March 4, 2024

మారిన జీవితం

రచన: ప్రభావతి పూసపాటి

“ఒక్కసారి వీలు చూసుకొని రా రామం నీతో చాలా విషయాలు మాట్లాడాలి, ఫోన్ లో చెప్పలేను, నువ్వు సృజన రెండు రోజులు ఉండేలా రండి, “ఫోన్ లో అక్క గొంతు భారంగా వినపడుతోంది,
“ఏమైంది అక్క? ఏదైనా కంగారు పడే విషయమా” ఆత్రంగా అడిగాను,
” కాదు లేరా, కొంచెం నీతో మాట్లాడితేగాని మనసుకి ప్రశాంతత కలగదు అందుకే” , గొంతులో జీర వినపడింది,
“అలాగే అలాగే అక్క, రాత్రికి బయలుదేరుతాను, నువ్వు ప్రశాంతంగా వుండు, పొద్దునకల్లా వచ్చేస్తాను “ఫోన్ డిస్కనెక్ట చేసి, సిద్దుకి పొలం పనులు అప్పగించి రాత్రి బస్సుకి టికెట్స్ తీసుకొని ఇంటికి చేరాను,
“వరి నాట్లు పని వుంది సాయంత్రం వరకు రాలేను అన్నారు అప్పుడే వచ్చేసారే నాన్నా”నాకు ఎదురు వచ్చి కూరగాయల సంచి చేతిలోకి తీసుకొంటూ అడిగింది సృజన.
మీ అత్తయ్య నుంచి ఫోన్ వచ్చింది అమ్మా, నాతో మాట్లాడాలని వుంది రమ్మని పిలిచింది, అన్నయ్యకి పొలం పని చూసుకోమని చెప్పి వచ్చాను, బాగ్ లో ఒక జత బట్టలు సర్ది పెట్టు తల్లి. సాయంత్రం ఏడు గంటలకి బస్సు”
“మళ్ళీ వంశి బావ ఎదో ఉపద్రవం తెచ్చి ఉంటాడులే నాన్న, అత్తయ్య కంగారు పడి నిన్ను రమ్మని పిలిచింది, అంత కన్నా పెద్ద విషయము ఏమి అయి వుండదులే, నువ్వు భోజనం చేసి కొంచెం సేపు పడుకో, నేను అన్ని సర్ది నిన్ను లేపుతాను” అన్నది బావని తలుచుకొని ముసిముసిగా నవ్వుతు.
మంచం మీద నడుము వాల్చానే గాని మనసంతా అక్కయ్య చుట్టే తిరుగుతోంది, అక్క కి నాకు వయసులో ఏడేళ్ల తేడా వుంది, అమ్మ పోయినప్పటినుంచి అక్కే అన్నీ తానై నన్ను పెంచింది, ఊరి కరణంగారి అబ్బాయి అక్కని ఇష్టపడి పెళ్లిచేసుకొన్నాడు, బావ పట్నంలో పెద్ద వుద్యోగంలో వున్నాడు, వంశి అక్కబావలకి ఏకైక సంతానం, చాల కాన్పులు పోయిన తర్వాత పుట్టడం వలన చాలా అపురూపంగా పెంచింది, పట్నం వెళ్ళినప్పుడల్లా అక్క బావ వాడిని పెంచుతున్న తీరు చూసి హెచ్చరిస్తూనే వున్నాను. అక్కవాడిని ఒక్క పని సొంతం గా చేయనివ్వదు. బావ వాడిని ఏ ఒక్క నిర్ణయం స్వతంత్రంగా తీసుకోనివ్వదు. వాడు ఇది అలుసుగా తీసుకొని బద్దకస్తుడిలా, జీవితం కూడా మనది కాదు ఎవరిదో అన్నట్టుగా బ్రతికేయడం అలవాటు చేసుకొన్నాడు, ఇలా అలవాటు చేస్తే వాడి భవిష్యత్తు పాడైపోతుందని ఎన్నిసార్లు చెప్పినా అక్కకి బావకి పిల్లాడి మీద వున్న ప్రేమ మైకం వల్ల నా మాట చెవికి ఎక్కలేదు,
“నాన్న పడుకొన్నారా ” పొలంలో పని ముగించుకొని వచ్చినట్టువున్నాడు సిద్దు, వాడికి నా పట్ల వున్న ప్రేమ, శ్రద్ద, గౌరవభావం, బాధ్యత సిద్దు గొంతులో ప్రస్ఫుటంగా వినపడుతోంది.
సిద్దు ఇంచుమించు వంశి వయసువాడే, కానీ వాడికి వీడికి మధ్య ఏంతో వత్యాసం కనిపిస్తుంది, వంశి ఎగిసిపడే కెరటంలాంటి వాడైతే, సిద్దు గంభీరంగా ప్రవహించే నదిలా ఉంటాడు, వంశి స్కూల్ చదువు పది ఏళ్ళల్లో కనీసం ఐదు, ఆరు స్కూళ్లు మారాడు. అవి ఏమైనా మామూలు స్కూల్ లాంటివా అంటే కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వున్నవి. ఎందుకు అలాగా అని అక్కని అడిగితే వాడికి ఒకటే స్కూల్, ఒకటే టీచర్స్, అదే ఫ్రెండ్స్ అంటే విసుగు పుడుతోంది అని సమాధానం, సిద్దు , సృజన మున్సిపల్ స్కూల్లో చదివారు, ఏనాడూ తమ స్కూల్ గురించి కంప్లైంట్ చేసిందే లేదు, అలాగని వంశి తెలివితేటలూ లేనివాడు కాదు, వాడు పెరిగిన తీరు వలన దేని మీద శ్రద్ధ, గౌరవం లేవు,
వంశి విషయంలో తప్పు అంతా వాడిదే అని అనలేను, ఎందుకంటే వాడు పెరిగిన వాతావరణం అల్లాంటిది, బావ వుద్యోగంవల్ల మంచి జీతం, జీవితం, వంశి పుట్టేనాటికే బావ జీతం ఐదు అంకెల్లోకి వచ్చేసింది, ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు, విలాసవంతమైన జీవనం, అడగకుండానే ఖరీదైన వస్తువులన్నీసమకురుతాయి, వాడికి ఏదైనా వస్తువు కొనుక్కోవడం అన్నది అతి తేలికైన విషయము, పధి తరగతి పాస్ అయినందుకు వాడు అందుకొన్న బహుమతి ఆపిల్ ఐ ఫోన్, ఇంటర్ పాస్ ఐతే లక్షరూపాయల బైక్, ఇది వాడి రేంజ్, సిద్దు పదవతరగతి డిస్ట్రిక్ట్ లోనే ప్రధమంగా వచ్చాడని తెలిసి “నాన్న నీకు మొబైల్ ఫోన్ కొని ఇస్తానని” అడిగాను దానికి వాడు “ఇప్పుడు ఫోన్ తో అంత పెద్ద అవసరం ఏమి లేదు నాన్న, నాకు అవసరం అయినప్పుడు కొందువు గానిలే అన్నాడు, ఇంటర్ తర్వాత కాలేజీ కోసం పక్కనే వున్న వూరికి బస్సులో వెళుతున్నావు, బండి కొంటానురా అంటే “నలుగురితో బస్సులో వెళ్ళటం వలన కష్ట సుఖాలు తెలుస్తాయి నాన్న, ఐనా డిగ్రీ పాస్ అయ్యాక సొంతంగా సంపాదించి కొనుక్కునే ఆనందమే వేరులే నాన్న”అన్నాడు,
వంశిని చూసిన ప్రతిసారి వాడి ప్రవర్తన ఆందోళన కలిగించేలాగే ఉంటుంది, కిందటిసారి చూసిన ఘటన ఇంకా ఆశ్చర్యం కలిగించింది, వంశి ఆకలి వేస్తోంది వేడిగా పకోడీ చేసిపెట్టు అని అడిగాడు, అక్క లేచి వంట ఇంట్లోకి వెళ్లే లోపలే “అబ్బాఇప్పుడు ఉల్లిపాయ తరిగి పిండి కలిపి పకోడీ వేసే లోపు తినాలన్న ఆశ చచ్చిపోతుంది స్విగ్గి లో చెపుతాలే నిముషాల్లో వాడు తెస్తాడు అని ఆర్డర్ చేసాడు, ఇలా వాడి అసహనం అన్ని విధాలా పరాకాష్టకి చేరుకుంది, దీనికి భిన్నంగా ఇక్కడ వూర్లో కొత్తగా కాకా హోటల్ తెరిచారు తిందాము రండిరా వెళదాము అని అంటే నా పిల్లలిద్దరూ అక్కడ కి వెళ్లి తినే కన్నా మనం కబుర్లు చెప్పుకొంటూ మనమే సొంతంగా చేసుకొని తింటే వచ్చే మజా వేరు నాన్న అని ఓపికగా పిండి తయారు చేసుకొని అట్లు పోసుకున్నారు, ఆ రోజు ఎంత సరదాగా ఆనందంగా గడిచింది, కంఫర్ట్స్ పేరుతో పిల్లలని మనమే పాడు చేస్తున్నామా???
నిజమేనేమో ఆధునిక పరిజ్ఞానం వలన ఎంత సుఖ పడుతున్నామో, అంత కన్నా ఎక్కువ దుఖంలోకి భావి తరాన్ని నెట్టేస్తున్నాము , ఈ తరం తల్లితండ్రుల ఆర్ధిక స్తొమత వల్ల ప్రతి వస్తువు అనుకున్నదే తడవుగా కొనేసు కోవడం, వాడేసుకొని పనిచేయకపోతే విసిరేయడం అంతే తప్ప దేని పట్ల బాధ్యత లేకపోవడం ఏ విషయంలోను ఓరిమి, ఓపిక లేకపోవటం ఒక్క వంశీలోనేకాదు, ఈ మధ్య ప్రతి ఇంటిలో సర్వ సాధారణంగా కనిపిస్తోంది,
ఆలోచనల్లో ఉండగానే లేవండి నాన్న బస్సు టైం అవుతోంది అన్న సిద్దు పిలుపుతో లోకంలోకి వచ్చి బయలుదేరాను, “వంశిని ఇక్కడికి రమ్మనమని చెప్పండి నాన్న, కొన్నాళ్ళు మనతో ఉండి వెళతాడు, ఎప్పుడు మనం వెళ్ళటమే కానీ వాడు రాలేదు, “బస్సు ఎక్కించడానికి వచ్చి సిద్దు అన్న మాటలు మనసుని మళ్ళి గతంలోకి తీసుకెళ్లాయి,
వంశిని ఎన్నిసార్లు తనతో తీసుకొని వెళతానన్న ససేమిరా ఒప్పుకొనేవారు కాదు అక్క బావ, ఈ పల్లెలో తగిన సౌకర్యాలు లేవని, ఇక్కడ వాతావరణంలో ఇమడలేడని పంపేవారు కాదు, ఈ మధ్యే ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పింది, ఇప్పుడు సెలవే దొరకడం కష్టం, వాడికి సిద్దు, సృజన అంటే వల్లమాలిన అభిమానం, నేనంటే విపరీతమైన ప్రేమ, మనిషి మంచివాడే కానీ ప్రస్తుత యువతకి ప్రతీకగా ఉంటాడు, ఈసారి ఏ ఇబ్బంది తెచ్చాడో ఆలోచనలతో ఉండగానే అక్క ఇల్లు చేరటం జరిగిపోయింది,
“ఏమి మావయ్య ఇలా అకాల దర్శనం, వూర్లో అంత కులాసానేనా?” అంటూ చనువుగా వచ్చి పక్కన కూర్చున్నాడు,
అక్క ఫోన్ చేసిన విషయం వీడికి తెలిసిపోలేదు కదా అనుకొంటూ ” చాల రోజులైంది కదా మిమ్మలిని చూసి వెళదామని, అవునురా ఈ రోజు సెలవు పెట్టవచ్చు కదా, కొంచెంసేపు నీతో గడిపినట్టు ఉంటుంది, “అన్నాను,
“సెలవు అవసరం లేదు మావయ్య నేను వుద్యోగం మానివేస్తున్నాను, చాల తేలికగా అనేశాడు, మీరు మాట్లాడుకొంటూ వుండండి నేను ఇప్పుడే మా ఫ్రెండ్ ని కలిసి వస్తాను” అంటూ సమాధానం కోసం కూడా చూడకుండా బండి కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు, అదన్నమాట అక్క పిలుపుకి కారణం,
“ఇదిరా వాడి సంగతి, చేరి పదిహేను రోజులు కూడా కాలేదు మానేస్తాను అంటున్నాడు, కారణం వింటే నవ్వి పోతారు వుద్యోగం చెయ్యడం ఇష్టమే కానీ ఒకేచోట కూర్చుని చేయటం విసుగుట, పని చెయ్యటం కష్టం కాదుట కానీ అంత సేపు ఓపికగా ఓరిమిగా ఉండి ప్రాజెక్ట్ డెవలప్ చెయ్యాలని అనిపించదుట, ఏదైనా కొంచెంసేపే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కానీ ఎక్కువసేపు దాని మీద దృష్టి పెట్టడం వాడి వల్ల అవ్వటం లేదుట, వాడి వరస ఏమి బోధ పడటం లేదు నాకు మీ బావగారికి, నాకైతే సృజనని కోడలిగా చేసుకోవాలని ఉందిరా, ఇద్దరికీ పెళ్లి ఈడు కూడా వచ్చింది కదా, సృజనని చేసుకోమని ఎలా అడగను వీడు ఉద్యోగమే ఈ చందాన చేస్తుంటే ఇంక సంసారం ఎలాగా అని, కళ్ళు వత్తుకొంటూ చెప్పింది,
“ఇలా జరగడంలో పెద్ద ఆశ్చర్యమేమి లేదు అక్కా. వాడి చిన్నప్పటినుంచి ఏ పని చేయనివ్వకుండా శారీరక శ్రమ అంటే ఏమిటో తెలియనివ్వకుండా నువ్వు చేసావు, ఎంత చిన్న విషయం ఐనా బావే ప్రతి విషయంలో ఆయనే సలహా సంప్రదింపులు చేసేసి మానసిక స్థిరత్వం లేకుండా చేసారు, ఇంక వాడిలా కాక ఇంకెలా తయారవుతాడు అక్క?? ప్రేమ అని అనుకున్నారు కానీ చిన్నతనం నుంచి అన్నివిధాలా వ్యక్తిత్వ వికాసం కలిగేలా పెంచలేదు, వాడికి దేని మీద ఆసక్తి, అనుబంధం, బాధ్యత ఏమి లేవు”
“అదేరా ఇప్పుడు తెలిసింది కానీ దీనికి పరిష్కారం ఏమిటో తెలియటం లేదు రామం ” బావ ఎప్పుడు వచ్చాడో కానీ నా మాటలకి అడ్డువస్తూ దిగాలుగా నా పక్కనే కూర్చుండి పోయారు,
“ ఏ సమస్యకైనా పరిష్కారం ఉండకుండా ఉండదు బావ, మీ ఇద్దరు ఒప్పుకుంటే నేనొక మార్గం సూచిస్తాను”
“అంతకన్నానా, అందుకే కదరా నిన్ను రమ్మని పిలిచింది, ఏమిటో తొందరగా చెప్పు” నా చేయి పట్టుకొని కుదిపేస్తూ అడిగింది,
“అక్క మనం ముందు వాడికి దేనిమీదైనా ప్రీతి కలిగేలాచెయ్యాలి, దానిమీద అనుబంధం ఏర్పడాలి. దానిని సాధించాలని లక్ష్యం కలగాలి, అది సాధించేవరకు పట్టుదలతో ఉండి విజయం కోసం ఓరిమితో ఎదురుచూడాలి, ఇక్కడ ఈ యాంత్రిక జీవితంతో వాడిలో ఈ లక్షణాలన్నీ మచ్చుకైనా కనపడటం లేదు. నా అంచనా ప్రకారం వాడు ఈ పట్నవాస జీవితానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటే మార్పు తీసుకురాగలం అని అనిపిస్తోంది”
“అంటే ఏమంటావురా, వాడు ఇక్కడ వుంటే మారడంటావా” ఆదుర్దాతో నా మాటకి అడ్డువస్తూ.
“అవును అక్క కొన్నాళ్ళు వాడిని నాతొ[ వూరికి తీసుకొని వెళతాను, ఈ ఎలెక్ట్రాన్ పరికరాలకి, మర మనుషులకి, యాంత్రిక జీవనానికి దూరంగా.”
“ఇక్కడ ఉంటేనే బోర్ అంటున్నాడు, ఆ పల్లెటూరిలో ఉంటాడంటావా ఇది జరిగే పనికాదేమో” అన్నట్టు అన్నారు బావ నిరాశగా,
“నిజమే బావ వెంటనే వస్తాను అని అంటాడని నేను అనుకోవడంలేదు, కానీ ఇప్పటివరకు వాడు అక్కడికి రాలేదు కదా ఆలా ఆ వంకతోనైనా వస్తాడేమో, కానీ ఒక్క ఆరు నెలలు వాడి గురించి మీరు పట్టించుకోవడం మానేయాలి. ఆ షరతుకి మీరు అంగీకరిస్తేనే నేను వాడితో మాట్లాడతాను”.
కొంచెంసేపు మౌనం రాజ్యమేలింది. “అన్నింటికీ నువ్వు వున్నావనే భావం మా ఇద్దరికీ ఉందిరా, వాడిని నీ చేతిలో పెడుతున్నాము. నువ్వే వాడిని సరైన మార్గంలో పెట్టగలవనిపిస్తోందిరా” అక్క బావ ముక్తకంఠంతో అని భారం నా మీద వేశారు.
సాయంత్రం కబుర్లలో వంశితో “ఏరా, నాతో మా వూరు రావచ్చుకదా. సిద్దు మా ఊరి కుర్రాళ్లతో కలిసి సేంద్రియ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి మంచి దిగుబడి ఎలా తీసుకురాగలమో చేసి చూపిస్తున్నాడు, నువ్వు కూడా వస్తే కొంత వాడికి సహాయంగాను కొంత వాళ్ళని ప్రోత్సహించినట్టు ఉంటుంది” అన్నాను,
“తప్పకుండా మావయ్య. నేను కూడా రొటీన్ నుంచి బ్రేక్ కావాలి ఎటైనా వెళదామని అనుకొంటున్నాను. ఇట్స్ అ గుడ్ ఐడియా. నేను ఇప్పటివరకు విల్లెజెస్ చూడలేదు, కొంచెం త్రిల్లింగ్ గా అనిపిస్తోంది, లెట్స్ గో మావయ్య, కార్ లో వెళ్లిపోదాము “.
అంత తొందరగా వస్తాను అని అంటాడని అనుకోలేదు, షాక్ నుంచి తేరుకొని, “రాత్రికి బయలు దేరుదాము కానీ వెళ్ళేది బస్సులో” చెప్పాను.
ఒక్క నిముషము అలోచించి” ఓకే మావయ్య నీవు ఎలా అంటే అలాగే ” నవ్వుతు ఊరి ప్రయాణానికి సన్నద్ధమయ్యాడు,
********
పెళ్లి బట్టల్లో వంశీని, సృజనిని చూసి మురిసిపోతోంది అక్క, , ఇది నిజమేనా అన్న భావం ఇంక తన కళ్ళల్లో కనపడుతోంది, ఇదెలా సాధ్యమైంది, వంశిలో ఎంత మార్పు కనపడుతోంది, మనిషి లో కొంచెం పెద్దమనిషి తరహా వచ్చింది, మాటల్లో స్థిరతత్వం కనపడుతోంది, ప్రతి పని ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నాడు, కొన్ని రోజుల్లోనే ఇలా ఎలా మారగలిగాడు, ఇంత పొందికతనం ఎలా వచ్చింది, అక్క ఎన్నిసార్లు అనుకుంటోందో, బావ సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నారు, ఇదంతా నా గొప్పతనమే అని సందర్భం వచ్చినప్పుడల్లా అందరితో అంటున్నారు,
“ఏమి మాయ చేసావురా, వంశి ఈ ఇంటిని ఈ ఊరిని వదిలి రానంటున్నాడు, అప్పగింతలు తర్వాత అక్క నన్నుసిద్దుని మురిపెంగా ఆటపట్టిస్తూ అడిగింది,
“ ఇందులో నాది, నాన్నది పాత్ర ఏమి లేదు అత్తయ్య, వంశి బావకి ఈ వూరు వచ్చాక ఒకటే కండిషన్ పెట్టాము, మన పొలంలో ఒక పంట చేతికి వచ్చేంతవరకు దానిని దున్నడం దగ్గరనించి పంట కోసేంతవరకు ప్రతి పని తానే చెయ్యాలని, తరువాత తన ఇష్టం అని చెప్పాము. నీకు తెలియంది ఏముంది అత్తా, ఇంక బావ భారమంతా నేలతల్లి చూసుకొంది, ప్రకృతి తలచుకుంటే సాధ్యం కానిది ఏముంది. బావ చాల తెలివైనవాడు అవడం మూలాన ప్రతి పని తేలికగా నేర్చేసుకొని అన్ని స్వయంగా తానే దగ్గరుండి చేసాడు, ఓరిమి విషయము అంటావు. అది కూడా మొక్కలనించే నేర్చుకొన్నాడు. మనం తొందరపడినంత మాత్రాన అవి పెరిగి పెద్దవైపోవుగా, తన చేతితో వేసిన విత్తనాలు ఇలా పెరిగి పంట రూపంలో చేతికి అంది రావడం బావ ప్రత్యక్షంగా చూసి ఆనందం అనుభవించాడు, అంతే కదూ బావా!” సిద్దు మాటలు వింటున్న వంశి కళ్ళల్లో ఆత్మసంతృప్తి కూడా కనిపించింది,
“ఈ విషయము ఐతే ఓకే రా, మీ పల్లెటూరి అమ్మాయి సృజన ఎలా నచ్చిందిరా” వంశిని ఉడికిస్తూ అడిగారు బావ,
“దానికి సమాధానం నేను చెపుతాను నాన్నా, ఆధునికత పేరుతో చక్కని అందాన్ని, అలవాట్లని వికృతంగా మార్చేసుకొంటున్నఆడవాళ్ళని చూసి చూసి ఇక్కడికి వచ్చాక సాంప్రదాయ దుస్తుల్లో, చక్కని వాలుజడతో తల్లి లేకపోయినా ఇంటిని, వంటని ఇంత చక్కగా చేస్తున్న సృజనని కాదనుకొంటే నాకన్నా దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనిపించింది నాన్న, అమ్మ మనసు కూడా తెలుసు కాబట్టి నేనే మావయ్యని సృజనని నాకివ్వమని అడిగాను”
పట్నం చదువులు, ఆధునిక పద్ధతులు మనిషిని ఇంకా ఉన్నతమైన పధం వైపుకి నడిపించగలవు, కానీ నాలాగే నేటి యువత వాటిని సద్వినియోగించుకోవటంలో పొరపడుతున్నారు, సరైన సమయంలో మావయ్య నాకు అండగా నిలబడి జీవిత మాధుర్యాన్నితెలియచేయడంలో సహాయపడ్డారు, అటువంటి మావయ్యకి ఏమి ఇచ్చినా ఋణం తీరదు నాన్న, అందుకని ఒక పని చేద్దాము, ఎన్నో ఏళ్లుగా మరచిపోయిన ఈ ఊరిని బాగు చేయటంలోను, ఇక్కడే ఉండి మన సొంత గడ్డ అభివృద్ధికి పాటుపడదామనిపిస్తోంది నాన్న, నువ్వు అమ్మ నా మాటని మన్నిస్తారని నా నమ్మకం,
ఎందుకు పనికి రాకుండా పోతాడేమో అనుకొన్న కొడుకు తను మారడం కాకుండా ఊరి బాగు కోరుకునే వాడిలా మారిన వాడిని చూస్తూ, నేటి యువత కూడా ఈ బాట అనుసరిస్తారని ఆశిస్తూ తమ సమ్మతం తెలుపుతూ కొడుకుని దగ్గరికి తీసుకొని ఆశీర్వదించింది అక్క

సమాప్తం

2 thoughts on “మారిన జీవితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *