుభావుడు పేపర్లో చూసి, హృదయం ద్రవించి ఇరవయ్ నాలుగు గంటలలో ఆ కుటుంబానికి ఒక కొత్త ట్రాక్టర్ కొని ఇచ్చాడు. మన భాష కాదు, మన రాష్ట్రం కాదు. కానీ మన ఆడపడచు కష్టం చూసి కరిగి పోయాడు. కొన్ని వేల మంది వలస కూలి వారిని, వారి స్వంత ఊళ్లకు సగౌరంగా పంపాడు. ఆయనకు అధికారం లేదు, అంగ బలం లేదు. కానీ సాటి మనుషుల్ని ఆదుకోవాలన్న పెద్ద మనసు ఉంది.
మనవూ మనుషులమే. కానీ ఆయన మనసున్న మనిషి, మానవత్వం మూర్తీభవించిన మనిషి. ఇటువంటి వారు కొద్ది మందే ఉన్నారు. వీరి సంఖ్య పెరిగితే సమాజం మరింతగా అభివృధ్హి చెందుతుంది. మంత్రి గారు నన్ను క్షమించాలి. నేను ఇలా మాట్లాడుతున్నందుకు. మన ఏం. ఎల్. ఏ. లు., ఏం. పి. లు., మంత్రులు దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయంటారు? ఐనా ఇంకా.. ఇంకా.. డబ్బు పోగేస్తూనే ఉంటున్నారు. కరుణ, దయ
దూరం చేసుకుని కాగితాలు చూసుకుని మురిసిపోతున్నారు. ఇది పొరపాటు సర్. మారాలి. అందరం మారాలి. ఒకరికి ఒకరం, అన్నట్టు బతకాలి గానీ, నేనొక్కడినే బాగుందాలనుకోవడం మంచిది కాదు సర్.
ఏ ప్రభుత్వం వచ్చిన ఇంటికో ఉద్యోగం అని చేపుతుందే గానీ ఇంటికో మనిషి దేశం కోసం పనిచేయాలని ఎందుకు చెప్పదు సర్?
అందుకే మనం మారాలి సర్. మన ఆలోచనా విధానం కూడా మారాలి. పెద్దలు మీరు నన్ను మన్నించాలి. నేను మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ధనవంతులకి వ్యతిరేకం కాదు. నేను దేసభక్తుల కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నా మాటలు ఇలానే ఉంటాయి. నేనే కాదు, నా కొడుకు కూడా మిలిటరీ లోనే చేరతాడు భవిష్యత్తులో. మీ అందరికీ నమస్కారం.”
సుప్రజ మాట్లాడడం ముగించేసరికి ఆమె కళ్ళు చెమర్చాయి. చీర చెంగుతో కళ్ళు వత్హుకుంది. ఆ దృశ్యం చూసిన వారి హృదయాలు బరువెక్కాయి. మంత్రి గారు, పోలీసులు మౌనంగా ఆమెకి నమస్కరించి వెనుదిరిగారు.
మంత్రి కృష్ణమూర్తి ఇంటికి వచ్చినా సుప్రజ మాటలు ఆయన చెవుల్లో మారు మోగుతున్నాయి. ఎంత ధైర్యంగా మాట్లాడింది. ఎంత నిబ్బరంగా చెప్పింది. ఎంత దేశభక్తితో మాట్లాడింది. వింటుంటే వళ్ళు గగుర్పొడుస్తోంది.
తన పరిస్తితి ఏంటి? తన తండ్రి ఎం.ఎల్.ఏ. చేసాడని తనూ ఎం.ఎల్.ఏ. గా పోటీ చేసి గెలిచాడు. అదీ పాతిక కోట్లు ఖర్చు చేసి. తాతల నాటి ఆరువందల ఎకరాలు ప్రస్తుతం వంద ఎకరాలకు వచ్చాయి. కేవలం కీర్తి కోసం. కానీ మనస్ఫూర్తిగా పనిచేయలేక పోతున్నాడు. నెరవేరని హమీలు ఇస్తున్నాడు. పైవారి ఆదేశాలు. తప్పడం లేదు. అధికారం లేకుండా ప్రజాసేవ చేయలేడా ? నిజమే ఆ దిశగా ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది.
వెంటనే హైదరాబాదు లో ఉన్న కొడుకుకి ఫోన్ చేసాడు ‘ఇంటికి ఒకసారి రమ్మనమని ‘
తెల్లవారేసరికి ధీరజ్ ఇంటికి వచ్చాడు. అతను బి. టెక్. పాస్ అయ్యాడు. ప్రస్తుతం సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. కొడుకుని తన గదిలోనికి పిలిచి తన మనసులోని మాట చెప్పాడు. ధీరజ్ ఒక్కసారి ఆశ్చర్య పోయాడు తండ్రి మాటలకు. తనకు కొంచం సమయం ఇమ్మని అడిగాడు ధీరజ్.
కృష్ణమూర్తి భార్యతో కూడా మాట్లాడాడు. ‘మీ ఇష్టం ‘అంది ఆవిడ.
ధీరజ్ చాలా సేపు ఆలోచించాడు. తండ్రి కోరికలో ఒక ఉదాత్తమైన ఆశయం కనిపించింది. ఈ పరుగు పందెం కన్నా తండ్రి చెప్పినదే మేలనిపించింది. సాయంత్రం తండ్రికి తన అంగీకారం తెలియజేసాడు. కృష్ణమూర్తి సంతోషంగా లేచి కొడుకుని కౌగలించుకున్నాడు.
మర్నాడే పెద్ద బ్రేకింగ్ న్యూస్. కృష్ణమూర్తి తన మంత్రి పదవికి, ఎం. ఎల్. ఏ. పదవికి రాజీనామా చేసాడు. తనూ, తన కుటుంబం జీవించడానికి తగిన ఆస్థి ఉంచుకుని, మిగతాది అమ్మేసి దేశ రక్షణ నిధికి ఇవ్వదలచుకున్నానని.
ఆ రోజే ధీరజ్ మిలటరీలో చేరడానికి దరఖాస్తు పంపించాడు.
దేశ భక్తుల జాబితాలో మరో రెండు పేర్లు చేరాయి.

*******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2021
M T W T F S S
« Jul   Sep »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031