May 26, 2024

మోదుగ పూలు – 3

రచన: సంధ్య యల్లాప్రగడ

గేటులోంచి లోపలికి ప్రవేశిస్తున్న వివేక్‌ను కొందరు పిల్లలు చూశారు. అది వాళ్ళకు లంచ్‌ టైంలా ఉన్నది. గోల గోలగా దగ్గరకు వచ్చేశారు. అందరూ “నమస్తే సార్!” అంటూ పలకరింపులు. పెద్ద పిల్లలు దగ్గరకు వచ్చి బ్యాగు, పెట్టె అందుకున్నారు చేతుల నుంచి.
“ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకుపోండి!” అన్నాడు వివేక్.
ఆ ప్రహరిలోకి ప్రవేశించగానే లోపల పెద్ద మైదానము మధ్యలో ఒక ఎత్తు అరుగు, మధ్యన జెండా స్తంభం ఉన్నాయి. రెండు రెండంతస్థుల భవనాలు రెండూ ప్రక్క ప్రక్కగా ఉన్నాయి.
ఒక దాని పైన స్కూలు పేరుతో పెద్ద బోర్డు ఉంది. మరో భవనముపై వసతీగృహము అన్న బోర్డు ఉన్నాయి.
స్కూలు ప్రిన్సిపాల్ గది వైపు ఊరేగింపుగా పిల్లలందరూ తీసుకుపోతుంటే వెళ్ళాడు వివేక్, చెమటను తుడుచుకుంటూ. లోపల రాజు సారు కాక మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఈ పిల్లల గోలకు తల ఎత్తిన రాజు సార్ వివేక్ ను చూసి “హల్లో! రండి. ఎప్పుడు బయలుదేరారు? మీతోపాటు మరొకరు కూడా ఉండాలిగా వారేరి?” అంటూ ఆహ్వానిస్తూనే ప్రశ్నలు సంధించాడు.
పిల్లల వైపు తిరిగి “పెట్టె అక్కడ పెట్టి మీరు పొండి. లంచ్‌ చెయ్యండి!” అని ఇటు తిరిగి
“సార్ కాస్త మంచినీళ్ళు ఇవ్వండి ముందు” అన్నాడు వివేక్ చెమట తుడుచుకుంటూ.
ఫ్యాను క్రింద కూర్చొని చుట్టు పరికించాడు. ప్రక్కన ఉన్న ఇద్దరికీ షేక్‌హ్యాండు ఇచ్చి “నా పేరు వివేక్. హైద్రాబాదు నుంచి వస్తున్నా” అన్నాడు.
వాళ్ళలో ఒకరు షేకెండ్‌ ఇచ్చి “రాజు సారు చెబుతుండే మీరు, మరో సార్ వస్తారని. నేను సాగర్” అన్నాడొకతను.
మరొకతను “నేను మధు. మ్యాథ్ చెబుతాను” అన్నాడు.
రాజు సార్ నీళ్ళతో వచ్చాడు.
వివేక్‌ మంచి నీళ్ళు తాగి “నేనొక్కడ్నే వచ్చాను సార్. మరొకతను జాయిన్ అవలేదు. మీకు తెలియదా?” అన్నాడు.
“తెలియదు వివేక్. నేను మీ అందరి ఇంటర్యూ అయ్యాక బుక్సు తీసుకొని బండిలో వచ్చేశా. ఇద్దరుంటరు ఒకరికొకరు అనుకున్నా. లేకుంటే నీ కోసము వెయిట్ చేసేవాడిని” అన్నాడు.
“లేదు సారు. ఆయన టూ యియర్స్ బాండ్ అంటే వెళ్ళిపోయాడు. నాకేమీ కష్టం కాలే కానీ గంట నడక కొంచం…” అంటూ నసిగాడు.
నవ్వారు వాళ్ళు. “మాములుగా మనవాళ్ళు వస్తున్నారంటే మేము బండి పంపుతాము. మీరు వస్తున్నట్లుగా చెప్పటానికి కుదిరి ఉండదు ప్రసాదరావు సార్‌కి. పైపెచ్చు ఇక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు. మొబైల్ సరిగ్గా పని చెయ్యదు” చెప్పాడు రాజు సారు.
“మీరు లంచ్‌ చేస్తారా? లేకుంటే ముందు స్నానం చేసి వస్తారా?” అడిగాడు రాజుసారు.
“ముఖము కడుక్కొని వస్తా సార్” చెప్పాడు వివేక్.
“సరే. మధు నీవు వివేక్ సారుకు ఆయన క్వార్టరు చూపించు. మీ ఇద్దరూ లంచ్‌కు రండి. మనము అక్కడ కలుద్దాం” చెప్పాడు రాజు సారు.
“వివేక్ పద మనము టీచర్స్ క్వార్టర్సుకు పోదాము. నీ కోసము రెడీ చేశారు” అంటూ తీసుకుపోయాడు మధు సారు.
స్కూలు బిల్లింగ్ ప్రక్కనే ఉన్న మరో రెండస్తుల భవనము పై అంతస్థుకు దారి తీశాడు.
“క్రింద పిల్లల వసతిగృహము, డైనింగు హాలు, కిచెను, యోగా హాలు. పైన టీచర్లు క్వార్టర్సు. మనము మొత్తం ముపై మంది టీచర్లు ఉన్నాము మీతో కలుపుకుని” అన్నాడు మధు.
“ఇంత మంది ఉన్నా ఇంకా అవసరముందా ఇక్కడ” ఆశ్చర్యముతో అడిగాడు వివేక్.
“సారు మన స్కూలు స్టూడెంట్సు ఎంత మంది అనుకున్నావు?” అడిగాడు మధు.
తెలీదన్నట్లుగా ముఖం పెట్టాడు వివేక్.
చిన్నగా నవ్వుతూ “వెయ్యి పైన రెండు వందలు” అన్నాడు మధు, ఆశ్చర్యపోయాడు వివేక్. ఆ అడవిలో అంత లోపల సరిగ్గా రోడ్డు కూడా లేని చోట ఇంత పెద్ద భవంతి, ఇంత మంది పిల్లలు చదవటము వింతగా తోచింది.
“వీరంతా గిరిజన బాలబాలికలే కదా” అడిగాడు మధుసారుని.
“అవును సార్. నీవు ప్రెష్ అయి రా. లంచుకు వెడదాము” చెప్పాడు మధు ఒక తాళము తీసి లోపలికి తీసుకుపోతూ “ఇది నీ పోర్షన్. నీతో పాటు మరో టీచర్‌ వస్తారని ఇద్దరికీ కలిపి ఇది రెడీ చేశాము. నీవొక్కడివే వాడుకోవచ్చు“ అన్నాడు మధు.
అదో రెండు గదుల చిన్న హౌసింగులా ఉంది.
ఒక వైపు ఒక బల్ల, మరో వైపు మరో బల్ల వేసి ఉన్నాయి. ప్యాను, లైటు. లోపలికి వెడితే చిన్న కిచెను, బాత్రూము ఉన్నాయి.
“నీవు టీ గిట్ల చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు.” చెప్పాడు మధు సారు.
పెట్టె బల్ల మీద పెట్టి, తువాల తీసుకొని బాత్రూములోకి పోయాడు వివేక్. మధు బయటకెళ్ళాడు.

***

అదో ఒపెన్‌ కారీడార్. వరుసగా గదులు. మధ్యలో మెట్లు పైకి, క్రిందకు వెళ్ళటానికి. మెట్ల అటు వైపు లేడి టీచర్ల క్వాటర్స్ ఉన్నాయి. చాలా పెద్ద బిల్డింగు అది. పైన ఖాళీ స్థలములా ఉంచారు. అక్కడ బట్టలవి ఆరేసుకుంటారు టీచర్లు.
సాయంత్రాలు అక్కడ చేరి కబుర్లు గట్రా కూడా సాగుతూ ఉంటాయి. సిగ్నల్ బాగా వస్తుందని అక్కడకు చేరుతారు ఫోను చెయ్యాలనుకునే వారు.
ఫ్రెష్ అయి వివేక్ బయటకు వచ్చేదాక ఆ కారిడార్‌లో మధు వెయిట్ చేశాడు. ఇద్దరూ కలసి ఆ క్రిందనే ఉన్న డైనింగు హాలుకు వెళ్ళారు. అదో పెద్ద హాలు. పిల్లలు బారుగా కూర్చొని తింటున్నారు. దానికి ప్రక్కనే మరో హాలు ఉంది. అది డైనింగు కమ్ టీచర్ల మీటింగు హాలు. అందులోకి తీసుకు వెళ్ళాడు మధు. అక్కడ మిగిలిన టీచర్లు అంతా కలిసి తింటున్నారు. మధు వివేక్ కూడా జాయిన్ అయ్యారు. తిన్న తరువాత రాజు సార్ వచ్చి “మధు నీవు వివేక్ కు స్కూలు చూపించు. నాకు ఇప్పుడో క్లాసు ఉంది. స్కూలు చూశాక నీవు రెస్టు తీసుకో వివేక్. సాయంత్రము టీచర్లను పరిచయము చేస్తాను. రేపట్నించి తీసుకోవలసిన తరగతులను గురించి అప్పుడు మాట్లాడుకుందాము” అని వెళ్ళిపోయాడు.
మధు, వివేక్ కలసి ఆ రెండు భవంతులు తిరిగారు. స్కూల్లో మొదటి తరగతి నుంచి పది వరకూ ఉన్నాయి. ప్రతి క్లాసు రెండేసి మూడేసి సెక్షన్లు. దానితో పాటు సైన్సు లాబ్, కంప్యూటరు ల్యాబ్‌, లైబ్రరీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవటానికి గేమ్ రూము, వివిధ గేములు ఆడటానికి సరిపడా ఆట వస్తువులు. స్కూలు పెంచాలని మరిన్ని తరగతులు పెంచాలన్న ఆలోచన కూడా ఉందని చెప్పాడు మధు. వివేక్ ఆ బడిలో తిరుగుతూ, అక్కడి ప్రతి దానిని పరిక్షిస్తూ ఆశ్చర్యములో గడిపాడు. ఆ స్కూలు పెద్ద కాన్మెంట్లలో ఉన్నంత పకడ్బందీగా ఉంది. విశాలమైన ఆవరణతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు పరిశుభ్రమైన పరిసరాలు, ఆహారము. పిల్లలకు చదువుకోవటానికి చక్కటి ప్రదేశమది.
క్రింద మంచి నీటికి అక్కడ ప్లాంటు ఉంది.
ఉదయము యోగా, టిఫెను, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, పుస్తకాలు, వసతీ అన్నీ ఆ పిల్లలకు ఉచితము. చాలా మటుకు పిల్లలు పేదవారు. కొందరు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వస్తారు. అలా వచ్చే వారిని తెచ్చేందుకు స్కూలు వారికో బస్సు ఉంది. సరుకులు తేవటానికి ఒక జీపు ఉన్నాయి. అమ్మాయిలకు, అబ్బాయిలకు హస్టలు, హాస్టల్ వార్డెను ఉన్నారు. వంటవారు ఇద్దరు, హెల్పర్లు ఇద్దరు.
టీచర్లు ముప్పై మంది. విద్యార్థులతో గలగలమంటూ ఆ ప్రాంగణము హోరెత్తుతోంది.
ఈ వివరాలను వివరిస్తూ మధు చూపెడుతుంటే వివేక్ కన్నులు విప్పుకు చూస్తూ ఆశ్చర్యములో మునిగిపోయాడు. హైద్రాబాదులో ఏ గొప్ప కాన్మెంటుకూ తక్కువ కాని వసతులు ఉన్నాయి. ఇవి అన్నీ వీరికి ఉచితము. వివేక్ అలా ఆలోచనలలో ఉండగా మధు సార్ క్లాసు ఉందని వెళ్ళిపోయాడు. వివేక్ రెస్టు తీసుకోవటానికి తన గదికి చేరాడు.
అతను పడుకోగానే నిద్ర పట్టింది.
సాయంత్రము స్కూలు అయ్యాక అటెండరు వచ్చి లేపితే గాని లేవలేదు. లేచి మీటింగుకు వెళ్ళాడు.
అది మధ్యాహ్నం భోజనము చేసిన హాలే.
“ఈయన వివేక్ సారు. తెలుగులో ఎమ్‌ఏ చేసి, తెలుగు పండిట్‌ ట్రైనింగు కూడా చేశాడు. మన గురుకుల పాఠశాలలో కొత్త సభ్యుడు. ఈయన కూడా మనతో పాటే ఉంటాడు. పిల్లలకు చదువుచెప్పి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటములో కృషి చేస్తాడు” అని చెప్పి రాజుసార్‌ మిగిలిన వారిని తనను తాము పరిచయము చేసుకోమని కోరాడు.
ప్రతి ఒక్కరు లేచి తన పేరు తను బోధిస్తున్న సబ్జెక్టు చెప్పి స్వాగతం పలికారు. ఇవ్వన్నీ సాగుతుండగా అందరికీ టీ ఇచ్చారు హెల్పర్లు.
తరువాత వివేక్ తీసుకోవలసిన క్లాసుల గురించి, చెప్పవలసిన సిలబస్ గురించి వివరించాడు మధు సార్.
వివేక్ కు ఐదు క్లాసులు ఇవ్వబడినాయి. ఒక తొమ్మిదవ సెక్షను క్లాసు టీచరుగా నియమించబడ్డాడు. అతనికి తెలుగు, సోషల్ ఇవ్వబడింది. ఆ తరగతుల పుస్తకాలు ఆ రోజు చూడమని చెప్పి ఇచ్చాడు సాగరుసార్.
అందరూ చాలా స్నేహంగా అతనిని స్వాగతించారు. మంచి మిత్రులైనారంతా.
అలా వివేక్‌కు ఆ పాఠశాలలో ఆ రోజు అడవిలో ఉన్నామన్న ఆలోచన లేకుండా గడిచింది. వచ్చేటప్పుడు మనస్సులో కలిగిన ఆలోచనలు, ఆందోళనలూ దూదిపింజాల్లా మాయమయ్యాయి. ఆ విశాలమైన స్కూలు, పిల్లలు, ఆహారము, టీచర్లు వారి స్నేహపూర్వకమైన ప్రవర్తన చాలా హాయిగా అనిపించింది.
ఆ రోజు సాయంత్రము మేడ మీదకు వెళ్ళి ఫోను సిగ్నల్ ట్రై చేశాడు. ఫోను ఎప్పటికో కలిసింది. తల్లికి క్షేమముగా చేరానని, అంతా బావుందని చెప్పి, మిత్రుడు వీరాకు కూడా ఫోనులో తను చేరిన విషయము అక్కడి స్కూలు, వాతావరణము చెప్పాడు. వీర్‌నాయక్ కూడా ఊరట పొందాడు. ‘బలవంతముగా మిత్రుని పంపి తప్పు చేశానా’ అన్న గిల్టు ఉన్నది అతని మనస్సులో, అది పోయింది.
అలా టీచరుగా వివేక్‌ జీవితములో మరో ప్రస్థానము మొదలైయింది. అది ఎంత మలుపో అతనికి ఆ క్షణంలో తెలియదు.
ఇంకా వుంది…

4 thoughts on “మోదుగ పూలు – 3

  1. ఆహ్లాదకరమైన వాతావరణం, సిటీలో ప్రైవేట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.
    చాలా బాగుంది

  2. ప్రశాంతమైన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. చాలా బాగుంది కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *