February 21, 2024

ప్రగతి (బి) భిక్ష

రచన: అఖిల దొడ్డపనేని

మనోహరమైన సుందర దృశ్యం!
విమానం కిటికీలోనుండి చూస్తున్న నా మనసు పులకలకు గురైంది.
చూస్తున్నంతసేపు నీలి పరదాలు కప్పుకున్న తనివి తీరనన్ని కొండల బారులు! వాటినంటి పెట్టుకున్న దట్టమైన చెట్టూ చేమా.
ఇంతకంటే సుందర దృశ్యాలు ఎన్నిటినో చూసాను కాని ఇవ్వన్ని నావి. ఈ నేల, నింగి, మబ్బులు, గాలి సర్వం నా సొంతం. ఏ నిమిషమైనా నేను చూడొచ్చు, అక్కడ తిరగొచ్చు. అన్నీ కుదిరితే సొంతం కూడా చేసుకోవచ్చు.
ఇది మనది, మన దేశమనుకుంటే ఎంత రిలీఫ్ గా ఉందో ! కళ్ళు చెమ్మగిల్లినాయి.
రూట్ మ్యాప్ నిజామాబాద్ ని చూపెడుతుంది! వావ్ గ్రేట్. చాలాసార్లు ఇండియా వచ్చి వెడుతున్నా కాని ఇక వెళ్ళను, నేనుండబోయేది ఇక్కడేననుకుంటుంటే గొప్ప థ్రిల్లింగ్ గా ఉంది.
చిన్నపిల్లలా చప్పట్టు కొడుతూ లబ్ డబ్ మంటూ సందడి చేస్తుంది హృదయం.
చల్లని అరుణబింబం కొండల వెనుక నుండి కనువిందు చేస్తూ దబదబా పైపైకి వస్తున్నాడు. ఇనబింబాన్ని చూస్తుంటే సూర్య నమస్కారాలు చేస్తున్న నాన్నగుర్తుకొచ్చాడు. ఆ పక్కనే నాన్నలాగానే సూర్యదేవుడికి నమస్కారాలు చేస్తూ చిన్నారి పంచాక్షరి ప్రత్యక్షమై నా తలపులలో నిండిపోయింది.

***

స్నానం చేసిన నాన్న మెులకు చుట్టుకున్న తడిఅంగవస్త్రం మీదే సూర్యనారాయణుడికి కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటున్నాడు.
మనకేమన్నా కోరికలుంటే స్నానం చేసి శుద్ధిగా మనసారా ఆయనను అడిగితే ఇస్తాడట. నా కెప్పుడన్నా కోరికలుంటే ఆయన్నే అడుగుతాను, మిగతా దేవుళ్ళంటే కూడా భక్తేలెండి.
ఈ రోజు నాన్న ఏమి అడగబోతున్నాడో నాకు తెలుసు.
అందుకే కళ్ళు మూసుకుని రెండుచేతులు జోడించి సూర్యుణ్ణి అడిగాను –
“దేవుడా! దేవుడా! ఈ రోజు నాన్న కోరిక తీరకూడదు. రేపు గుండారం గుట్టల తండా నుంచి మా భానుమతి కూతురు తిరిగి రావద్దు. రావద్దు గాక రావద్దు.
కిషన్ నాయక్ దాని తల అస్థికలను తెచ్చి “దొరా! దుడ్డుని చిరుత గుంజుకెల్లిందని చెప్పాలి. చెప్పిస్తావు కదా!” లోలోపల చెప్పుకున్నా పెదాల కదలికలతో.
పైకి అంటే వామ్మో ! నా వీపు విమానం మోత మోగదూ!
“ఏమి చిన్న దొరసాని నాయనలెక్క నువ్వు సుగ దండాలు బెడుతున్నావ్ సూర్యుడుకి, జరజెప్పు ఇంతకి ఏమని మెుక్కినావ్?” అంది నర్సవ్వ గంప దింపుకుని ముడుకుల మీద కూర్చుంటు. వాళ్ళ చేలో పండిన లేత తాజా ఆకుకూరలు, కూరగాయల్ని రోజు పొద్దున్నే మనకు ఇంటివద్దకే తెచ్చి ఇస్తుంది.
చెవులకు ముత్యాలు ముద్దలు కట్టినట్టు గువ్వగున్నాలు, మీదిపుల్లలు, గంటీలు, రాళ్ల కమ్మలు, మెడలో బంగారు గుళ్ళు, వెండి దండ కడియాలు, ఒకోచేతికి నాలుగేసిపెద్ద పెద్ద వెండిగాజులు, కాళ్ళకుబరువైన వెండి కడియాలు, జిగిబిగి అల్లికలతో వ్రేలాడే పట్టా గొలుసులతో నా కళ్ళకెంతో అబ్బురంగా కన్పడుతుంది.
ఒకరోజ అమ్మఅంటుంది నాన్నతో “అమాయకపు నర్సవ్వ! మంచితనం, బోళాతనం కలగలిసిన సత్తెకాలపు మనిషి. నేను చేతిలో పెట్టినంత తీసుకుంటుంది ఇదేమని అడగదు. మెత్తానికి ఈ దేశపు మనుష్యుల్లో కుచ్చితపు బుద్ధి కన్పడదు. ”
“నిజమే! మరే మెుగవాళ్ళతో సమానంగా పొలంపనులు చేస్తారు రోజు ఇంట్లో చేసే ఆడపన్లకు తోడు అదనంగా.” నాన్నకూడా ఒప్పుకున్నాడు.
నర్సవ్వ వాళ్ళకు ఇరవై ఎకరాల భూమి ఉంది. పదిహేనెకరాలు మెట్టభూమి మిగతా ఐదెకరాలు మోటబావి క్రింద సాగులో ఉంది. మూడెకరాల్లో వరి వేసి మిగతా రెండెకరాలలో సంవత్సరం పొడవునా ఆకుకూరలు – కూరగాయలు పండిస్తారు.
పొద్దున్నే గంప ఎత్తుకుని కూరగాయలు అమ్మి ఇంటికెళ్ళి ఇంత తిని పొలం వెడుతుంది నర్సవ్వ. పొలంలో గుడిసె వుందిట దాని ప్రక్కనే వేపచెట్టు. “అలసిన ప్రాణానికి పలంగు లేంటికి, కొంగుపర్చుకుని యాపచెట్టు క్రిద పండితే పానం ఎటుబోవునో ” అంటుంది నవ్వుతూ.
ముందుగా గంప అమ్మదగ్గర దింపి తరువాత వేరే ఇళ్ళకు వెళ్ళేది.
అమ్మేమి తన ఋణం ఉంచుకోదు. పండుమిర్చి, గోంగూర, వంకాయలు, టమాటోలు పచ్చళ్ళ కోసం తెచ్చిచ్చినప్పుడు గిన్నెడుగిన్నెడు పచ్చడి ఇచ్చేది డబ్బులకు తోడుగా.
“మీ ఆంధ్రోళ్ళ పచ్చళ్ళు లావు కమ్మగుంటాయి దొరసాని” అని కితాబిచ్చేది నవ్వుతూ అమ్మకు.
కాస్త పెద్దయిన తరువాత నాకు కొన్నిసందేహాలు కలిగాయి. తిప్పి తిప్పి కొడితే మాకు మూడెకరాల పొలంకూడా లేదు. అమ్మకు మెళ్ళో మంగళ సూత్రాలు, చెవులకు నీరుపట్టిన తెల్ల తొమ్మిదిరాళ్ళ పోగులు తప్పితే ఇంట్లో చిన్నమెత్తు బంగారం లేదు.
అలాంటిది వంద తులాల బంగారం, వెండి వున్న నర్సవ్వ మా అమ్మని దొరసానని నాన్నను దొరాని పిలుస్తుందెందుకు? చాన్నాళ్ళు నన్ను వేధించిన ప్రశ్న. ఈ విషయాలు అన్నీ అమ్మ నర్సవ్వ మాట్లాడుకుంటుంటే నే తెలుసుకున్నవి, అమ్మ నాన్నకు చెబుతుంటే విన్నవీనూ.
ఒకరోజు నాన్న దగ్గర నాకు సమాధానం దొరికింది. “అవును వృత్తిరీత్యా మనమూ వాళ్ళు వ్యవసాయదారులమే! మనల్ని వాళ్ళు అలా పిలవ్వలసిన అవసరం లేదు. స్వభావరీత్యా మంచి మనసున్న మనుషులు అందుకే మనల్ని అలా పిలుస్తున్నారు”
నిజమే! ఇప్పటికి నేను దానినే విశ్వసిస్తున్నాను. నాన్న మెున్నామధ్య దళ్ళు కట్టడానికి, పొయ్యిలో మంట పెట్టి వంట చేయడానికి కందికంప కోసం గుండారం వెళ్ళినప్పుడు పనిలో పనిగా గుట్టల తండా కెళ్ళి పాలి కిచ్చిన భానుమతి కూతురు ‘గంగ’ ను చూసొచ్చి “పడ్డ ఈనమోపుకొచ్చింది, మనుగులు జారాయి, ఇంకో వారం-పది రోజుల్లో ఈనుతుంది. ” ఎంత సంబరమో నాన్న మాటల్లో.
నా గుండెల్లోగూడ్సురైలు పరుగు మెుదలైంది. ఈ మధ్య ఇంట్లో తరచుగా వినపడుతుంది.
“పెళ్ళిచేస్తే ఒకింటికి వెళ్ళే ఆడపిల్ల చదివి ఏ ఊళ్ళేలాలి, అక్షరాల్ని గుర్తుపట్టి ఉత్తరం ముక్క చదవడం పాటి వస్తే చాలుకదా! పంచాక్షరిని స్కూల్ మాన్పించి గేదల్ని కాయమందాము ” తిరిగి నాన్న రాత్రి అమ్మతో అంటున్నాడు.
వీళ్ళకు తేరగా నేనే దొరికాను. అక్కతోపాటు నేను కూడా పుట్టి వుంటే నన్ను ఇలా గేదెలను కాయమని పంపుతారా? అక్క పెద్ద పిల్లయిందికదా, బయట తిరగడం మంచిది కాదు, పైగా తొందరలో పెళ్లి చేస్తారట.
అన్న కాలేజిలో ఇంటర్ తినుకుతున్నాడు. తను డిగ్రీ చదివి, బ్యాంకుఉద్యోగం తెచ్చుకుని మా పెళ్ళిళ్ళు చేసి అమ్మ- నాన్నలను సుఖపెట్టొద్దూ ? అందరూ కలలు కంటున్నారు తను పెద్ద కాలేజీ కెళ్ళడం కోసం.
తనకంటే ఎంతో చిన్నదాన్నయిన నన్ను చదువు మానిపించి బర్రిగొడ్లు కాయమంటారా ?
అసలు ఆ పని ఎవరు చేయాలి ? అబ్బాయిలేకదా! తన చదువు కోసం నేను నా చదువును త్యాగం చేయాలంట? మగపిల్లవాడిగా నన్నెందుకు పుట్టించలేదురా దేవుడా? గట్టిగా ఏడవాలని వుంది.
అందుకే నా మనసు బాగోలేక గంగ ఇంటికి రాకూడదు, గట్టిగా దాన్ని చంపేయమని సూర్యుణ్ణి కోరుతున్నాను.
ఇందులో నా తప్పువుందా? తప్పయినాసరే గంగ చచ్చిపోవాలి! నే బడికి పోవాలి.
చదువంటే నాకిష్టం. చదువుకుంటుంటే ఎంత బాగుంటుంది! ఆ చందమామలు, ప్రభ పత్రికలు చదువుతుంటే ఎన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
నిజామాబాద్ దాటి బయటికి ఎక్కడికి పోలేదు. జాగ్రఫీ చదివేప్పుడు సారు స్విర్జర్లాండ్లోని ఆల్ఫ్స పర్వత శ్రేణుల గురించి అలాగే హిమాలయాల గురించి చెబుతుంటే తనకి ఒక్కసారి వాటిని చూడాలని అనిపించింది. చదువుకుంటేనే కదా వీణా టీచర్లా తనూ ఉద్యోగం చేసేది, డబ్బొచ్చేది వాటితో తన కోరిక తీరేది?
గంగ చచ్చిపోవాలని అమ్మతో అంటే తిట్టింది. ఎవర్నన్నా ఉత్త పుణ్యానికి చచ్చిపొమ్మని శాపనార్ధాలు పెడితే మనం చచ్చిన తరువాత యములాళ్ళు కందిరీగలతో కుట్టించి, మూకుట్లో మసిలే నూనెలో గారెల్లా వేయించుతారట.
అయినా సరే, గంగ చనిపోవాలి తాను బడికి పోవాలి!
అందుకే లెంపలు వేసుకుంది సూర్యుడి ముందు గంగ చనిపోవాలని కోరుకుంటున్నందుకు తనని క్షమించమని.
రోజుకంటే ముందుగా పుస్తకాల సంచిమూసి పడకేసా ! రాత్రి ఎంత సేపయినా నిద్దర రాలేదు.
అమ్మ నాన్న తెల్లవారి ఇంటికి రాబోయే గంగ గురించి అది ఈని పెయ్యి దూడను పెడితే కొద్ది రోజులు పాలు కుడిచిందాకా ఉంచి ఆతరువాత కిషన్ నాయక్ కే పాలి కివ్వాలని కులాసాగా చెప్పుకుంటున్నారు.
దూరంగా రైలుబండి కూత. . . అంటే టైము తొమ్మిది, మన్మాడ వెళ్ళే అజంతాఎక్సెప్రెస్ రైలు మా ఊరొచ్చే టైమది.
రోజూ అప్పటిదాక లాంతరు వెలుగులో పిల్లమూక మేమంతా చదువుకుంటాము. అన్న కొక్కడికే సెపరేటుగా బుడ్డి దీపం. తను మాలాగా గోలగోలగా పైకి చదవడు. కాలేజీ చదువు కదా! కొంచెం గౌరవం! నాకెప్పుడు ఆ గౌరవం దొరుకుతుంది?
సంబరం అయినట్టే పంచాక్షరీ ! తెల్లవారుతూనే గంగ వస్తుంది కదా దాని వెనకబడి పోవాలి !ఏడుపు తన్నుకొస్తుంది ఈమాట అనుకోగానే. ఈ గేదెల గండంనుంచి బయట పడేదెలా? ఇప్పుడు తనని కాపాడే వారెవరు?
సడన్ గా వీణాటీచర్ గుర్తొచ్చింది. రేపు తనతో చెప్పాలి ఈ సంగతి. తేలికైన మనసుతో నిద్రలోకి జారుకున్నా
భోజనాల బెల్లులో మెల్లగా స్టాఫ్ రూమువైపు వెళ్ళా, టీచర్ కలిసింది. ఆవిడని చూడగానే దుఃఖం పొంగుకొచ్చి కళ్ళవెంట ఉత్తినే నీరు ధారకట్టింది, కాని గొంతు పెగల్లేదు ఎందుకేడుస్తున్నావంటే?
“సరే! ఇప్పుడు క్లాసుకెళ్ళు, సాయంకాలం నాతో ఇంటికిరా” స్కూల్ అయిపోయాక నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది వీణాటీచర్ ఎలాగు తనకీ అదే దారికాబట్టి.
అప్పటికి తేరుకున్న తను జరుగుతున్న విషయాలన్నీ టీచర్ కి చెప్పి “నాకు స్కూల్ మానాలని లేదు టీచర్ ” అంటుంటే మరోసారి దుంఖం పొంగిపొర్లింది.
ఆలోచిస్తూ వుండిపోయారు టీచర్ కొద్దిసేపు. ఆ తరువాత అమ్మవాళ్ళతో నే మాట్లాడతా పదమంటే మా ఇంటికి చేరాము.
చెప్పాచెయ్యకుండా టీచర్ను ఇంటికి తీసుకొస్తే అమ్మ తత్తరపడింది. ఆదరాబాదరాగా నులక మంచం వేసి దుప్పటి పరిచి టీచర్ని ఆసీనురాల్ని చేసింది.
“మీ దగ్గరకొచ్చిందాండి. పిల్ల ఇంకా ఇంటికి రాలేదని సావాసగత్తెల్ని అడిగితే మీతో వెళ్లిందని చెప్పారు. విసిగించిందామ్మా దాని సొదతో” – అమ్మ.
“విసుగెందుకు కాని పంచాక్షరి ఏడుస్తుంటే నాకే దిగులేసింది. పద నేనొచ్చి అమ్మానాన్నతో మాట్లాడతా అని కూడా వచ్చా. మంచి పిల్ల ! చక్కగా చదువుతుంది. క్లాసులో ఫస్టు. మీరు ఉన్నంటుండి తనని చదువు మాన్పించి గేదెల్ని కాయడానికి పంపుతాననడం ఏమి బాగలేదు. ”
“కాని జరుగుబాటు గురించి కూడా చూడాలి కదమ్మా! పెద్ద పిల్లవాడ్ని కాలేజి మాన్పించ లేము. పెద్దదయ్యింది పెద్ద పిల్ల. మిగతా పిల్లలు చిన్నవాళ్లు. తప్పనిసరి సరి పరిస్థితులొచ్చాయి.
అయినా ఉత్తరాలు చదివే చదువొచ్చింది కదా! ఒకింటికెల్లే పిల్ల, పెద్ద చదువులెవరు అడుగుతారు. ఇంకా మీదికి చదివి ఉద్యోగం చేయాలా? ఊళ్ళేలాలా?” నాకు నచ్చని పాత పాట అమ్మనోటంట
“అదే పొరపాటమ్మా ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు. ఇల్లాలు చదువుకుంటే బిడ్డలు చదువరులవుతారు. ఏమో ! ఎవరు చెప్పగలరు ఉద్యోగమే చేస్తుందో రేపటి రోజున ఏ కలెక్టరో అయి ఊళ్ళేలుతుందో! ఎవరు చూడొచ్చారు”
టీచర్ మాటలకి అమ్మ మెుహంలో సినిమా చూస్తే కలిగినంత సంబరం తొంగిచూసింది! క్షణ కాలం!
చిన్నపాటి నవ్వుతో అంది ” చదువంటే మాటలామ్మా, నెలకో రూపాయి ఫీజు కట్టాలా? యూనిఫారమా, బొక్కులని, పెన్నులని- పెన్సళ్ళని అంతా పైస పైసా లెక్కేకదండి. కుండలో కూడుతిని నడిచెల్లి వస్తారు. అది చూసుకుంటే ఇంట్లో జరుగుబాటు ఎలా? ”
“పంచాక్షరి స్కూలుకి ఇంట్లో జరుగుబాటుకేమి సంబంధమండి?”
“ఇప్పుడు దొడ్లో ఉన్న పెద్దగేద కూతురే గుట్టల్లో పాలికివ్వగా రేపు వస్తున్న చూడి పడ్డ. ప్రస్తుతం వాళ్ళమ్మ పూటకు రెండు శేర్లకు తక్కువ కాకుండా పాలిస్తుంది. పిల్లాజెల్లావున్న ఇల్లు, ఇల్లుగడవగా రోజు రెండుశేర్ల పాలు రెండు శేర్ల పెరుగు అమ్ముతున్నా. ఇంటివాడకం పోగా అప్పుడు ఇప్పుడు మిగిలిన వెన్న అమ్ముతా. నెలవారి పైఖర్చులకి బొటాబొటీగా సరిపోతాయి. బియ్యం కొనే పనిలేదు కదా!
నలుగురు పిల్లలున్న కుటుంబంలో రాబోయే రోజుల్లో అన్నీ ఖర్చులే ! పెళ్ళళ్ళు, రాకపోకలు, పురుళ్ళు పుణ్యాలనిను. ”
దేవుడి దయవల్ల అంతా సవ్యంగా జరిగితే ఈ కొత్త గేదెపాడి మాకు మిగులేకదమ్మా! పెద్దపిల్ల పెళ్ళికో లేక పిల్లాడి కాలేజి ఫీజు కట్టడానికో అక్కర కొస్తుంది.
అప్పుడే వచ్చిన నాన్న” నమస్కారమమ్మా” అని టీచర్ గార్కి నమస్కరించాడు.
“రండి మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నా, కలిసారు సంతోషం” ప్రతి నమస్కారం చేస్తూ అన్నారు టీచర్.
“పంచాక్షరిని గేదెలు కాయడానికి పంపొద్దు బడికి పంపమని అడగొచ్చారు టీచరమ్మ” బెరుకుగా నాన్న మెుహంలోకి చూస్తు అంది అమ్మ.
“ఇన్నిరోజులు ఒక్కగొడ్డు కాబట్టి మేమిద్దరమే ఎలాగో తంటాలు పడి ఇక్కడిక్కడే తిప్పుతున్నాము. రెండయితే లాభాలెన్నో బయట తిప్పకపోతే కలిగే నష్టంకూడా అంతే.
స్వేచ్ఛగా గాలికి నాలుగు గట్లంటా తిప్పితే అది వేరుగానే వుంటుంది. పాలతీతలో కలిగిన మార్పుతో మనకు వెంటనే తెలిసి పోతుంది. బయట తిప్పాలంటే మనిషి వెనక వుండాలి. కన్ను మూయకుండా కాపలా కాయాలి. లేదంటే చేలోపడతాయి. ”
“ఇంకోరకంగా దీన్ని అధిగమించలేమా” వీణా టీచర్ మెల్లగా నాన్ననడుగుతున్నారు. టీచర్ ఆరాటమంతా నన్నెట్లన్నా గేదల బారినుండి కాపాడాలనే.
“జీతగాడ్ని పెట్టుకోవాలి. పదిపన్నెండేళ్ళ కుర్రాడెవరన్నా దొరికితే పర్లేదు. అదే పెద్దవాళ్ళయితే మేము నిభాయించుకోవడం కష్టం” సాలోచనగా అన్నాడు నాన్న. చూస్తుంటే నాన్నకు జీతగాడిని పెట్టుకుని నన్ను బడికి పంపడం ఇష్టమేలాగుంది!
“నా ఉద్దేశ్యం జీతగాడిని పెట్టుకుని ఆర్థికంగా మిమ్మల్ని కష్టపడమనడం కాదు. గేదెలకు బదులుగా కోళ్ళ మందనో, మేకలు లేక గొర్రెలు లాటివి పెంచుకుంటే కాదా?”
చూడండి గేదెల్ని సాకడం కేవలం పాలు- పెరుగు కోసమేకాదు. మన ఇంటి అవసరాలు తీరుతాయి. మిగిలితే అమ్ముకోవచ్చు. కుటుంబ అవసరాలు తీరుతాయి. దూడ పుట్టిన రెండున్నర మూడేళ్ళలోపు ఎదకట్టి ఈనుతుంది. పెయ్యి దూడయితే అనుకునేదేముంది ఇంట్లో లక్ష్మీదేవి తాండవమాడుతుంది. పాడిగేదె దాదాపు పదినెలలు -ఓ ఏడాది దాకా పాలిస్తుంది, దున్నపోతయినా దిగుల్లేదు. మాలాంటి చిన్నకమతాలకు పనికొస్తుంది. వద్దనుకుంటే అంగట్లో అమ్మేసుకోవచ్చు.
పశువులుంటే పొలంలో వరిగడ్డిని, వర్షాకాలంలో దొరికే పచ్చిగడ్డని మేపుకోవచ్చు. వాటినుండి లభించే పేడ, చెత్త పొలానికి మంచి ఎరువు. అందుకే పాడి – పంట అంటాము. ఇక్కడ వృధా అన్నమాటకే అర్థంలేదు. రెంటికి అవినాభావ సంబంధముంది. ఒకదాని నుండి మరొకదాన్ని విడదీయలేము.
అంతగా మా జీవితాలతో పెనవేసుకున్నాయి పశువులు. మేము దేశం(ఆంధ్రా) నుండి ఇక్కడికి వచ్చి కొద్దిపాటి బీడు భూముల్ని కొనుక్కుని వ్యవసాయం మెుదలెట్టాము. ఇంకా పూర్తి బందోబస్తుతోఇంటి నిర్మాణం కూడా జరగలేదు. చెప్పాలంటే డబ్బులకు కటకటగానేవుంది. ఈ పరిస్థితిలోమరో ఆదాయ వనరు గేదెల పాడి.
పిల్లలు ముద్దుగా వాటికి పేర్లు పెట్టారు. తల్లికి భానుమతి బిడ్డకు గంగనీను” నాన్న చిరునవ్వుతో టీచర్కి అర్ధ మయేట్టు వివరంగా చెప్పాడు.
గేదెల పేర్లు వింటున్న టీచర్ మెుహంలో నవ్వు దోబూచులాడింది.
“రండి గేదెల్ని చూద్దురు”ఎంత బడాయో, మోజో తమ పశువుల్ని ఇతరులకి చూపించుకోవడం !చావిట్లోకి దారితీసాడు నాన్న అమ్మకు కాఫీ పెట్టమని చెప్పి.
అమ్మ నన్నుండమని సైగచేసింది చేతితో గుడ్రంగా తిప్పుతూ – అంటే కోళ్ళ గూట్లో గుడ్లేమన్నా ఉన్నాయేమో చూడమని.
ఆమ్లెట్ వేస్తుందనుకుంటా! గూట్లోకి తొంగిచూసా రెండు గ్రుడ్లు ! గబగబ తెచ్చిచ్చా. ఆ చేత్తో ఒక ఉల్లిగడ్డ రెండు మిరపకాయలు ముక్కలు చేసిచ్చి, కరివేపాకు తెంపుకొచ్చా.
అమ్మ పొయ్యి రాజేసి బాండి పెట్టింది అట్టు వేయడానికి. ఆ రోజుల్లో అంతే గబుక్కున ఇంటికెవరన్నా వస్తే మర్యాద చేయడానికి ఇలాంటి టిఫిన్లే రక్షించేవి అమ్మని.
నేను పరిగెత్తికెళ్ళా చావడి దగ్గరకు. అబ్బో చాలా పెద్దదయిందే గంగ! లావుగా, నిండుగా ఎంత బాగుందో! సంతోషం కమ్ముకుంది. అచ్చు వాళ్ళమ్మలాగేవుంది!
దగ్గరకు పోబోతుంటే నాన్న వారించాడు. ” నువ్వు గుర్తున్నావా దానికి జాగ్రత్త పొడవగలదని. ” నాన్నచెబుతున్నాడు “దూడను పాలికివ్వకముందు పొద్దున నిద్దర లేచింది మెుదలు బడికి పోయేవరకు తిరిగి వచ్చిందగ్గరనుంచి పంచాక్షరి దానితోటే ఆడుకునేది. దానికి గంగనే పేరు తను పెట్టిందే, తన కిష్టమైన స్నేహితురాలి పేరని “.

*****

ఓ వారంరోజుల తరువాత మేము నిద్దర లేచేప్పటికి అమ్మ రోట్లో వడ్లు దంచుతూంది. నన్ను చూడగానే నవ్వుతూ” నీ గంగ పెయ్యి దూడను పెట్టింది ” అంది. నాకు భలే సంతోషం వేసింది బుజ్జిదూడను చూడగానే, నాన్న గోళ్ళు గిల్లుతున్నాడు దూడకు. అప్పుడే లేచి నిలబడి మళ్ళీ దభీమని క్రింద పడింది.
అమ్మఇత్తడి దబరా గిన్నెలో పొట్టుతోనున్న కచ్చాపచ్చా దంచిన వడ్లని గంగ ఎదురుగా పెట్టింది. ఆత్రంగా బొక్కసాగింది. అవి తింటే మాయ పడతది. మాయ తియ్యడం, బుజ్జి దూడకు జున్నుపాలు కుడపడం నాన్న పని. అమ్మానేను ఇంట్లోకెళ్ళాం. పిల్లలం మేము స్కూలుకెళ్ళాలి కదా మరి !
ఇప్పుడు నా మనసెంతో నెమ్మదిగావుంది. ఎందుకంటున్నారా? మీకు చెప్పలేదు కదా మరి. వీణా టీచర్ వచ్చివెళ్ళిన తరువాత నాన్న నన్ను స్కూలు మానిపించే విషయం గురించి మళ్ళీ ఎత్తలేదు. అమ్మ అన్నది ఆ రోజు వీణా టీచర్ పంచాక్షరి చదువుకి ఫీజు, పుస్తకాలు, యూనిఫారాలకు అన్నిటికి కలిపి సంవత్సరానికి ఓ వందరూపాయల లోపే అవుతాయి తాను పెట్టుకుంటానన్నారంట. కాదు కూడదంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వేద్దాము అక్కడ ఆఫీసర్ తన ఫ్రెండ్ అని చెప్పారట.
టీచర్ మాటకు తల ఒగ్గి నాన్న కిషన్ నాయక్ ను కలిసి పది సంవత్సరాల బుడ్డాడు కావాలంటే తన తమ్ముడిని వప్పించి వారి కొడుకుని సంవత్సరానికి అరవై రూపాయలిచ్చి తిండి బట్టా అన్నీ చూసుకునేట్టు వప్పించు కొచ్చాడట. వాడు ఇవ్వాళో రేపో రావాలని ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం గంగతో నాకెలాంటి వైరం లేదు. బుజ్జిదూడకు ఓ మంచి పేరు పెట్టే ప్రయత్నంలోవున్నా, ఆలోచించాలి మరి!
వసుధ అనే పేరు పెట్టాము దూడకు. నాన్నకు కూడా చాలా నచ్చింది, తనకు వ్యవసాయమంటే ఇష్టం. నేల తల్లిని నమ్మితే నూకలకు కరవుండదని అంటాడు.
శీను వచ్చిమాతోనే ఉంటున్నాడు. మాకు బయటి ఊడుపు పని తగ్గింది. అమ్మకు చేదోడు వాదుగా చేతికింద చిన్న చిన్నపనులు అందుకునేవాడు. సమయం దొరికి నప్పుడు మాతోను ఆడుకునేవాడు.
అక్క పెళ్లి అయిపోయింది
అప్పటిదాకా అన్నయ్యకు గజం పద్నానుగు అణాలకు దొరికే బట్టతో పంట్లాములు కుట్టించేవాళ్ళు, మెల్ల మెల్లగా మాకూ ఆ సర్కారు దుకాణం నుండి కొనుక్కొచ్చే కంట్రోలు బట్టలు కట్టుకునే బాధ తప్పింది.
నేను కష్టపడి చదివి పదోతరగతి పరీక్షలలో మా జిల్లాకే ఫస్టు వచ్చాను. ఆ రోజు సంబరం చూడాలి. ఎంత హడావుడో! హెచ్ఎమ్ గారు వీణా టీచర్తో కలిసి మా ఇంటికొచ్చారు నన్ను అభినందించడానికి. అమ్మనాన్నలిద్దిరిని కూచోబెట్టి చెప్పారు నా చదువాపవద్దని. .
అప్పుడే మెల్లమెల్లగా ఇంటర్ మీడియట్ ప్రయివేటు కాలేజీల రాక స్టార్ట్ అయింది. బాగా చదివే పిల్లలను ఇంటికొచ్చి మరీ తమ కాలేజిలో ఫ్రీ గా సీటిచ్చి ఎంసెట్ కోచింగ్ తో చదివిస్తామంటే అలా ఇంటర్లో జాయినై బైపిసి గ్రూప్తో కాలేజి టాపర్ నయ్యాను.
ఎంసెట్లో ఆరువందల ర్యాంక్ వచ్చింది. నాకొచ్చిన ర్యాంకుకి మెడిసిన్లో సీటు రాదన్నారు. మా వాళ్ళకు ఆ విషయాలు పెద్దగా తెలియవు. అసలు హైదరాబాదు చూసిందే లేదు వాళ్ళు. నేనన్నా ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి మాకు తెలిపిన వాళ్ళుంటే వాళ్ళింట్లో ఉండి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎగ్జామ్ రాసాను. చదవక పోయినా ఓసారి కాలేజి అన్నా చూసొచ్చాను.
మెడిసిన్లో సీటు రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు, దిగులుపడలేదు. మనుష్యుల డాక్టర్ను కాలేకపోయినా పశువుల డాక్టర్ను అవ్వబోతున్నాను కదా! ఇష్టమైన వృత్తి.
అన్నయ్యకు ఆంథ్రాబ్యాంకులో ఉద్యోగం దొరికింది.
అమ్మనాన్నలకు మునుపట్లా డబ్బులకు వెతుక్కునే బాధ తప్పింది. అమ్మరెండు గేదెల పాడి అల్లా నాలుగుకి పెరిగింది భానుమతి, గంగ, వసుధల పిల్లా జెల్లలతో. నాన్నకు కూడా కాస్త జీవితపు మెలకువలు అబ్బినాయి. నాలుగు గేదెల పాలు పిండుకుని సైకిల్ మీద నేను చదివొచ్చిన హాస్టల్కి, ఖలిల్ వాడిలోని కొన్ని డాక్టర్ల కుటుంబాలకు సప్లయ్ జేయసాగాడు. నోటిమాట మీద కల్తీలేని పాలని తెలుసుకుని ఎంతోమంది విద్యాధికులు నాన్నే పాలుబోయాలని కోరుకున్నారు.
చెల్లెళ్ళు సిటిబస్సులో, తమ్ముడు సైకిల్ మీద వెడుతున్నారు రోజు నిజామాబాద్ స్కూళ్ళకు. నేను హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో, బివియస్స్ సి లోజాయిన్ అయ్యాను. హాస్టల్లో మకాము. ఐదవ సంవత్సరం హాస్పిటల్ ప్లేస్మెంట్లో భాగంగా తన సూపర్ సీనియర్ మహేష్ తోటి పరిచయం ప్రేమగా మారింది.
మహేష్ మాస్టర్స్ డిగ్రీ కోసం ఆస్ట్రేలియా, సిడ్నీ వెళ్లాడు. తను ఇక్కడే ఎమ్విఎస్ సిలో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసింది. రిజల్ట్స్ వస్తునే సర్కారు వారి ఆర్డర్, పోస్టింగ్ ఇస్తూ వెంటనే డ్యూటీలో జాయిన్ కమ్మని. అమ్మనాన్నల ఆనందానికి హద్దులు లేవు, పరీక్ష పాసవుతూనే పశువుల డాక్టరైన కూతుర్ని చూస్తుంటే.
గిర్రున రెండేళ్ళు తిరిగొచ్చాయి. ఒక చెల్లి డిగ్రీ కంప్లీట్ చేసి లైబ్రరీ సైన్సులో డిగ్రీలో జాయిన్ కాగా రెండో చెల్లి యమ్ కామ్ లోను తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజిలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
చుట్టుపక్కల ఊర్లవాళ్ళందరికి అదో అద్భుతం కేవలం మూడెకరాల పొలం ఒక్క పాడిగేదెను పెట్టుకుని ఎంత అభివృద్ధిని సాధించింది రాఘవయ్య కుటుంబమని. సంబంధాలు వెతక్కుండానే పిలవకుండానే వాళ్ళంతట వాళ్ళుగా రాగా పిల్లలందరి పెళ్ళిళ్ళుజరిగి పోయాయి.
మహేష్ ది తమ కులమే అందుకే ఎటు తరపు వారికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వివాహం జరిగి తను కూడా సిడ్నీ వెళ్ళి అక్కడ లైవ్ స్టాక్ మ్యానేజ్మెంట్ లో పిహెచ్ డిలోజాయినయి, ముగించుకుని అక్కడే సెటిలయి పోయినారు.
తమ పిల్లలిద్దరు పెద్దవాళ్ళయిపోయి తోడునీడలను వెతుక్కున్న ముప్పై ఏళ్ళ తరువాత తిరిగి ఇండియాకి వచ్చేస్తుంటే, రూట్ మ్యాప్‌లో నాందేడ్ ఆతరువాత నిజామాబాద్‌ను స్కీన్ మీద చూస్తుంటే గతం గిర్రున కళ్ళల్లో తిరిగింది. ఏనాటి భానుమతి, గంగ, వసుధ అందరూ గుర్తుకొచ్చారు. వాళ్ళ భిక్షే కదా తమ జీవితాలలోని ఈ ప్రగతి!
అమ్మానాన్నలిద్దరు పెద్దవాళ్ళయినారు. వాళ్ళ రోజువారి అవసరాలకే కష్ట పడుతున్నారు. అన్నయ్య, తమ్ముడు, పిల్లలు ఎవరు బ్రతిమిలాడినా ఈ పల్లెను వదిలి రామని తెగేసి చెప్పారు.
తనకి ఫారిన్ జీవితం మెుహమెుత్తింది. ఈ గాలి ప్రశాంతమైన పల్లె జీవితం తనను గోదావరి ఒడ్డున పాతికెకరాల పొలంకొని ఫకీరాబాదులో సెటలవుదాము రమ్మని పట్టి గుంజుకొచ్చాయి.
ఇక అమ్మానాన్నలను కూడా మేమే చూసుకుంటాము. వారికోసం వస్తూ పోతూ ఉంటే మిగతా తోబుట్టువులతో సాన్నిహిత్యం వుండి రాకపోకలు మెరుగవుతాయి. నాకెందుకో మళ్ళీ ఆ పాత జీవితం కావాలని మనసు గగ్గోలుపెడుతుంది.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *