March 29, 2024

ఔషధ విలువల మొక్కలు – 3

రచన: నాగ మంజరి గుమ్మా

11.
*చూత పత్రం*

చూత పత్రమేది? చూడగ తెలియునా? *
మామిడదియె కాద మంగళమ్ము*
తోరణమున, చేరు తొలి పూజ దేవుని*
ఔషధముగ నాకు లమరియుండు*

శ్రీ గణేశ పూజా పత్రాలలో చూత పత్రం ఒకటి. మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది. దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.

12.

*దాడిమీ పత్రం*

దాడిమి యను పేర దానిమ్మ పత్రిని*
గణపతికిడి మొక్కు ఘనము గాను*
పత్రి ఫలము బెరడు బహు గుణముల జూపు*
స్వీయ వైద్యమెపుడు చేటు దెచ్చు*

దానిమ్మ లేదా దాడిమి. విఘ్నేశ్వర పూజలో మరొక పత్రి. ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కుష్టు వ్యాధికి, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. (కషాయముల వంటివి లోనికి తీసుకునే టప్పుడు వైద్యుని సలహా తీసుకోవాలి. సొంతవైద్యం పనికి రాదు. ఒక్కోసారి వికటిస్తాయి).

13.

. *దేవదారు పత్రం*


హిమనగముల దొరకు ద్రుమరాజ మీ మాను*
దేవదారు యనెడి దేవ తరువు*
పుణ్య తీర్ధ వాసి పుణ్య జల విలాసి*
అమ్మ పెంచు పత్రులమరె నిచట*

బహు పుణ్యప్రదమైన హిమాలయాలలో పరమ పావని గంగానది కాలుపెట్టిన చోట పుట్టిన చెట్లు ఈ దేవదారు వృక్షాలు. పార్వతీదేవి పుట్టినింట పుట్టిన చెట్లు అంటే ఆమెకు ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. ఆ చెట్టు బెరడు ఔషధం. నిలువెత్తున పెరిగే ఆ చెట్ల సొగసు ఎవరూ పాడుచేయకుండా సింహాలను కాపువుంచినదట హైమవతి. మరి ఆమె ముద్దుల తనయుని పూజించడానికి కావలసిన పత్రులలో చేరడానికి ఇంతకంటే ఏం కావాలి? దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

(ఎవరైనా హిమాలయాలకు వెళితే పార్వతీదేవికి, చెట్టు పెంపకందారుకు, ముఖ్యంగా దేవదారు చెట్టుకు క్షమాపణ చెప్పుకుని పిడికెడు ఆకులు కోసుకుని తెమ్మని చెప్పండి. ఆ ఆకుల్ని నీరు, పసుపు, కుంకుమ, గంధము, పాలతో అభిషేకించి, పూజించి, మళ్ళీ అపరాధ నమస్కారం చేసి, transparent పొలిథిన్ కవర్ లో సీల్ చేసి ఉంచి, ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరునికి ఒకసారి వినాయక చవితినాడు చూపించండి. ఏం చేస్తాం? మన ప్రాంతంలో లభించదు కదా)

14.

*మరువక పత్రం*

మరువకమని పిలుచు మరువం మనసెరుగు*
మల్లె కాగడాల మధ్య చేర్చి*
కలిపి కట్ట నెర్ర కనకాంబరాలకు*
సరియగు జత నౌదు సరసులార*

శ్రీగణేశు పూజలో మరొక దివ్య పత్రం మరువక పత్రం. దీనికే మరొక పేరు మరువం. మగువల పాలిటి మరులు తీగ… మరువానికే మాటలు వస్తే, “మల్లెలు, కాగడా మల్లెలు, కనకాంబరాలతో నన్ను చేర్చి కట్టండి, మీ జడలో పెట్టండి, ఎంత అందమో చూడండి” అనదా?
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది. కాబట్టి వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.

15.

. *సింధువార పత్రం*

సింధువార పత్రి శ్రీగణేశు కొలిచె*
వావిలాకు పేర వాడుకగను*
వాత పట్లు తొలగు బాలింతలకు పూయ*
చూడ బిల్వమట్లు చూపుకట్టె*

సింధువార పత్రం పేరిట శ్రీ వినాయకుని కొలిచే మరొక పత్రం వావిలాకు. బాలింతలకు 11 వ రోజున చేయించే శుద్ధి స్నానమునకు వేడినీటిలో ఈ వావిలాకులు వేస్తారు. వాతపట్లు హరిస్తుంది. చూడటానికి బిల్వపత్రాల్లా అనిపిస్తాయి. మారేడు వృక్షంలా ఎదుగుతుంది కానీ వావిలి చిన్న మొక్క మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *