February 27, 2024

కంభంపాటి కథలు – సమయానికి తగువు మాటలాడెనే

రచన: కంభంపాటి రవీంద్ర

‘ఏవండీ… ‘
‘ఊఁ’
‘ఓ మాట’
‘చెప్పు ‘
‘రేపటి నుంచీ మనిద్దరం తగులాడుకోవద్దు’
‘రెండు విషయాలు’
‘రెండు విషయాలా?
‘అవును… ఒకటి. తగూలాడుకోవద్దు అనడం తప్పు… తగువుపడొద్దు అనాలి… రెండు… మనిద్దరం తగువుపడకూడదు అంటే… రేపటిదాకా ఎందుకు? ఇవాళ్టి నుంచే మనిద్దరం గొడవ పడకుండా ఉండొచ్చుగా’
‘ముందు మొదటి పాయింట్ చర్చిద్దాం… మీ ఉద్దేశం ఏమిటి? నాకు తెలుగు రాదనేగా?’
‘రాదని కాదు… సరిగా రాదని… ఒకవేళ వచ్చుంటే… పాయింట్ బదులు విషయం అనేదానివి’
‘మరదే…… నా పదో క్లాసు పబ్లిక్ పరీక్షలో తెలుగు మార్కులు తెలుసా? నూటికి తొంభై రెండు… మీకెన్ని?’
‘పదో క్లాసు మార్కులెందుకు?… ఇంటర్ లో నీ తెలుగు మార్కులు చెప్పు… నాకు నూటికి డెబ్భై రెండు ‘
‘నేను ఇంటర్లో తెలుగు తీసుకోలేదు… సంస్కృతం తీసుకున్నాను’
‘సంస్కృతం అంటే మార్కులెక్కువ కొట్టేయొచ్చనే కదా … ఇక్కడే అర్ధమవుతూంది… నీకు తెలుగు మీద ప్రేమో లేక మార్కుల మీద ప్రేమో’
‘ఓహో… అలా వచ్చేరా… మరి నేను పదో తరగతి దాకా మాడపాటి హనుమంత రావు తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నాను… మరి మీరో… సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్… మరి మీకు ఇక్కడేం అర్ధమయ్యిందో!’
‘ఇందులో నాకర్ధమవ్వాల్సిందేమీ లేదు… ఎక్కడ చదువుకున్నామని కాదు… ఏం చదువుకున్నామన్నది పాయింటు’
‘ఏం చదువుకున్నామన్నది కాదు… ఏం గ్రహించామన్నది విషయం… చూసేరా… నేను విషయం అంటే… మీరు పాయింట్ అన్నారు… తెలుస్తూనే ఉంది… ఎవరికీ తెలుగు బాగా వచ్చునో!’
‘నీ మొహం… నేను పాయింట్ అని అన్నది నీకు అర్ధం కావడానికి… ఇంటర్ కి వచ్చేసరికి తెలుగొదిలేసిన బ్యాచ్ కదా తమరు’
‘ఈ ఎత్తిపొడుపులే వద్దన్నది… చిన్నప్పటినుంచీ తమరికి తెలుగంటే అంత ప్రేమ తన్నుకొచ్చేస్తూంటే…మన పెళ్లి రిసెప్షన్ లో ఎంచక్కా తెలుగు సంస్కృతి ని ఉద్ధరించేలా పంచె, ధోవతి వేసుకోకుండా… సూటెందుకేసుకున్నారో అయ్యగారు ‘
‘అదే మరి…. ఆ సూటు తమరి తండ్రి గారే కొన్నారు మరి… ‘
‘ఓహో… మరి మా తండ్రి గారిని “మా పిల్లాడికి మూడు సూట్లు పెట్టాలి ” అని ఆర్డరేసింది తమరి తండ్రిగారే ‘
‘రిసెప్షన్ అనే మాట ఎత్తింది… మీవాళ్ళే’
‘ఇది మరీ బావుంది… రిసెప్షన్ ఎక్కడ పెట్టుకుందాం అని అడగడం కూడా తప్పేనా!… అసలా మాటకొస్తే… మాతో పెళ్లి సంబంధం మాట ఎత్తింది మీ వాళ్ళే ‘
‘అవునూ… పెళ్లి బ్యూరోలో నీ వివరాలు పెడితే… పెళ్లి సంబంధం కోసం అనుకుంటాం గానీ… ఇలా నీతో గొడవాడ్డానికనుకోము కదా ‘
‘గొడవాడ్డం ఏమిటి? గొడవ పడడం అనాలి… చూసేరా… ఇంటర్లో కూడా మీ సెకండు లాంగ్వేజ్ తెలుగే అయినా… ఇప్పటికీ తెలుగు మాట్లాడ్డం రాలేదూ!… అంతేలెండి… గుఱ్ఱాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం గానీ దానికి నీళ్ళు తాగించగలమా?’
‘ఏడిసినట్టుందా ఉపమానం… దాహం లేని గుఱ్ఱాన్ని చెరువు దాకా తీసికెళ్ళి నీళ్లు తాగమని బతిమాలాడడమెందుకు?… దానికి దాహమైనప్పుడే తీసుకెళ్ళొచ్చుగా ‘
‘ఆం… నాకేం గుఱ్ఱం భాష రాదు…దానికి దాహంగా ఉందో లేదో తెలుసుకోడానికి, అయినా మనకేవైనా గుఱ్ఱాలున్నాయా ఏమిటీ?… వాటికెప్పుడు నీళ్ళెట్టాలో… గడ్డెట్టాలో తెలుసుకోడానికీ?’
‘మరి…గుఱ్ఱం, చెరువూ, నీళ్ళూ అంటూ మొదలెట్టిందెవరో?’
‘మొదలెట్టింది నేనైనా… దానికి నానార్ధాలూ తీసింది మీరే కదా’
‘నానార్ధాలూ తీస్తే ఫర్లేదు…. నీలా విపరీతార్ధాలూ తియ్యకుండా ఉంటే చాలు!’
‘ఇదిగో…ఇలా ఎడ్డెమంటే తెడ్డెం అంటారు కాబట్టే… మీతో చెప్పింది … ఇవాళ్టి నుంచీ మనిద్దరి మధ్యా తగువులొద్దండీ అని!’
‘నువ్వేం అలా అనలేదు!’
‘అదేమిటి…నేనలా అనలేదా? ఏమన్నానో మరి?’
‘ఒకటి. ఇవాళ్టి నుంచీ అనలేదు… రేపటి నుంచీ అన్నావు…రెండు… తగువులొద్దండీ అనలేదు… తగులాటలొద్దండీ అన్నావు… చూసేవా దొరికిపోయేవు!’
‘నేనేం దొరకలేదు… మీరే దొరికేరు’
‘నేనా?’
‘మరి? 1. “రేపటి నుంచీ” అన్నది ఇందాక… ఇప్పుడు రాత్రి పన్నెండు దాటింది…కాబట్టి ఇప్పుడు “ఇవాళ్టి నుంచీ” అన్నది కరెక్టు…రెండు. ఇందాక తగులాట కరెక్టు కాదు తగువులొద్దు అనాలి అన్నారు. నన్ను నేను సరిదిద్దుకుని తగువులొద్దండీ అన్నాను… ఇప్పుడు తేల్చండి… ప్రతీ విషయాన్నీ లాగీ పీకీ…తగువు పెట్టుకునేది మీరా నేనా?’
‘చూసేవా! మళ్ళీ మాట తప్పేవు!’
‘నేనా?’
‘అవును నువ్వే! ఇందాకేగా ఇవ్వాళ్టి నుంచీ తగువులొద్దండీ అన్నావు… మళ్ళీ… మొదలెట్టేవు!’

1 thought on “కంభంపాటి కథలు – సమయానికి తగువు మాటలాడెనే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *