April 16, 2024

చంద్రోదయం – 20

రచన: మన్నెం శారద

“ఓహో!! ఆడవాళ్ల వయసడగకూడదనుకుంటాను” అన్నాడు కళ్లెగరేస్తూ.
“అబ్బే అందుకోసం కాదు. నా వయసు నా సర్వీస్ రిజిస్టర్ తీస్తే మీకే దొరుకుతుంది. ఇందులో దాచేదేమీ లేదు” అన్నాను.
మోహన్ మర్నాడు నవ్వుతూ “మీ వయసు ఇరవై నాలుగేళ్ళు” అన్నాడు.
నాకు ఆశ్చర్యం కల్గింది. అతను నేను తమాషాగా అన్నదే చేసి వచ్చేడు. నా సర్వీసు రిజిస్టరు వెరిఫై చేసేడు.
“ఇంతకీ మీ వయసెందుకడిగేనో తెలుసా?”
నా కళ్లు ఆందోళనతో రెపరెపలాడేయి.
“ఇన్నాళ్ల మన స్నేహంలో నేను కొన్ని విషయాలు ఎక్కువగా మాట్లాడినందువల్ల మీరు మరోవిధంగా భావించరనుకుంటాను” అన్నాడు సంశయంగా నా వంక చూస్తూ.
నేను అనుకోనన్నట్లు తల పంకించేను.
“పాతికేళ్ళలోపు ప్రాయంలోనే మీరు జీవితంలో అటూపోటూ చవి చూసేరు. కానీ ముందు మీకు, నానీకి ఎంతో భవిష్యత్తు వుంది. కాదనగలరా?” అతని ప్రశ్నకు నేనేం జవాబు చెప్పలేదు.
తిరిగి అతనే అన్నాడు. “జీవితం అపురూపమైన అరుదైన వరం మనిషికి. దాన్ని శాపాల పాలు చేసుకొన్నా, సుఖాల మయం చేసుకోవాలన్నా, అంతా మనిషి చేతిలోనే వుంది. విధివశాత్తు మీకో దెబ్బ తగిలింది. అంత మాత్రాన పడిపొయినచోటే పడి వుండమని ఎవరు చెప్పేరు? నాలాంటి ఆశావాది అలాంటి వాటిని అసలు ఒప్పుకోడు మేడం”
“ఇలా ఒంటరి బ్రతుకుని ఈడ్వటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది ఇప్పుడు మీకు తెలీదు. కానీ రాను రానూ ఈ ఒంటరితనాన్ని మీరు భరించలేరు. సహించలేరు. అందుకే మీరు నా మాటల్ని అపార్ధం చేసుకోకుండా మరో పెళ్లి చేసుకోండి” అన్నాడు.
అతనికేం సమాధానం చెప్పాలో నాకు అర్ధం కాలేదు.
నేను తల దించుకున్నాను. నా కళ్లనుంచి నీళ్లు జారిపడ్డాయి. అతను నొచ్చుకుంటున్నట్లు “మీరు బాధపడు తున్నారా? సారె, నేను మీ శ్రేయోభిలాషిగా మీమంచి కోరి చెప్పాను. అంతే. ఇందులో బలవంతం ఏమీ లేదు” అని అతను వెళ్లిపోయేడు.
చాలాసేపు నేను అలానే కూర్చుండిపోయేను.
“అమ్మా! ఆకలేస్తోంది!” అని నానీ నా చీర పట్టుకుని గుంజేవరకు నేను ఈ లోకంలోకి రాలేకపోయాను.
నానీకి అన్నం తినిపించి పడుకోబెట్టి నేను కూడా పక్కనే పడుకున్నాను.
నాకు ఆకలనిపించలేదు. నిద్ర అంతకంటే రాదు.
ఏదో దిగులు. బాధ. ఏడుపొస్తుంది.
అంత యింట్లో బిక్కుబిక్కుమంటూ మేమిద్దరమే.
వాడికి నేనూ, నాకు వాడూ.
మా కోసం ఎవరో వస్తారని ఆశలేదు.
ప్రతి యింట్లోనూ సాయంత్రమయ్యేసరికి భర్తలకోసం భార్యలు, తండ్రులకోసం పిల్లలూ ఎలా ఎందురు చూస్తారో నాకు తెలుసు. కొన్ని గంటల ఎడబాటుకే ఎంతో ఆత్రుతపడుతూ గడపలు పట్టుకొని ఎదురుతెన్నులు చూడడం చూస్తే గుండెల్లో ముల్లుతో గుచ్చినట్టు వుండేది. నా జీవితం గాఢాంధకారంలో ఆవరించుకొన్న ఓ గుడ్డి వెలుగులాంటిది.
మేము ఎవరికొసం ఎదురు చూడాలి?
నాకు ఎన్నో, ఎన్నెన్నో ఆలోచనలు.
ఈ మధ్య ఒంటరితనమే కాక శరీరాన్ని దహిస్తోన్న మరో బాధ. ఈ దేశంలో ఆడదానికిగా పుట్టిన నేను, నాకిలాంటి ఆవేదన వుందని ఎవరికి ఎలా చెప్పుకోగలను. చెప్పుకుంటే ఎవరు అర్ధం చేసుకుంటారు?
ఈ పవిత్ర భారతదేశంలో మగవాడికి సుఖాలు కొనుక్కునే అధికారం వుంది.
ఇంట్ళో భార్య వుండగానే ప్రక్కదారులు త్రొక్కే స్వేచ్చ వుంది. కానీ యౌవనంలో వున్న ఆడది దురదృష్టవశాత్తు భర్తని పోగొట్టుకున్నా, భర్తకి దూరమైనా అలానే కోరికల్ని అణచుకొని జీవచ్చవంలా బ్రతకాలి. అది రూలు.
అలా బ్రతుకుతున్నా ఎన్నో అక్కరలేని ఆరాలు.
అవసరం లేని నిషేధాలు. గుసగుసలు. చీ. నాలాంటి అభాగిని వేసే ప్రతి అడుగుకీ శల్యపరీక్షలు. నాకు నవ్వొస్తుంది. బాధగా వుంటుంది. రగిలిపోతుంది.
వయసుడిగినా, ప్రతి రాత్రీ అనుభవమైన సుఖాలే అయినా, సాయంత్రమయ్యేసరికి పూలుపెట్టి తెల్లచీరలు కట్టి, ఎదిగిన సంతానం ముందు సిగ్గు విడిచి ప్రత్యేకంగా ముస్తాబయి ముసలి భర్తలకోసం ఎదురుచూసే వృద్ధ సతులకి కూడా నా మీద ఆరా.
నవ్వురాదా మరి.
నేను వాళ్లలాంటి ఆడదాన్ని కాదా?
ఎంత జాగ్రత్తగా వున్నా ఏదో ఒక నింద.
ఎవరితో మాట్లాడినా తప్పు.
నాకు చెప్పలేని విసుగు కల్గింది.
“మోహన్ చెప్పినట్లు పెళ్లి చేసుకుంటే?” అనిపించింది.
నాకప్పుడు వెంటనే మీరు గుర్తొచ్చేరు.
కాని.. ఆ ప్రసక్తి గురించి మీరెప్పుడూ మాట్లాడలేదు. ఒక శ్రేయోభిలాషిగా, స్నేహితుని భార్యగా నా మేలు కోరి మీరు రాసే వుత్తరాలలో అంతకు మించి నాకేమీ కన్పించేది కాదు.
ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించిన సంగతి నాకు తెలుసు. కానీ మన మధ్య ప్రేమకథ నడవలేదు. ఇద్దరం ఒకరి పట్ల మరొకరం ఆకర్షితులయ్యేం. అది నిజమయినప్పటికీ కేవలం దానికోసం మీరు ఒక బిడ్డ తల్లయిన నన్ను స్వీకరించగల స్థితిలో వున్నారో, లేదో నాకెలా తెలుస్తుంది?
మీరు పెళ్లి చేసుకోకుండా అలా వుండిపోయింది కేవలం నా కోసమేనని ఎలా అనుకోగలను. మద్రాసు వెళ్లి చాలా రోజులయింది.
ఒంటరి బ్రతుకుని యీడ్వటం నా చేత కాదనిపించింది.
నిత్య సంఘర్షణలతో సతమతమైపోతున్న నన్ను మోహన్ మాటలు రెచ్చగొట్టేయి.
అతనెందుకిలాంటి సలహా యిచ్చేడు.
“నన్ను ఒకవేళ అతను ప్రేమిస్తున్నాడా?” అన్న అనుమానం కూడా కలిగింది.
కానీ ఎలా తెలుసుకోగలను? ఆడదాన్ని.
నేనొకప్పుడు మిమ్మల్ని ప్రేమించేను. కానీ ప్రేమలో నాకు అనుభవం లేదు.
మనిషి చేష్టలని బట్టి, మాట్లాడే తీరును బట్టి ఎదుటి వ్యక్తిలోని భావాలని పసిగట్టటానికి వీలుంటుంది.
అత్ను రోజూ వస్తున్నాడు. నాకోసం , నా జీవితం స్థిరపడాలన్న అభిలాషతో తహతహలాడుతున్నాడు.
నా పట్ల ఎంత అభిమానం, ప్రేమా లేకపోతే అతనలా పనిగట్టుకుని నా దగ్గరకొస్తున్నాడు?
ఖచ్చితంగా అతను నన్ను ప్రేమిస్తున్నాడు. కాని చెప్పడానికేదొ సంశయం అతన్ని పీడిస్తున్నదని నాకు అర్ధమయిపోయింది.
ఈ విధమైన ఆలోచనలతో రాత్రంతా గడిపేసేను. మర్నాడు అతనొచ్చేడు. అతని ముందుకు వెళ్లాలంటే ఏదో తడబాటు కలిగింది.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *