February 22, 2024

సగటు జీవి సంతోషం

రచన: రాజ్యలక్ష్మి బి

రంగయ్య రిక్షా ప్రక్కన నించుని అలసటగా ఒళ్లు విరుచుకున్నాడు. అరచేతులు మొద్దుబారాయి. అలవాటు లేని రిక్షా బ్రతుకుతెరువు, తనలో తనే నవ్వుకున్నాడు. పట్టణం అంటేనే బ్రతుకుపోరాటం ఒకరు దయ తలిస్తేనే యింకొకరి మనుగడ. రంగయ్య యిప్పుడు విరక్తిగా జీవం లేని నవ్వు నవ్వుకున్నాడు. కారణం యేమిటంటే….
రంగయ్య తన చిన్నపల్లెలో పచ్చని పొలాలు, వ్యవసాయం అక్కడ జీవనాధారం. కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర. చల్లని ప్రశాంత జీవనం. భార్యా, యిద్దరు బిడ్డలూ, తల్లి. రంగయ్య తన ఐదెకరాల పొలంలో ఒక ప్రక్క కాయగూరలు, మరొక ప్రక్క వరి చేను! హాయిగా యెవరి మీద ఆధారపడకుండా వున్నంతలో కలతలు లేని కాపురం. అయితే ఆ పల్లెటూళ్లో చెరువులెన్ని వున్నా వ్యవసాయం వానచినుకు మీదే ఆధారపడింది. పల్లె కళ పంటచేలే కదా!
అదేం ప్రారబ్దమో కానీ వరుసగా నాలుగేళ్లనించి వానచినుకే కరువయ్యింది. నల్లమబ్బు కోసం యెదురు చూడ్డం నిరాశ చెందడం అలవాటైపోయింది. తొలకరి వర్షం కోసం యెదురుచూస్తూ విత్తనాలు నాటడం, చినుకు లేక పొలాలు బీళ్లయ్యాయి. రైతన్న కళ్లు కన్నీటి ధారలయ్యాయి. కష్టాలు మొదలయ్యాయి. రంగయ్య జీవన పోరాటం మొదలయ్యింది. రైతే రాజుగా బ్రతికిన తన పల్లెలోనే తిండిగింజలే. కరువయ్యాయి. చిన్నబిడ్డలూ, పెద్దవయసు కన్నతల్లీ. రంగయ్యకు ఆరాటం, తపనా మొదలయ్యాయి. కొన్నాళ్లు కొండల మీద ఆకులు తెంపుకొచ్చి గంజి కాచుకున్నారు. పశువులను మేపుకున్నారు. కానీ ఎండలకు ఆకూ అలము కూడా మాడిపోయాయి. డొక్కలెండిన పశువులను చూస్తే రంగయ్యకు దిగులుగా వుంది. ఆకులూ కరువయ్యాయి, గంజీ కరువయ్యింది. రంగయ్యకు దిక్కు తోచడం లేదు. భార్యా బిడ్డలూ డొక్కలెండిపోయి మంచినీళ్లు త్రాగి గడిపేస్తున్నారు. కానీ రంగయ్యకు తన కన్నతల్లిని చూస్తే దుఃఖం ఆగడం లేదు. తనవాళ్లను బ్రతికించుకోవాలి, కాపాడుకోవాలి యిదే తపన మొదలయ్యింది అతనిలో. .
ఒకరోజు తన పల్లెటూళ్లో పట్టణం నించి వచ్చిన మోతుబరి రైతు బంధువు కనిపించాడు. ఆయన పట్నం లో యేదో ఒక బ్రతుకుతెరువు దొరుకుతుందని హామీ యిచ్చాడు. ఆ రోజే పట్నానికి బయల్దేరుదామనుకున్నాడు. కానీ రంగయ్య తల్లి ససేమిరా ఒప్పుకోలేదు.
“పట్నంలో వాళ్లకు డబ్బు తప్ప మరో ధ్యాసుండదు, గొడ్డు చాకిరీ చేయుంచుకుంటారు, జాలీ, దయా వుండవు. రోగం వస్తే పలికే దిక్కుండదు కలో, గంజో యిక్కడే తాగుదాం, యిక్కడే చద్దాం ” రంగయ్య తల్లి నిక్కచ్చిగా అన్నది.
రంగయ్య ఏం మాట్లాడలేదు. కొన్నాళ్ళాగి పట్నం వెల్దామనుకున్నాడు. సుమారు నెలరోజులు వాన చినుకు ఆశతో యెదురు చూసాడు. కానీ ఫలితం లేకపోయింది. భార్యను ఒప్పించి తల్లికి చెప్పకుండా ఒకరాత్రి పట్నానికి బయల్దేరాడు. ఆ పల్లెలో రైలు మూడునిమిషాలు ఆగుతుంది. మొత్తానికి తెల్లవారేసరికి పట్నం చేరాడు. అతను యెన్నడూ పల్లె దాటలేదు. రైలు దిగగానే ఒక్క సారిగా కళ్లు చెదిరాయి. జనాలే జనాలు, అందరూ యేదో తరుముతున్నట్టు గబగబా నడుస్తున్నారు. అందర్నీ తప్పుకుంటూ చేతిలో గుడ్డసంచీతో కొద్దిదూరం వున్న ఇడ్లి బండి దగ్గరకెళ్లాడు. కానీ వున్న కాసిని డబ్బులు ఖర్చు అయిపోతే !అందుకని పంపు నీళ్లు త్రాగి కడుపు నింపుకున్నాడు. కార్లూ, భవంతులూ, జనాలను చూస్తూ నడక సాగించాడు. ఎటు పోవాలో, , యెవరిని అడగాలో తెలియడం లేదు. ఆలా రెండు గంటలు యెండలో తిరిగి తిరిగి అలసిపోయి ఒక కిరాణా కొట్టుదగ్గర ఆగాడు. అక్క్కడ యెవరినయినా తనకు పనిప్పించమని అడుగుదామంటే మొదట జంకాడు. అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. యింతలో బియ్యం బస్తాలు ఒక రిక్షాలో వేసుకుని లాక్కొస్తున్న తనలాంటి కష్ట జీవిని చూసాడు. మూడు పెద్దబియ్యం బస్తాలు కొట్లో ఒక మూల వీపుమీద మోసుకొచ్చి పడేసి, కూలీ తీసుకుని బయటకొచ్చిచేతిగుడ్డతో చెమట తుడుచుకుంటున్నాడు. అతను రంగయ్యను చూసాడు. దిగాలుగా, బిక్కమొహం నిలబడ్డ రంగయ్యలో తనలాంటి కష్టజీవే కనపడ్డాడు. అధిగ్రహించి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు.
రంగయ్య తన పరిస్థితి చెప్పాడు.
“నా పేరు కోటయ్య! నే వచ్చి శానా రోజులయ్యింది, అలవాటు లేని పని, కొంచెం కష్టమే, నువ్వు సేత్తానంటే మిల్లు కాడికి తీసుకెళ్తా.”అన్నాడు కోటయ్య.
రంగయ్య ఒప్పుకున్నాడు. కోటయ్య తన రిక్షాను లాక్కుంటూ, రంగయ్యను కూడా వెంటబెట్టుకుని మిల్లు యజమాని దగ్గరకు తీసుకెళ్లాడు. సుమారు రెండు గంటలు నడిస్తే కానీ మిల్లు రాలేదు. దోవలో కోటయ్య రంగయ్యకు రెండు అరటిపళ్ళిచ్చి తినమన్నాడు. రంగయ్య మొహమాట పడుతూనే ఆకలికి తట్టుకోలేక తినేసాడు. యజమాని ఒప్పుకుని రంగయ్యకు రిక్షా యిప్పించాడు. పట్నం వచ్చిన మొదటి రోజే పని దొరికినందుకు సంతోషపడ్డాడు. యజమాని ఆ రోజు పని లేదని మర్నాడు రమ్మన్నాడు. అందరూ రిక్షాలు అక్కడే వదిలి వెళ్లాలి. ఒక గండం గట్టెక్కాడు. కోటయ్య తన గుడిసె ప్రక్కన తెలిసిన యింట్లో చిన్న అరుగుమీద పడుకోమన్నాడు. కష్టపడే వాడికే మరొకడి కష్టం తెలుస్తుంది అనుకున్నాడు రంగయ్య.
పట్నం అంటే అర్ధం అయ్యింది. డబ్బున్నవాడికి యే కొరతా లేదు, యెక్కడ చూసినా రకరకాల తిండి బళ్లు కానీ డబ్బు లేనివాడికి తిండి కరువే ! ఒక కుంటివాడు హోటల్ ప్రక్కన బొచ్చె పట్టుకు నించున్నా యెవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒక బాలింతరాలు చంటిబిడ్డతో ‘ బాబూ. బాబూ ‘ అంటూ ఆడుకుంటుంటే అందరూ చీదరించుకుంటూ వెళ్లిపోతున్నారు. రంగయ్యకు బాధేసింది. వాళ్లు తలా ఒక ముద్దేసినా ఆ బిచ్చగత్తె కడుపు నిండుతుంది కదా అనుకున్నాడు. అదే తన పల్లెలో పిలిచి మరీ తమకున్నదాంట్లోనే కాస్త పెడతారు.
బియ్యం మిల్లు దగ్గర రిక్షా పెట్టుకుని నించున్నాడు రంగయ్య. ఒక ఆసామి మూడు బియ్యం బస్తాలు వేయించాడు రంగయ్య రిక్షాలో. అయన “యెంత యివ్వాలి “అడిగాడు. అనుభవం, అడగడం తెలియని రంగయ్య “మీ యిష్టం బాబూ “అన్నాడు. ఆసామి నవ్వాడు. అయన తన బైక్ మెల్లిగా వెళ్తూ కొట్టుకు దోవ చూపించాడు. గతుకుల, ఎత్తుపల్లాల కంకరరోడ్డు, చెమటలు కారుస్తూ మొత్తానికి ఒక గంటకు చేరాడు. మూడు బస్తాలు మోసుకెళ్లి మూలాన పెట్టాడు. ఆసామి త్రాగడానికి మంచి నీళ్లయినా యివ్వకుండా చేతిలో పది రూపాయలు పెట్టి పంపించాడు. ఊసురోమంటూ కాళ్ళీదుకుంటూ మిల్లు దగ్గరకొచ్చాడు రంగయ్య. ఆ రోజు దీపాలు పెట్టేదాకా మూడు ట్రిప్పులు కొన్ని దూరం, కొన్ని దగ్గరా వేసాడు. చేతిలో యాభై రూపాయలు పడ్డాయి. అరుగుమీద కూర్చుని తన కష్టానికి, శ్రమకూ, ఆ డబ్బులు యెక్కువో, తక్కువో అర్ధం కాలేదు. కానీ యింటికి కొంత పంపి తన వాళ్ల కడుపు నింపవచ్చన్న ధైర్యం కలిగింది.
రంగయ్యకు శ్రమ అనిపించినా, అలసటనిపించినా తన తిండి ఖర్చు తగ్గించుకుంటూ యింటికెక్కువ పంపుతుండేవాడు. ఒక్కోరోజు యెండలో లాగలేకపోయేవాడు. డబ్బు సంపాదిస్తున్నాడు కానీ హాయి లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తున్నది. తన పల్లెలో రాజు లాగా వున్నాడు. ఇక్కడ అడుగడుగునా దండాలు పెట్టాలి, కోపం, విసుగూ అసలుండకూడదు. ఇక్కడ స్వార్థమెక్కువ. మొదట్లో బియ్యం బస్తాలు రిక్షాలో వేసుకుని లాగడం సిగ్గనిపించేది. తలొంచుకుని ఎంతిస్తే అంత పుచ్చుకునేవాడు. ఒక దుకాణం యజమాని మాత్రం యెప్పుడూ తన రిక్షా కోసమే యెదురు చూసేవాడు. రంగయ్య కోసం వెతుక్కునేవాడు మొదట్లో రంగయ్య ఆయన తనకోసం ఎదురుచూడ్డం సంతోషంగా వుండేది. తర్వాత తెలిసింది ఆయన కొట్టుకు కనీసం యాభై రూపాయలు కూలి అవుతుందనీ, తనకు యిరవై రూపాయలే యిస్తున్నాడని.
రంగయ్యకు తెలిసిన తర్వాత నవ్వొచ్చింది. ఇంత డబ్బున్నవాడు కేవలం ముఫై రూపాయలు తగ్గించుకోవడం కోసం తనతో నవ్వుతూ మాట్లాడడం, పొగడడం అందుకేనని అర్ధమైన తర్వాత అసహ్యమేసింది. ఒకరోజు కొద్దిగా చినుకులు పడ్తున్నాయి, రిక్షా పెట్టుకుని కూర్చున్నాడు రంగయ్య. అదే కొట్టాయన రోజు కన్నా యింకో బస్తా యెక్కువేయించాడు. వాన చినుకుల్లో బస్తాలను లాక్కుంటూ తడుస్తూ వెళ్తున్నాడు. అడుగులు తడబడ్తున్నాయి, తను యిక్కడ కట్టుబానిసయ్యాడు. ఇక్కడ డబ్బుల్లేకపోతే చులకన. చాకిరీ బాగా చేయించుకుంటారు, డబ్బులిచ్చేటప్పుడు మాత్రం కొసరి కొసరి యిస్తారు. తన పల్లెలో యీ బాధలు లేవు. అక్కడ యెన్ని కష్టాలున్నా, యే పరిస్థితులలో వున్నా, ఒకళ్లనొకళ్ళు ఆదుకుంటారు.
చినుకులు పెద్దవయ్యాయి. తడుస్తున్నాడు, అయినా లాగుతున్నాడు, బురదలో కాలుజారింది, కళ్లు తిరిగి పడిపోయాడు. రిక్షా ప్రక్కకు ఒరిగింది. కొట్టు యజమాని “అయ్యో, , , , , , అయ్యో బస్తాలు “అరుస్తూ బస్తాలన్నీ అక్కడ కనిపించిన యింటికప్పు కిందికి లాగాడు. రంగయ్యను విసుక్కున్నాడు.
“వీడి మూలంగా బస్తాలన్నీ తడిసాయి. దరిద్రగొట్టు మొహం “విసుక్కున్నాడు. అక్కడ చుట్టుప్రక్కల సాటి కష్టజీవులు రంగయ్యను లేపి ఒకచోట కూర్చోబెట్టి తుడిచి మంచి నీళ్లిచ్చారు. యజమాని కనీసం దెబ్బలేమైనా తగిలాయా అని కూడా అడగలేదు. రంగయ్యకు తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. జాలీ, దయా లేని పట్నం జనాలు !
రంగయ్యకు యిప్పుడు పట్నమంటే వుత్సాహం లేదు, తన పల్లె, తన వాళ్లు పదే పదే గుర్తుకొస్తున్నారు. తన పల్లెలో వర్షాలు పడుతున్నాయని, చెరువులు నిండుతున్నాయనీ, నీళ్లకు కొదవ లేదనీ తెలిసింది. రంగయ్య కళ్లల్లో ఆనందం చిన్నపిల్లాడిలా గంతులేసాడు. పల్లెకు బయల్దేరాడు. పట్నం లో డబ్బొస్తుంది కానీ హాయి లేదు. పల్లెలో గంజి త్రాగినా హాయిగా వుంటుంది. తల్లి మాటలు “ఉన్నవూరు కన్నతల్లి రా ” రంగయ్యకు యిప్పుడు తన పల్లె పచ్చటి పొలాలూ కళ్లల్లో మెదిలాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *