June 25, 2024

ధర్మసూత్రాలకు ఆద్యుడు గౌతమ మహర్షి

రచన: శ్యామసుందర్ రావు

గౌతమ మహర్షి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు భరధ్వాజుడు. ఈయన అంగీరస మూలానికి చెందిన వారే. వేద కాలానికి చెందినవాడు ఈయన రాహూగణుడి కొడుకు. ఈయన భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు.
గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వములో ప్రస్తావించబడింది. ఒకసారి గౌతముడు దండకారణ్యములో తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై గౌతమ మహర్షి ఉన్నచోట భూమి సస్య శ్యామలముగా ఉంటుంది అని వరము ఇచ్చాడు. ఆ తరువాత శృత శృంగ గిరి అనే ప్రాంతములో ఆశ్రమము నిర్మించుకొని వచ్చిన అతిధులకు భోజనము పెడుతూ ఉండేవాడు. నారద పురాణంలో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకథాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా, గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. విఘ్నేశ్వరుడు గౌతమ మహర్షి వ్రతాన్ని భంగము చేయటానికి ఆశ్రమానికి వచ్చి అక్కడే ఉంటాడు. అప్పుడు ఆశ్రమమం భూలోక స్వర్గముగా మారిపోతుంది
విఘ్నేశ్వరుడు గౌతమ మహర్షి సహాయముతో శివుని జాతాఝతములోని గంగను భూమి మీదకు తీసుకురాగలిగితే, తన తల్లి అయినా పార్వతి దేవికి సవతి పోరు తప్పుతుంది అని అలోచించి, ఆశ్రమములో బ్రాహ్మణులను అక్కడి నుండి తీసుకుపోవటానికి ఉపాయము ఆలోచిస్తాడు. అహల్య చెలికత్తెలలో ఒకరిని గోవుగా మార్చి గౌతముని పంటను నాశనము చేయటానికి పంపుతాడు. పంట మేస్తున్న గోవు పైకి గౌతమ మహర్షి ఒక గరికను విసరగా విఘ్నేశ్వరుని మాయ వలన ఆ గోవు చనిపోతుంది. అప్పుడు ఆశ్రమములో బ్రాహ్మణులూ ఇతర మునులు గౌతముని గోహాత్య పాతకానికి నిందిస్తారు. గౌతమ మహర్షి గోహత్య పాతక నివారణకు ఏమి చేయాలని బ్రాహ్మణులను అడుగుతాడు. వారు శివుడిని మెప్పించి శివుని జటాజూటములోని గంగను భూమి మీదకు తెప్పించగలిగితే, పాప విమోచనము కలుగుతుంది అని చెపుతారు. గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకొని, బ్రాహ్మణులను బండరాళ్లుగా మారిపొమ్మని శపిస్తాడు. బ్రాహ్మణులు తమని క్షమించమని వేడుకొనగా, శ్రీ కృష్ణావతారంలో శాపవిముక్తి కలుగుతుందని సెలవిస్తాడు. విఘ్నేశ్వరుడు లోకకళ్యాణము కోసము దైవకార్యము కాబట్టి, గంగను భూమికి తెమ్మని అడుగుతున్నాడు కాబట్టి, ఆ పని చేయాలని నిశ్చయించుకుంటాడు.
హిమాలయాలకు భార్య అహల్యతో వెళ్లి ఒంటి కాలి మీద శివుడి కోసము తపస్సుచేస్తాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగినప్పుడు, గంగను భూమి మీదకు వదలమని ప్రాధేయపడతాడు. శివుడు అలాగే గంగను వదిలితే, గంగ గోవు మరణించిన ప్రదేశముపై ప్రవహించిన వెంటనే గోవు బ్రతుకుతుంది. ఆశ్రమములో బ్రాహ్మణులు గంగలో స్నానమాకాహారచటానికి వస్తే, గంగా వెనక్కు వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళా గౌతముడు బ్రతిమాలితే గంగ వస్తుంది కాబట్టి ఆ నదిని గౌతమి అనియు, గోవును బ్రతికించింది కాబట్టి గోదావరి అనే పేరుతో పిలబడుతుంది. ఆ విధముగా గోదావరి నది పుట్టుకకు గౌతమ మహర్షి కారకుడు ఈ వృత్తాంతము దేవి భాగవత పురాణములో వివరింపబడింది , గౌతమ మహర్షికి శతానందుడు అనే కుమారుడు (ఈయన మిథిలా నగరానికి రాజుయైన జనకుని కొలువులో ప్రధాన ఆచార్యుడు) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజనాదేవి హనుమంతుని తల్లి, రెండవ కూతురు ఉదంక మహర్షి భార్య.
మొదటినుండి ఇంద్రునికి అహల్యాపై గల వ్యామోహము వలన ఇంద్రుడు, గౌతముడు సూర్యదయాన్నే గంగలో స్నానానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతముని రూపములో వచ్చి అహల్యను అనుభవిస్తాడు. తిరిగి వచ్చిన గౌతముడు దివ్యదృష్టితో జరిగిన విషయము తెలుసుకొని ఇద్దరినీ శపించాడు. శాపము వలన అహల్య రాయిగా మారుతుంది. ఇంద్రుడి శరీరము వేయి యోనులతో నిండిపోతుంది. తరువాత వారిద్దరి మీద జాలిపడిన గౌతముడు ఇంద్రుడి శరీరముపై ఉన్న యోనులను కళ్లుగాను, రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాద స్పర్శ వలన పూర్వ రూపము సంతరించుకొని తనను కలుసుకుంటుంది అని శాపవిమోచనం కలిగిస్తాడు
మంత్రాల సృష్టికర్తగా (మంత్ర ధృష్ట) సుప్రసిద్ధుడు ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మసూత్రాలుగా ప్రఖ్యాతి చెందాయి. ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మశాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అని కూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంథంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, చత్రుర్వర్ణాలు, చాతుర్వర్ణాలు, రాజధర్మాలు, శిక్షాస్మృతులు స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హిందూ ధర్మశాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మశాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.

1 thought on “ధర్మసూత్రాలకు ఆద్యుడు గౌతమ మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *