June 25, 2024

చంద్రోదయం – 21

రచన: మన్నెం శారద

ఎప్పట్లా చిరునవ్వుతో ఎదురు వెళ్లలేకపోయేను.
అది భయం కాదు.
మనసులో యేదో స్పందన కలుగుతోంది. ఏవిటది? ఆలోచనలకందని మధురస్వప్యం ఏదో నా కళ్లముందు
కదులుతోంది.
పనిపిల్లతో కాఫీ పంపించేను.
“మీ అమ్మగారు ఘోషా చేస్తున్నారా?” అని అతను అడగటం నాకు విన్పిస్తూనే వుంది.
అయినా అప్పటికి నేను బయటికి వెళ్లలేదు.
“మైడియర్ స్వాతి మేడంగారూ. మీరు ఆఫీసుకు ఎందుకు రాలేదో, ఏమైందో కనుక్కుందామని వచ్చేను. కారణం చెబితే ఈ దీనుడు సెలవు తీసుకుంటాడూ” అన్నాడు మోహన్.
అతని మాటలకు నాకు నవ్వొచ్చింది. అతను నిజంగా వెళ్లిపోతాడేమోనని భయంగా వుంది.
కానీ.. అతనికి ఎదురుపడాలంటే ఏదో సంకోచం.
కాళ్ళు కదలనని మొండికేస్తున్నాయి.
కిటికీ పట్టుకొని అలాగే నిలబడ్డాను.
నా వెనక నీడని చూసి వులిక్కిపడి వెనక్కి తిరిగేను. దరిదాపు నన్ను అంటుకొన్నంత దగ్గరగా మోహన్ నిలబడి వున్నాడు. నేను భయంగా తల దించుకొని నిలబడ్డాడు.
అకస్మాత్తుగా అనుకోని విధంగా అతను నా చుబుకం పట్టుకుని నా తల యెత్తి నా కళ్లలోకి సూటిగా చూసేడు.
నేను వెంటనే కళ్ళు వాల్చేశాను.
నా శరీరం సన్నగా కంపిస్తోంది.
“స్వాతీ! ఐలవ్‌యే!” అన్నాడతను తమకంగా. నేను పరవశంగా అలాగే అతని చేతుల్లో యిమిడిపోయేను.
ఆ క్షణం అతను నన్ను ఏం చేసినా కాదని వుండేదాన్ని కాదేమో. కానీ. అతను దైవికంగా తొందరపడలేదు.
నానీ రావడంతో అతన్ని విడిపించుకుని దూరంగా నిలబడ్డాను.
అతను నానీని యెత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
“ఈ రోజు ఓ దేవత ప్రత్యక్షమై వరాలిచ్చింది. అందుగ్గాను మనం పార్టీ చేసుకోవాలి పద. పద. “అతను నానీతో చెబుతున్నట్లు చెప్పి కొంటెగా నావంక చూసి నవ్వేడు.
నేను నవ్వు దాచుకుంటూ నిలబడ్డాను.
అతను నానీని తీసుకుని నావైపే చూస్తూ నిలబడ్డాడు.

*****
మోహన్‌తో నా పరిచయాన్ని జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారన్న సంగతి నాకు తెలుసు.
అయితే ఎవరూ ఎదురుపడి నన్ను ప్రశ్నించలేదు.
కానీ.. జానకమ్మ ఆగలేదు.
ఆవిడకు అక్కరలేని విషయాలంటూ లేవు.
అందుకే ఓ రోజున నన్ను నిలేసింది.
“ఏమిటమ్మా స్వాతీ! ఆ కుర్రాడు రాని రోజు లేనట్టుంది. ఇది సంసారుల కొంప కదా. ఇలాంటివి యేం బాగుంటాయి చెప్పు”
నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. “ఇక్కడంత కాని పనులేం జరగడం లేదండీ. ఒక మగవాడు యింటికొస్తేనే సంసారుల కొంపలన్నీ సాని కొంపలయితే ప్రపంచంలో కొంపంటూ ఒక్కటీ వుండదు.”అన్నాను ఘాటుగా.
నేనంత గట్టిగా మాట్లాడటం జానకమ్మ ఎన్నడూ చూసి వుండలేదేమో, బిత్తరపోయి చూసింది.
ఆపైన సర్దుకుంటూ “అది కాదు తల్లీ! నీకు తల్లిలాంటి దాన్ని కాబట్టి చెబుతున్నా. ఒంటరిగా వున్న ఆడదాన్ని వెంటాడి వేపుకు తింటారీ మగాళ్ళు. నువ్వా మొగుడుపోయి ఏదో ప్రాణం చిక్కబట్టి కొడుకుతో కాలం గడుపుతున్నావు. రేపేదైనా పొరపాటు జరిగి అతను వుడాయిస్తే నువ్వు తిరిగి మనిషివి కాలేవు. అప్పుడు నీ ప్రాణంలో ప్రాణమైన నీ కొడుకు గతేమిటో ఆలోచించు!” అంది.
జానకమ్మ మాటలు నాకు విసుగు కలిగించేయి. “అంత అనర్ధం ఏమీ జరగదులెండీ. అతనూ, నేనూ పెళ్ళి చేసుకోబోతున్నాం” అన్నాను నవ్వుతూ.
జానకమ్మ కళ్లు తేలేసి చూస్తుంటే నేను నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయేను.
రెండ్రోజుల తర్వాత కాబోలు..
సాయంత్రం నేను ఒంటరిగా వస్తున్నాను. ఎవరో ఇద్దరు సైకిల్ మీద నన్ను వెంబడిస్తున్నట్లనిపించి వెనక్కి తిరిగి చూశాను.
అందులో ఒకడు కన్ను గీటి వెకిలిగా నవ్వేడు.
వాడు మా ఇంటి దగ్గరలో కిళ్లీ కొట్టువాడు.
నేను తల తిప్పుకొని వడివడిగా అడుగులేసేను.
వాడు చౌకరకం సినిమా పాట పాడుతూ వెంబడిస్తున్నాడు. నాకు ఆవేశం ముంచుకొచ్చింది. అయినా ఏమీ అనలేని పరిస్థితి. రోడ్డు మీద జనం కూడా అట్టే లేరు.
“పాపం అది పూర్ విడోరా! దానితో నీకు సరసం ఏమిట్రా?”
రెండోవాడు అంటున్నాడు.
“నీకు బుర్ర లేదురా సన్నాసి. విడో కాబట్టే సరసానికడ్డం వుండదు. ‘విదో’ అంటే లైన్ క్లియరని అర్ధం. కాబట్టి అందరూ సరసం ఆడొచ్చు. పైగా అదేం పత్రివ్రతనుకున్నావా. చాలా రోజుల్నుండి ఓ కస్టమరున్నాడులే..”వాడు పళ్లికిలిస్తూ చెబుతోంటే నా వళ్లంతా కోపంతో దహించుకుపోయింది.
వాణ్ని తప్పించుకునే ఉద్ధేశ్యంతో సందు మలుపు తిరిగేను. అప్పుడు గుర్తొచ్చింది మోహన్ వుండే రూం ఆ సందులోనేనని. కానీ. నేనెప్పుడూ అతని గదికి వెళ్లలేదు.
వెనక్కి తిరిగి చూసేను.
వాళ్లు వస్తూనే వున్నారు.
వెంటనే గబగబా మోహన్ వున్న యింట్లోకి వెళ్లాను. మోహన్ రూంలో లైటు వెలుగుతోంది.
మోహన్ మరో స్నేహితుడితో వున్నట్లుగా ఒకసారి మాటల సందర్భంలో చెప్పేడు. నేనదే మొదటిసారి రావటం.
తలుపు దగ్గరకేసుంది. రూంలో ఎవరున్నారో. సంశయంగా నిలబడ్డాను.
రూంలోంచి మాటలు వినపడుతున్నాయి. అందులో ఒకటి మోహన్ గొంతు.
నా పేరు విన్పించటంతో అప్రయత్నంగా నేనా మాటలు వినాల్సొచ్చింది.

ఇంకా వుంది.

1 thought on “చంద్రోదయం – 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *