April 25, 2024

ఔషధ మొక్కలు – 4

 

రచన: గుమ్మా నాగమంజరి

 

 

 

  1. తాటి పత్రం

తాళ పత్రమనుచు దాచె గుట్టుల నెన్నొ

కప్పు వేయనగును కమ్మలిట్టె

నీర, ముంజె, రసము మారె నౌషధముగ

కనగ పేదవాని కల్పతరువు

 

తాళము అనే పేరిట తాటి చెట్టు ప్రఖ్యాతి పొందింది. తాటియాకులపై ఎన్నో మహాగ్రంధాలు రాయబడ్డాయి. నీర (సూర్యోదయం అవక పూర్వపు తాటికల్లు) అమృతంతో సమానం. (ఆలస్యం అమృతం విషం సామెత ఇలా పుట్టిందే) తాటి ముంజెలు చలువ చేస్తాయి. తాటిపండ్ల రసంతో చేసిన తాటిబెల్లం ఆయుర్వేద ఔషధం. ఆకులు పైకప్పుగా, మాను వాసాలుగా, బోదెలుగా పనికి వస్తాయి. పీచును తడపలు అంటారు. తాళ్ళు నేస్తారు. వంటచెరకుగా కూడా తాటిచెట్టు పనికివస్తుంది. ఒక విధంగా పేదవాని పాలిటి కల్పవృక్షం ఈ తాటిచెట్టు.

 

 

 

  1. జామ

పెరటి చెట్టు జామ పెంచు దంత పటిమ

తెలుపెరుపుల జామ విలువ హెచ్చు

గుణములందు జామ కొండంత మేలిచ్చు

నాకు బెరడు పండు నౌషధములె

 

జామపండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటి పెరడులో జామచెట్టు సర్వసామాన్యం. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. జామపండ్లు ఎరుపు, తెలుపు రంగులలో లభించినా, గుణాలలో రెండు ఒకటే.

 

 

  1. మందార

నల్లని తలకట్టు నిలువ

చల్లని మందార చాలు జల్లను కురులున్

కొల్లలుగ వన్నె కూర్చుకు

నుల్లము దోచు సుమమిది శుభోదయ వేళన్.

 

మందార.. కుంకుడు కాయలతో కలిసి శిరోజాలకు చక్కని నల్లని రంగును, పట్టులాంటి మృదుత్వాన్ని ఇస్తుంది. కానీ సాంప్రదాయకమైన ఈ అలవాటును మాని మందార, కుంకుడు ఉన్న షాంపూలు వాడి ఉన్న జుట్టు ఊడగొట్టుకుంటున్నాం. రకరకాలైన మందారపూలతో దేవుడికి పూజ చేస్తే ఆ తృప్తే వేరు.

 

 

 

  1. బ్రహ్మకమలం

మంచు కొండలందు మహనీయ పుష్పాలు

బ్రహ్మ కమలమనెడి రాచ విరుల

విచ్చుకొనిన పూల వీక్షణ స్వల్పము

స్వర్ణపుష్పమనుచు వాసికెక్క

 

హిమాలయాల్లో పెరిగే అరుదైన మొక్క ఈ బ్రహ్మకమలం. అర్ధరాత్రి ఎప్పుడో వికసించి, రెండుమూడు గంటలు మాత్రమే ఉంటుంది. అందుచేత వికసించి ఉండగా చూసిన వాళ్ళు తక్కువ. బ్రహ్మ పుట్టిన పువ్వు ఇదే అని, శివుడు ఏనుగు తలను బాలునికి అమర్చగా ఈ పువ్వు తాకించి బ్రహ్మ పునరుజ్జీవితుని చేశారని పురాణ గాథ. టిబెటన్లు ఈ మొక్క మొత్తంగా ఔషధంగా వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

 

 

  1. పారిజాతం

హనుమ వాసముండు అందాల పూతర్వు

సత్య భామ కోరె స్వర్గ సుమము

కృష్ణ మూర్తి తెచ్చె వృక్ష రాజమ్మునే

శిరసు దాల్చరాదు నరుడు కోరి.

పారిజాతం అనగానే హనుమంతుడు నివాసం ఉంటారని, సత్యభామ కొరకు శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తెచ్చి ఇచ్చారని చప్పున గుర్తుకు వస్తుంది. ఈ పువ్వులు దేవతా పుష్పాలు కాబట్టి మనుషులు ధరించరాదు అని ఒక నమ్మకం.

శరీరానికి వేడి చేసినపుడు ఆకులు , పువ్వులు కలిపి నూరి నుదుటిపై పట్టు వేస్తే 5 నిమిషాలలో ఆ ముద్ద వేడి ఎక్కిపోతుంది. తీసివేసి, మళ్ళీ మరొక ముద్దను పట్టుగా వేయాలి. ఇలా ముద్ద వేడెక్కనంత వరకు వేయాలి. ఒంట్లో వేడి తగ్గిపోతే ముద్ద కూడా చల్లగానే ఉంటుందట. ఇంట్లో (పెరటిలో) పారిజాతం పెంచుకోవచ్చు కానీ గొంగళిపురుగుల బాధ ఎక్కువ.

1 thought on “ఔషధ మొక్కలు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *