April 16, 2024

దేవీ భాగవతం – 4

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి

 

ద్వితీయ స్కంధము ఎనిమిదవ కథ

రురుని కథ

 

శాస్త్రమందు చెప్పబడిన విషయములను ఎప్పుడూ జారవిడువరాదు. వివేకవంతులెప్పుడునూ వారి వివేకము పైనే విశ్వాసము ఉంచుకోవాలి. మంత్రములు, మణులు, ఔషధములను సంపూర్ణముగా అభ్యాసము చేసినచో వాటితో కానిదేదియు లేదు. ప్రయత్నము అను దానిని తప్పక చేయవలెను.

భృగుమహర్షి పత్ని పేరు పులోమ. వారి పుత్రుడు చ్యవన మహర్షి. వాని భార్య పేరు సుకన్య. ఆమె శర్వాతి అను రాజు కుమార్తె. చ్యవన, సుకన్యలకు ‘ప్రమతి’ యను పేరుగల పుత్రుడుదయించెను. ప్రమతి యొక్క భార్యపేరు ప్రతాపి. వారి పుత్రుడే రురుడు. పరమ తేజస్సంపన్నుడు.

పరమ సుందరియగు మేనకకు విశ్వావసుడను ముని సమాగమముచే ప్రమద్వర అను బాలిక జన్మించెను. స్థూలకేశుడను ముని ఆ బాలికను పెంచి ఆమెకా పేరు పెట్టెను. మేనక ఆ బాలికకు జన్మనిచ్చి స్వర్గమునకు వెడలి పోయెను. సకల శుభ లక్షణములు గల ఆ బాలికను యవ్వనమున రురుడు చూచుట సంభవించెను. ఆమెను పెండ్లియాడవలెనని అతనికి తోచి తండ్రితో విన్నవించెను. ప్రమతి, స్థూలకేశుడు అంగీకరించి పెండ్లి యత్నములు సేయుచుండగా దురదృష్టవశాత్తు పాముకాటుకు గురియై ప్రమద్వర మరణించెను. ఆ మాట విని రురుడు మిక్కిలి విచారించెను. ప్రమద్వర కొరకు పిచ్చవాడై ఆత్మహత్య కూడా చేసుకొనుటకు సిద్ధపడెను. కాని తల్లిదండ్రులకొరకు ఆ ప్రయత్నము మానుకొని పిచ్చివానివలె తిరుగుచుండగా అతనికి ఒక ఆలోచన కలిగెను. అంతనాతడు కమండలములోని నీటిని చేతిలోనికి తీసుకుని, ‘‘నేను దేవయజ్ఞాది పుణ్యకర్మలు చేసితినేని, భక్తిగా గురువును, దేవతలను పూజించితినేని, గాయత్రిని భక్తిగా జపించి సూర్యారాధన చేసితినేని, ఆ పుణ్యప్రభావమున నా ప్రియురాలు పునఃజీవితరాలగుగాక’’ అని శపధము చేసెను.

వెంటనే ఒక దేవదూత ప్రత్యక్షమై వలదు, యిటువంటి దుస్సాహసమునకు ప్రయత్నించవలదు. ఆమె మేనక కుమార్తె. వివాహము కాక ముందే మరణించినది కావున నీవు మరొక కన్యను పెండ్లాడుము అని చెప్పెను.

అందులకు అంగీకరించని రురుని చూసి ఆ దేవదూత అతనికి ఒక దేవరహస్యము చెప్పెను. ‘‘నీవు నీ ఆయుష్షునందలి సగభాగము ఆమె కొసగినచో ప్రమద్వరను రక్షించుకోగలవని చెప్పెను.’’ తప్పక అలాగేనని రురుడు నా ఆయుష్షు లో ఆమెకు సగము ధారబోసెదనని పలికెను. అదే సమయాన ప్రమద్వర తండ్రి విశ్వవసు దేవదూత యమధర్మరాజు వద్దకు వెళ్ళి విషయము చెప్పి ప్రమద్వరను జీవింపజేయవలసినదిగా ప్రార్థించిరి. రురుని నియమవ్రత పుణ్యయిందులకు ధారపోయబడెను అనికూడా చెప్పిరి. వెంటనే ధర్మరాజు దేవదూతను పంపి ప్రమద్వరను బ్రతికించవలసినదిగా ఆజ్ఞాపించెను. తదనంతరము ఒక శుభముహూర్తమున ప్రమద్వరకు, రురునికి పెండ్లి అయ్యెను.

ఉపాయమువలన, సరియైన పద్ధతితో శాస్త్రమును ఉపయోగించడం వల్ల ఈ కార్యము సిద్ధించినది. ప్రాణములను రక్షించుకొనుట, మణులను, మంత్రములను, ఔషధములను విధిపూర్వకముగా ఉపయోగించుకొనుట సముచితమని ఈ రురుని వృత్తాంతము వలన తెలియుచున్నది.

అయితే ఆ పిమ్మట రురుడు ప్రమద్వరను కాటు వేసి సర్పజాతిపై పగ పెంచుకొని, కనబడిన సర్పజాతినన్నిటిని చంపుచుండెను. ఒకనాడు ఒక ముసలి సర్పము రురునకు కనబడెను. ఆతడు దానిని కర్రతో కొట్టసాగెను.

చిత్రముగా ఆ సర్పము మానవభాషలో మాట్లాడసాగెను. ఓ బ్రాహ్మణుడా, నీ వు ధర్మాత్ముడవు, సత్యవాదివి. నీకు నేనేమి అపకారము చేసితిని. నేను నిజముగా అజగరమును కాదు. నా స్నేహితడగు ఖేచరుడను వారని శాపము వలన ఇట్లు సర్ప రూపమును పొందితిని. ఒక నాడు నా మిత్రుడు అగ్నిహోత్రము చేసుకొనుచుండగా నేను హాస్యమునకు అతని మెడలో ఒక గడ్డితో చేసిన సర్పమును వేసితిని. అతడు వడవడ వణుకుచు భయకంపితుడై,  ఓ మూర్ఖుడా నన్ను సర్పముచే భయపెట్టావు కావున నీవు సర్ప యోనియందు జన్మించెదవు గాక అని శాపమిడెను. మిక్కిలి లజ్జితుడనై నేను ప్రార్థించగా చాలా కాలము పిమ్మట రురుడు అని ఉత్తముని వలన అతని కర్ర తగులుట వలన నీ శాపవిమోచన మగునని అతడు దయతలిచెను. నీవే రురుడవు, నేనే అ సర్పరూపములో ఉన్న బ్రాహ్మణుడను అని ఆ సర్పము చెప్పి మానవరూపమును పొంది వెళ్ళిపోయెను. అప్పటినుండి రురుడు సర్పములను చంపక పూర్వవైరమును మానుకొనెను.

ఈ వృత్తాంతమును ఉత్తంకుడు అను ముని పరీక్షిత్‌ మహారాజు కొడుకైన జనమేజయునికి వివరించెను. కావున బ్రాహ్మణుడైన వాడు ధర్మబుద్ధి కలిగి, అహింస చేయక ఉండాలి. హింసా ప్రవృత్తి కలిగి ఉండక వైరభావము లేక శాంతుడై ఉండవలెను అని భావము.

 

 

 

ద్వితీయ స్కంధము తొమ్మిదవ కథ

ఆస్తీకుని కథ

పరీక్షిత్‌ మహారాజు కాటువేసిన తక్షకుడు అను సర్పరాజుచే ఎన్నో బాధలు అనుభవించుచున్న ఉత్తంకుడు అనే ముని పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుని వద్దకు వెళ్ళి అతని తండ్రిని చంపిన తక్షకునిపై పగతీర్చుకోమని చెప్పగా జనమేజయుడు సర్పయాగమునకై తన భటులను, బ్రాహ్మణులను, మంత్రులను ఆదేశిస్తాడు. ప్రపంచం నలుమూలలా ఉన్న అనేక సర్పరాజములు ఆ యాగమునందు పడి మరణించుచున్నవి. తక్షకుడు భయపడి ఇంద్రుని శరణువేడగా, ఉత్తంకుడు ఇంద్రునితో సహా తక్షకుడిని సర్పయాగములో పడి భస్మము కావలసినదని ఆదేశిస్తాడు. ఆవాహనము చేస్తాడు. అప్పుడు యాయావర కులమునకు చెందిన ఆస్తీకుని తలచెను. అతడు జరత్కారుడను ముని కుమారుడు. అతడు జనమేజయుని వద్దకు వచ్చి అతనిని ప్రశంసించి మెప్పు పొందెను. అందుచే రాజాతని తెలివితేటలకు ఆనందం చెంది వరమేదైనా కోరుకొమ్మనగా ఆస్తీకుడు సర్పయాగమును సమాప్తము గావించవలసినదిగా కోరతాడు. యిచ్చిన మాట తప్పక రాజు అట్లే సర్పయాగమును ఆపివేసెను.

ఆ పిమ్మట మహాభారత కథను వ్యాసుడు వివరించినను జనమేజయుడు తృప్తి పొందలేదు. అర్థాంతరముగా సర్పయాగము ఆపివేయవలసి వచ్చినందుకు అతడు చింతించెను. తన తండ్రి పై లోకములందు వివశుడై శరీరము పరిత్యజించవలసి వచ్చినందుకు రాజు మిగుల దుఃఖించెను. తన తండ్రి వెంటనే స్వర్గమునకధికారి అగుటకేమైనా ఉపాయమును చెప్పమని వ్యాసుని ప్రార్థించెను.

వ్యాసమహర్షి జనమేజయునికి దేవీ భాగవత మందలి కథలను చెప్పసాగెను.

సర్వత్ర ప్రకటితము కాకూడని, మిగుల గోప్యమైన విషయములను రాజుకు వివరించెను. ఈ పురాణ శ్రవణము వలన ధర్మార్థ కామ మోక్షములన్నియు సులభమగుననెను. శుభమై అక్షయమగు సుఖము నొసగు ఈ దేవీ భాగవత పురాణమందు సమస్త వేదముల సారముందని వ్యాసుడు నుడివెను.

ఆ ఆస్తీకుడెవరు? అతడెందుకు సర్పములను రక్షించెను అని రాజు ప్రశ్నించగా వ్యాసుడిట్లు చెప్పెను.

జరత్కారువు అని ఒక మహర్షి ఉండేవాడు. సౌమ్యుడు, సత్యసంధుడు. అతడు వివాహము చేసుకోలేదు. అతని పూర్వజులు ఒక పెద్ద గుంతలో వ్రేలాడుచుండిరి. వారు జరత్కారువుతో నాయనా నీవు వివాహము చేసికొని సంతానమును గని మమ్ములను ఈ దుఃఖమునుండి విముక్తులను చేయుము. అప్పుడు మేము స్వర్గమునకు అధిపతులము కావచ్చును అని విలపించిరి. జరత్కారువు అంగీకరించి తన పేరు గలిగిన స్త్రీని అయితేనే పెండ్లాడెదనని చెప్పెను. నా ఆధిక్యతను స్వీకరించి, నే నడగకుండా లభించే కన్యను వివాహమాడెదనని చెప్పెను. తీర్థయాత్రలకు బయలుదేరెను.

అదే సమయాన కద్రువ అను నాగమాత తన మాట పుత్రులు వినకుండుటచే వారినందరినీ అగ్నికి ఆహుతి కమ్మని శపించెను. వాసుకి మొదలగు సర్పరాజులు బ్రహ్మదేవుని శరణు జొచ్చిరి. బ్రహ్మ వాసుకితో వాని చెల్లెలగు జరత్కారువను పేరుగలది గాన మునియగు జరత్కారుని ఆమెకిచ్చి వివాహము చేయుమని చెప్పెను. వారికి కలగబోయే కుమారుడే మిమ్ములను రక్షించునని బ్రహ్మ చెప్పెను.

వాసుకి తన చెల్లెలిని జరత్కారువు ముని వద్దకు తీసుకుని వెళ్ళి పెండ్లాడమని అర్ధించబా ఆ ముని అట్లే పెండ్లాడెదను గాని ఆమె నా మాటకు ఎదురు చెప్పినచో నేనామెను పరిత్యజించెదనని నుడువగా వాసుకు అట్లే అని మాట యిచ్చి సోదరి వివాహము చేసి వెడలి పోయెను.

ఒక కుటీరమందు జరత్కారుదంపతులు సుఖముగా జీవింపసాగిరి. ఒకనాడు ముని నిద్రకుపక్రమించి ఎట్టి పరిస్థితిలోనూ తనకు నిద్రాభంగము కలిగించవద్దని చెప్పి పరుండెను.

సంధ్యాసమయమయ్యెన. ముని లేవలేదు. సంధ్యావందనమునకు సమయమయ్యెను. ధర్మలోపమగునేమో అని భార్య భయపడెను.

‘మునిని లేపినచో అతడు నన్ను విడిచిపెట్టును. లేపనిచో ధర్మము నశించును. సంధ్యాసమయము వ్యర్థమగును. ధర్మము నశించుటకంటే నన్ను పరిత్యజించుట ఉత్తమము. ధర్మహీనుడైన పరుషుడు మాటిమాటికీ నరకమనుభవించును’ అని తలంచి ఆమె భర్తను మేల్కొలిపెను.

అంత ముని ఆమెను త్యజించటకు సిద్ధపడగా ఆమె తన అన్నయైన వాసుకి ఏ ఫలముకొరకు అతనిని యిచ్చి వివాహము చేసెనో ఆ ఫలమెట్లు లభించునని వేడుకొనగా ‘‘అట్లే జరుగుగాక’’ యని అతడు వెళ్ళిపోయెను.

ఆమె తన అన్నతో మునివాక్కులు యిట్లు చెప్పెను. ‘‘అస్తియితి’’ అని ముని వచించి నన్ను త్యజించెను అని చెప్పగా అతని మాటలు వ్యర్థములు కావని, అవి సత్య వచనములని వాసుకి నమ్మెను. కొంతకాలమునకు జరత్కారువు గర్భమున ఒక పుత్రుడు జన్మించెను. ‘‘అతడే అస్తి యితి’’ భావికాలమున ఆస్తీక ముని పేరుతో కీర్తికెక్కెను.

అతడు తల్లి కులమును రక్షించుటకై జనమేజయ మహారాజును మెప్పించి సర్పజాతిని రక్షించెను. యయావర కులదీపకుడు ఆస్తీకుడు. అతని తల్లి జరత్కారువు. వాసుకి చెల్లెలు. మునిచేసిన పని అభినందించదగినది. తన తల్లి కులమును రక్షించుటకై ఆతడు కృషిచేసి యశోవంతుడయ్యెను.

సర్వోత్కృష్టమైన భగవతి ఆద్యాశక్తిని మొట్టమొదట అర్ధశ్లోకమందు విష్ణుదేవునికి వివరించెను. అట్టి పరమ పావనము, అనేక రసముల కాలవాలము, సంసారమును ఉద్ధరించెడు ఈ పురాణశ్రవణము విన్న పురుషుడు కీర్తిమంతుడగును. అన్ని సుఖములను పొందును. వారు భగవానులుగా పిలువబడెదరు. కావున ఓ రాజా ఆ భగవతి పరమేశ్వరికి ఒక విశాల మందిరము కట్టించి ఎల్లపుడు ఆ ఆద్యాశక్తిని నీ మనసునందు ఉంచుకొని ఆరాధింపుము. అందువలన నీ పితరులకు సదా స్వర్గమునందుండెడి సౌకర్యము లభించునని వ్యాసుడు జనమేజయునికి ఆదేశించెను.

 

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *