March 28, 2024

ధృతి – 4

రచన: మణికుమారి గోవిందరాజుల

“రండి! రండి… అత్తయ్యగారూ!” కారు దిగుతున్న అత్తగారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది పూర్ణ. కారు దిగుతూ కోడల్ని నిండుగా చూసుకుంది రంగనాయకమ్మ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే కోడలంటే చాలా ఇష్టం రంగనాయకమ్మకి.
కారు దిగిన అత్తగారి కాళ్ళకు దండం పెట్టింది. “ఇప్పుడెందుకే ఈ దండాలూ” అంటునే మనసారా “దీర్ఘ సుమంగళీ భవ” అని దీవించింది. “పిల్లలేరే” ఎక్కడా పిల్లల జాడ కనపడక అడిగింది.
“ఏమో అత్తయ్యా! ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికెళ్ళారో… ఏంటో” పూర్ణ పెదవులమీద చిరునవ్వు కదలాడింది. “మీ కోసం ఫిల్టర్ ఫ్రెష్ గా వేసి, పాలు కాగబెట్టి ఉంచాను. మంచి కాఫీ తాగుదాము రండి అత్తయ్యా” చెప్తూ లోపలికి దారి తీసింది.
“శివా! బ్యాగ్స్ లోపల పెట్టి కాళ్ళూ చేతులు కడుక్కొచ్చుకో. టిఫిన్ తిని కాఫీ తాగుదువు కాని. ఎప్పుడో పొద్దున్న తిని ఉంటారు” ఆ మాటలు వింటూనే లోపలికి వెళ్తున్న రంగనాయకమ్మ గిర్రున వెనక్కి తిరిగి శివకు వద్దంటూ సైగ చేసేలోగానే జరగాల్సిన డామేజీ జరగనే జరిగింది. “పొద్దున్న ఎప్పుడో తినడం ఏంటమ్మా? అన్ని ధాబాల దగ్గర ఆగాము” కిసుక్కున నవ్వాడు శివ.
“ఒరేయ్ శివా! ఘనకార్యం చేసావులే కాని, ఆ బ్యాగులు లోపల పెట్టి బయటికేడువు” చెప్పి కోడలి మొహం చూడకుండా గబ గబా లోపలికి వెళ్ళిపోయింది.
అత్తగారి చిన్న పిల్లల మనస్తత్వానికి నవ్వుకుంటూ తాను కూడా లోపలికి వెళ్ళింది పూర్ణ.
బయటి హాల్ దాటి లోపలి హాల్లో కెళ్ళగానే రంగనాయకమ్మ తల మీద పూల వాన కురిసింది. “వెల్కం బామ్మా!” అంటూ ముగ్గురూ వచ్చి బామ్మని కావలించుకున్నారు. చాల సంతోషపడిపోయింది. “బంగారాలూ ఎలా ఉన్నార్రా?” అంటూ తానూ వాళ్ళని దగ్గరికి తీసుకుంది. “ఇందుకటర్రా భడవకానల్లారా? బయటికి రాక్కుండా దాక్కున్నారు?” పిల్లలు ఇచ్చిన గౌరవం, ప్రేమ రంగనాయకమ్మ పెదాలమీదకు ప్రేమతో, గర్వంతో కూడిన నవ్వును తీసుకొచ్చింది.
పిల్లలు అనుకుంటాం కానీ, చాలా తెలివి కలవాళ్ళు. తమ తలితండ్రులను, ముఖ్యంగా తల్లిని మిగతా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చాలా నిశితంగా గమనిస్తారు.అది వైస్ వర్సా కూడా. బామ్మను తల్లి ఎలా ట్రీట్ చేస్తున్నదీ కూడా అంతే జాగ్రత్తగా గమనిస్తారు. ఆ పసి వయసులో ఏది మంచీ, ఏది కాదూ అనేది వాళ్ల చిన్ని బుర్రలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. సహజంగా ఎటు కరెక్ట్ అవుతే అటే మొగ్గుతారు. తమకు చాతనైన విధంగా వాళ్ళను ఊరడించడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లోని పెద్దవాళ్ళకూ తల్లికీ మధ్య ఉండే ఆప్యాయతానురాగాలను గమనిస్తే వాళ్ళకు ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చెప్పక్కరలేదు. వాళ్ళూ ఆటోమేటిక్ గా పెద్దలను గౌరవించడం నేర్చుకుంటారు.
బామ్మకు తల్లి అంటే ఎంత ప్రేమో, తల్లికి బామ్మ అంటే ఎంత గౌరవమో చిన్నప్పటినుండి చూస్తున్న ధృతీ వాళ్ళకు బామ్మ అంటే తగని ప్రేమ. రంగనాయకమ్మకు కూడా మనవడూ, మనవరాళ్ళంటే ఎంతో ముద్దు. ధృతి తర్వాత పిల్లలు లేరని, నాకూ ఒక్కడే, నీకూ ఒక్కతే అని చాలా బాధపడేది.చాలా కాలం తర్వాత గర్భం దాల్చిన కోడల్ని కొంతకాలం తన దగ్గర ఉంచుకుని అపురూపంగా చూసుకున్నది. అప్పుడే ధృతి బామ్మకు చాలా చేరికయింది.
తన పక్కలో పడుకోబెట్టుకుని ఎన్ని కథలో చెప్పేది. జీవితాన్ని ఎన్ని ఉపమానాలతోనో పోల్చేది. రామయణ, భారత, భాగవతాలు చిన్న చిన్న కథలుగ చెప్పి అవి జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరించేది.మంచీ, చెడూ ఎలా గమనించుకోవాలో నేర్పేది. అందుకే ధృతికి బామ్మ దగ్గర బాగా చేరికే కాకుండా ఇష్టం కూడా.
“ఏమర్రా! ఎక్కడెక్కడ ఏమేమి సినిమాలు ఆడుతున్నాయి?” పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ అడిగింది.
“బామ్మా! ఈ సారి మేము తీసుకెళతాము నిన్ను. ఇప్పుడు మేము పెద్దాళ్ళమయ్యము కదా?” ఆర్తీ కార్తీ పోటీ పడ్డారు.
“అత్తయ్యా! ఇప్పుడే వచ్చారు… అప్పుడే సినిమాలా? కొద్దిగా రెస్ట్ తీసుకోండి. ఏయ్! పిల్లలూ బామ్మని గోల చేయకండి” అత్తగారికి చెప్తూనే పిల్లల్ని మందలించింది.
”రెస్టేంటే? రెస్టూ..రొస్టూనూ. నేనేమన్నా అలసిపోయానా? హాయిగా వచ్చాను. నా తండ్రి నన్ను అలసిపోనివ్వడు కదా”
“అత్తయ్యా! ఇందులో మీ తండ్రేమి చేసాడో” కొంటెగా అడిగింది.
“ఓసి నీ అసూయ దొంగల్దోలా… నా తండ్రంటే మీ ఆయన అనుకున్నావా? వాడేనే ఆ శివగాడు” తనూ కొంటెగానే చెప్పింది.
అప్పుడే లోపలికి వస్తున్న శివ “పెద్దమ్మగారూ…” అంటూ తెస్తున్న బ్యాగులు అక్కడే పడేసి వచ్చి రంగనాయకమ్మ కాళ్ళమీద వాలిపోయాడు. “పెద్దమ్మగారో…! ఇంతవరకు నాకు తెలీదు, నేనంటే మీకంత ప్రేమని. ఇక ఈ పాదాలు వదలనమ్మా… మీ మీద ఒట్టు. మీరు దోవలో ఏమేమి తిన్నారో కూడా చెప్పను కాక చెప్పను… సూర్యాపేట దాటాక ఆగామా అక్కడ మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటే హైవే మీద ఆపించి, అక్కడే కాల్పించుకుని తిన్నామని అస్సలు చెప్పను. అల్లనేరేడు పళ్ళు రోడ్డు పక్కన పెట్టుకుని కూర్చున్నామెని పిలిచి, ఆమె చేతిలో వంద పెట్టి నాలుగంటే నాలుగే పళ్ళు తీసుకుని తిన్నారని అసలే చెప్పను… మర్చిపోయాను ధాబా మొదట్లో పెట్టే మిర్చి బజ్జీలు
తిన్నామని అంతకంటే చెప్పను… పెద్దమ్మగారో మీ మీద ఒట్టు. మీ కాళ్ళు వదలను” ఒక చేత్తో బామ్మ కాళ్ళు గట్టిగా పట్టుకుని ఇంకోచేత్తో కళ్ళు తుడుచుకుంటున్నట్లుగా యాక్షన్ చేసాడు. “అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పిన టైం కంటే రెండుగంటలు ముందుగానే బయలు దేరామని అసలే చెప్పను”
పిల్లలంతా వాడి నటనకు పడీ పడీ నవ్వుతూ చప్పట్లు కొట్టసాగారు.
“ఆరి భడవా! చెప్పనంటూనే అన్నీ చెప్పావు కదరా? పిల్లలూ ఆ కర్ర పట్టుకురండర్రా… వీడి బుర్ర బద్దలు కొడదాము” తనూ లేస్తున్నట్లుగా యాక్షన్ చేసింది. ఈ లోపలే కార్తీ వెళ్ళి కర్ర పట్టుకొచ్చాడు. అది చూడగానే శివ ఒక్క ఉదుటున లేచి బ్యాగులందుకుని లోపలికి పరుగు తీసాడు.
పిల్లలు కూడా వాడి వెనకాల పడ్డారు. శివ వస్తే వాళ్ళకు బోలెడు సందడి. బాగా ఆడిస్తాడు. శివ తల్లి భర్త పోయాక, శివ నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చి రంగనాయకమ్మ దగ్గర పనికి చేరింది. ఒంటరి వాళ్ళైన ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఎదుగుతున్న శివ అమ్మా అంటూ కాళ్ళను చుట్టుకుంటుంటే తల్లి లానే దగ్గరకు తీసింది. శివ కూడా అక్కడ సొంత వాడిలానే అన్నీ బాగా కనిపెట్టుకుని ఉంటాడు. బలవంతాన వాడితో డిగ్రీ దాకా ప్రైవేట్ గా చదివించింది. ఇప్పుడు ఎస్సై ఉద్యోగానికి టెస్ట్ రాయడానికి తీసుకొచ్చింది.
“అమ్మా నే వెళ్తే నీకెలాగా” అన్నా కూడా “నా కొడుకునే నేను ఆశించటం లేదు. ఇక నీదేముందిరా? పోయే జీవితం నాది. భవిష్యత్తంతా మీదే. నువు వృద్ధి లోకి వస్తే నాకు అంతకంటే కావలసినదేమున్నది?” అంటూ ఒకరకంగా బలవంతాన తీసుకొచ్చింది.
శివ చేతుల్లోనే పెరిగారు పిల్లలు. అందుకే వాళ్లకంత ఆనందం శివ వస్తే.
“ఎందుకు బామ్మా అవన్నీ తింటావు? మీకు పల్లెటూళ్ళో అన్నీ దొరుకుతాయి కదా?” బామ్మ మెడచుట్టూ చేతులేసి, ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అడిగింది ధృతి.
“రోడ్డు మీద అలా ఆపించి తినడంలో మజానే వేరే. మనకు ఇంట్లో అన్నీ కోరుకోకుండానే దొరుకుతున్నాయి. ఇది నేను కావాలని అనుకుని కొనుక్కోవడం కదా?” హాయిగా నవ్వేసి, తను కూడా ధృతిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. చెప్తుండగానే ఆమె జ్ఞాపకాలు ఎక్కడికో వెళ్ళాయి.
“అమ్మా!” లోపలికి వచ్చిన దినేష్ సంతోషంగా తల్లి కాళ్ళకు దండం పెట్టి పక్కన కూర్చున్నాడు. కొడుక్కెంత వయసొచ్చినా తల్లికెప్పుడూ అడ్డాల్లో బిడ్డడే. కొడుకుని చూడగానే మొహం వెలిగిపోయింది ఆ తల్లికి.
ఇంతలో పూర్ణ కాఫీలు తెచ్చింది అందరికీ. “అమ్మా! మరి మాకూ?” ఆర్తీ కార్తీ ఒక్కసారే అడిగారు. వాళ్ళిద్దరూ ఒకటే చెప్పారు మీరెన్నిసార్లు కాఫీలు తాగితే మాకు అన్ని సార్లు పాలు కలిపి ఇవ్వాలని. ఇద్దరూ పాల పిచ్చోళ్ళు.
“మీకు లేకుండానా? మీకివ్వకపోతే మీ అక్క నన్ను బతకనిస్తుందా?” నవ్వుతూ వాళ్ళ గ్లాసులు వాళ్ళకిచ్చింది.
“అమ్మా! ఊళ్ళో అంతా బాగున్నారా? శివా వాళ్ళమ్మ బాగుందా?” ఊళ్ళో వారి యోగక్షేమాలు అడగసాగాడు దినేష్.
పిల్లలు లోపల ఇల్లంతా ఉరుకుతూ శివతో ఆడసాగారు. రాత్రి వంట చేయటానికి వంటింట్లోకి వెళ్ళింది పూర్ణ. బామ్మా నాన్నల ముచ్చట్లు వింటూ బామ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకుంది ధృతి.

************

“స్వాతీ! చూసావు కదా? ఎలా ఉన్నది ఆ అమ్మాయి?” డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరూ అన్నాలకు కూర్చున్నప్పుడు, కూర వడ్డించుకుంటూ అడిగాడు శేఖరం భార్య స్వాతిని.
“వియ్యానికైనా… కయ్యానికైనా సమఉజ్జీ అన్నారు పెద్దలు. ఆ అమ్మాయి మనకే విధంగానూ సరిపోదు. మీకెందుకు అంతలా నచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మనవాడికి ఏమి తక్కువని ఆ అమ్మాయిని కోడలిగా చేసుకుందామనుకుంటున్నారో అంతకంటే అర్థం కాలేదు. వారం నుండి వినీ వినీ బుర్ర వాచిపోయింది” చిరాగ్గా అన్నది స్వాతి.
“ఆ అమ్మాయి మొహం లో కళ చూసావా? అమ్మవారిలా వెలిగిపోతున్నది. ఆస్తులదేమున్నదే, మనకే ఉన్నది తరాలు కూర్చుని తిన్నా తరగనంత. ఆ అమ్మాయి అమ్మవారిలా ఇంట అడుగు పెడితే సిరులన్నీ ఉన్నట్లే” నాట్యం చేస్తున్న ధృతి కళ్ళముందు మెరిసింది.
“చాల్లెండి సంబడం. అసలు వాడేమనుకుంటున్నాడొ తెలియదు కదా? వాడొచ్చాక ఆలోచిద్దం లెండి” అప్పటికి ఆ సంభాషణకు చుక్క పెట్టింది స్వాతి.
కాని శేఖరం మనసు మటుకు ఆ అమ్మాయి కోడలిగా వస్తే బాగుండును అనే ఉన్నది.
స్వాతి కలిగిన ఇంట్లో పుట్టింది. పెళ్ళినాటికి శేఖర్ అప్పుడప్పుడే ఆర్ధికంగా పుంజుకుంటున్నాడు. స్వాతి తండ్రి వెంకటేశ్వర రావు గొప్ప దార్శనికుడు.శేఖర్ లోని స్పార్క్ ని గమనించాడు. అందుకే తనంత తానుగా వెళ్ళి అడిగి మరీ అల్లుణ్ణి చేసుకున్నాడు. గొప్పింటినుండి వచ్చానన్న అతిశయం స్వాతికి ఓ పాలు ఎక్కువే ఉన్నది.
ఆ గర్వంతోనే అత్తా, ఇద్దరు ఆడబిడ్డలను కొత్తల్లో చులకనగా చూసేది. శేఖర్ కి తల్లి,తండ్రులంటే చాలా ప్రేమ. ముఖ్యంగా కుటుంబ బంధాలకు చాలా విలువ ఇస్తాడు. ఏమీ లేని స్థితిలో కూడా ఎంతో కష్టపడి తనను చదివించారు తల్లీ తండ్రీ. వారు కోరుకున్నదానికంటే ఎక్కువగానే తాను ఎదిగాడు. ఇప్పుడు వాళ్ళను సుఖపెట్టవలసిన బాధ్యత తనది. అందుకే పెళ్ళి మాటలకు స్వాతి తండ్రి, వేంకటేశ్వర రావు రాగానె ఒకటే కండిషన్ పెట్టాడు. ‘అందరమూ కలిసే ఉంటాము… తన తలితండ్రులను, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని’ వెంకటేశ్వర రావు తన ఎన్నిక సరైనదే అని సంతోషపడ్డాడు. కుటుంబ బంధాలకు విలువ ఇచ్చే అల్లుడు తన కూతుర్ని కూడా బాగా చూసుకుంటాడు అని ఆలోచించాడు.
స్వాతి భర్త ఉన్నప్పుడు ఒకతీరుగా, భర్త లేనప్పుడు ఒకతీరుగా ప్రవర్తించేది. శేఖర్ తలితండ్రులు, ఆ విషయం చెప్తే కొడుకు కాపురంలో కలతలు వస్తాయని నోర్మూసుకునేవారు. కాని ఒకటి రెండు సార్లు ఆ సంగతి అనుకోకుండా శేఖర్ కంట పడింది.
ఎప్పుడు కూతుర్ని చూడటానికి మనసొస్తే అప్పుడే వచ్చేవారు వేంకటేశ్వర రావు దంపతులు. ఆ రోజు కూడా అలానే వచ్చారు. సాధారణంగా ఎవరన్నా వస్తున్నారని ముందుగా తెలిస్తే చాలా మంది ఇంట్లో వేసుకునే నలిగిన బట్టలు మార్చుకుంటారు. ఆ రోజు వాళ్ళు సడన్ గా వచ్చేసరికి శేఖర్ తల్లి కుసుమ, తండ్రి రామారావు మామూలు బట్టలతో ఉన్నారు. దానికి తోడు స్వాతి మేనమామ వాళ్ళు కూడా వచ్చారు వాళ్లతో. స్వాతి చాలా అవమానంగా ఫీల్ అయింది. మేనమామ వాళ్ళు కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.
అప్పటివరకు ఉగ్గబట్టుకున్న చిరాకు వాళ్ళు వెళ్ళగానే బయటపడింది.
“అత్తగారూ! మీరు కట్టుకున్నటువంటి బట్టలు మా ఇంట్లో పని వాళ్ళు కూడా కట్టుకోరు. కాస్త మంచి బట్టలు కట్టుకోవచ్చు కదా? మిమ్మల్ని చూసి వాళ్లేమనుకుంటారు? మేము మీకు ఏమీ ఇవ్వడం లేదనుకోరూ?”
“వాళ్ళొస్తున్నారని తెలీదు కదమ్మా? అందుకని మార్చుకునే సమయం లేకపోయింది” నెమ్మదిగా అన్నది కుసుమ.
“వాళ్ళొచ్చి బయట కూర్చున్నారు కదా? అప్పుడైనా మార్చుకోవచ్చు కదా? లేకి బుద్దులెక్కడికి పోతాయి?” వంతపాడింది తల్లి వందన.
అప్పుడే వాళ్ళని పంపి లోపలికి వచ్చిన వేంకటేశ్వర రావుకు కూతురి మాటలు విని బాధపడ్డాడు. పెద్దవాళ్ళైన తాము ఉండగానే కూతురు అలా మాట్లాడటం నచ్చలేదు. “స్వాతీ! ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతున్నదా? నీ భర్తకు ప్రాణం వాళ్ళు. నీక్కూడా అంతే ఉండాలి. పెళ్ళయింది కాబట్టి నిన్ను ఇంతకన్నా ఏమీ అనలేకపోతున్నాను. బావగారూ! క్షమించండి. మా అమ్మయి తరపున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను” రామారావు దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకున్నాడు.
“అయ్యో! పర్లేదండీ” ఏమనాలో తెలీక ఆ మాటని ఊర్కున్నాడు రామారావు.
అప్పుడే లోపలికి వస్తూ క్షమించండి అని మామగారు అడగడం, తండ్రి పర్లేదనడం విన్నాడు శేఖర్. కాని ఆ సంగతి అప్పుడేమీ అడగలేదు. తండ్రితో కోపంగా ఏదో అనబోయిన స్వాతి, భర్తను చూడగానే లోపలికి వెళ్ళిపోయింది. శేఖర్ అత్తగారు, వందన కూడా కూతుర్ని అనుసరించింది.
వేంకటేశ్వర రావుకు అర్థమయింది అల్లుడికి సంగతేదో ఉన్నదని అనుమానం వచ్చిందని. అందుకే ఆ సాయంత్రం అల్లుణ్ణి బయటకు తీసుకెళ్ళి సంగతంతా చెప్పేసాడు. “అల్లుడూ! ఆ బాధేంటో నాకు తెలుసు. మీ అత్తగారు కూడా మా వాళ్ళను సరిగా చూడకపోయేది. అదే అహంకారం నా కూతురుకు వచ్చింది. లేనింటి పిల్ల అయితే అణకువగా ఉంటుందని తలచారు మా అమ్మా, నాన్నా. కాని ఆడపిల్లకు అహం రావడానికి, పేదింటి పిల్లా, కలిగిన ఇంటి పిల్లా అన్న తేడా ఉండదన్న సంగతి నా కూతురు బాగా చెప్పింది” విచారంగా అన్నాడు వేంకటేశ్వర రావు.
ఏమీ మాట్లాడలేదు శేఖర్. అల్లుడికి కోపం వచ్చిందన్న సంగతి అర్థమయింది వెంకటేశ్వర రావుకు. ఏదో చెప్పబోయాడు. ఆగమన్నట్లుగా చేయి ఊపాడు శేఖర్. “మామగారూ! ఇప్పుడర్థమవుతున్నది. మీకు మీ అమ్మాయి అహంకారం సంగతి తెలుసు. లేనింటి అల్లుడైతే అణిగి మణిగి ఉంటానని నన్ను ఏరి కోరి అల్లుడిగా చేసుకున్నారు. కాని లేనింటి వాళ్ళమయినా అభిమానానికి తక్కువ వాళ్ళము కాము.విలువలకు విలువ ఇవ్వని మీ అమ్మాయిని నేను భరించలేనేమో. కాని మీ ప్రేమ, నాకు మీరిచ్చే గౌరవం నన్ను ఆలోచించమంటున్నది. చూద్దాము కొన్నాళ్ళు. పదండి ఇంటికెళదాము” కోపాన్ని హద్దుల్లో ఉంచుకుంటున్న అల్లుడి మీద గౌరవం ఎక్కువయింది వేంకటేశ్వర రావు ఏమీ మాట్లాడలేక అల్లుణ్ణి అనుసరించాడు..
ఇంటికి వచ్చాక మామూలుగానే ఉన్నాడు శేఖర్. భోజనాలు అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రయింది. భర్త ప్రవర్తన స్వాతిని కొద్దిగా భయపెడుతున్నా బింకంగా ఉన్నది. కానీ ఏమీ అడగలేదు శేఖర్.
మర్నాడు ఎక్కువ సమయం తలి తండ్రులతోనే ఉన్నాడు శేఖర్. కాని మనస్సులో ఏదో అర్థం కాని ఆవేదన. దీనిని ఎలా పరిష్కరించాలా అన్న ఆలోచనతోనే గడిపాడు. భార్యను ఏమీ అడగలేదు. అడగాలనిపించలేదు. అలా అని వదిలే సమస్య కాదు.
“అమ్మా! చిన్న మామయ్యా వాళ్ళను చూసి చాలా రోజులయింది వెళదామా?”
కుసుమ చాలా సంతోషపడింది. తాము వెళ్ళొస్తున్నా కొడుక్కున్న బిజీ స్కెడ్యూల్లో అతనికి రావటానికి కుదరటం లేదు. అందరూ అడుగుతున్నారు… కొడుకు కోడలు కూడా ఒకసారి వస్తే బాగుండును, అని మనసులో ఉన్నా అడగలేకపోయింది.
“అలాగే మన ఊరు కూడా వెళ్దాం అమ్మా. అందర్నీ చూసి చాలారోజులయింది”
ఇంకా పొంగిపోయారు ఇద్దరూ.
మర్నాడు స్వాతిని, తలి తండ్రులను తీసుకుని ఊళ్ళో ఉన్న మేనమామల ఇంటికి వెళ్ళాడు. అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఎదుగుతున్న మేనల్లుణ్ణి చూసి పొంగిపోయారు. అంత ఎదిగినా ఒదిగి ఉన్న అతని సంస్కారాన్ని మెచ్చుకున్నారు.
“మామయ్యా! అందరమూ తరచుగా తప్పక కలుద్దాము. నేను కూడా కొంత సమయం మిమ్మల్ని కలవడానికి కేటాయించుకుంటాను” చెప్తున్న మేనల్లుణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు.
“స్వాతి వల్ల కలిగిన అవమానానికి కొంత ఉపశమనం కలిగింది అమ్మా వాళ్ళకు” వెలిగి పోతున్న తల్లి వదనం చూసి తృప్తి పడ్డాడు శేఖర్. వస్తూ వస్తూ తమ ఊర్లోని కొంతమంది ఆత్మీయులకు బట్టలు తీసుకున్నాడు.
రెండు రోజుల తర్వాత అందరూ కలిసి సొంతూరుకు వెళ్ళారు. అక్కడ అత్తగారికీ, మామగారికీ ఊళ్ళో వాళ్ళు ఇస్తున్న మర్యాదలు చూసి ఆశ్చర్యపోయింది స్వాతి. నిజంగా వాళ్ళు పొందుతున్న మర్యాదలు, తమకు ఇంత ఆస్తి ఉన్నా ఎప్పుడూ అనుభవం లోకి రాలేదు. అంతటి గౌరవం ఎప్పుడూ అందలేదు.
వాళ్ళ ఊళ్ళో రెండు రోజులున్నారు. రామారావు కుసుమ దంపతులకు సంతోషం పట్టలేకుండా ఉన్నది. సుమతీ శతక కారుడు చెప్పినట్లు ఇప్పుడు కొడుకును అందరూ పొగుడుతుంటే, అదీ తమ సొంత ఊర్లో, వాళ్ళకు అందలమెక్కినట్లుగా ఉన్నది. అందరి దగ్గరా సెలవు తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసారు అందరూ.
ఆ రాత్రి చెప్పాడు శేఖర్ స్వాతితో “స్వాతీ! మీ అమ్మా వాళ్ళు నీకెంతో మావాళ్ళు నాకూ అంతే అలాగే. నేను మామగారూ వాళ్ళతో ఎలా ఉంటున్నానో, నువూ అలాగే గౌరవంగా ప్రేమగా ఉండాలి. ఇది సింపుల్ లాజిక్. మీకేదొ చాలా ఆస్తులున్నాయని నేను మీ వాళ్ళని గౌరవంగా చూడటం లేదు. మా అమ్మావాళ్ళు నాకు నేర్పిన సంస్కారం నన్ను అలా ఉంచుతున్నది. నువ్వెలా, ఎటువంటి సంస్కారంతో పెరిగావో ఆలోచించుకో. ఇది మన కుటుంబం. అందరం కలిసి ఉండాలనేది నా కోరిక. ఈ కుటుంబం లోకి మీ వాళ్ళొచ్చినా నేను అంతే ఆప్యాయంగా ఆహ్వానిస్తాను. ఏమన్నా వాళ్ళవల్ల ఇబ్బందులుంటే చెప్పు. మనం కూర్చొని సార్టవుట్ చేసుకుందాము. సరైన బట్టలు లేవనీ, మెళ్లో బోలెడు నగలు లేవనీ అవమానించకు. అది నీ వ్యక్తిత్వాన్ని చిన్నపరుస్తుంది. ఇంకా కావాలంటే ఆప్యాయంగా వాళ్ళని తీసుకెళ్ళి కావాల్సినవి కొనిపెట్టు. లేదంటే నాకు చెప్పు. ఇంకొక్కసారి వాళ్ళను చిన్న చూపు చూడకు. జీవితమంతా కష్టపడ్డారు. సుఖపడాల్సిన వయస్సులో మనస్తాపానికి గురిచేయకు.”

****సశేషం********

12 thoughts on “ధృతి – 4

  1. కథ కథనం చాలా రసవత్తరం సాగుతున్నాయి…. సంభాషణలు…
    మనమంతా కలుసుకొని మాట్లాడు కున్నట్టే వున్నాయి….మంచి కథను అందిస్తున్న
    మణి అభినందనీయులు…..

  2. మణి మీకు జోహార్లు .ఎంతో అద్భుతంగా కథని కొనసాగిస్తూ, జీవితానికి కావలసిన చక్కటి మెళుకువలు తెలియజేస్తూ , చదువుతున్న ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకునే విధంగా,చక్కటి కుటుంబ వ్యవస్థ కు నాంది అయిన ఆదరాభిమానాలు,ప్రేమ, పరస్పర గౌరవాభిమానాలు , పిల్లల పెంపకం లాంటి అంశాలు చాలా బాగా వ్రాస్తున్నారు.అన్నింటి కంటే భార్య చేసే తప్పు లను ఎంతో సున్నితంగా తెలియజెప్పి, కనువిప్పు కలిగించటం శ్లాఘనీయం.

    1. మీకు నచ్చినందుకు, మీరు ఇచ్చిన చక్కటి స్పందనకు ధన్యవాదములండి.. మణి

Leave a Reply to గురిజాల రమేష్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *