June 24, 2024

మోదుగపూలు – 4

రచన: సంధ్య యల్లాప్రగడ

ఉదయం ఏడుగంటలకు లేచి బయటకొచ్చిన వివేక్‌కు అంతా హడావిడిగా కనిపించింది. ప్రక్క రూములో ఉన్న సాగర్ సారు ఉన్నాడేమో చూస్తే అతను రెడి అయిపోయి ఉన్నాడప్పటికే.
“శుభోదయం సారు” పలకరించాడు వివేక్‌.
“లేచారా! మీకు చెప్పలేదు కదా ఇక్కడ ఉదయం ఐదు నుంచి ఆరు వరకు యోగా ఉంటుంది. పిల్లలందరూ చేస్తారు. కొందరు టీచర్లు కూడా చేస్తారు. మేము ఉదయమే వాకింగ్‌కి వెడతాం. ఈ రోజు వెళ్ళి వచ్చేశాం కూడా” చెప్పాడతను.
“అవునా. రేపటి నుంచి నేన వస్తాలెండి” అన్నాడు వివేక్‌.
“సార్‌ ఉదయం ఎనిమిదిన్నరకు ప్రేయరు. దానికల్లా వచ్చేయి. ఏడున్నరకి టిఫిను ఉంటది. తీసుకో” సాగర్‌ గుర్తు చేశాడు.
వివేక్‌ తల ఊపి రూములోకి దూరాడు. త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని, బయటకొచ్చి టీ త్రాగుదామని డైనింగు హాలు వైపు సాగాడు.
అక్కడ రాజు సారు అతని వైఫ్ సుధా మేడమ్ ఉన్నారు. రాజు సారు వైఫ్ కూడా టీచరే. ఆమె చిన్న తరగతులకు సైన్సు బోధిస్తుంది. వాళ్ళకు పిల్లలు లేరు. వివేక్ ను చూసి నవ్వుతూ గ్రీట్ చేశారిద్దరూ.
వివేక్ వాళ్ళతో “మీరు బలే లక్కీ సార్. ఇద్దరూ టీచర్లే. చక్కగా కలసి ఇక్కడే పని చేస్తున్నారు” అన్నాడు సంతోషం ప్రకటిస్తూ.
రాజు సారు నవ్వి “మేము అలా కుదుర్చుకున్నాం!” అన్నాడు.
“కుదుర్చుకోవటమంటే?” అడిగాడు వివేక్‌ అర్థం కాక.
“ఇక్కడికి వచ్చాక, ఈ ఫెసిలిటీస్, పిల్లలు, వాతవరణం వదిలి ఎక్కడికీ పోబుద్ది కాదు. నాకే కాదు దాదాపు అందరిదీ ఇదే ఫీలింగు. చాలా వరకు టీచర్లును పెళ్ళి చేసుకుంటే, వచ్చే వాళ్ళు కూడా మన స్కూల్లో పని చేస్తున్నారు. అమ్మాయిలైతే, వాళ్ళ భర్తలు ఇక్కడ టీచర్లవ్వచు.” చెప్పాడను నవ్వుతూ.
“అలా కుదురుతుందా” అడిగాడు ‘ఇదేదో వింతగా ఉందే’ అని మనస్సులో అనుకుంటూ.
“ఎందుకు కుదరదు? సుధ ఇంతకు ముందు వేరే ప్రవేట్ స్కూల్లో చేసేది. పెళ్ళి తరువాత ఇక్కడ చేస్తోంది. మాకు పెళ్ళై నాలుగేళ్ళవుతోంది. చైతన్య సార్‌, మణి మేడమ్ హస్బెండులా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ జాయిన్‌ అయినాడు. టీచరుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మధు సారు వైఫ్ కూడా టీచరే. ఆమె డెలివరీకి వెళ్ళారు. ఇప్పడిప్పుడే రాదు. ఒక ఆరు నెలల గ్యాపు.” వివరించాడు రాజు సార్.
“వాళ్ళకు వేరే జూబు వస్తే?” వివేక్ ప్రశ్నించాడు.
“నీకు చెప్పలేదా ప్రసాద్ రావు సారు. గవర్నమెంటు జాబు వస్తే వెళ్ళవచ్చు. మరోటైతే వెళ్ళటము వేస్టు. ఇక్కడున్నంత ప్రశాంతత ఎక్కడా లేదు. ఫీమేల్ టీచర్సు మాత్రము పెళ్ళి తరువాత వెళ్ళిపోతారనుకో. లేకపోతే మన మణి మేడమ్ లాగా వాళ్ళ హస్పెండు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు. మన స్కూల్లో పని మానేసిన వారు లేరు. వీరన్నసారును చూశావు కదా. ఆయనైతే స్కూలు మొదలు పెట్టిన రోజు నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. మన స్కూలుకు మంచి పేరు జిల్లాలోనే కాదు పూర్తి స్టేటులో ఉంది” అన్నాడు రాజు సార్.
వివేక్‌కు తను వచ్చినది మాములు పాఠశాలకు కాదని, ఒక గొప్ప స్కూలుకని అర్థమవటము మొదలయ్యింది. కాని అక్కడ అన్నీ చాలా మాములుగా ఉన్నా అంతర్లీనంగా ఎదో గొప్ప మెసేజ్, గొప్ప కమిట్‌మెంటు, లేదా మరో వింతైన విషయమో దాగి ఉందనిపించింది. కుతూహలంగా కూడా అనిపించింది.
టీచర్లు వచ్చిన వారు వచ్చినట్లుగా, టీ, పొంగలి తీసుకొని తిని పోతున్నారు. మర్యాదగా అందరు అందరికీ గ్రీట్ చేసుకుంటున్నారు.
వివేక్ తన తిండి కానిచ్చి స్కూలుకు వెళ్ళాడు.
జాయినింగు లెటరు ఒకటి రాజు సారు కిచ్చి, స్కూలు ప్రేయరు అందరితో కలసి అటెండు అయ్యాడు. తనకు ఇచ్చిన క్లాసురూంకు రాజు సార్ తో కలసి వెళ్ళాడు.
పిల్లలు అందరూ లేచి “గుడ్‌మార్మింగు సార్!!” అంటూ కోరస్ పలికారు.
రాజు సార్ పిల్లలతో “వివేక్ సారు మీ తెలుగు టీచరు!” అని చెప్పి వెళ్ళిపోయాడు.
వివేక్ క్లాసురూంలోకి నడిచాడు.
పిల్లల హాజరు తీసుకున్నాడు.
అందరి పేర్లు అడిగి, హాస్టలా, లేక ప్రక్కనున్న పల్లె నుంచి వస్తారా? అంటూ ప్రశ్నలు వేశాడు. తరువాత పాఠము మొదలుపెట్టాడు.
***
ఆ వారం వివేక్‌కు చాలా త్వరగా గడిచిందనిపించింది. ప్రతిరోజు క్లాసులు తీసుకోవటం, పిల్లలు వింటున్నారో లేదో ప్రశ్నలడుగుతూ, వారి చేత పునః పునః వల్లె వేయిస్తూ, ఆ పాఠము పూర్తి కాగానే చిన్న పరీక్ష పెడుతూ విద్యను బోధించేవాడు. ఆ ప్రశ్నలు తయారు చేసుకోవటం, పిల్లలు జాగ్రత్తగా వింటునారాన్నది గమనించుకుంటూ ఉండటం, వారిలో ఒక మనిషిలా మెసలటంగా బోధన సాగేది. దానికై అతను ముందర రోజు చాలా ప్రిపేరయ్యేవాడు. చిన్న తరగతైనా, పెద్ద తరగతైనా తేడా లేదు. ఏ స్థాయి వారికి వారికర్థమయ్యేలా చెప్పటమే అతని లక్ష్యం.
ఆ వారం రోజులు అతనిని నాలుగు కళ్ళు సదా గమనిస్తున్నాయని, అతని మీద చిన్న రిపోర్టు తయారుచేసుకుంటున్నారని అతనికి తెలియదు. ఉదయమే నడక, టీ, పలహారం, స్కూలు, సాయంత్రం ఎవరికైనా ఏదైనా పాఠములో సహాయం కావాలంటే చెయ్యటం, మరుసటి రోజు పాఠానికి తయారు. అదో యజ్ఞంలా చేస్తున్నాడు. ఏదైనా పని తీసుకుంటే అలా రాత్రింపగళ్ళు చేస్తాడని అతనికి పేరుండేది. అది అక్కడి మిగిలిన టీచర్లుకు కూడా అర్థమయ్యింది.
అలా వివేక్ స్కూల్లో చేరిన మొదటి వారం చకచకా సాగిపొయింది. ఆ ఆది వారం సంత. పాఠశాల మామిడిపల్లి గ్రామ శివార్లలో ఉంది. పాఠశాలకు మైలు దూరంలో ఆదివారం సంత పెడతారు. మిగిలిన వారు సంతకెళ్ళాలని చాలా చాలా అనుకోవటం వివేక్ గమనించాడు. పిల్లలు కూడా సంత గురించి తెగ చెబుతున్నారు.
పట్నంలో పెరగటం వలన, పేదరికం వలన వివేక్‌ కు ఎటూ వెళ్ళే అవకాశం కలగలేదు. అందుకని ప్రతీదీ కొత్తగా, వింతగా ఉంది. అతను ఆనాటి సాయంత్రం సాగరుసార్‌ను అడిగాడు
“సంతలో ఏం దొరుకుతాయి సాగర్!” అంటూ
“పప్పులు, ఉప్పు, బియ్యం, నూనె, ఎండుచేపలు, వడియాలు, తదితర నిత్యావసర సరుకులు మొదలు ఫేస్‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూత్‌ పౌడర్, పేస్టూ, జండూబామ్‌‌‌‌‌‌‌‌ దాకా అన్నీ అక్కడే కొంటారు. వీళ్ళు నెలకు సరిపడా కాకుండా కేవలం వారానికి సరిపడా మాత్రమే కొంటుంటారు. తాము నడిచి వెళ్లేందుకు అందుబాటులో ఉండే సంతలనే ఇందుకోసం ఎంచుకుంటారు. ఆదివాసీలు, అందరూ వాడే వస్తువులు ఎక్కువగా వాడరు. టీవీల్లో ఎన్ని యాడ్లు వచ్చినా వాటిని కొనరు. సంతకు వ్యాపారులు తీసుకువచ్చే వాటినే కొంటుంటారు. బయట కిరాణాలలో కూడా ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేయరు. వీరి కోసం వ్యాపారులు తక్కువ ధరకు లభించే వస్తువులు తెస్తుంటారు. వారిపై నమ్మకంతో వారిచ్చిన వాటినే కొనుగోలు చేస్తారు. గిరిజనులు నమ్మకం పై చాలా కథలున్నాయి” అన్నాడు సాగర్ వివరంగా.
“అయితే మనం మనకు కావలసినవి ఇక్కడే కొనాలన్నమాట!” అన్నాడు వివేక్.
“అవును! మేము కూడా కావలసినవి సంతలోనే కొంటాం. సంతలో ఆడవాళ్ళకు కావలసినవి, పిల్లలకు కావలసినవి కూడా దొరుకుతాయి. రేపు ఆదివారం వెడదాం. మేము ఎలాగో వెడతాం. నీవు కూడా రా!” చెప్పాడు సాగర్.
“అసలు ఆదివాసులంత సత్యసంధులు మనకు ఈ నాగరికి ప్రపంచంలో కనిపించరు. వారు నీతిమంతులు. అమాయకులు. కట్టు మీద ఉండేవారు. వారిని చూసి ఈ నాగరిక ప్రపంచం సిగ్గుపడాలి. ఒకసారి ఏమైందో తెలుసా?” అన్నాడు సాగర్‌
“ఏమయింది?” కుతూహలంగా అడిగాడు వివేక్‌.
“మేము ఒక పెద్ద ఖర్బుజా బేరం చేస్తున్నాం. మాకు ఇవ్వనంటాడు తెచ్చిన ఆ గిరిజనుడు. ఇరవై రూపాలిస్తామన్నా, మాకివ్వక మేస్త్రీ కి మాట ఇచ్చానని అతనికే ఐదు రూపాయలకు అమ్మాడు. వాళ్ళను మనం కళ్ళు మూసుకు నమ్మవచ్చు!” చెప్పాడు సాగర్.
****
ఆ ఆదివారం ఉదయం వాళ్ళకు పెట్టిన సంకటి తిని, టీ తాగి కొందరు టీచర్లు సంతకు బయలుదేరారు.
ఒక మైలు వెళ్ళాక రోడ్డు మీదనే అటూ ఇటూ నేల మీద పట్టాలు మీద సమస్త వస్తువులను పరిచి కనపడ్డాయి. గిరిజనులు ఎందరెందరొ ఎక్కడ్నుంచో వస్తున్నారు, సామాను కొనటానికి, తమ వద్ద ఉన్న సరుకు అమ్మటానికి. అక్కడ ఎక్కడ చూసినా జనాలు. వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వివేక్ ఎన్నడూ అంత మంది గిరిజనులను చూడలేదు. కొందరు పూసలు పెట్టుకు అమ్ముతున్నారు. చాలా మంది స్త్రీలు ఆ పూసలు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. చాలా మంది స్త్రీలు, పురుషులు కూడా ముక్కుకు పోగులతో ఉన్నారు. పూసలు ధరించిన స్త్రీలు చాలా మందే కనిపించారు సంతలో.
వారంతా కూడా వేరే వేరే భాషలు మాట్లాడుతున్నారు. తన పక్కనే ఉన్న చైతన్యతో “వాళ్ళు మాట్లాడే భాష ఏంటి చైతన్యా?” అని అడిగాడు వివేక్.
“హో! అది వాళ్ళ భాష. గిరిజనులకు వాళ్ళ భాష వాళ్ళకుంటుంది వివేక్‌. మనకు ఇక్కడ ఎక్కువ గోండులు, కొలాములు. గోండులు మాట్లాడేది గోండి. కొలాములు మాట్లాడేది కొలామి. మన పిల్లలు చాలా మంది ఈ కొలామే మాట్లాడుతారు” వివరించాడు చైతన్యసార్‌.
టీ కప్పు, చాయ్‌ పత్తా ఒక గిన్నె తీసుకున్నాడు వివేక్ చాయ్‌ చేసుకోవటానికి. వివేక్ మనస్సులో వింతగా ఉంది. ‘నేను నిజంగా ట్రైబల్‌నా? నాకేమీ తెలీదు. ఒక్క ట్రైబల్‌ సర్టిఫికేటుతో చదువు, వసతి లభించింది. నా వాళ్ళు ఎవరు? ఎక్కడున్నారు. వాళ్ళ భాషేంటి? ఎందుకు నాయన ఇలా పెంచారు’ ఇలా మధనపడుతూ ఆలోచనలలో ఉండిపోయాడు. మిత్రుడు భుజం తట్టి “నీవు తీసుకోవలసినవి అయితే వెనక్కి పోదాం. మా షాపింగు అయింది” అన్నాడు.
మౌనంగా తల ఊపాడు వివేక్. అతను అన్యమస్కంగా ఉండటము మధు సార్‌ గమనించాడు. పాఠశాలకు తిరిగి వచ్చాక అందరు మధ్యహ్నం భోజనాలు కానిచ్చారు. ఎవరి బసకు వాళ్ళు వెడుతుండగా మధు వివేక్‌ను సమీపించి “వివేక్ ఏమయింది? అలా ఏవో ఆలోచనలు పెట్టి ఉన్నావు? సంత దగ్గర్నుంచి గమనించా నిన్ను!” అన్నాడు.
వివేక్ మధును చూస్తూ ‘తనను గమనించేవారున్నారన్నమాట’ అనుకుంటూ “మధుసార్! నేనూ గిరిజనుడినే. కానీ నాకు నా ట్రైబ్‌, భాషా వివరాలు ఏమీ తెలియవు. మా నాయన ఏమీ చెప్పలేదు. ఇప్పడు ఆయన లేడు కూడా. అమ్మకు ఏమీ తెలియదు. చెప్పదు. మా భాష ఒకటి ఉందని కూడా ఈ రోజు వరకు నాకు తెలియదు” అన్నాడు దిగులుగా.
“మీ ఇంటికి చుట్టాలెవ్వరు వచ్చేవారు కారా?” అడిగాడు మధు.
“లేదు. నా చిన్నప్పుడెప్పుడూ ఎవ్వరూ రాలేదు. మా అమ్మా, నాయనా కూడా ఎక్కడికీ వెళ్ళేవారు కారు. గిరిజనులమన్న చిహ్నాలు కూడా వారి వద్ద ఉన్నట్లు నాకు గుర్తు లేదు” అన్నాడు వివేక్.
“మన చంద్రయ్య ఉన్నాడు కదా. అతనికి ఈ చుట్ట ప్రక్కల తండాలన్నీ కొట్టిన పిండి. అతనితో రోజూ కాసేపు మాట్లాడు, తెలుస్తుంది. వారం రోజులలో నీకు మహాభారతం రాయగల జ్ఞానమిస్తాడు” అన్నాడు నవ్వుతూ మధు.
చంద్రయ్య అక్కడ హెల్పరు. ఉదయం, సాయంత్రం టీలు, గంట గంటకు బెల్లు కొట్టడం, నోటిసులు పంచటం ఇలాంటివన్నీ చేస్తాడు. గేట్‌మెన్‌, వాచ్‌మెన్‌ కూడా అతనే. వయస్సు అరవైలోఉండవచ్చు. అందరూ “తాతా” అని చాలా గౌరవంగా పిలుస్తారు. పిల్లలు చదువుకుంటుంటే ముద్దుగా చూసుకుంటాడు చంద్రయ్యతాత.
వివేక్ అతనితో మాట్లాడాలనుకున్నాడు. ‘ఏం తెలుస్తుంది మాట్లాడితే?’అంటూ ఆలోచనలో పడ్డాడు…

సశేషం…

4 thoughts on “మోదుగపూలు – 4

  1. నేను 1987 నుంచి 1990 వరకు ఒక గిరిజన ప్రాంతంలో బేంక్ మేనేజర్ గా చేశాను. గిరిజనుల జీవన విధానం వారి మధ్య ఒకనిగా మెసలుతూ గమనించే వాణ్ణి. అవన్నీ మళ్ళీ కళ్ళకు కట్టినట్లు విశదీకరిస్తున్నారు రచయిత్రి. ఆవిడ పరిశీలనా దృక్పథానికి జేజేలు పలుకుతున్నాను.

  2. గిరిజన వాసుల గురించి, చాలా విపులంగా వివరించారు, ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *