March 28, 2024

వెంటాడే కథలు – 1

రచన: చంద్రప్రతాప్ కంతేటి

వెంటాడే కథలు!
నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!
-చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు

ప్రొఫెసర్ గారి స్వయంకృతం

అతనొక గొప్ప రిటైర్డ్ ప్రొఫెసర్. పేరు డేవిడ్.
వయసు ఏడుపదుల పైమాటే !
భార్యాబిడ్డలు లేరు. ఒంటరి వృద్ధుడు.
రోజూ వంటావిడ అతని ఫ్లాట్ కు వచ్చి ఇల్లు శుభ్రం చేసేది. అల్పాహారం, వంటావార్పు ముగించి, వండిన వంటకాలు డైనింగ్ టేబుల్ మీద నీటుగా అమర్చి తన ఇంటికి వెళ్లిపోయేది.
ప్రొఫెసర్ గారు తనకు తీరుబడి అయినప్పుడో ఆకలి అయినప్పుడో తినేవారు.
ఆమె వచ్చినప్పుడు తలుపు తీయడం, వెళ్ళినప్పుడు తలుపు వేయడం మినహా వారిద్దరి మధ్య మాటలు ఉండేవే కాదు.
ఆయన ఎక్కువగా చదువుకుంటూనో రాసుకుంటూనో కూర్చునేవారు.
లేదా ఉన్నట్టుండి సుదీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయేవాడు. పడక కుర్చీలో పడుకుని అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకునేవారు.
అప్పుడప్పుడూ పాత విద్యార్థులు లేదా మాజీ సహోద్యోగులు వచ్చి ప్రొఫెసర్ గారితో బాతాఖానీ వేసి వెళ్లి పోతుండేవారు.
వాళ్లు వచ్చినప్పుడు ఆయన బాగా సంతోషపడేవారు.
ఆ సమయంలో మంచి హుషారుగా ప్రవర్తించేవారు.
వాళ్ళతో కలిసి విస్కీ లేదా వైన్ తీసుకుంటూ తెగ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవారు.
చాలా తెలివైనవాడు కావడంతో వచ్చిన అతిథులు ఆయన నుంచి ఎన్నో సందేహాలకు పరిష్కారాలు తెలుసుకుని కృతజ్ఞతలు చెప్పి మరీ వెళ్లేవారు.
ఆ తర్వాత ఫ్లాట్ అంతా నిశ్శబ్దంలో కూరుకుపోయేది. ఒంటరితనంతో ముడుచుకుపోయేది.
జీవితం ఆయనకు నిస్సారం అనిపించేది. విసుగు కలిగించేది.
క్షణమొక యుగంలా గడుస్తున్నట్టు భావించుకునేవారు.
బాల్కనీలోకి వెళ్లి కింది రోడ్ మీదికి చూసేవారు.
ఉరుకులు పరుగులు పెడుతూ మనుషులు. . వాహనాలు !
అది చూసి నవ్వొచ్చేది.
కొన్నేళ్ళక్రితం తను కూడా అలా పరుగులు తీసినవాడే కదా!
ఓపిక ఉన్నంతసేపు అక్కడే నిలబడి తర్వాత లోపలికి వచ్చేవారు.
ఏ వ్యాపకం లేకపోవడంతో చదివిన పుస్తకమే మళ్ళీ చదవడం, రాసిన మాటలే మళ్ళీ రాయడం . .
ఎప్పుడూ మననం చేసుకునే విషయాలే మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం చేస్తుండేవారు.
తనలో తనే మాటాడుకోవడం చేసేవారు.
ఒకరోజున తన కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో గుర్తురాలేదు.
గంటల తరబడి ఇల్లంతా గాలించాడు. కనబడలేదు.
తీరా చూస్తే అది ఆయన కళ్లకే ఉంది.
దాంతో బాగా నవ్వొచ్చింది.
పడీపడీ నవ్వారు. కళ్లలోనుంచి నీళ్లు కారేదాకా నవ్వుతూనే ఉన్నారు.
ఆ కన్నీళ్ల ఆనవాళ్లు ఆనందానివో ఆవేదనవో ఆయనకు కూడా అర్థం కాలేదు.
నిజానికి తను వెదకాలనుకున్నది చేతి గడియారం.
మూడు రోజులుగా అది ఎక్కడ పెట్టాడో గుర్తు రావడం లేదు.
ఆ విషయం మరచిపోయి కళ్ళజోడు కోసం అన్వేషణ మొదలెట్టారు.
కళ్ళజోడు ఎలాగూ ఉంది కాబట్టి – వెదకాల్సింది గడియారం.
ఇప్పటిదాకా అతను వెదికింది ‘కళ్ళజోడు’ కాబట్టి గడియారం పేరు కాస్తా కళ్లజోడుగా మార్చేస్తే పోతుంది. .
కళ్ళజోడు పేరు ‘గడియారం’గా మార్చేస్తే భలే తమాషాగా ఉంటుంది అనుకున్నారు.
ఈ ఆలోచన ఆయనకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.
‘కొత్తవాళ్ల దగ్గర ఇలా పేర్లు మార్చి మాట్లాడితే కంగారు పడిచస్తారు. . ఛస్తే చావనీ! నాకు మాత్రం మంచి కామెడీగా ఉంటుంది’ అని అనుకున్నారు.
మర్నాడు పనిమనిషి రాగానే ”నా రైటింగ్ టేబుల్ మీద ‘కళ్ళజోడు’ ఉంది తీసుకురా” అన్నారు.
పనిమనిషి ఆశ్చర్యపోయింది.
”కళ్ళజోడు పెట్టుకునే ఉన్నారు గదా?” అంది.
”కాదు కాదు టైం ఎంతైందో చూడాలి. . తొందరగా తీసుకురా?” అని అరిచారు.
‘టైం చూడాలంటున్నాడు. . కళ్ళజోడు అంటున్నాడు. . గడియారం అనబోయి ఇలా అన్నాడు కాబోలు. . సరే అదే తెద్దాం’ అనుకుని పనిమనిషి లోపలికి పరుగెత్తుకుని వెళ్లి చేతి గడియారం పట్టుకొచ్చింది.
”వెరీ గుడ్! సరే ‘కళ్లజోడు’లో టైం ఎంతైందో చూసి చెప్పు” అన్నారు మనసులో నవ్వుకుంటూ.
ఆమె కంగారు పడుతుంటే – ఆమె చేతిలోని వాచీ తీసుకుని –
”ఇదిగో చూడు! ఇకపై దీనిపేరు ‘కళ్ళజోడు’ అని గుర్తుంచుకో! అలాగే కళ్ళకు పెట్టుకునేది ‘చేతి గడియారం’. ఇప్పుడు కళ్లజోడులో టైం చూసి ఎంత అయిందో చెప్పు?” అన్నారు ప్రొఫెసర్ గారు చిరునవ్వు నవ్వుతూ.
‘ముసలాడికి పిచ్చిగానీ ఎక్కలేదు గదా?’ అనుకుంది పనిమనిషి.
”అలాగే సార్ అని గడియారం తీసుకుని ఉదయం ఎనిమిది అయింది సార్ . ” అని చెప్పి గడియారం ఆయన చేతికిచ్చి ”లోపల నాకు వంట పనుంది సార్!” అంటూ ఇంట్లోకి తుర్రుమంది.
కళ్లజోడును గడియారమని- గడియారాన్ని కళ్లజోడని వాదించేసరికి పనిమనిషి కంగారుపడిపోవడం, గందరగోళం కావడం డేవిడ్ గారికి ఎంతో హుషారు ఇచ్చింది.
ఆయనలో ఏదో కొత్త చైతన్యం వచ్చింది.
ఇక ఆ రోజునుంచి ఆయనకు తీరుబడే లేకుండా పోయింది.
అన్ని వస్తువులకూ కొత్తపేర్లు పెట్టడంతోనే పొద్దంతా సరిపోయేది.
బ్రెడ్ కు ‘బక్కెట్’ అని మిల్క్ కు ‘విస్కీ’ అని, విస్కీకి ఇంకో పేరేదో పెట్టేసి తెగ నవ్వుకునేవారు.
మర్నాడు పనిమనిషి రాగానే – ”చాలా ఆకలిగా ఉంది. కొంచం బక్కెట్ కాల్చి ఇస్తావా?” అని అడిగారు.
”బక్కెట్ కాల్చి ఇవ్వాలా?” ఆవిడకు మూర్ఛ వచ్చినంత పనైంది.
”అవును ఇకపై ‘బ్రెడ్’ పేరు ‘బక్కెట్’! ‘విస్కీ’ అంటే ‘పాలు’! ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. . నేను తడవ తడవకూ చెప్పను. నువ్వే గుర్తుపెట్టుకోవాలి” అన్నారు గట్టిగా.
‘కచ్చితంగా వీడికి పిచ్చి ఎక్కింది. . వీడి దగ్గర పని మానేయడం ఉత్తమం.’అన్న నిర్ణయానికి అప్పటికప్పుడే వచ్చింది పనిమనిషి.
ఎలాగోలా ఈ వారం జీతం తీసుకుని బయటపడితే సరిపోతుంది అనుకుంది.
అయితే ఆ వారం రోజుల్లో ప్రొఫెసర్ గారు ఆమెకు పిచ్చి ఎక్కించినంత పని చేశారు.
పుస్తకాన్ని ‘ఎలుక’ అన్నారు.
ఎలుకకు ‘పుస్తకం’గా నామకరణం చేశారు.
మంచాన్ని ‘ఏనుగు’ అన్నారు.
ఏనుగును ‘బీరువా’ అన్నారు. బీరువాను ‘సింహం’ అన్నారు.
ఇలా రకరకాల పేర్లు పెట్టి వాటిని యథేచ్ఛగా వాడి ఆమెకు తల తిరిగిపోయేలా చేశారు.
వారం గడిచింది. పనిమనిషి మానేసింది.
డేవిడ్ ఇప్పుడు పూర్తిగా ఒక్కరే అయిపోయారు.
అయినా దిగుల్లేదు. కొత్త నామకరణాలతో బిజీ బిజీ అయిపోయారు.
ఏదో ఇంత ఆయనే వండుకు తింటూ కాలాన్ని హుషారుగా లాగిస్తున్నారు.
ఇప్పుడు ఆయనకో వ్యాపకం దొరికింది గదా?
అదీ ఆయన సంతోషం.
కానీ అదే తనను చాలామందికి దూరం చేస్తోందని ఆయన గుర్తించలేకపోయారు.
ఇదివరకటిలా సందేహ నివృత్తికి శిష్యులు వస్తే –
ఆయన తన ‘పిచ్చి భాష’తో వారిని తికమక పెట్టేవారు.
వాళ్ళు గందరగోళ పడుతుంటే ఆయనకు పరమ వినోదంగా ఉండేది.
వాళ్ళు గుడ్లు మిటకరించి చూస్తుంటే ఆయన పెద్దగా నవ్వుతూ ఉండేవారు.
”మీరు రెండు నిముషాలు కూర్చోండి . రెండు బక్కెట్లు కాల్చి ఇస్తాను. . ఏమీ తినకుండా ఎలా వెళ్తారు?” అనేవారు.
వాళ్ళు నోరెళ్ళబెట్టి చూస్తుంటే –
”విస్కీ మీకు ఒకే గదా?” అని పాల గ్లాసులు చేతిలో పెట్టేవారు.
”కొత్త ఎలుకలు కొన్ని వచ్చాయి . చదువుతారా?” రెండు కొత్త పుస్తకాలు తెచ్చి టీ పాయ్ మీద పడేసేవారు.
”అరె మర్చేపోయాను కళ్ళజోడు చూడండి. . టైం ఎంతైందో? ఇవాళ ఒక మిత్రుడు వస్తానన్నాడు. . అతనికి వార్నిష్ (డిన్నర్) తయారు చేయాలి”
ఇలా మాట్లాడుతుంటే అతిధులకు, శిష్యులకు ఆయన ఏమి చెబుతున్నాడో అర్థం కాక జుట్టు పీక్కునేవారు.
వారి పరిస్థితి ఆయనకు పరమానందం కలిగించేది.
ఆయన మానసిక పరిస్థితిపై వాళ్లకు అనుమానాలు రేకెత్తేవి.
ఆ తర్వాత నుంచి ఒకసారి వచ్చిన వాళ్లు తిరిగి ఆయన గుమ్మం ఎక్కడం మానేశారు.
క్రమంగా చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా ఆయన ఫ్లాట్ లోకి తొంగి చూడడం మానేశారు.
పొరపాటున ఎవరైనా తొంగి చూసినా –
ఏదో విచిత్రంగా మాట్లాడి వాళ్ళను బేజారెత్తించేవారు.
ఆయనలో ఆయన మాట్లాడుతూ నవ్వుతూ ఉండేవారు.
గుర్తు వచ్చినప్పుడు వండుకున్నది తినేవారు.
మొత్తం మీద సమాజంలో వాడుకలో ఉన్న ప్రతి పదానికి ఆయన తనకు నచ్చిన పదాన్ని కాయిన్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక భాష నిర్మించుకున్నారు.
తనలో తనే తన స్వీయ నిర్మిత సొంత భాషలోనే మాట్లాడుకుంటూ. . పదేపదే అదే మననం చేసుకుంటూ అసలు జనభాష మరచిపోయారు. జనాన్నీ మరచిపోయారు.
అప్పటి నుంచి కథ తిరగబడింది.
ఆయన ఆరోగ్యం చెడింది. మంచం పట్టారు.
డాక్టర్ వచ్చాడు.
ఆయన భాష డాక్టరుకు అర్థం అయ్యేది కాదు.
డాక్టర్ చెప్పేది డేవిడ్ గారికి అర్థం అయ్యేది కాదు.
”బాధ ఎక్కడ సార్?” అని అడిగితే –
”సంచిలో. . ” అనే వాడాయన బాధతో మెలికలు తిరుగుతూ.
బహుశా ‘సంచి’ అంటే ‘కడుపు’ అని పేరు పెట్టుకున్నాడేమో ఎవడికి తెలుసు?
చూపు మందగించింది అనే విషయాన్ని కూడా డాక్టర్ కు చెప్పలేకపోయేవారు.
ఆయన మాట్లాడేది ఇతరులకు ఎవ్వరికీ అంతు పట్టేది కాదు.
ఇతరులు చెప్పేది ఆయనకు అర్థం అయ్యేది కాదు. .
వ్యాధి కాకపోయినా కనీసం దాని లక్షణాలు కూడా డాక్టర్లకు చెప్పలేకపోయేవారు.
దాంతో వారు ఆయనకు వైద్యం చేయలేకపోయేవారు.
క్రమంగా పరిస్థితి మరింత విషమించింది.
అంత చదువుకుని అంత ప్రసిద్ధుడైన ఓ మహా మేధావి కథ చిట్టచివరికి అలా ఎవరికీ అంతుపట్టని తీరులో విషాదాంతం అయిపోయింది.

గమనిక : ఈ కథలో వార్ధక్యంలోని ఒంటరితనం ఎంతటి శాపమవుతుందో. . అలాంటి వాళ్లకు కుటుంబ సభ్యులతోపాటు సమాజం ఎంత భరోసా ఇవ్వాల్సి ఉంటుందో రచయిత ఒక గమ్మత్తయిన పద్ధతిలో చెప్పారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం రాసిన కథైనా ఇప్పటికీ ప్రాసంగికత కోల్పోనిది. పైపెచ్చు ఇప్పుడే మరింత ప్రాసంగికత సంతరించుకున్నది.
ప్రస్తుతం మన చుట్టుపక్కల కుటుంబాలలోని ఎందరో వృద్ధులు పలకరించేవారు లేక మౌన సముద్రాల్లా మిగిలిపోతున్నారు. రెండు పూటలా భోజనం, కాఫీ అల్పాహారాలు అందించినంత మాత్రాన మనం వారిని గొప్పగా చూసినట్టు కాదు. కనీసం కొడుకో, కోడలో, మనవడో ఎవరో ఒకరు రోజూ తమతో పదినిమిషాలు గడిపితే చాలు వారు బ్రహ్మానందపడతారు. అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరమవుతారు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, గాడ్జెట్ల యుగంలో వారికి ఆ మాత్రం భరోసా దొరికితే చాలు. . ఈ కథ లక్ష్యం నెరవేరినట్టే! ఇంత గొప్ప కథను మనకు అందించిన ఆ మహా రచయితకు శతకోటి వందనాలు!

27 thoughts on “వెంటాడే కథలు – 1

  1. అసలు కథ చదివాను ప్రతాప్ గారు. మీరు కథలో చిన్న చిన్న అంశాలను కూడా గుర్తు పెట్టుకుని రాయడం గొప్ప విషయం. చక్కటి పరిచయం.

  2. ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా మనషి తాను వాడే ఉపకరణాలు ఏవిధంగా రూపాంతరం చెందుతాయో,వాటికి ఎప్పటికప్పుడు పేరు మార్చివేస్తున్నాడు. అలాగే ఈ భాధలు కూడా ఎక్కడ అంటే కూడా చెప్పలేని భాధకర పరిస్థితి. అది శారీరికమా లేక మానసికమా చెప్పలేడు.మనిషి తన శరీర భాగాలు అన్నింటినీ వస్తువులుగా భావించడవలన మనిషి తన జీవిత పరమార్థం ఏమిటో తెలియకుండానే అర్థంతరంగా ఈ ప్రపంచం విడిచి వెళ్ళిపోతున్నాడు.

  3. వృద్ధాప్యపు ఒంటరితనం గురించి వినూత్నంగా రచించారు.శీర్షిక కథకు తగినట్లుగా ఉంది.ఒంటరిగా వృద్ధులను వదిలేసిన బిడ్డలకు బాధ జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది.తాత్కాలికంగా వదిలేసిన జీవితకాలం శిక్ష అనుభవించక తప్పదు.చాలా బావుంది కథ.

  4. అతనొక రిటైర్డ్, గొప్ప ప్రొఫెసర్.
    చాలా బాగుంది. సార్

  5. నమస్తే సర్, మీరు చెప్పిన డేవిడ్ గారి ఒంటరితనం కధ చదివాను…. ఒంటరితనం గురించి న నగ్న సత్యాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతో బాగా చెప్పారు సర్…. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి అదే స్థితిలో వున్నాడు… కానీ గుర్తించటం లేదు….. మంచి కథను చదివించిన మీకు కృతజ్ఞతలు సర్…. నమస్తే……

  6. ఇప్పుడే చదివాను జీవితంలో ఇలాంటి వి కూడా జరుగుతాయికాబోలు అని కొంత ఆశ్చర్యం మరికొంత భయం కూఢా వేసింది మీరు రాసిన విధానం చాలా బాగుంది సార్

  7. శీర్షికే ఆకర్షణీయమైనది. గతంలో ఏ పత్రికలోనూ దీనిని పోలిన దానిని చూడలేదు. చదివిన కథను జాపకం మీద ఆధారపడి పునర్నించడం అరుదైన, కష్టమైన ప్రక్రియ. సిపీ గారు సవ్యసాచి; మంచి కథకులు. ఫేస్బుక్ లో విఙానదాయకమైన టపాలు పెడుతుంటారు. నేను చదవకుండా ఒక్కదాన్నీ వదలను. ఒక అంతఠ్జాల పత్రికకు ‘వెన్నెల హాసం’ పేరుతో పురాణం సీతను తలపిస్తూ వారంవారం వ్రాస్తున్నారు. ఆయన అంత విరివిగా వ్రాయడం ఎప్పుడన్నా మాత్రమే రాయగల నాకు అసూయగా ఉంది. పూర్వ సంపాదకుడిగా ఆయన ఎంత సహృదయుడో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. ఈ కథ చదివిన తరువాత నిజంగానే వెన్నంటి బాధిస్తుంది. ఇంత మంచి శీర్షిక గురించి వీలైనంత ఎక్కువమందికి తెలిస్తే బాగుండు.

  8. …..చంద్ర ప్రతాప్ గారు…నమస్కారం…మీరు ఎంచుకున్న ‘వెంటాడే కధలు’ ప్రక్రియ అద్భుతం. మనం ఎన్నో కధలు చదివి వుంటాము. వాటికి మరలా పునరుజ్జీవనం కల్పించడం ఎంతో ఆనందంగా వుంది…ప్రస్తుత కధ కళ్లవెంట నీరు తెప్పించింది….ధన్యవాదములు రచయితకు శత కోటి వందనాలు..!

  9. మీరు మొదలుపెట్టిన “వెంటాడే కథలు” మంచి ప్రయోగం. పాత కథలని మీరు విపులలో 35 ఏళ్లనాటి సంచికలోంచి కతల్ని చదివి ఒక కథని ఎన్నుకొని ఆ కథకి పునర్జీవం పోసారు. అది ఎంతో ఆదరణ పొందింది! మీరు వరసకొద్దీ ప్రతి సంచికలో ఒక వెంటాడే కథని పరిచయం చేస్తూనే, పాఠకులకి కూడా వారిని వెంటాడే కథల్ని సంచికకి ఒకటి చొప్పున వేస్తే బాగుంటుందని సూచన. అలా రెండు కథల్ని చదివే భాగ్యం ఇచ్చిన వారౌతారు. పరిశీలించండి. ఈ విధంగా వైవిధ్యభరిత వెంటాడే కథలు అందుబాటులోకి వచ్చి పాఠకులని ఆలోచింప చేస్తాయి కదా! టి. సంపత్ కుమార్. నిర్మల్/దిల్లీ

  10. కథ చెబుతూ మీరు ఉటంకించిన మాటలు అక్షర సత్యం. మంచి రచన అందించిన వారికీ జ్ఞాపకం వుంటుకుని చప్పిన మీకు ధన్యవాదాలు.

  11. అద్భుతం ఈ ఒక్క మాట కన్నా ఎక్కువేమీ చెప్పలేక పోతున్నాను sir ❤️

    1. Sir your comment is very very very very happy and nice i hope i can serve you with my good stories In forthcoming issues.

Leave a Reply to chandra pratap kanteti Cancel reply

Your email address will not be published. Required fields are marked *