April 19, 2024

శ్రీదేవీభాగవత మహత్మ్యము . 2

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మి

మొదటి స్కందము మూడవ కథ

రైవతుడను మనువు వృత్తాంతము

ఈ కథను మిత్రావరుణుని నుండి ప్రకటితుడైన అగస్త్యమునికి శివకుమారుడైన స్కంధుడు వివరించినది.
దేవీ భాగవత మహాత్మ్యము ఇందు చెప్పబడినది.
ఋతువాకుడను ముని గలడు. అతడికి ఒక పుత్రుడుదయించెను. పుత్రోత్సాహము జరుపబడెను. అతడు రేవతీ నక్షత్రమందు నాల్గవ పాదమున జన్మించెను. అది గండాంతము అని చెప్పుదురు.
చేయవలసిన సంస్కారాదులన్నీ ముని అతనికి జరిపించెను. జాతకర్మాదులు, ఉపనయన సంస్కారము చేసెను. అ పిల్లవాడు పుట్టినప్పటినుంచి తల్లిదండ్రులు రోగములచే పీడుతులైరి. క్రోథలోభములు వారిని చుట్టుముట్టెను. వారు మిగుల చింతించుచుండిరి.
ఆ బాలుడు ఎన్నో దుష్టములగు కర్మములు చేయుచుండెను. పరమ మూర్ఖముగా ప్రవర్తించుచుండెను.
సంతానము లేకుండిన ఫరవాలేదు గాని, దుష్ట ప్రవృత్తి గల కుమారుడుండుట తల్లిదండ్రులకు శాపమే. కుపుత్రునితో వారికి ఎప్పుడూ దుఃఖమే. వాడివలన ఎవరికీ ఉపయోగము లేదని చింతించి అతడు కులమునకే చేటు అని వారు తలచిరి.
సుపుత్రుని వలన సమాజమునకు మేలుకల్గును. వాని తండ్రి భాగ్యవంతుడగును. స్త్రీలు దుష్టులైనచో జన్మసాఫల్యము ఉండదు ` అని ఆ ముని మనసున తలచి గర్గ మహాముని దగ్గరకు వెళ్ళి తన గోడు విన్నవించుకొనెను.
‘‘గురుసేవా తత్పరుడనై వేదాధ్యయనము చేసి బ్రహ్మచర్య వ్రతము బూని పిమ్మట గృహస్థుడనై నా భార్యతో గార్హస్త్య ధర్మమును నిర్వహించితిని. పంచయజ్ఞకార్యములు ఒనరించితి. సత్పుత్రుని కొరకు నిష్ఠగా శాస్త్రోక్తముగా గర్భాదాన మొనరించితిని. మాలో ఎవరి దోషము వలన ఈ కుపుత్రుడు జన్మించెను. మాకు అశాంతి గల్గుచున్నది’’ అని ఆ ముని గర్గుని ప్రార్ధించెను.
జ్యోతిష శాస్త్ర పండితుడైన గర్గముని ధ్యానమగ్నుడై కారణము తెలిసికొని యిట్లు చెప్పెను.
‘‘నాయనా! నీ కుమారుడు దుష్టుడగుటకు కారణము మీరు గాని, మీ కులము గాని కారు. రేవతీ నక్షత్రము అంతిమపాదమందు అతడు జన్మించుటే కారణము. నీవు దీనినుండి నివృత్తి కొరకు అంబిక దుర్గాదేవిని ఆరాధింపుము. ఆమె సకల విఘ్నములు దూరము చేసి నిన్ను కాపాడును,’’ అని తరుణోపాయము చెప్పెను.
విషయము తెలిసిన ఋతువాకుడు కుపితుడై రేవతీ నక్షథ్రమును నేలకు రాలిపొమ్మని శపించెను. అందరూ చూచుచుండగా రేవతీ నక్షత్రము ఆకాశమునుండి జారి ‘కుముదాద్రి’పై పడెను. అందుచే ఆ గిరికి రైవతమని నామము గల్గెను.
అప్పటినుండి ఆ పర్వతము మిక్కిలి వృద్ధిపొందెను. ఋతువాకుడు భగవతి జగదంబికను ఆరాధించి సుఖముగా నుండెను.
రేవతీ నక్షత్రము పర్వతముపై పడుటచే ఒక కన్య జన్మించెను. ఆమె మహాలక్ష్మివలె శోభిల్లుచుండెను.
ప్రమదుడు అను ఒక ఋషి ఆ పిల్లను చూచి ప్రసన్నుడై తన ఆశ్రమమున పెంచసాగెను. ఆమెకు రేవతి అను పేరిడెను.
యుక్తవయస్కురాలైన పిమ్మట తగిన వరునికొఱకై వెదుకసాగెను. అగ్నిదేవుని ప్రార్ధించగా, ధర్మతత్పరుడు, సుభాషితుడు, శూరుడు, వీరుడైన భర్త ఈమెకు లభించును. అతడే రాజయిన దుర్దముడని తెలిపెను. దుర్దమ మహారాజు తండ్రి ప్రియవ్రతుడు, తల్లి కాళింది.
కొన్ని రోజుల అనంతరము దుర్దమ మహారాజు ప్రమదుని ఆశ్రమమునకు వచ్చెను. ఆశ్రమం లోనికి వచ్చిన రాజు కన్య రేవతిని ప్రియురాలా అని సంబోధించి ఆమె తండ్రిని గూర్చి అడిగెను.
ముని అగ్నిశాలలో వుండి దుర్దముని చూచినవాడై ఆతనికి అర్ఘ్యమిచ్చెను.
అతడు తన కుమార్తె రేవతి గూర్చి వివరించి ఆమెను వివాహము చేసికొమ్మని యిది అగ్నిదేవుడు స్వయముగా నిర్ణయించినదని చెప్పగా దుర్దముడట్లే చేసెను.
కలుషిత భావమేమీ లేక తాను ఆ కన్యను ప్రియశబ్దముతో పిలిచినందుచే, అగ్నిదేవుని ప్రేరణవలన అది అట్లు జరిగినది. అందుచే ఈ కన్యను స్వీకరించుమని చెప్పగా దుర్దముడు అంగీకరించెను.
కాని తాను రేవతీ నక్షత్రములోనే వివాహము చేసికొందునని కన్య చెప్పగా అప్పుడు రేవతీ నక్షత్రము నక్షత్రమండలమున లేదని సంశయపడగా ఋతువాకునికన్న మీరు జగత్తును సృష్టి చేయుటలో సమర్ధులు, యోగులు. మీ తపోబలముచే మరల రేవతీ నక్షత్రమును మరల స్థాపించి నా వివాహమును జరిపించవలసినదిగా కోరెను.
అప్పుడు ఆమె కొరకు ఆ ముని సోమ మార్గమున తన తపశ్శక్తిచేత రేవతీ నక్షత్రమును పునఃస్థాపించి వివాహమొనరించెను.
దుర్దముని మంచి వరమడుగమని ముని అర్ధించగా ఆ రాజు మన్వంతమున మీ దయచేత నాకు ఈ వంశమును అధిష్టించు కుమారుడు గావలెనని తన కోరికను వెల్లడిరచెను.
భగవతి జగదంబికను ఆరాధింపుము తప్పక నీ కోరిక లభించగలదు. శ్రీమద్దేవీ భాగవతమను అయిదవ పురాణము అయిదుసార్లు శ్రవణము చేసిన నీ కోరిక తీరును. ఈ రేవతీ గర్భమందు రైవతుడను అయిదవవాడు మనువగును. సకల విద్యాపారంగతుడగును. అపరాజితుడై యశము గాంచునని ముని దీవించెను.
కొంతకాలము సుఖముగా రాజ్యపాలన మొనరించిన పిదప లోమశుడు అను మహాత్ముడు అతని వద్దకు వచ్చెను.
అతడిని శ్రీమద్దేవీ భాగవతమును తనకు వినిపించమని రాజు కోరెను.
ఆ జగదంబికపై నీకు భక్తి మెండు. నీ కార్యమ తప్పక సిద్ధించునని రాజుని దీవించి దేవీ భాగవత పురాణమును శ్రవణము జేసిన ఈ లోకమునందు లభించని ఏ వస్తువు లేదని మహర్షి వివరించి దేవీ భాగవతమును ప్రారంభించెను.
రాజు తన ధర్మపత్ని రేవతితో కూడి అయిదు అవుతులు (అధ్యాయములు) వినుచుండెను.
కధ సమాప్తమయ్యాక మునిని పురాణమును పూజించెను. భూరి దానములిచ్చెను. సంతర్పణలు చేసెను. భాగవతి కృపతో కొంతకాలమునకు రేవతి కడుపు పండెను. శుభ గ్రహ కలయికయందు ఒక కుమారుడు జన్మించెను. అంతులేని ఆనందముతో రాజు సువర్ణకలశమున జలముతో జాతకర్మాదులను నిర్వర్తించెను.
తరువాత ఉపనయనము గూడా పూర్తిచేసెను. సకల విద్యలను నేర్పించెను. రైవతుడని పేరుతో అతడు ధర్మాత్ముడై పరాక్రమవంతుడై ధర్మప్రచారకుడై శోభిల్లెను.
బ్రహ్మ రైవతుని మనుపదమునందు ప్రతిష్ఠించెను. మన్వంతరస్వామిjైు అతడు పృధివిని పాలించెను.
అగస్త్యుడు దేవీభాగవతపురాణమును కార్తికేయుని ద్వారా విని పిమ్మట అతనిని పూజించెను.
భక్తిపూర్వకముగా ఈ దేవీ పురాణమును విన్నను, చదివినను పురుషుడు మిక్కిలి భోగములనుభవించి, చివరకు జన్మరాహిత్యమును పొందునని సూతుడు పలికెను.

మొదటి స్కంధము నాలుగవ కథ
హయగ్రీవుడు
సమస్తమునకు కర్త, భర్త అయిన విష్ణుభగవానుని మస్తకము తెగి మొండెము వేరుగా అగుట, గుఱ్ఱపుతల అమర్చుట వలన ఆ స్వామి ‘హయగ్రీవు’ డని పిలువబడుటకు కారణమేమని ఋషిగణములు సూతమహర్షినడుగగా సూతుడిట్లు చెప్పదొడంగెను.
ఒకసారి శ్రీహరి భయంకరమైన యుద్ధము అసురులతో చేయవలసి వచ్చినది. ఆ స్వామి పదివేల సంవత్సరముల వరకు యుద్ధభూమియందే నిలచి అలసిపోయెను.
అప్పుడతడు తన వైకుంఠమునకు వెళ్ళి అలసట తీర్చుకొనుటకై పద్మాసనమున కూర్చుండి ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సుయొక్క త్రాడు సహాయముతో కొంచెము ముందుకు వంగెను. దానిమీదే భారమువేసి తన అలసటను తీర్చుకొనసాగెను. శ్రమవలననో లేక మాయవలననో లీలా సంయోగము వల్లనో నిద్ర అధికముగా వచ్చెను. ఇది ఇలా ఉండగా ఆ సమయములో దేవతలు పెద్ద యజ్ఞమును చేయుటకై విష్ణువును ఆహ్వానించుటకు వైకుంఠము చేరిరి. దేవ కార్యము నిర్వఘ్నముగా సాగవలెనని వారి కోరిక.
యజ్ఞేశ్వరుడైన విష్ణువు దర్శనము వారికి కాలేదు. ధ్యానముతో అతడెక్కడున్నది తెలుసుకొన్న ఇంద్రాది దేవతలు అచటకు వెళ్ళి నిద్రావస్థలోనున్న విష్ణువును కనుగొనిరి.
విష్ణుభగవానుని మేల్కొలిపితే ఏమి అగునో అని చింతించసాగిరి. యజ్ఞకార్యము తప్పక నెరవేర్చవలసి యుండుటచే విష్ణువును మేల్కొలుపుట అత్యంత ఆవశ్యకమని శంకరుడు తెలిపెను.
అప్పుడు బ్రహ్మ ‘వమ్రి’ అను ఒక కీటకమును సృజించెను. భూమిమీద ఉన్న ధనుస్సు యొక్క త్రాడును ఆ కీటకము కొరికి వేయును. త్రాడు తెగగానే ధనుస్సు పైకి లేచును. అపుడు శ్రీహరికి నిద్రాభంగమగును. దేవతల కార్యము కొనసాగగలదని దేవతలు తలిచిరి.
అదే విషయమును బ్రహ్మ ‘వమ్రి’ అను కీటకముతో అనగా ఆ కీటకము అందువలన తనకేమి లాభము. అతడు అందరికి ఆరాధ్యదైవము, అతడికి నిద్రాభంగము కల్గించుట అసహ్యకర, అభ్యంతరకరమని అది అనెను.
నా కార్యమేదైన ఫలవంతమయినచో నేనీ కార్యము తప్పక చేయుదునని అది ఆసక్తిని కనబరిచెను.
‘‘నీకు యజ్ఞభాగము నొసగెదము. యజ్ఞమునందు హవనము చేయునపుడు చుట్టుప్రక్కల హవిష్యము పడును. అది నీ భాగము. కావున శీఘ్రమే మేము చెప్పిన పనిని చేయు’’ మని బ్రహ్మ సెలవిచ్చెను.
ఆ కీటకము వెంటనే అల్లె త్రాడును కొరికెను. ధనుస్సు బంధమునుండి విడిపోయెను. రెండవవైపున్ను దారము కూడా సడలిపోయెను. అప్పుడు భయంకరమైన పెద్ద శబ్దం వచ్చెను. అంధకారమంతా అలముకొనెను. సురులు భయకంపితులైరి. సూర్యకాంతి క్షీణించెను. కొంతసేపటికి చీకట్లు తొలగి ప్రకాశము కల్గెను. కానీ విష్ణువు మస్తకం, కుండలములు మకుటంతో సహా ఎచ్చటికి ఎగిరిపోయెనో వారికి కనబడలేదు. వారంతా ఆశ్చర్యపడిరి. చింతా శోక సముద్రమున వారంతా మునిగిరి. విచిత్రమైన ఈ దైవ ఘటనకు వారు అచ్చెరువందిరి. విలపించుచుండిరి.
కాలప్రభావమున అట్లయ్యెనని, అంతకు ముందు తన తలను కూడా శంకరుడు ఖండిరచెనని బ్రహ్మ పలికెను. విష్ణువు తల కూడా సముద్రమున పడిపోయెను.
ఇంద్రునికి కూడా యిటబువంటి ఘటన ఎదుర్కొని కమలములో వెళ్ళి దాక్కొనవలసి వచ్చెను కదా అని చెప్పగా మరియు మనమందరము ఆ ప్రకృతిమయి, భగవత్స్వరూపిణి, మహా మాయి అయిన భగవతి పరమేశ్వరిని ధ్యానించిన మన కార్యము సిద్ధింపగలదని పలికెను. ఆమె బ్రహ్మవిద్య అనెను.
పిమ్మట బ్రహ్మ వేదములతో ఆ జగదంబికను మిక్కిలి భక్తితో స్తుతించమని ఆదేశించెను.
జననీ, దేవీ మీకు నమస్కారములు. గుణాతీతవు, జగత్‌ సృష్టికర్తవు, పృధివీ స్వరూపివి. బుద్ధి, సంపద, కాంతి, క్షమ, శ్రద్ధ, మేధస్సు, ధృతి, స్మృతి నామములు నీవె. ఓంకార స్వరూపిణి, త్రిలోకపావని, విద్యా స్వరూపిణి, కర్మమయి, వాగ్బీజరూపిణి, ఈ జగత్తు మిధ్య, మీ లీలా వైభవము నెవ్వరికి గ్రహించుట అసాధ్యము. శ్రీ విష్ణుభగవానుడు మస్తక హీనుడగుట చింతనీయము. శ్రీహరికి మస్తకము నిచ్చి మహలక్ష్మిని కాపాడుము తల్లీ.
ఇట్లు అంగ ఉపాంగములతో వేదములు దేవిని స్తుతించెను.
జగదంబిక మిక్కిలి ప్రసన్నురాలై, దేవతలారా చింతించవలదు. మీరు నన్ను చక్కగా స్తుతించిరి. యిది విన్నను, చదవినను కోరినది లభించగలదు. సుఖశాంతిని బడయగలరు. ఏదీ అకారణముగా ఈ లోకంలో జరుగదు.
ఒకనాడు శ్రీమహాలక్ష్మి విష్ణువుతో కూడియున్న సమయాన లక్ష్మియొక్క సుందర వదనారవిందమును చూచి, విష్ణువు నవ్వెను. నా ముఖము వికృతముగా నున్నట్లు స్వామి నన్ను చూసి నవ్వెను. కారణము లేకుండా ఉండదని తలపోసి, లక్ష్మిదేవి కుపితురాలయ్యెను. తమోగుణముచే ప్రభావితురాలై అత్యంత బాధతో ఆమె భర్తను, ‘మీ తల నేలమీదపడుగాక’ యని శపించెను. ఆ పరిణామము కూడా దేవకార్యం సిద్ధించుటకొరకే. ఇప్పుడా శిరస్సు లవణ సాగరమునందు గలదు.
హయగ్రీవుడను రక్కసుడు సరస్వతీ నదీ తీరమున నిరాహారుడై గొప్ప తపమొనరించి 1000 సంవత్సరములు ఉండగా నేను అతని తామస శక్తిని అలంకరించుకొని దర్శనమిచ్చితిని.
అతడు నన్ను స్తుతించి ప్రసన్నురాలిని చేసుకుని మరణము లేకుండునట్లు వరమడిగెను. జన్మించిన వారికి మృత్యువు తప్పదు కాన మరో వరము కోరుకొమ్మనిన ‘హయగ్రీవ’ రూపము గల వానితోనే తన మృత్యువు కలుగునట్లుగా అతడు వరమడిగెను. ఇతరులెవ్వరూ అతనిని వధించలేరు. అందుచే ఆ దైత్యుని చంపవలసిన ఆవశ్యకత యిప్పుడు ఆసన్నమైనది. అందుచేత విష్ణువుకు అశ్వము యొక్క తలను దెచ్చి అమర్చిన ఆ స్వామి హయగ్రీవుని అదే రూపములో వధించగలడని, మీకు విజయము గల్గునని, దేవి నుడివి అంతర్థానమయ్యెను.
దేవతలు ప్రార్ధించగా, బ్రహ్మ ఎదుటనున్న గుఱ్ఱపు తల ఖండిరచి విష్ణువు మొండెమునకు అమర్చెను. భగవతి దయవలన వెంటనే విష్ణుభగవానుడు హయగ్రీవుడిగా రూపొందెను. పిదప, ‘హయగ్రీవు’ డను దైత్యునితో ఎంతో కాలము పోరుసలిపి అతనిని వధించెను. మర్త్య, దేవలోకమున అందరూ ఈ కథను విని, సకల దుఃఖములనుండి విముక్తులైరి.
భగవతి, పరమేశ్వరి, మహామాయ, జగదంబిక చరిత్ర పవిత్రమైనది. యిది సత్యం. పాపముల హరించునది.
యిది విన్నవారికి, చదివిన వారికిసర్వసంపదలు లభ్యము కాగలవు.

మొదటి స్కంధము ఐదవ కథ
మధుకైటభుల వృత్తాంతము
భూమికి ‘మేధిని’ అనే నామము కల్గుటకు కారణము గూర్చి తెలుపు కథ.
హయగ్రీవుని వృత్తాంతము విన్న ఋషిగణములు యింకా ఉత్సాహముతో మహర్షి సూతుని మరొక ప్రశ్న వేసిరి.
హే మహర్షీ! అంతటా జలముగల కాలమునందు విష్ణువు ఐదు సంవత్సరములు మధుకైటభులను దైత్యులతో పోరెందుకు సలిపెను. మహా పరాక్రమవంతులైన మధుకైటభుల జన్మ ఎట్లు ఉత్పన్నమయ్యెను. సాహిత్య విషయమున పురాణ శ్రవణము అన్నిటికంటె ఉత్తమమైనది అని చెప్పబడెను కదా. సాత్త్విక, రజో, తమో గుణములను కనబరిచే ఇతిహాసములలో మిక్కిలి సాత్త్విక విషయములను తెలియజేసే ఉత్తమకథలను వినుట (శ్రవణముచేయుట) ఉత్తమోత్తమమని పెద్దలు నుడివెదరు కదా. బుద్ధి వృద్ధి చెందును. పాపములు తాపములు శాశ్వతముగా నశించే అట్టి కథాశ్రవణము మాకు వినిపించమని వారు కోరిరి.
సూతుడు వారి ఉత్సాహవంతమైనమాటలకు ప్రసన్నుడై వారికి మధు కైటభుల వృత్తాంతము వివరించెను.
ప్రాచీన కాలమందు ప్రపంచమంతా ప్రళయము సంభవించగా లోకాలన్నీ జలమున మునిగిపోయి, కేవలం శ్రీ మహావిష్ణువు మాత్రమే శేషశయ్యపై నిదురించి ఉండగా ఆ స్వామి చెవి యందలి మైల (గులిమి) చేత ఈ మధుకైటభులు జనించిరి. వారు ఆ జలమునందే పెరిగి యువకులైరి. ఒకనాడు వారికి లోకమంతటా కేవలం జలమే కలదు కదా తామెట్లు జన్మించిరి? తమ తండ్రి ఎవరు అని సందేహము కలిగినది.
మధుకైటభులు ఒక నిశ్చయమునకు రాలేక తమ జన్మకు ఆ పరాశక్తియే కారణమగునని, ఆమెయే పరమ ఆరాధ్యురాలని శక్తి స్వరూపిణి యని తలచిరి? యింతలో ఆకాశవాణి నుండి ఒక ప్రతిధ్వని సుందరమైన ‘వాక్తేజము’ వినిపించెను. ఒక మెరుపు కాంతిలో ఆ ‘వాక్తేజము’ ఒక మంత్రరూపమున నింగిని చూచిరి. ధ్యానముచే వారికి సగుణ మంత్ర అభ్యాసము లభించెను.
అప్పటినుండి వారా మంత్రమునే మరల మరల జపించుచూ అన్న పానీయములను విడిచి ఇంద్రియములు జయించి ఘోరతపము ఒక సహస్ర (వేయి) వత్సరములు చేసిరి.
పరాశక్తి వారి తపమునకు మెచ్చి ప్రసన్నురాలై వరము కోరుకొమ్మన్నది. తమకు స్వేచ్చామరణము అనగా తాము కోరితేనే వారికి మరణము కలుగునట్లుగా వరమడిగిరి.
దేవ దానవులచే వారికి మరణము లేకుండునట్లు ఆమె వరమొసగినది.
దానితో వారు మిక్కిలి అభిమానముతో విర్రవీగసాగిరి. వారి దృష్టి బ్రహ్మదేవుని పై పడి వారతనిని యుద్ధమునకు ఆహ్వానించిరి. పోరు సలుపుటకు నీవశక్తుడవేని ఈ ప్రదేశము విడిచి పొమ్ము లేదా మా చేతులలో హతుడవు కమ్మని వెంబడిరచిరి.
బ్రహ్మదేవుడు అన్ని సామ దాన భేద దండాది విషయములనెరిగినను ఈ దానవుల బలమెంతటిదో ఊహించలేక తక్షణమే విష్ణువు నొద్దకు ఆ కమల నాళము ద్వారానే ప్రయాణించి చేరుకొనెను. విష్ణుమూర్తి ఆ సమయమున యోగమాయ ప్రభావముచే నిద్రలో మునిగియుండెను. అమ్మ మహాలక్ష్మి కూడా పతివలెనే నిద్రించుచుండెను.
విష్ణువును మెలకువ పరచుట ఎట్లో తెలియక బ్రహ్మ యోగమాయనే స్తుతించుచు పరాశక్తిని ప్రార్థించెను.
అహంకారముతో మధుకైటభులు తనను వెంటాడుతున్నారని వారినుండి తనను రక్షించువారు విష్ణువేనని కాని ఆ సమయమున స్వామి యోగమాయా ప్రభావమున నిద్రించుచున్నాడని పలికి తనను రక్షించమని ఆ జగదంబికను ప్రార్థించెను.
త్రిసంధ్యలలో సంధ్యానామము తోడను, యజ్ఞ హవనములందు స్వాహా పేరుతోనూ అందరినీ కాపాడుచున్న ఓ జగజ్జననీ, నన్ను కాపాడుమని వేడుకొనగా తామసి యగు నిద్రాదేవి విష్ణు అంగములనుండి బయటకు వచ్చి నిలుచుండెను. మధుకైటభుల సంహారము కొరకే ఆ యోగనిద్రట్లావహించెను.
శ్రీహరికి ప్రదక్షిణ చేసి బ్రహ్మ ఎదుట నిలువగా ప్రభువు బ్రహ్మ చింతనకు కారణమడిగెను.
మధుకైటభుల వలన లోకానికి కలిగిన విపత్తు గూర్చి బ్రహ్మ తెలిపెను.
మీరు భయపడవలదు వారిప్పుడే నా చేత వధింపబడెదరని అభయమిచ్చెను.
మధుకైటభులు విష్ణువు కడకు చేరి యుద్ధమునకు రమ్మని పిలిచిరి.
విష్ణువు, మధువుతో మల్ల యుద్ధము చేసెను. వాడు అలసిపోగానే కైటభుడు తలపడెను. బాహుయుద్ధము జరిగెను. బ్రహ్మాదులా పోరును భగవతి సహితముగా తిలకించుచుండిరి. మధు కైటభులు అలసిపోలేదు కాని విష్ణువు అలసెను. స్వామికి మిక్కిలి ఆశ్చర్యము కలిగెను. స్వామి ఆలోచించుచుండగా మధుకైటభులకు ఆనందము కలిగెను. వారు విష్ణువును లొంగిపొమ్మని పరిహాసము చేసిరి.
మీరిరువురు గొప్ప శూరులని నేను అంగీకరించితిని. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మరల పోరు చేసెదను. మీరిరువురు, నేను ఒక్కడను అనగానే వారు కాస్త ఆగిరి.
విష్ణువు భగవతి వరము యిచ్చుట వలననే వారు మరణించలేదన్న నిజమును గ్రహించెను. వీరి మరణ రహస్యము తెలియక యిన్ని వేల సంవత్సరములు వ్యర్ధము గావించితిని. కావున నేనిప్పుడు ఆ శక్తినే శరణు వేడెదనని తలపోసి ఆమెను తలచుకోగా పరమేశ్వరి యోగమాయ విష్ణువుకు దర్శనమిచ్చి, వీరు మోసము చేతనే వధింపబడెదరు. మరల నీవు యుద్ధము చేయుమనెనను. నేను వీరిని నా మాయామోహితులను చేసెదనని పలికెను.
విష్ణువు మరల వారితో పోరుసలుపుటకు రాగా ముష్ఠిఘాతములతో తలపడిరి. భయంకర యుద్ధము జరిగెను.
యింతలో భగవతి విరగబడి నవ్వెను. తన మోహితరూపముతో ఆ దానవులను విచలితులను చేసెను. ఆమె వక్ర చూపులకు వారు మోహితులైరి. మన్మధ బాణములవంటి ఆమె క్రీగంటి చూపులతో వారు వివశులైరి. వీరులారా మీరు మహా పరాక్రమవంతులు. మీయుద్ధ కుశలత నాకు ప్రీతికలిగెను. ఏదైనా వరము కోరుకొమ్మనెను. కామాతురులైన దానవులు దేవినుండి చూపులు మరల్చక విష్ణువుని ఏదైనా వరము కోరమని అహంకారముతో పలికిరి. ఇదే సమయమని విష్ణువు ‘‘మీ యిరువురూ నాచేతులలో మీ మరణమును స్వీకరించుమని’’ కోరగా వారు తెలివిలోనికి వచ్చి మోసమును గ్రహించిరి.
వారు విష్ణువును జలశూన్య విశాల ప్రదేశమునందు తమ్ము వధింపమని కోరిరి. అంతటా జలమే ఉన్నది. మా మరణమెట్లు సంభవించును అని వారు ప్రశ్నించగా విష్ణువు తన తొడల భాగమును మిక్కిలి విశాల పరచి వారిని తన తొడలపై మస్తకములు పెట్టమని అడిగెను.
ఆ పైన తన తొడలపైకి వారి విశాల శరీరముల నాహ్వానించెను. వెంటనే తన తొడలను ముడిచి, వారి మస్తకములను తన సుదర్శన చక్రముతో ఖండిరచెను. వారి రక్త మాంసములతో జలములు నిండెను. అప్పటి నుండి పృధివికి ‘‘మేదిని’’ అని పేరు వచ్చెను. అందువలన మన్ను తినుట నిషేధింపబడినది.
మహామాయా స్వరూపిణి యగు ఆ పరాశక్తిని సకల దేవతలు ఆరాధించిరి.

సశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *