March 28, 2024

సాఫ్ట్‌వేర్ కథలు: 2 – పచ్చడి

రచన: రవీంద్ర కంభంపాటి

ఉదయం ఎనిమిదిన్నర కావొస్తూంది.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా అటూ ఇటూగా అదే టైముకి వచ్చే ఆ ఐటీ కంపెనీ బస్సు , ఆ రోజు కూడా టైముకే ఆఫీసు చేరుకుంది.
అంత సేపూ బస్సులో కూచుని ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉన్న ఆ కంపెనీ ఉద్యోగులు, బస్సు దిగి, మళ్ళీ ఎవరి ఫోన్ల వేపు వాళ్ళు చూసుకుంటూ ఆఫీసు వేపు నడవడం మొదలెట్టేరు. ఆఫీసు ముందున్న విశాలమైన లాన్ లో మొక్కల పని చూసే లాల్ సింగ్ తన పనాపేసి, ఆ వచ్చే ఉద్యోగుల వేపు చూస్తున్నాడు. అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ఈ బస్సు దిగి ఆఫీస్ లోకి వెళ్ళేలోపు వీళ్ళు ఈ ఫోన్ వేపు చూడలేకుండా ఉండేంత కొంపలంటుకుపోయే పని వీళ్ళకేముంటుందో పాపం అనుకున్నాడు.
దూరంగా నడిచొస్తూ ప్రపూర్ణ కనిపించింది.. నిజానికా ఆ అమ్మాయి పేరు లాల్ సింగ్ కి తెలీదు. గార్డెనింగ్ పని చేసే తను ఆ అమ్మాయి పేరు అడిగేంత సాహసం చెయ్యలేడు. మొహం మటుకు గుర్తుపడతాడు. నిజమే ప్రపూర్ణ పొందికైన పిల్ల, ఆమెలో ఈ కాలం జనాల అతి కనిపించదు. మొక్కలంటే చాలా ఇష్టం తనకి, రోజూ ఆఫీస్ లోకి వస్తూ ఆ లాన్ లో ఉన్న రకరకాల మొక్కల్ని పలకరిస్తుంది. ఆకుపచ్చగా ఉండే ఆ మొక్కలన్నీ చూస్తేనే, తనకి ఓ ఆత్మీయ పలకరింపు కనబడుతుంది, తను కూడా ఆ మొక్కల్ని చూస్తూ అప్రయత్నంగా చిరునవ్వులు రాలుస్తుంది.. ఆ మొక్కల్ని అంత బాగా చూసుకుంటున్న లాల్ సింగ్ వేపు ఓ అభినందన తో కూడిన చిరునవ్వు పడేస్తుంది.
రేపు తన కూతురు రష్మి పెద్దదైతే ఈ అమ్మాయిలా ఉండాలి అనుకుంటూంటాడు లాల్ సింగ్.
కానీ ఆ రోజు ప్రపూర్ణ మొహంలో సంతోషం లేదు.. ఇంకా చెప్పాలంటే ఓ విధమైన నిస్సహాయత ఉంది, చిన్నప్పటినుండీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు తనకి ! దానికి కారణం ఇందాక బస్సులో ఆఫీసుకి వస్తూండగా శ్రీరామ్ నుంచి తనకొచ్చిన ఫోన్ కాల్ !
ప్రపూర్ణకి తెలుసు, శ్రీరామ్ ఎందుకు ఫోన్ చేసేడో, కాకపోతే తన వెర్షన్ వినే అవకాశం ఇస్తాడనుకుంది, కానీ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
‘అసలు నీకు ఆ వినయ్ తో ఇంతకు ముందు లవ్ అఫైర్ ఉందని ఎందుకు చెప్పలేదు? అన్నీ దాచేసి నాతో పెళ్ళికి ఒప్పుకున్నావా ? అసలేమిటి నీ ప్లాన్ ? మీ ఇంట్లో వాళ్ళకు నచ్చిన నన్ను పెళ్లి చేసుకుని, అమెరికా వచ్చాక ఆ వినయ్ గాడితో జంపైపోదామనే కదా ? మా ఫ్యామిలీ పరువు తీసి మమ్మలందర్నీ బజార్లో నిలబెట్టేద్దామనే నీ ప్లాన్ తెలీనంత ఇన్నోసెంట్ ఫెలోని కాదు నేను.. ‘ అంటూ శ్రీరామ్ అరుస్తూంటే, ప్రపూర్ణ ‘ప్లీజ్.. ఇప్పుడు కాదు.. ఆఫీస్ బస్ లో ఉన్నాను.. అందరి ముందూ మాట్లాడలేను ‘ అని చెప్పే ప్రయత్నం చేసింది, కానీ శ్రీరామ్ కి ఎక్కడా ఆ అమ్మాయి మాటలు వినే ఉద్దేశం లేదు, పైగా ‘నేను మాట్లాడుతూంటే మధ్యలో మాట్లాడ్డానికి నీకెంత ధైర్యం ? ఇప్పుడే మా ఇంట్లో, మీ ఇంట్లో నీ విషయం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను ‘ అని ఫోన్ పెట్టేసేడు.
తన ప్రాజెక్ట్ ఫ్లోర్ లోకి ప్రవేశించిందే కానీ ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు ప్రపూర్ణకి. అప్పటికే శ్రీరామ్ ఫోన్ చేసి చెప్పేసినట్టున్నాడు, తన తండ్రి నుంచి ఫోన్. భయం భయంగా తీసింది ‘దొంగ రాస్కల్.. ఆ వినయ్ గాడి విషయం మర్చిపొమ్మని చెప్పేనా ? సిగ్గులేకుండా మళ్ళీ వాడిని శ్రీరామ్ దగ్గిరకి రాయబారం పంపిస్తావా? అదీ మీ ఇద్దరూ తీసుకున్న ఫోటోలతో? బంగారం లాంటి సంబంధం నాశనం చేసుకుని, నన్ను రోడ్డు మీద నిలబెట్టేసేవు కదే ‘ అంటూ తిట్లు మొదలెట్టేసరికి, కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి, బ్రేక్ఫాస్ట్ కి వెళదామంటూ తన కొలీగ్స్ సాహితి, ఆయుష్ వచ్చేరు, మీరు వెళ్లండంటూ సైగ చేసి, తన సీట్లో కూలబడింది.
ఇంక తిట్టడానికి తిట్లేమీ లేవేమో మరి, ‘సరే.. నీ సంగతిలాక్కాదు.. ఇంటికిరా చెబుతాను ‘ అంటూ తండ్రి ఫోన్ పెట్టేసేడు.
ప్రపూర్ణ గబగబా వాష్ రూమ్ కి వెళ్లి మొహం కడుక్కుని, కామ్ గా ఆఫీస్ టెర్రస్ వేపు నడిచింది. సాధారణంగా అక్కడ ఎవరూ పెద్దగా ఉండరు, ఎప్పుడైనా సిగరెట్లు కాల్చుకోడాని కొచ్చే కొంతమంది ఎంప్లాయిస్ తప్ప. అక్కడికెళ్లి, వాటర్ ట్యాంక్ కి కాస్త వెనగ్గా కూచుని స్థిమితంగా ఆలోచించడం మొదలెట్టింది.
అసలు చిన్నప్పటినుంచీ తనెప్పుడూ తండ్రి గీసిన గిరి దాటి చేసిన పనేదీ లేదు, నిజానికి తనకి ఇంగ్లిష్ లో గ్రాడ్యుయేషన్ చెయ్యాలని ఉండేది, కానీ తండ్రి ఖరాఖండీగా చెప్పేసేడు ‘నాకు తెలిసిన వాళ్ళ పిల్లలందరూ చక్కగా కంప్యూటర్స్ చదువుకుని, ఓ ఐటీ ఉద్యోగం తెచ్చేసుకున్నారు. వెంటనే అమెరికా నుండి సంబంధాలే సంబంధాలు.. నువ్వు వేరే ఆలోచనలేవీ పెట్టుకోకు.. పెట్టుకున్నా నేను పడనియ్యను.. కాబట్టి బుద్ధిగా కంప్యూటర్స్ చదివేడు.. ఏదో ఓ ఐటీ కంపెనీ ఉద్యోగం ఇచ్చేడుస్తుంది ‘.
కాస్త అందంగానే ఉంటుందేమో, తనకి తొమ్మిదో క్లాసు నుంచే చాలా మంది కుర్రాళ్ళు వెంటపడేవారు, ఎవ్వరినీ పట్టించుకోలేదు. కానీ ఈ వినయ్ విషయం లో అలా కుదర్లేదు. వినయ్ తన ప్రాజెక్ట్ లీడర్, మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాడట. చాలా సార్లు ప్రొపోజ్ చేసేడు. తన టీం లో కొలీగ్స్ కి కూడా తన మీద అతనికి ఇష్టం ఉందని అర్ధం అయ్యి, తనని టీజ్ చెయ్యడం మొదలెడితే, ఆ వినయ్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, ‘మా నాన్నగారి మాట దాటి నేను చేసుకునేది లేదు.. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు ‘ అని. ‘మరీ మంచిది.. నేను మా పేరెంట్స్ తో పాటు మీ ఫాదర్ ని అప్రోచ్ అవుతాను.. అప్పుడు డైరెక్ట్ గా పెళ్ళే ‘ అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేడు వినయ్.
అతను అన్నట్టుగానే, తన పేరెంట్స్ ని తీసుకుని ప్రపూర్ణ తండ్రి దగ్గిరకి వెళ్ళేసరికి, ఆయన కూతుర్ని పిలిచి ‘ఏమే..నువ్వు ఇతన్ని రాయబారం పంపించేవా లేకపోతే ఇతనే వచ్చేడా ?’ అంటూ ఒక్కరుపు అరిచేడు
‘లేదు నాన్నా. అతను నన్నడిగితే. నేను వద్దన్నాను. కానీ అతనే వచ్చి మాట్లాడతారన్నారు ‘
‘ఏమిటి మాట్లాడేది? నా కూతురికి ఇండియా సంబంధం చెయ్యను.. కాబట్టి మీరెళ్ళొచ్చు ‘ అన్నాడాయన వినయ్ వాళ్ళతో
‘అదికాదన్నయ్య గారూ.. మా వినయ్ కూడా ఈ నెలాఖరుకి వాళ్ళ కంపెనీ తరఫున అమెరికా వెళ్తున్నాడు ‘ అంది వినయ్ తల్లి
‘అదీ ఓ వెళ్లడమే? వాళ్ళు పంపితే వెళ్ళాలి.. పిలిస్తే రావాలి.. అదీ ఓ ఉద్యోగమేనా ? నేనాల్రెడీ ఓ కుర్రాణ్ణి సెలెక్ట్ చేసేను.. శ్రీరామ్ అని డల్లాస్ లో ఉంటాడు.. పెద్ద ఉద్యోగం.. గ్రీన్ కార్డు ఉంది.. దీని ఫోటో వాళ్ళ అమ్మానాన్నా పంపగానే, నచ్చేసిందట.. రేపు సాయంత్రం దీంతో వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడతాడు.. అతనికి నచ్చితే, రెండు నెలల్లో పెళ్లి.. కాబట్టి మీరింకెళ్లొచ్చు ‘ అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయేడు ప్రపూర్ణ తండ్రి.
మర్నాడు వినయ్ ఆఫీస్ కి రాలేదు.. సాయంత్రం శ్రీరామ్ ప్రపూర్ణకి వాట్సాప్ లో వీడియో కాల్ చేసి మాట్లాడేడు,’ఇంత అందమైన అమ్మాయిలు ఇంకా భూమ్మీద ఉన్నారని తెలీదు నాకు ‘ అంటూ ఏవేవో మాట్లాడేడు, ఏం మాట్లాడితే ఏం గొడవొస్తుందో అనుకుంటూనే ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా ఆ కాల్ ముగించింది ప్రపూర్ణ.
ఆ తర్వాత రోజు ఆఫీస్ లో వినయ్ కనిపిస్తే అతనికి చెప్పింది ప్రపూర్ణ తన పెళ్లి కుదిరిన విషయం. అతనేమీ మాట్లాడలేదు. ‘నా ఫోటో ఒకటి మీ ఫోన్లో చూసేను..ప్లీజ్ డిలీట్ చేసెయ్యండి ‘ రిక్వెస్ట్ చేసింది.
‘నీ ఫోటోనా?’
‘అదే.. మన కొలీగ్ లాస్య బర్త్ డే పార్టీలో మనిద్దరం పక్కపక్కన నుంచుని ఉంటే సందీప్ తీసిన ఫోటో ‘
‘అది నేను డిలీట్ చేసేసేను’
‘అంటే.. నేను మొన్న మీ క్యూబికల్ పక్కనుంచి వెళ్తూంటే.. మీరు మీ ఫోన్లో ఆ ఫోటో చూడడం నేను చూసేను ‘
‘ఆ తర్వాత డిలీట్ చేసేసేను.. కావాలంటే నా ఫోన్ చూసుకో.. అంటే నా మీద అంత లో ఒపీనియన్ అన్నమాట నీకు.. ఈ నెలాఖరుకి నేను కూడా డల్లాస్ వెళ్తున్నాను కాబట్టి.. అక్కడ మీ శ్రీరామ్ ని కలిసి ఈ ఫోటో చూపిస్తానని నీ డౌట్.. అంతేగా ?’
‘ఛఛ..లేదు..నేను అలా ఆలోచించలేదు.. నా పెళ్ళి కుదిరింది కదా.. నా ఫోటో మీ దగ్గరెందుకని.. అయినా మీరు డిలీట్ చేసేసేను అంటున్నారుగా.. ఐ బిలీవ్ యు ‘ అనేసి వెళ్ళిపోయింది ప్రపూర్ణ !
ఇవన్నీ తల్చుకుంటూంటే అప్పుడు తట్టింది తనకి.. అంటే వినయ్ ఆ ఫోటో వినయ్ డిలీట్ చెయ్యలేదన్నమాట, దాన్ని యూస్ చేసుకుని శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి ఓ లవ్ స్టోరీ అల్లేసి చెప్పేడని ! ఇప్పుడు వినయ్ ని కాంటాక్ట్ చేసి ఎందుకిలా చేసేవని అడిగి ప్రయోజనం లేదు, తన తండ్రికి విషయం వివరించినా అర్ధం చేసుకోడు, ఇంక శ్రీరామ్ ఒక్కడికే ఇదంతా అర్ధం అయ్యేలా చెబితే ఏమైనా ఫలితం ఉండొచ్చని, వెంటనే అతనికి కాల్ చేసింది, అందడం లేదు.. కాసేపు తర్వాత అర్ధం అయ్యింది ప్రపూర్ణకి, తన నెంబర్ బ్లాక్ చేసేసేడని.
ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది.. ఆ వస్తున్న వాళ్ళు తనున్న ఆ వాటర్ ట్యాంక్ వెనక వైపుకి రాకూడదని దేవుణ్ణి తల్చుకుంది. వాళ్ళు అటువైపు రాకుండా.. సిగరెట్లు కాల్చుకుంటూ, తమ మేనేజర్ వాళ్ళని ఎలా కాల్చుకు తింటున్నాడో చెప్పుకుంటూ బూతులు తిట్టుకుంటున్నారు. ఓ పది నిమిషాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేరు.
ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించడం మొదలెట్టింది, తండ్రి వేపు దారులు మూసుకుపోయేయి, అసలు తన వెర్షన్ ఏమిటి అని కూడా కనుక్కోకుండా తన నెంబర్ బ్లాక్ చేసిన శ్రీరామ్ కి మళ్ళీ ఈమెయిల్ రాసినా ప్రయోజనం ఉండదు, ఒకవేళ పొరబాటున పెళ్లి చేసుకున్నా, జీవితాంతం కాల్చుకు తినే ఛాన్సుంది. చేతిలో ఉద్యోగం ఉంది కదా అనే ధైర్యం తో తన కుటుంబాన్ని కాదని బయటకి వెళ్ళి బతికే దమ్ము తనకి లేదు.
పోనీ చచ్చిపోతే ? అవును నిజమే.. అదే రైటు.. అప్పుడైతే ఎవరికీ ఏ సంజాయిషీ చెప్పుకోనక్కర్లేదు.. జీవితంలో తను తీసుకునే బెస్టు డెసిషన్ ఇదే.. ఇప్పుడు చాలా హాయిగా ధైర్యంగా ఉంది.. ఎవరి గురించీ ఆలోచించనక్కర్లేదు.. అనుకుంటూ గబగబా నడవడం మొదలెట్టింది.
ఆ నాలుగంతస్తుల బిల్డింగ్ టెర్రస్ మీద సిగరెట్లు కాల్చుకుంటున్న కొందరు ఎంప్లాయిస్ ముందు ఆ అమ్మాయిని అక్కడ చూసి ఆశ్చర్యపోయేరు.. తరువాత తను చేయబోయే పని చూసి ఆపబోయేరు.
కింద లాన్ లో తన పని ముగించుకుని లేవబోయిన లాల్ సింగ్ ఎందుకో తలెత్తి పైకి చూసేలోపే జరిగిపోయిందా ఘోరం. ప్రపూర్ణ ఆ బిల్డింగ్ పైనుంచి దూకేసింది !

ఉపసంహారం : ఏడాది తర్వాత.. మధ్యాన్నం రెండు గంటల ప్రాంతం.. గచ్చి బౌలి సిగ్నల్ దగ్గర అడుక్కున్న డబ్బులతో సరుకులేవో తెచ్చుకుని,తన గుడిసెలో వంట మొదలెట్టిన మౌని, లోలోపలే ఏడుస్తూ ‘దేవుడు కొందరికి అన్నీ ఇచ్చి, కొందరికి ఏమీ ఇవ్వక అన్యాయం చేస్తాడని తెలుసు గానీ.. ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరి జీవితాన్నో అన్యాయం చేసినవాడు దేవుడేనా ? ? ఆ పిల్ల పైనుంచి దూకడమేంటీ.. తన పనేదో తను చేసుకుంటున్న నా మొగుడి మీద పడడమేంటి ? ఆ పిల్ల మూణ్ణెళ్ళకి ఆస్పత్రిలో కోలుకుని, ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకునెళ్లిపోవడమేంటీ ? తన మొగుడు నడుం పచ్చడైపోయి ఎప్పటికీ మంచానికే పరిమితమైపోవడమేంటి ?’ అని బాధపడుతూంటే, ఆ గుడిసె బయట నులక మంచం మీద నిస్సహాయంగా పడున్నాడు లాల్ సింగ్..దూరంగా సిగ్నల్ దగ్గర తోటి పిల్లలతో కలిసి అడుక్కుంటూన్న తన కూతురు రష్మిని చూస్తూ !

2 thoughts on “సాఫ్ట్‌వేర్ కథలు: 2 – పచ్చడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *