January 31, 2023

దేవీ భాగవతము 3

రెండవ స్కంధము ఆరవ కథ

ఉపరిచర వసువు
ఉపరిచర వసువు ఛేది దేశమును పాలించేవాడు. నిష్ఠాగరిష్ఠుడు. సత్యవ్రతుడు, ధర్మ ప్రభువు. అతనికి నలుగురు కుమారులు గలరు. వారిని వివిధ రాజ్యములకు రాజులుగా నియమించాడు వసువు.
రాజుభార్య గిరిక. గొప్ప సౌందర్యవతి. ఒకసారి ఆమె ఋతుమతి అయిఉండగా రాజు పిత్రాజ్ఞచే వేటకు వెళ్ళవలసి వచ్చెను. భార్యయందు అనురక్తుడైన రాజుకు వీర్యస్ఖలనమయ్యెను. రాజు ఆ వీర్యమును ఒక వటపత్రము నందు భద్రపరచి దగ్గరలో ఉన్న ఒక గ్రద్దకు యిచ్చి భార్యకు ఇచ్చి రమ్మనెను. ఆ గ్రద్ద ముక్కున కరచుకొని ఆకాశమార్గమున పోవుచుండగా వేరొక గ్రద్ద మాంసఖండమని తలచి దానితో తలపడెను. వాటి కొట్లాటలో ఆ వీర్యము క్రిందనున్న జలమునందు పడిపోయెను. అది యమునా నది. అద్రిక యను అపర్సర స్నానమాచరించుచు నదిలో యోగాభ్యాసము చేయుచున్న ఒక బ్రాహ్మణోత్తముని పాదములకు తగిలెను. అతడు ఆమెను చేపగా కమ్ము అని శాపమొసగెను. ఆమె ఆ జలములలోనే చేపగా మారి ఉండెను. అదే సమయమున డేగ ముక్కు నుంచి పడిన వీర్యము చేప మ్రింగెను. అది గర్భము ధరించెను. ధీదరుడను మత్స్యకారుడు దానిని పట్టి కడుపును చీల్చుటకు సన్నద్ధుడయ్యెను.
అంతలో ఆ చేప కడుపు చీల్చుకొనిన ఒక బాలిక, ఒక బాలుడు వచ్చిరి.
అతడు వారిని రాజునకు అప్పగించెను. రాజు బాలుని తన దగ్గర ఉంచుకొని మత్స్యుడు అని నామమొసగెను.
ఆ బాలికను ఆ మత్స్యకారునకే యిచ్చి పెంచుకోమనెను. ఆమెకు మత్స్యోదరి, కాళి అని పేర్లు గలవు. ఆమె దేహమునుండి చేప వాసన వచ్చుచుండెను. అందుకని ఆమెను ‘మత్స్యగంధి’ అని కూడా పిలవసాగిరి.
అప్సర తన శరీరమునుండి యిరువురు శిశువులు జన్మించగానే శాపవిమోచన చెంది తిరిగి స్వర్గమునకు వెళ్ళిపోయెను. పరాశరుడను గొప్ప మహర్షి తీర్థయాత్రలు చేయుచూ యమునానది దాటవలసి వచ్చెను. మత్స్యగంథి తండ్రి ఆజ్ఞతో మహర్షిని ఆవలి ఒడ్డుకు చేర్చుటకు పడవ అంగీకరించి వెళ్ళసాగెను.
దైవవశమును ముని ఆమెను చూచుట జరిగి కామవాసన అతనిలో కలిగెను. ముని వెంటనే ఆమె దక్షిణ హస్తమును పట్టుకొనెను.
బ్రాహ్మణోత్తమా మేము మత్స్యకారులము. అదియు కాక మీరు ధర్మాచార పరాయణులు. నానుండి చేపల వాసన వచ్చుచున్నది. సద్గుణ సంపన్నులు మీరు అని అనగా అతడు ఆమె దేహమును కస్తూరి వాసన వచ్చునట్లు చేసెను. అది పగటి సమయమగుటచే ఆమె కామక్రీడకు ఒప్పుకొనలేదు. పరాశరుడు వెంటనే ఆ ప్రదేశమంతయు మంచుచే కప్పబడిన ప్రదేశముగా మార్చివేసెను. తీరమంతా అంధకారమయ్యెను.
మహాత్మా, నా కన్యావ్రతము భంగము కాకుండా నా తల్లిదండ్రులకు ఈ విషయము ఎరుగకుండా చేయమని ఆమె అర్థించెను. నీతో సమానమైన పుత్రుడు నాకు కావలెను. నా ఈ సుగంధము ఎల్లకాలము ఉండాలని ఆమె కోరెను.
సుందరీ నీకు పుట్టబోయే కుమారుడు విష్ణువు యొక్క అంశ అగును. గొప్ప పేరు, కీర్తిని గడిరచును. నాకు నీపై కోరిక కల్గుటకు అవశ్యము ఏదో దేవకార్య రహస్యము గలదు. కావున నీవు భయపడవలదు. నీ కోరిక తీరగలదు. నీ పుత్రుడు పురాణములను రచించును. వేదముల నెరిగెడి వాడగును. యశోవంతుడగునని పలికి ఆ యోజనగంధితో గడిపి, ఆ మహర్షి వెడలిపోయెను. ఆమె గర్భవతి అయ్యి యమునా ద్వీపమునందునే పుత్రుని గనెను. కామదేవుని వలె మిక్కిలి అందముగా ఉండెను. పుట్టగానే ఆ బాలుడు తేజోవంతుడై పెద్దవాడయ్యెను. తల్లీ నేను తపమాచరించుటకు వెళ్ళెదని. నీ యిచ్ఛ వచ్చినపుడు నన్ను స్మరించగానే నేను వత్తును అని తల్లికి నమస్కరించి వెడలి పోయెను. అతడే వ్యాసమహర్షి. యమునా ద్వీపమున జన్మించుటచే ‘‘ద్వైపాయనుడను’’ నామము కల్గెను. కలికాలము ప్రవేశించుటచే, అనేక కాలాంతర ప్రభావముల వలన ప్రజలు అజ్ఞానులగుటచే వారికొరకు నాలుగు వేదములను విభజించెను. అనేక పురాణములు రచించెను. శ్రుతులు, స్మృతులను రచించెను. అందుచే వేదవ్యాసుడయ్యెను. సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, అసిరుడు, దేవలుడు, తన పుత్రుడైన శుకుడు అతని శిష్యులు. వ్యాసుని తల్లి సత్యవతి. వ్యాసుని జన్మవృత్తాంతమున ఏ సందేహము లేదు.
మహా పురుషుల చరిత్రలను విమర్శించరాదు. వారి ఆచరణలన్నిటిని ఆచరించరాదు. పరాశరుడు ధర్మమెరిగిన వాడు. వ్యాసుని జన్మ ఆవశ్యకము. ఇదే ఈ కార్యమందు రహస్యము. ఈ కథ వినువారికి ఎప్పటికీ ఏ దుర్గతి రాదు. విన్నవారు సర్వదా సుఖముగా నుందురు.

*****

ప్రధమ స్కంధము ఏడవ కథ

శుకమహర్షి
సత్యవతీ నందనుడు, సకల వేదపారంగతుడైన శ్రీ వ్యాసమునీంద్రుడు కూడా యోగమాయ ప్రభావమును తప్పించుకొనలేక పోయెను. ఆ మహామాయ నుండి ఎవ్వరునూ తప్పించుకోలేరు.
ఒకసారి వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున నివసించియుండగా ఘృతాచి అను పేరుగల ఒక అప్సరస ఆ వనములో విహారము చేయుట చూసి, అతనికి ఆమె యందు కోరిక కలిగెను. ఘృతాచి ఆ మునిని చూసి భయపడి ఒక శుకరూపమున మారి ఆకాశమున కెగురుచుండగా వ్యాసుడు కామ వికారము పొందెను. ఆ సమయమున వ్యాసుడు అగ్నిని రగుల్చు ఉద్దేశముతో ఒక కర్రను మధించుచుండెను. హఠాత్తుగా ఆ అప్సరమీద కలిగిన కామమునకు ఆయన వీర్యము ఆ కర్రపై పడెను. అందునుండి ఒక అద్భుతమైన బాలకుడు ఉద్భవించెను. దివ్యమైన తేజస్సుతో ఆ బాలుడు మెరయుచుండెను. యజ్ఞము నందు హవిస్సు పడిన అగ్ని జ్వలించునట్లు ఆ బాలుడు వెలుగుచుండెను. వ్యాసుని ఆశ్చర్యమునకు హద్దు లేకుండెను. ఏది ఏమైనను అది శంకరుని వరప్రసాదమని నమ్మి, అగ్ని వలె వెలుగుచున్న ఆ బాలుడికి గంగ యందు స్నానము చేయించెను. తాపసులు నింగినుండి పుష్పవర్షము కురిపించిరి. అప్సర శుకరూపములోవుండుట చూచి తాను కోరుకొనుటచే పుత్రుడు జన్మించుట వలన వ్యాసుడతనికి ‘శుకుడు’ అని నామమొసగెను.
వివిధ జాతకర్మాది సంస్కారముల జేసెను. నారద, తుంబురులు, విద్యాధరులు ఆ బాలుని స్తుతించి గానము చేసిరి. ఆతడు ధరించుటకు దండము, కృషమృగ చర్మము, దివ్యమైన కమండలము ఆకసము నుండే వచ్చెను.
సకల వేద పారంగతుడైన వ్యాసమహర్షి శుకుడు యుక్తవయస్కుడగుట తోడనే ఉపనయనము చేసెను. సకల విద్యలు అభ్యసింపజేసెను. శుకుడు బృహస్పతిని విద్యాగురువుగా చేసికొనెను.
సకల వేదములు, రహస్యములు, ధర్మశాసనములు చక్కగా అభ్యసించెను. గురుదక్షిణలొసగెను.
అనంతరము గృహస్థాశ్రమమును స్వీకరించవలసినదిగా పుత్రుని కోరగా శుకుడు సంసార బంధనములకు లొంగి జీవితమును వ్యర్ధము చేయబోనని భార్యా పుత్రుల సంకెళ్ళలో బంధింపబడిన వానికి ముక్తి లేదని చెప్పెను. అంత వ్యాసుడు జనకమహారాజు రాజ్యభోగములన్నీ అనుభవిస్తున్నను గొప్ప జ్ఞాని అయ్యెనని, అతని వద్దకు వెళ్ళి, జ్ఞానము పొంది రమ్మని ఆదేశించగా, విదేహనగరమునకు పయనమయ్యెను.
ఆ రాజ్యమున అతనికి అనేక భోగములను సేవలను చేయుటకు రాజు ఎందరో స్త్రీలను నియమించెను. కాని విరాగి అయిన శుకుడు ఏ మాత్రము చలించక స్థాణువు వలె నుండెను. ధ్యానమగ్నుడై ఉండెను.
జనక మహారాజు శుక మహామునిని దర్శించుటకు గురువులతో కలిసి వెళ్ళెను. సముచితమైన సేవలు చేసెను. నియమప్రకారము శుకుడు ఆ సేవలను స్వీకరించెను. తదుపరి తన మనసులో నున్న సందేహములను ప్రశ్నల ద్వారా జనకుని అడిగెను.
ఎంతో సహనముతో జనకుడు ప్రతి వ్యక్తికి గృహస్థాశ్రమము బంధము కాదు. బ్రాహ్మణుడు తప్పక నాలుగు ఆశ్రమములను ఒక బాధ్యతా యుక్తముగా చేయవలయునని బ్రహ్మచర్యము ఉపనయనము ద్వారా అనుభవించి, గురువుల వద్ద వేద విద్యా రహస్య జ్ఞానములను అభ్యసించి తదుపరి వివాహము చేసుకుని, సంతానమును గని, వారికి తన భార్యను, వృద్ధురాలైన పిమ్మట అప్పగించి తాము వానప్రస్థాశ్రమమును తీసుకొనవలెనని, ఎన్నో రాజ్యభోగముల ననుభవించుచున్నను వాటికి కట్టుబడకుండా ఉందునని, ఆ బంధములకు తాను అతీతుడనని అనేకవిధములుగా శుకమహర్షికి బోధించగా, శుకుడు మహారాజు మాటల అంతరార్థమున గ్రహించి తిరిగి తన తండ్రి వ్యాసుల వద్దకు చేరెను.
వివేకి అయిన పురుషుడు విద్య, అవిద్యలందు భేదమును గ్రహించి, జ్ఞానము పొందవలెనని ఆలోచించెను. సకలశాస్త్రములను గ్రహించిన వాడై శాంతి ననుభవించెను. తండ్రి ఆజ్ఞచే పీవరి అను చక్కని కన్యను వివాహమాడి కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవశృతుడు అను కుమారులను, కీర్తి యను నామము గల కన్యకు జన్మనిచ్చెను.
అణూహుడను బుద్ధిశాలితో ఆమె వివాహముచేసెను. వారి పుత్రుడు బ్రహ్మదత్తుడు. నారదుడతనికి గురువు. పిమ్మట తండ్రిని విడిచి శుకుడు కైలాస పర్వత శిఖరమును చేరెను. అతడు సమాధి యందు వెళ్ళిపోయెను. సిద్ధి గల్గుట తోడనే ఆసనముతోనే ఆతడు పైకిలేచి ఆకాశమందు వెల్గు సూర్యుని వలె ప్రకాశించెను. వ్యాసుడు శుకదేవుని గూర్చి చింతించగా శంకరుడాతనికి శుకదేవుడు నీడవలె వ్యాసునకు ఉండునని బోధించెను. ఉత్తమ గతిపొందిన నీ పుత్రుని దర్శించుచూ నీవు తృప్తిపొందుమని శంకరుడు అంతర్థానమయ్యెను. ఇదీశుక మహాముని వృత్తాంతము.

2 thoughts on “దేవీ భాగవతము 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *