March 29, 2024

తామసి – 11

రచన: మాలతి దేచిరాజు

షీబాతో ఆ ఘటన జరిగిన తర్వాత, గౌతమ్ ఆమెని కలవడం తగ్గించాడు. ఎదురుపడినా మొహం చాటేస్తున్నాడు. అది మరింత బాధ పెడుతోంది ఆమెని. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది. చివరిసారిగా అడుగుదామని నిశ్చయించుకుంది.
‘టక్..టక్..టక్…’ తలుపు చప్పుడు విని గుమ్మం వైపు చూసాడు గౌతమ్. ఎదురుగా షీబా.
“రా…” అన్నాడు.
“ఎందుకొచ్చావనంటావ్ అనుకున్నా.” చెప్పింది తను.
“తెలిసినవి అడగను నేను.”
“కాని, తెలిసి కూడా పట్టించుకోవు! అంతేనా?”
“పట్టించుకోకపోవడమే… పట్టించుకోవడం…”
“గౌతమ్… నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను… అర్థం చేసుకో!”దీనంగా అడిగింది.
ఆమె మాటలకి అతనికి కూడా బాధ కలిగింది. కానీ ‘ఆడదాని కన్నీటి వెనుక ఆవేదన కంటే అవకాశవాదం ఎక్కువ ఉంటుంది. ప్రతిసారీ నమ్మకూడదు!’ అనుకున్నాడతను.
“లేదని అనలేదే… నాకొద్దని అంటున్నాను.”
గొంతులో ఆగిన దుఃఖం ఏడుపులా పరివర్తనం చెంది, అల్పపీడనంగా మారి, పెనుతుఫానులా కళ్ళలోంచి కన్నీటి జడివానను కురిపించింది… ఆమె శోకంతో నిండింది ఆ గదంతా. ఓదారిస్తే దుఃఖం కన్నా ఓదార్పు అలవాటవుతుంది, వదిలేస్తే తనని తానే ఓదార్చుకునే బలం వస్తుందనుకుని, కళ్ళు గట్టిగా మూసుకుని నిలబడ్డాడు గౌతమ్.
చూడ్డానికి రాయిలా అనిపించినా, అతనిలోనూ కన్నీరుంది. ఆడదాని కన్నీరులో మనసు తెలుస్తుంది, మగాడి కన్నీరులో మనసు తడుస్తుంది. అడుగు కూడా కదలకుండా నిలబడ్డాడు అతను. గుండెలు పగిలేలా ఏడుస్తోంది తను. ఆమె రోదన ధ్వనిస్తోంది, అతని నిశ్శబ్దం ప్రతిధ్వనిస్తోంది.
హృదయంలో వేదన అలిసి, కళ్ళల్లో కన్నీరు ముగిసి ఆ పూటకి బరువెక్కిన హృదయంతో వెళ్ళబోతూ… ఒక్క క్షణం ఆగింది తను. అతని వైపు చూసింది. అయిదేళ్లుగా గడిచిన తన ప్రేమకథంతా ఆమె కళ్ళ ముందు కదిలింది… ఆ క్షణం అనిపించింది తనకి.
“కలిస్తేనో, కలవాలనుకుంటేనో మాత్రమే ప్రేమ ఏడిపిస్తుంది, ఆడుకుంటుంది, నిలువెల్లా దహిస్తుంది… వాస్తవాన్ని చూస్తూ ఊహల్లో ఉంటేనే ప్రేమ ప్రేమిస్తుంది… ప్రేమనిస్తుంది…” అని.
అతన్ని వదిలి అక్కడ నుంచి కదలాలంటే ఆమెకి అడుగు పడట్లేదు. మళ్ళీ దుఃఖం… ఈసారి ఆపగలిగింది. అంటే అర్థం నొప్పికి అలవాటుపడుతోంది. గుమ్మం దాటాలంటే భయం వేసింది. ఆ అడుగు అతని జీవితం నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు వేసే తొలి అడుగులా తోచింది. ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తుకుని వెళ్లి అతన్ని మనసారా హత్తుకోవాలనిపించింది. కానీ గుండె ధైర్యం సరిపోలేదు. అందుకే తప్పనిసరై, గుమ్మం దాటింది, గుండెని వదిలేసి!

*****

“అరే వా… ఇజాక్ నీలో కూడా కవి ఉన్నాడ్రోయ్.” అనుకున్నాడు తురకంలో ఆ వాక్యం చదివి భుజం తట్టుకుంటూ. అంతే హుషారుగా పేజీ తిప్పాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ …
ఆరో నెంబర్ ప్లాట్ ఫాం పై వచ్చి ఉంది విశాఖ ఎక్స్ ప్రెస్… చేతిలో సూట్ కేస్ తో దిగింది నసీమా. స్టేషన్ నుంచి బయటకి వచ్చి ఆటో ఎక్కింది.
ఆటో నేరుగా అమీర్ పేట్ సెంటర్లో ఉన్న ఒక లేడీస్ హాస్టల్ ముందు ఆగింది.
“ఎంతా?” అడిగింది తను ఆటో దిగి.
“నూట యాభై!” చెప్పాడతను. ఇచ్చి హాస్టల్ లోకి నడిచింది.
సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని అకౌంట్స్ చూస్తోంది వార్డెన్ విజ్ఞానేశ్వరి. చూడగానే నవ్వొచ్చే రకం తను. తన ముందుకొచ్చి నిలుచున్న నసీమాని చూసి.
“ఏం కావాలి?” అనడిగింది ముక్కు పై నుంచి కళ్ళజోడు సరి చేసుకుంటూ.
“రూమ్ కావాలి.” మంద్ర స్వరంతో చెప్పింది నసీమా.
“ఏం చేస్తుంటావ్?” అరిచినట్టు అడిగింది.
“స్కూల్ లో టీచర్ ని.”
“స్కూల్ లో..టీ..చారు..సాంబారు..ఏమిటి నా కళ్ళజోడు! స్కూల్ కో పేరు ఊరు లేదా?”
“గాయత్రి పబ్లిక్ స్కూల్.”చెప్పింది
“మ్…జీతమెంతో?”
“పదిహేను వేలు.”
“పదిహేను అంటే చాలదూ? వేలు అని నొక్కి వక్కాణిస్తున్నావ్… వేలు కాకపోతే వందలిస్తారా
లేక లక్షలిచ్చేంత గొప్ప ఉద్యోగమా? సరే సరే… ఇంతకీ ఏ ఊరు?”
“వైజాగ్.”
“అమీర్ పేట్ లో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ హాస్టల్ కే ఎందుకు వచ్చావూ?”సాగదీస్తూ అడిగింది.
“ఈ హాస్టల్ అయితే స్కూల్ కి దగ్గరగా ఉంటుందని.”
“స్కూల్ కి దగ్గరగా ఉందని వచ్చావా? పార్క్ కి దూరంగా ఉంటే! వెళ్ళిపోతావా?”
నవ్వింది భళ్ళున, తనేసింది జోక్ అనుకుని నసీమా.
“చుప్. ఇంతకీ బాయ్ ఫ్రెండు… గట్రా ఎవరైనా ఉన్నారా?”
లేరని తల అడ్డంగా ఊపింది నసీమా.
“మ్. వెరీగుడ్. అలాంటివేమైనా ఉంటే నా హాస్టల్ లో ఉండటానికి ఒప్పుకోను. మగాళ్లంటేనే నాకు ఎలర్జీ. మగాళ్ళే కాదు అసలు మగ వాసన కూడా పడదు.”మూతి ముప్పైమూడు వంకర్లు తిప్పుతూ చెప్పింది. ఓపిగ్గా విన్నది నసీమా.
“సరే… సరే… అడ్వాన్సు 2800. ఇవ్వాళ డేట్ ఎంతా?”
“పదమూడు!”
“ప్రతీ నెలా పదమూడో తారీఖుకి ఫీజు కట్టేయాలి… అర్థమైందా?
తలూపింది అయ్యిందన్నట్టు
“సుశీలా….సుశీలా…” పిలుపు విని బిరబిరా వచ్చింది సుశీల.
“ఈ అమ్మాయిని సెకెండ్ ఫ్లోర్ 201 కి తీసుకెళ్ళు…” ఆజ్ఞాపించింది
“అలాగేనమ్మా.” అంది తను వినమ్రంగా.
*
“ఇదేనమ్మా.” అని రూమ్ చూపించింది సుశీల నసీమా కి. తను లోపలికెళ్ళింది.
రెండు మంచాలు అటూ ఇటూ వేసి ఉన్నాయి. మధ్యలో ఖాళీ. మంచాల మధ్య గోడకి ఆనించి రెండున్నర అడుగుల టేబుల్. గది చివర ఇంకో గది. బాత్రూమ్ కాబోలు.
ఒక చిన్న అల్మారా, నాలుగు షెల్ఫ్ లు… గదికి ఇద్దరు చొప్పున మొత్తం ఆ హాస్టల్ లో నలభై మంది దాకా ఉంటారు.
స్నానం చేసి టిఫిన్ తిని స్కూల్ కి వెళ్ళింది నసీమా. జాయిన్ అయిన మొదటి రోజే నాలుగు పీరియడ్ లు వేసారు. సాయంత్రానికి తిరిగి హాస్టల్ చేరుకుంది. తను వచ్చేసరికి గదిలో మరో బెడ్ పైన పడుకుని ఉన్నారెవరో అటు తిరిగి. తన రూమ్ మేట్ కాబోలు అనుకుంది. బాత్ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లేచి ఉంది ఆ అమ్మాయి. తనని చూసి,
“హాయ్… నా పేరు సీమా… మీరు?” అంది షేక్ హ్యాండ్ ఇస్తూ.
“షీబా…” చెప్పింది తను, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. నసీమాకి ఏదోలా అనిపించింది కానీ అంతగా పట్టించుకోలేదు. డిన్నర్ కి. ఎవరికి వాళ్ళు వెళ్లి ప్లేట్ లలో భోజనం పెట్టించుకు వస్తున్నారు. నసీమా కూడా వెళ్లి తెచ్చుకుంది. షీబా మాత్రం బెడ్ పై పడుకునుంది. నడుం వాల్చి రూఫ్ ని చూస్తూ.
“మీరు తినరా?”అడిగింది నసీమా..
“ఆకలిగా లేదు…” అని మొహం అటు తిప్పి పడుకుంది షీబా.
ఇలా ఎప్పుడూ మూడీగా ఉండేది షీబా. గౌతమ్ నుంచి దూరంగా ఉండాలని హాస్టల్ మారింది. కానీ తను మనసింకా మారలేదు, గౌతమ్ తన మనసు నుంచి దూరం కాలేదు. నసీమా తనని గమనిస్తూనే ఉంది. కానీ మాట కలుపుతున్న ప్రతిసారీ తప్పుకుపోతోంది షీబా.
ఆ రోజు షీబాకి ఒంట్లో బాలేదు బాగా జ్వరంగా ఉంది. స్కూల్ కి వెళుతూ షీబా ని చూసింది. తొమ్మిది కావొస్తున్నా లేవలేదేంటి అనుకుని లేపడానికి ప్రయత్నించింది.
“షీబా… షీబా…” అయినా లేవలేదు. తాకి చూస్తే తన ఒళ్లు కాలుతోంది. డాక్టర్ వచ్చి చూసింది.
ఇంజెక్షన్ చేసి మందులిచ్చి, “కంగారు పడాల్సిన పన్లేదు. నీరసంగా ఉండటం వల్ల సిక్ అయ్యిందంతే… టేక్ కేర్.”
అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్.
నసీమా స్కూల్ కి సెలవు పెట్టి షీబా దగ్గరే ఉండి, టైం కి మందులేయడం, టిఫిన్ తినిపించడం చేసింది… రాత్రి కూడా తనకి అంతగా నిద్రపట్టలేదు. మధ్యమధ్యలో లేచి షీబాని చూస్తూనే ఉంది,
తెల్లవారింది. నసీమా నిద్ర లేచేసరికి పదయ్యింది… టేబుల్ పైన టిఫిన్ రెడీ గా పెట్టి ఉంది.
అప్పటికే లేచి ఉన్న షీబా తన వైపు చూసి,
“గుడ్ మార్నింగ్” అనగానే, నసీమా ముఖం విప్పారింది.
“వెరీ గుడ్ మార్నింగ్…” అంది. ఇద్దరి మధ్య అప్పట్నుంచి స్నేహం పెరిగింది. కానీ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలీదు. తెలిసే సమయం ఆసన్నమైంది.
***
“వాక్… వాక్… వాక్…” వాంతులు చేసుకుంటోంది షీబా.
“ఏమైంది షీబా..” అడిగింది నసీమా కంగారుగా.
“ఫుడ్ పాయిజన్ అనుకుంటా…” అంది నోరు తుడుచుకుంటూ.
“హాస్పిటల్ కి వెళదామా?”
“వద్దొద్దు… నైట్ కి సేట్ అయిపోద్దిలే…” అందో, లేదో మళ్ళి వాంతులు.
నసీమా వెంటనే డాక్టర్ ని తీసుకు వచ్చింది. చెక్ చేసి, “షీ ఈజ్ ప్రెగ్నెంట్ ” అంది డాక్టర్.
షాక్ అయ్యింది నసీమా. తలదించుకుంది షీబా. డాక్టర్ వెళ్ళిపోయింది..
“ఏంటి షీబా ఇది?” అడిగింది…
ఎవరో ఒకరికి చెప్పుకోవాలి అనుకుందో, ఏమో… జరిగినదంతా చెప్పింది నసీమాకి, కానీ ఎక్కడా గౌతమ్ పేరు చెప్పలేదు… అంతా విని మౌనం వహించింది నసీమా కాసేపు,
“ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?” సమాధానం లేదు షీబా దగ్గర.
“అబార్షన్ తప్ప వేరే మార్గం లేదు షీబా…” నసీమా మాటకి అవునన్నట్టు తలూపింది తను.
“పోనీ అతనికి ఈ విషయం చెప్పి చూడు…”
“వద్దు… అబార్షన్ చేయించుకోవడమే మంచిది. ఇది అడ్డం పెట్టుకుని దక్కించుకోవాలని అనుకోవట్లేదు.” కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. ఓదార్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది నసీమా..
**
“మేరి సపనోకి రాణి కబ్ ఆయేగి తూ…” అంటూ మోగుతున్న ఫోన్ తీసి, “హలో…” అన్నాడు గౌతమ్.
“గౌతమ్, స్మాల్ హెల్ప్ యార్…” అట్నుంచి తన కొలీగ్… రాజేష్.
“చెప్పు రాజేష్.”
“మా వైఫ్ ఊరెళ్ళింది… నాకు కొంచెం ఆఫీసు లో వర్క్ ఉంది. నువ్వెలాగూ లీవ్ లో ఉన్నావు కదా, ఇఫ్ యు డోంట్ మైండ్… మా పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకుంటావా?”చకచకా చెప్పాడు.
“ష్యూర్, ఇంతలా అడగాలా? తీసుకొస్తాను…”
“థ్యాంక్ యు…”అన్నాక కాల్ కట్ అయ్యింది.
స్కూల్ బయట ఎదురు చూస్తున్నాడు గౌతమ్. నసీమా ఉద్యోగం చేస్తున్న స్కూల్ అది.
బెల్ మోగింది. మిడతల్లాగా పిల్లలంతా పరుగులు పెడుతూ వస్తున్నారు. రాజేష్ కూతురు, వర్ష కోసం వెతుకుతున్నాడు గౌతమ్ ఆ పిల్లల మధ్య. కాసేపటికి కనిపించింది, ముసి ముసి నవ్వులు నవ్వుతూ వస్తోంది… తనని చూడగానే వెళ్లి ఎత్తుకున్నాడు గౌతమ్, పాపని ముద్దాడుతుండగా కనిపించింది నసీమా…
ఆశ్చర్యం,ఆనందం కలగలిసిన చూపు చూసి,
“నసీమా…నువ్వు ….ఇక్కడ?” పాపని దించుతూ అడిగాడు.
తన గతం చెప్పడం పూర్తయ్యేసరికి ఇద్దరూ ఒక కాఫీ షాప్ దగ్గరకి చేరుకున్నారు.
“ఇప్పుడెక్కడ ఉంటున్నావు?”
“ఇక్కడే అమీర్ పేట్ లో హాస్టల్.”
“ఓహ్… ఎనీ వే… ఏం జరిగినా మన మంచికేలే… ఏమైనా అవసరం ఉంటే కాల్ చెయ్ సీమా…”
“తప్పకుండా…”
“ఇప్పుడలాగే అంటావ్… హైద్రాబాద్ వచ్చి ఇన్ని రోజులైంది, నెంబర్ ఉండి కూడా కాల్ చేయలేదు…”
“అదేం లేదు గౌతమ్… వచ్చి రెండు నెలలే అయ్యింది. పైగా ఇక్కడ గంటలు కూడా క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఇక స్కూల్, హాస్టల్ ఇదే సరిపోతోంది. ఇప్పుడు కలిసావ్ గా, కాల్ చేస్తుంటానులే. నువ్వు తప్ప ఎవరున్నారు నాకు ఇక్కడ?” మనసుకి హాయి కలిగించాయి, ఆమె చివరి మాటలు… ఇద్దరూ అక్కడ నుంచి నిష్క్రమించారు.
*****
హాస్పిటల్లో డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్స్ చూస్తోంది.
కళ్ళజోడు తీస్తూ, “అబార్షన్ చేయచ్చు కానీ… భర్త లేదా పెద్ద వాళ్ళ అనుమతి లేకుండా చేయకూడదు…” అంది డాక్టర్.
ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.
అప్పటికే పెళ్ళి అయ్యింది అని నమ్మించడానికి కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంది షీబా. క్రిస్టియన్ కాబట్టి తాళి గోల లేదు. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు అని కహానీ చెప్పారు డాక్టర్ కి,
తీరా చూస్తే ఆవిడేమో ఇలా అంది.
చేసేది లేక, “సరే డాక్టర్ వీళ్ళ ఆయనకు కబురు పెడతాము…” అంది నసీమా. బిత్తరపోయింది షీబా.
బయటకి వచ్చారు ఇద్దరూ.
“నీకేమైనా పిచ్చా? లేని మొగుడ్ని ఎక్కడ నుంచి తెస్తావ్?” గద్దించింది షీబా.
“కంగారు పడకు షీబా… నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్ ఉన్నాడు. నేను అడిగితే హెల్ప్ చేస్తాడు.”అంది.
“వద్దు సీమా… బాగోదేమో.”
“ఇంతకంటే వేరే దారి లేదు షీబా. వేరే ఎవరో అయితే నేనూ వద్దనేదాన్నే… కానీ తను నా క్లోజ్ ఫ్రెండ్.;ఈ విషయం మన మధ్యే ఉండిపోతుంది…” అని ఫోన్ తీసి కాల్ చేసింది… రింగ్ అవుతోంది.
“సరే నేను వాష్ రూమ్ కి వెళ్ళొస్తా…” అని షీబా అలా వెళ్ళింది, ఇలా గౌతమ్ కాల్ లిఫ్ట్ చేసాడు… షీబా తిరిగి వచ్చేసరికి మాటా మంతీ ముగిసింది.
“ఏమైంది?” అడిగింది వస్తూనే.
“వస్తున్నాడు…” చెప్పింది నసీమా.
అరగంట లో హాస్పిటల్ చేరుకున్నాడు గౌతమ్. బైక్ పార్క్ చేసి వస్తున్నాడు. నసీమాకి కాల్ చేసాడు. ఫలానా చోట ఉన్నానని చెప్పింది. గౌతమ్ తను చెప్పిన చోటు వైపు కదిలాడు. రిసెప్షన్ నుంచి క్యాజువాలిటీకి మలుపు ఉంది. మలుపుకి ఇటు గౌతమ్ అటు వీళ్ళు ఉన్నారు.
గౌతమ్ మలుపు దగ్గరికి చేరుతుండగా,
“షీబా! ఒక పని చేద్దాం. విషయం తెలిస్తే చాలు గాని నువ్వెవరో తెలియనక్కరలేదు కదా?” అవునేమో అన్నట్టు చూసింది షీబా.
“అలాంటప్పుడు మీరు ఒకరికొకరు చూసుకోకపోయినా ఫర్లేదు కదా?” నిజమే అన్నట్టు చూసింది షీబా.
“ఏమీ లేదు. రేపు ఎపుడైనా. నిన్ను తనకి, తనకి నిన్ను పరిచయం చేసినా మీరు నెర్వస్ ఫీల్ అవ్వకూడదని అంతే. అందుకే అతని గురించి నీకు చెప్పినా, నీ గురించి అతనికి తెలియకుండా ఉండటం నయమేమో కదా అని…” అలాగే అని పక్కకు వెళ్ళింది షీబా… గౌతమ్ మలుపు తిరిగి వచ్చాడు నసీమా దగ్గరికి..
“ఏమైంది సీమా?”అతనికి విషయం తెలీదు. రమ్మంటే వచ్చాడంతే.
పక్కకు తీసుకెళ్ళి విషయం చెప్పింది కానీ… అబార్షన్ తనకే అని చెప్పింది. పెళ్ళి అయ్యింది కాబట్టి అనుమానం రాలేదు గౌతమ్ కి. విడిపోయింది కాబట్టి మంచిదే అనుకున్నాడు.
NOC ఫాం మీద సంతకం చేస్తూ ఆగాడు తను… RATANA KUMARI అని ఉంది పేరు..
“ఇదేంటి?” అడిగాడు.
“ఫేక్ పేరైతే తర్వాత ఏం ప్రాబ్లం ఉండదని చెప్పింది ఫ్రెండ్.” అంది చెవిలో గుసగుసగా.
అవును కదా, అనుకుని సంతకం చేసాడు… పెద్ద గండం గడిచినట్టు అనిపించింది నసీమాకి.
“ఆపరేషన్ ఎప్పుడు? నేనుండనా?” అడిగాడు.
“వద్దొద్దు నువ్వెళ్ళు… టైం పడుతుంది. రేపు నేనే కలుస్తా.” అంది.
“సరే జాగ్రత్త!” అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్… షీబాకి అబార్షన్ జరిగింది.
***
“ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను… దయచేసి నా జోలికి రావద్దు.”
హెచ్చరించింది నసీమా, పీటర్ ని. ఆమె ఎంత వద్దు అంటున్నా వెంటపడుతున్నాడు అతను. మొదట్లో అంతగా పట్టించుకోలేదు గాని, ఇక విసుగొచ్చింది తనకి. తన కొలీగ్ మ్యాథ్స్ టీచర్ తమ్ముడే పీటర్. ఒకసారి ఆవిడ ఇంటికి నసీమా వెళ్ళినప్పుడు తనని చూసి ఇష్టపడ్డాడు… అప్పట్నుంచి ఇలా వెంటపడుతున్నాడు. ఈ విషయం వాళ్ళ అక్కకి చెప్పలేదు నసీమా ‘పోనీలే’ అనుకుని.
***
దిగులుగా తన ముందు కూర్చుని ఉన్న నసీమా ని చూసి, “ఏమైంది అలా ఉన్నావు?” అడిగాడు గౌతమ్.
“ఏం లేదు…”
“ఏమీ లేకపోతే అలా ఎందుకున్నావు మరి? చెప్పు ఏమైందో…” చెప్పక తప్పదని అర్థమైంది.
“మా కొలీగ్ తమ్ముడు నా వెంటపడుతున్నాడు. రోజూ వాడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఇవ్వాళ వార్నింగ్ ఇచ్చాలే…”ఆగింది చెప్పి.
“లైట్ సీమా… ఇలాంటివి కామనే కదా, ఎక్కువగా ఆలోచించకు. ఇంకేంటి?” అని టాపిక్ మార్చాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
“హే… సీమా!”అన్నాడు గౌతమ్ వెనక నుంచి తనని చూసి రాజా. ఎవరా అని తల తిప్పాడు గౌతమ్. రాజా… చిన్ననాటి క్లాస్ మేట్.
“హే… రాజా, బావున్నావా?”పలకరించింది తను.
“ఏరా ఎలా ఉన్నావు?” గౌతమ్ కూడా.
“మీరేంట్రా ఇక్కడా?” అడిగాడు.
“నేను ఇక్కడే నాలుగేళ్ల నుంచి జాబ్… తను రీసెంట్ గా వచ్చింది…” చెప్పాడు గౌతమ్.
“ఓహ్… సౌండ్స్ గుడ్.”
“ఇంతకీ నువ్వు… ఇక్కడేంటి?” అడిగింది నసీమా.
“జాబ్ బాంగళూర్ లో… కజిన్ ఇక్కడ ఇన్ ఫోసిస్ లో జాబ్… జస్ట్ ఏ ట్రిప్… ఫీలింగ్ వేరీ హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైం మనమిలా కలవడం రియల్లీ నైస్…” అన్నాడు రాజా.
“యా…” గౌతమ్, సీమా చిరునవ్వు.
“ఏరా… ఇంకా తనని ఎవరైనా ఏడిపిస్తే తల పగలగొడుతున్నావా?” అడిగాడు రాజా నవ్వుతూ. వీళ్ళిద్దరూ నవ్వారు.
“ఇంకా గుర్తుందా?”అడిగాడు గౌతమ్.
“ఎలా మర్చిపోతాను? తల దువ్వుకున్నప్పుడల్లా గుర్తుకొస్తారు మీరిద్దరూ…”అని పకపకా నవ్వాడు. వాళ్లు ఏం మాట్లాడలేదు. కాసేపు ఉండి కబుర్లు చెప్పి కదిలాడు రాజా!
“చూసావా… చిన్నప్పుడు నన్ను ఎవరన్నా ఏమైనా అంటే ఊరుకునేవాడివి కాదు,
ఇప్పుడేమో ఇలాంటివి కామన్ అంటున్నావు… నువ్వు మారిపోయావ్ గౌతమ్.”అంది తను చిలిపిగా… నవ్వాడు తను.
“అంటే, ఇప్పుడు వెళ్లి పీటర్ తల కూడా పగలగొట్టమంటావా?” అన్నాడు. నవ్వింది తను కూడా బిగ్గరగా,
“ఇలా ఏ తోడు లేకుండా ఉంటే… ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి…”
అర్థం కానట్టు చూసింది తను గౌతమ్ మాటలకి.
“అంటే నీ ఉద్దేశం?”
“నీకో తోడు ఉంటే బావుంటుంది అని.”
“నువ్వున్నావుగా?”
“జీవితాంతం ఉండే తోడు గురించి చెబుతున్నా!”
“అలాంటి తోడు దొరకడం కష్టం లే.”
“దొరికితే!”ఆమె భ్రుకుటి ముడిపడింది. అసంకల్పిత ప్రతీకార చర్యగా టేబుల్ పై ఉన్న ఆమె చెయ్యిపై పడింది అతని చెయ్యి. జీవితాంతం ఉండే తోడు నేనవుతా! అనే ప్రమాణంలా ఉంది ఆ స్పర్శ… చిన్నప్పటి నుంచి గుండెలో దాగిన ప్రేమంతా అతని కళ్ళలోకొచ్చి చేరింది. ఆ ప్రేమే నేను కోరుకునేది అనే భావన ఆమె ముఖంలో కనబడుతుంది. ఆ క్షణం
తనకి బిడియం లేదు… పొగమంచులో విహరిస్తున్న పక్షికి వెచ్చని నీడ దొరికితే అందులో అమాంతం ఒదిగిపోవాలన్న భావం అమెది. మనసుని ముసిరిన మంచు మౌనాన్ని కరిగించే చైత్రమాసపు కోయిల గానం విని పరవశం చెందుతూ కేరింతలు కొట్టే ఉత్సాహం అతనిది… ఇరువురి కళ్ళ మధ్య చూపుల వంతెన నెలకొంది. ఆ వంతెనపై భావాల పాలపిట్టలు అటూ, ఇటూ సంచరిస్తూ జరిపే రాయబారానికి భాష లేదు, లిపి లేదు. విశ్వమంతా వ్యాపించగలిగే ప్రేమ గుప్పెడంత గుండెలో దాగడం ఎంత చిత్రమో, అలాగే ఆ ప్రేమ కళ్ళలో చేరి చూపుల ద్వారా పరావర్తనం చెందడం అంతకన్నా విచిత్రం.
ప్రేమ గుడ్డిది…అందుకే ప్రేమించుకున్న వాళ్ళ కళ్ళని ఆసరాగా చేసుకుని ఒకరి ప్రేమని ఒకరికి చూపుతుంది. బిడ్డ పుట్టగానే తల్లికి శరీర భారం తగ్గుతుంది. గుండె బరువు పెరుగుతుంది. తనువు నుంచి హృదయానికి బదిలీ అయ్యే ఆ భావన ఎంత మధురం? ప్రేమ కూడా అంతే…
“మనం ప్రేమించిన వాళ్ళకి మన ప్రేమని చెప్పగలగడం అదృష్టం, చూపించగలగడం వరం,
చెప్పకుండా, చూపించకుండా తెలిస్తే ఆ ప్రేమ శాశ్వతం!”

******************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *