March 4, 2024

తాత్పర్యం – 5 – అతడు

రచన: రామా చంద్రమౌళి

మనిషి శరీరం ఒక బయో వాచ్. ఇరవై నాలుగు గంటల సమయానికి సెట్ చేయబడి. . ట్యూన్ చేయబడి. . అసంకల్పిత నియంత్రణతో దానంతటదే నడిచే ఒక జీవవ్యవస్థ. ఈ రోజు ఈ క్షణం ఏమి చేస్తావో. . రేపు మళ్ళీ అదే సమయానికి అదే పనిని చేయాలనే అదృశ్య కుతూహలం. . అదే సమయానికి నిద్ర. . అదే సమయానికి ఆకలి. . అదే సమయానికి సెక్స్. . అదే సమయానికి తాగుడు కుతి. . అదే సమయానికి అదే . . ఏదైనా.
అతడు. . రాజు. . ఇరవై రెండేళ్ళ రాజు. . ఎస్సస్సి నాల్గుసార్లు తప్పి. . గవర్నమెంట్ టీచర్ ఐన అమ్మ నెత్తీ నోరూ బాదుకుని బలవంతంగా బతిలాడీ బతిలాడీ. . పంపితే. . ఇంటర్ ఎం పి సి. . లో చేరి. . ఉహూ. . చదువు అబ్బని రాజు. . తర్వాత. . ఆవారా. . బొగ్గుబావుల సింగరేణి బెల్ట్ లోకంలో. . బెల్లంపల్లి. . మందమర్రి. . రామగుండం. . గోదావరి ఖని. . కళ్ళు విశాలమై. . చూపులు విసృతమై. . ఆకలి ఆవులిస్తూ. . వయసు విచ్చుకుంటూ. . శరీరం ఒట్టి తినడానికీ తాగడానికే కాదు. . ఇంకేవేవో పనులకు కూడా అని. . తెలుసుకుంటూ. . నరాల్లో ఒక్క రక్తమే కాదు. . కొంత అగ్నికూడా ఉంటుందని. . దేహం దేహమంతా ఒక నిప్పులకొలిమిలా దహించుకుపోతూ లోలోపల దాహంతో రగిలిపోతూంటుందని. . తెలుసుకుంటూ. . అప్పుడప్పుడు తెలియని ‘ దేని ‘ కోసమో వెదుక్కుంటూ వెదుక్కుంటూ. . జవాబు దొరక్క. . మెల్లమెల్లగా. . సారా. . విస్కీ. . బ్రాందీ. . ఏదిబడితే అది తాగి. . బానిసగా మారుతున్న రాజు,
ఎనిమిది గంటలు. . రాత్రి. . పొద్దటినుండి ఒకటే వర్షం. ఎడతెగని వర్షం. . ముసురు కొద్దిసేపు. . మళ్ళీ చినుకులు ముదిరి జోరు వాన మరికొంతసేపు.
పైన రేకుల షెడ్ పై పడ్తున్న చినుకుల చప్పుడు. . ఒక రిథం. . లయ. .
ఎనిమిది కాగానే రాజు దేహమంతా దాహం దాహం. . బయో వాచ్ అరుస్తోంది. . అలార్మ్ మోగిస్తోంది . . మందు కావాలి. . ఎక్కడిదో అక్కడిది. . ఎవరో ఒకరితో. . ఏ రకంగానైనా సరే. . ఎలాగైనా సరే . . కొంత మందుకావాలి. . ఎలా. . ఎలా.
సరిగ్గా ఆ క్షణం మోగిందతని సెల్ ఫోన్.
“అరే రాజూ. . రెడీయేనా. . రానా నేను నీదగ్గరకు. . అక్కడే ఆ గూడ్స్ రేకుల షెడ్ దగ్గరే ఉన్నావుగదా. ” రఫీక్ గాడు.
ప్రాణం లేచొచ్చింది రాజుకు. రఫీక్ గాడైతే వెంటనే తప్పక మందు తీసుకుని వస్తాడు క్షణాల్లో. తెలుసు వాడికి తనకేమి కావాలో. చిన్ననాటి క్లాస్ మేట్ వాడు. . మొన్నటిదాకా నూకుడు బండిపై ఉల్లిగడ్డలమ్మే వాడు. . గత నాల్గు నెలలుగా తనతోనే ఇదే పని. . బొగ్గు దొంగతనం. రఫీక్ అంటే మెరుపు తీగ. . రఫీక్ అంటే స్పైడర్ మ్యాన్ కంటే చురుకు. . గెంతు గెంతితే రైలు డబ్బాలను దాటుకుంటూ సినిమాల్లోకంటే వేగంగా. . ఒకటే పరుగు. . ఒకటే ఉరుకు. . కన్ను తెరిచిమూసేలోగా మటుమాయం.
“తొందరగా వచ్చేయ్ రా. . చాలా చలిగా ఉండి. . వెచ్చగా మందు కావాలి ప్లీజ్. . ”
“మందు సరే గానీ. . నువ్వు రెడే కదా. . తొమ్మిదింబావుకు. . రైలు లక్ష్మీపురం. . యైటింక్లైన్ నడుమకు రాగానే . . హనుమంతుని గుడి ఇవతల. . అడ్డా. మొత్తం ముప్పై ఆరు మందిమి ఈ రాత్రి. . మొత్తం ఇరవై ఆరు టన్నులు డౌన్ లోడ్ కావాలి. మంచి క్వాలిటీ బొగ్గు వస్తోంది ఎన్ టి పి సి కి ఈ రాత్రి. . రైలు హనుమంతుని గుడి దాటిన అరగంటలోనే మన మనుషులు చకచకా బొగ్గునంతా గోతాల్లో కుట్టి. . అరగంటలో లారీలకెక్కిస్తారు. తెల్లారే సరికి ఆరు లారీల్లో మొత్తం ఎనిమిది పాయింట్స్ నుండి అరవై ఆరు టన్నుల బొగ్గు బాలానగర్ ఫౌండ్రీకి చేరిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ క్యాష్ అడ్వాన్స్ పే చేశారు. అరే వింటున్నావా రాజూ. . ”
“చెప్పు బే. . ఇంటానగాని మందు సంగతేందిరా. . దబ్బున తేరా సాలే. . స్పెషల్ పనికి స్పెషలేమీ లేదా మరి ”
“ఉన్నదున్నది. . ఈ రోజు. . క్వార్టర్ కు బదులు ఒక్కొక్కనికి హాఫ్ తెస్తాన ఇంపీరియల్ బ్లూ. హాఫ్ చికెం మంచూరియా. . ఓ కే నా. రెండు వందలకు బదులు. . ఈ రోజు మూడు వందలు. అన్నతోని బార్గెయిన్ చేసిన ఇవన్నీ. . ”
“అరే . . . మంచి బామ్మర్దివిగాని. . దబ్బున రారా. . పానం గోల చేస్తాంది. దా దా ”
“వస్తి. . ఐదు నిముషాలల్ల. . నా వెంట రాం రెడ్ది గాడు. . బషీర్ కూడా వస్తాండ్లు. . ఒ కే గదా. ”
“ఒ కే గనీ తొందర్గ రాండ్రా. ”
బయో వాచ్. . లోపల అలారం మ్రోగిస్తోంది. . ట్రన్ ట్రన్ ట్రన్. . ఆగకుండా. . నిర్విరామంగా. . బిగ్గరగా. . భీకరంగా.
కళ్ళు మూసుకున్నాడు రాజు.
అతనికి చాలా అసహనంగా. . చికాగ్గా. . ఎవరిమీదనో తెలియకనే కోపంగా. . విసుగ్గా ఉంది.
ఎవరిమీద. . ఎందుకు అసహనం.
తనమీద తనకే. . తన పట్ల తనకే అసహ్యం.
ఒక్క క్షణం. . ఏ ఎత్తైన కొండపైనుండో తనొక రాయిలా దొర్లుతూ దొర్లుతూ కిందికి జారి పడ్తూ పడ్తూ. . పాతాళంలోకి. . లోయల్లోకి. . రాలిపోతూ,
అకస్మాత్తుగా రెండు చేతులు. . ఆకాశమంతా వ్యాపించి. . కూలిపోతున్న తనను అమాంతం పట్టుకుని. . గుండెలకదుముకుని. . ఒడిలోకి తీసుకుని. ,
“అమ్మ. . అమ్మ. . అమ్మ . . రమణమ్మ. . తనకు తల్లి. . టీచర్. . గురువు. . దైవం. . అమ్మ”
“రాజూ. . ఒక్కసారి నా కళ్ళలోకి చూడరా. . నా తండ్రీ. . నాన్నా. . ఇటు. . నా వైపు. . నా కళ్ళలోకి. . ”
ఉహూ. . చూడలేకపోతున్నాడు తను. . అమ్మ కళ్ళలోకి సూటిగా చూడలేక,
సిగ్గు. . సిగ్గు. . అమ్మ ముఖంలోకి చూడ్దానికి సిగ్గు. . కూలిపోయాడు తను . శిథిలమైపోయాడు తను. బలహీనతలకూ. . వ్యసనాలకూ. . దురలవాట్లకూ బలైపోయి పతనమై తలదించుకుని. . ముఖం చెల్లని ఆత్మద్రోహ న్యూనతతో ఎప్పుడో చచ్చిపోయాడు తను.
కాని. . ఎందుకు. . ఎందుకిలా. . జరిగింది.
నాన్న జ్ఞాపకమొచ్చాడు రాజుకు అకస్మాత్తుగా.
నరేందర్. . ఓవర్ మ్యాన్. . సర్దార్. . బొగ్గు మనిషి. . చిన్నప్పటినుంచీ చూస్తున్నాడు నాన్నను. . మొత్తం బొగ్గే. మనిషి నల్లగా. . మనసు కూడా నల్లగానే. . ఎప్పుడూ మనిషి దగ్గర సారా వాసన. . ఆయన శరీరంలో రక్తముంటదా. . సారానే ఉంటదా అనిపించేది. బొగ్గు బాయిలోకి దిగితే మాత్రం మనిషి పులి. . గడ్డపార అందుకున్నడంటే బొగ్గు వాల్స్ బలబలా కూలి. . టన్నులకు టన్నుకు టబ్బుల్లోకి చేరి. . రికార్డ్ ప్రొడక్షన్. . నరేందర్ ట్రూప్ అంటే ఒక స్పెషల్ గుర్తింపు.
కాని ఏమిజరిగేదో. . తెలియదు. . ప్రతిరాత్రీ అమ్మ రమణమ్మకూ. . నాన్న నరేందర్ కూ. . గొడవ. . కొట్లాట. . తీవ్రమైన తిట్లు. . ఒకరినొకరు అవమానించుకోవడాలు. కోపంతో ఊగిపోతూ నాన్న అప్పుడప్పుడు అమ్మను కొట్టడాలు. . ఆమె నిశ్శబ్దంగానే ఆ హింసను భరిస్తూ. . ఒక్కోసారి రాత్రంతా ఏడ్వడాలు.
తర్వాత్తర్వాత అర్థమైంది తనకు. . అమ్మా నాన్న మధ్య ఉన్నవి వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాల వైరుధ్యాలని.
అమ్మది సాత్విక శాంత తత్వం. . ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూనే కనిపిస్తుందామె ఇప్పటికీ. పుస్తకాలవల్ల మనిషికి జ్ఞానం. . ధైర్యం వస్తుందని చెప్పేది తనకు. దాంతో కొన్నాళ్ళు పిచ్చిగా తనుకూడా అనేక పుస్తకాలను లైబ్రరీ నుండి తెచ్చుకుని రాత్రింబవళ్లు చదివేవాడు.
అమ్మ తనను బడికి తీసుకు పోతూ. . తను ప్రైవేట్ గా చదువుతూ. . క్వాలిఫికేషన్ను పెంచుకుంటూ. . బి. ఎ. . తర్వాత ఎం. ఎ. . ఆ తర్వాత బి. ఎడ్.
ఒకనాటి రాత్రి షిఫ్ట్ లో ఆరవ ఇంక్లైన్ లో డ్యూటీ చేస్తూండగా బొగ్గు గని. . రూఫ్ ఫాల్. . పైకప్పు కూలిపడి. . ముగ్గురు సజీవ సమాధి. . మరో నలుగురు తీవ్రంగా గాయపడి బతికి బయటపడుట. సమాధైన వాళ్ళలో. . నరేందర్. . నాన్న.
తాగుబోతు నరేందర్. . అస్తమయం. . మందమర్రిలో కోల్ కట్టర్స్ భాషలో అదీ జరిగింది.
ఈ బొగ్గు మనుషుల సంస్కృతి ఏమిటంటే. . దుఃఖమొచ్చినా. . సంతోషమైనా తాగుడే తాగుడు. . జల్సాలే జల్సాలు.
అమ్మకు రేండు ఉద్యోగాలొచ్చినై. . ఒకటి కంపాషనేట్ నియామకం. . సింగరేణి పాఠశాలలో టీచర్ గా. రెండవది. . డిఎస్సీ పరీక్ష రాసి స్వయం ప్రతిభతో సంపాదించుకున్న ప్రభుత్వ టీచర్ ఉద్యోగం.
అమ్మ తన వ్యక్తిత్వ పరిరక్షణ తత్వంతో ప్రభుత్వ టీచర్ గానే ఉద్యోగంలో చేరింది.
ఇక తర్వాత బెల్లంపల్లికి వలస.
అప్పుడప్పుడే హైస్కూల్ లోకి అడుగు పెడ్తూ. . తను.
కొత్త స్నేహాలు. . కొత్త ముఖాలు. . కొత్త ఊరు. . కొత్తగా శరీరంలో విజృంభిస్తున్న మార్పు. . ఎదుగుదల.
ఈ కోల్ బెల్ట్ ఏరియాలో. . ఒక రకమైన భిన్నమైన జీవన విధానం. . కల్చర్. . ప్రవర్తన. . విచ్చలవిడితనం. . దూకుడు. . సకల బలహీనతలతో కూడిన జీవితాన్ని స్వీకరించే తెగింపు ఉంటాయి.
అందరిలోనూ ఒక ” బలాదూర్” తత్వం.
ఆ తత్వమే మెల్లమెల్లగా బడికని వెళ్ళి. . మధ్యలో తప్పించి. . ఒక గ్రూప్ గా రైలు పట్టాల వెంటపడి. . ఎటో తెలియదు. . రైలు. . మాల్ గాడీల్లో దొంగతనాలు. . ధాన్యాన్నమ్మి. . పైసలతో. . సినిమాలు. . షికార్లు. . చేపలు పట్టడానికి చెరువుల వెంట. . సిగరెట్లు తాగడాలు. . డబ్బు లేకుంటే చిన్న చిన్న దొంగతనాలు. . నాల్గు రూపాయలు దొరికిన రోజు. . ఏ బార్ లోనో వెనుక రహస్యంగా కూర్చుని తాగడాలు.
తాగడమనేది. . ఎండు గడ్డి వాముకు నిప్పు అంటుకున్నట్టుంటది. బు ర్ ర్ ర్ మని మంట ఎగిసిందంటే. . క్షణాల్లో అంతా బూడిద. ఏమీ మిగలదు.
బాల్యంలో అలవాటైన తాగుడు. . ఇక ఎన్నడూ తెల్లారని చీకటి వంటిది.
తొమ్మిదవ తరగతి నుండి పదిలోకి అడుగు పెడ్తున్న సంధిసమయం. . వేసవికాలంలో. . పరిచయమైంది. . అప్పుడే కొత్తగా కొత్తగూడెం నుండి తన తండ్రి ట్రాన్స్ ఫరై వస్తే చేరిన అమ్మాయి. . జూలీ. మొట్టమొదటినాడు చూచినప్పుడు. . ఒక దిగ్భ్రాంతి. . షాక్. . స్టన్నింగ్ బ్యూటి. . ఆ అనుభూతి ఏమిటో అర్థంకాదు. . కాని ఇరవై నాల్గు గంటలూ ఆమెనే చూస్తూ కూర్చోవాలని పిచ్చి. . మైకం. . మత్తు. . చూస్తూంటే ఒళ్ళంతా తిమ్మిరి. . సలపరం. ఏదో ఒక నెపంతో ఊర్కే ఆమెతో మాట్లాడాలని తహతహ. . అదీగాక. . చిత్రంగా. . వాళ్ళకు క్వార్టర్ తమకు రెండిండ్ల అవతలనే అలాట్ కావడం. . ఇరవై నాలుగ్గంటలూ జూలీతో గడిపే అవకాశం. . తనుకూడా. . ఫరవాలేదు. . చూడ్డానికి బాగానే ఉంటాడు.
ఇక. . లోపల ఏదో కాగితాల మంట అంటుకుని ఎగిసెగిసి పడ్తున్నట్టు. . తగలబడిపోయేది శరీరం. . రాత్రింబవళ్ళు. అప్పుడడిగాడు తను తనకన్నా పెద్దవాడైన తన క్లాస్ మేట్ శంకరిగాన్ని. . ‘ ఏమిట్రా ఇది ‘ అని.
‘ వాడన్నాడు. . నువ్వు ఆ జూలీ అనే పోరిని ప్రేమిస్తున్నావని అర్థం ‘ . . నవ్వు. . తొండ నవ్వినట్టు. . వికారంగా.
ఓహో. . ఇది ప్రేమా. ? అనే కౌమార స్పృహ.
ఇక జూలీ వెంట తనొక పిచ్చి కుక్క. . ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆమె వెంటే. . బాడీగార్డ్. షాడో.
గర్వంగా ఉందేది జూలీకి తన అందానికి బానిసలై మగ పోరగాండ్లు వెంట పిచ్చోళ్ల్=ళై తిరగడం. చూపుల్లో. . ‘ సీ. . హౌ దీజ్ మ్యాడ్. . మగాళ్ళు ‘ అన్న ధీమా కనిపించేది. .
తనకు ఎందుకో గాని ఆమెకు దగ్గరయ్యే అవకాశం కల్పించి. . మత్తెక్కించేది. . ‘ మా ‘ టి వి ‘ డాన్స్ బేబీ డాన్స్ ‘ లో. . ‘ఆట ‘ వంటి వెకిలి డాన్స్ పోటీల్లో పాల్గొని ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేసేది. ‘ సీ హౌ సెక్సీ అయాం ‘ అనేది వంకర్లు తిరిగిపోతూ. ఆ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ ఆమె వెళ్తూంటే. . తనూ. . ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్. . ఆమె వెంటనే . . అంగరక్షకుల్లా.
అలా మొదలైన పిచ్చి. . ముదిరి ముదిరి. . వెంట చిత్తకార్తె కుక్కలా ఇంటర్ హెచ్ ఇ సి ఫైనల్ ఫెయిలయ్యేదాక తిరిగి తిరిగి . . తర్వాత జూలీ అన్నాళ్ళూ తెరవెనుక ఉండి కథ నడిపించిన బెంజమిన్ తో లేచిపొయ్యేదాకా,
ఒక. . ఆధ్యాయం. . ముగిసి,
నిప్పుకోడి ఇసుకలో తలదూర్చి. . ఉండీ ఉండీ. . తలెత్తేసరికి. . అంతా. . విషాదంగా. . వికారంగా. . భరించలేని బాధగా. . దుఃఖంగా,
తన పేరు అమ్మానాన్న పెట్టిన ‘ ఆనందరాజు ‘ కాస్తా ‘ దుఃఖరాజు ‘ గా మారి,
‘నీయమ్మ. తాగు. . తాగు. . దుఃఖాన్ని మరిచిపోయేందుకు ఇంకా ఇంకా తాగు. . మతితప్పి. . రోడ్ల ప్రక్కన మురిక్కాలువలో పడిపొయేదాకా తాగు. . దబ్బుల్లేకుంటే దొంగతనాలు చేసి తాగు. . దొంగతనాలు చేయడానికి ఒక గ్రూప్ కావాలి. . కదా. . అందుకు ఒక దొంగల గ్రూప్ లో కలువు. . అట్లా విస్తరణ. . జీవిత విషాద విస్తరణ. . థూ నీయమ్మ. . జూలీ. . తప్పిపోయిన ఇంటర్. . అప్పుడప్పుడు పట్టుపడ్తే పోలీసుల సహవాసం. . లాఠీ దెబ్బలు. ,
జీవితంలోకి చీకటి రాలేదు. . తనే కావాలని చేజేతులా చీకట్లోకి వెళ్ళి ముఖాన్ని నలుపు ఇంక్ తో రుద్దుకున్నాడు. . అప్పుడు. . ఆ నలుపు బొగ్గు ముఖంతో నడివీధిలో తాను నిలబడ్డప్పుడు పరిచయమైన వాడు. . దేవేశ్వర్.
దేవేశ్వర్. . ఒక బొగ్గు డాన్. . మాఫియా.
దేవేశ్వర్. . ఒక బొగ్గు డాన్. . మాఫియా.
రోజుకు దాదాపు రెండు వందల టన్నుల సింగరేణి క్వాలిటీ బొగ్గును దొంగతనం చేసి. . హైదరాబాద్. . నాగపూర్. . రంగారెడ్డి జిల్లాల్లో బాజాప్తాగా అమ్మి నెలకు ఏ రెండువందల కోట్లనో సంపాదించే డాన్ అతడు . నెలకు రెండు వందల కోట్ల అతని సంపాదనలో. . దాదాపు ఇరవై కోట్లు సింగరేణి ఆఫీసర్లకు. . ఇంకో ఇరవై కోట్లు పోలీసోల్లకు. . పది పదిహేను కోట్లు రైల్ వే సిబ్బందికి,డ్రైవర్లకు. . లారీలను పట్టుకోకుండా పది కోట్లు ఆర్ టి ఎ ఆఫీసర్లకు. . దొంగ వే బిల్లులు. . మేనేజ్ చేయడానికి. . గుండాలను మేపడానికి ఇంకో పది కోట్లు. . అడ్డు తగలకుండా కిక్కుమనకుండా అన్నీ మూసుకుని ఉండడానికి రాజకీయ నాయకులకు ఓ ఇరవై ఐదు కోట్లు. . తమ వంటి అసలు దొంగ కార్యశూరులకు ఖర్చు ఓ పది కోట్లు. . అన్నీ పోను దేవేశ్వర్ నెల ఆదాయం పది కోట్లు.
ఇదంతా గత పదేళ్ళుగా జరుగుతున్న బహిరంగ రహస్యమే. కోల్ బెల్ట్ జనమందరికీ సుపరిచితమైన బిజినెస్సే.
ప్రజాస్వామ్య దేశాల్లో చాలా బహిరంగంగానే జరుగుతున్న అకృత్యాలు కోకొల్లలు. . ఎన్నో.
వర్షం ఇంకా జోరుగా కురుస్తూనే ఉంది.
బయట ఐదారు మోటార్ సైకిళ్ళు ఆగిన చప్పుడు. . మనుషులు గుంపులుగా దిగి. . హడావిడిగా వస్తున్న అలికిడి. . చుట్టూ చీకటి. . చినుకుల లయాత్మక ధ్వని రేకులపై. బయట చెట్టు దగ్గర పచ్చగా బలహీనమైన లైట్ వెలుగు.
రఫీక్. . సారయ్య. . దుర్గారావ్. . మస్తాన్. . అబ్రహం. . ఇంకెవరెవరో. . మొత్తం దాదాపు ఎనిమిది మంది. . ఒళ్లంతా తడిచి. . నెత్తులపైనుండి నీళ్ళు కారుతూ,
“అరేయ్. . రాజూ. . హర్రీ. . టైమైతాంది. . అరగంటలో అక్కడుండాలె. దబ్బ దబ్బ కానీయుండ్లి. . ఊ. . పట్టు. . ”
చేతిలోని ప్లాస్టిక్ సంచీనుండి. . ఎదురుగా ఉన్న పాత రేకు టేబుల్ పై. . ఇంపీరియల్ బ్లూ. . హాఫ్ సీసాలు. . చికెన్ మంచూరియా పొట్లాలు. . ప్లాస్టిక్ వాటర్ పొట్లాలు. . పరిచి “ఊ. . కానీయుండ్లి ” అని ఫర్ ర్ ర్ న ఒక సీసా మూతిని విప్పి. . డిస్పోసబుల్ గ్లాస్ లోకి వంచి. . పళ్ళతో నీటి సంచి మూతిని కొరికి. . వంచి,
అమృతతుల్యమైన మనిషి రక్తం మద్యాన్ని విషంలా స్వీకరించి. . తనలో లీనం చేసుకుంటూ. . మత్తును మహత్తరమైన మెదడులోకి చిమ్ముతూ,
ఒక ఇరవై నిముషాల్లో. . మనుషులు క్రమంగా మృగాలుగా పరివర్తన చెందుతూండగా వచ్చాయి ఐదారు ఆటోలు. . సెవన్ సీటర్లు.
గబగబా మూతులు తుడుచుకుంటూ. . బిలబిలా ఆటోల్లో ఎక్కి,
“అరే రాజూ. . ఈ రోజు దబుల్ ధమాకారా. ఈ వన్ సిక్స్టీ బండి పోయిన తర్వాత మరో గంటకే ఇంకో బండిని 16 రేక్స్ తో రిలీజ్ చేస్తాండ్లు ఎన్ టి పి సి కి. . స్పెషల్ కోల్ అది. ఎక్కువ మొత్తంలో తోడాలె. మనిషికి ఐదు వందలు. . ఇంకో హాఫ్ బాటిల్ బోనస్. . ఒకే. . ” అన్నాడు రఫీక్ అరుస్తున్నట్టు బిగ్గరగా. . అందరికి వినబడేట్టు.
“వావ్. . దబల్ ధమాకా. . సాలే. . పా ”
ఆటోల దండు కదిలింది.
రఫీక్ వెంటనే పరిస్థితులను దేవేశ్వర్ కు సెల్ ఫోన్ లో చెప్పాడు. . చిన్న గొంతుతో. . ” అన్నా. . అన్నా. ” అని.
పది నిముషాల్లో. . అందరూ. . యైట్ ఇంక్లైన్ కాలనీ. . లక్ష్మీపూర్ మధ్య. . హనుమంతుని గుట్ట దగ్గర. . వర్షంలో గుంపుగా నిలబడి. ,
ప్లానింగ్. . రఫీక్ చెబుతున్నాడు. . ” అరే రాజు నువ్వూ. . నీ వెంట వెంకట్ తోపాటు ఇంకా ఎనిమిది మంది. . మర్రి చెట్టు కొమ్మలపైనుండి ఎనిమిది డబ్బాల మీదికి దూకుతరు. . ఇవ్వాళ డ్రైవర్ సాలమన్ ఉన్నాడు. చెప్పిన. స్పీడ్ పదే ఉంటది. . రేక్ లోడిం దగ్గర కూడా మేనేజ్ చేసిన. లోడ్ లో పెద్ద పెద్ద బొగ్గు పెళ్లలే ఉంటై. దబ్బ దబ్బ పెద్ద పెద్ద పెళ్లలను ఏరి. . ఎడ్జ్ మీద పెట్టి. . బుర్రి వాగు దగ్గరికి రాంగనే. . ఎర్కే గద. . సప్ప సప్ప పెళ్ళలను బైటికి నూకెయ్యాలె. అక్కడ మనోళ్ళు ఇరవై రెండు మందున్నరు. అరగంటల బొగ్గునంతా గోతాలల్ల నింపి కుడ్తరు. . సమజైందా. . ఇగోండ్లి మనిషికి మూడు వందలు. . ఈ పనై పోంగనే తొమ్మిదిన్నరకు మళ్ళచ్చి మనిషికి ఐదు వందలిస్త. . సెకండ్ ట్రైన్ కు. . ఓ కే నా. ”
“ఓ కే. . ” మనుషులు మరుక్షణం మాయమయ్యారు. . అందరూ సైనికుల్లా క్రమశిక్షణతో.
దొంగల్లో సైనికులకంటే ఎక్కువ క్రమశిక్షణ ఉంటుంది. నిబద్ధత ఉంటుంది. నిజాయితీ ఉంటుంది. . కట్టు ఉంటుంది.
చూస్తూండగానే. . ముఖంపై ఫ్లడ్ లైట్ ను ధరించి రొప్పుతూ. . మెల్లగా. . గర్భినీ స్త్రీలా వస్తూ కనబడింది. . బొగ్గు బండి. . వన్ సిక్స్టీ.
మర్రి చెట్టు. . లోడెడ్. . ఎనిమిది మందితో. చెట్టు దగ్గరికి రాగానే డ్రైవర్ సాలమన్ ప్లాన్ ప్రకారం రైలు స్పీడ్ ను ఇంకా తగ్గించగానే. . దబదబా అందరూ డబ్బాలపైకి దూకి,
దోపిడి. . సామూహిక దోపిడి. . పెద్ద పెద్ద బొగ్గు పెళ్లలు. . పిడుగుల్లా పడిపోతున్నాయి మహోదృతంగా ట్రాక్ ప్రక్కన.
వర్షం కురుస్తూనే ఉంది. . ఎడతెగకుండా.
మొత్తం పదిహేను నిముషాలు. . అంతే. . ఇరవై ఐదు టన్నుల బొగ్గు పడిపోయింది బయట.
ఈ లోగా. . ఎక్కడినుండో. . విజిల్స్. . కేకలు. . ఈలలు. . టార్చి లైట్లతో. . గుంపులు గుంపులుగా వెలుగులు. . రైలు వేగాన్ని పుంజుకుంది చటుక్కున. వ్యాగన్లపై నున్న వాళ్ళు చకచకా దిగి పారిపోబోయి. . వర్షంలో జారుతూ. . పట్టు తప్పుతూ.
పోలీసులా. . అన్ని ఏర్పాట్లూ చేశారుగదా. . మరి ?
రాజు. . వేగం అందుకున్న వ్యాగన్ మూలపైనుండి. . చటుక్కున కిందకు దూకి. . కింది కంకర రాళ్లపైబడి. . కాళ్ళు రక్కుకుపోయి. . మోకాళ్ళు చితికినట్టై,
ఒకటే పరుగు. . పరుగు. . చీకట్లోకి.
చూస్తూండగానే. . రైలు వేగాన్నందుకుని. . దూరంగా చీకట్లోకి మాయమై,
మళ్ళీ అంతా మామూలే. . చిక్కని చీకటి. . చిక్కగా వాన. . గడ్డకట్టిన నిశ్శబ్దం.
పరుగు పరుగులతో. . అందరూ. . ఎనిమిది మంది. . పాడుబడ్డ గుడి దగ్గర కలుసుకుని,
రఫీక్ వచ్చాడు. . ఎక్కడినుండో. . చటుక్కున. ” అరే భాయ్. . వర్రీ కావద్దు. . ఒక ట్రయల్ వేశారు విజిలెన్స్ వాళ్ళు. . లాగ్ బుక్ లో రాసుకుంటారు వాళ్ళంతే. . రైడింగ్ మేడ్. . అని. ”
“హమ్మయ్య. . భయపెట్టిండ్లు గద బే. . సాలె ” నవ్వులు. . పకపకా.
రాజు. . రేకుల షెడ్ లోకి వెళ్ళి గుడ్డి వెలుతురులో పగిలిన మోకాళ్ల దిక్కు చూచుకున్నాడు. . రక్తం కారుతోంది. . ఎర్రగా.
ఎందుకో రాజుకు. . తల్లి రమణమ్మ జ్ఞాపకమొచ్చింది. ముఖం దీనంగా. . అలసటగా. . దైన్యంతో. . చేతులు చాచి పిలుస్తున్నట్టు,
ఎల్ కే జి లో తనను బడికి తీసుకు పోతూ అమ్మ . . ఒక రోజు. . అకస్మాత్తుగా వర్షం కురుస్తే. . తనుమాత్రం వానలో తడిచి ముద్దైపోతూ. . గొడుగును. . తన నెత్తిపై పట్టి. . అమ్మ. . అమ్మ.
ఎందుకురా రాజూ. . చక్కగా చదువుకుని. . వృద్ధిలోకొచ్చి. . బాగుపడక. . ఈ చెడు తిరుగుళ్లు. . తాగుడు.
తాగుడు. . వంశ పారంపర్యంగా. . జీన్స్ ద్వారా సంక్రమిస్తుందా. ?. . వ్చ్.
కళ్ళు మూసుకున్న రాజుకు . . హాఫ్ తాగిన మెదడులోకి అమ్మ లీలగా. . మాయగా. . ఒక వీడియో చిత్రంలా. . కనబడ్తూ,
రజియా జ్ఞాపకమొచ్చింది.
రఫీక్ గాని చెల్లెలు. . ” ప్యార్ హై ముఝే తేరేసే ” అంటుంది. . అని ఒకరోజు తన గదికి పిలుచుకుని. . కౌగలించుకుని. . ముద్దెట్టుకుని. . పైపైబడి,
స్త్రీలు. . చిన్నప్పుడే ప్రవేశించిన. . జూలీ. . నిరంతరమై ప్రాధేయబడ్ద అమ్మ. . పైకి నిప్పు వరదలా ఎగబ్రాకే రజియా. . స్త్రీలు.
కళ్ళూ మూసుకుంటే. . ఎప్పుడు నిద్ర పట్టిందో. .
రఫీక్ వచ్చి తట్టి లేపుతూ. . కళ్ళు తెరవగానే. . ఒక ఐదు వందల రూపాయల నోటునిచ్చి. . మరో హాఫ్ బాటిల్ విస్కీ,” కమాన్. . కమాన్. . రైలొస్తాందీ. . పా పా. ” అని బలవంతంగా ఆటోలోకెక్కించి. . పరుగు. . పరుగు. . చీకట్లో. . వర్షంలో.
ఐపోయింది. . అమ్ముడుపోయిండు తను. . తప్పించుకోవడం కష్టం.
“అమ్మా. . వద్దు. . వద్దు నాకీ జీవితం. . ఈ తాగుడు. . ఈ బతుకు. . ఈ బానిసతనం. . ఈ దిక్కుమాలిన బికారి జీవితం. . వస్తున్నానమ్మ . . తెల్లవారనీ ఈ రాత్రి. . నీ ఒడిలోకొస్తానమ్మా. . ”
వర్షం ఆగదు ఒక్క క్షణమైనా. . ఒకటే కుండపోత.
దూరంగా రైలు. . తీక్షణమైన ఫ్లడ్ లైట్ కాంతితో. . మెల్లగా రొప్పుతూ.
డబుల్ ధమాకా. . ఐదు వందల కూలీ. . హాఫ్ బాటిల్ నజ్రానా. . థూ నీయమ్మ. .
తప్పదు. . ఉరికురికి. . మర్రి చెట్టెక్కి. . కోతిలా కొమ్మలపైకి ఎగబ్రాకుతూ. ,
వస్తోంది రైలు. . దూకాలి. . దూకాలిక. . క్షణకాలంలో.
ఎందుకో. . మెల్లగా పది కిలోమీటర్ల వేగంతో వస్తున్న బండి. . సడెన్ గా వేగం పెంచుకుని. . రయ్ మని,
ఠప్పున దూకాడు రాజు వ్యాగన్ పైకి. కాని వేగం. . దూకే స్పీడ్ మ్యాచ్ కాలేదు. . వ్యాగన్ మధ్యలోకి చేరవలసిన వాడు వ్యాగన్ అంచుపై బడి. . కమ్మీకి ఫడేల్మని కొట్టుకుని. . ఒక బుల్లెట్ షాట్ తాకినట్టయి, ధబేల్మని కిందపడి. . జారుతూ. . క్షణకాలంలో పట్టాలమీదికొచ్చి. . ఇరుక్కుపోయి. . లిప్తకాలంలో. . పైనుండి. . వేగాన్నందుకున్న రైలు చక్రాలు దడదడా. . ,
ఎర్రగా రక్తం. . చిద్రమై నుగ్గు నుగ్గౌతున్న శరీరం. . ముక్కలు ముక్కలై విడివడిపోతున్న అవయవాలు. . చుట్టూ చీకట్లో ఎవరికీ కనిపించని రక్తపు మడుగు.
గాలిలో కలిసిపోయిన ” అమ్మామ్మా. . . “అన్న గావుకేక.
తర్వాత అంతా నిశ్శబ్దం.
మెల్లగా. . దూరమై పోతూ. . గాలిలో కలిసిపోయిన బొగ్గు రైలు ధ్వని. . కొద్దికొద్దిగా పల్చబడి తగ్గుతున్న వాన. . చుట్టూ చీకటి. .
ఎవరు చెట్టుపైనుండి దిగి ఎటు పారిపోయారో. . ఎక్కడ దాక్కున్నారో. . ఏమై పోయారో. . రఫీక్ ఎక్కడ. . వెంకట్ ఎక్కడ. . శ్రీకాంత్ ఎక్కడ?. . బొగ్గు. . రైలు. . ఇంపీరియల్ బ్లూ. . రజియా. . జూలీ. . మాసిపోతూ మిణుక్కు మిణుక్కు మని మెరిసే నాన్న నరేందర్ జ్ఞాపకాలు. . జీవితమంతా తనను బ్రతిలాడుతూనే ఉన్న అమ్మ రమణమ్మ. . వీళ్లంతా ఎవరు. . ఎవరికెవరు.
ఆ రాత్రి. . ఆ రైలు పట్టాలపై. . ముక్కలు ముక్కలుగా. . పడి ఉన్న రాజు శరీరం. . ఒక ప్రశ్న.
మనుషులు తమను తాము ఎలా ద్వంసించుకుంటారో . . ఎలా మిణుగురు పురుగులా హననమైపోతారో. . అని ఒక ఘటన. . ఒక మరక. . చీకటి మరక. . బొగ్గు మరక.
రాజు. . అతడు. . ఒక మరక. *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *