April 19, 2024

అపాత్రదానం

రచన: ప్రభావతి పూసపాటి

“మీ బామ్మకి రాను రాను చాదస్తం ఎక్కువైపోతోంది.. ఎవెరెలా పొతే మనకేంటి అని అనుకోకుండా. సమాజసేవ, మంచి, మానవతా విలువలు అంటూసైదమ్మకి చెప్పాలని చూసారు. విసురుగా అంటూ టేబుల్ మీద గిన్నెలు తీసి సింకులో పడేయడానికి వెళ్ళింది. శ్వేత.
“ఏమి? ఏమైంది ఈ రోజు కూడా సైదమ్మ పనిలోకి రాలేదా ??” తన ప్లేట్ కూడా తీసి సింక్ లో వేస్తూ అడిగాడు సిద్దు.
“మీ బామ్మసుభాషితాలు విన్నాక ఎటువంటి వారైనా ఇల్లాంటి పనే చేస్తారు. “పని చేసుకోవాల్సి వచ్చిందని కొంత విసుగు తోనూ, నా మాటలవల్లే అది పని మానేసిందని నాకు తెలియాలని ఉద్దేశం తోనూ కొంచెం గట్టిగానే అంది.
“బామ్మ చెప్పినదాన్లో నాకు కొంచెం కూడా తప్పు ఏమి కనపడలేదు అమ్మ. బామ్మ చెప్పింది సరిగా అర్థం చేసుకొని ఉంటే చిన్నపిల్లల చేతికి కత్తి, చాకు ఎందుకు ఇవ్వమో అర్థం అవుతుంది”. అంటూ నన్ను, నా మాటని సమర్థిస్తున్నట్టు దేవునికి పూలమాల కడుతున్న నన్ను హత్తుకొని తల్లికి వినపడేలా ఒత్తి పలికాడు కొత్తగా పోలీస్ వుద్యోగం లో చేరిన మనవడు సిద్దార్థ్.
“మీ అమ్మ కూడా మీ బామ్మ ని ఏమి అనటం లేదు లేరా. ఎదో లేనివాళ్లు కదా అవసరమని అడిగి వుంటారు కదా ఇస్తే ఏమి పోతుంది అని మా అభిప్రాయం. అంతే, ” తన మనసులోని మాటని చెప్పేసారు పేపర్ చదువుతూ మా మాటలన్నీ వింటున్న మావారు.
పొద్దున్న నించి ఇంత సంభాషణ ఎందుకు జరుగుతోందో మీకు కూడా తెలియాలంటే కొంత గతం గురించి తెలియాలి.
**************
సైదమ్మ చాల ఏళ్లుగా మా ఇంట్లో పనిచేస్తోంది. సైదమ్మకి చదువుకోవడమంటే చాలా ఇష్టం. కానీ దాని ఇంటి పరిస్థితులు అందుకు సహకరించలేదు. కనీసం దాని పిల్లలైనా చదువుకోవాలని దాని ఆరాటం. గవర్నమెంట్ స్కూల్ లో ఐతే చదువు అంత బాగోదని రెక్కలు ముక్కలు చేసుకొంటూ నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ కొడుకుని, కూతురిని చదివిస్తోంది. కరోనా పుణ్యమాని అన్నీవ్యాపారాలు మూలపడ్డట్టు పిల్లల చదువులు కూడా సంవత్సర కాలం గా మూలపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా స్కూల్ మూసేశారని, వచ్చిన ఆ నాలుగు ముక్కలు ఇంట్లో ఉంటే పూర్తిగా మరిచిపోతారని గొడవ చేస్తుంటే, చదువుపట్ల దానికి వున్న మమకారం చూసి పోనిలే మనకి తెలిసిన విద్య కదా సహాయం చేసినట్టు ఉంటుంది, మనకి కొంత కాలక్షేపం అయినట్టు ఉంటుందని ఇద్దరికీ చదువు చెపుతాననని గత కొంత కాలంగా దాని పిల్లలిద్దరినీ నేను చదివిస్తున్నాను.
పిల్లవాడు శ్రవణ్ ఎనిమిదో తరగతి, ఆడపిల్ల సౌమ్య నాలుగు చదువుతున్నారు. పిల్లల పేర్లు బాగున్నాయి అంటే” నా పేరు మొరటుగా ఉంది కందా.. గందుకే వాళ్ళకి అసొంటి కొత్త పేర్లు పెట్టాను”అని మురిపెంగా చెప్పింది.
సౌమ్య కి తల్లి లాగే చదువంటే ప్రీతి. చెప్పిన ప్రతి విషయం శ్రద్దగా విని అర్థం చేసుకొంటుంది. నాకు తెలియకుండానే దానిపట్ల కొంచెం ప్రేమ కలగసాగింది . పిల్లవాడికి మాత్రం అసలు చదువంటే శ్రద్ధ ధ్యాస లేదు. ఎన్నిసార్లు చదివించినా ఒక్క విషయం కూడా వాడికి వంటబట్టడం లేదు. అసలు ఈ మాత్రం అరకొర తెలివి వున్నవాడు ఎనిమిదో తరగతి వరకు ఎలా పాసై రాగలిగాడో అర్థం కావడం లేదు. తను ఎలా చదివినా తల్లికి తెలియదుకదా పాసైపోతే చాలు అన్న భావం వాడు మాటల్లో చెప్పకపోయినా వాడి ప్రవర్తన లో ప్రస్ఫుటంగా కనపడుతోంది. సైదమ్మ ఎదుగుతున్న కొడుకుని చూసుకొని మురిసిపోతోంది. అటువంటి దానితో నీ కొడుకు ప్రయోజకుడు కాడు, వాడికి కనీస అక్షర జ్ఞానం కూడా లేదు అని చెపుదామంటే, కొడుకు బాగా చదివేస్తున్నాడు, రేపు మంచి ఉద్యోగంలో చేరి తమని పోషిస్తాడు అని ఆశతో ఉంది. పోనీ వాడితో ఆ విషయం చెప్పి చదువుపట్ల శ్రద్ధ కలిపిద్దామని అనుకొంటే వాడసలు ఇక్కడికి కేవలం వాళ్ళ అమ్మ బలవంతం మీద వస్తున్నట్టు చెప్పాడు.
సైదమ్మ కి భర్త లేడు. పిల్లలిద్దరిమీద ఆశలు ఉంచుకొని వాళ్ళని చదివించి వృద్ధిలోకి తీసుకురావడమే జీవిత పరమావధి అన్నట్టు జీవనం సాగిస్తోంది. ఈ సమయంలోనే స్కూల్ తెరిచామని, కానీ ఆన్ లైన్ క్లాస్ అని గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. సైదమ్మ ఆ వార్త విని డీలా పడిపోయింది. అసలే అంతంత మాత్రం చదువులు అవికూడా ఇలా చెపితే ఇంక ఎలా తమ పిల్లలు బాగుపడతారని వాపోయింది. కానీ నలుగురితోపాటూ నారాయణ కదా మనకి ఇష్టం వున్న లేకున్నా అందరితో కలిసి మనం కూడా నడవాలి కదా అని ధైర్యం చెప్పి స్కూల్ ఫీజు కట్టాము.
“ఆమోగోరు, గదేందో చెల్లు పోనంట, అది గావాలని రెండు రోజుల సంధి నా బిడ్డ తెగ లొల్లి చేస్తుండాడుగా .. స్కూలోళ్లు గందులో చదువు చెపుతారంట “గిన్నెలు కడుగుతూ చెప్పింది సైదమ్మ. నిజమే స్తొమత ఉన్నవాళ్ళ మాట సరే, సైదమ్మలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి?ఈ రోజుల్లో విలాస వస్తువులు కూడా ప్రతి ఇంటి లో ఒకటికి రెండు చేరి తేలికగా ఇచ్చేవేయగలుగుతున్నాము. పని వారి ఇళ్లలో కూడా అందుకే రైస్ కుక్కర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్స్ట్లో చేరి ఇలా వాళ్ళ జీవం విధానం కూడా మారిపోతోంది. ఇవ్వడం తప్పని కాదు కానీ దాని ప్రయోజనం వాళ్ళకి ఎంత వరకు ?? చేసేదేమిలేక ఇంట్లో వున్నపాత స్మార్ట్ ఫోన్ రిపేర్ చేసి దానిలో డేటా కార్డు కి సరిపడా డబ్బులు కట్టి ఇచ్చాను.
వారము పది రోజులు బాగానే జరిగింది. పిల్లలిద్దరికీ వాట్స్ అప్ లో పాఠాలు పంపిస్తారుట. మళ్ళీ వీళ్లు సాయంత్రం వాటి సమాధానాలు వాట్స్ అప్ చేయాలట. పోనిలే మళ్ళీ తిరిగి రెగ్యులర్ స్కూల్ తెరిచేవరకు ఇలా చదువు సాగినా పరవలేదులే అనుకొంటుంటే ఆ సాయంత్రం సౌమ్య చెప్పిన విషయం కంగారుపడేలా చేసింది.
” ఏమే ఎలా అర్థం అవుతున్నాయి? ఆన్ లైన్ క్లాస్ నువ్వు మీ అన్నయ్య నేర్చుకొంటున్నారా ?”. అని అడిగితె సౌమ్య ఏడుస్తూ “శ్రవణ్ ఫోన్లో ఏమేమో చూస్తున్నాడు. ఆటిల్లో ఉన్నోళ్లు బట్టల్లేకుండా వున్నారు అవన్నీ గలీసుగున్నాయి , అమ్మకి చెప్పమాకు, చెపితే కొడతా ” అని అరుస్తున్నాడు అంటూ భయపడుతూ చెప్పింది.
సాయంత్రం శ్రవణ్ ని పిలిచి నిలదీస్తే ముందు భయ పడిన తర్వాత మనల్ని కాదులే తిడుతున్నది అన్నట్టు ఏటో చూస్తూ నిలబడ్డాడు. ఎంత చెప్పినా వాడికి బోధ పడదని సెల్ ఫోన్ తీసుకొని పంపించేసాను.
ఇంటికి వెళ్లి వాడు ఫోన్ లాక్కొని పంపించేసానని చెప్పాడట, అన్నకి భయపడి సౌమ్య నోరు విప్పలేదుట, ఇక్కడికి వచ్చి సైదమ్మ నానాగోల చేసింది. వాడి చేతిలో ఫోన్ వాడిని ఎంత పాడుచేస్తుందో చెప్పినా వినేలా లేదు.. నువ్వు పనుల కోసం తిరుగుతూ ఉంటావు. నేను భాద్యత తీసుకొని వాడిని చదివిస్తాను, డైరెక్టుగా పరీక్షలు రాయిద్దాము అని ఎంత చెప్పినా ఫోన్ ఇవ్వకపోవటమే మా తప్పు అన్న భావనతో వెళ్ళిపోయింది. కోపంగా వెళ్లినా తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తుందని నా నమ్మకం.
“సైదమ్మ ఎదురింటి పంకజం గారింట్లో పనికి కుదిరింది ” శ్వేత మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. మనం ఫోన్ ఇవ్వము అని అన్నామని తన పిల్లల చదువు కోసమని ఫోన్ ఇస్తే పనికి వస్తాను అని అడిగిందట. వాళ్ళకి సైదమ్మలాంటి కష్టపడి పని చేసే అమ్మాయి కావాలని ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నారు కదా ఇదే అదను అనుకొని ఫోన్స్ ఇచ్చేసారుట. నిన్నటి నుండి పనికి వెళ్తోందిట. ఆపై మాటలు వినపడటం లేదన్నట్టు అనిపించింది నాకు.
పూజకు కూర్చున్నానే గాని మనసు నిలవటం లేదు. ఇన్నేళ్ల నుండి మన ఇంట్లో పని చేస్తోంది, ఎన్నిసార్లు పంకజం పని కోసం పిలిచినా వెళ్ళని మనిషి, పిల్లల చదువు భాద్యతలు తను తీసుకొని వాళ్ళని చదివిస్తాను, ఫోన్ ఇవ్వకపోవటం పిల్లాడి మంచికోసమని ఎంత చెప్పినా వినకుండా సైదమ్మ చేసిన పని ఎందుకో మనసుకు కష్టం అనిపించింది.
నా పిచ్చిగానీ అవసరాలు ఎటువంటి మనిషినైనా తేలికగా మార్చివేస్తాయి, సైదమ్మ లాంటి మనిషి ఎంత?నా భయం తండ్రి తల్లి అదుపు ఆజ్ఞల్లో ఉన్నవాళ్లే తేలికగా తప్పటడుగు వేస్తున్నారు. పైగా సెల్ ఫోన్ పుణ్యమాని ప్రపంచం మొత్తం తమ అరచేతులలో చూడగలుగుతున్నారు. కత్తి వాడకం తెలిసినవారే దానిని సరిగా ఉపయోగిస్తారు, లేకపోతే దానివలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఆన్ లైన్ క్లాస్ అని నేటి ప్రస్తుత పరిస్థితిలో అన్నెం పున్నెం తెలియని పసికందులకి ఫోన్ అందజేస్తున్నారు, కేవలం అందుకి ఉపయోగిస్తే సరే, కానీశ్రవణ్ వయసులో వున్న కుర్రాడు, శ్రవణ్ లాంటి వాళ్ళకి అది ప్రమాదకర హేతువు. అందుకని ఫోన్ తీసుకున్నాను అని సైదమ్మ తోఇంకొంచెం విడమరిచి చెప్పవలసింది. తను ఫోన్ తీసుకున్నానని అక్కసు తప్ప ఎందుకు ఆ పని చేసానో తలకెక్కించుకోలేదు.
లేచి మొక్కలకి నీళ్లు పోస్తుంటే సైదమ్మని, పనికి సాయం చేయడానికి వచ్చిన సౌమ్యని, కలవడానికి వచ్చిన శ్రవణ్ పంకజం ఇంట్లోంచి వెళ్తూ తన చేతిలోని ఫోన్ నాకు కనపడేలా ఎత్తి చూపించి నువ్వెంత, నీ ఫోన్ ఎంత అన్నట్టు తల ఎగరేసుకొని పోయాడు. వాడలా వెళ్లడం వెనకనించి శ్వేత కూడా చూసినట్టు వుంది.
శ్వేతకి కూడా సైదమ్మ చేసిన పని నచ్చలేదు, శ్రవణ్ గురించి, వాడు ఇన్నాళ్లు ఎలా చదవకుండా పరీక్షలు పాస్ అవుతున్నాడో, అలాకాకుండా వాడికి కూడా చదువు అబ్బి నాలుగు అక్షరముక్కలు నేర్చుకోవాలని నేను పడే తపన చూసి “ఎందుకు అత్తయ్య అంత ప్రయాస పడతారు. ఈ రోజుల్లో కుర్రాళ్లకు చదవటం కన్నా పరీక్షా ఎలా పాస్ అవ్వవచో తేలిక గా నేర్చుకొంటున్నారు. చదువు దాని విలువ, దాని పట్ల అంకిత భావం అలాంటివి ఏమి లేవు. డిగ్రీలు సంపాదిస్తున్నారు అంతే, జ్ఞానాన్ని కాదు. మీకు తోచిన సహాయం మీరు చేద్దామనుకున్నారు అందుకొనే భాగ్యం వాళ్ళకే లేదు పదండి లోపలికి “అని నిస్తేజంగా చూస్తున్న నన్ను పట్టుకొని లోనికి తీసుకొని వచ్చింది. “ఆలోచనలు మానేసి కొంచెం సేపు పడుకోండి.”అని తలుపు చేరవేసి వెళ్ళింది.
“సిద్దు బాబు సిద్దూబాబు, నా బిడ్డని నువ్వే రచ్చించాలా, నువ్వే వాడిని విడిపించాలి, నా కొడుకు ఏమి చేసిండో నా కేరకలేదు, అయ్యా సిద్దు బాబు “బయట తలుపులు బాదుతూ సైదమ్మ ఏడుపు వినిపిస్తోంది.
“ఏమైంది సైదమ్మ శ్రవణ్ కి ఏమైంది” ఆదుర్దాగా అందరం బయటికి వచ్చి అడిగాము,
అయ్యా.. అయ్యా నాకేటి తెలవదు.. ఆడు ఇంటి పక్కన ఆడుకొంటున్న చిన్న పోరిని ఎత్తుకొచ్చినాడంట.. ఇంట్లోకి గొంటపోయి ఏమో చేసినాడంట. ఆ పోరి అరుపులు విని చుట్టుపక్కలోళ్లు ఆడిని తన్ని టేషనుకు గుంజకు పోయినారంట బాబు.. నాకు బయమెత్తనుంది నాకెవరు దిక్కు బాబూ నీ వె కాపాడాలి బాబు ” గుండెలు ద్రవించేలా ఏడుస్తోంది సైదమ్మ.
జరిగింది గ్రహించి సిద్దు “నేను చూస్తాను సైదమ్మ పద. వాడికి ఏమి కాదులే.. నువ్వు ఏడవకు పద “అంటూ జీప్ స్టార్ట్ చేసి సైదమ్మని తీసుకొని వెళ్ళాడు.
సైదమ్మ ఏడుపుకి దాదాపు సందు జనమంతా మా ఇంటి ముందు గుమిగూడారు. అందరిలోనూ గుసగుసలు మొదలయ్యాయి ప్రతివారు ఈ రోజుల్లో టీవీ సీరియల్స్ ఎంత ఛండాలంగా ఉంటున్నాయి, సినిమాలు ఎంత రక్తపాతంగా చిత్రికరిస్తున్నారు, పిల్లలు ఎలా ఫోన్లకి బానిసలైపోతున్నారు అన్న విషయాల మీద కాళ్ళు, నోరు నొప్పి పుట్టేవరకు చర్చించుకొని, మళ్ళీ సాయంత్రం సీరియల్ వచ్చేటైం అయ్యింది, మిస్ కాకూడదు అనుకొంటూ వెళ్లిపోయారు. అంతటితో సమాజం పట్ల తమ వంతు భాద్యత అయిపోయిందనుకొంటు .
ఎదురింటి పంకజం మాత్రం జరిగినదాంట్లో తన పాత్రేమీ లేదన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది.. ఒక విధం గా పంకజం తప్పు లేదు కానీ కొంత “పాత్రత” తెలిసుకొని వుండాల్సింది. దూరంగా గుళ్ళోనుంచి అపాత్రదానం ఎంత ప్రమాదకర హేతువో చెపుతూ దానం చెయ్యటం ఎంత ప్రధానమో అంత కన్నా దానం పట్టే వ్యక్తి సంస్కారం ఎరిగి దానం చెయ్యాలన్న చాగంటి గారి సందేశం ఆ నిశ్శబ్ద వాతావరణంలో మారుమోగుతోంది .

2 thoughts on “అపాత్రదానం

  1. నిజమే పాత్రతనెరిగి దానం చెయ్యాలి. నువన్నట్లు అన్ని తరగతులవారినీ అబద్దపు జీవితం వేపు అడుగులు వేయిస్తున్న ఆంలైన్ క్లాసులు, నేటి విద్యార్థులను ఎలాంటి పరిస్థితులలోకి నెడుతున్నాయో చాలా బాగా చెప్పావు. నైస్ నరేషన్…కంగ్రాచ్యులేషన్స్ ప్రభావతి పూసపాటి

Leave a Reply to మణి Cancel reply

Your email address will not be published. Required fields are marked *