April 19, 2024

దేవీ భాగవతము – 4

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి

తృతీయ స్కంధము పదవ కథ
సత్యవ్రతుని వృత్తాంతము

బీజమంత్రము యొక్క ఫలము ఋషులడుగగా సూతుడిట్లు వివరించెను.
జనమేజయ మహారాజు ‘‘ఐం’’ అను బీజమంత్రమును ఉచ్ఛరించుటవలన కలిగిన సుఫలమును గూర్చి వివరించమని వ్యాస మహర్షిని అడుగగా అతడిట్లు ఆ బీజమంత్రమును గూర్చి తెలుపసాగెను.
ఇది పురాణములకు సంబంధించిన పవిత్రకథ.
జమదగ్ని అను ఋషి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యింద్ర, కుబేర, వరుణ, సూర్య, చంద్ర, త్వష్ట సకల గ్రహములు, వీటిలో దేనిని మనము అధికముగా పూజించాలి అని అడుగగా ముని శ్రేష్టుడైన లోమశుడు యిట్లు చెప్పెను.
అద్యాశక్తియు, పరాప్రకృతి, సర్వత్ర విరాజమానమైనది. సంసార రూప వృక్షమునకు మూల కారణమైనది, నామము నుచ్ఛరించగానే కోరికలను నెరవేర్చే చింతామణిjైున పరాశక్తి, మహాశక్తిని పూజించవలెను. శీఘ్రము నామమును తలవగానే ఆమె కోరికలు తీర్చును. అందుకు ఉదాహరణగా ఒక బ్రాహ్మణుని చరిత్ర ఉన్నది. అదియే పరమ మూర్ఖుడైన ‘‘ఊతధ్యుడు’’. గొప్ప పండితుడై సత్య వ్రతుడిగా మారుట.
కోసల దేశమున దేవదత్తుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. సంతానము లేదు. అతడనేక తీర్థయాత్రలు, పూజలు, యజ్ఞములు చేసెను. తుదకు పుత్రేష్టి యజ్ఞమును సంకల్పించెను.
తమసానదీ తీరమున యజ్ఞమండపం నిర్మించి గొప్ప నిపుణులైన వేదపండితులను ఆహ్వానించెను.
యజ్ఞ బ్రహ్మగా మునివరుడైన సుహాత్రుడు, ఆధ్వర్యునిగా యాజ్ఞవల్క్యుడు, హోరిగా బృహస్పతి, ప్రస్తోతగా పైలమహర్షి, ఉద్గాతగా గూభిలుడనివానిని నియమించెను.
ఉద్గాతjైున గూఢలుిడు సప్తస్వరములతో రథంతర మంత్రమును చదువసాగెను. చక్కని స్వరముతో మంత్రము గానము జరుగుచుండెను. అవధి లేకుండా మంత్రోచ్ఛారణ చేయుచుండుటచే అతనికి స్వరభంగమయ్యెను.
దేవదత్తుడు అతనిని మూర్ఖుడని సంబోధించి నిందించెను. వెంటనే గోభిలుడు ఆగ్రహించి దేవదత్తునికి పరమ మూర్ఖుడు, శబ్దశూన్యుడు నీకు పుత్రుడుగా జన్మిస్తాడని శపించెను. అతడు శఠుడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములయందు నా తప్పులేదుకదా, నీవు గమనింపక నన్ను నిందించితివి అని కోపగించెను. వెంటనే దేవదత్తుడు అతని కాళ్ళపై బడగా పుత్రులు లేని నేను మంచి కుమారునికొరకై ఈ యజ్ఞము చేయుచుంటిని గదా. నా అపరాధమును మన్నింపుమని ప్రార్థించెను. మూర్ఖుడైన పుత్రునికంటె సంతాన హీసుడగుట మేలుకదా అని చింతించెను. మూర్ఖుడైన బ్రాహ్మణుడు సకల కర్మలందు పశువుగా చంద్రునివలె చూడబడును. అతడెచటనూ గౌరవించబడడు. నిందనీయుడగును. వేదశూన్య మూర్ఖ బ్రాహ్మణుడు పన్ను చెల్లించాలి. రాజు కూడా అతనిని గౌరవించడు. శ్రాద్ధభోక్తగా కూడా పనికిరాడు. ఏ శుభకార్యమున పాల్గొనరాదు. వ్యవసాయము చేయాలి. అతడు భుజించుటకు ఎక్కువ అన్నము యివ్వబడదు. రాజ్యము నింద్యమగును. పండితులు వాని ప్రక్కన నిలువరారు. కావున మహర్షీ నన్ను క్షమించి ఉద్ధరింపుము అని వేడెను.
మహాత్ముల కోపము క్షణికము. పాపిష్టుల కోపము కల్పము వరకూ కూడా దూరము కాదు. గోభిలుడు శాంతుడై దేవదత్తా నీ కుమారుడు మూర్ఖుడై ఆ పిమ్మట విద్వాంసుడగునని యిది సత్యము నమ్మమని చెప్పెను. యజ్ఞము పూర్ణాహుతి కావింపబడెను.
ఒక శుభదినమున రోహిణి నక్షత్రసమయమున పగలు శుభలగ్నమున బాలుడు జన్మించెను. ఉతఢ్యుడు అను నామమొసగెను. ఎనిమిదేండ్లకు ఉపనయనము చేయబడెను. గురువు ద్వారా వేదాధ్యయనము ప్రారంభమయ్యెను. ఉతఢ్యుడు ఒక్క శబ్దము కూడా పలకకుండెను. మూర్ఖుడై కదలక కూర్చుండెను. 12 ఏండ్లవరకు సంధ్యావందనము చేయుట కూడా రాలేదు.
తల్లిదండ్రులు, బంధుజనులు, గ్రామప్రజలు అతనిని దుర్భాషలాడుచుండిరి. విసుగు చెందిన ఉతఢ్యుడు ఎవరికి చెప్పక వనములకు వెళ్ళిపోయెను.
గంగాతీరమందు చక్కని కుటీరము వేసుకుని కందమూలములు తింటూ జీవించుచుండెను. నేనెప్పుడు అబద్ధాలు చెప్పను అని అతడు సంకల్పించెను. బ్రహ్మచర్యము పాటిస్తూ గడపసాగెను.
జపము గాని, వేదాధ్యయనము గాని అతడికి రాదు. దేవతలను పూజించుట ఎరుగడు. ప్రాణాయామము, ఆసనము, భూతసిద్ధి, ప్రత్యాహారము తెలియవు. గాయత్రి చదువుట రాదు. సంధ్యవార్చుట ఎరుగడు. తన పని ఏమో తాను చేయుచుండెను. ఆహార నియమములు తెలియవతనికి. ఎల్లప్పుడు సత్యమును మాత్రము పలికెడివాడు. అందువలన చుట్టుప్రక్కలవారు అతనిని సత్యవ్రతుడు అనే వారు. దేనికీ భయపడేవాడు కాదు. ఈ జీవనమిటు గడపాలి అనే ప్రశ్నే లేదు. దైవమే నన్నిట్లు మూర్ఖునిగా పుట్టించినాడు. నా జీవనము ఇలా వ్యర్థమైనది. పూర్వకర్మ ఫలము వలన నేను మూర్ఖుడైతిని. తపము చేయలేదు. తీర్థములు దర్శించలేదు. బ్రాహ్మణులకు దానమివ్వను. ఎట్టి సాధన చేయుదునని చింతించుచుండెను. ఒక నిర్జన వనమునందు విరక్తుడై తన కుటీరమందు ఒంటరిగా ఆసీనుడై ఉన్నాడు. 14 సంవత్సరములు గడిచాయి. ఏమీ లభించలేదు.
అతడు ఎప్పుడూ సత్యమునే పలుకునని కీర్తి మాత్రము వ్యాపించెను.
ఒకనాడు వేటాడుచు ధనుర్బాణములు చేత ధరించి మిక్కిలి భయాకారముతో అచటికి వచ్చెను. అతడొక పందిని వేటాడెను. ఆ పంది ఉతఢ్యుడు దగ్గరకు చేరి వణుకుచుండెను. దాని శరీరము రక్తమయము. ఆ దీనమైన స్థితిలో ఉన్న పందిని చూచి ముని వణకసాగెను. అతడి నోటినుండి ‘ఐ’ అను ఉచ్ఛారణ వెలువడెను. ఎప్పుడూ అతడు పలకనూ లేదు. వినలేదు. అదృష్టవశమున నాడు అతని నోట పలుకసాగెను. ఆశ్రమములో ఓ పొదలో ఆ పంది దాక్కొనెను. వేటగాడు వచ్చి పంది కోసము ప్రశ్నించెను. నా ఆకలి తీరుటకు ఆ సూకరము (పంది) కావలెనని అడిగెను. ఈ వృత్తియే నాకు ధర్మము. జీవనభృతికి మీరు సత్యవ్రతులు కావున చెప్పమని ఆ వేటగాడు మరల మరల ప్రశ్నించుచుండెను.
నేను చూడలేదనినచో నా సత్యవ్రతము భంగమగును. హింసతో నిండిన సత్యము సత్యము కాదు. దయతో కూడిన అసత్యము దానివలన సత్యము అగును. మానవుని హితసాధనకు ఉపయోగపడేదే సత్యము. ఏమి చేయవలెను అని ధర్మసంకటములో ఉతఢ్యుడు ఆలోచించుచుండెను. దయకు పాత్రురాలై బాణముతో కొట్టబడిన పందిని చూచి అప్రయత్నముగా అతని నోటి నుండి ‘ఐ’ అనునది వెలువడెను. అది భగవతి వాగ్బీజము.
అందుచే దానిని వినిన పరమేశ్వరి ప్రసన్నురాలై అతనికి అపారమైన విద్యల నొసగినది. వాల్మీకివలె గొప్ప విద్వాంసుడయ్యెను.
‘‘చూచిన కళ్ళు మాట్లాడలేవు. మాట్లాడే వాణి చూడలేదు. నీ పనిని చూసుకోక నన్నెందుకు మరల మరల అడుగుచున్నావు.’’
ఈ మాటలు అర్థం కాని వ్యాథుడు నిరాశతో వెళ్ళిపోయెను.
రెండవ వాల్మీకి వలె ఉతఢ్యుడు గొప్ప పండితుడయ్యెను. సత్యవ్రతుడను యశము పొందెను. సారస్వత బీజమాత్రమగు ‘‘ఐ’’ని పదే పదే ఉచ్ఛరించుచుండెను. విధి పూర్వకముగా దానిని జపించెను. అతని పాండితీ ప్రతిమ ఎల్లెడల వ్యాపించెను. బ్రాహ్మణులు అతని కీర్తిని వేనోళ్ళ పొగడుచుండిరి. ఆ నోట ఈ నోట విన్న దేవదత్తుడు ఆశ్రమానికి వెళ్ళి ఉతఢ్యుని కలిసెను. సాదరముగా ఇంటికి తెచ్చెను.
వేదములలో చెప్పిన విధివిధానము ననుసరించి భగవతి యజ్ఞాలు చేయాలి. భక్తి పూర్వకముగా ధ్వనించినా, నామము నుచ్ఛరించినా అనేక కోరికలు సిద్ధించును. అందుకే ఆమెను ‘‘కామద’’ అంటారు.
కావున అందరూ ఆ భగవతి నామమును, ధ్యానమును, బీజమంత్రములను ఉచ్ఛరించిన సకలసిద్ధి కల్గును.

*****

తృతీయ స్కంధము 11 వ కథ
నవరాత్రి వ్రతము

ప్రాచీన కాలమున సుశీలుడు అనే ఒక పేదకోమటి వుండెను. సంతానమెక్కువగా ఉండుటచే అతడు మిగుల దుఃఖితుడయ్యెను. ఏదో విధముగా కాలము వెళ్ళబుచ్చసాగెను. అతడు సదా ధర్మతత్పరుడై ఉండెను. సదాచారసంపన్నుడై సదా సత్యములు పలికెడివాడు. కోపములేదు. ఎప్పుడూ ధైర్యముగా ఉండెడివాడు. ఈర్ష్య రాగములు లేవు. నిత్య ఆరాధన చేయుచు అతిధులకి భోజనము నిచ్చి తాను తినేవాడు. అతని నియమమిట్లుండెను.
ఒకసారి సుశీలుడు ఒక మునిని సమీపించి తనకు ధనమోజు లేదని నా కుటుంబమును మాత్రమే పోషించగల శక్తిని ఉపదేశించమని కోరెను. తన కుటుంబమంతయు ఆకలితో తనని విడిచిపెట్టి ఎచటికో వెళ్ళిపోయారని చింతించెను. ఆ బ్రాహ్మణుడు అతనిని భగవతిని పూజ చేయుమని, నవరాత్ర వ్రతమును చేయమని కోరెను.
కాని అందు భగవతి మంత్రజపము హోమాది కార్యక్రమములుండును. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. నీ శక్తికనుగుణముగానే చేయుమని దీవించెను.
ఈ నవరాత్రి వ్రతము సర్వదా పాటించు వారికి జ్ఞానము మోక్షము కలుగును. పరమ పవిత్రము, సుఖప్రదము అని చెప్పెను.
పూర్వము సీతాపహరణ జరిగిన పిమ్మట భగవతి జగదంబికను ఆరాధించెను. నవరాత్రి వ్రతము చేసి సీతాదేవిని పొందెను. లంకకు విభీషణుని రాజుగ జేసి అయోధ్య చేరి పట్టాభిషుక్తుడయ్యెను. రావణాదులు వధింపబడిరి.
బ్రాహ్మణుడు వైశ్యునకు మాయాబీజమగు భువనేశ్వరీ మంత్రమును ఉపదేశించెను. వైశ్యుడు నవరాత్రవ్రతమాచరించి తన శక్తికొది భవానీదేవిని ఆరాధించెను. తొమ్మిదవ సంవత్సరమున నవరాత్రియందు అష్టమి తిథియందు అర్థరాత్రి ఆ దేవి ప్రకటితురాలయ్యెను. దర్శనము లభించెను. ఆరాధనచే కృతకృత్యుడయ్యెను.
కావున నవరాత్రి వ్రతము అత్యద్భుతమైన ఫలితముల నిచ్చునని తెలియవలెను. పరమపావనము, సుఖప్రదము ఈ వ్రతము పేదరికము, రోగములు, దుఃఖము, పూర్వజన్మలో ఆచరించక పోవుటవలననే కల్గును. వైధవ్యము, అంగవైకల్యము యివి అన్నీ దుఃఖభాజనములే కదా!

*****

చతుర్థ స్కంధము 12వ కథ
మరుత్తుల జన్మ వృత్తాంతము

కర్మవశమున కశ్యపఋషి వసుదేవునిగను, ఆతని పత్నులు అదితి, సురస అను యిరువురు దేవకి, రోహిణిగాను జన్మించుట యిందుల వృత్తాంతము.
వివిధ కల్పములందు విష్ణువుయొక్క లీలా జగత్తుకు అనేక కారణములుండును.
ఒకప్పుడు కశ్యపుడు ఒక యజ్ఞము చేయుటకు వరుణుని దగ్గర ఉన్న ఒక యజ్ఞధేనువును అడిగి తీసుకుని వెళ్ళెను. పని పూర్తయిన పిమ్మట ఎంత కాలమయినను ఆ ధేనువును వరుణునకు అప్పగించలేదు. ఎన్నో సార్లు వరుణుడు కశ్యపుని ప్రార్థించి తన గోవునిమ్మని అడిగినను కశ్యపుడు తిరిగి యివ్వలేదు. వరుణుడు బ్రహ్మకడకు వెళ్ళి విషయమును చెప్పెను. తరువాత వరుణుడు కశ్యపునకు మానవుడై గోవుల కాచే వాడుగా జీవితమును గడుపుమని శపించెను. అతని భార్యలను కూడా భూమిని వశింపుమని ధేనువుకు గోవులతో దూరము చేసితిరి గాన వారు కారాగారమునుండి తన పుత్రులకు దూరమగును గాక యని శపించెను. బ్రహ్మ కశ్యపుని పిలిచి లోభము మిగుల బలమైనదని, నరక ప్రాప్తికలుగునని పాపము కూడునని బోధించెను. కాని కశ్యపుడు వినలేదు. బ్రహ్మకు పౌత్రుడు కశ్యపుడు. అయినా ధర్మము యొక్క మర్యాదను కాపాడుట కొరకు కశ్యపునకు బ్రహ్మకూడా శాపమిచ్చెను.
నీవు నీ అంశతో పృధివిని యదుకులములో జన్మిస్తావు. నీ వెంట నీ భార్యలుందురని, గోపాలకుడవయి నివసింపుమని శపించెను.
దితి, అదితికి జన్మించుట తోడనే నీ ఏడుగురు పుత్రులు మరణించుదురని శపించెను.
దితి, అదితి కశ్యపుని భార్యలు. దక్షప్రజాపతి కుమార్తెలు. అదితికి కశ్యపుని వలన ప్రతాపవంతుడగు ఇంద్రుడు పుట్టెను.
దితి కూడా కశ్యపుని ఇంద్రుని వంటి పుత్రుడు కావలెనని కోరగా నియామానుసారముగా ఒక వ్రతమును సేయుమని చెప్పెను.
ముని మాటలను విని శ్రద్ధాభక్తులతో వ్రతమును ఆచరించుచు కాలము గడప సాగెను. ఆమె ముని అనుగ్రహం వల్ల గర్భవతి అయ్యెను. సంపూర్ణ దశకు చేరుకొను సమయమయ్యెను. అదితికి అసూయ పెరిగెను. తన కుమారుడైన ఇంద్రుని పిలిచి నీకు శత్రువుగా దితి గర్భమున శిశువు పెరుగుచున్నాడు. వానిని వధింపుమని కోరెను. ఇంద్రుడు పినతల్లి నియమానుసారము వ్రతము చేయుచు నేలపై పరుండుట గమనించి ఆమె సేవ చేయుచున్నట్లు పాదములొత్తుచూ ఆమె నిద్రావస్థలో ఉండగా సూక్ష్మరూపాన్ని ధరించి ఆమె గర్భాన ప్రవేశించి ఏడు ముక్కలుగాను, ఒక్కొక్క ముక్క మరల ఏడుఖండములుగానూ చేసివేసెను.
గర్భస్త శిశువు రోదించుచుండగా వలదని ఇంద్రుడు వారించి వారందరినీ మరుత్తులు అను దేవగణముగా ప్రసిద్థి పొందెదరని, వారు తనకు అత్యంత ప్రియమైన వారని చెప్పెను. దితిని నిద్రాభంగమై జరిగినది తెలుసుకుని అదితికి ఇట్లు శాపమిచ్చెను. పాపపు ఆలోచన చేసి దుష్కర్మ చేయించితివి. అట్లే నీ బాలకులు కూడా జన్మించగానే పదే పదే మృత్యువాత పడెదరు. పుత్రశోకముతో నీవు పరమ దుఃఖమును పొందెదవు గాక అని శపించెను. నీవు కారాగారమున బంధింపబడి రెండవ జన్మలో నీ కుమారులు మరణింతురు గాక అని శపించినది.
కశ్యపుడు దితి కోపాన్ని శాంతింపజేసి నీ గర్భమున బలశాలురైన పుత్రులు జన్మించి దేవతల సౌభాగ్యమును పొందెదరు. ‘మరుత్తుల’ను నామముతోఇంద్రునికి ప్రియమగువారని నచ్చచెప్పెను.
ద్వాపర యుగమున నీవొసగిన శాపము ఫలించును. నేను, మీరుకూడా వరుణుని శాపమున భూలోకమున జనించెదమని చెప్పెను. అదితియే వసుదేవుని భార్య దేవకి అయ్యెను. వసుదేవుడు కశ్యపుని అంశ. దితి రోహిణిగా జన్మించెను. ఇది ‘మరుత్తుల’ వృత్తాంతము. మరుత్తులు మొత్తం 49మంది.

సశేషం

1 thought on “దేవీ భాగవతము – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *