December 6, 2023

భజగోవిందం తెలుగు పాట – 1


రచన: ధనలక్ష్మి పంతుల

ఓమ్ సరస్వత్యై నమః.
భజగోవిందం ఆది శంకరాచార్యులు.
శ్రీమతి ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి గారు పాడిన రాగాలలోనే కూర్చిన తెలుగు పాట.

1.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే

గోవిందాయని సేవించుమురా
గోవిందాయనీ మందమతీ
మరణము నిన్నూ పొందే సమయము
ఏ వ్యాకరణమూ రక్షించదురా

శంకరాచార్యులవారు ఒకరోజు అలా వీధిలో నడిచి వెళ్తుండగా ఒక వ్యాకరణ పండితుడు కృణ్ కరణే అని శిష్యులకు బోధపరుచుచుండెను. అనగా కృణ్ అనే ధాతువు కి అర్థం చేయు (కరణే) అని. ఆ పండితుడు అప్పటికే పెద్దవాడు. వానిని జూచి
‘నాయనా! నీవు పెద్దవాడవు! ఇంకా ఎంతకాలం ఈ వ్యాకరణ పాఠాలు చెబుతావు? ఇకనైనా ఆ గోవిందుని
స్మరింపుము. మరణకాలము సమీపించినచో నిన్ను ఎంత పండితుడవైనా ఏ వ్యాకరణ పాఠమూ రక్షింపలేదు కదా! అని చెప్పేరు.

2.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం

మూఢుడ ధనముపై ఆశను వదలరా
వైరాగ్యమునూ మనసున నింపరా
శ్రమతో నీవూ పొందిన ధనముతో
ఆనందించర ఆస్వాదించర!

ఈ లోకంలో ఎంతమందో యుద్ధాలు చేసి, ఒకరినొకరు చంపుకుని , మోసాలు దొంగతనాలు చేసి బలవంతముగా తీసుకొని ధనాన్ని సంపాదించి ఆనందము పొందుతున్నారు. అలా ఎందుకు?
నీవు కష్టపడి సంపాదించిన ధనముతో మనసులో ఆనందాన్ని అనుభవించు. ఈ ధనముపై ఆశను
వదిలిపెట్టి వైరాగ్యమును నింపుకొనుము అని చెబుతున్నారు.

3.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే

ధనమూ నీకూ యున్నంత వరకే
నీవారనుచూ చేరెదరెందరో
కాయము కృశించి జీవించిననూ
అడుగరు నీయింట మంచీచెడునూ

ఎప్పుడైతే నీకు ధనము ఎక్కువగా ఉంటుందో, అప్పుడు ఎక్కడెక్కడివారో వచ్చి మేము నీవారమని నీ చుట్టూ
చేరతారు. నీవు ముసలి వాడవై శరీరము కృశించినపుడు నీ యింట్లోనే ఎవ్వరూ నీ మంచీ చెడూ అడుగరు కదా!

4.
మా కురు ధన జన యవ్వన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా

ధన జన యౌవ్వన గర్వము వద్దురా
క్షణమున నన్నీ హరించును కాలం
మాయా మయమౌ జగమును విడిచీ
తెలివిగ పొందుర పరబ్రహ్మమునూ

చాలామంది మాకు ఎక్కువమంది స్నేహితులు, బంధువులు, మేమంటే ఇష్టపడేవారు ఉన్నారు మాకేమిటి తక్కువ? మాకు చాలా ధనముందని, వయసులో ఉన్నామని ఎవరి మాటా వినకుండా చాలా గర్వంతో, అహంకారంతో ఉంటారు. ఎంతమంది ఉన్నా, ఎంత ధనమున్నా, యౌవనమున్నా మన ప్రాణం పోవడానికి పట్టే సమయం ఒక్క క్షణం.
ఎన్నిఉన్నా ఒక్కక్షణములో అన్నీ కాలంతో పాటు పోతాయి. మనతో ఏదీ రాదు. ఈ జగమంతా వట్టి మాయ.
ఏదీ శాశ్వతం కాదు. అటువంటి ఈ మాయా ప్రపంచమును విడిచి తెలివిగ పరబ్రహ్మ స్వరూపమును పొందండి. అని చెబుతున్నారు శంకరాచార్యులవారు.

5.
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః

దేవాలయమున వృక్షముక్రింద
నేలను నిద్రా జింక తోలే వస్త్రమై
అన్నీ విడిచిన సన్యాసికి మరి
ఇంతకుమించి సుఖమేముందిరా

అయ్యా! తమరు ఇంత చక్కని స్తోత్రాలు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనేక భాష్యాలు , అన్నీ రాస్తున్నారు, చెబుతున్నారు మీకొక నివాసం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అన్నారు కొంతమంది పెద్దలు.
“అయ్యా! ఏదో ఒక గుడిలో ఓ చెట్టుకింద నేలమీద పడుకుని ఓ జింక తోలు కట్టుకుని ఉన్నవానికి అన్నీ సుఖాలు విడిచిపెట్టిన సన్యాసికి నేలమీద నిద్ర లాటి వాటి కన్నా సుఖమేముంటుంది?నేను అన్నీ విడిచి పెట్టిన వానిని కదా! అన్నారు శంకరాచార్యులవారు.

6.
భగవద్గీతా కించిదధీత
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేవ న చర్చ

భగవద్గీత కొంచెము చదివినా
గంగా జలమును కొంచెము త్రావినా
ఒక్కసారైనా మురారిని తలచిన
యముడైనా దరికే రాగలడా!!

భగవద్గీతను కొంచెము అర్థము చేసికొని చదివినా, కొంచెము పవిత్రమైన భావముతో గంగా జలమును కొంచెము త్రాగినా ఒక్కసారైనా ఆ విష్ణువుని స్మరించినా ఆ యముడు కూడ మీ వద్దకు రావడానికి , చూడడానికి సందేహిస్తాడు కదా!

7.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే

మరిమరి జననం, మరిమరి మరణం మరిమరి జననీ గర్భనివాసం
ఈ సంసారము దాటగలేనిది
కృష్ణా దాటించి రక్షింపుమయా!!
పుట్టుక, మరణం మరలమరల వచ్చుచుండును.

జన్మించినపుడల్లా తల్లి గర్భమందు నివాసము తప్పదు. ఈ సంసార సముద్రం ఎవరూ దాటలేరు. ఓ కృష్ణా! నీవే దయతో దాటించి మమ్ములను రక్షింపవయా!!

8.
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం

పాడర గీతా విష్ణు నామములను
ధ్యానము సేయర విష్ణువు నెపుడూ
విడువకు సజ్జన సంగతి నెపుడూ
దీనజనమునకు ధనమును ఈయరా

భగవద్గీతను , విష్ణు సహస్ర నామములను పాడండి! విష్ణువును ఎల్లప్పుడూ ధ్యానించండి. మంచి మనుష్యులతో స్నేహము ఎప్పుడూ విడువవలదు. అటులనే పేదవారికి ధనమును ఈయవలెను. అని అందరికీ బోధించారు శంకరాచార్యులవారు.

9.
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి:

ధనమెప్పుడునూ అనర్థమేతెచ్చునూ,
కొంచెము కూడాసుఖమే లేదే
పుత్రులు వలన ధన భయమే కల్గును
ఇదియే అంతట లోకము రీతీ

ధనమెప్పుడూ చేటు కలిగిస్తుంది. ధనము వలన కొంచెము కూడ సుఖము లేదు. ఆఖరికి పుత్రులవలన కూడా ధనముంటే భయమే కలుగుతుంది. ఇదియే అంతా లోకములోనున్న విధము అని శంకరాచార్యులవారు చెప్పిరి.

10.
గురుచరణా౦బుజ నిర్భర భక్తః
సంసారాదచిరార్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం

గురు పదములపై భక్తిని యుంచుము
సంసారము నూ విడువగవలెనూ
ఇంద్రియములనూ మనసున అణిచిన
దేవుని నీవే దర్శింతువులే

మంచి గురువుల పాద పద్మములను భక్తితో ఆశ్రయించాలి. ఈ సంసారము నుండి విముక్తుడవు కావలెను. కోరికలను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు నీకు ఆ భగవంతుని నిజమైన దర్శనము కలుగగలదు అని శంకరాచార్యులవారు చెప్పిరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

October 2021
M T W T F S S
« Sep   Nov »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031