April 20, 2024

అమ్మమ్మ – 28.

రచన: గిరిజ పీసపాటి

నాగ అలా అడగడానికి కారణం చిన్నప్పటి నుండి గిరిజ పెద్దగా నడవలేదు. కాస్త దూరం నడిచినా మనిషి నీరసించిపోతుంది. కానీ పరిస్థితిలే ఆరిందాతనాన్ని ఇస్తాయేమో. అందుకే “అదేం లేదమ్మా. కానీ కేరేజీ లోపలకి తీసుకురావాలంటే డబ్బు కట్టాలని కింద గేట్ దగ్గర వాచ్ మేన్ ఆపేస్తున్నాడమ్మా!” అంది.
“ఎంత అడిగాడు” అనడిగిన తల్లితో “ఇరవై రూపాయలు” అంది. “సరే. రేపు ఉదయం ఈ పది రూపాయలు ఇవ్వు. మిగిలిన డబ్బులు తరువాత మా పెద్దవాళ్ళు ఇస్తామన్నారని చెప్పు” అంటూ హేండ్ బేగ్ లోంచి పది రూపాయలు తీసిచ్చింది నాగ.
సరిగ్గా రాముడువలసలో ఫంక్షన్ పూర్తి అయేసరికి టెలిగ్రామ్ అందింది. ఆడవాళ్ళని అన్నీ సర్దుకుని తరువాత రమ్మని చెప్పి పీసపాటి తాత, చిన్న కొడుకు, అల్లుడు, తమ్ముడి కొడుకు, తోడల్లుడి కొడుకు, తమ్మినాయుడనే వ్యక్తి ఇలా మగవారంతా హడావుడిగా బయలుదేరి వచ్చారు.
ఒక్క ఆడమనిషి కూడా రాకుండా మొత్తం మగవాళ్ళే వచ్చారని భర్త చెప్పగా వన్న నాగ గుండెల్లో రాయి పడింది. ‘తను వసంతను వదిలి ఇంట్లో వీళ్ళందరికీ వండి పెట్టడం కష్టం. గిరిజ చిన్నపిల్లైనా తమ వరకూ వండి, అటూ ఇటూ తిరిగి కష్టపడుతోంది. మడి, ఆచారం ఉన్నవాళ్లు కావడం వల్ల హోటల్ లో తినరు’.
కానీ “నేను చెయ్యగలనమ్మా! నువ్వు అక్కను చూసుకో” అంటూ భరోసా ఇచ్చింది గిరిజ. తాతకి ఇష్టం అని తండ్రి తెచ్చిన దోసకాయ పప్పు, వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, చారు చేసింది. అందరికీ భోజనం వడ్డించి, తాతగారు తన వంటను ఏమంటారో అని బిక్కుబిక్కుమంటూ ఒక పక్కన నిలుచుంది. ఆయనసలే భోజన ప్రియుడు.
ఆయన రుచి చూసి “దోసకాయ పప్పు మీ అమ్మ తప్ప ఎవరూ రుచిగా వండలేరు. కానీ, మీ అమ్మ కన్నా బాగా చేసావు” అని మెచ్చుకోగానే ‘హమ్మయ్య’ అని తేలిగ్గా ఊపిరి తీసుకుంది.
తరువాత అందరూ కలిసి హాస్పిటల్ కి బయలుదేరారు. యధావిధిగా కారియర్ ని లోపలికి పంపడానికి డబ్బు అడిగాడు వాచ్ మేన్. గిరిజ తల్లి ఇచ్చిన పది రూపాయలు అతని చేతిలో పెట్టింది.
“ఇరవై ఇవ్వాలని నిన్ననే చెప్పాను కదా! పదే ఇచ్చావేంటి? లోపలికి పంపను గాక పంపను” అంటూ గేట్ మూసేసాడు.
దూరంగా చెట్టు నీడన నిలుచున్న పీసపాటి తాత వచ్చి “ఏమైంది గిరీ?” అని అడగగానే విషయం చెప్పింది. అంతే. ఆ వాచ్ మేన్ ని నానా తిట్లూ తిట్టి “మర్యాదగా గేట్ తీస్తావా, నీ
ఉద్యోగం ఊడగొట్టించమంటావా” అనే సరికి పిల్లిలా గేట్ తీసాడు. అందరూ వార్డులోకి వెళ్ళి వసంతను చూసారు.
పెద్ద మనవరాలిని చూస్తూనే “అదేమిటి నాగమ్మా పిల్లని కింద పడుకోబెట్టారు. మంచం ఇవ్వలేదా!?” అని ప్రశ్నించారు తాత. “మంచం ఇవ్వాలంటే రెండు వందలు కట్టాలట మామయ్య గారు. ప్రస్తుతం అంత డబ్బు లేక” అంటూ ఆపేసింది నాగ.
“ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా! డబ్బు ఎందుకూ!?” అంటూనే అటుగా వచ్చిన హెడ్ నర్స్ తో “నా మనవరాలికి వెంటనే ఒక మంచం వేయించమ్మా!” అన్నారు. ఆమె కాస్త పొగరుగా “ఆవిడకి‌ ముందే చెప్పాను, అడిగిన డబ్బు ఇస్తే ఆరోజే ఇచ్చేవాళ్ళం” అంది.
ఇక తాత అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. పెద్ద కళ్ళతో ఆవిడని చూస్తూ “గవర్నమెంట్ హాస్పిటల్ లో డబ్బు ఎందుకివ్వాలి? కింద వాచ్ మేన్ అలాగే వాగాడు.”
“ఎక్కడ మీ సూపరింటెండెంట్? పది నిముషాలలో నా ముందు ఉండాలి. లేకపోతే ఇప్పుడే రామారావుకి, దగ్గుబాటికి ఫోన్ చేస్తాను”. అన్నారు అపర వీర భద్రుడిలా కోపంగా. (అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయన అల్లుడు దగ్గుబాటి గారు హెల్త్ మినిస్టర్.)
” ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరు చెప్పేవాళ్ళే. నీకు వాళ్ళు తెలిసినా వాళ్ళకు నువ్వు తెలియొద్దూ” అందామె వెటకారంగా.
“వెళ్ళి మీ సూపరింటెండెంట్ కి చెప్పు. పీసపాటి నరసింహమూర్తి పిలుస్తున్నాడని. అతనే పరిగెట్టుకుంటూ వస్తాడు” అన్నారు తాత మరింత కోపంగా.
“ఆఁ…ఆఁ… వస్తారు. నీలాంటి వాళ్ళు పిలవగానే పరిగెట్టుకుంటూ వస్తారు మరి. ఆయనకు నీలా పనీ పాటు లేదనుకున్నావా” అందామె మరింత రెచ్చగొడుతూ.
అప్పటివరకు అక్కడే నిలబడి ఆ గొడవంతా చూస్తున్న వార్డ్ బాయ్ తాత గారి పేరు వినగానే గబుక్కున ముందుకు వచ్చి “ఆవిడకు మీరెవరో తెలియక మాట్లాడుతున్నారు గురువు గారు. ఏమీ అనుకోకండి.”
“నేను మీ అభిమానిని. నాటకంలో కృష్ణుడి వేషంలో తప్ప విడిగా ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు. ఇన్నాళ్ళకు నాకా అదృష్టం కలిగింది. పెద్దయ్యగారి రూమ్ కి నేను తీసుకెళ్తాను” అంటూ తాతగారి కాళ్ళ మీద పడ్డాడు.
అతడి చర్యను, తాత గారికి ఇచ్చిన గౌరవాన్ని గమనించిన నర్స్ మరేమీ మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయింది. తాతగారు సూపరింటెండెంట్ ని కలిసి, పరిచయం చేసుకోగానే అతను చాలా మర్యాదగా మాట్లాడి వెంటనే బెడ్ ఇవ్వమని ఆర్డర్ వేసారు. అతను కూడా తాతగారి అభిమానే కావడం విశేషం.
నర్స్ మీద ఏక్షన్ తీసుకుంటానని చెప్పిన అతడిని వారించి “ఎవరినీ పొట్ట మీద కొట్టకూడదు డాక్టర్ గారూ! ఇక మీద పేదవాళ్ళని ఇలా డబ్బు కోసం పీడించవద్దని చెప్పండి చాలు” అన్నారు తాత గారు.
మర్నాడు మధ్యాహ్నానికి ఆడవాళ్ళు కూడా వచ్చారు. పగలు వంట పీసపాటి మామ్మ, చిన్న కోడలు చేసేవారు. రాత్రి వంట మాత్రం గిరిజ, కామేశ్వరి (పీసపాటి తాతయ్య చిన్న కొడుకు యొక్క పెద్ద కూతురు) చేసేవాళ్ళు.
హాస్పిటల్ లో జాయిన్ అయిన పదిరోజులకి గాంగ్రిన్ (gangrene) ఫామ్ అయిందని వసంతకి ఆపరేషన్ చేసి ఎడమ చేతి వేళ్ళు మూడు (మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలులో సంగం) తొలగించారు.
ఆ రోజు “ఇక అందరూ నన్ను అవిటిది అంటారు. నాకిష్టమైన గోరింట, గోళ్ళ రంగు అవసరం ఇక నాకు లేకుండా చేసాడా దేవుడు” అంటూ వసంత ఏడ్చిన ఏడుపుకి అందరి గుండెలూ ద్రవించిపోయాయి.
వెంటనే వసంత మేనత్త (పీసపాటి తాతయ్య కూతురు) “నిన్నెవరైనా పల్లెత్తు మాటంటే చంపేస్తాను. నిన్ననే ధైర్యం ఎవరికి ఉంది” అంటూ ఓదార్చింది.
వసంతకు చేతి వేళ్ళు తీసేసారని ఉత్తరం ద్వారా తెలుసుకున్న అమ్మమ్మ చాలా ఏడ్చింది. వెంటనే వెళ్ళి మనవరాలిని చూడాలని తపించింది. కానీ పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ముందే ఒప్పకున్న పనులు వదిలి వెళ్ళలేకపోతున్నందుకు ఇంకా బాధ పడింది.
మరో వారం రోజులకు గిజకు సహాయంగా కామేశ్వరిని ఉంచి అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కామేశ్వరి కూడా పనిమంతురాలు కావడంతో ఇద్దరూ కలిసి ఇంటి పని, హాస్పిటల్ కి వెళ్ళే పని చూసుకోసాగారు.
ఒకరోజు వసంతకు డ్రస్సింగ్ చేస్తుంటే వేళ్ళు లేని అక్క చేతిని మొదటిసారి చూసిన గిరిజ కళ్ళు తిరిగి పడిపోయింది. వసంత మంచం పక్కనే నేల మీద పక్క వేసి గిరిజను పడుకోబెట్టి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. చాలాసేపటి వరకూ స్పృహలోకి రాలేదు. స్పృహ వచ్చేసరికి హై ఫీవర్ ఉంది.
నెల రోజులకి వసంతను డిస్చార్జ్ చేసారు. ఆ నెలరోజులలో డాక్టర్స్ అంతా వసంతను చాలా అపురూపంగా చూసుకున్నారు. ముఖ్యంగా డాక్టర్ భాస్కరరావు గారు (సర్జన్) అయితే వసంతను కన్న కూతురిలా గారాబం చేసారు.

***** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *