April 20, 2024

ధృతి పార్ట్ – 5

రచన: మణికుమారి గోవిందరాజుల

“స్వాతీ! మనం ఇద్దరమూ జీవితాంతం కలిసి సంతోషకరమైన జీవితం గడపాలని ప్రమాణాలు చేసుకుని పెళ్ళి చేసుకున్నాము. చిన్న చిన్న గొడవలూ, అపోహలూ ప్రతి ఇంటా మామూలే. . . సర్దుకుపోతూ ఉంటాము. కానీ పెద్దవాళ్ళను అవమానించడం అనేది కూడని పని. స్వాతీ. . . నువు మంచి భార్యవి. ఖచ్చితంగా మంచి తల్లివి కూడా అవుతావు. కాని మంచి కోడలిగా కూడా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది. మీ అమ్మా నాన్నలు కూడా ఆనందంగా ఉంటారు. నువు నాకు చాలా ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను నిలుపుకో” నిదానంగా చెప్తున్నట్లు ఉన్నా పదునుగా ఉన్న ఆ మాటలకు తల వంచుకుంది స్వాతి.
“ఇది నా కుటుంబం అని నువు మనస్పూర్తిగా అనుకుంటేనే నువ్వు అమ్మా వాళ్లతో మంచిగా ఉండగలుగుతావు. నన్నాల ఆక్సెప్ట్ చేసావో వారినీ అలానే చెయ్యి”
“తనను తాను కట్టడి చేసుకోవాలి” మనసులో అనుకున్నది. ఆ తర్వాత మిగతా విషయాల్లో ఎలా ఉన్నా అత్తింటి జోలికి వెళ్లలేదు స్వాతి. కాని ఏ మార్పైనా ఒక్కరోజులో రాదు. మారే దిశగా ఉన్న భార్యకు ఆ తర్వాత పదే పదే చెప్పలేదు శేఖర్. కొద్ది కొద్దిగా వారిని గౌరవంగా చూడటం అలవాటు చేసుకున్నది.
“స్వాతీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఒకరకమైన ప్రశాంతత కలుగుతున్నది. మనవాడి అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి మనింటి కోడలిగా వస్తుంది. ఈ రోజు ఫోన్ చేసాడా ఇంద్ర? డబ్బేమన్నా కావాలటనా?” చేతులు కడుక్కుంటూ అడిగిన భర్త ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చింది స్వాతి.
“ఆ… చేసాడు. ఇప్పుడేమీ అవసరం లేదట. అవసరమైనప్పుడు చెప్తానన్నాడు” తనూ చెయ్యి కడుక్కుంటూ చెప్పింది.
శేఖర్, స్వాతిలకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఇంద్రనీల్, అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేస్తున్నాడు. అమ్మాయి దాక్షాయని. ఇంటర్ చదువుతున్నది. దక్షా అని పిలుస్తారు.
ఇంద్రనీల్ కి తండ్రి నెమ్మదితనంతో పాటు వ్యాపారదక్షత రాగా, దాక్షాయనికి తల్లి అందంతో పాటు పొగరు కూడా వచ్చింది. పుట్టడమే బంగారు చెమ్చాతో పుట్టిందేమో ఆ గర్వం, అతిశయం ఆ అమ్మాయి మాటల్లో తొంగి చూస్తూ ఉంటుంది.
**********
“బామ్మా! ఎక్కడికి వెళదాము?” తెల్లవారి లేస్తూనే బామ్మ వెంట పడ్డారు ఆర్తి, కార్తి.
పిల్లలకు పెద్దవాళ్ళు ఇంటికొస్తే పండగే. అసలు కంటే వడ్డీ ముద్దులా మనవళ్ళను గారాబంగా చూసుకునే అమ్మమ్మా, బామ్మలంటే మరీ ఇష్టపడతారు. అందులో రంగనాయకమ్మతో వంటలొక్కటే కష్టం కానీ, ఆవిడ చిన్నపిల్లల్లో చిన్నది. పెద్దవాళ్ళల్లో పెద్ద. అత్తగారుంటే పూర్ణ హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే ఆవిడ పెట్టే ఆశలకు పడిపోయే పిల్లలు హోంవర్కులు ఇట్టే చేసేస్తారు. ఎక్కడికి తీసుకెళ్ళినా పిల్లల హోంవర్కులయ్యాకే. సినిమాలకు వెళ్ళడం ఎలానూ ఉన్నదే.
“సినిమాలు ఏమి ఆడుతున్నాయి? కొత్త సినిమాలేంటి?” పిల్లలను దగ్గరకు తీసుకుంటూ అడిగింది. ఇద్దరూ లిస్ట్ చదవడం మొదలు పెట్టారు.
“బామ్మా! ఏఎంబీ అని కొత్త మాల్ ఒకటి కట్టారు ఇప్పుడు. చాలా పెద్దది తెలుసా? మేమందరం కలిసి ఒకసారి వెళ్ళొచ్చాము. ఎంత బాగుంటుందో. మళ్ళీ వెళ్దామంటే కుదరలేదు. ఇప్పుడెళదాం బామ్మా!” గారాలు పోయారు పిల్లలు.
“అలాగే లెండర్రా! మొదలు బ్రేక్ ఫాస్ట్ కానివ్వండి. మీ కోసం మంచి రెసిపీ నేర్చుకుని వచ్చాను” ఎక్జౖటింగ్ గా చెప్పింది. పిల్లలిద్దరూ తెల్లమొహాలేసారు. వాళ్ల కళ్ళు భయంతో రెపరెపలాడాయి.
“బామ్మా! అక్కడ ఏఎంబీ మాల్ లో మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది. నీక్కూడా నచ్చుతుంది నీకు శ్రమ ఎందుకు చెప్పు?” అప్పుడే లోపలికి వచ్చిన ధృతి బామ్మ ఆలోచనలను తెలివిగా డైవర్ట్ చేసింది.
రంగనాయకమ్మకు హోటల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అన్ని రకాల రుచులనూ ఎంజాయ్ చేస్తుంది.
“అంతేనంటావా? అయితే వాకే… వెళ్ళి అమ్మ ఏమి చేస్తున్నదో చూడండి. నేను స్నానం చేసి రడీ అవుతాను” పిల్లలు ఉత్సాహంగా వెళ్ళిపోయారు ఎగురుకుంటూ.
“రావే… ధృతమ్మా! ఏంటి కాలేజీ సంగతులు? ఎలా ఉన్నాయి క్లాసులు?”
“పో బామ్మా! నీ మీద నాకు బాగా కోపం వచ్చింది. మా ఆనివర్సరీకి రావచ్చుకదా? ప్రోగ్రామ్స్ అన్నీ ఎంత బాగా జరిగాయో తెలుసా. ఒక్కరోజు కోసం రమ్మన్నా రాలేదు నువ్వు. నీకు శిక్షేంటో తెలుసా?” అల్లరిగా అడిగింది.
“నా అల్లరి బంగారం నాకు వేసే శిక్ష నాకు తెలుసులే” నవ్వింది. “మహా అయితే నన్ను మూవీకి తీసుకెళ్ళవు అంతేగా? నువు తీసుకెళ్లకపోతే ఆగుతుందేంటీ ఈ రంగనాయకమ్మ” పక పకా నవ్వింది. “నిన్ను కూడా లాక్కెళతాను”
“ఛీ! బామ్మా…పప్పులో కాలేసావు. ఆ సంగతి నాకు తెలీదా ఏంటి? అదేమి కాదుగా. . . నిన్నిక్కడినుండి వెళ్ళనివ్వము. అప్పుడు నిన్ను ‘రా బామ్మా ప్లీజ్’ అని బతిమాలే అవసరం ఉండదు” అంటున్న మనవరాలిని మురిపెంగా చూసుకుంది.
“నాకు తెలుసే నేనంటే మీకెంత ప్రేమో. తప్పక ఉంటాను. ఈ సారొచ్చినప్పుడు. . . కానీ ఇప్పుడు ఈ శివగాడి టెస్ట్ అవగానే వెళ్తాను”
“నువెలా వెళ్తావో… ఆ శివగాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏడీ ?వాడేడీ?” ఆవేశంగా అన్నట్లన్నా కళ్ళు నవ్వుతున్నాయి.
“అమ్మా! తల్లీ… ఆ శివగాడు ఇక్కడే ఏడ్సాడు, తల్లీ… అమ్మా! పెద్దమ్మగారో. . . ఇప్పుడే ప్రమాణం చేసి చెప్తున్నాను… ధృతమ్మ దగ్గరనుండి పర్మిషన్ లెటర్ తీస్కుని నాకు చూపించేంతవరకు నా జగన్నాధ రథచక్రాలు కదలవు గాక కదలవు… మీకు దండం పెడత… నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి” వంగి వంగి దండాలు పెట్టాడు లోపలికి వచ్చి వీరి మాటలు విన్న శివ.
ధృతి కంటే రెండేళ్ళే పెద్ద అయినా తినే ఆహారం, చేసే వ్యాయామాల వల్ల వయసుకు మించి కనపడతాడు ఆరడుగుల శివ. చామనఛాయలో ఉన్నా మొహంలో ఏదో తెలీని ఆత్మవిశ్వాసం తొంగి చూస్తూ ఉంటుంది. మాట్లాడే మాట చాలా స్పష్టంగా ఉండి, నేను అంతా కరెక్ట్‌గానే చేస్తున్నాను అని చెప్తున్నట్లుంటుంది. రంగనాయకమ్మతో వాడుండే తీరు చూస్తే సొంత కొడుకే అనుకుంటారు. ఆ ఇద్దరి బంధం అన్నిటికీ అతీతంగా ఉంటుంది. ధృతి అంటే వాడికి ప్రాణం. సొంత అన్న ఉన్నా కూడా అంత ప్రాణంగా ఉండరేమో. బామ్మ దగ్గరికి వెళ్ళినా, బామ్మ ఇక్కడికి వచ్చినా వాడు ఉండాల్సిందే. చిన్నప్పుడు “బాతో… బాతో” అని పిలిచేది. అంటే బామ్మ తోక అని…
మొదట్లో దినేష్ కారు మాట్లాడి తల్లిని పిలిపించుకునేవాడు. . శివ ఇంటర్ అవుతూనే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అప్పుడు కారు కొని వద్దంటున్నా తల్లికి గిఫ్ట్ గా ఇచ్చాడు దినేష్. శివ ఆ కారుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. శివ వాడి తల్లీ ఉన్నారన్న ధైర్యంతోనే, పల్లెటూర్లో ఉన్న తల్లి గురించి నిశ్చింతగా ఉన్నాడు దినేష్.
“చాల్లే కానీ… నీ టెస్ట్ ఎన్నింటికి? చెప్తే నిన్నక్కడ దింపి కారు నేను తీసుకుంటాను. బామ్మని తీసుకుని మేము ఏఎంబీ కి ప్లాన్ చేస్కుంటున్నాము” చెప్పింది ధృతి.
“ఎట్టెట్టా…? నేను లేకుండా అక్కడికి వెళ్దామనే? అదేమీ కుదరదు. అమ్మా! ఈ రోజు పొద్దున్న మీరంతా ఏదన్నా షాపింగ్ చేసుకోండి. లంచ్ ఎక్కడన్న చేసుకోండి. డిన్నర్కి అందరమూ ఏఎంబీ కి ఫిక్స్డ్. నా పరీక్ష అవగానే వచ్చేస్తాను. అప్పుడు అందరం కలిసి వెళదాము” ఖచ్చితంగా చెప్పాడు.
“బామ్మా! మనం చేసేదేమీ లేదు. ఆర్డర్ వచ్చేసింది. ఏమి చేస్తాము? మళ్లీ ఆలోచిద్దాము ఎక్కడికి వెళ్ళాలో. మొదలు ఆకలేస్తోంది. అమ్మ సూపర్ టిఫిన్ చేసింది. నీ కిష్టమని పాయసం కూదా చేసింది. వెళ్దాం రా”
“ఏమి టిఫినేంటి… అంత సూపర్‌గా?” ఆరాగా అడిగింది రంగనాయకమ్మ.
“అంత సూపరేమీ కాదులే బామ్మా… ఇడ్లీ సాంబార్ విత్ పల్లీ చట్నీ” యాక్ అన్నట్లు మొహం పెట్టారు”బట్ యమ్మీ పాయసం” నోట్లో నాలుకని తిప్పుతూ అన్నారు అప్పుడే వాళ్లను పిలవడానికి అక్కడికి వచ్చిన ఆర్తీ కార్తీ.
“అరే! ఇడ్లీ చట్నీనా? నా ఫావరేట్… ఇంక పాయసం చెప్పక్కర్లే… యమ్మీ ఫుడ్. రండి. . . రండి… ఎంత హాయైన ఫుడ్డో తెలుసా? ఎంత బలమో…!” మనవలను హుషారు పరుస్తూ వాళ్లను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది.
**********
“అమ్మా!” పిలుస్తూ లోపలికి వచ్చిన విశ్వ తల్లి హడావుడిగా వంట ఇంట్లో ఉండడం చూసి “ఏంటమ్మా ఈ రోజు స్పెషల్? ఇల్లంతా ఘుమ ఘుమ లాడిపోతున్నది?” సువాసనలను ఆస్వాదిస్తూ అడిగాడు.
“వచ్చావా? కాళ్ళు కడుక్కుని రా… పకోడిలు తిందువు కాని… హడావుడేంటంటే… ఇందాకే తెలిసిందట శశికి జాబ్ వచ్చిందని. ఆ జాయ్ ని షేర్ చేసుకోవడానికి అత్తా బామ్మా వాళ్ళంతా లంచ్ కి వస్తున్నారు. మొత్తానికి వాడు అనుకున్నది సాధించాడ్రా” లోపలికి వచ్చిన కొడుకుతో సంతోషంగా చెప్పింది వసంత. .
“వావ్! గ్రేట్… ఓకే ఇప్పుడే వస్తాను ఫ్రెష్ అయ్యి. నువు కానివ్వు. అవునూ నాన్నేరి?” అడుగుతూ హాల్లోకి వచ్చేసరికి రాజారావు కూడావచ్చేసాడు. వీళ్ళు మాట్లాడుకుంటూండగానే రానే వచ్చారు అందరూ.
లోపలికి వస్తున్న శశికాంత్ ని హగ్ చేసుకున్నాడు విశ్వ. “హార్టీ కంగ్రాచ్యులేషన్స్” అంటూ. రాజారావు సాదరంగా ఆహ్వానించాడు బావగారినీ , చెల్లెల్నీ.
రాశి మొహం వెలిగిపోతున్నది కొడుకు శశికాంత్ కి ప్లేస్మెంట్ ద్వారా ఇన్ఫోసిస్‌లో జాబ్ వచ్చిందని. మనవడు ఉద్యోగస్తుడయ్యాడని వెంకట్రావు దంపతులు కూడా ఆనందంగా ఉన్నారు. .
రాజారావు కూతురు వినీల, రాశి కూతురు నీలాంబరి ఒకే వయసు వాళ్ళు. ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ముందే పెళ్ళైనా రాశికి ఆలస్యంగా పుట్టడంతో శశికాంత్, విశ్వ ఒకే వయసు వాళ్ళయ్యారు. శశికాంత్ పేమెంట్ సీట్ తీసుకుని పేరున్న కాలేజీలో జాయిన్ కాగా, విశ్వ ప్లేస్మెంట్స్ ఉండవని తెలిసీ, కొత్త కాలేజీని ఎంచుకున్నాడు.
“చెప్తే వినలేదు అప్పుడు. నువు కూడా వాడితో పాటు చేరినట్లైతే నువు కూడా ఉద్యోగస్తుడవయ్యేవాడివి” నిష్టూరంగా అన్నది రాశి విశ్వతో. మేనల్లుడు ఎంత తెలివైనవాడో తెలిసినా కొడుక్కి జాబ్ వచ్చిన సంతోషం అలా అడిగించింది అంతే. కావాలని అనదం కాదు. అత్త ప్రేమ తెలుసు కనక నవ్వి ఊరుకున్నాడు విశ్వ.
అప్పుడే పకోడీల ప్లేట్ తో అక్కడికి వచ్చింది వసంత. “అబ్బ! అత్తా… నువు చేసిన పకోడీలు తింటే స్వర్గానికి బెత్తెడు దూరానికి వెళ్ళిపోతాం” పకోడీ నోట్లో వేసుకుంటూ తన్మయంగా అన్నాడు శశి.
“విన్నీ! అన్నను పట్టి లాగుదాము రా!!రా!” నవ్వుతూ అన్నది నీల.
“చాల్లే ఊర్కో అన్నను ఆటపట్టించటం… నీకు ఇష్టమనే చేసానురా… ఎంజాయ్. కానీ లంచ్ కి కాస్త ప్లేస్ ఉంచుకో”
“ఇవి స్తార్టర్సే కదా? అన్నానికి ఖాళీ ఉంటుందిలే” అందరూ నవ్వేసారు శశి మాటలకు.
కాసేపు అందరూ పోస్టింగ్ అదీ ఎక్కడిస్తారూ ఏంటీ అని మాట్లాడుకున్నారు…
“పోస్టింగ్ ఎక్కడో ఇప్పుడే చెప్పరు మామయ్యా… మొదలు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అదయ్యాక పోస్టింగ్ ఇస్తారు. రెండేళ్ళు జాబ్ చేసి హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో చదవాలనేది నా కల మామయ్య. తప్పక సాధిస్తాను” ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్నది శశి మాటల్లో.
“చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్ రా. నువ్వనుకున్న గోల్ తప్పక సాధిస్తావు. మాకు తెలుసు” అందరూ ఇవే మాటలన్నారు. రాశికి ఆమె భర్త వివేక్ కి చాలా గర్వంగా అనిపించింది. పిల్లల అభివృద్ధిని ఇంకోళ్ళు పొగుడుతుంటే వచ్చే ఆనందమే వేరు.
“బావా! పార్టీ ఇవ్వాల్సిందే… మా అమ్మ వంట తినడం కాదు” అన్నది వినీల.
“నీకేమి తెలుసే? అత్త చేతి వంట ఆ ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా రాదు”
“పొగిడింది చాల్లే కాని అందరూ అన్నాలకు లేవండి. పార్టీ సంగతి తర్వాత ఆలోచించుకుందాము” అందర్నీ అన్నాలకు లేపింది వసంత. పిల్లలంతా వెళ్ళి గబ గబా టేబుల్ సర్దారు. ఎగస్ట్రా కుర్చీలేసారు. పెద్దవాళ్ళంతా టేబుల్ దగ్గర కూర్చుంటే, పిల్లలు విడి కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు.
“పార్టీ ఇవ్వనంటావ్… వీడివ్వడు కానీ మనమే ఇద్దాము విన్నీ…అత్తా రాత్రికి వాడికేదన్న ఇష్టమైనది చేస్తానన్నావో ఇక మేము పార్టీ ఇస్తామన్నా రాను కూడా రాడు ” అన్నది నీలాంబరి. నీలా అని పిలుస్తారంతా. అందరూ పక పకా నవ్వారు. ఆనందం మనసుని ఆవరించుకుని ఉన్నప్పుడు, ఏ మాటలకైనా మనసు హాయిగా స్పందిస్తుంది.
“ఏడవకండే… ఇస్తానులే పార్టీ. అన్నట్లు అందరం కలిసి ఏఎంబీకెళ్తే ఎలా ఉంటుంది? కొత్త మాల్. హాయిగా ఉంటుంది. మీకేమి కావాలంటే అవి శాంక్షన్. నా కార్డ్ ఇచ్చేస్తా” వరమిచ్చినట్లుగా పోజ్ పెట్టి అన్నాడు శశి.
“మా నాయనే… అది మామయ్య కార్డ్ అని ధైర్యంగా ఇస్తానంటున్నావా?” వెక్కిరించింది వినీల.
“తల్లీ… జాబ్ లో జాయిన్ అయ్యాక మొదటి జీతం మీ ఇద్దరికే… ఇంతమంది సాక్షం ఉన్నారు సరేనా?” చేతులెత్తి దండం పెట్టాడు శశి.
“డన్” థమ్స్ అప్ చూపించారిద్దరు ఆడపిల్లలు. కలివిడిగా ఉన్న పిల్లలను చూసి ఆనందంగా నవ్వుకున్నారు పెద్దలు.
“ఏమి విశ్వా! నువ్వేమీ మాట్లాడటం లేదు… “మౌనంగా కూర్చున్న విశ్వను పలకరించాడు వివేక్.
“మీ గురించే ఆలోచిస్తున్నా మామయ్యా” వెంటనే జవాబిచ్చాడు విశ్వ.
“మా గురించా?” అర్థం కాక అడిగాడు వివేక్.
“ఇప్పుడీ కోతుల్ని తీసుకుని మనం మాల్ కెళ్తే ఒక కార్డ్ సరిపోదేమో కదా? మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయా… అవి ఖాళీ అయిపోతే మీ పరిస్థితేంటా అని… పర్లేదులే మామయ్యా మీకు మేమున్నాము. మరేమీ ఖంగారు లేదు. ” ధైర్యం చెప్తున్నట్లుగా యాక్షన్ చేసాడు.
“నువ్వూ…”అంటూ ఆడపిల్లలిద్దరూ విశ్వ వెంట పడ్డారు.
పెద్దవాళ్ళెవరూ ఏఎంబీకి రామన్నారు. పిల్లలు నలుగురూ ఒక కారులో బయలుదేరుదామని అనుకున్నారు.
రూం లోనుండి తయారై వచ్చిన వినీలను పరవశంగా చూసాడు శశి. స్కైబ్లూ కలర్ చుడీదార్ లో ఆకర్శణీయంగా ఉన్నది వినీల. చెవులకు పెట్టుకున్న హ్యాంగింగ్స్ కదిలినప్పుడల్లా మెరుస్తూ, ఆ మెరుపులను చెక్కిళ్ళకు అద్దుతున్నాయి. వినీలకు తయారవడం ఇష్టం కాని అతిగా ఉండదు. లైట్ గా అద్దిన లిప్ స్టిక్ పెదాలకు సిల్కీ షైనింగ్ ని ఇచ్చింది. జీన్స్ వేసుకుందామనుకుని కూడా బామ్మా తాతయ్యలు చుడీదార్ వేసుకుంటే సంతోషపడతారని అవి వేసుకున్నది. ఇంటర్ చదువుతున్న మగపిల్లాడు చిన్నపిల్లాడిలానే అనిపిస్తాడు. ఆ వయసుకే ఇట్టే ఎదిగిన ఆడపిల్లల్లో పరిణతి కనిపిస్తుంది.
కిల కిలా నవ్వుతూ ఆడపిల్లలిద్దరూ బయటికి రాగానే బామ్మ వసుంధర ఇద్దర్నీ దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నది. “నా దిష్టే తగిలేట్లున్నది. ఇంటికి రాగానే దిష్టి తీయండి” కోడలికీ, కూతురికీ కలిపి చెప్పింది.
“టాటా. . బై. బై…” అందరికీ చెప్పి అప్పటికే కార్లో కూచుని హారన్ కొడుతున్న విశ్వ దగ్గరికి వెళ్ళారు పరుగునా.
*************
అప్పటికే పదిసార్లు లోపటికీ బయటికీ తిరిగారు ఆర్తీ, కార్తీలు. “బామ్మా… ఈ శివా చూడు ఇంకా రాలేదు. ఇంకెప్పుడెళ్తాము? ఆ మాల్ తిరగాలంటే ఎంత టైమూ సరిపోదు. లాస్ట్ టైం కూడా ఆ రైడ్స్ అన్నీ ఎక్కనే లేదు” ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నారు ఇద్దరూ.
“పరీక్షకెళ్ళాడు కదా వస్తాడులే. ఫోన్ చేద్దామంటే పరీక్ష హాల్లోకి ఫోన్ ఇవ్వరు కదా… మీ ఇద్దరూ రడీయేనా?” వాళ్ళను దగ్గరికి తీసుకుంటూ అడిగింది.
“మేమెప్పుడో రడీ. చూడు మా డ్రెస్ అంతా నలిగిపోయింది” డ్రెస్ చూపిస్తూ అన్నారిద్దరూ.
“అవున్రోయ్… మీరన్నట్లు బాగా నలిగాయి. ఏమీ బాలే… పోనీ ఒక పని చేయండి. వెళ్ళి మొహం కడుక్కుని వేరేవి ఇస్త్రీవి వేసుకుని వచ్చేయండి ఫాస్ట్ గా” వాళ్ళను హుషారు చేసింది.
“అత్తయ్యా! ఇప్పటికే వంద మార్చారు. మళ్ళీనా?” నీరసంగా అన్నది పూర్ణ.
“బామ్మా! నేను రడీ…” లోపల్నుండి వచ్చింది ధృతి.
“అమ్మ! నేనొచ్చేసా…” బయటినుండే అరుస్తూ లోపలికి వచ్చాడు శివ.
పిల్లల మొహాలు వెలిగిపోయాయి. డ్రెస్ మార్చుకోవాలన్న సంగతి మర్చిపోయి వాడివెంట పడ్డారు.
“అరేయ్… శివా అన్నం తినేసి వెళ్ళు” లోపలికి వెళ్తూ చెప్పింది పూర్ణ.
అదా ఇదా అంటూ తయారై బయల్దేరేసరి రెండయింది. అప్పటికే కార్లో కూర్చుని హారన్ మోగిస్తూనే ఉన్నారు ఆర్తీ, కార్తీ. అత్తగారితో ఎప్పుడో కాని వెళ్లే ధైర్యం చేయదు పూర్ణ.
రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్లుగా కారు కదిలింది.
****************

4 thoughts on “ధృతి పార్ట్ – 5

  1. నిజంగా …..భలే రాసావు.మణీ….నువ్వెంత ఫాస్ట్ గా డైలాగ్స్ రాసావో నేనూ అంతే ఫాస్ట్ గా చదివా….చాలా బాగుంది….వెంటనే
    స్పందించి పంపినందుకు ధన్యవాదాలు…

Leave a Reply to Sravya Gupta Cancel reply

Your email address will not be published. Required fields are marked *