December 6, 2023

మారుతున్న యువతరం

రచన: లక్ష్మి చివుకుల

“ఈ పెళ్లి సంబంధం అయినా కుదిరితే తిరుపతి వెంకటేశ్వర స్వామీ.. నీ గుడికి నడుచుకుంటూ వచ్చి నీ దర్శనం చేసుకుంటాము తండ్రీ! నూతన వధూవరుల చేత కళ్యాణం చేయిస్తాను”… ఎడాపెడా చెంపలు వాయించుకుంటూ దేవునికి మొక్కుకుంటోంది అలివేలు.

“నవీన్ !! రెడీ అయ్యావా ! ప్లీజ్ … ఈ పెళ్లి చూపులలో అయినా, ‘నేను అమ్మాయితో విడిగా మాట్లాడతాను….. మా అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి…. మనమంతా కలిసే వుండాలి……’ అని చెప్పకురా. మమ్మల్ని చూసుకోపోయినా ఫరవాలేదు…. నువ్వు బావుండాలి…మీరిద్దరూ అన్యోన్యంగా వుండి పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలి…. నువ్వు అలాంటి రూల్స్ పెట్టకురా ప్లీజ్ ..” అంటూ కొడుకుని ప్రాధేయపడుతోంది అలివేలు.

“అమ్మా! ఈ కాలం ఆడపిల్లలు ఎలా వున్నారో నీకు తెలియదు. ఏమి చెప్పాలి అన్నా ఏమి మాట్లాడాలి అన్నా ముందే మాట్లాడు కోవాలి. లేకపోతే పెళ్లి అయ్యాక లేనిపోని గొడవలు వస్తాయి. ముందే ఎందుకు చెప్పలేదు ? చెపితే నేను నిన్ను పెళ్లి చేసుకో పోయేదాన్ని కదా!!! అని మనల్నే తప్పు పడతారు.

ఇదివరకు పెళ్లి చూపులకు వెళ్లి నప్పుడు ఏమయింది. ఆ అమ్మాయి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కాళ్లు ఊపుతూ నాకూ సెపరేట్ గా వుండడం ఇష్టం. నా జీతం నేనే ఖర్చు పెట్టుకుంటాను నా రూమ్ నాకూ సెపరేట్ గా వుండాలి. నా రూమ్ లోకి రావాలంటే డోర్ నాక్ చేసి రావాలి అని చెప్పలేదా? ఆ కండీషన్లు విన్నాక నేను భయంతో వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను కాబట్టి సరిపోయింది. ఇప్పటి ఆడపిల్లలు అత్తగారి కుటుంబం అమెరికాలో వుండాలి అమ్మగారు వాళ్లు ఇంటి పక్కనే వుండాలి అని కోరుకుంటున్నారు అమ్మా”.

“అలివేలూ పద పద! టైమ్ అవుతోంది. మళ్లీ వర్జ్యం వస్తుంది. అయినా నీ పిచ్చి గానీ ఇప్పటి రోజులలో అత్తగారు మావగారు వుంటే, వాళ్ళని లగేజీలనీ, కేరీ బేగ్ లని, చెత్త బుట్టలతోటీ పోలుస్తున్నారు. మనం ఎవరి మీదా ఆధారపడి లేము. అయినా మనకి ఏం తక్కువ? సిటీలో రెండు ఇళ్ళు వున్నాయి. మన అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెల తిరిగే సరికి లక్ష రూపాయలు వస్తాయి.

నాకూ పెన్షన్ వస్తుంది. ఎవరు ఎక్కడ వున్నా మన జీవితాలు మనం బ్రతకగలం” ఓదార్పుగా అన్నారు వాసుదేవరావు గారు.

“మనం బ్రతకగలం కానీ వాడు నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా వుండాలి అని కండీషన్లు పెడుతున్నాడు అందుకే కదా వచ్చిన సంబంధాలు అన్నీ పోతున్నాయి? ఈ సంబంధం అయినా కుదిరితే బావుండును. కన్నందుకు మన బాధ్యత మనం తీర్చుకోవాలి కదండీ?!?!”..

“రండి! రండి!! కూర్చోండి. బావున్నారా మంచి నీళ్లు తీసుకోండి. ఈలోగా కాఫీ కలుపుతాను”. అంటూ ఒక విధమైన ఆదుర్దాతో పూర్వం పెళ్లి చూపులకు గుమ్మంలోకి మగపెళ్లి వారు వస్తే ఎంత హడావుడి చేసేవారో అంత టెన్షన్ తో అంత ఆత్మీయంగా వాళ్లని ఆహ్వానించారు సరళ వాళ్లు.

“ఉజ్వలా ! ఈ కాఫీలు పట్టుకెళ్లి వాళ్లకి ఇయ్యమ్మా” అంటూ సరళ కాఫీ కప్పులు వున్న ట్రే అందించింది కూతురుకి.

నవీన్ కు హలో చెప్పి కాఫీ కప్ అందించింది. నవీన్ తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం పెట్టింది.

టిఫిన్ లు కాఫీలు అయ్యాక అప్పుడు ఉజ్వల మాట్లాడడం మొదలుపెట్టింది.

“ఈ పెళ్లి జరగాలంటే నావి కొన్ని కండిషన్స్ వున్నాయి.. నేను మీతో మాట్లాడాలి” అని ఏదో చెప్పడానికి నోరు తెరవ బోతుంటే ఉజ్వల తల్లి కొంత ఆందోళనతో

“అబ్బాయి నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆ రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకోండి” అంటూ ఆ సంభాషణ ఆపేయబోయింది.

“అమ్మా! రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకునే విషయాలు ఏమీ లేవు. అందరి ఎదురుగా ఇక్కడే మాట్లాడతాను”.

దేవుడా!!! ఈ సంబంధం కూడా కుదిరేలా లేదు. ఈ అమ్మాయి ఎలాంటి కండిషన్స్ చెపుతుందో ఏమో! అని అలివేలు కూడా భయపడింది.

“మా అమ్మ, నాన్నగారు మా నాయనమ్మని చాలా బాగా చూసుకునేవారు. మా నాన్నగారు చనిపోయాక మా నాయనమ్మని కూతుళ్ళు ఎంత పిలిచినా వెళ్లకుండా ‘మా కోడలు ఒంటరిది అయిపోయింది. దానికి సపోర్ట్ గా వుండాలి. పెళ్లి అయి కాపురానికి వచ్చినప్పుటి నుంచి ‘అత్తయ్యా అత్తయ్యా’ అంటూ నా వెనకనే తిరిగింది. ఏ పని చేయాలన్నా ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడగ కుండా ఏ పనీ చేసేదికాదు. అలాంటి కోడలని మనవరాలిని ఒంటరిగా వదిలేసి నేనూ ఎవరి దగ్గరకు రాను’ అని చెప్పి పంపేది. వాళ్లు అత్తా కోడలుగా కాకుండా తల్లీ కూతుళ్ళ లాగా వుండేవారు. అలాంటి పెంపకంలో పెరిగాను నేను.

నాకు అత్తగారిని మావగారిని ఎలా చూసుకోవాలో ఎవరూ నేర్పలేదు. అమ్మని నాయనమ్మని చూసి నేనూ అలాగే నా అత్తమామలని చూసుకోవాలి అని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను.

మిమ్మల్ని నా తల్లిదండ్రుల్లా చూసుకుంటాను. జన్మలో వేరు కాపురం పెట్టను. అలాంటి ఆలోచన మీ అబ్బాయికి వున్నా నేను ఒప్పుకోను. నాకు నెలకి లక్ష రూపాయలు జీతం వస్తుంది. మీ అబ్బాయికి లక్ష రూపాయలు జీతం వస్తుంది. అందరం కలిసి ఒకే చోట హాయిగా బ్రతకగలం.

అన్నట్టు… మా అమ్మ కూడా నాతోబాటు వుంటుంది. మా అమ్మ వలన మీకు ఎలాంటి ఇబ్బందులూ రావు. నేను హామీ ఇస్తున్నాను. నా పెళ్లి అయిపోతే మా అమ్మ కాశీ వెళ్తాను. అక్కడే వుండిపోతాను. లేకపోతే రామేశ్వరం వెళ్లి పోతాను అంటోంది. మా అమ్మకు కొడుకు అయినా కూతురు అయినా నేనే! అమ్మను అత్తగారిని ఇద్దరినీ నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. నాకు తండ్రి లేని లోటు తెలియకుండా మావయ్య గారిలో మా నాన్నని చూసుకుంటాను. ఈ విషయంలో మీకుఎటువంటి సందేహమూ అవసరం లేదు.

నేను మూడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పటికి 12 లక్షల రూపాయలు వరకూ, నా పెళ్లి కోసం దాచ గలిగేను. ఆ మొత్తం మీకు ఇచ్చేస్తాను. నేనూ… నా అభిరుచులూ, కండీషన్లు మీకు, మీ అబ్బాయికీ నచ్చినట్లైతే, రెండు వైపులా మీరే పెద్ద దిక్కుగా వుండి మా పెళ్లి జరిపించండి. ఆ డబ్బుతో బంగారు నగలే కొంటారో చీరలే కొంటారో పెళ్లికే ఖర్చు పెడతారో మీ ఇష్టప్రకారమే చేయండి”.

ఆ మాటలు విన్న ఆ నలుగురు ఆశ్చర్యంతో ఆనందంతో కాసేపు నిశ్శబ్దంగా వుండి పోయారు. అలివేలుకు అయితే కళ్లలో నీళ్లు కూడా వచ్చాయి. ఇలాంటి కోడలు కోసమే కదా! ఇన్నాళ్ళు తన కొడుకూ, తానూ ఎదురు చూసింది. భగవంతుడు ఇలా నా కోరిక నెరవేర్చాడు. అని మనసులోనే భగవంతుడికి నమస్కారం చేసింది.

నవీన్ కూడా చాలా సంతోషించాడు. “ఇలాంటి అభిప్రాయాలు, ఆదర్శాలూ ఉన్న అమ్మాయి భార్యగా రావాలి అని ఎన్నిసార్లు మనసులో అనుకున్నానో! కొంత మంది అమ్మాయిలని చూస్తే అసలు ఈరోజుల్లో అలాంటి వాళ్లు వుంటారా అనే సందేహం కూడా వచ్చేసింది.

ఇప్పుడు ఉజ్వలని చూసాక మనుషుల్లో ఇంకా మనసూ, మానవత్వం, ప్రేమాభిమానాలు బతికే ఉన్నాయని నమ్మకం మరింత బలపడింది” అనుకున్నాడు.

వాసుదేవరావు వెంటనే వాళ్ల ఇంటి పురోహితులు ఆంజనేయ శర్మ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని ఎడ్రస్ పంపించారు. ఒక గంటలో ఆయన కూడా వచ్చారు.

పంచాంగం చూసి పది రోజుల్లో మంచి ముహూర్తం వుంది అని చెప్పారు. అందరూ ఆ ముహూర్తం ఓకే అనుకున్నారు.

“అమ్మా! ‘దీర్ఘాయుష్మాన్భవ ఇష్టకామ్యార్థ సిధ్ధిరస్తు’ అని దీవిస్తూ ప్రతీ ఆడపిల్లా నీలాగా ఆలోచిస్తే…. ఇంక వృద్ధాశ్రమాలతో పనిఉండదు. మళ్ళీ గతకాలపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టమౌతుంది. కుటుంబాలలో మనుషుల మధ్య దూరాలు తగ్గి సమస్యలు సమసిపోతాయి” అంటూ ఆంజనేయ శర్మ గారూ కూడా ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు.

“ఇందులో నా స్వార్ధం కూడా ఉందండీ. మా అమ్మ మా నాయనమ్మని ఎలా చూసుకుందో అది చూసిన నేను నా అత్తమామలని ఎలా చూసుకోవాలో తెలుసు కున్నాను. అలాగే మా తరాన్ని చూసిన మా పిల్లలు కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటారనే నమ్మకం నాకుంది.

ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలు ఉన్నతమైన ఆదర్శాలతో, ధైర్యంగా ప్రేమగా ఆత్మీయంగా వుంటారు. ఒంటరితనం అస్సలు ఫీల్ అవ్వరు. ఏవైనా సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.

అలాగే మన తరువాత తరాలు కూడా ఉమ్మడి కుటుంబ విలువలు నేర్చుకోవాలి. పిల్లలు మనం నోటితో చెపితే ఏదీ నేర్చుకోరు. మనం ఆచరించి చూపిస్తే వాళ్లు అది చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు వున్న జనరేషన్ కు వాళ్ల భాషలో చెప్పాలంటే….. ట్రెండ్ ను ఫాలో అవ్వకూడదు ట్రెండ్ ని మనమే సెట్ చేయాలి”.

అలా ఉజ్వలతో పెళ్లి చూపులు జరిగిన పదిరోజుల్లో కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. అందరి ముఖాలు సంతోషంతో కళ కళ లాడాయి…

—-

1 thought on “మారుతున్న యువతరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2021
M T W T F S S
« Aug   Oct »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930