March 29, 2024

మోదుగ పూలు – 1

నా మాట:

భారతదేశములో ‘వికాసతరంగిణి’గా పేరున్న ఒక Non-Profit Organizationకు అమెరికాలో VTSeva బ్రాంచ్‌ వంటింది. వారు ప్రతి సంవత్సరము అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయ సంతతిని ‘ఇంటర్న్‌షిప్’ మీద భారతదేశములోని వారు నడుపుతున్న పాఠశాలలకు తీసుకువెడతారు. ఆ స్కూల్సు ‘గిరిజన పాఠశాలలూ, అంధవిద్యార్థుల పాఠశాలలు’.
ఇవి పరమహంసపరివ్యాజులైన శ్రీ. చిన్నజియ్యరు స్వామి వారి అధ్వర్యములో నడుస్తాయి.
ఈ internship కు chaperoneలా పిల్లలతో కలసి నేను కూడా ప్రయాణించే అపూర్వ అవకాశమొచ్చింది. అలా మొదటిసారి 2017 లో ఆ గిరిజన- పాఠశాలలను సందర్శించాను.
ఆ స్కూలు, ఆ పిల్లలు, వారి ప్రేమ, ఆ వాతావరణము నాకు మరో ప్రపంచం పరిచయం చేశాయి. అటుపై గిరిజనుల సంస్కృతి గురించి తెలుసుకోవాలని నాకు గొప్ప తపన కలిగింది.
ఆ తపనలో భాగంగా నేను గిరిజనుల గురించి ఎంతో సాహిత్యం సేకరించాను.
2018లో మరోసారి నేను ఆ స్కూలుకు వెళ్ళాను. వారిచ్చిన స్వాగతం, చూపిన నిఖార్సైన ప్రేమ నేను మరువలేను. వారికున్న తెలివితేటలు అపూర్వం.
ఇందులో నేను వర్ణించిన స్కూలు, అడవి అప్పటి నేను చూసిన విశేషాలే. నేను కొద్దిగా ఊరి పేర్లు, స్కూలు పేరు మార్చాను. కాని విషయం వాస్తవం.
అడవి ఒక అద్భుత లోకం. నాకు అవకాశమొస్తే నేను గిరిజనులతో కలసి ఉండిపోగలనని నా నమ్మకం. అంతగా గిరిజనులు నన్ను ఆకట్టుకున్నారు. నాకు వారి స్వచ్ఛత అంటే గౌరవం, వారి అమాయకత్వం అంటే ప్రేమ. వారు సత్య యుగము నాటి వారంత స్వచ్ఛమైన వారు. నిజమైన మానవులు, ప్రేమజీవులు. మనం నాగరీకత పేరులో పూర్తి కల్తీ సరుకు.
***
నేను ఇందులో ప్రస్థావించిన చరిత్ర, గోండుల చరిత్ర, గిరిజనుల సమస్యలు నిజమైనవి. ఈ కథలో నేను ఆ విషయాలు చాలా కొద్దిగానే వివరించాను. విస్తారంగా చెబితే అది ఒక రీసెర్చు గ్రంధమవుతుందని బెదిరి చాలా తగ్గించి రాశాను.
ఉపయుక్తమైన గ్రంధాలు;
1. ఆదివాసులు వైద్యం, సంస్కృతి, అణచివేత. – కె. బాలగోపాల్‌
2. గిరిజన విప్లవమూర్తి కొమరం భీం – భూక్యా చినవెంకటేశ్వర్లు
3. ఆదిలాబాదు గిరిజనులు సంస్కృతి ప్రగతికి సవాళ్ళు – శాస్త్రీ
4. కొలవగొట్టి – కరపెజ్‌ సటి పుస్తకము
5. ఆదివాసీ ఆత్మ గానం. – డా. విఎన్. వికె శాస్త్రి
6. కొమరం భీం ముందు తరువాత ఇప్పుడు – డా. వి. ఎన్. వి. కె. శాస్త్రి
7. కొండకోనలలో తెలుగు గిరిజనులు – శివరామకృష్ణ
8. కొమరం భీం – అల్లం రాజయ్య సాహూ

ఇది చదివి మీరు ఆదరించాలని ఆశిస్తూ మీ ప్రతి స్పందన ఆశిస్తూ…
సంధ్యా యల్లాప్రగడ

 

***************************************************************************************************

 

 

బర్రున వచ్చి ఆగిన బస్సులోంచి దిగాడు వివేక్.
“రైట్ రైట్!! ” అంటూ కేకేసాడు కండెక్టరు వివేక్ బస్సు దిగిన తరువాత.
అక్కడ మరి ఎవ్వరూ దిగలేదు.
ఎర్రట్టి దుమ్ము లేపుతూ బస్సు సాగిపోయింది.
బట్టలపై పడిన దుమ్ము దులుపుకుంటూ ఎదురుగా కనపడుతున్న మట్టి రోడ్డు వైపు ధీర్ఘంగా చూశాడతను.
అది కంకర, ఎర్ర మట్టి కలిపి వేసిన రోడ్డు. అవి ఫిబ్రవరి మాసపు ఆఖరి రోజులు. అప్పుడే చలి తగ్గుతూ ఎండ ఎక్కుతోంది. సమయం పన్నెండు గంటలవుతోంది. ఆ చుర్రుమంటున్న ఎండలో, ఆ ఎర్ర మట్టితో ఉన్న దారి మరింత ఎర్రగా కనపడుతోంది. రోడ్డు మీద కానీ ఆ బస్టాండులో కానీ జన సంచారం లేదు. మరో నరమానవులు లేరు. బస్సు కనుచూపు మేర దాటాక గమ్మత్తుగా నిశ్శబ్ధం అలుముకుంది.
చుట్టూ అడివి, పెద్ద పెద్ద చెట్లు చుట్టూ వ్యాపించి ఉన్నాయి. చక్కటి హరిత వర్ణముతో ఉన్న చెట్టు ఎటు చూసినా మెరుస్తూ కళ్ళకు శాంతిగా ఉంది. ఆ చెట్లు ఏమిటో అర్థం కాలేదు వివేక్‌కి. ‘వాటి క్రింద నిలబడితే గొడుగు అవసరము ఉండదెంత వానకైనా’ అనుకున్నాడు.
అంచు కనపడని అడివి విస్తారంగా ఉంది. అతను పుట్టి బుద్ధి తెలిసినది మొదలు అంత పచ్చదనం చూసి ఉండలేదు. చుట్టూ మెల్లగా చూస్తూ ఆ పరిసరాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం మొదలెట్టాడు. అడవి పురుగుల ధ్వని వ్యాపించి ఉంది. ఆ మట్టి రోడ్డు మొదట్లో ‘గిరిజన గురుకుల పాఠశాల’ అన్న బోర్డుతో ఒక యారో మార్కు వేసి ఉంది.
భుజానికి బ్యాకుప్యాకు, చేతిలో చిన్న పెట్టెతో ఆ యారో చూపిన దిశగా రోడ్డు మీద నడక మొదలెట్టాడు వివేక్. అడవిలో కీచు రాళ్ళ ధ్వనికి తోడు ఇప్పుడు వివేక్ అడుగులు జత అయ్యాయి. మరో చప్పుడు లేదు. ఆలోచిస్తూ నడవటం మొదలెట్టాడు.
‘ఇలా గంట నడవాలేమో‘ అనుకున్నాడు మనసులో.
అతనికి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. తను ఇలా రావటం.
***
వీరానాయక్, వివేక్ మంచి మిత్రులు. డిగ్రీ, ఎమ్‌ఏ కలిసి చదువుకున్నారు. ఈ గిరిజనపాఠశాలకు ఉపాధ్యాయులు కావాలన్న ప్రకటన ముందు వీరా చూశాడు. కాని అతను ఎమ్‌ఫిల్ కి వెళ్ళిపోతున్నందునా. . . వివేక్‌ ఆర్థిక పరిస్థితులరీత్యా అతనికి ఉద్యోగము అత్యవసరం కనుక, వివేక్‌ను ఆ జాబుకు దరఖాస్తు చెయ్యమని బలవంతపెట్టాడు.
“మనము అప్లై చెయ్యగానే వస్తుందటరా? అయినా ఇదంతా ఫార్సు కాని. వాళ్ళకు ఎవరో ఉండే ఉంటారు. జీతం చూడు దండిగా ఇస్తున్నారు. పైపెచ్చు తిండి, షెల్టరు వాళ్ళే. . . వచ్చేదంతా మిగులే కదా. మనకెందుకొస్తుంది?” అన్నాడు ఉదాసీనంగా వివేక్.
కానీ వీరా ఒప్పుకోలేదు.
“కాదులేవో! అది ఎక్కడో జిల్లాలో. మారుమూల అని వాళ్ళు పెద్ద జీతం పెట్టారు. అంత దూరం హైద్రాబాదు వదిలి ఎవరు వెడతారని. నీకు తప్పక వస్తుంది. నీవు నీ ఫ్యూచర్‌ చక్కగా సెటిల్ చేసుకోవచ్చు. నా మాట కాదనకు. ముందు నీవు అప్లై చెయీ” అంటూ బలవంత పెట్టి తనే దగ్గరుండి కట్టించాడు.
వివేక్ తండ్రి వివేక్ పుట్టక మునుపే పల్లె వదిలి పట్నం వచ్చాడు. రిక్షా తొక్కుతూ కుటుంబం లాగేవాడు. పిల్లలను పెద్ద చదువులలో చూడాలని ఆటో నడపటం మొదలెట్టాడు. వివేక్‌కి పదహేనేళ్ళప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు ఆయన. అప్పటి వరకూ ఏదో పర్వాలేదులా ఉన్న కుటుంబం రోడ్డున పడింది. చెల్లికి బాల్య వివాహం చేస్తే మొగుడు తాగి కొట్టి ఆ అమ్మాయిని వదిలేశాడు. తల్లి, చెల్లి చేతనైన పనులు చేస్తూ కుటుంబం గడుపుతున్నారు. వివేక్ తెలివైన విద్యార్థి. స్కాలర్‌షిప్‌తో, గిరిజన హాస్టల్స్ లో ఉండి చదువు కానిచ్చాడు.
హాస్టల్లో ఉన్న మిత్రులలో ఒకడు సింగపూరు వెడుతున్నాడు. అతనికి అక్కడ పై చదువు చదివే అవకాశమొచ్చింది, తెలివైన వివేక్‌ ను కూడా రమ్మని పిలిచాడతను.
“అక్కడ స్కూలులో టీచరుగా ఉండవచ్చు. వచ్చే డబ్బు కొంత ఇంటికి పంపవచ్చు. జీవితంలో సెటిల్ అవటానికి నీకిదో మంచి అవకాశం. తెలివైన వాడివి ఆలోచించు” అన్నాడతను.
“నా దగ్గర పైసా లేదు” చెప్పాడు వివేక్‌ నిరుత్సాహంగా.
“ఎక్కడో అక్కడ అప్పు చెయ్యరా. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావుగా. ఇంతా చేస్తే నీకు ఒక యాభై వేలు ఉంటే చాలు. రెండు నెలల్లో తిరిగి ఇచ్చెయ్యగలవు” ఉత్సాహపరిచాడా మిత్రుడు.
వివేక్ దుకాణములో పద్దులు రాస్తూ, ఎయిడెడ్ స్కూల్ లో టీచరు జాబు వస్తే చేరుదామని చూస్తున్నాడు. ఇది మంచి అవకాశంగా తోచింది కానీ యాభైవేల కోసం ఏ బ్యాంకును కొల్ల కొట్టాలి? దారితోచలేదు అతనికి.
అదిగో అప్పుడు వీరాను అడిగితే ఈ జాబు చూపి, వెళ్ళు అని సలహా ఇచ్చాడు.
తను లెక్కలు రాసే దుకాణపు యజమానిని అడిగితే ఉన్న ఆ చిన్న ఉద్యోగము కూడా పీకుతాడని వివేక్ కి తెలుసు.
ఇలా కొట్టుమిట్టాడుతుంటే అతనికి ఈ ఇంటర్యూకి పిలుపొచ్చింది. కొంత హోప్, కొంత సంతోషం కలిగాయన్న మాట నిజంకానీ, అంత లోనే జాబు రావాలిగా అన్న నిరుత్సాహం కలిగాయి.
కనీసం ఇంటర్వ్యూలు అటెండు అవుతే అనుభవం వస్తుందని మనస్సులో చెప్పుకొని ఉన్నంతలో మంచి బట్టలు తగిలించుకొని ఇంటర్యూకి బయలుదేరాడు వివేక్.
***
కోటిలో ఒక చిన్న ఆఫీసు అది. బహుశా వాళ్ళ సిటీ సెంటర్ కావచ్చు. మూడంతస్తుల బిల్డింగులో రెండో అంతస్తులో ఉంది ఆ ఆఫీసు.
ఆ ఆఫీసులోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న కుర్చీలలో నలుగురు తన లాంటి వాళ్ళు కనిపించారు, వెయిట్ చేస్తూ. అటెండరు అవ్వొచ్చు, “కూర్చోండి పిలుస్తారని” చెప్పి లోపలికి పోయాడు. దాదాపు గంట తరువాత వివేక్‌ను పిలిచారు.
లోపల చిన్న కారిడార్. ప్రక్కగా గదులు రెండు ఉన్నాయి. ఒక గది చూపించి లోపలికెళ్ళమని చెప్పి అటెండరు మాయమయ్యాడు.
లోపల దాదాపు అరవై సంవత్సరాల వయస్సు ఉన్న ఒక పెద్ద మనిషి, ముప్పై సంవత్సరాల వయస్సు ఉన్న మరో అతను ఉన్నారు. గదిలో వెలుతురు తక్కువగా ఉంది. ఫ్యాను చప్పుడు చేస్తూ తిరుగుతోంది. వాళ్ళు కూర్చున్న కుర్చీల ముందు పెద్ద బల్ల. ఇటువైపు రెండు కుర్చీలు వేసి ఉన్నాయి. ఒక ప్రక్క పుస్తకాలు బొత్తులు పెట్టి ఉన్నాయి. చూడగానే స్కూలు పుస్తకాలని తెలిసిపోతోంది. మరో ప్రక్క బొత్తులుగా నోటు బుక్స్ ఉన్నాయి.
ఒక ర్యాకు, దానిలో పుస్తకాలు. మొత్తానికి గది అంతా పుస్తకాలు పరచి వున్న విజ్ఞాన మైదానంలా ఉంది.
ఆ పెద్ద మనిషి నవ్వుతూ “రావయ్యా! రా! కూర్చో! నీ పేరేంటి? నా పేరు ప్రసాద్రావు” అన్నాడు.
ఆయన ఎదురుగా వివేక్ అప్లికేషను కనపడుతోంది.
వివేక్ నమస్కరించి “నమస్తే సార్. నా పేరు వివేక్” అన్నాడు కూర్చుంటూ.
“ఎమ్‌ఏ చదివావు. పండిట్ ట్రేనింగు కూడా అయినట్లుంది. ఇక్కడ ఏ స్కూల్లోనూ చూసుకోలేదా” అన్నాడు ఆరాగా చూస్తూ.
“ట్రై చేశాను సార్. ఇంకా చేస్తున్నా. రావాలిగా. ” అన్నాడు వివేక్.
“ఈ స్కూలు చాలా లోపలగా ఉంటుంది. సిటీ హడావిడి ఉండదు. ఉండగలవా? రెండో రోజే వెనక్కు వస్తావా?” అన్నాడాయన సరదాగా మాట్లాడుతున్నట్లుగా.
“నేను ఉన్న స్థితిలో ఉద్యోగం అవసరం సార్. అమ్మ, చెల్లిని చూసుకోవాలి. నాయన లేడు. నాకు కుదిరితే రీసెర్చ్ కూడా చెయ్యాలని ఉంది. మరీ కుదిరితే విదేశాలకు పోవాలని కూడా ఉంది. ఇప్పటి వరకూ స్కాలర్‌షిప్స్ మీద గడిచింది. ఇప్పుడు ముందుకు పోవటం కష్టంగా ఉంది.
వీటికి ముందు అనుభవం, కొంత డబ్బు అవసరం కాబట్టి జాబు దొరికితే చెయ్యాలనుంది. కొన్ని రోజులు కదలకుండా జాబు చెస్తే కొద్దిగా నిలకడగా ఫ్యూచరు చూసుకోవచ్చు” అన్నాడు నిజాయితిగా వివేక్.
“నీవు తెలుగు ఎమ్‌ఏ. మరి ఇంకా ఏ సబ్జెక్టు చెబుతావు. ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉందా?” అడిగాడు ప్రక్కన ఉండి అప్పటి వరకూ మాట్లాడకుండా చూస్తున్న ఆ వ్యక్తి.
“ట్యూషన్లు చెప్పాను సారు. తెలుగు, సంస్కృతము, సోషల్, చిన్న పిల్లలకు లెక్కలు. ఆరు నెలలే కదా సార్ నా ఎమ్‌ఏ అయి అందుకే బడిలో చెప్పిన అనుభవమేమి లేదు” అన్నాడు వివేక్.
“ఇతనే రాజు, మా స్కూలు ప్రిన్సపాల్” చెప్పాడు ప్రసాదరావు సార్.
తల ఊపాడు వివేక్.
“నీవు మాకో చిన్న లెసన్ చెప్పమంటే చెప్పగలవా ఇప్పుడు?” అడిగాడు రాజుసార్.
తల ఊపిన వివేక్ కి టెన్తు తెలుగు పుస్తకము ఇచ్చాడు రాజు సార్.
వివేక్ అది తీసుకొని దానిలోని చందస్సు పేజీ తీసి అక్కడే ఉన్న వైట్ బోర్డు దగ్గరకు వెళ్ళాడు.
మార్కర్ పట్టుకొని “చందస్సు అంటే గురువు లఘువులు ఆట. . ” అంటూ మొదలెట్టాడు.
పిల్లలు ఉన్నట్లుగా, వాళ్ళు వింటున్నట్లుగా భావిస్తూ, చందస్సు, లఘువు, గురువులు, తేడాలు గుర్తించడం వివరించసాగాడు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఉంది అతని వివరణ.
రాజుసార్, ప్రసాదరావుసార్ పిల్లల్లా వింటూ తలవూపుతూ ఆ పాఠములో మునిగిపోయారు. పది నిముషాల తరువాత
“బావుంది. ఇక చాలు” అన్నాడు ప్రసాదరావు సార్.
“మాకు రెండు సంవత్సరాలు బాండ్ ఇవ్వాలి, ఇవ్వగలవా?” అడిగాడు ప్రసాదరావుసార్.
“ఒక ఏడాదే అనుకున్నా సార్” అన్నాడు వివేక్ వచ్చి కూర్చుంటూ.
“నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మేము ఆపము. లేకపోతే కనీసం రెండేళ్ళన్నా ఇక్కడ ఉండాలి. ప్రతి యేడు మేము టీచర్లును వెతుక్కోలేంగా” అన్నాడాయన.
కొద్దిగా తల వంచి ఆలోచించి, తల ఎత్తి “సరే సార్!” అన్నాడు వివేక్.
“నీవు రేపు ఇక్కడికే రా, వివేక్! నీకు రిజల్టు చెబుతాం” అన్నారు ప్రసాదరావుసార్.
నమస్కారం పెట్టి లేచి వచ్చేశాడు వివేక్.
***
ఆ రోజు సాయంత్రం కలిసినప్పుడు వీరా అడిగాడు ఇంటర్యూ ఎలాయిందని.
“బానే చేశాననుకుంటున్నారా! కాకపోతే వాళ్ళు రెండేళ్ళు బ్యాండ్ రాసిమ్మని అడుగుతున్నారు. కొంచం ఎక్కువేమో అంత టైం” అన్నాడు ఆలోచనగా వివేక్.
“టూ యియర్స్ ఏముందిరా బాబు, ఇట్టే గడిచిపోతాయి. కొంచం అమ్మా చెల్లీ కూడా సెటిల్ అవుతారు. వస్తే ఆలోచించకు. వెళ్ళిరా. నీ జాబు అనుభవము చూపించి నీవు రీసెర్చులో కూడా చేరవచ్చు. మంచిగ కుదిరితే ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్‌గా పోవచ్చు. ఏడికో పోతనంటవు. ఇక్కడ అమ్మా, చెల్లీ నీ కోసము ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో మర్చిపోకురా” చెప్పాడు వీర్‌ ప్రోత్సాహంగా.
“సరే! చూద్దాంలే. రానీయ్యరా ముందు” అన్నాడు ఇక సంభాషణ పొడగించటం ఇష్టం లేక వివేక్.
ఆలోచనలతో బుర్ర తిరుగుతోంది అతనికి. ఎక్కడో మారుమూల పల్లెకు పోవాలా? లేక ఇక్కడే ఏదైనా చూసుకోవాలా? అమ్మా వాళ్ళు ఉండగలరా? అలా అనుకొని నవ్వుకున్నాడు. వదిలేసి విదేశాలే వెళ్ళాలనుకున్నాడు. అలాంటిది పల్లెకు పోవటానికి సంకోచమేంటి? బావుంటే అమ్మను తీసుకుపోవచ్చు. చెల్లితో డిగ్రి చెయించొచ్చు. వస్తే కాదనకూడదు. నెలకు పదిహేను వేలంటే మాటలు కాదుగా అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ఆ రాత్రి.
ఆ మరుసటి రోజు రమ్మన్న టైంకు వెళ్ళాడు వివేక్. అక్కడో పది మంది తనలాంటి వారు కనిపించారు. వాళ్ళంతా నిన్నటిరోజున ఇంటర్యూకు వచ్చినవారే. చిన్నగా నవ్వుకుంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
అరగంట తరువాత వివేక్ ను మరో అతనిని లోపలికి పిలిచారు. మిగిలిన వారిని వెళ్ళిపొమ్మన్నారు.
వివేక్ మనస్సు ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. లోపలికి వెళ్ళాక ప్రసాదరావు సార్ ఒక్కరే ఉన్నారు. గదిలో బుక్స్ కూడా చాలా మటుకు మాయం అయ్యాయి.
ప్రసాదరావు ఇద్దర్ని కూర్చోమని “మీ ఇద్దర్ని తీసుకుంటున్నాము” అన్నాడు.
మరో అతను “రెండేళ్ళు నేను కమిట్ కాలేను సార్. ఏడాది అయితే నాకు వోకే” అన్నాడు.
ప్రసాదరావు ధీర్ఘంగా చూసి “సరే నీ ఇష్టం. నీవు వెళ్ళవచ్చు. మాకు రెండేళ్ళకు కావాలి అని ఖచ్చితంగా చెప్పానుగా” అన్నాడు.
అతను లేచి వెళ్ళిపోయాడు.
వివేక్ వైపు చూసి “నీకు రెండేళ్ళు ఓకే కదా!” అన్నారాయన.
వివేక్ తల ఊపాడు.
“సరే చూడు ఇది అగ్రిమెంటు. చూసి సంతకము చెయ్యి. డేట్ వేసి ఇవ్వు. నీ సర్టిఫికేట్లు ఒర్జినల్స్ నాతో ఉంటాయి. రెండేళ్ళ తరువాత నీకందచేస్తాం” అన్నాడు.
వివేక్ ఆ అగ్రిమెంటు తీసుకొని చదవటం మొదలెట్టాడు. చదివి సంతకము పెట్టి, డేటు వేసి ఇచ్చాడు. తన ఒర్జినల్స్ కూడా ఆయన ముందు పెట్టాడు.
ప్రసాదరావు వాటిని తీసుకొని ఒక ఫైల్‌ లోపెట్టి చిన్న నవ్వుతో “నీవు వచ్చే మండేకల్లా అక్కడికి చేరు. ముందుగా ఇంట్లో వాళ్ళకు డబ్బు అదీ సర్దాలేమో నేను కొంత ఇస్తాను తీసుకొని అది ఇచ్చి బయలుదేరు“ అన్నాడు.
తల ఊపాడు వివేక్.
“ఇక్కడ ఆదిలాబాదు బస్సు పట్టుకో. . . ఆదిలాబాదుకు ఉదయం చేరతావు. అక్కడ టిఫెన్ చేసి మరోబస్సు తీసుకోవాలి. బస్సు మన బడి రోడ్డు దగ్గర దింపుతుంది” అంటూ ఎలా వెళ్ళాలో వివరించాడు.
“అది అడవి ప్రాంతం. మనుషులు మంచి స్నేహశీలులు. నగరాల్లోలా కల్మషం ఉండదు. తండాల జనాలకు నీవు దేవుడివే ఇక. అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే నీకు. తినబోయే ముందు రుచులెందుకు” అన్నాడాయన నవ్వుతూ.
డెస్కు నుంచి ఐదువేల రూపాయలు తీసి ఇచ్చాడు. “ఖర్చులకు ఉంచుకో” అంటూ.
షేక్‌హ్యాండిస్తూ “ఆల్‌దబెస్టు వివేక్!” అన్నాడాయన.
నమస్కారం చేసి బయటకొచ్చాడు వివేక్.
తరువాత అన్నీ చకచకా జరిగాయి. రెండు జతల బట్టలు కొత్తవి కొనుక్కున్నాడు. తల్లికి చెప్పాడు సెలవలకు వస్తానని. బస్సులకు కొంత ఉంచుకొని, రెండు వేలు తల్లికి ఇచ్చాడు. ఫస్టుకు మళ్ళీ పంపుతానని చెప్పాడు.
తన వద్ద ఉన్న పుస్తకాలు బ్యాగులో సర్దుకున్నాడు. వీరాకు చెప్పి నగరం వదిలి ఆదిలాబాదు వెళ్ళే బస్సు పట్టుకున్నాడు.

***

23 thoughts on “మోదుగ పూలు – 1

  1. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారండి. ఆరంభమే ఆకట్టుకుంది. తాండాలూ, గిరిజనులు అంటే నా బాల్యం గుర్తొస్తోంది. మా చిన్నప్పుడు మా నాన్నగారు అడవులల్లోనే పనిచేసారు. గిరిజన తాండాలల్లోనే ఉండేవాళ్ళం. నాకు ఆ వెదురు ఇల్లు, అడవి లో ఆటలు, చెరువు లో స్నానం కొద్దికొద్దిగా గుర్తు. బాగుందండి.

    1. చాలా సంతోషమండి. మీరు ఇలాగే నన్ను ప్రోత్సహించాలని నా కోరిక. ❤️

    2. అమ్మా నాకయితే ప్రారంభం చాలా నచ్చేసింది, నాకు చిన్నప్పటి నుంచి అడవులన్నా, మొక్కలన్నా చాలా ఇష్టం.
      ఇక గిరిజన ప్రజలు గురించి నాకు పెద్దగా తెలియదు, కొత్త విషయాల మీద ఆసక్తితో వారితో గడపాలనే కోరిక కూడా ఉంది, నా మాటలు విన్నప్పుడల్లా మావారు పోయి అడవుల్లో బ్రతుకు, నీలాంటి వారంతా అక్కడే ఉంటారు అని ఆట పట్టిస్తుంటారు, నాక్కూడా ఉండాలని ఉంది, కానీ నా కుటుంబ పరిస్థితులు దృష్ట్యా కుదరదు గా.
      కామెంట్ ఎక్కువ అవుతున్నట్టుంది.
      కధ చాలా బాగుంది మా

  2. Interesting beginning. తరువాత ఏమవుతుందో అనే ఆలోచన కలిగించారు. కథ వదలకుండా చదివించింది. అభినందనలు సంధ్య గారూ

  3. మీ మోదుగపూలు చక్కని కథనం … ఆసక్తికరమైన అంశం… next episode కోసం ఎదురు చూస్తున్నాను already. Congratulations again అండి

    1. చాలా సంతోషం సుకన్య. మీరు అన్ని ఇంత ఉత్సాహంగా చదవాలని కోరుతున్నాను

  4. మంచి కధాంశం తీసుకున్నావు సంధ్య. ప్రెజెంట్ చేసిన తీరు బావుంది. తరువాయి భాగం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నా.

    1. ప్రియమైన ఇందిరా. కృతజ్ఞతలు. మీ వంటి మిత్రల ప్రోత్సాహము మునుముందుకు నడిపిస్తుంది నన్ను. కథను

  5. చాలా చక్కటి కథాంశం ఎంచుకున్నావు సంధ్య. ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంది. నువు గిరిజనుల మధ్య మెసలిన అనుభవంత ఈ నవలను అద్భుతంగా తీర్చి దిద్ది ఉంటావని ఆశిస్తున్నాను.శుభాభినందనలు మిత్రమా

    1. Dear Padma చాలా చాలా కృతజ్ఞతలు. హృదయపూర్వక ఆలింగనలు

  6. చాలా చక్కని అంశంతో మొదలు పెట్టారు సంధ్యా. చాలా జాగ్రత్తగా హావ భావాల పరిచయం కొనసాగిస్తూ కథ నడిపిన తీరు చాలా బాగున్నది. ఏఎండో భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

    1. విజయలక్ష్మిగారు వందనము. మీ స్పందన నన్ను ఎంతో ఉత్సాహపరుస్తున్నది. కృతజ్ఞతలు.

  7. చాలా బాగా మొదలు పెట్టారు…అప్పుడే అయిపోయిందా అనిపించింది…నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు అని ఎదురు చూసేలా ఉంది సంధ్య గారూ.

    1. రమేష్ గారు వందనము. మీ స్పందనకు కృతజ్ఞతలు. మీ వంటి
      మిత్రులు నన్ను ముందుకు నడిపించే సంజీవనిలు.

  8. చాలా చక్కని అంశం తీసుకున్నావ్ సంధ్య! ఆరంభమే చాలా ఆసక్తికరంగా ఉంది! నీ పరిశోధనా సారాంశం అంతా కథలో మరింత విపులంగా చదవగలమని ఆశిస్తున్నాను అభినందనలు నీ మోదుగ పూలకు!

    1. ప్రియమైన శశికళగారు మీ నుంచి వచ్చే స్పందన విలువైనది. కృతజ్ఞతలు. ప్రేమపూర్వక ఆలింగనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *