March 4, 2024

చంద్రోదయం – 19

రచన: మన్నెం శారద

“ఇది జరిగి రెండేళ్ళు అవుతోంది. డిపార్టుమెంటు రూల్స్ ప్రకారం శేఖర్ ఆఫీసులో నాకు క్లర్క్ పోస్ట్ యివ్వటం, నేను జాయినవ్వటం మీకు తెలుసు. ఆ విషయంలో మీరు మాకనేక విధాలుగా సహాయం చేసి ఆదుకున్నారు. అయినా కూడా నేను మిమ్మల్ని నొప్పించి పంపేసేను. అప్పటి పరిస్థితులు, ఆవేశం అలాంటివి.
శేఖర్ నన్ను ఎంతో ఆదరణగా చూసేరు. ఆయనతో గడిపిన జీవితం చాలా చిన్నదయినా ఎంతో అపురూపమైనది. అంత మంచి వ్యక్తిని భర్తగా ప్రసాదించిన ఆ దేవుడే చూడలేక మమ్మల్ని విడదీసేడు”
ఆమె కళ్లలో కన్నీరు తొంగి చూస్తోంది.
“ఒంటరి ఆడది అందరికీ లోకువే. మంచి మనసుతో మీరు సాయం చేస్తున్నా, యిరుగు పొరుగు అనే మాటలు విని నాకు పిచ్చెక్కిపోయేది. అందుకే మిమ్మల్ని వెళ్లిపొమ్మని గట్టిగా చెప్పేను. మీరు వెళ్లిపోయేరు. జీవితం మీద విరక్తి పొందిన నేను అన్నీ వదులుకోవాలనుకున్నాను. కానీ నానీ నాకు బంధంగా మిగిలేడు. వాడికోసం ఆఫీసుకెళ్ళి వస్తున్నా, నేను చాలా నిర్లిప్తంగా, నిరాశగా వుండేదాన్ని. ఎవరితోనూ కలిసేదాన్ని కాదు.
సంతోషంగా వున్నపుడు కాలం గడిచినట్లుగా నిరాశలో నడవదు. ఆ తరుణంలో నాకు నానీయే లోకం అయ్యేడు. వాడి చుట్టూ ఆశలు అల్లుకొంటూ, వాడే ప్రపంచంగా బ్రతికేను. వాడికి చిన్న దెబ్బ తగిలినా, వాడి కళ్లలో నీళ్లు వచ్చినా చూడలేక విలవిలలాడేదాన్ని. అందుకే యిప్పటికి నానీని ఒక్క క్షణం చూడందే బ్రతుకలేననిపిస్తుంది.
ఆ రోజు మా ఆఫీసుకి ఓ కొత్త వ్యక్తి వచ్చి జాయినయ్యేడు. అతని పేరు మోహన్. అతను రాజమండ్రి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేడు. చాలా హుషారుగా నవ్విస్తూ, కబుర్లు చెబుతూ, చాలా కలివిడిగా వుండేవాడు. చాలా కొద్దిరోజుల్లోనే అతను ఆఫీసులో అందరి అభిమానం సంపాదించేడు. అతను ఒకరోజు ఆఫీసుకి రాకపొతే అందరూ అతన్ని గురించే మాట్లాడుకునేవాళ్లు.
నేను ఆఫీసులో నా పని నేను చేస్కుపోవటం తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అసలు మాట్లాడాలనే ఆసక్తి కూడా వుండేది కాదు. బ్రతుకుతెరువు కోసం ప్రాణాలు బిగబట్టి ఆ కొన్ని గంటలు ఆఫీసులో నిలబడేదాన్ని కానీ, నిజానికి నా ప్రాణం పనిపిల్లకి అప్పజెప్పిన నానీమీదే వుండేది.
మోహన్ వచ్చిన దగ్గరనుండి మా ఆఫీసు వాతావరణం మారిపోయింది. అతను వేసే జోక్స్‌కి అందరూ నవ్వేవారు. జడపదార్థంలా పడివున్న నాకు కూడా కాస్త చైతన్యం కలుగసాగింది. అతని మాటలకి నా పెదవులపై అప్పుడప్పుడూ చిరునవ్వు తొంగి చూసేది.
ఒకసారి అతను “స్వాతిగారికి నవ్వకూడదనే నియమం ఏమన్నా వుందా?” అన్నాడు.
నేను వెంటనే బిగుసుకుపోయి నా పని చూసుకోసాగేను.
నా కొలీగ్ జ్యోత్స్న వెంటనే అతనికి మెల్లగా ఏదో చెప్పింది.
అతను వెంటనే నాలిక్కరచుకుని “సారీ” అనడం నాకు వినిపించింది. అది కూదా నేను గమనించనట్లుగా వూరుకున్నాను.
ఆ రోజునుండి అతను నా పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోన్నట్లు నాకన్పించసాగింది.
ఆఫీసుకి రాగానే నాకు ప్రత్యేకంగా విష్ చేసేవాడు.
ఏదో ఒకతి తన గురించి చెబుతూ నవ్విస్తుండేవాడు.
అతనితో ఎక్కువగా మూవ్ కావటం నాకు యిష్టం లేదు. కానీ అతని మాటలు నాకు రాను రాను వినాలనిపించేది. టైము ఇట్టే గడిచిపోయేది. కొన్నాళ్లకి అతను, నేను, జ్యోత్స్న కలిసి లంచ్ టైములో టిఫిన్స్ మార్చుకుని తినే స్థాయికి వచ్చేం.
అతనికి చాలా విషయాలు తెలుసనే విషయం అతని మాటల్ని బట్టి తెలుస్తుండేది. సమకాలీన రాజకీయల గురించి, సినిమాల గురించి, యిలా ఎన్నో విషయాల గురించి చాలా తమాషాగా చెబుతున్నప్పటికీ, అతని పరిశీలనా దృష్టికి నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది.
ఇంటికి రాగానే తిరిగి ఎంతో వొంటరితనం.
నేను – నానీ! అంతే.
నానీకి మూడేళ్లు నిండేయి. చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు.
వాడి మాటలు వింటుంటే ఎంతో ఆనందం కల్గేది.
తండ్రిలేని వాణ్ణి చూస్తుంటే మరెంతో దిగులు కూడా కలిగేది.
శేఖర్ ఫోటో చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని.
అప్పుడప్పుడు మీరు గుర్తొచ్చేవారు. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పకపోగా, మిమ్మల్ని నొప్పించేనన్న విషయం జ్ఞాపకమొచ్చి చాలా బాధ కలిగేది.
మీరు రాసిన ప్రతి ఉత్తరం ఎంతో ప్రేమతో చదివేదాన్ని. ఈనాటికీ మీ లెటర్స్ నేను చింపకుండా బీరువాలో దాచేనంటే మీరు నమ్మలేరేమో. ఒంటరితనంలో అవే నాకు కొండంత ధైర్యాన్నిచ్చేవి. అయినా ఎందుకో మీకు జవాబు రాయాలంటే ఓ విధమైన జంకుగా వుండేది.
ఒకరోజు మోహన్ అనుకోకుందా యింటికి వచ్చేడు.
నేను కంగారుపడుతూ లేచి నిలబడ్డాను.
“మీ పర్మిషన్ లేకుండా వచ్చేను. మీరు ఏమీ అనుకోకూడదు. నన్ను కోప్పడకూడదు.” గుమ్మలో నిలబడి తన సహజమైన ధోరణిలో నవ్వుతూ అన్నాడు.
“అదేం లేదు. రండి!” అన్నాను పైకి నవ్వుతూ. నిజానికి అతనలా రావడం నాకిష్టం లేదు.
లోపల నాకు కాస్త కంగారుగానే వుంది. ఇన్నాళ్లుగా వుద్యోగం చేస్తున్నప్పటికీ నేనింతవరకూ ఆఫీసులో వాళ్లతో ఎక్కువగా పరిచయాలు పెట్టుకోలేదు. ఎవరికి యింటికి వచ్చేంత చనువు లేదు. నేను ఎవరింటికీ వెళ్లను. నాలోని ముభావాన్ని చూసి కాబోలు ఎవరూ అంతగా నాతో పరిచయం పెంచుకోవటానికి ప్రయత్నించలేదు.
నేను ఒంటరిదాన్ని. ఆడదాన్ని. భర్త లేనిదాన్ని. ఏది వచ్చినా, ఏం జరిగినా అది కేవలం నా మనస్థాపానికే దారి తీస్తుందని నాకు తెలుసు. నాలాంటివాళ్లమీద రాళ్ళు విసరడమంటే సంఘానికి ఆనందమని కూడా తెలుసు. అందుకే ఎవరూ యింటికి రావడం నాకు ఇష్టమనిపించదు.
“మీరదోలా వున్నారు!” అన్నాడతను లోపలికొస్తూ.
“అదేం లేదు కూర్చోండి” అన్నాను.
అతను కూర్చుని యిల్లంతా పరికించి చూస్తున్నాడు.
ఈ లోపున పనిపిల్లని కాస్త కాఫీ పెట్టమని, మళ్ళీ వచ్చి కూర్చున్నాను.
అతను నానీని ఎత్తుకుని కబుర్లు చెబుతున్నాడు. నానీ అతనికి విమానం ఎలా లేండయ్యేది. టాంకర్సు బాబుల వర్షం ఎలా కురిపించేదీ, సందర్భం లేకుండా చెప్పేస్తున్నాడు.
మోహన్ నానీ మాటలకు ఓ పక్క విస్తుపోతూ, మరో పక్క సరదాపడుతూ వింటున్నాడు.
అతని చూపు అకస్మాత్తుగా ఎదురుగా గోడకి వున్న శేఖర్ ఫోటోపై పడింది.
“మీవారా?” అని అడిగేడు.
“నాకు జ్యోత్స్న చెప్పింది” అన్నాడతను.
అతని మట్లని విన్నానే గానీ, నేను మాట్లాడలేదు.
పనిపిల్ల కాఫీ తెచ్చి యిచ్చింది. అతను కాఫీ త్రాగి నానీని తీసుకొని బయటకి వెళ్ళి మరో అరగంటలో తిరిగి వచ్చేడు.
నానీ చేతినిండా చాక్లెట్లతో, ఎయిరోప్లేన్ బొమ్మతో హుషారుగా వున్నాడు.
“అమ్మా! నువ్వొస్తావా? మేము విమానంలో అమెరికా వెళ్లిపోతున్నాం” అన్నాడు కళ్లు తిప్పుతూ.
నేను నానీవపు కోపంగా చూస్తూ “అలా అందరిదగ్గరా తీసుకోవచ్చా?” అన్నాను.
నానీ నావైపు బెదురుగా చూసేడు.
మోహన్ వారిస్తున్నట్లు అన్నాడు. “మీరలా భయపెట్టకండి. డిసిప్లిన్ పేరుతో పిల్లల్ని చెండాడం ఏమంత మంచి విషయం కాదు. వయసులో చాలా చిన్నవాళ్లు కాబట్టి వాళ్లు మన మీద తిరుగుబాటు చెయ్యలేరు. కానీ మనస్సులో చాలా చిన్నబుచ్చుకుంటారు. ఆ విధంగానే చాలామంది పిల్లల్ని మానసికంగా దూరం చేసుకుంటారు. పెద్దయ్యేక తల్లిదండ్రుల్ని ప్రేమించలేదని వూరికే వాపోతాంగానీ మన చేతలకది ఫలితం అనే విషయాన్ని మరచిపోతాం”
నేను అతనివైపు ఆశ్చర్యంగా చూసేను.
“ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. పసిపిల్లలు దైవ స్వరూపాలు. వాళ్లని అలరించి ఆనందించని జన్మ జన్మ కాదు. నాకు పిల్లలంటే వుండే యిష్టం కొద్దీ నేనే కొన్నాను. మీరేమైనా అనదలుచుకుంటే నన్ను అనండి.”బాధగా అన్నాడు మోహన్.
నేను కూడా అతణ్ణి నొప్పించినందుకు ఎంతగానో బాధపడ్డాను.
ఆ తర్వాత అతను తన గురించి ఎన్నో విషయాలు చెప్పేడు.
“నాకు తల్లి లేదు. తండ్రి వున్నా మా మధ్య మానసికంగా ఎంతో దూరం. ఆయన రెండో పెళ్ళి చేసుకున్నాడు. సహజంగా చొరవలేని నన్ను ఆయనంతగా పట్టించుకొనేవాడు కాదు. మా పిన్ని పిల్లలు ఎంతో స్వతంత్రంగా, స్వేచ్చగా ప్రవర్తించేవారు. ఏది కావాలన్నా, మా నాన్న దగ్గర మారాం చేసి తీసికొనేవారు. నేను అవసరమయింది కూడా అడగలేకపోయేవాణ్ణి. నన్ను నేనే వారందరికీ దూరంగా వుంచుకునేవాణ్ణి. అందరూ శెలవుల్లో యింటికి వెళ్లాలని వుత్సాహం చూపిస్తుంటే నాకు శెలవులొస్తున్నాయంటేనే భయంగా వుండేది. హాస్టలే యిల్లుగా భావించుకునేవాణ్ని. అయినా తప్పనిసరిగా వెళ్లాలి కాబట్టి వెళ్లి క్షణాలు లెక్కబెడుతూ శెలవులు గడపి తిరిగి హాస్టలు చేరేవాణ్ని.
ఇంతకూ మా పిన్ని గయ్యాలి కాదు. మా నాన్న దుర్మార్గుడు కాదు. తల్లి అనే మనిషి లేకపోవడం వల్ల నాలో నేను ఏర్పరచుకొన్న న్యూనతా భావం అది.
అందుకే తల్లిదండ్రులలో ఏ ఒక్కరి ప్రేమ అందకపోయినా అ అపిల్లలు దురదృష్టవంతులు. సాధ్యమైనంతవరకు పిల్లల్ని ఆ భావన కలగనీయకుండా పెంచడం ధర్మం. దయచేసి నేను కోరేది ఒకటే. నానీకి తండ్రి లేడనే బాధ కలగనీయకండి. సాధ్యమైనంతవరకు అతను ఉత్సాహంగా ఆనందంగా పెరిగే పరిస్థితులని కల్గించండి. జరిగిందే తలుచుకుకొంటూ కృంగిపోక, జీవితాన్ని బిజీగా, ఆనందమయంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక స్నేహితుడిగా యింతకంటే ఎక్కువగా చెప్పలేను.”
అతను చెప్పటం ఆపి నా వంక చూసేడు.
నేను మాట్లాడలేదు.
“నేను చెప్పినదాంట్ళో తప్పేమయినా వుందా?”
“అబ్బే! అదేం కాదు.” అన్నాను.
అతను వెళ్లి వస్తానని వీడ్కోలు తీసుకున్నాడు.
నానీ వుత్సాహంగా చెయి వూపి “టాటా” చెప్పేడు.
“అంకుల్! మళ్లీ వస్తారుగా” నానీ మాట్లకు అతను తలవూపి నావైపు చూశాడు.
నేను నవ్వి వూరుకున్నాను.

ఇంకా వుంది…

1 thought on “చంద్రోదయం – 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *