June 14, 2024

సర్దాలి….సర్దుకోవాలి…

రచన: జ్యోతివలబోజు

ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు ఇస్త్రీ చేసే బట్టలు అల కుప్పలా వేసారేంటి? సర్దుకుంటే కాదా…
క్లాసు బుక్స్, హోంవర్క్ బుక్స్, అసైన్మెంట్ బుక్స్, రికార్డ్ బుక్స్, పెన్నులు, స్కెచ్ పెన్నులు అన్ని అల చెత్తకుండీల పెట్టుకుంటారేంటి బీరువా.. సర్దుకుంటే కాదా…
బెడ్‌రూమ్‌లో టేబుల్ అవసరమా, అసలే రూం చిన్నగా ఉంది..ఇదొకటి అడ్డంగా ఉంది తీసేయమంటే వినరు. వాడని కుర్చీలు, పాత సామాను ఎవరికైనా ఇచ్చేసి కాస్త ఇల్లు నీటుగా సర్దుకుంటే కాదా…
ఇది ఇల్లా .. రైతుబజారా.. ఏదీ పెట్టినవి పెట్టినచోట ఉండవు. ఎవరి సామాను వాళ్లు సరిగ్గా పెట్టుకుంటే నీటుగా ఉంటుంది. ఎవరి వస్తువులు వాళ్లకి ఈజీగా దొరుకుతాయి. ఒక్కరికి కూడా సర్దుకునే తెలివి లేదు.
ఏంటో ఈ కరోనా?… ఏంటో ఈ లాక్‌డౌన్… ఎక్కడికీ వెళ్లేట్టు లేదు. ఎవరిని పిలిచేట్టు లేదు. ఒక పార్టీ లేదు. ఒక ఫంక్షన్ లేదు.. ఈ చీరలన్ని మడతలు నలక్కుండా అలా కదలకుండా బీరువాలో మూలుగుతున్నాయి. ఈ జీవితమంతా (కరోనా కాలమంతా) నైటీలతోనే గడిచిపోయేట్టు ఉంది. ఐనా కూడా బట్టల బీరువా సర్దుకోవాలి తప్పదు.
బంధాలు, అనుబంధాలు, ఆరోపణలు, తంపులాటలు, ఆస్తి కావాలని ఒకరు, బంగారం కావాలని ఒకరు, అనుబంధాలు కావాలని కొందరు. సర్దుకోవాలి వీళ్లని కూడా.

సర్దుకోవాలి.. సర్దుకోవాలి.. అవసరమైనవి మాత్రమే ఉంచుకుని, పనికిరానివి, అంత అవసరం లేనివి దూరం చేసుకోవాలి. అవతల పారేయాలి. అప్పుడే మనశ్శాంతి… ప్రశాంతి..శాంతి…

………………………………………………………………………..

రమా… ఇది ఇల్లా? చేపల మార్కెట్టా?..(ఈయనెప్పుడెల్లాడబ్బా..) ఇల్లు శుభ్రంగా ఉంచాలని తెలీదూ. ఎప్పుడు చూసినా ఆ టీవీ సీరియళ్లు, లేకుంటే ఫోనులో ముచ్చట్లు.. పనిమనిషి ఉంది. నెలకు రెండు వేలు జీతం ఇస్తున్నాం. దానితో అన్నా శుభ్రం చేయించవచ్చుగా. అది కూడా చేతకాదా? ఆ మంచం కింద దుమ్ము చూడు. సోఫాల మీద కవర్లు చూదు ఎంత మాసిపోయాయో. ఆఫీసులో కష్టపడి సాయంత్రం ఇంటికొస్తే నీటుగా ఉంటే హాయిగా ఉంటుందనుకోవడం నా పొరపాటు. అయినా నువ్వు పొద్దంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్. కనీసం ఇల్లన్నా నీటుగా పెట్టుకోవచ్చుగా.. నా బట్టలు వాషింగ్ మెషీన్లోనే ఉతుకుతున్నావు.. ఇస్త్రీ చేసి హాంగర్లకు వేసి పెట్టొచ్చుగా.. నేను ఇస్త్రీ షర్టు లేదని అరిచేదాకా నీకు తెలివి రాదు. అప్పుడు వాటిని ఇస్త్రీకి పంపిస్తావు. నీ చీరల మీద ఉన్న శ్రద్ధ నా బట్టల మీద ఉండదు. వంట చేసి పెట్టడమే గొప్ప అనుకుంటావ్. ఇల్లు కూడా అందంగా సర్దుకోవాలి. పెద్దలనలేదా ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారని. ఎవరైన చుట్టాలు వస్తున్నారంటేనే ఇల్లంతా నీటుగా సర్దుతావ్. రోజూ అలా ఉంచడానికేమైంది.. ఆ రాజేష్ వాళ్ల ఇల్లు చూడు. ఎంత అందంగా, నీటుగా ఉంటుందో. నువ్వూ ఉన్నావు ఎందుకు?

రేయ్ శిరీష్.. రమణి… ఏం చేస్తున్నారు.. ఆదివారం ఇంట్లో ఉన్నా ఆ ఫోనులు పట్టుకుని కూర్చుంటారు. మీ బీరువాలు, బట్టలు, పుస్తకాలు సర్దుకోవచ్చుగా..రోజూ బట్టలు, పుస్తకాలు, చెప్పులు పెన్నులు ఇష్టమొచ్చినట్టు రూమంతా పరిచేస్తారు. మీరు కాలేజీలకు వెళ్లగానే రూం అంతా సర్ది ఎవరి సామాను వాళ్లకు విడిగా పెడతాను. అయినా నిదానంగా తీయకుండా ఒక్క షర్టు కోసం మొత్తం లాగేస్తారు. మళ్లీ లోపల కుక్కేస్తారు. గాడిదల్లాగా పెరిగారు ఎందుకు. ఇంకెప్పుదు తెలివొస్తుంది. మీ వస్తువులు మీరు సర్దుకోవడానికి ఏం రోగం..అంతంత ఖరీదు పెట్టి బట్టలు కొంటారు. వాటిని అలాగేనా పెట్టుకునేది. ఇస్త్రీ చేసి నీటుగా మడతపెట్టి ఉంచుకోవచ్చుగా.. చిన్నపిల్లలా తెలీదనుకోవదానికి. రోజూ చెప్పడానికి. మీ పనులు మీరు చేసుకోడానికేమైంది. నేనేమన్నా మీ పనిమనిషినా? ఇరవై నాలుగు గంటలు మీ వెనకాల తిరుగుతూ సర్దిపెట్టడానికి. మళ్లీ మీ బట్టలు కుప్పలా కుక్కేసారంటే అన్నీ మూట కట్టి మేడ మీద రూములో పెట్టేస్తా. జాగ్రత్త.

పెళ్లికి అమ్మ, అత్టగారు పెట్టిన చీరలు ఎంత బావున్నాయో. ఇప్పుడు ఈ క్వాలిటీ అస్సలు రావట్లేదు. అప్పటి ఫుల్‌వాయిల్, నైలెక్స్ చీరలు రోజూ కట్టుకోవడానికి ఎంత బావుండేవో. ప్లెయిన్ జార్జెట్ చీరలుంటే కొద్ది రోజులు మాచింగ్ ప్రింటెడ్ బ్లౌజుతో కట్టేసి మోజు తీరాక, ఆ చీరకి ప్రింటెడ్ బార్దరు వేయడమో, చేత్తో గొలుసుకుట్టు, కాడకుట్టుతో డిజైన్లు కుట్టుకోవడమో, అద్దాలు కుట్టడమో చేసేవాళ్లం. ఇపుడు ఆ అవకాశం లేనే లేదు. అన్నీ దొరుకుతున్నాయి. వేలకు వేల డిజైన్లు, ఎన్నో రంగులు, వెరయిటీల చీరలు వస్తున్నాయి. ఇరవై వేల ఇక్కత్‌ చీరలో వచ్చిన డిజైన్ ఫేమస్ అయితే అది రెండొందల చీరలో కూడా వేస్తున్నారు. ఎన్ని రకాల పట్టులో.. కొత్త ఫాషన్, కొత్త డిజైన్ చీర కొన్న నెలలోపే ఇంకో కొత్త ఫాషన్ వచ్చేస్తుంది. ఎన్ని చీరలున్నా ఇంకా చాలా లేవు అనిపిస్తోంది. ఈ కరోనా మూలంగా ఎక్కడికి వెళ్లటం లేదు. ఇంటికెవరూ రావట్లేదు. మూసిన తలుపులు మూసినట్టే ఉంటున్నాయి. ఇక జీవితమంత నైటీలతోనే గడిచిపోతుందేమో. ఇపుడు చీర కట్టాలంటే విసుగ్గా, బరువుగా కూడా అనిపిస్తోంది. రెండు బీరువాల్లో నిండిపోయాయి. సర్దుకోవాలి. అయినా సర్ది ఏం చేయాలి. కొన్ని పాతవి, ఎక్కువ కట్టనివి ఇచ్చేస్తే కాస్త ఖాళీ అవుతుందేమో. కొత్తవి కొంటే పెట్టుకోవచ్చు.. బీరువా సర్దాలి.. సర్దాలి. ఆయన ఆఫీసుకెళ్లాకనో, క్యాంపుకెళ్లాకనో ఈ పని పెట్టుకోవాలి…

అమ్మల్లారా… అయ్యల్లారా.. ఆ దేవుని పిల్లల్లారా.. ఈ మాయామోహాలు పనికిరాదు. ఈ జీవితమే ఒక మిథ్య. ఏదీ నీది కాదు ఎవరూ నీవారు కాదు. రిటైరయ్యి చాలా కాలమైంది. ఇక నీవు కూడా సర్దుకోవడం మొదలు పెట్టు. ఇప్పుడేమి సర్దుకోవాలి స్వామి. ఎక్కడికి వెళ్లాలి అంటావా… ఈ జీవాత్మని విడిచి పరమాత్మని చేరే చివరి ప్రయాణం చేయాలి నాయనా.. దానికి ముందు ఇంతకాలం చేయాలనుకుని చేయలేనివి చేయడం, ఇవ్వాలనుకున్నవి ఇవ్వలేనివి ఇవ్వడం. తప్పులను దిద్దుకుని, అనుబంధాలని గుర్తు చేసుకుని.. ఇలాంటి విషయాలన్నీ సర్దుకొని తయారుగా ఉండు పిలుపు కోసం.

ఏహె… ఏంటో ఈ సర్దుడు.. ఇంటా , బయటా, కంప్యూటర్లో కూడా సర్దుకోవాల్సి వస్తోంది. నాకున్న లెక్కలేనన్ని పనులకోసం నా కంప్యూటర్ దెస్క్‌టాప్ మీద ఎన్నో ఫోల్డర్స్ ఉంటాయి. నా కొడుకు చూసి గోల పెడతాడు. మమ్మీ సర్దుకో.. అన్ని ఇలా నింపేసుకుంటే నీ సిస్టం స్లో అవుతుంది. తీసి లోపల పడేయ్ అంటాడు. సర్దాలి సర్దాలి.. పూర్తయిన ఫోల్డర్స్ లోపల భద్రంగా పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టానో గుర్తు పెట్టుకోవాలి. వంటలు, పుస్తకాలు, ఫ్రెండ్స్, ఫామిలీ ఫోటోలు, పిల్లల, మనవళ్ల ఫోటోలు. ఇలా అన్నీ క్రమపద్ధతిలో సర్దుకోవాలి. అప్పుడే జీవితం సులువు అవుతుంది.. నిజమే అంటారా??

1 thought on “సర్దాలి….సర్దుకోవాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *