June 24, 2024

తామసి – 12

రచన: మాలతి దేచిరాజు

నసీమా, గౌతమ్ పెళ్ళి చేసుకోడానికి నిర్ణయించుకున్న కొన్ని రోజులకి.
పెళ్ళి షాపింగ్ చేస్తున్నారు షీబా, నసీమా.
“ఇంతకీ అబ్బాయిగారెక్కడ. ?” అడిగింది షీబా.
“వస్తున్నాడు ఈ లోపు మనం చూద్దాం. ” అంది నసీమా.
చీరలు సెలెక్ట్ చేస్తున్నారు ఇద్దరూ. ఒక చీర ఒంటికి చుట్టుకుని ఎలా ఉంది అనడిగింది నసీమా.
“పర్ఫెక్ట్. ” వస్తూనే అన్నాడు గౌతమ్. షీబా తల తిప్పి చూసింది.
“హే. గౌతమ్. ” అంది నసీమా.
షీబా, గౌతమ్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని షాక్ అయ్యారు. కొన్ని ఘడియలు పట్టింది ఆ షాక్ నుంచి తేరుకోడానికి.
“ఇంకేం. గౌతమ్ కి నచ్చిందిగా. ఈ చీరే ఫిక్స్. ! అన్నట్టు. గౌతమ్ తను షీబా. హాస్టల్ లో నా రూమ్ మేట్. షీబా తనే గౌతమ్. “అంటూ ఇరువురికి పరిచయం చేసింది.
“హాయ్. “షీబా
“హలో ” గౌతమ్.
“గౌతమ్ నా షాపింగ్ అయిపొయింది, ఇక నీదే. “అనగానే.
“మీరు చెయ్యండి. నాక్కొంచెం తల నొప్పిగా ఉంది నేను హాస్టల్ కి వెళ్తా సీమా. “అంది షీబా.
“అవునా. సరే అయితే. వెళ్ళు. “అనగానే అరక్షణం ఆగకుండా కదిలింది తను.
గౌతమ్ సీమాని అనుసరించి షాపింగ్ చేయడానికి కదిలాడు.
హాస్టల్ కి వచ్చి ఘొల్లున ఏడుస్తోంది షీబా. తన దుస్థితి తలుచుకుంటే పట్టరాని దుఃఖం కలుగుతోంది. అంటే తన అబార్షన్ కి హెల్ప్ చేసింది గౌతమే అని కూడా అర్ధం అయ్యింది తనకి. అదింకా బాధాకరం. ఇంతలో వచ్చింది సీమా.
*****
“గౌతమ్ డ్రెస్ కూడా చాలా బావుంది. హమ్మయ్య మొత్తానికి అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి ఇక పెళ్ళే
మిగిలింది. .”సంబరపడుతూ చెప్పింది నసీమా. షీబా మౌనంగా వింటోంది. ఏం చెప్పగలదు మరి.
“నీకు తెలుసా షీబా!. చిన్నపటి నుంచి నాకు గౌతమ్ అంటే చచ్చేంత ప్రేమ, కానీ ఎప్పుడూ తనకి చెప్పలేదు. ఇక గౌతమ్ నా జీవితంలో లేడనుకునే టైంలో మళ్ళీ ఆ దేవుడు ఇద్దర్ని ఒకటి చేస్తున్నాడు. “అంది ఆనందబాష్పాలు నిండిన కళ్ళతో.
“మీ ఇంట్లో ఒప్పుకుంటారా మరి. ?” అడిగింది షీబా. ఇక తప్పక తన గతం చెప్పింది నసీమా. గతమంతా విని తనలో ఏం అనుకుందో తనకే తెలియాలి.
రాత్రి అయ్యింది.
ఎంతసేపటికీ షీబాకి నిద్రపట్టడం లేదు. తన గుండెని ఎవరో మెలిపెడుతున్నట్టుంది. మొదట బాధ, తర్వాత కోపం, అటుపై ఆక్రోశం. చివరకి స్వార్ధం. గౌతమ్ సీమాని పెళ్ళి చేసుకున్నా పర్లేదు అతని జీవితంలో తనూ ఉండాలి. అన్న ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది షీబా. ఆ నిర్ణయమే తనని దహిస్తుందని ఊహించలేకపోయింది. !
గౌతమ్. ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తోంది షీబా. అతను కంట పడగానే.
“గౌతమ్ నీతో మాట్లాడాలి.” ఏమిటి అన్నట్టు చూసడతను. పావుగంటలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నారు ఇద్దరు. లోకంలో వాళ్లిద్దరు మాత్రమే ఉన్నారా అనేంత నిర్మానుష్య ప్రదేశం.
“ఏదో మాట్లాడాలి అన్నావ్. “అడిగాడు గౌతమ్.
“నువ్వు నాకు కావాలి గౌతమ్. “టక్కున చెప్పింది. క్షణం విస్తుపోయి.
“అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నావా. ?”
“నసీమా. గతం. “అంది. నవ్వొచ్చింది అతనికి.
“అయితే. ?”
“ఇదివరకే పెళ్ళి అయ్యి విడాకులు కూడా అయిన తనని పెళ్ళి చేసుకునేంత ఉదాసీనత ఉన్న నీకు. నువ్వే ప్రాణం అనుకుని సర్వస్వం అర్పించిన నాపైన ఎందుకీ విముఖత. ?”
“సీమా విషయం వేరు, నీ విషయం వేరు. ” సూటిగా చెప్పాడు.
“ఎవరో ఎంగిలి చేసిన దాన్ని స్వీకరించగలవు గాని. నీ ఎంగిలే నీకు అరుచిగా మారిందా. ” ఒకరకమైన జుగుప్స కలిగింది అతనికి ఆ మాటలు వింటే.
“ప్రేమంటే. కేవలం శరీరాలు కలిస్తే చాలదు, మనసులు కలవాలి. ప్రేమకి మనసుతో తప్ప శరీరంతో పని లేదు. ”
“ఓహో. అయితే ఒక పని చేస్తావా. ?”
“ఏంటి. ?”
“నువ్వన్నట్టు ప్రేమకి శరీరంతో పని లేదు కాబట్టి. నసీమాతో కాపురం చేయకుండా ఉండాలి. ఉండగలవా. ?” సంద్రం పొంగిన దృశ్యం కదిలింది గౌతమ్ కళ్ళ ముందు.
“పెళ్ళి చేసుకున్నాక అలా ఎలా ఉండటం. ”
“సో. ప్రేమలో శరీరానికి కూడా భాగం ఉంది. తను ముందు నీకు మనసిచ్చింది. విధి రాత వల్ల తనువు మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. కానీ నేను నా తనువూ, మనసూ రెండూ నీకే ఇచ్చాను. ”
“ఒక్కసారి రమించినంత మాత్రాన. ప్రేమ కలుగుతుందా. ? మరొకరితో రమించినంత మాత్రానా ప్రేమించిన వాళ్ళపై మక్కువ, మమకారం పోతుందా. ! నీకర్ధమైయ్యేలా చెప్పాలంటే. తనువు ఎవరికైనా ఇవ్వగలం. మనసు ఒక్కరికే ఇవ్వగలం. “కాస్త పచ్చిగా అనిపించినా, ఒకవిధంగా వాస్తవం అది.
“అయితే. తనతో కలిసిన మనసుని తనకే ఇవ్వు. నాతో కలిసిన తనువు నాకు ఇవ్వు. ఇద్దరికీ నీ జీవితంలో సమానమైన స్థానం ఇవ్వు. దీన్ని నువ్వు స్వార్ధం, మొహం, కామం ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు నువ్వు కావాలంతే”
ఆశ్చర్యం తప్ప మరో భావం లేదు అతని కళ్ళలో. ఒక స్త్రీ మాట్లాడాల్సిన మాటల్లాగా అనిపించలేదు. కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ముఖ్యమే కదా. !
“నువ్విలా మాట్లాడ్డం భావ్యం కాదు షీబా. ”
“అయ్యుండచ్చు. కానీ తప్పదు. EVERY THING IS FAIR IN LOVE AND WAR. నీ జీవితంలోకి రావడానికి, నిన్ను నా మనిషిగా చేసుకోడానికి ఎలాంటి యుద్ధం అయినా చేస్తాను. చివరికది నీతో అయినా సరే. ” అయోమయంగా చూస్తున్నాడు గౌతమ్. ఇక చెప్పడానికి ఏమీ లేదంటూ వెళుతోంది తను. నాలుగడుగులేసి ఆగింది.
“యుద్ధంలో ధర్మం ఉండదు. ధర్మం ఉంటే యుద్ధంతో అవసరం ఉండదు. ” అని వెళ్ళిపోతున్న తనని చూస్తుండిపోయాడు గౌతమ్ నిస్సహాయంగా.
*****
షీబా మనసులో ఆణువణువూ స్వార్ధం నిండిపోయింది. ఎలా అయినా గౌతమ్ ని దక్కించుకోవాలనే కాంక్ష నిలువెల్లా పాకింది. ఏం చేస్తే గౌతమ్ తనకి సొంతమవుతాడు అనే ఆలోచన చేస్తోంది. ఇంతలో మోగింది తన ఫోన్. గౌతమ్ నుంచి ఆ కాల్.
“షీబా. “అట్నుంచి
“చెప్పు. ”
“నన్ను అర్ధం చేస్కో. ”
“నువ్వు అర్ధం చేసుకున్నావా. నా మనసుని, నా ప్రేమని, నా బాధని, దేన్నైనా అర్ధం చేసుకున్నావా. ” అటు కాసేపు మౌనం.
“నిన్ను. సీమాని చేసుకోవద్దు అని అనట్లేదు గౌతమ్. నన్ను వదులుకోవద్దు అంటున్నా. ”
“పిచ్చిదానిలా మాట్లాడకు. అలా చేస్తే నిన్ను సమాజం నా. . ” ఆగాడు. అతనికి పలకడానికి కూడా కొంత సంశయం కలిగించే పదం అది. కానీ షీబా కి అంతరార్ధం అర్ధమై.
“పర్లేదు గౌతమ్. ఎవరు ఏమైనా అనుకోని. మంచో, చెడో. తప్పో, ఒప్పో, నేను నీ మనిషినై ఉంటే చాలు నాకు. ” కన్నీళ్లు. వినిపించాయి గౌతమ్ కి.
“ఇంత చెప్పినా నువ్వు మొండిగా ప్రవర్తిస్తే. నీ ఖర్మ. ఇప్పుడే సీమాకి ఈ విషయం చెప్పేస్తే. తను అర్ధం చేసుకుంటుందన్న నమ్మకం ఉంది నాకు. గుడ్ బై. ” అని కాల్ కట్ చేసాడు.
షీబాకి కలవరం కలిగింది. తను అన్నంత పని చేస్తే కష్టం. గౌతమ్ మీద సీమాకి ఉన్న ప్రేమ బలీయమైనది. ప్రేమ ఎంతటి తప్పునైనా క్షమిస్తుంది. అలాంటిది పొరపాటుని క్షమించదా. !
“నో. ఇది జరక్కూడదు. ఎట్టి పరిస్తితుల్లో సీమాకి ఈ విషయం తెలియకూడదు. అలా జరగాలంటే. అలా జరగాలంటే.” అంటూ ఉక్రోషంతో రగిలిపోయాయి షీబా కళ్ళు.
*****
మోగుతున్న ఫోన్ వైపు చూసి లిఫ్ట్ చేసింది సీమా.
“హలో. చెప్పు. సరే వస్తున్నా ” ఫోన్ పెట్టేసి కదిలింది నసీమా.
గచ్చిబౌలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదగా శంకరపల్లి వెళ్ళే దారిలో ఉన్న క్వారీ దగ్గరకి చేరుకుంది నసీమా.
“ఇక్కడికి రమ్మన్నావు ఏంటి. ” అంది ఎదురుగా ఉన్న షీబా ని చూసి.
“నీకో పిట్ట కథ చెబుతా. దానికి సరైన క్లైమాక్స్ చెప్తావా. ?” సంబంధం లేకుండా మాట్లాడుతున్న తనని వింతగా చూసింది నసీమా.
“ఏంటది. ?”
“అనగనగా ఒక చిలుకా, గోరింకా గాడంగా ప్రేమించుకున్నాయి. కానీ ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒకరి ప్రేమ ఒకరికి తెలియదు. దురదృష్టవశాత్తు చిలుకకి కాకితో పెళ్ళి అయ్యింది. గోరింక తన ప్రేమని తనలోనే దాచుకుంది. కొంత కాలం గడిచాక గోరింకకి పావురంతో పరిచయమైంది. పావురం అప్పటికే గోరింకని ప్రాణంగా ప్రేమిస్తోంది. ఒక వెన్నెల కురిసిన రాత్రి గోరింకా, పావురం శారీరకంగా ఒకటైయ్యారు. కానీ గోరువంక అది పొరపాటు అంటోంది. పావురానికది ప్రేమే. ” “ఇప్పుడు. నువ్వేమంటావ్. ?” ప్రశ్నించింది.
“నీకు పిచ్చంటాను. విషయం ఏంటో చెప్పకుండా, ఏంటీ పిట్ట కథలు. “అంది నసీమా.
“పూర్తిగా వినూ. “ఊరుకుంది నసీమా
“విధి ఆడిన వింత నాటకంలో చిలుక సంసారం చిన్నాభిన్నమైంది, కాకి నుంచి విడిపోయింది. కొన్నాళ్ళకి మళ్ళీ గోరింకని కలిసింది చిలకా. ఇప్పుడు గోరింక తన సొంతం అంటోంది పావురం. చిలకే తన ప్రాణం అంటోంది గోరింక. ” అని ఆగి తన వైపు సూటిగా చూస్తూ
“ఇప్పుడు చెప్పు గోరింక ఎవరి సొంతం. మనసిచ్చిన చిలకకా, తనువిచ్చిన పావురానికా. ”
“ఇంతకీ ఇది నన్నే ఎందుకు అడుగుతున్నావ్. ”
“ఎందుకంటే. నువ్వు చిలుకా, నేను పావురం. గోరింకెవరో చెప్పక్కర్లేదనుకుంటా. ?”
ఉరుము శబ్దంలా వినిపించాయి ఆ మాటలు. సీమ తనని తాను నమ్మలేని స్థితిలో ఉంది.
తనని తాను తమాయించుకుని.
“ఇందులో చిలక చెప్పడానికి ఏమీ లేదు. గోరింకని ఒప్పించి పావురాన్నే తన సొంతం చేసుకోమను. ”
బిగ్గరగా నవ్వు. గాలిలో ప్రతిధ్వనిస్తున్న ఆ నవ్వు. రాక్షస నవ్వుగా వినిపిస్తోంది.
“గోరింకని ఒప్పించే పరిస్థితే ఉంటే. చిలకని ఇక్కడిదాకా రప్పించే పనేం ఉంది. ”
అర్ధం కానట్టు చూసింది నసీమా ఆ మాటకి.
“అర్ధం కాలేదా. ? చిలుక ఉంది కాబట్టే కదా. పావురాన్ని వద్దంటోంది గోరింకా. అసలు చిలకే లేకపోతే.”అంటూ నసీమాని సమీపిస్తోంది షీబా.
తన ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే, నసీమా అడుగులు వెనక్కి పడుతున్నాయి. నసీమాని పూర్తిగా సమీపించిది షీబా. ఇంకొక్క అడుగు వెనక్కి వేసినా. నసీమా నలభై అడుగుల కింద ఉన్న రాయి మీద పడటం ఖాయం.
“షీబా! నేను జీవితం చూసిన దాన్ని నాకు ఎలాంటి ఆశలు, కోరికలు లేవు. కోల్పోయిన చిన్నప్పటి ప్రేమ మళ్ళీ దక్కబోతుంది అనే చిన్న స్వార్ధం నాది. నిజంగా నీకు గౌతమ్ మీద అంత ప్రేమ ఉంటే. గౌతమ్ తో నేను మాట్లాడుతాను. నేను అడిగితే ఎంత పెద్ద సాయమైనా చేస్తాడు. అలాంటిది నీకింత న్యాయం చేయలేడా. “అంది దీన స్వరంతో.
“అయితే ఒకపని చెయ్. ”
“చెప్పు. ”
“గౌతమ్ నుంచి, అతని జీవితం నుంచి దూరంగా వెళ్ళిపో. ”
“వెళ్ళిపోతాను. “క్షణం ఆలోచించకుండా అంది తను.
“అయితే. పో. ” అని తోసేసింది నసీమాని.
“నసీమా. . . . . . . . ”
స్థంభించిన చూపు, ఒణుకుతున్న చెయ్యి, కంపిస్తున్న ఎదసడి.
“గౌతమ్. మిస్టర్ గౌతమ్. ” అని కదిపాడు గాంధీ గౌతమ్ ని.
తేరుకున్న గౌతమ్ “సారీ. సారీ. “అని తమాయించుకుని టేబెల్ పై ఉన్న వాటర్ బాటిల్ అందుకుని నీళ్ళు తాగాడు.
“కేరక్టర్ తో కనెక్టివిటి అంటే ఏంటో అర్ధమైందా. ? మిస్టర్ గౌతమ్. ” అన్నాడు గాంధి.
అప్పటికే తను వాస్తవికతలోకి వచ్చాడు.
“నిజమే సార్. నేను చదువుతున్నాను అనే స్పృహ కూడా లేదు నాలో. గుడ్ రైట్ అప్. ”
“థ్యాంక్ యు. బట్ ఫినిషింగ్ ఇంకా పూర్తవలేదు ఇది ప్రీ క్లైమాక్స్ మాత్రమే. ”
“మరి నేను అడిగిన పరిష్కారం ఇంత వరకూ ఇందులో ఇంకా రాలేదు. ?”
“సీ మిస్టర్ గౌతమ్. నేను మామూలు రైటర్ ని. మానసిక డాక్టర్ ని కాదు. మీరు పార్క్ లో చెప్పిన్నట్టు. మీకు ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పెరుగుతుందో అన్నది మీ సమస్య. కేవలం నేను రాసే నవలలో ఆ పరిష్కారం వెతుక్కోవడం మీ పిచ్చితనం. మీరు చెప్పిందంతా విని దానికి నా కాల్పనికత జోడించి పాఠకుడ్ని రంజింప చేయడమే నా పని. బై ద వే. సహాజీవనం అన్నది అంత పెద్ద నేరమో, అపరాధమో కాదు. కానీ మీ విషయానికొస్తే కాస్త విభిన్నంగా ఉంది అంతే. ”
“కానీ. ఇలా ఎంతకాలం. సమాజంలో ఉండే కట్టుబాటుకి ఏదో రోజు తలవంచాల్సి వస్తే. ?”
నవ్వి. “మీకు ఏదైనా సమస్య వస్తే దాని పేరు షీబా లేదా సీమా అయి ఉండాలి. వాళ్ళిద్దరూ మీతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళల్లో వాళ్లకి ఒక అండర్ స్టాండింగ్ ఉన్నంతకాలం మీకే సమస్యా రాదు. ” అతని మాటల్లో మరో అర్ధం కూడా ఉంది. ఒకవేళ వాళ్ళలో వాళ్లకి ఏమైనా భేదాభిప్రాయాలొస్తే అప్పుడు మొదలవుతుంది సమస్య. అని చెప్పకనే చెప్పిన అతని తెలివి చూస్తే ముచ్చటేసింది గౌతమ్ కి.
“ఇద్దర్లో ఎవరికి న్యాయం చేయాలి అని మీరు నన్ను పరిష్కారం అడగడంలో మీ ఉద్దేశం ఏమిటో కూడా నాకు తెలుసు గౌతమ్. ” ప్రశ్నగా చూస్తున్నాడు అతను.
“నేను ఆ దిశగా నవల రాస్తే. అందులో సందర్భాలు, సంభాషణాలు, లాజికల్ థాట్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నారు అంతేనా. ?”
అవునన్నట్టు తలూపాడు.
గాంధీ నవ్వాడు. “సినిమాల్లో ఉండే పాటల్ని, రచనల్లో ఉండే మాటల్ని ప్రయోగించి తమ ప్రేమని అవతలి వాళ్ళకి చేరేలా చేస్తుంటారు కొంతమంది. మీరూ ఆ కోవకే చెందినట్టు అనిపిస్తుంది. “నవ్వు.
గౌతమ్ కూడా నవ్వాడు. అవుననో, కాదనో అన్నది తనకే తెలియాలి.
“ఒక్క విషయంలో మాత్రం మీకు సారీ చెప్పాలి”
“ఎందుకు”
“మీరు మీ కథని ఒక సమస్యగా చెప్పి పరిష్కారం అడిగారు. నేను దాన్ని కమర్షియల్ గా తీసుకుని కథగా రాసాను అందుకు.” మందహాసం చేసాడు గౌతమ్
“బట్ ఐ లైక్ యుర్ వే ఆఫ్ రైటింగ్. నా కథ నాకే కొత్తగా అనిపించింది. ముఖ్యంగా మీ పేరుని ఒక రైటర్ పాత్రకి పెట్టి దాన్ని మీ ఒరిజినల్ పాత్రకి లింక్ చేయడం ఇట్స్ అమేజింగ్. ”
“ఈ రచనకి సంబంధించినంత వరకు అన్నీ రియల్ క్యారెక్టర్స్ పేర్లే వాడాలనుకున్నాను. అందుకే కథలో కూడా రైటర్ రాస్తున్నట్టు తీసుకున్నా కాబట్టి అది నేనే కాబట్టి నా పేరే పెట్టాను. అందుకే ఓపెనింగ్ పోలీస్ లు రైటర్ ని తరుముతున్నట్టు కథ మొదలుపెట్టాను. ఈవెన్ ఆ పొలిస్ రుద్రాక్ష్ పేరు కూడా రియల్ క్యారెక్టర్ నుంచే తీసుకున్నా. ఒక్క ఇజాక్ పాత్ర, పేరు మాత్రమే అవుట్ ఆఫ్ ది రియాలిటి. ”
“యా. యా. బట్ అదీ కూడా బావుంది. చాలా బాగా వచ్చింది. పోయిన పుస్తకం మరో వ్యక్తికి దొరకడం, అందులో క్లైమాక్స్ లేకపోతే తనే ఒక క్లైమాక్స్ రాసుకోవడం చాలా ఫ్రెష్ థాట్. కానీ. ”
అతనేం చెప్పాలనుకుని ఆగాడో గ్రహించి.
“షీబా క్యారెక్టర్ గురించేనా. ?” తల పంకించాడు గౌతమ్.
“ఒక వెర్షన్ లో గ్యాంగ్ రేప్. ఇజాక్ వెర్షన్ లో గౌతమ్‌తో శారీరకమైన కలయిక ఎందుకు పెట్టానంటే. నా వెర్షన్ లో అది మిడిల్ ఆఫ్ ద స్టోరీ. కాబట్టి ఒక కమర్షియాలిటి ఉండాలి లేదంటే పాఠకులకు ఇంట్రెస్ట్ కలగదు. అండ్. ఇజాక్ పాయింట్ ఆఫ్ వ్యూ కథలోనే చెప్పేసా. క్లైమాక్స్ మాత్రమే రాయాలంటే కష్టం. కొంత ఫ్లో లేనిదే రాదు. ఎలాగో క్లైమాక్స్ తనదే కాబట్టి తనకి మింగుడు పడని టాపిక్ నుంచి మరో కోణంలో కథ చెప్పా. అందుకే నా వెర్షన్ లో లాజిక్ వదిలేసా.” అబ్బురపడ్డాడు గౌతమ్. గాంధి చెప్పడం పూర్తవలేదు ఇంకా.
“అలా వదిలేస్తేనే అక్కడ నుంచి తను కథ ఎత్తుకోడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. చదివేవాళ్లకి కూడా కొంత క్యూరియాసిటి కలిగించినట్టు అవుతుంది.
“కరెక్ట్” అనుకున్నాడు మనసులో.
“నా పాత్ర ని ఎందుకు ముందుగానే చంపేసారు.”నవ్వుతూ అడిగాడు.
“హా హా హా హా. ఇంకా ఈ మాట అడగలేదు ఏమిటా అనుకుంటున్నా.” నవ్వుకున్నారు ఇద్దరు.
“ఉదాహరణతో వివరిస్తా. మీరు హైదరాబాద్ టూ విజయవాడ వెళ్తున్నారు అనుకుందాం కానీ మీరు కోదాడలో ఉండగా కథ ఓపెన్ చేస్తే. ఇప్పుడు మీ ముందు రెండు ప్రశ్నలుంటాయి.
ఒకటి. ఎక్కడనుంచి వస్తున్నారు. ? రెండు. ఎక్కడికెళ్తున్నారు. అదే మీరు హైదరబాద్ లో ఉండగా ఓపెన్ చేస్తే విజయవాడ వెళ్తున్నారు అని, విజయవాడ లో ఓపెన్ చేస్తే హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఒక్క మాటలో చెప్పేయొచ్చు. అలా చెప్పడంలో నడక ఉండదు. సినిమా భాషలో నరేషన్ అంటారు. కథకైనా, నవలకైనా నరేషన్ ప్రధానం. సినిమా పరిభాషలో స్క్రీన్ ప్లే అంటారు. గౌతమ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాడు అన్నదే కథ. అది ఎలా, ఎప్పుడు, ఎందుకు, లాంటివి దృష్టిలో పెట్టుకుని ఆద్యంతం చదివించేలా నవల, చూసే విధంగా సినిమా ఉండాలి.
మీ క్యారెక్టర్ ని ముందే చంపేయడం వల్ల ఒక సస్పెన్స్ మొదలవుతుంది. ఆ సస్పెన్స్ దిశగా అసలు కథలోకి వెళితే. సస్పెన్స్ ని అడ్డం పెట్టుకుని కావలసినంత కంటెంట్ చెప్పచ్చు.
ఇట్స్ డిపెండ్ అప్ ఆన్ ద వే ఆఫ్ థాట్ ప్రోస్సేసింగ్ ఆఫ్ ఎ రైటర్. “అనగానే చెప్పట్లు కొట్టాడు గౌతమ్.
“సో నైస్ ఆఫ్ యు. సార్. ” పొగడ్తకి నవ్వడమే తెలుసు అన్నట్టు నవ్వాడు గాంధి.
“మరి ఆ పార్ట్ కంక్లుజన్ ఇవ్వలేదే మీరింకా. “? పుస్తకం అందుకుని చూస్తూ అన్నాడు గౌతమ్.
“చెప్పా కదా గౌతమ్ క్లైమాక్స్ ఇంకా రాయాల్సి ఉంది. మీరు వచ్చారు కాబట్టి, ఇది మీ నుంచి వచ్చిన కథ కాబట్టి ఉండబట్టలేక చూపించాను. !”
“వెరీ గ్లాడ్ ఫర్ దట్. ” అన్నాడు గౌతమ్.
“నసీమా ఫ్యామిలి డ్రామా కూడా బావుంది. బట్ కొంత మీ రచన ప్రకారమే జరిగింది లేండి. ”
“హా హా హా. ఫ్యామిలీ లో ఏవో కారణాల వల్ల అని మీరొక్క మాటలో చెప్పారు. దానికి సరైన కారణాలు కల్పించుకుని నేను రాసాను. ఇప్పుడు మీరే అంటున్నారు కొంత నా రచన ప్రకారమే జరిగిందని. దెన్ ఫైన్ కదా. ”
“లాస్ట్ వన్. ”
“యా అడగండి. ”
“పీటర్ గురించి మెన్షన్ చేయకుండా ఉండాల్సింది. ”
“దానికీ కారణం ఉంది గౌతమ్. మీ ఇద్దరి మధ్య. ఐ మీన్ గౌతమ్ అండ్ నసీమా మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ పడాలి అంటే. ఒక సమస్య లేదా ఒక కేలామిటి ఉండాలి. అందుకే పీటర్ ఇంసిడెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా నసీమాకి పీటర్ తో. ”
“నో నో. ఇప్పుడంతా నార్మల్. “చెప్పాడు నేల చూపులు చూస్తూ. ఇంత దాకా సూటిగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడిన గౌతమ్. అలా ఎందుకు చూసాడో మరి కొద్ది రోజుల్లో అర్ధం అవుతుంది గాంధీకి. !

***********************

1 thought on “తామసి – 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *