April 25, 2024

తాత్పర్యం – అమ్మ గది

రచన: రామా చంద్రమౌళి

ఏ వస్తువు విలువైనా ఆ వస్తువు లేనప్పుడే తెలుస్తుంది.
మనిషి విషయంకూడా అంతే..ఒక మనిషి మననుండి దూరమౌతున్నప్పుడు. పూర్తిగా ఎడమై కోల్పోతున్నప్పుడు.. చివరికి మనిషి శాశ్వతంగా నిష్క్రమించినప్పుడు.,
విలువలు ఎప్పుడూ సాపేక్షాలూ..సందర్భోచితాలూ..జీవితానుభవంతో మారే పాఠాలా?
మనుషులనుబట్టి..వాళ్ళ వయసులనూ,వాళ్ళ సామాజిక ప్రయోజకతనూ..ముఖ్యంగా ఆర్థిక నేపథ్యాన్ని బట్టీ,ఆ వ్యక్తితో ఎవరికైనా ఒనకూరే లాభాన్నిబట్టీ విలువలు ఎప్పటికప్పుడు మారుతూ..సంబంధిత వ్యక్తులను శాసిస్తుంటాయా.?
ఔను.
సరిగ్గా అంతేనేమో..సందర్భాన్ని బట్టీ..అవసరాన్నిబట్టీ..మున్ముందు ఆ వ్యక్తితో సిద్ధించబోయే ప్రయోజనాలనుబట్టే మానవ సంబంధాలన్నీ.,
అరవై ఐదేళ్ల రామచంద్రం ఆ గది కిటికీలోనుండి చూస్తున్నాడు..దిగంతాల్లోకి..శూన్యంలోకి..ఆకాశంలోకి.
అంతా కనబడ్తూనే ఏదీ కనబడ్డంలేదు.
తను అప్పుడు నిలబడ్డ ఆ గది..అమ్మ గది.
నాన్న చనిపోయిన తర్వాత..ఒంటరిగా మిగిలిపోయిన అమ్మను..ఆర్గురు అన్నదమ్ములు తాము..ముగ్గురు అక్కాచెల్లెళ్ళు..అందరూ కలిసి..అమ్మ పోషణను వంతులు వేసుకుని.,
ఎందుకో తెలియలేదు..కాని..రామచంద్రానికి అకస్మాత్తుగా సముద్రం ఒక తుఫానై తన్నుకొచ్చినట్టు దుఃఖం వరదై ముంచుకొచ్చింది.
అమ్మ ముఖం..దీనంగా..జాలిగా..నిస్సహాయంగా.,
అమ్మ చనిపోయి చాలా ఏళ్ళే అయ్యింది..పదేళ్లయిందేమో..కాని ..నిన్నమొన్ననే వెళ్ళిపోయినట్టు..జ్ఞాపకాలు..నిత్యనూతనంగా.,
విస్మరణ..నిరాదరణ..బాధ్యతా రాహిత్యం..చదువుకూ సంస్కారానికీ అస్సలే సంబంధంలేని నీచాతినీచమైన
ప్రవర్తన..కొడుకులమైన తామందరిదీ.
ఒంటరిగా నిలబడ్డ రామచంద్రం అప్రయత్నంగానే వెనక్కి తిరిగి ఆ గదినంతా చూపులతో తడిమాడు.
అమ్మ ఆ గదిలోనుండి వెళ్ళిపోయిన్నాటి నుండి..ఆ గది అలాగే ఉండిపోయింది. అదే డబుల్ కాట్ బెడ్..అవే పరుపులు..అదే సి ఎల్ ఎఫ్ బల్బ్..అదే ఫ్యాన్.అవే గోడలు..అవే పరదాలు..అదే బెడ్ ల్యాంప్. గాలినిండా అదే అమ్మ వాసన..కాదు కాదు అమ్మ పరిమళం..అమ్మ జ్ఞాపకం..అమ్మ అక్కడున్నట్టే ఏదో తెలియని పరితపన.
చివరికి ఆ ఇంట్లో మిగిలింది తామిద్దరే..తనూ..లక్ష్మి.పిల్లలెప్పుడన్నా వచ్చినప్పుడు ఆ గదిలో పడుకో మంటే..ఉహూ..నానమ్మ అందులోనే ఉండేది..చచ్చిపోయింది..మేం పడుకోం..భయం..
అమ్మ తన వంతుగా తన ఇంటికి వచ్చి ఆ గదిలో ఉన్నపుడు..తను పదిగంటలకు హడావిడిగా తయారై ఇక ఆఫీస్ కు వెళ్తూంటే “ఒరే పెద్దోడా..వచ్చేటప్పుడు ఈ మందు గోళీలు తీసుకురారా” అని తన గదిలోనుండి సన్నగా..బలహీనమైన గొంతుతో ప్రాధేయపూర్వకంగా అడిగేది.
ఏమిచేసాడు తను..ఏవగించుకున్నాడు..విసుక్కున్నాడు..”తెస్తాలేవే..ఎప్పూడూ మందులు మందులు..ఒక్క పూట మందుల్లేకుంటే చస్తవా..” అని పరుగు బయటకు.
మళ్ళీ ఎప్పుడో..ఏ రాత్రికో రాక.
భయం భయంగా అడిగేది.. ఏ పొద్దుబోయిన రాత్రో..”పెద్దోడా ఆ మందు గోళీలు తెచ్చావారా” అని.
జవాబు ఇచ్చేవాడే కాదు తను.దేహ భాషతోనే చెప్పేవాడు..’ తేలేదు..తెస్తాలేవే ‘..అని.అప్పుడు అమ్మ ముఖంలో ఎంత దిగులో..చాలా నిరాశగా మెల్లమెల్లగా నడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయేది అడుగులో అడుగేసుకుంటూ..గోడలను పట్టుకుని.
ఇన్నాళ్ళకు అమ్మ జ్ఞాపకమొస్తూ..గుండెల్లోనుండి ఏదో అగ్ని పర్వతం బద్దలౌతున్నట్టు..దుఃఖం..ఘోర అపరాధం జరిగిపోయింది..తప్పు..క్షమించరాని..క్షమించలేని తప్పు చేశాడు తను.
ఎప్పుడో ఒకరోజు..అమ్మ గదిలోకి..అమ్మ మంచం దగ్గరికి వెళ్ళి..ప్రక్కన కూర్చుని..ఓఐదు నిముషాలు మాట్లాడి..అదీ..అసహనంగా..మొక్కుబడిగా..లక్ష్మి ‘ తల్లి గదండీ..పాపం అప్పుడప్పుడు కొద్దిసేపు మాట్లాడండీ’ అని పదే పదే అరుస్తే..బలవంతంగా.,
“నాకీ మందులూ అవేవీ వద్దురా పెద్దోడా..ప్రతిరోజూ..ఒక్క అరగంట నాతో కడుపునిండా మాట్లాడు నాయనా.. చాలునాకది.నా అన్ని రోగాలూ నయమైపోతై..”అనేది..ప్రాధేయపడ్తూ.ఉహూ..అర్థంకాలే అప్పుడు..అమ్మ యొక్క ప్రేమనిండిన అతి సహజాతిసహజమైన చిరుకోరిక వెనుకున్న తల్లి హృదయం అర్థంకాలేదు.
వ్యావహారికమైన మిథ్యా ప్రపంచ లాలసలో కొట్టుకుపోతున్న ఆ అజ్ఞాన స్థితిలో అర్థంకాలేదు..కళ్ళకు పొరలు.,
ఇంతమంది పిల్లలని ఒక్కతే పెంచి పెద్దచేసి..చదివించి..పెళ్ళిళ్ళు చేసి..ఎక్కడివాళ్లక్కడ స్థిరపడేట్టు తనవంతు పాత్రను తను పోషించి.,
వృద్ధాప్యం..భర్తను కోల్పోయిన నిస్సహాయత.ఒంటరి ఏకాకితనం..అదుపుతప్పి ఎవరో ఒకరి చేయూతను అనివార్యం చేసే శారీరక దుస్థితి.డిపెండెన్సీ.
నాన్న పోయేక ..దశదిన ఖర్మ తర్వాత..ఆ వేసవి మధ్యాహ్నం..” అమ్మ సంగతి ఏం చేద్దాం పెద్దన్నా..పెద్దక్కా” అని మిగతావాళ్లందరు ప్రశ్నించినపుడు.,
మౌనం వహించాడు తను..ఇంత చదువుకున్నవాడు..అన్నీ తెలిసినవాడు..ఎన్నో పుస్తకాలను చదివి లోకజ్ఞానాన్ని సముపార్జించినవాడు..విజ్ఞుడు.
మాట్లాడవలసినప్పుడు మాట్లాడకపోవడం నేరం..మౌనం ఒక యుద్ధనేరం..నేరం చేశాడు తను..తీరని ద్రోహం అమ్మకు.
అక్క చెప్పింది..”ఆర్గురు కొడుకులు కదరా..ఒక్కొక్కరి ఇంట్లో రెండు నెలల చొప్పున ..ఏడాది..సరిగ్గా సరిపోతుంది లెఖ్ఖ”
మనిషిని..అమ్మను..వంతులు వేసుకుని భారాన్ని పంచుకోవడం.
అప్పుడు అమ్మ ముఖాన్ని చూశాడు తను..మల్లె పందిరికింద..నేలమీదనే..నిరామయంగా కూర్చుని..నేలదిక్కు చూస్తూ,
ఆ తతంగాన్నంతా వింటుందో..వినడంలేదో..తెలియని..భావశూన్యమైన ముఖం..ఇంకా జ్ఞాపకమే.
ఇప్పుడు ఆ ముఖం జ్ఞాపకమొస్తే..తనపై తనకే అసహ్యం..సిగ్గు..భయం..అన్నీ కలగలిసి..ఒక భ్రష్టానుభూతి.
ఇక మొదలైంది..అమ్మ పంపకాల ప్రయాణం..ఒక సుదీర్ఘ జీవితకాల అమ్మయొక్క సకల సంపదలన్నీ..అప్పుడు..ఒక సూట్ కేస్ గా మారి..అంతే.అమ్మ ఎవరింటికి వెళ్ళినా..ఆ ఒక్క సూట్ కేస్ తోనే.అసలు అమ్మలోని జీవకళ ఎప్పుడో చచ్చిపోయింది..ఒట్టి ప్రాణమున్న శవం ఆమె.
ఐదోసారో..ఆరవసారో..తన వంతుకు అమ్మ వచ్చినప్పుడు..అన్నాడు తను..”అమ్మా ఇక నువ్వు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండవే..ఎవరింటికీ వెళ్ళొద్దిక..”అని.సిగ్గనిపించిన విషయమేమిటంటే..ఆ మాటను తను తానుగా అనలేదు..లక్ష్మి అనమంటే అన్నాడు.స్వంత వ్యక్తిత్వమే లేదు.అమ్మ గురించిన స్పృహ..బాధ్యత..ఉహూ..అస్సలే లేదు తనకు.
ఎందుకు..ఎందుకలా జరిగింది..వ్చ్.
అమ్మ ఒకసారి అమ్మగదికి అటాచ్ ఐ ఉన్న బాత్ రూం లో స్నానంచేసి..తనగదిలో తుడుచుకుంటూ..చేతకాక అలా మంచంపట్టెపై కూర్చుండి పోయింది..ఒంటిపై సరిగా బట్టలు చుట్టుకోకుండా. అప్పుడే ఎవరో వచ్చారు..అటు కిటికీప్రక్కనుండి.
లక్ష్మి అంది..అసహనంగా..”ఒంటిపై బట్టలు కట్టుకోవచ్చుగదా..ఎవరైనా చూస్తే…” ఇంకేదో గొణుక్కుంటూ.,
అమ్మ చాలా నిస్సహాయమైన దీనతతో అంది..” ఏమున్నది బిడ్డా..ఇంకా నాదగ్గర ఎవరైనా చూడ్డానికి..చాతనైతలేదు..ఏంజేయన్నేను..” అని.
వినబడిందామాట..ఏదో ఫైల్ పై రాసుకుంటున్నతనకు..ఎవరో కడుపులో చేయిపెట్టి దేవుతున్నట్టు..క్షోభ.ముడుచుకుపోయి..సిగ్గుతో చచ్చిపోయి..ఒట్టి బోలు మనిషిగా మిగిలి.,
తర్వాత ఆఫీస్ కు వెళ్ళే ముందు..భయం భయంగా..సిగ్గు సిగ్గుగా..ఉత్సుకతతో..అమ్మ గదిలోకి చూస్తే.,
అప్పుడు అమ్మ..మంచం పట్టెమీద అలా ఒక వికృత విగ్రహంలా కూర్చుని..ఒంటిపైనున్న పాత చీర జారిపోతున్నా..పట్టించుకోకుండా..అప్పటికే శరీరంనిండా వ్యాపిస్తున్న చర్మ వ్యాధికి సంబంధించినసోర్వెటే ట్యూబ్ నుండి జెల్ ను పూసుకుంటోంది..తెల్లని జుట్టు విరబోసుకుని..ముఖంనిండా ఒట్టి శూన్యతతో..పిచ్చిదానివలె.,
ముద్రించుకుపోయింది..అమ్మయొక్కఆ భంగిమ..ఆ రూపం..ఆ నిరామయమైన చూపు.

* * *

ఉలిక్కి పడ్డాడు రామచంద్రం..అలికిడయ్యింది..అమ్మగదికి అటాచ్ ఐఉన్న బాత్ రూం లోనుండి.
లక్ష్మి స్నానం ముగించుకుని వస్తోందా.?
“వయసు మళ్ళినవాళ్ళు..స్నానం చేసేప్పుడు బాత్ రూం లోపలినుండి గడియ పెట్టుకోకుండా ఉండడం మంచిది..ఎందుకంటే..” అని డాక్టర్ ఆమధ్య చెప్పిన విషయం జ్ఞాపకమొచ్చి.,
లక్ష్మి..స్నానం చేస్తున్నప్పుడు..తనే వ్యక్తిగతంగా..బాత్రూం బయట నిలబడి లోపలి ఆమె కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ..వింటూ.,
లక్ష్మి వస్తోంది బయటకు,
రామచంద్రం గబగబా కిటికీ దగ్గరినుండి తప్పుకుని..హాల్లోకొచ్చి..ఏదో పేపర్ చదువుకుంటున్నట్టు..నటిస్తూ,
లక్ష్మికి గత రెండునెలలుగా..అదో రకమైన మానసిక రుగ్మత..డిప్రెషన్..అకస్మాత్తుగా..బ్రేక్ డౌన్.. అప్పుడప్పుడుతీగలోనుండి కరంటుచటుక్కున మాయమైనట్టు..వెంటనే చేష్టలుడిగి..చూపులు నిలిచిపోయి..కళ్ళు శూన్యాలై..పిచ్చిదానిలా.,
ఒకప్పటి అమ్మవలె.
డాక్టర్లు..’ డిమెన్షియా ‘ అన్నారు.అంటే..మరుపూ..జ్ఞాపకం తెగి అతుకుతూ..అస్తవ్యతమౌతున్న మానసిక సున్నిత స్థితి.
కొద్దిరోజుల క్రితమే లక్ష్మి అంది..” నేను ఈరోజునుండి అమ్మ గదిలో పడుకుంటానండీ” అని.
“ఎందుకు..మన బెడ్ రూం ఉందికదా”
“ఊర్కే..నాకు ఎందుకో అక్కడే ప్రశాంతంగా…”
ఎందుకుకలిగిందిలక్ష్మికిఈవింతకోరిక..వ్చ్..ఏమో..తెలియదు.
తను ఎటో బజారుకు వెళ్ళొచ్చేసరికే తను తన బట్టలను తీసుకుని అమ్మ గదిలోకి మారిపోయింది లక్ష్మి.
ఇక బలవంతపెట్టలేదు రామచంద్రం..అప్పటినుండీ..లక్ష్మి అమ్మ గదిలోనే..ఒంటరిగా.
గదిలోపలికి తొంగి చూశాడు రామచంద్రం..అలికిడి కాకుండా..మెల్లగా.
మంచం పట్టెపై కూర్చుని..ఒంటిపైనుండి జారిపోతున్న కాటన్ చీరను పట్టించుకోకుండా..తెల్లని జుట్టు..విరబోసుకుని..చింపిరి చింపిరిగా..పిచ్చిదానివలె,
అమ్మకు వచ్చినదే..అదే చర్మ వ్యాధి..అదేసోర్వెటే ట్యూబ్ ను..నొక్కి..జెల్ ను..పాదాలకూ..పిక్కలకూ రాసుకుంటోంది.
అమ్మ..అమ్మ..ఆనాటి అమ్మ..అమ్మగదిలో..ఇప్పుడు లక్ష్మి..మళ్ళీ అదే రూపం..అదే స్థితి..అదే దృశ్యం..అదే అమ్మ.
ఎందుకో రామచంద్రానికి పట్టరాని దుఃఖం ముంచుకొచ్చి..ముఖాన్ని చేతుల్లో దాచుకుని..ఎక్కెక్కిపడి ఏడుస్తూ,
అమ్మ..లక్ష్మి..ఒక అస్తమయం..తర్వాత మరో అస్తమయం.
ఎప్పుడూ ఉదయాలగురించే ఆలోచించే మనిషి ప్రతినిత్యం హెచ్చరించే అస్తమయాన్ని గురించి ఎందుకు ఆలోచించడో.,
అమ్మగదిలో..ఒక అస్తమిస్తున్న సూర్యుడు..మెల్ల మెల్లగా-

1 thought on “తాత్పర్యం – అమ్మ గది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *