June 24, 2024

తామసి – 13

రచన: మాలతి దేచిరాజు

CYBERABAD COMMISSIONER OFFICE ముందు ఆగింది ఏ.సి.పి. రుద్రాక్ష్ కార్.
కారులో నుంచి దిగగానే,
“గుడ్ మార్నింగ్ సార్!” సెల్యూట్ చేసాడు..పీ.సి.
తనూ చేసాడు. లోపలికి నడుస్తుండగా ఎదురయ్యాడు సి..ఐ..సాగర్.
“ఇంతకీ ఆ శవం ఎవరిదో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా?” అడిగాడు రుద్రాక్ష్
“ఇప్పుడే ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి సార్… మీ టేబుల్ మీద పెట్టాను.” అనగానే తన క్యాబిన్ లోకి తలుపు తోసుకుని వెళ్ళాడు రుద్రాక్ష్. టేబుల్ పైన ఉన్న ఫైల్ తీసుకుని చూస్తున్నాడు. కళ్ళతోనే రిపోర్ట్ చదివాడు.
“బాడీ మార్చ్యురి లోనే ఉందా?”
“ఎస్ సార్.” ఫైల్ మూసాడు.

***

గౌతమ్ ఇల్లు…
“సీమా… తలనొప్పిగా ఉంది… కాఫీ ప్లీజ్!” బెడ్ రూమ్ నుంచి హాల్లోకి వినిపించేలా అన్నాడు గౌతమ్…
మంచం మీద బోర్లా పడుకుని…కాసేపటికి అతనికి కాఫీ సువాసన తెలిసింది. కళ్ళు తెరిచి తీసుకుంటుండగా చూస్తే ఎదురుగా షీబా.
“నువ్వు తెచ్చావేంటి? సీమా లేదా?”అతనలా అనడం అదే మొదటిసారి అయినట్టు చూస్తోంది.
“సీమా లాన్ లో ఉంది.. అందుకే నేను తెచ్చా.” చెప్పింది తను.
“కూల్…” అంటూ అందుకున్నాడు కాఫీ. ఒక సిప్ చేసాడు..₹ కళ్ళు పెద్దవి చేసి తలూపాడు,
బావుంది అన్నట్టు… నవ్వి వెళ్ళిపోయింది తను..
హాల్లోకి వచ్చి,
“సీమా బోర్ కొడుతుంది సినిమాకెళదామా?” అన్నాడు.
సరే అంది తను… గౌతమ్ లోపలికి వెళ్ళాడు రెడీ అవడానికి. సీమా కూడా వెళ్ళింది. షీబా వంటింట్లో ఉంది.
“సీమా రెడీయా?”వస్తున్నా అంది తను లోపల నుంచే.
“నైస్ డ్రెస్.” అన్నాడు తనని చూసి…
ఇంతలో షీబా కూడా వచ్చింది.
“నువ్వు కూడా వస్తున్నావా?” అడిగాడు గౌతమ్.
ఆమె భృకుటి ముడిపడింది.
“అదేంటి అలా అడిగావ్?” అంది తను.
“ఇవాళ సీమాతో వెళ్లాలని ఉంది… మనం ఇంకోసారి వెళదాం షీబా.” మనసుని నొప్పించే మాట అది. గుండె నుంచి ఒక్కసారిగా ఉబికొచ్చి గొంతులో అడ్డం పడింది బాధ. తలూపింది తను నవ్వుతూ. సీమా ఏమీ మాట్లాడలేదు. బహుశా అది ఇంకా బాధించి ఉండచ్చు షీబాని. కారెక్కి బయల్దేరారు ఇద్దరూ…
“నీకసలు కామన్ సెన్స్ ఉందా? అలా మొహం మీద చెప్పేస్తావా నాతో వెళ్ళాలనుందని…”గదమాయించింది.
“అందులో తప్పేముంది? నాకు నీతో వెళ్లాలని ఉంది. అదే చెప్పాను.”
“అది నిజమే గౌతమ్, బట్… కొంచెం వేరే విధంగా చెప్పాల్సింది… లేదా నీకు నాతో వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పుడు నాకు మాత్రమే చెప్పాల్సింది. ఓపెన్ గా చెప్పి చివర్లో అలా అంటే ఎవరు మాత్రం హర్ట్ అవ్వరు చెప్పు? పాపం షీబా ఎంత ఫీల్ అయ్యిందో, ఏంటో…”
అయ్యి ఉంటుందా…అన్నట్టు చూసాడు గౌతమ్, సీమా వైపు.
సినిమా చూసి ఇంటికొచ్చారు ఇద్దరూ… కాలింగ్ బెల్ కొట్టిన కొద్దిసేపటికీ తలుపు తీసింది షీబా.
“తిన్నావా? నువ్వు…” లోపలికొస్తూనే అడిగింది సీమా.
“ఇంకా లేదు, మీరొచ్చాక తిందామని..” చెప్పింది తను… గౌతమ్, సీమా ముఖాలు చూసుకున్నారు. గౌతమ్ తో
“ఎట్లీష్ట్ ఒక కాల్ చేసి చెబ్దాం అని చెప్పా , విన్నావా? సారీ షీబా, దారిలో ఫ్రెండ్ కలిస్తే డిన్నర్ చేసి వచ్చాం …రియల్లీ సారీ రా…” అంది సీమా.
“ఇట్స్ ఓకే…” అంది తను అరువు తెచ్చుకున్న నవ్వోటి నవ్వి.
“బట్ నేను నీకు కంపెనీ ఇస్తా…రా…” అనగానే ఇద్దరూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సీమా వడ్డించింది. తప్పదన్నట్టు తింటోంది షీబా. సీమా కూడా తన ప్లేట్ లో నుంచి రెండు ముద్దలు తిన్నది. పది నిమిషాల్లోభోజనం ముగిసింది. కబుర్లు కూడా… ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు.

***

అర్ధరాత్రి. సమయం ఒంటి గంట కావొస్తుంది… షీబాకి నిద్ర పట్టట్లేదు. జీవితం ఎటు పోతోంది? తనెటు పోతోంది? ఇదే ఆలోచన… తనకంటూ ఒక మనిషి, తనకంటూ ఒక సంసారం, తనకంటూ పిల్లలు… ఇవేవీ లేకుండానే జీవితం పూర్తై పోతుందా? ఎలాంటి ముచ్చట్లు తీరకుండానే చీకట్లో కలిసిపోతుందా? మనిషిని,మనసుని పంచుకోవడం అంత తేలిక్కాదు కాబోలు… కానీ ఇప్పుడనుకుని ఏం లాభం? అన్నీ తెలిసేకదా తనొచ్చింది! కోరుకున్నవాడి కోసం ఇంతకన్నా ఏం చేయగలదు తను మాత్రం? ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది… నలుగురిలో ఉన్నప్పుడు పక్కన ఎవరున్నా పర్లేదు, కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు మన అనుకునే మనిషి ఉండాలి. మన సొంతం అనుకునే మనిషి ఉండాలి… కిర్..ర్.ర్.ర్…తలుపు తెరుచుకున్న చప్పుడు విని గుర్తించింది తను. తలుపు కూడా వేసుకోలేదని. అయినా ఈ టైం లో ఎవరూ? అనుకుంటూ తిరిగింది. ఎదురుగా గౌతమ్… టక్కున లేచి కూర్చుంది..
“ఇంకా పడుకోలేదా?” లోపలికొస్తూనే అడిగాడు.
“నిద్ర పట్టట్లేదు…” అతను కూర్చోడానికి చోటిచ్చి అంది. ఆమె పక్కన కూర్చుంటూ, “సారీ…” చెప్పాడు..
“దేనికి?” తెలిసే అడిగింది..
“సాయంత్రం నేనలా అని ఉండకూడదు…” పశ్చాత్తాపం కనిపించింది.
“పర్లేదు గౌతమ్… ఇలాంటి జీవితం కోరుకున్నప్పుడు కొన్ని భరించాలి తప్పదు.”
“ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించలేం కదా షీబా? ఒక్కోసారి ఒక్కో ఫీలింగ్…” తల పంకించింది అవునన్నట్టు…
ఆ మాటలో మరో అర్థం కూడా గోచరించింది ఆమెకి.
“ఇప్పుడు నా పై ఫీలింగ్సా? సినిమాలకీ, షికార్లకి…తనతో… సరదాలకి,సరసాలకి నాతోనా?” పైకనలేని మాటలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థమైంది తనకి.
“ఏం ఆలోచిస్తున్నావ్?” అన్న అతని మాటకి తేరుకుని, తల అడ్డంగా ఊపింది ఏం లేదని.
ఆమెని నెమ్మదిగా దగ్గరకి తీసుకున్నాడతను. ఒళ్ళంతా ముడుచుకుపోతున్నట్టుగా అతని ఒడిలో ఒదిగిపోయింది పసి పాపలా.
ఆమె చెవిపై పడుతున్న ముంగురులని సరి చేస్తూ ఉంటే… పరవశం కలుగుతోంది తనకి… కాలం ఇక్కడే ఆగిపోతే బావుణ్ణు అనిపించింది ఒక్కసారిగా. నచ్చిన స్పర్శలో తీపి అది. అది ప్రేమా? కాదు… శృంగారమా? కాదు… సరసమా? అంతకంటే కాదు… మరేంటది? అక్షరాలు, అర్థాలు అక్కరలేని భావమది. ఎంత ఎదిగినా ఎవరో ఒకరి ఒడిలో ఒదగనిదే మనిషికి స్వాంతన కలగదు.
అతను ఇప్పుడు ఆమె చెంపలు నిమురుతున్నాడు. చిగురాకుపై మంచు తునకల్ని చల్లగాలి మోసుకొచ్చి చల్లినట్టు ఉంది ఆ స్పర్శ. మృదువుగా పాలమీగడని తెచ్చి పచ్చి బుగ్గపై పూస్తున్నట్టు ఉంది అతనలా నిమురుతుంటే. ఒక్కసారిగా ముఖంపై పడుతున్న కురులని మొత్తంగా అరచేత్తో పక్కకు జరుపుతున్నప్పుడు మూతపడిన కళ్ళ వెనక సంగతులని ఎన్ని రెప్పల సడులలో వినిపించాలో, అదురుతున్న అధరాల మాటు నులి వెచ్చని చుంబనపు తీపిని అతని ఆణువణువులో ఎలా ఒలికించాలో… అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పచ్చని ఆశని ఏ ఒంపుల మెలికల కదలికలతో వివరించాలో… అనుకుంటూ కళ్ళు తెరిచి అతడ్ని చూసింది.
అతని కళ్ళలో సాక్షాత్కారమైన ఆమె ముఖారవిందం… సముద్రపు దోసిట్లో చందమామలా వెలుగుతోంది. రెప్పార్పక చూస్తున్న ఆమె చూపు చెదిరేలా… ఉఫ్.ఫ్.ఫ్ ..అని ఊదుతున్నాడు. తెమ్మెరై చేరుకున్న చెమట అంతా ఆవిరైపోయింది, అతడి వెచ్చని శ్వాస తాకి… అప్పుడు పుట్టుకొస్తుంది ఎద లోపలి నుంచి ఒక గమ్మత్తైన భావన… అమాంతం హత్తుకోవాలనిపించేలా… తనూ అదే చేసింది… అతడు సహకరించాడు. కాసేపు గాఢ కౌగిలిలో మునిగి తేలాక అన్నాడతను…
“నువ్వు ఐ లవ్ యు చెప్తే బావుంటుంది…” అని ఇప్పుడు చెప్పమని చెప్పకనే చెబుతూ.
అతనికి సైతం వినిపించనట్టుగా… చెవులకి మాత్రమే వినిపించేంత నిశ్శబ్దంగా చెప్పింది తను.
“ఐ….లవ్…..యు…” అని… కొన్ని మాటలుంటాయి, కొందరు చెప్తేనే బావుంటాయి… కొన్ని భావాలుంటాయి, అవి మాటల్లో చెప్తేనే బావుంటాయి… కొన్ని భావాల్ని కొందరు మాటల్లో చెప్తేనే బావుంటాయి… చెప్పే విధానం బట్టి భావ ప్రకటన ఉంటుంది… వినేవాళ్ళకి భావప్రాప్తి కలుగుతుంది… ఆమె నోటివెంట ఆ మాట వినడం అది ఎన్నో సారో తెలీదు అతనికి, కానీ మొదటిసారి విన్నప్పుడు ఎంత అనుభూతి కలిగిందో, విన్న ప్రతిసారీ అంతే… ఇప్పుడూ అంతే. మాటలో ఏమీ ఉండదు…అది చెప్పే వాళ్ళని బట్టి ఆ మాట లోతు తెలుస్తుంది.
“పడుకో…” అని తలగడ సర్దాడు. ఆమె బరువెక్కిన భావాన్నేదో గుండెపై మోస్తూ ఒరిగింది.
తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టి… గుడ్ నైట్ చెప్పి కదలబోయాడు, ఇంతకు మించిన శృంగారం, రసజ్ఞత ఏం ఉంటుందన్నట్టు…
కానీ… ఆమెకి మాత్రం పున్నమి చంద్రుడు సముద్రంలో అలల్ని రెచ్చగొట్టి అందకుండా వెళిపోతున్న భావన… కాదు కాదు తెల్లారిపోతుందేమో అన్న బెంగ. అతను తలుపు దాటి వెళ్ళేవరకు చూస్తూనే ఉంది తను. అటు, ఇటు తిరిగింది నిద్ర మాత్రం పట్టలేదు… లేచి హాల్లోకి వచ్చి ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసి నీళ్ళు తాగుతుంటే వినిపించింది తనకి… గాల్లో తేలి తేలి వచ్చిన గుసగుసేదో… సీమా గది నుంచి వస్తోందా గుసగుస…
తన ప్రమేయం లేకుండానే అటు కదిలింది తను. తలుపు దగ్గరకెళ్ళే కొద్ది పెరుగుతుందా గుసగుస… తను తలుపు దగ్గర దాకా వెళ్ళింది. నవ్వులు, ఇకఇకలు, పకపకలు. తలుపు పక్కన ఉన్న కిటికీ తెరిచి ఉంది కొద్దిగా. నెమ్మదిగా తెరిచి పరదా జరిపింది. చప్పున మూసేసింది. తన మనసు ద్రవించింది. గుక్కపెట్టి ఏడుస్తూ అలా కూర్చుండిపోయింది… తన మీద తనకే అసహ్యం కలిగింది… ఎందుకొచ్చిన బ్రతుకు? అని తల కొట్టుకుంది… ఆ రాత్రి తన నిద్ర ఎక్కడో తప్పిపోయింది.

******

తెల్లవారింది…
సీమా పొద్దునే లేచి రెడీ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ లేదు. షీబా గది తలుపు తీసిలేదు. దానర్థం తనింకా లేవలేదు. తలుపు కొట్టింది సీమా. కాసేపటికి తెరిచింది షీబా.
“ఒంట్లో బాలేదా?” అడిగింది.
“అదేం లేదు.” అంది తను
“మరి రోజూ పొద్దున్నే లేచి టిఫిన్,లంచ్ బాక్స్ రెడీ చేసేదానివి, ఇవ్వాళ ఏమైంది?”
“మనసేమి బాలేదు…ఇవ్వాల్టికి నువ్వే చేస్కో.”అని తలుపేసింది మొహం మీద.
“ఏమైంది దీనికి?” అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది సీమా.
గౌతమ్ లేచి ఆఫీస్ కి వెళుతుంటే క్యారేజ్ ఇవ్వబోయింది సీమా.
“షీబా లేదా?” అడిగాడు.
“తనకి ఒంట్లో బాలేదు, సో ఇవాళ నా వంట…”
“ఓహ్… ఏమైంది?” అని తన గది వైపు వెళుతుంటే…ఆపింది.
“ఏం లేదు జస్ట్ రెగ్యులర్ హెల్త్ ప్రాబ్లం…” అర్ధం అయినట్టు తల పంకించి కదిలాడు గౌతమ్.

***

సాయంత్రం సీమా స్కూల్ నుంచి వచ్చాకా కూడా షీబా కనబడలేదు.. తన రూమ్ డోర్ ఇంకా వేసే ఉంది. చేసేది లేక సీమానే ఇంటి పని, వంట పని చేసింది. పని అయ్యేసరికి ఆరున్నర అయ్యింది. మళ్ళీ తలుపు తట్టింది. తెరిచింది షీబా… చేతిలో ఉప్మా తో నిలబడింది తనముందు.
“మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నావో, లేదో నీ కోసం ఉప్మా చేసా…” అంటూ అందించింది..
“ఆకలిగా లేదు సీమా.. ప్లీజ్ కాసేపు వదిలేయ్ ఒంటరిగా…” అని తలుపేసేసింది. సీమాకి ప్రాణం చివుక్కుమంది…
రాత్రి…
గౌతమ్ అప్పటికే ఇంటికొచ్చేసాడు… డిన్నర్ చేయడానికి కూర్చున్నారు ఇద్దరూ.
“షీబా ఏది? ఇంకా తగ్గలేదా?” అడిగాడు అన్నం వడ్డించుకుంటూ… సీమా ఏదో పరధ్యానంలో ఉంది.
గౌతమ్ మాటలు తన చెవిన పడలేదు.
“సీమా…” అంటూ కదిపాడు చెయ్యి పట్టుకుని… తేరుకుని, “కూర వెయ్యనా?” అంది.
“నేనేం అడిగాను, నువ్వేం అంటున్నావ్? షీబాకి ఇంకా తగ్గలేదా?” సాగదీస్తూ అన్నాడు.
“ఆహా…తగ్గలేదు…” చెప్పింది తటపటాయిస్తూ.
లేచి వెళ్ళి షీబా రూమ్ డోర్ కొట్టాడు. తీసింది తను.
“ఇంకా తగ్గలేదా?” లోపలికి వెళుతూ అడిగాడు జ్వరంగా ఉందేమోనని నుదుటి మీద చెయ్యేసి.
“అదేం లేదు… మూడ్ బాలేదు అంతే…” చెప్పింది తాపీగా.
“తను ఒంట్లో బాలేదని చెప్పింది మరి.” అన్నాడు సీమా వైపు చూస్తూ.
“అయితే అదే నిజం. అవును ఒంట్లో బాలేదు.” అన్నది. అందులో వెటకారం అర్థమై, “ఏమైంది షీబా వాట్స్ రాంగ్ విత్ యు?” అంటూ చెయ్యి పట్టుకున్నాడు.
“ముట్టుకోకు…” అని వెనక్కి జరిగింది. కన్నీళ్లు మొదలైయ్యాయి. గౌతమ్ కి అర్థం కాలేదు.
సీమా పరిస్థితీ అంతే.
“ఏమైంది షీబా…ఎందుకలా మాట్లాడుతున్నావ్?” ఈసారి నసీమా వచ్చి అడిగింది.₹.
“మాట్లాడొద్దంటే… అది కూడా చెయ్యను.”
ఉన్నట్టుండి తనలో ఈ మార్పు ఏమిటి అని,
“ఏమైందో చెప్పు షీబా… చెప్తే కదా తెలిసేది!” గొంతు పెంచాడు గౌతమ్.
“చెప్పినంత మాత్రాన తెలుస్తుందా? తెలిసినంత మాత్రాన న్యాయం జరుగుతుందా?”
“ఇప్పుడు ఎవరికి ఏం అన్యాయం జరిగింది?”
“ఎవరికో జరిగితే… నేనెందుకు బాధపడతాను? నాకే జరిగింది…” అర్థం కానట్టు చూసాడు గౌతమ్…
సీమా కి నెమ్మదిగా అర్థం అవుతోంది. బహుశా సినిమా సంగతేమో అనుకుంటోంది. అసలు విషయం తెలిస్తే పాపం గుండె చెరువైపోతుంది… అలాంటి మాటే అన్నది షీబా.
“గౌతమ్ నా వల్ల కాదు… తనని పంపించేయ్ గౌతమ్, ప్లీజ్… మనం పెళ్ళి చేసుకుందాం!”
అంటూ ఘొల్లున ఏడవసాగింది షీబా…
క్షణకాలం, కాలం స్థంభించినట్టు అనిపించింది గౌతమ్ కి.
తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది సీమాకి.
“ఏంటి షీబా నువ్వు మాట్లాడుతోంది?” ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది గౌతమ్ ముఖంలో.
“అవునూ… నేనన్నది, నువ్విన్నది నిజమే… తనని పంపించేయ్.” ఏడుపు గొంతుతోనే అన్నది.
“ఎక్కడికి పంపించాలి? ఎందుకు పంపించాలి? మొదటి రోజే చెప్పాను ఇద్దరికీ, మీరు ఎంత సర్దుకుపోయినా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి అని… నా మాట ఖాతరు చేసారా?”
ఇద్దరూ తల దించుకున్నారు. అతను చెప్పింది నిజమే మరి… ఎంత సర్డుకుపోయినా ఒక మగాడితో ఇద్దరు ఆడవాళ్ళ సహజీవనం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు… రెండిళ్లలో ఉంటేనే లేని పోనీ చిక్కులు! అలాంటిది ఒకే ఇంట్లో అంటే ఎలా సాధ్యం అనుకున్నారో అసలు… అయినా ఇలాంటి సమస్య వస్తుందని ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాడు గౌతమ్. ఇదిగో ఈ రోజు అది కాస్తా నిజమైంది.
మౌనంగా ఉన్న ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ,
“ఇక లాభం లేదు, ఈ రోజుతో ఏదోటి తేలిపోవాలి. చూడు షీబా, ముందు నుంచి నాకు తనంటేనే ప్రేమ… నీ మీద ఉంది కేవలం ఇష్టం మాత్రమే. అది కూడా నువ్వు ఇష్టపడ్డావ్ కాబట్టి, నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు…” అనగానే చాచి కొట్టినట్టు అనిపించింది షీబాకి…
“అంటే ఇప్పుడు… దాన్ని ఉండమంటావ్ నన్ను పొమ్మంటావ్ అంతేనా? అలాగే వెళ్ళిపోతాను గౌతమ్… కానీ ఒక్క మాట అడుగుతా చెబుతావా?” అడగమన్నట్టు చూసాడతను…
“నీ జీవితంలోకి మళ్ళీ తను రాకపోయి ఉంటే… నన్ను పెళ్ళి చేసుకునే వాడివా కాదా?”
“తెలీదు… మే బీ… మే నాట్ బి” తెలివిగా బదులిచ్చాడు.
“హూ! మే బి… చాలా తెలివిగా చెప్పావ్ ..” ఆక్రోశం ధ్వనించింది ఆ మాటలో.
“అసలు దీనంతటికి కారణం ఇది!” అంటూ సీమా మీదకి వెళ్లి గొంతు పట్టుకుంది. ఉక్కిరిబిక్కిరి అవుతోంది సీమా. గౌతమ్ పరుగున వెళ్లి విడిపించబోయాడు. సుదీర్ఘ ఘర్షణ జరిగాక సీమా గొంతు వదిలింది షీబా. రొప్పుతూ కూలబడింది సీమా. తనని లేపి మంచినీళ్ళు తాగించాడు గౌతమ్.
“నీకేమైనా పిచ్చి పట్టిందా?” అరిచాడు గౌతమ్. హాల్ అంతా వ్యాపించింది ఆ అరుపు.
“అవును నాకు పిచ్చే పట్టింది. ప్రశాంతంగా ఉన్న మన జీవితంలోకి శనిలా దాపరించిందిది!”
గౌతమ్ ఆవేశం కట్టలు తెంచుకుంది. చాచి కొట్టాడు షీబాని. కుప్పకూలింది ఆ దెబ్బకి తను.

***

అర్ధరాత్రి.. పావుతక్కువ ఒంటిగంట అయ్యింది సమయం… జరిగిన గొడవకి సీమా తీవ్ర మనస్తాపం చెంది ఎప్పుడు నిద్రపోయిందో కూడా తెలీదు. గౌతమ్ తన గదిలో ఉన్నాడు. నిద్రపోలేదు అతను. నిజానికి నిద్రపట్టలేదు. షీబా పరిస్థితి అంతే. గౌతమ్ మీద తనకున్న పిచ్చి ప్రేమే తన చేత అలా చేయించింది… ఒక్కసారిగా గతమంతా ఆమె కళ్ళ ముందు కదిలింది..
హాస్టల్ లో ఉన్నప్పుడు రోజూ గౌతమ్ ని చూడటం , తన పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం. అయిదు సంవత్సరాలు అతన్ని ఆరాధిస్తూ బ్రతకడం. పరిచయం అయ్యాక కూడా ఎంత ఆనందంగా గడిచాయి రోజులు!
తనతో చెప్పిన కబుర్లు, చేసిన అల్లరి, తిరిగిన ప్రదేశాలు, గడిపిన క్షణాలు… ఏమైపోయాయి ఆ రోజులు? మళ్ళీ రావా? తన ప్రేమ గురించి తను చెప్పకుండానే అతను తెలుసుకున్న ఆ పుట్టినరోజు… ఎక్కడికి పారిపోయాయి ఇవన్నీ? ఒక్కరోజు ముందు తను గౌతమ్ దగ్గరకి వెళ్లి ఉంటే, ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. అసలు సీమా తన జీవితంలోకి అడుగుపెట్టేదే కాదు… అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తడిసిన తలగడకే తెలుసు ఆ కన్నీళ్ళ బరువెంతో. ఇంతలో ఏదో స్పర్శ కాళ్ళపైన… చప్పున తిరిగి చూసింది… ఆ స్పర్శ గౌతమ్ ది. కళ్ళ నిండా కన్నీటి పొరలు. ముఖంలో జీవం లేదు, స్పర్శలో వేడి లేదు… తేజం లేని సూర్యుడిలా ఉన్నాడతను.

“సారీ…” బరువైన గొంతుకతో అన్నాడు. ఆర్ద్రత నిండిన స్వరం అది. మౌనం వహించింది షీబా.
తనకి దగ్గరగా కూర్చుని, “నేనలా కొట్టి ఉండకూడదు… కానీ నువ్వలా చేసేసరికి ఆవేశం ఆపుకోలేక కొట్టేశాను…” చెప్పాడతను.
పశ్చాత్తాపం కాదు తనకి కావల్సింది, ప్రాయశ్చిత్తం అన్నట్టు పెట్టింది ముఖం.
“నీకు గుర్తుందా… రోజూ నువ్వు నన్ను ఆ హాస్టల్ కిటికీ దగ్గరే కూర్చుని చూసే దానివని చెప్పావు.” ఆమెకి గుర్తుంది అని చెబుతున్నదామె మౌనం.
“కానీ… నేను పదేళ్లుగా చూస్తున్నాను సీమాని. నీలా కిటికీలో నుంచి కాదు నా కలల్లో, నా ఊహల్లో, నా జ్ఞాపకాల్లో! తనతో కలిసి ఉన్నప్పటి కన్నా , తను పక్కన లేనప్పుడే తన మీద ఎక్కువగా ప్రేమ కలిగేది. అదేంటో చిత్రంగా… అలాంటిది తనని నువ్వలా చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పు?”
షీబా ఇక ఏమీ మాట్లాడలేదు. ఆ గది అంతా నిశ్శబ్దమైన నిశ్శబ్దం.
తెల్లవారిన కొన్ని గంటలకి…
గౌతమ్ ఇల్లు…
సూర్య కిరణాల తాకిడికి కళ్ళు తెరిచింది సీమా. హాల్ లోకి వచ్చింది. కొద్దిగా తెరిచి ఉన్న షీబా రూమ్ వైపు చూసి అటువైపు వెళ్ళింది. గది లోపలికి చూడగానే
“గౌతమ్ ……………..” అని గావుకేక పెట్టింది.
ఆ అరుపుకి వచ్చాడు గౌతమ్ మేలుకుని, ఏమైందంటూ… గదిలో వ్రేలాడుతూ కనిపించింది షీబా…ఉరి వేసుకుని…
కళ్ళు తిరిగాయి సీమాకి… గౌతమ్ ఆమెని పట్టుకున్నాడు. లోపలికెళ్ళి వ్రేలాడుతున్న తనని చూసి ఘొల్లున ఏడుస్తుంది సీమా. గౌతమ్ ఆమెని ఓదారుస్తున్నాడు.
శవాన్ని దింపుదాం, అనుకునే సరికి మోగింది కాలింగ్ బెల్.
గౌతమ్ వెళ్లి తలుపు తీసాడు. పోలీసులు లోపలికి శరవేగంగా వచ్చారు. సరాసరి సీమా వైపుకి కదిలారు…
“యు ఆర్ అండర్ అరెస్ట్.” అన్నాడు రుద్రాక్ష్ సీమాతో.
“ఎందుకు తనేం చేసింది? ఇది హత్య కాదు ఆత్మహత్య…” అని సమర్ధించాడు గౌతమ్.
“దీని గురించి కాదు నేను మాట్లాడేది… పీటర్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు…” చెప్పాడు రుద్రాక్ష్. సుడిగుండంలో పడ్డట్టు అయ్యింది గౌతమ్ కి. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సీమాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు.

సీమా అరుస్తోంది, తనని కాపాడమని. కానీ శూన్యంలోకి చొచ్చుకుపోయిన అతనికి ఆమె మాటలు వినిపించటం లేదు… అచేతనుడై చూస్తుండిపోయాడు. అతను తన ఆధీనంలో లేడు. కళ్ళని కమ్ముకుంది చీకటి… ఆ అంధకారంలో గతం ఓ మెరుపు తీగలా కదులుతోంది.

*********************

“పోలీసుల కథనం ప్రకారం… విశాఖపట్నం నగర వాస్త్యవ్యురాలైన నసీమా అలియాస్ సీమా (32) భర్తతో విడిపోయి హైదరాబాద్ లోని గాయత్రి పబ్లిక్ స్కూల్ లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈమెకి గౌతమ్ (33) చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు కూడా.. హైదరాబాద్ లో గౌతమ్ పరిచయం అవ్వడంతో, అతనితో మళ్ళీ తన ప్రేమాయణం సాగించింది. ఇంతలో హైదరాబాద్ కళ్యాణ్ నగర్ లో నివశించే పీటర్ (28) అనే వ్యక్తి సీమాని ప్రేమించమని, పెళ్ళి చేసుకోమని వేధిస్తున్నాడు. అలా ఒకరోజు గండిపేట్ దగ్గరకి సీమాని బలవంతంగా ఎత్తుకుపోయాడు. తనని పెళ్ళి చేసుకోమని అడిగాడు. తనూ గౌతమ్ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం, అని సీమా చెప్పడంతో ఆగ్రహానికి గురై గౌతమ్ ని చంపి అయినా సరే నిన్ను చేసుకుంటా అనడంతో, అతని వల్ల గౌతమ్ కి ఎలాంటి ముప్పు వస్తుందో అన్న భయాందోళనతో అతన్ని అక్కడే రాయితో తల పగలగొట్టి హతమార్చింది. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ఈ విషయాన్ని ఏ.సీ.పి. రుద్రాక్ష్ మీడియాకి తెలియ చేసారు.”
పేపర్ మడత పెట్టి కుర్చీలో వెనక్కి ఒరిగి రూఫ్ వైపు చూస్తున్నాడు గాంధి. తను అనుకున్న క్లైమాక్స్ కి జరిగిన దానికి పొంతన లేదు. కానీ వాస్తవమే చాలా బాధాకరంగా ఉంది. పైగా మొదటి నుంచి పాజిటివ్ గా ఉన్న సీమా క్యారెక్టర్ లో ఇంత భయంకరమైన ట్విస్ట్ తనైతే రాయలేడు. దీన్నే యథాతథంగా రాయాలని నిర్ణయించుకున్నాడు. రాసే ముందు ఒక్కసారి గౌతమ్ ని కలవాలి… అతని మనసులో మెదిలిన ఆఖరి ఆలోచన ఇది.
గౌతమ్ ఇంటిని చేరుకొని కాలింగ్ బెల్ నొక్కాడు గాంధి… కొద్దిసేపటికి తెరుచుకుంది తలుపు.
ఎదురుగా ఒక ముసలావిడ నెరిసిన జుట్టు, ముడతల ముఖం అరవై ఏళ్ల పైనుంటుంది ఆమె వయసు. ఈవిడెవరు అన్న సందేహం మెదులుతుండగానే, అడిగాడు.
“గౌతమ్ ని కలవాలి..” అని… ఆవిడ ఏమీ మాట్లాడకుండా లోపలికి దారిచ్చింది.
హాల్ లో మునుపటి కళ లేదు..
అతను గాలి చూపులు చూస్తుండగానే పైకెళ్ళమని సంజ్ఞ చేసిందావిడ. పైకి కదిలాడు గాంధి.

తలుపు తీయగానే గాఢమైన అంధకారం. కొన్ని ఘడియలు పట్టింది గాంధీకి ఆ చీకటి తన కళ్ళకి అలవాటు అవడానికి. అంతటి చీకటిలో నిర్జీవ ఆకారంలా కనిపించాడు గౌతమ్. మాసిన గెడ్డం, పెరిగిన జుట్టు, కళా విహీనమైన ముఖం… అలజడి నిండిన హృదయంతో ప్రశాంతమైన చీకటిలో గడుపుతున్న అతన్ని చూసి గాంధీకి కలిగిన భావం ఏమిటో అతనికే తెలియాలి! తన ప్రశాంతతకి భంగం కలిగించటం ఇష్టం లేక వెను తిరిగాడతను…
బయటకొచ్చి హాల్ గుండా వెళుతున్న అతన్ని ఏమీ అడగలేదు ఆ ముసలావిడ. గుమ్మం దాటి బయటికొచ్చాడు గాంధి. అతను వచ్చింది గౌతమ్ ని పరామర్శించడానికో, క్లైమాక్స్ యథాతథంగా రాస్తున్నానని చెప్పడానికో కాదు. షీబా తనంతట తాను ఉరి వేసుకుందా? లేక సీమా యే హతమార్చిందా? అన్న ధర్మ సందేహం తీర్చుకోడానికి… అది ఎప్పటికీ ఓ ప్రశ్నే…. తను రాసిన దానిలో ఇప్పుడు కొన్ని మార్పులు చేయక తప్పదు అని అర్థమైంది తనకి… ఇక మీద నవలలు రాసే అవకాశం కూడా లేదు… కారణం సినిమాల్లో అవకాశం వచ్చింది. ఒక్కసారి ఆ చట్రంలో పడ్డాకా ఇక నవలలు కష్టమే. కానీ ఇప్పుడు దానికంటే పెద్ద చిక్కు ఏంటంటే, అతను ఈ నవలకి పెడదామనుకున్న పేరు ఏదైనప్పటికీ. ఇప్పుడు గౌతమ్ ని ఇలా చూసాక తన మనసు మారింది. అందుకే… తన నవలకి ఇప్పుడు పెట్టదలచిన పేరు… ‘తామసి’. అంటే అర్థం చీకటి!!!

*******

(సమాప్తం)

1 thought on “తామసి – 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *