March 28, 2024

మోదుగపూలు – 2

రచన: సంధ్యా యల్లాప్రగడ

ఆదిలాబాదు అంటేనే అడవులు గుర్తుకు వస్తాయి. రాష్ట్రములో అత్యంత ఎక్కువ అడవులు ఉండి, అందాలతో ఉన్న జిల్లా అది. 75శాతం పచ్చని అడవులు, జలపాతాలతో ప్రకృతి అందాలన్నీ నిలవలుగా ఉన్న జిల్లా అది. అందాలు హస్తకళలు ఉన్నా అక్షరాస్యత 63శాతంలోనే ఉంది. ఆదివాసులు, గిరిజనులు ఉన్న జిల్లా. ఉన్నత విద్య, వైద్యము, కనీస అవసరాలకు ఆదిలాబాదే క్రేంద్రము వాళ్ళకు.

ఆదిలాబాదు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు. కాని అడవులకు సరిహద్దులేర్పచగలమా? మహారాష్ట్ర, నాందేడు సంస్కృతులు కలిసిపోయిన భాషాతో పచ్చని జిల్లా అది. గిరిజనులకు ఆలవాలమైనది. ఆదిలాబాదు జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తుర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. గోదావరి తెలుగు రాష్ట్రములోకి ఈ జిల్లాలోనే ప్రవేశిస్తుంది.
జ్ఞానప్రదాయిని బాసర సరస్వతిదేవీ దేవాలయం ఈ జిల్లాలోనే నెలకొని ఉంది. ప్రకృతి ఒడిలో దిగినట్లుగా ఆ ఉదయం ఆదిలాబాదులో బస్సు దిగాడు వివేక్. అక్కడే బస్టాండులో కాలకృత్యాలు తీర్చుకొని టీ తాగి, టిఫెను తిన్నాడు. తను తరువాత ఎక్కవలసిన బస్సు కోసము ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఉట్నూరు వెళ్ళే బస్సు అతనికి పదింటికి దొరికింది. అది ఎక్కితే ఆ బస్సు ప్రతి చోటా ఆగుతూ ఆగుతూ వివేక్ ను పన్నెండుకు గురుకుల పాఠశాలకు వెళ్ళే రోడ్డు దగ్గర దింపింది.

***

ప్రసాదరావు సార్ ముందే చెప్పాడు. “నీవు బస్సు దిగి సక్కగా పో. అదే రోడ్డు. మరో దారి లేదు. అట్లా ఓ గంట నడిస్తే బడి దగ్గరకు పోతావు. రాజుసార్ నిన్ను చూశాడు కాబట్టి నీకు కొత్త కూడా ఉండదు. ఎవరైనా గ్రామం వాళ్ళు కనపడితే నీవు బలానా బడికి వెడుతున్నావని చెబితే, నీ పెట్టె పట్టుకొని నిన్ను బడి దగ్గర వదిలిపోతారు”.
వివేక్ ఆ మాటలు పట్టుకొని నడక మొదలెట్టాడు. అడవిలో అలా నడుస్తూ ఉంటే అతనికి ఆలోచనలు చుట్టు ముట్టాయి.
అతనికి మరణించిన తండ్రి చాలా గుర్తుకు వచ్చాడు. గిరిజనుడైన వివేక్ తండ్రి కొన్ని అనుకోని పరిణామాల వలన అడవి వదిలి రహస్య జీవితానికై పట్నం వెళ్ళాడు. అక్కడ మంచి-చెడు గ్రహించి, రిక్షా తొక్కుతూ జీవితాన్ని మొదలెట్టాడు. తెలివైన ఆయన రిక్షా నుంచి ఆటోకి ప్రమోటు చేసుకున్నాడు కాని ప్రమాదంలో మరణించాడు. ‘ఆయన కనుక బ్రతికి ఉంటే నన్ను వెళ్ళనిచ్చేవాడేనా?’ అని అనుకున్నాడు. తండ్రి ఏ పరిస్థితులలో పట్నం వచ్చాడో వివేక్‌కు తెలియదు. ఎప్పుడూ చెప్పలేదు. ఆయన అవేమి మాట్లాడేవాడు కాడు కూడా. తల్లికి ఏమీ తెలియవు. ఆమె చాలా అమాయకురాలు. కాల్నీలో నాలుగిళ్ళలో పాచి పని చేసి నెలకు కొంత తెచ్చేది. తండ్రి పోయాక ఆమె తెచ్చేదే వారిని బ్రతికించింది. తరువాత చెల్లి కూడా అలా పనికి వెళ్ళటం మొదలెట్టింది.

వివేక్‌కి తన పెద్దలెవరో తెలియదు. తన తండ్రి ఎక్కడివాడో చూచాయగా మాత్రమే తెలుసు. చుట్టాలంటూ కూడా ఎవ్వరూ తెలియదు. అడవంటే మాత్రం తండ్రి మాట్లాడేవాడు కాడు. కన్నీరు పెట్టుకునేవాడు. వివేక్‌కు చిన్నతనపు ఆ విషయాలన్నీ వరస పెట్టి గుర్తుకు వచ్చాయి, అలా అడవిలో నడుస్తూ ఉంటే.
తల్లిని ఎంత అడిగినా ఆమె ఏదీ చెప్పేది కాదు. అలా తన వంశవృక్షము, పెద్దలు, భాషా, పూర్వీకుల గురించి ఏమీ తెలియదు. పట్నంలో పెరిగినందుకు అతని భాషా వేషం పూర్తిగా పట్నవాసమే తప్ప, అతని పెద్దలు గిరిజనులంటే ఎవ్వరూ నమ్మరు కూడా.
ఇవి తలుస్తూ నడుస్తున్నాడు వివేక్. తన తండ్రి ఈ అడవులలో ఎక్కడో పెరిగాడు, తిరిగాడు. తన రక్త సంబంధీకులు ఈ అడవులలో ఉన్నారన్న ఆలోచన వింతగా అనిపించింది వివేక్‌కు.
‘నాకు ఈ గురుకులం ఇంత అడవిలో ఉందని తెలియదు. తెలిస్తే మాత్రము చేసేదేముంది. అవసరాలరిత్యా నాకు ఈ ఉద్యోగం ముఖ్యము. కొంచం కుదురుకోవాలి. తదనంతరము ఏ యూనివర్సిటిలోనో ఫ్రోఫెసర్ అవ్వాలి. నాయన మనస్సు శాంతిస్తుంది’ అనుకున్నాడు ఆలోచనగా.
అడవిలో ఎకడ్నుంచో నెమలి కూతలు వినిపిస్తున్నాయి. రకరకాల పిట్టల కూతలు. ఆ చప్పుళ్ళన్నీ వివేక్‌కు వింతగా ఉన్నాయి. మరి అతను జీవితములో మొదటిసారి ఇలా అడవిలో నడుస్తున్నాడు, అదీ ఒంటరిగా.
ఆ మట్టిదారిలో కంకర మాయమయ్యింది. ఎర్రమట్టి రోడ్డు సన్నబడింది. మనుష్యులు నడిచినది కాకుండా మిగిలినదంతా పచ్చని గడ్డి, చెట్లతో ఉంది.
‘అబ్బా ఎంత స్వచ్ఛమైన గాలి. ఇంత ఆక్సిజన్ పీల్చి నేను తట్టుకోలేను!’ అనుకుంటూ నవ్వుకున్నాడు.
సిటీలో ఆ కాలుష్యము పీల్చిన అతనికి ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది.
రోడ్డుకడ్డంగా వాగు ఒకటి. సన్నటి కాలువలా ఉంది. వైశాల్యము చూస్తే ఇసుక రాళ్ళతో పెద్దగానే ఉంది. వానాకాలము ఇటువంటి వాగులు పొంగుతాయి. మధ్యలో ఎత్తుగా రాళ్ళు పరిచి ఉన్నాయి. బహుశా వాటి మీద నడుస్తారేమో. ప్రస్తుతానికి అదో చిన్న కాలువలా ఉంది. నీరు చేతిలోకి తీసుకోవటానికి కూడా రావు.
అది దాటుతూ టైం చూసుకున్నాడు. నడవటం మొదలుపెట్టి అరగంట అయింది. చుట్టూ గడ్డితో పాటు తంగేడు పూల చెట్లు. అడవిలో మోదుగపూలు విపరీతముగా పూచాయి. తంగేడు పసుపు, మోదుగ ఎరుపులతో ఆ పూలు ఎంత రంగులుగా ఉన్నాయంటే బహుశా పైనుంచి చూస్తే ఈ ఎరుపు పసుపులతో అందమైన బతకమ్మలా ఉంటుందేమో అడవి అనుకున్నాడు. అంత ప్రకృతి చూస్తుంటే అతని హృదయం పొంగుతోంది.
అప్పుడప్పుడు కవితలు రాసుకునే అతనో చిన్నపాటి కవి. ఆ కవి హృదయము ఆ సౌందర్యము చూసి పరవళ్ళు త్రొక్కటం మొదలెట్టింది. కాని నడక, అందునా చేతులలో పెట్టె బరువుతో అతనిని ఇబ్బంది పెట్టింది. లేకపోతే అలా కూర్చొని కొంత కవిత్వము రాసేవాడేమో మరి.
ఆ ఏరు దాటాక అడవిలో చెట్లు కొట్టేసి వేసిన పంటలు కనపడ్డాయి. టైరు గుర్తులు కనపడ్డాయి అంటే ఏదో వాహనము కూడా ఆ దారిన ప్రయాణిస్తుందన్నమాట అనుకున్నాడు వివేక్.
అడవులలో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తారు. అడవి దట్టంగా ఉన్నదంటే భూమి సారవంతమైనదన్నమాట. ఆ దట్టమైన అడవిని నరికి, అక్కడ పంటలు వేసుకుంటారు. మూడు నాలుగు సంవత్సరాలైన తరువాత భూసారము తగ్గుతుంది. వారంతా అక్కడ్నుంచి మరో చోటికి తరలిపోతారు.
గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య జరిగే సంఘర్షనంతా ఈ అడవి గురించే, ఈ భూముల గురించే. గిరిజనులు అడవి బిడ్డలు. తను చదివిన చరిత్ర గుర్తుకు వచ్చింది వివేక్‌కు. తల విదిల్చి ముందుకు చూస్తూ సాగుతున్నాడు. ఆ అడవిలో కరెంటు కూడా ఉన్నట్లుగా లేదు. వెళ్ళే చోట గుడిసెలో, ఇల్లో, రేకులషెడ్డో.
అతను చదివిన ప్రభుత్వ పాఠశాలలన్నీ రేకుల షెడ్లే. కొన్ని బడులలో గోడలు కూలి కూడా ఉంటాయి. వాళ్ళకు కూర్చోటానికి బల్లలు కూడా ఉండవు. నేల మీదనే కూర్చుంటారు. హస్టల్ లో కూడా అందరికీ కలిపి హలు ఉంటుంది. ఎవరి చాప వారు పరుచుకు పడుకుంటారు. అది ప్రభుత్వ బడుల, వసతీగృహాల పరిస్థితి. ఇది కొందరు పెద్దమనుష్యులు కలిసి ఏర్పాటు చేసిన బడి. ఎలా ఉంటుందో? తనేమి చూడాలో, ఎక్కడ ఉండబోతున్నాడో ఆలోచిస్తేనే అతనికి కొద్దిగా కంగారు ఆందోళనా మొదలయ్యాయి.
అడవులలో దోమకాటు, విషజ్వరం కూడా ఎక్కవే. తనా రెండేళ్ళు బాండ్ రాసిచ్చాడు.
‘తప్పు చేశానా? తొందర పడ్డానా?’ అన్న దిగులు మెదలయింది మనస్సులో. అది పెరగటం మొదలయింది.
“ఇప్పుడు ముందు నుయ్యి, వెనక గొయిలా ఉంది నా పరిస్థితి. హైద్రాబాదులోనే ఏదో ఒకటి దొరికేది. తిండి గూడా ఇచ్చి జీతం ఇస్తే అంతా మిగులే. తల్లికి పంపినా, సగము దాచినా రెండేళ్ళలో రెండు మూడు లక్షలు దాచి కొద్దిగా బాగు పడవచ్చు అన్న ఆశతో వచ్చాను. ఆశ ఎంతైనా చేస్తుంది. హైద్రాబాదులో వెయిట్ చేస్తే బాగుండేది. ఛా! తొందరపడ్డాను’ ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న అతని మనస్సు కోతిలా అల్లరి చేస్తొంది. ఆలోచనలతో నడక మందగించింది.

***

ఎండ పెరిగింది. తల మీద చుర్రుమంటుంటే.. ‘ఇంకా ఎంత దూరమో’ అనుకుంటూ తల యెత్తి చూశాడు వివేక్. కనుచూపు మేరలో కొన్ని గుడిసెలు కనపడ్డాయి. కానీ నరసంచారం లేదు. అయినా వివేక్ ఆ గుడిసెలలో వెతుకుతూ వెళ్ళాడు. మొత్తం పది గుడిసెలు. వేటికీ తలుపులు లేవు. ఇంతలో ఒక ఆడమనిషి చేతిలో చిన్న పిల్లాడ్ని ఎత్తుకు కనిపించింది.
వివేక్ ఆమెను పిలిచాడు.
ఆమె కొత్త మనిషిని చూసిన కంగారు పడింది.
వివేక్ చేతులు జోడించి “అమ్మా! బడి ఇక్కడికి ఎంత దూరము?” అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు ఆమె నెమ్మదించింది.
“దగ్గరే సారు.. కొంచం ముందుకు పోతే కనపడుతుంది” అంది ఆమె.
“ఎవ్వరూ లేరేంటి?” అడిగాడు.
“పనులకు పోయారు సారు. నాకు ఈ సన్నపిల్లగాడు పైయి బాగాలేకుంటే పోలే” చెప్పిందామె.
“అవునా. మందులు ఎవైనా దొరుకుతాయా ఇక్కడ?” అడిగాడతను.
ఆమె నవ్వింది. “లేదు సారు పసరు పోసినా. తగ్గిపొతది” అంది అమాయకంగా.
“నేను ఇక్కడ బడికి టీచరుగా వస్తున్నా. పోతానింక” అంటూ ముందుకు సాగాడు వివేక్.

***
వివేక్ మళ్ళీ మట్టి రోడ్డు మీదకు వచ్చాడు.
మళ్ళీ నడక మొదలెట్టాడు. ఎవరన్నా కనపడితే పెట్ట మోయమని ఇవ్వచ్చు అన్న ఆశ పోయింది. మధ్యహ్నానం ఎవ్వరూ కనపడరన్న జ్ఞానము కలిగింది ఆ స్త్రీ తో మాట్లాడిన తరువాత. దగ్గరలోకి వచ్చేశామన్న సంతోషం కలిగింది.
దారి కొంత గుట్టలా ఎత్తుగా ఉంది. నెమ్మదిగా గుట్ట పైకి ఎక్కిన వివేక్‌కి లోతట్టులో ఉన్న గురుకుల పాఠశాల తెల్లని రంగులో కనపడింది. అతను జీవితములో అంత ఆశ్చర్యం ఎప్పుడూ పొందలేదు. కారణం అతని ఊహలకు వ్యతిరేకంగా అది రెండంతస్తుల భవనం. చుట్టూ ప్రహరి గోడతో, చెట్లతో ఎత్తుగా ఉంది. దూరం నుంచి కుడా రాజసంగా నిలబడి ఉంది. ధీర్ఘచత్రాస్రాకారములో ఉన్న ఆ భవనము ఆ ఎండలో మెరుస్తూ కనపడింది. అది రెండు చేతులూ సాచి ఆహ్వానిస్తున్నట్లుగా తోచింది అతనికి. చుట్టూ ఉన్న చెట్లు, వాటి ఎర్రటి పువ్వుల మధ్య తెల్లని ఆ భవనము అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్లుగా ఉంది.
చకాచకా అడుగులు పడినాయి వివేక్ కు. చాలా మటుకు టెన్షన్ పోయింది. ఎందుకో చాలా రిలీఫ్ గా అనిపించింది. ఆందోళన కరిగిపోయి ఉత్సాహం చోటుచేసుకుంది.
‘ప్రసాదరావు సార్ అడిగినా చెప్పలేదు బిల్డింగు అని’ అని అనుకుంటూ భవనం గేటు దగ్గరకు చేరుకున్నాడు. పెద్ద గేటు అది. తాళం పెట్టి ఉంది. ప్రక్కన చిన్న గేటు తెరిచి ఉంది. అత్యంత సుందరంగా గేటు మీద బోర్డు “గిరిజన గురుకుల పాఠశాల” మెరుస్తూ ఆదరంగా ఆహ్వానిస్తూ కనపడింది.

***

20 thoughts on “మోదుగపూలు – 2

  1. కధ చాలా ఆసక్తికరంగా ఉంది, వివేక్ నాన్న రహస్య జీవితం ఈ అడవితోనే ముడిపడి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది.
    నాకయితే ఒకసారి ఆపాఠశాలకి వెళ్ళాలని అనిపిస్తుంది మా.
    అభినందనలు

  2. చాలా బాగా సాగుతోంది సంధ్యా! కొత్త కథాంశం… ఆసక్తిగా నడుస్తోంది. అభినందనలు. చదువుతుంటే, వెంటనే ఆ పాఠశాలకు వెళ్లాలనిపిస్తోంది, వివేక్ తో!

    1. కృతజ్ఞతలు భానుమతిగారు. మీ వంటి పెద్దలు దీవెనలు నన్ను ముందుకు నడిపిస్తాయి

    1. చాలా సంతోషముగా ఉంది కిరణ్ కృతజ్ఞతలు. మీవంటి మిత్రులు దొరకటం అదృష్టం.

  3. అద్భుతంగా రాశావు సంధ్యా!ఏ చిన్న వివరాన్నీ ఒదిలి పెట్టకుండా, ప్రతి దృశ్యాన్నీ చక్కగా వర్ణిస్తున్నావు.
    వివేక్ నాన్నగారి రహస్యజీవనం వెనకాల మర్మం ఎప్పుడు వీడుతోందో అని చాలా ఆసక్తిగా ఉంది.
    ఆ బడిలో వివేక్ గడపబోయే జీవనం పట్ల కూడా అమితమైన ఆసక్తిగా ఉంది.
    విజయోస్తు మిత్రమా

    1. కృతజ్ఞతలు పద్మా. మీ అందరి మంచి మాటలు నాకు బలమిస్తున్నాయి.

    1. మీ ఆసక్తిని పెంచాలన్నదే నా ధేయ్యం. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ స్పందన చెలిపినందుకు కృతజ్ఞతలండి వీణా.

  4. సంద్యగారికి సరస్వతి కటాక్షం అయ్యింది. సందేహం లేదు

  5. చాలా బావుంది సంధ్యగారు. విషయసేకరణ లో మీ కృషి అడుగడుగునా తెలుస్తోంది . అభినందనలు .

    1. చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చుతున్నందుకు. కృతజ్ఞతలు జ్యోతి

  6. ఆషా మాషీ గా వ్రాసుకుంటూ పోవడం లేదు రచయిత్రి. ఉటంకించే విషయాలకు సాధికారత నబ్బించే ప్రయత్నం ప్రతి సన్నివేశం లోనూ ద్యోతకమౌతోంది. అందుకే దృశ్యకావ్యాన్ని తలపిస్తోంది రచన! అభినందనలు సంధ్య గారూ.

    1. మీ వంటి పెద్దలు మాకు అండగా నిలబడి ఉండగా
      మాకు లేదు భయమెందునా
      నడుస్తాము మునుముందునా. మీకు నా హృదయపూర్వక ప్రణామాలు.

Leave a Reply to Sandhya Cancel reply

Your email address will not be published. Required fields are marked *