May 18, 2024

మలుపులో మధుర చెలిమి

రచన: రాజ్యలక్ష్మి బి

“వచ్చావా.? యెక్కడున్నావే.?” అన్నది జానకి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని.
“ఇదిగో యీ కుడివైపు చూడు — నిన్ను నేను చూస్తున్నా. గేట్ వద్ద కనిపిస్తున్నావు నువ్వ్వు “చెయ్యుపుతూ అంది శారద.
“ఆ —– కనిపించావు. ఆగు వస్తున్నా. ” అటువైపు నడిచింది జానకి.
జానకి, శారద చిన్నప్పటినించీ మంచి స్నేహితులు. ఒకే వీధిలో యిళ్ళు. ఒకేస్కూలు, ఒకేకాలేజీ. మనస్తత్వాలలో భిన్నత్వం వున్నా, అభిరుచులలో యేకత్వం వుంది. ఒకరిపై ఒకరికి గల అభిమానం వారి మధ్య యెప్పుడూ విభేదాలు రానివ్వలేదు. ఇద్దరూ పోటాపోటీగా చదివేవారు. క్లాసులో మొదటి రెండు స్థానాలూ వారివే
శారద వున్నత మధ్య తరగతి నుండి వస్తే, జానకిది దిగువ మధ్యతరగతి. అవేవీ వారి అన్యోన్య స్నేహానికి అడ్డుకోలేదు.
డిగ్రీ అయ్యాక జానకికి ఓ చిరుద్యోగితో వివాహం చేసేసాడు పోస్టుమాస్టరుగా పనిచేసే ఆమె తండ్రి. శారద తరువాత పి.జి చదివి మంచి ప్రభుత్వరంగంలో గెజిటెడ్ హోదాలో వుద్యోగం సంపాదించుకుంది. ఆ పైన పెళ్లయ్యి ఆ వూరి నుండి ఆమె కూడా వెళ్లిపోయింది.
అలా యిద్దరూ పెళ్లిళ్లయ్యి విడిపోయారు. ఎవరికి వారు తమ పిల్లలు, భర్త, వుద్యోగం, సంసారం గొడవల్లో తలమునకలయ్యారు
చాలా యేళ్ళ తర్వాత తమ అరవైల వయసులో తీరిక దొరికి, కాలక్షేపం కోసం, తమ సాహిత్యాభిరుచి మేరకు, ఓ సాహిత్య ప్రధాన గ్రూపులో చేరి, అక్కడ కామెంట్స్, పోస్టులల్లో ఒకరినొకరు గుర్తుపట్టి, ఫోన్ నంబర్లు యిచ్చి పుచ్చుకుని, యిలా యీ రోజు యీ పార్కులో కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
అన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా కలుసుకోవడం తో ఆనందంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, కుశలప్రశ్నలతో వుక్కిరిబిక్కిరి చేసుకున్నారు. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి ప్రేమగా పట్టుకుని తీరికగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
“మావారు మా చిన్నవాడికి ఏడేళ్ళుండగా గుండెపోటుతో హఠాత్తుగా పోయారే.ఇద్దరు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచాను. పెద్దవాడు ఎయిర్లైన్స్ లో, చిన్నవాడు లాయరుగా హైకోర్టులో పని చేస్తున్నారు. నీ పిల్లలు?” తన గురించి చెప్పి జానకిని అడిగింది శారద.
“నాకు యిద్దరూ కూతుర్లేనే. మావారు రిటైర్ అయ్యాక కిడ్నీ ఫేయిల్యూర్ తో కొంతకాలం పోరాడి పోయారు. ఇప్పటికి నాలుగేళ్లయ్యింది. నా పిల్లలిద్దరూ సాఫ్ట్ వేర్ కంపెనీలలో మంచి జీతంతో పనిచేస్తున్నారు. యీ సిటీలోనే వాళ్ల భర్తలూ అదే ఫీల్డు. “జానకి మనసులోని నిశ్చింత ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది
“అవునా.ఇంతకూ నువ్వెక్కడ వుంటున్నావు.? ఒంటరిగా వున్నావా.? నాతోపాటు ఆశ్రయ గోల్డేజ్ హోమ్ కు వచ్చెయ్యకూడదూ.? నా రూములోనే వుందువుగాని. నేనే పే చేస్తాను. చాలా బావుంటుంది అక్కడ. సెపరేట్ ఏ. సి గది, విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద గార్డెన్. ఆర్గానిక్ కూరల పెంపకం. యోగకేంద్రం, చిన్న దేవాలయం, యిరవై నాలుగు గంటలూ డాక్టర్స్ అందుబాటులో వుంటారు. చక్కని తాజా ఆహారం సమయానికి అందిస్తారు. నేనున్న రూమ్ ఒక్కరికి అయితే నెలకు యిరవైనాలుగు వేలు. అక్కడే యిద్దరుంటే ముఫైవేలు” ఉత్సాహంగా జానకి రెండు చేతులూ తన చేతిలోకి తీసుకుని అడిగింది శారద.
“అదేమిటీ. నువ్వు ఓల్డేజ్ హోమ్ లో వున్నావా ? “పట్టలేని ఆశ్చర్యంతో శారద వైపు చూస్తూ అంది జానకి.
“అవును? ఏం ? అయినా అక్కడ చాలా సౌకర్యంగా వుంది. నువ్వు ఒంటరిగా వుంటున్నావని అడిగాను.” చప్పబడిన వుత్సాహం జానకికి దొరకనివ్వకూడదని ప్రయత్నం చేస్తూ, చిన్నగా తన చేతులు వెనక్కి తీసుకుంది శారద.
“లేదే. నేను నా కూతుర్ల దగ్గరే వుంటున్నాను, ఆయన పొయినప్పటినుండీ. అది సరే. నీ పిల్లలు నిన్నిలా ఒంటరిగా యెందుకు వుండనిస్తున్నారు? అంది జానకి.
శారద తన భావాలు ముఖంలో చూపకుండా ” ముందు నువ్వు చెప్పు, నీ అల్లుళ్లు నిన్ను తమ వద్ద వుంచు కోవడానికి ఒప్ప్పుకున్నారా? “ఆసక్తిగా చూసింది జానకి కళ్లల్లోకి.
జానకి చెప్పడం మొదలు పెట్టింది.
“నా పెళ్లయిన తర్వాత నేను కోదాడలో స్థిరపడ్డాను. ఆయన వున్నప్పుడే యిద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు. కొన్నాళ్లు కోదాడలో వున్నాను. ఇప్పటికీ అక్కడ యిల్లు వుంది. భగవంతుడి దయవల్ల ఆరోగ్యం బాగుంది. ఆయన పెన్షన్ వస్తుంది. నేను స్వతంత్రం గా వుంటున్నాను. ఇదిగో యీ సాహిత్య అభిమానం, మక్కువ వల్ల నేను నా లోకం సృష్టించుకున్నాను. కాకపోతే అల్లుళ్లు యిద్దరూ చాలా మంచివాళ్లు. యిద్దరి అపార్టుమెంట్లు దగ్గరే. నన్ను వచ్చి అక్కడే వుండమన్నారు. కానీ నేను కొన్నిరోజులు పెద్దమ్మాయి దగ్గర కొన్నిరోజులు చిన్నమ్మాయి దగ్గర, కొన్నిరోజులు కోదాడలో వుంటాను. అక్కడ కూడా కొంత వసతి అమర్చుకున్నాను. నాకు పిల్లలు ఆంక్షలు పెట్టలేదు. యింట్లో యోగ చేసుకుంటాను. మనవళ్లు మనవరాళ్లతో సరదాగా గడిచిపోతున్నది. అప్పుడప్పుడు సెలవుల్లో యెవరి వీలును బట్టి యెక్కడికయినా టూర్ వెళతాం. ఒక్కోసారి అందరం కోదాడలో నా వంటలు రుచి చూస్తు సరదాగా గడిపేస్తాం. మొత్తానికి ప్రస్తుతం నాకు హాయిగా నా స్వాభిమానానికి భంగం కలగకుండా వాళ్ల అభిమానాన్ని పొందుతున్నాను. అలాగే నేను కూడా వాళ్లతో కలిసిపోయాను. “సుదీర్ఘం గా తన వివరాలు నవ్వుతూ చెప్పింది జానకి.
“జానూ.. చక్కగా ప్లానింగ్ చేసుకున్నావు. బావుందే. నీ వ్యక్తిత్వం, అభిరుచులు దెబ్బతినకుండా, పిల్లల దగ్గర అభిమానం పొందుతూ హాయిగా వున్నావు. నాకు చాలా సంతోషంగా వుంది. నా సంగతి చెప్తాను. నేను పెళ్లయ్యాక హైద్రాబాద్ లో స్థిరపడ్డాను. గెజిటెడ్ ఆఫీసర్ గా పని చేసాను. మావారు ప్రొఫెసర్. ఆయన సర్వీసులో వుండగానే పోయారు. అప్పటికి పిల్లలు చిన్నపిల్లలు. మా అత్తగారు, మామగారు నాకు అండగా నిలబడ్డారు. పెద్దవాడు ఏరోనాటికల్ యింజనీరింగ్ చదివి ఎయిర్ లైన్స్ లో స్థిరపడ్డాడు. పెద్దకోడలు డాక్టర్. స్వంత క్లినిక్ పెట్టుకుంది. చిన్నవాడు హైకోర్టు లాయర్. చిన్న కోడలు కాలేజీ లెక్చరర్. మొత్తానికి అందరూ వారి వృత్తులలో బిజీ. నాకు మన వయసువాళ్లతో వుండాలనిపించింది. భగవంతుడి దయవల్ల నాకు పెన్షన్ వస్తుంది. ఆరోగ్యం బాగుంది. మొదట్లో యిద్దరూ నేను ఆశ్రమంలో వుండటానికి ఒప్పుకోలేదు. కానీ తర్వాత అర్ధం చేసుకున్నారు. నాకు కూడా ఆశ్రయలో సాహిత్య అభిరుచులవాళ్లు కలిసారు. నాకు పాటలూ, కవితలూ యిష్టం. అవి అందరం షేర్ చేసుకుంటాం. అయితే ఒక నియమం. ప్రతి శని, ఆదివారాలు కొడుకు, కోడళ్ల దగ్గర సరదాగా గడిపేస్తాను. పండగలన్నీ పిల్లలదగ్గరే వుంటాను. యిదీ నా జీవన విధానం “నవ్వుతూ శారద ముగించింది.
ఇద్దరి కళ్లల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం తీణికిసలాడింది.
“బాగుందే సరదా..మొత్తానికి యిద్దరం హాయిగా వున్నాం. మనిద్దరం కూడా నెలలో ఒకరోజు సరదాగా గడుపుదాం. కోదాడ వచ్చెయ్యి. నా వంటలు రుచి చూడు, నీ పాటలు నేను వింటాను. యేమంటావు శారు” అన్నది జానకి ఆప్యాయం గా శారద చెయ్యి పట్టుకుంది.
“తప్పకుండా జానూ..మన కలయికలో మన కాలేజీ జ్ఞాపకాలు, గుర్తుకొస్తున్నాయే.. నాదగ్గర కూడా నీకు నచ్చినన్ని రోజులు వుండు. పద..తాజ్ లో తినేసి వెళ్దాం. “శారద తన సమ్మతి చెప్పింది.
జీవితం మలిసంధ్యలో శారద, జానకి చాలా కాలం తర్వాత కలుసుకుని, భవిష్యత్తుని అందంగా ఆస్వాదించాలని నిర్ణయించుకుని ఆ రోజు పార్కు నుంచి నిష్క్రమించారు.

1 thought on “మలుపులో మధుర చెలిమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *