April 19, 2024

ధృతి – 3

రచన:మణి గోవిందరాజుల…

“హే! ధృతీ కంగ్రాట్స్… శేఖరం గారినే మెప్పించావు హార్టీ కంగ్రాట్స్” అభినందనలు వెల్లువలా కురిశాయి.
“ధృతీ, ఇక వెళ్దామా? బాగా అలసి పోయావు!” దినేష్ వచ్చి అడిగాడు.
“అదేమీ కుదరదు.అంకుల్… ఇంత పెద్ద సక్సెస్ మేము ఎంజాయ్ చేయాల్సిందే. మేమొచ్చి దింపుతాము. ప్లీజ్! అంకుల్, మీరెళ్ళండి. మేము క్యాంటీనుకెళ్ళి ఏమన్నా తిని, తాగాక బయలుదేరుతాము” అప్పుడే వెళ్ళడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చేసేది లేక భార్యను, పిల్లల్ని తీసుకుని దినేష్ వెళ్ళిపోయాడు.
అందరూ కలిసి పొలో మంటూ క్యాంటీన్ కి వెళ్ళిపోయారు. అందరూ కూడా అలసి పోయినా ఎవ్వరికీ కూడా ఆ అలసట తెలియటం లేదు. క్యాంటీన్ ఓనర్ కూడా ప్రత్యేకంగా వచ్చి, “ధృతమ్మా! మేము కూడా ఆడాము తెల్సా? చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాము!” సంతోషంగా చెప్పాడు.
అందరూ మాట్లాడుకుంటూ తిని బయలుదేరేసరికి రాత్రి అయింది. ధృతిని ఇంకా ఉన్న మిగిలిన ఆడపిల్లల్ని ఇళ్ల దగ్గర దింపి వెళ్ళిపోయారు మగపిల్లలు. ఇంటికి రాగానే దిష్టి తీసింది పూర్ణ. “అమ్మా! ఏంటమ్మా… ఈ చాదస్తం!” విసుక్కుంది ధృతి.
“వీప్పగులుతుంది… ఈ వారం రోజులూ నేనెలా చేస్తే అలా చేయించుకో. లేదా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో. ఊ… ఊ… ఊదు” మిరపకాయల చేతులు ముందుకు పెట్టింది.
“ఓకే! మా… నాకు బాగా నిద్రొస్తున్నది. గుడ్ నైట్” లోపలికి వెళ్ళి స్నానం చేసొచ్చి నైటీ వేసుకుని పడుకోవడమే, గాఢ నిద్రలోకి వెళ్ళింది.
ఆ తర్వాత స్పోర్ట్స్ డేస్ కూడా బాగా జరిగాయి.
“కబడి… కబడి” అని కూత పెడుతూ ఎవరికీ చిక్కకుండా పరిగెత్తుతున్న ధృతి, విశ్వ మనసులో చిక్కుకు పోయింది. ధృతి బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు ఆ బాల్ వచ్చి తన హృదయానికి పూలబంతిలా తాకినట్లు ఫీల్ అయ్యాడు విశ్వ. వచ్చీ రాకుండా బాడ్మింటన్ ఆడుతున్నప్పుడు, అటూ ఇటూ పరిగెత్తుతుంటే ఎక్కడ పడుతుందో అని కంగారు పడ్డాడు. మొత్తం మీద కలలో ఉన్నట్లుగా కాలం గడిచిపోయింది విశ్వకు.
అందరూ పాల్గొనడంతో ప్రైజులు అటూ ఇటుగా ఆడిన వాళ్ళు అందరూ అందుకున్నారు.

***

ఆ రోజు సెలవు. బద్ధకంగా లేచింది ధృతి. బ్రష్ చేసుకుని బయటికి వచ్చింది.
“రేపు కదా ప్రోగ్రాం? ఈ రోజంతా మంచిగా రెస్ట్ తీసుకో.” ఆవలిస్తూ వంటింట్లోకి వచ్చిన కూతురికి చెప్పింది పూర్ణ,
“ఫర్లేదు లేమ్మా… బాగానే ప్రాక్టీస్ చేసాము. వీళ్లేరీ?” చుట్టూ చూస్తూ అడిగింది.
“బయట ఆటలకు వెళ్ళారు” కాఫీ కప్పు కూతురి చేతికి ఇస్తూ చెప్పింది.
“నాన్న?”
“కూరలకెళ్ళార్లే గానీ ఈ ప్రశ్నలేంటే బాబూ? నువు కాఫీ తాగేలోగానే అందరూ వస్తారు” ముద్దుగా విసుక్కుంది. రోజూ అంతే. ధృతి కి లేవగానే అందరూ కనపడాలి. వాళ్ళతో కాసేపు ఆడుకోవాలి.
ఇంతలో ఉరుక్కుంటూ రానే వచ్చారు ఆర్తి, కార్తి. “అక్కా! అక్కా… మీ కాలేజి గురించి పేపర్ లో పడిందట. చూసావా?” అంటూ.
“అవునా! ఏదీ? ఎక్కడ?” ఆశ్చర్యంగా అడిగింది.
“ఇదిగో! ఇక్కడ… టట్టడాం” అప్పుడే ధృతి దగ్గరకొస్తూ పేపర్ ఇచ్చాడు దినేష్.
సంతోషంగా పేపర్ అందుకుంది. దాదాపు ఒక పేజ్ అంతా రాసారు. కాకపోతే ఎక్కడా ధృతి ఫోటో ప్రత్యేకంగా లేదు కానీ, పేరు ప్రత్యేకంగా రాసి ఆటలను ప్రోత్సహించిన తీరు రాసారు. ఆటలాడుతున్న ఫోటోల్లో ఎవర్నైనా వాళ్ళ బట్టలను బట్టి గుర్తు పట్టాల్సిందే.
“అక్కా! నీ ఫోటో విడిగా లేదు” అన్నది ఆర్తి.
“బంగారూ! మన ఫోటో రాకపోవడమే మనకు మంచిది. ఎందుకంటే రేపు ఏ మిర్చి బజ్జీ పొట్లాలమీదో మనం కనపడతాం” చెల్లెలిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ చెప్పింది.
నూనె అంటిన అక్క మొహాన్ని ఊహించుకుని పడీ పడీ నవ్వారు ఇద్దరూ.
ధృతికి తమ్ముడూ చెల్లెళ్ళంటే ప్రాణం. వాళ్ళకీ అంతే. అక్క తోడిదే లోకం. ధృతి తర్వాత చాలా కాలం వరకు రెండో సారి కన్సీవ్ కాలేదు పూర్ణ. ఇక పుట్టరేమో అని కూడా అనుకున్నారు. ఒక్కతే కూతురని ఎంతో అపురూపంగా చూసుకునేవారు ఇంట్లో వాళ్ళకే కాదు పక్కవాళ్ళకు కూడా ధృతి అంటే గారాబమే. అయినా కూడా అందరిళ్ళల్లో ఇద్దరిద్దరుంటే మనింట్లో నేనొక్కదాన్నే ఎందుకు అని ఏడ్చేది. నాకూ తమ్ముడో, చెల్లో కావాలి అని మారాం చేసేది. దేవుడికి మొక్కుకుంటే పుడతారంటే బోల్డు మొక్కులు మొక్కుకునేది.
తొమ్మిదేళ్ళ తర్వాత తమ్ముడు పుట్టబోతున్నాడని తెలిసి పొంగిపోయింది. హాస్పిటల్లో తల్లి పక్కన ఇద్దర్ని చూసి “అబ్బ! దేవుడెంత మంచివాడో కదా అమ్మా! నేను తమ్ముడో, చెల్లెనో అని ఒక్కళ్ళని అడిగితే ఇద్దర్నీ ఇచ్చాడు” అని బోలెడు సంబరపడిపోయింది. ఆ చూసిన క్షణం ఎలాంటిదో కాని కంటికి రెప్పలా కాచుకునేది. తనకోసమే వాళ్ళు పుట్టారని ధృతి నమ్మకం.
“అమ్మా! రేపు నేను పొద్దున్నే వెళ్ళిపోతాను ఫైనల్ రిహార్సల్స్ చూసుకోవాలి. మీరంతా ఆరుకల్లా వచ్చేయండి. ముందు సీట్లు దొరుకుతాయి. లేకపోతే వెనకాల ఎక్కడో కూర్చోవాలి. పూరీ కూర చాలా బాగుంది. నువు చేసినట్లు ఎవరూ చేయలేరు అమ్మా!” కళ్ళు మూసుకుని తన్మయంగా చెప్పింది.
చేసిన వంట పిల్లలకు నచ్చితే తల్లికి అంతకంటే ఆనందం ఏముంటుంది? “ఇంకోటి వేసుకో” వేడి పూరీ తెచ్చి వేయబోయింది.
“ఇప్పటికే లడ్డూ లాగా అయ్యాను. పూరీ వద్దులే కానీ కాఫీ తాగుతాను” ఏదడిగినా తల్లికి సంతోషమే కదా. మళ్లీ కాఫీ కలిపి ఇచ్చింది.
కాఫీ తాగేసిన తర్వాత ముగ్గురూ గదిలోకి వెళ్ళిపోయారు.
“పూర్ణా! మా అమ్మకి రోజూ దిష్టి తీస్తున్నావా? రోజు ఎంతమంది కళ్ళు పడుతున్నాయో…”
“అయ్యో! రామా… ఓ పట్టాన తీయనిస్తుందా మీ కూతురు? అయినా నేనూరుకుంటానా? తీస్తూనే ఉన్నాను.”
“ఆ రోజు అందరూ మన బంగారు తల్లిని మెచ్చుకుంటుంటే కడుపు నిండిపోయిందే…”
“అవును నాక్కూడా అలానే ఉన్నది. ఎలాగో ఈ చదువు అవ్వగానే పెళ్లి చేసేస్తే…”
“ఓయ్! అప్పుడే దాని పెళ్ళికి తొందరేమొచ్చింది?”
“అవును మరి… ఇంటోనే కూర్చోబెట్టుకోండి” ఇద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే వంట చేసేసింది పూర్ణ.

***

“రాజారాం మోహన రాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వార్షికోత్సవ సంబరాలు” అన్న బోర్డ్ నియాన్ లైట్ల వెలుగులో మెరిసిపోతున్నది. చాలా పెద్ద కాలేజీ అది. కాలేజీ అంతా రక రకాల లైట్లతో అలంకరించారు.
ఏసీ ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసి పోయింది. ఎలానో సందు చూసుకుని వచ్చి విశ్వ తన పేరెంట్స్ కీ, ధృతి కుటుంబానికీ రెండో వరసలో సీట్లు చూపించి కూర్చోబెట్టాడు.
స్వాగత గీతంతో కార్యక్రమం మొదలయింది. ఆ తర్వాత మొదటగా విశ్వ, ధృతీల డ్యాన్స్. “యు ఆర్ మై సోణియా” అని అంటూంటే విశ్వ పూర్తిగా లీనమై పోయాడు. ఆ తర్వాత “కహోనా ప్యార్ హై” అని నిజంగా అడుగుతున్నట్లుగానే భావిస్తూ అభినయం చేసాడు. హృతిక్ రోషన్ కంటే కూడా ఎక్కువగా మెలికలు తిరిగాడు విశ్వ. ఒక్క నిమిషం ఏమన్నా నిశ్శబ్దంగా ఉన్నారేమో ఇక ఆ తర్వాత ఆగలేదు, ఈలలు, కేకలు, అరుపులు. అదీగాక ఆ తర్వాత అన్నీ ఫాస్ట్ బీట్ సాంగ్సే. ఒక్కళ్ళు కూడా కూర్చోలేదు. ‘రాములో రాములో…’ ‘బుట్టబొమ్మా బుట్ట బొమ్మా…’ ఇక అన్నీ హుషారెత్తించేవే. నిలుచున్న చోటనే స్టెప్పులేసారు.
“ప్లీజ్! దయచేసి కూర్చోండి. ఇక ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ కూర్చోండి!!” మైక్ లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇంతలో కర్టైన్ పైకి లాగుతుండగా, ధృతి భరత నాట్యం భంగిమలో, దోసిలితో పూలు తెచ్చి నటరాజు పాదాల దగ్గర పోసి వందనం చేసింది.
లైట్ల వెలుగులో ఒక కాంతి పుంజం లాగా మిరుమిట్లు గొలిపింది ధృతి అందం. ఒక స్టెప్ వేసి నాట్యం మొదలు పెట్టగానే అందరూ కూర్చున్నారు. అప్పటి వరకు ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోయిన ఆడిటోరియం నిశ్శబ్దం అయింది. దాంతో ధృతి డ్యాన్స్ అందరికీ చూడటానికి కుదిరింది.
“హిమగిరి తనయే హేమలతే…” అంటూ అమ్మవారి ప్రతీ రూపాన్ని వర్ణిస్తూ, ఆ అమ్మవారిని అభినయించి చూపిస్తుంటే, ఆ దయగల తల్లే వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా ఉన్నది. కళ్ళు పక్కకి తిప్పితే ఏ రూపాన్ని మిస్ అవుతామో అన్నట్లుగా కన్నార్పకుండా చూసారు అందరూ. పిన్ డ్రాప్ సైలెన్స్ తో అందరూ వీక్షించి, తెర వేయగానే ఆపకుండా అయిదు నిమిషాలు కరతాళధ్వనులతో తమ సంతోషాన్ని వెల్లడి చేసారు విద్యార్థులంతా.
వోట్ ఆఫ్ థాంక్స్ లో అందరూ కూడా ధృతిని ప్రత్యేకంగా అభినందించారు. శేఖరం గారు వారి సతీమణితో సహా వచ్చి ప్రశంసల వర్షం కురిపించారు.
***
చూస్తుండగానే ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గరకొచ్చేసాయి. అందరూ పరీక్షల హడావుడిలో పడిపోయారు. విశ్వకు మటుకు దీక్షగా చదువుదామని పుస్తకం ముందేసుకోగానే అక్షరాల మధ్య లోంచి తొంగి చూస్తూ ధృతి కనపడుతుంది. లాభం లేదని పుస్తకం మూసేస్తే కొంటెగా నవ్వుతూ పుస్తకం లోంచి బయటకొస్తుంది. చేసేదేమీ లేక కిటికీ దగ్గరకెళ్ళి గార్డెన్ లోకి చూస్తే పూలబాలలా దర్శనమిస్తుంది. కళ్ళు గట్టిగా మూసుకుందామంటే కళ్ళల్లోపలే ఉందాయె! కళ్ళు మూస్తే కళ్ళల్లోపల, తెరిస్తే కళ్ల ముందర కనపడుతూ, కవ్విస్తూ, అల్లరి చేస్తూ విశ్వ మదిని కలవర పెడుతున్నది ధృతి.
“విశ్వా! కాఫీ తాగుతావా? బయటకెళ్తానన్నావు కదరా?” అడుగుతూనే కాఫీ తీసుకొచ్చింది తల్లి వసంత..
“అమ్మా! కాఫీ తాగుతావా అని అడిగి నా జవాబు తెల్సుకోనక్కర లేదా?” నవ్వుతూ అడిగి తల్లి చేతుల్లో నుండి కాఫీ కప్పు అందుకున్నాడు విశ్వ.
“ఎలాగూ యస్ అంటావు… మళ్ళీ నాకు టైం వేస్ట్ ఎందుకురా?” అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది.
విశ్వ కాఫీ కప్పుతో తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని తల్లినానుకుని కాఫీ తాగసాగాడు.
“ఏంట్రా? ఏంటీ సంగతి?” కొడుకు జుట్టు నిమురుతూ అడిగింది.
“ధృతి అమ్మా! నన్ను చదువుకోనివ్వటం లేదు” అని చెప్దామని నోటి వరకూ వచ్చింది. కాని తల్లి ఏ విధంగా తీసుకుంటుందో అన్న జంకుతో “ఏమీ లేదమ్మా, ఫైనలియర్ కదా? కొద్దిగా టెన్షన్ గా ఉంది.”
“అరేయ్ అబద్ధం చెప్పినా అతికినట్లుండాలంటారు. నీకు ఎగ్జామ్ ఫియర్ అంటే నేను నమ్మాలా? చాల్లే తెలివి! విషయం ఇంకేదో ఉంది. నో ప్రాబ్లం. సమయం వచ్చినప్పుడు నువే చెప్తావు. నేను రాజక్కా వాళ్ళింటికి వెళ్తున్నాను” నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది వసంత.
‘అరె! అమ్మ భలేగా ఆలోచించిందే!’ నవ్వుకున్నాడు విశ్వ.
***
కాలేజికి వస్తూనే విశ్వ కళ్ళు ధృతి కోసం వెతుక్కున్నాయి. ఆ రోజు హాల్ టికెట్ కోసం వచ్చాడు. ఇంక ఈ రోజు తప్పితే మళ్ళీ కలుస్తుందో కలవదో… ఒక్కసారి చదువు ముగించుకుని కాలేజి ప్రాంగణం దాటి బయట పడితే జీవన ప్రయాణంలో ఎటు కొట్టుకెళ్తామో… అప్పటికీ ఫోన్ చేసి కూడా చెప్పాడు ఈ రోజు అందరం కలుసుకుందాం రమ్మని. వస్తుందో రాదో? ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాడు విశ్వ.
“హాయ్ విశ్వా! ఏంటి ఆలోచనల్లో పూర్తిగా మునిగి పోయావు?” దగ్గరకొచ్చి పలకరిస్తున్న ధృతిని ఆనందంగా చూసాడు విశ్వ.
“నథింగ్.. వెయింటింగ్ ఫర్ యూ గైస్” తడుముకుంటూ జవాబిచ్చాడు.
“హే! కమాన్…మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరూ రాలేదేంటి?” చుట్టూ చూస్తూ అడిగింది ధృతి.
“ఇంకా ఎవరూ రాలేదు” మొహమాటంగా ఎటో చూస్తూ చెప్పాడు. మామూలుగా అయితే అంత మొహమాటపడ వలసిన అవసరం లేదు. కాని ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఏదో ఆరాటం మనసుని కుదుపుతుంటే ఫ్రీగా ఉండలేకపోతున్నాడు.
ధృతికి నవ్వొస్తున్నది విశ్వ పడుతున్న ఇబ్బంది చూస్తుంటే.
“ధృతీ! నువు తీసుకున్నావా హాల్ టికెట్?”
“ఇంకా లేదు విశ్వా! నువు?”
“తీసుకోలేదు. పద ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాము”
“అందరూ రానివ్వు విశ్వా… అప్పటివరకు ఇక్కడ కూర్చుందాము” చెట్టుకింద ఉన్న రాతి బెంచ్ మీద కూర్చుంటూ చెప్పింది.
మనసులో గంతులేసుకున్నాడు విశ్వ. “విశ్వా! నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ అమెరికానే కదా? నీ జీఆర్యీ, టోఫెల్ కూడా అయ్యాయన్నావు కదా?” అడిగింది ధృతి.
“అరేయ్! విశ్వా… నక్కని తొక్కి వచ్చావురా” తనని తానే లోలోపల అభినందించుకున్నాడు.
“యస్! ధృతీ… వెళ్దామనే ప్లాన్ అయితే ఉంది. మరి చూడాలి. ధృతీ నిన్నొకటి అడగనా?”
“అయ్యో! నన్ను అడగటానికి అంతలా మొహమాట పడాలా? అడుగు విశ్వా”
అక్కడే తన్నింది విశ్వ లక్. “అరేయ్ విశ్వా! ఇక్కడున్నారా మీరు? పదండి హాల్ టికెట్ తీసుకుందాము” అంటూ గల గలలాడుతూ వచ్చేసారు మిత్రబృందం.
మళ్లీ లోలోపలే తల పట్టుకున్నాడు విశ్వ.
***
“ఇప్పుడు మీ అందరికీ నేనొక న్యూస్ చెప్పబోతున్నాను. అది విని మీరు షాక్ అవకపోతే మీరు అడిగింది ఇస్తాను” ఊరిస్తున్నట్లుగా చెప్పాడు దినేష్. పూర్ణ పెదవుల మీద చిరునవ్వు చూడగానే అర్థమయింది పిల్లలకు.
“వామ్మో!! బామ్మ!!” ముగ్గురూ ఒక్కసారే బిగుసుకు పోయారు షాక్ తిన్నట్లుగా.
“చెప్పానా! నేను చెప్పానా…?” టీజ్ చేస్తున్నట్లుగా రివర్స్ థమ్సప్ చూపించాడు వెక్కిరిస్తూ.
“మీకు వారం రోజుల సమయం ఉన్నది. ఏమి కావాలో చేయించుకుని తినండి. ఏమి కావాలో తెప్పించుకుని తినండి. ఆ తర్వాత బామ్మ ఏది చేస్తే అది తినండి” టీజ్ చేసాడు దినేష్.
“అమ్మా! మాకేవి ఇష్టమో నీకు తెలుసు. అవి చేసేయ్”
“రేపు నాకు పాయసం”
“నాకు పులిహోర”
“నాకు అవి రెండూ” ముగ్గురూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు.
“నాన్నా! ఈ సారి బామ్మతో మేమే వెళ్తాము మూవీకి” ఆర్తీ, కార్తీ పోటీ పడ్డారు.
దినేష్ తల్లి రంగనాయకమ్మ,ఆకారంలో సూర్యకాంతానికి తక్కువా, ఛాయాదేవికి ఎక్కువా. ఆమె రాక సునామీకి తక్కువా, తుఫాన్ కి ఎక్కువా. మనిషి ఆ కాలందైనా పాతకాలానికి తక్కువా, ఆధునిక కాలానికి ఎక్కువా. సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడేమో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోజూ సినిమాకు తీసుకెళ్లమనేది. ఇంట్లో చూడొచ్చు కదా అంటే నాలుక చప్పరించేది. “ఆ మాత్రం ఇంట్లో సినిమా నేను అక్కడ చూసుకోలేనా? ఇక్కడ మల్టీప్లెక్స్ ల్లో కూచుని సినిమా చూస్తూ, పాప్కార్న్ తింటూ ఉంటే ఆ మజానే వేరు” అనేది ఆమె ఫిలాసఫీ.
బామ్మ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అయితే భయమెందుకంటే…
రంగనాయకమ్మకి ఇంతవరకు వంట గదిలోకి వెళ్ళే అవసరం రాలేదు. ఊళ్లో వంటమనిషి చక్కగా చేసిపెడుతుంది.
ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం, ఏదన్నా వంట అనుకోవడం ఆలస్యం యూ ట్యూబ్ వెతికి, దాన్ని పిల్లలకు చేసిపెట్టాలన్న కోరిక. అదొ పెద్ద ప్రహసనం అయి కూర్చుంటుంది. వంట ఇల్లంతా ఓ కొలిక్కి తెచ్చాక, మొత్తమ్మీద తన ఆకారం పాడు చేసుకుని, చేసిన ఐటంతో (అది ఒక్కోసారి ఒక్కో రంగుతో అలరిస్తుంది) టేబుల్ దగ్గరకొస్తుంది. ఇక అది మనవరాళ్ళు, మనవడు తింటే ఆనందంగా చూడాలని ఆమె కోరిక.
***

(సశేషం)

6 thoughts on “ధృతి – 3

  1. Super story bagundi college days Anni gurtuku vastunnai chaduvutunte very nice keep it up waiting for next episode congrats once again

  2. కథ రసవత్తరంగా సాగుతోంది…… సంభాషణలు కాలేజీ జీవితం లో జరిగిన కాలాన్ని గుర్తుకు తెస్తున్నాయి…. ఒక్క సారిగా జీవితం వెనక్కు తీసికెళ్ళావు……
    విశ్రాంత జీవితం లో ఇదో మధురానుభూతి….
    ధన్యవాదాలు…..

Leave a Reply to Mani Cancel reply

Your email address will not be published. Required fields are marked *