March 28, 2024

వెంటాడే కథలు – 2 – జాలిగుండెకు రిపేరు!


రచన: చంద్రప్రతాప్ కంతేటి

 

 

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!

ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

-చంద్రప్రతాప్ కంతేటి

విపుల / చతుర పూర్వసంపాదకులు

 

 

 

 

బొంబాయి నగరం.

ప్రఖ్యాత వీటీ టెర్మినల్ నుంచి అంధేరీ వెళ్తున్న సిటీబస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.

గోనె సంచిలో ధాన్యం కుక్కినట్టు జనాన్నికుక్కిపడేశాడు కండక్టర్. ప్రయాణికులంతా ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ, తోసుకుంటూ తెగ చిరాకుగా ఉన్నారు. మిట్టమధ్యాహ్నం  కావడంతో ఒక పక్క చెమట, మరో పక్క ఊపిరి ఆడని స్థితి. అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, అసహనంతో కీచులాడుకుంటున్నారు.

“ఏం భయ్యా! జర ముందు వెనుక చూసుకోవా?”

“ఏంటి చూసుకునేది. నా వెనక వాళ్లకు చెప్పు ఆ మాట”

“అరేయ్ గాడిదా.. నా కాలు పచ్చడి అవుతోంది.. తియ్ నీ కాలు..”

“సాలే.. ఎవడ్రా గాడిద?.. తూ సువ్వర్ కా బచ్చే..”

ఎవడికి వాడు పక్కవాడితో గొడవ పడుతున్నాడు.

ఆడవాళ్ళూ తక్కువ తినలేదు.. మీద పడుతున్నారని మగాళ్లను తిట్టిపోస్తున్నారు.

ఒక్క పదిహేనేళ్ల పాటిల్ తప్ప, అందరూ ఎంతో అసహనంగా ప్రయాణిస్తున్నారు.

కండక్టర్ జన్నాన్ని తొక్కుకుంటూనే వెళ్లి టికెట్లు ఇస్తున్నాడు.

‘టికెట్.. టికెట్’ అంటూ కర్ణకఠోరంగా అరుస్తున్నాడు.

ఇదంతా చూస్తూంటే  పాటిల్ మనసు ఆనందడోలికల్లో తేలిపోతోంది.

కానీ దాన్ని దాచిపెట్టి మిగిలిన ప్రయాణికులలాగే మొహం మీద చిరాకు ప్రదర్శిస్తున్నాడు.

ఇవాళ కచ్చితంగా తన పంట పండుతుంది..

బస్సెక్కుతున్నప్పుడే చూశాడు ఆ బక్కపలచని ముసలి శాల్తీని!

తెల్లలాల్చీ, తెల్లపైజామా, నెత్తిమీద రూమీ టోపీ ధరించి కావడి బద్దలా ఉన్నాడు.

తనను తోసుకుంటూ ఎక్కుతుంటే ఆయన బరువైన లాల్చీ జేబు వాడిని మృదువుగా తాకింది.

ఆ స్పర్శ వాడికి ఎంతో ఉత్సాహాన్ని తెచ్చింది.

“దొరికింది గొర్రె.. చాకచక్యంగా పని ముగించుకోవడమే తరువాయి” అనుకున్నాడు మనసులో .

అంత రద్దీలోనూ అదృష్టవంతుడు కాబోలు ఆ ముసలాయన!

ఒకావిడ తను విండో వైపు జరిగి చోటిచ్చింది.

”షుక్రియా” అంటూ ఎలాగోలా ఇరుక్కుని కూర్చున్నాడు ఆ పెద్దమనిషి.

ఆ సీటు పక్కకే ఎలాగో చేరి నిలబడ్డాడు పాటిల్.

బరువుగా ఉన్న ఆ శాల్తీ లాల్చీ జేబు ఊగుతూ ద్రాక్ష పండ్ల గుత్తిలా వాడ్ని ఊరిస్తోంది.

ఆ విషయం ముసలోడు పట్టించుకోవడం లేదు.

చొక్కా కాలర్లో దాచిన పదునైన బ్లేడ్ ‘ఊఁ .. కానీ .. ‘అంటూ మెడపై  చెమట తుడుచుకున్నప్పుడల్లా  పాటిల్ కు  గుర్తుచేస్తోంది.

బస్సు పుష్పక విమానంలా వెళ్తూనే ఉంది.

అక్కడక్కడ ఆగుతోంది.. మళ్ళీ కదుల్తోంది..

ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు.. దిగేవాళ్ళు దిగుతున్నారు..

పాటిల్ ఎదురు చూపు ఫలించింది. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో బస్సులో ఉన్నవారంతా పక్కవాళ్లపై పడ్డారు. ఆ క్రమంలో పాటిల్ పక్కనే ఉన్న ముసలాయన మీద పడి లేస్తూ ”మాఫ్ కీజియే కాకా” అంటూ  సలాం చేశాడు.

కొందరు మీద పడిన వాళ్లను తిడుతుంటే .. ఇంకొందరు డ్రైవర్ సరిగా నడపడం లేదని అరిచారు. మరి కొందరు సర్కారీ రోడ్లను, ట్రాఫిక్ ను,  పాలకులను ఆడిపోసుకున్నారు.

ఏమైతేనేం?ముసలాయన జేబు చిరిగింది..

అందులోని నోట్లకట్ట పాటిల్ లోదుస్తుల్లోకి  భద్రంగా చేరిపోయింది.

పాటిల్ మనసు ఆనందంతో గంతులు వేస్తోంది.

ఇవాళ మోజెస్ కాకా తనను మెచ్చుకోవడం ఖాయం..

సమోసాలు, స్పెషల్ చాయ్ తో పార్టీ ఇవ్వడం అంతకంటే ఖాయం.

ఎంత ఉందోగానీ డబ్బు, కట్ట మాత్రం లావుగానే ఉంది.

ఉన్న తావు నుంచి మెల్లగా డోర్ వైపు కదిలాడు.

వెంటనే కదిలితే తన పైన అనుమానం రావచ్చు.

అంతలోనే బస్సులో కలకలం..

ముసలాయన లేచి నిలబడి బిగ్గరగా  అరుస్తున్నాడు..

”ఆపండి! బస్సు ఆపండి.. నా జేబెవరో కొట్టేశారు. కూతురు నిఖా కోసం బ్యాంకు నుండి ఇప్పుడే పదివేలు డ్రా చేసి తెస్తున్నాను. చూడండి.. జేబు ఎలా కత్తిరించారో ..!” అని ఏడుస్తూ చిరిగిపోయిన లాల్చీ జేబులో వేళ్ళు దూర్చి బయటకు చూపిస్తున్నాడు.

బస్సు ఆగింది. అందరూ “అయ్యో..  అయ్యో” అన్నారు.

”బస్సెందుకు ఆపావు పోనీ” అన్నారు కొందరు డ్రైవర్ ను.

కండక్టర్ కూడా ”రైట్ రైట్” అని అరిచాడు.

ఇలాంటి పంచాయితీలు రోజుకు ఎన్ని చూస్తున్నాడతను?

ఆలస్యం అయితే  ఇంక్రిమెంట్ కట్ మరి!

ముసలాయన  రోదన వర్ణనాతీతంగా ఉంది.

”పొద్దున్నే ఎవడి మొహం చూసొ చ్చానో.. ఇక బేటీకీ నిఖా లేదు.. ఏం లేదు.. అసలే మా బేగానికి గుండెపోటు. ఈ విషయం తెలిస్తే ఇప్పుడే చచ్చిపోతుంది. అది ఛస్తే నేనూ చచ్చిపోయినట్టే.. నా నల్గురు బేటీలు కూడా చావక తప్పదు”

”ఊరుకో భాయ్.. పోలీస్ ఠాణాకు పోయి కంప్లైంట్ చేయి.. డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎలాగైనా దొంగని పట్టుకుని నీ డబ్బు నీకిస్తారు..” అన్నారెవరో ఓదారుస్తూ.

”కనీసం బస్సు ఆపి అందరి జేబులు తనిఖీ చేయొచ్చుగదా?” అన్నారు ఇంకొకరు.

పాటిల్ గుండెల్లో రాయి పడింది.

”భలేవాడివే కాకా! జేబుకొట్టినోడు ఇంకా బస్సులోనే ఉంటాడా నీ పిచ్చిగానీ? ఎప్పుడో దిగిపోయి ఉంటాడు.. లేదా ఇంకెవడి చేతికో ఇచ్చి వాడ్ని దింపేసి ఉంటాడు..” అన్నాడు మరొకడు నవ్వుతూ.

పాటిల్ మనసు కాస్త శాంతించింది.

”నిజమే..  వాడెప్పుడో జారుకుని ఉంటాడు.. ఇప్పుడు బస్సు ఆపి టైం వేస్ట్ చేయొద్దు..  పోనీండి .. నాకు ఇంటర్వ్యూ టైం దాటిపోతోంది” అంది ఒక కాలేజీ పిల్ల కసురుతున్నట్టు.

”అవును బస్సు ఆపొద్దు.. తొందరగా పోనిమ్మని చెప్పండి.. ఆ డ్రైవర్ ఎడ్లబండి తోలినట్టు తోలుతున్నాడు” అని విసుక్కున్నాడు ఓ యువకుడు.

ముసలాయన శోక సాగరంలో మునిగి తేలుతున్నాడు.

”ఎవడో చచ్చినోడు.. ఇవాళ నా కొంపను నిట్ట నిలువునా కూల్చేశాడు.. యా అల్లా..  మై క్యా కరూ! బేటీ .. నా బంగారు బేటీ.. బాబా డబ్బు తెస్తాడు.. నిఖా మంచిగా అవుతుందని కలలు కనకు.. మీ నాన్న ఇంత విషం మింగి ఈ రాత్రికే చస్తాడు.. ఎన్ని నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెడితే  పదివేలైనాయి.. నా కష్టం, శ్రమ అంతా ఆ అల్లాకే  తెలుసు.. నిఖా కాదని తెలిస్తే బేటీ మాత్రం ఉంటుందా.. అదీ  చచ్చిపోతుంది..  మా కొంపలో రేపు ఆరు శవాలు లేవడం ఖాయం..” అంటూ తలగొట్టుకుంటూ ఏడుస్తున్నాడు.

పాటిల్ మనసు బాధపడింది.

తను చేసిన పనికి ఓ కుటుంబం.. అందునా ఒక నిరుపేద కుటుంబం.. ఆత్మహత్యకు గురి కాబోతోందా?

ఇంటి దగ్గర తన అక్క, అమ్మ, గుడ్డి అవ్వ వాడికి గుర్తొచ్చారు.

పెళ్లి కాకపోతే అక్క కూడా చనిపోతుందా? అక్క పోతే- అమ్మ, అవ్వ ప్రాణాలతో మిగుల్తారా?

తను తప్పు చేశాడు.

ఈ ముసలాడి జేబు కాక కాస్త బడా బాబు జేబు కొట్టాల్సింది..

ఇప్పుడేంటి కర్తవ్యం?

అతని బుర్ర వేడెక్కిపోయింది.

డబ్బు కొట్టేసినప్పుడున్న హుషారు ఎక్కడా లేదు వాడిలో!

తన లోదుస్తులలో ఉన్నది డబ్బు కాదు..  ఆ ముసలోడి కుటుంబానికి యమపాశం అనిపిస్తోంది.

ఏం చేయాలిప్పుడు? అవును ఏం చేయాలి?

పోనీ మెల్లగా ఆ డబ్బు ఎవరూ చూడకుండా ముసలాయన జేబులో పెట్టేస్తే?

అది సాధ్యమా? ఒకవేళ సాధ్యం కాకపొతే?

ఇలా మథనపడి పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు.

నిశ్శబ్దంగా డబ్బు ముసలాయన జేబులో పెట్టాలని!

అలా అనుకున్నాక  వాడి మనసుకు కొంచం ఊరట కలిగింది.

పది నిముషాల్లో డోర్ వైపు నుంచి ముసలాయన కూర్చున్న సీటు దగ్గరకు తోసుకుంటూ చేరాడు.

ముసలాయన ఏడుస్తూ ఓ పక్కకి ఒరిగి సొమ్మసిల్లినట్టున్నాడు.

మెల్లగా డబ్బు తీసి అతని జేబులో పెట్టబోతుండగా బలమైన ఒక చేయి వాడి చేతిని పట్టుకుంది.

ఆ చేయి ఎవరిదో కాదు.. ఆ ముసలాయనదే!

”ఇడుగో..  దొంగ దొరికాడు.. చూడండి .. చూడండి” అంటూ అరిచాడాయన.

అంతే ! ప్రయాణికులంతా పాటిల్ ను కుళ్లబొడిచారు.

ఆ దెబ్బలు తింటూనే ఎలాగో తప్పించుకుని పరుగెత్తుతున్న బస్సులోంచి కిందకు దూకి పారిపోయాడు వాడు. ఆ జన సమూహంలో వాడు దొరకడం కష్టమని బస్సులో వాళ్ళు ఎవరూ దిగలేదు.

తన డబ్బంతా సరిగానే ఉందని ముసలాయన దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు.

 

*                       *                    *

 

రాత్రి తొమ్మిదింటికి  మోజెస్ కార్ఖానాకు ముక్కుతూ మూలుగుతూ చేరాడు పాటిల్.

బస్సు దూకిన తర్వాత ఇంకో రెండు బస్సులు ఎక్కి ప్రయత్నం చేశాడుగాని చిల్లిగవ్వ చిక్కలేదు. పైగా ఒళ్ళంతా దెబ్బలు.. పెదాలు చిట్లి పోయాయి. బస్సునుంచి దూకడంతో కాలి మోచిప్ప పగిలిపోయింది. మొహం ఓ పక్క దోక్కుపోయింది..  కనీసం చాయ్ తాగడానికి కూడా వాడి దగ్గర కానీ లేదు. ఒళ్ళంతా పచ్చిపుండై, కడుపులో ఆకలి కరకర మంటుంటే ఖాళీ చేతులతో కార్ఖానాలో అడుగుపెట్టిన వాడు –

అక్కడి దృశ్యం చూసి  కొయ్యబారిపోయాడు.

కుర్చీలో మోజెస్ కాకా గంభీరంగా కూచుంటే అతని పక్కనే –

బస్సులో ఏడుపులు పెడబొబ్బలు పెట్టిన ముసలాయన నిలబడి ఉన్నాడు.

పాన్ తో గార పట్టిన పళ్ళు కనబడేలా పాటిల్ వంక చూస్తూ వెకిలిగా నవ్వాడాయన.

”అన్నా..” పాటిల్ నోటి నుంచి మాట రానేలేదు గర్జించాడు మోజెస్.

”అరె చుప్.. ఎంత కొట్టుకొచ్చావ్ చెప్పు ముందు?”

”అన్నా.. మరి మరి ..” పాటిల్ కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నాడు, డబ్బు తేకపోతే మోజెస్ ఎలాంటి కఠిన శిక్షలు వేస్తాడో వాడికి బాగా తెలుసు!

”మనోడు ధర్మరాజైపోయాడు మోజెస్ భాయ్… జాలిగుండె కావడంతో కొట్టేసిన డబ్బు మళ్ళా నా జేబులోనే పెట్టబోయిండు.. ఇలాటోడు మన దందాకు పనికిరాడు భాయ్..” పెద్దగా నవ్వుతున్నాడు ముసలోడు.

”ఏరా..  కొట్టేసిన డబ్బు వెనక్కి ఇచ్చేస్తావా?” మోజెస్ చేతిలోని పేముబెత్తం పాటిల్ వీపుపై నాట్యం చేసింది.

పాటిల్ హాహాకారాలు.. కార్ఖానా గోడలకూ రేకులకూ తాకి దద్దరిల్లాయి.

”నీకు వారం రోజులు తిండి బంద్… అసలు నిన్నిలా కాదు… నీ విషయం ఎస్ ఐ గారికి చెబితే నీ జాలి గుండెకు ఆయనే సరైన మందు వేస్తాడు..” అంటూ జేవురించిన మొహంతో రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు మోజెస్.

”వద్దన్నా వద్దన్నా.. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను.. ఎస్ ఐ దొరకు చెప్పొద్దన్నా.. నీకు దణ్ణం పెడతానన్నా” అంటూ కాళ్లు పట్టుకున్న పాటిల్ మొహాన్ని మోజెస్ బూటు కాలు బలంగా తాకింది.. కార్ఖానా గోడకు విసురుగా  గుద్దుకుని నేలకు జారిపోయాడు వాడు.

ఎస్ ఐ గారికి సమాచారం చేరిపోయింది.

 

(అయిపోయింది)

 

 

 

నా విశ్లేషణ : ఈ కథకు ప్రాణం చివరిలో ఉంది. ఇలాంటి అవినీతి దందాలన్నీ పోలీసుల నేతృత్వంలోనే నడుస్తుంటాయని రచయిత సొగసుగా చెప్పాడు. పేదరికం, అమాయకత్వం, అవిద్య కారణంగా పాటిల్ లాంటి బాల నేరస్థులు ఈ ఊబిలో కూరుకుపోవడానికి కారణం నేర ప్రపంచమే.. అన్నింటికంటే ముఖ్యం ఆ వయసు నుంచే వాళ్లలో జాలి, దయ, సానుభూతి, అనుకంప లేకుండా రాక్షసుల్లా మారడానికి ఎందరు పెద్దలు తెరవెనుక నిలబడి ప్రోత్సహిస్తున్నారో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత తర్వాత ఈ విష మొలకలే మహావృక్షాలై  ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా మారవన్న భరోసా మనకు ఎక్కడుంది? నాకు గుర్తున్నవరకూ ఇది ఏదో హిందీ కథ అనిపిస్తోంది.

 

******

 

వెంటాడే కథలు -1లో ప్రచురితమైన ‘ప్రొఫెసర్ గారి స్వయంకృతం’ కథ జర్మన్ రచయిత పీటర్ బక్సర్ రచన అని తెలిసింది. ‘వింత భాష’ పేరుతో శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి అనువాదంగా ‘విపుల’లో ప్రచురితమైనట్టు మిత్రులు తెలియచేశారు. వారికి కృతజ్ఞతలు..

-చంద్ర ప్రతాప్

 

 

17 thoughts on “వెంటాడే కథలు – 2 – జాలిగుండెకు రిపేరు!

  1. నేరస్థుల మనస్తత్వం రూపొందే క్రమం గురించి దానికి వ్యవస్థ సహకరించే తీరు గురించి ఎంతో చక్కగా చెప్పే కథ.

  2. చాలా చక్కని కథ. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే కథ.

  3. పాటిల్ లాంటీ బాల నేరస్తులు విష మొక్కలుగా మొలచి వారు మహావృక్షాలయై ఉగ్రవాదులు గా తయారవుతారు ఇది నిజం.
    15 ఏళ్ల కుర్రాడి మనసులో తను చేసిన నేరానికి ఒక కుటుంబం ఆత్మహత్య పాలవుతుంది అని ఆలోచన రావటం….బాగుంది సార్

    1. అవును మేడమ్ అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిల్లల చేత జరిగే ఈ అకృత్యాల వెనుక పెద్దల దందా ఉంటోంది అని సమాజానికి తెలియజేయటం ఈ కథలోని ప్రధాన ఉద్దేశ్యం . మీ స్పందనకు ధన్యవాదాలు

  4. ‘పుణ్యానికి పోతే పాపం ఎదురు పడినట్లు గా’అన్న తెలుగు సామెత చాలా వరకు ఈ కధకు వర్తించవచ్చు. పాటిల్ లోని పాపభీతి,భయం రెండు లక్షణాలు సంభాషణలు ద్వారా చక్కగా చెప్పారు. అదే కాకుండా ముఖ్యంగాముంబై నగర నేపథ్యంలో, పాటిల్ లాంటి పిల్లలను ఏ విధంగా జేబుదొంగలుగా మార్చడమే కాకుండా వారి ఆలోచనలు కూడా తాము చేసిన దొంగ తనం ద్వారా తమ యజమానులను సంతోషంగా ఉంచాలి అనుకోవడం, దాని ద్వారా ఆనందం పొందాలని అనుకోవడం చాలా చాలా చిత్రమైన ఆలోచన. మన సమాజంలో ఎవరు పుట్టు నేరస్తులు కాదు సమాజంమే అలాగా మార్చివేస్తుంది. కొన్ని సందర్భల్లో ప్రాణం కూడా తీసుకుంటుంది. పాటిల్ లాంటి దురదృష్టవంతులు ఎందరో?చా లా విషాందాంతం.

  5. మీ విశ్లేషణతో ఏకీభవిస్తున్నా. చాల చక్కని అనువాదం. బెంగాలీ కథ అనిపిస్తుంది. చాల బావుంది.

    1. అనసూయ గారు చాలా ధన్యవాదాలు ఇది మరాఠీ కదా అని నా అభిప్రాయమండి. చదివి స్పందనకు కృతజ్ఞతలు

      1. ‘కాకా’అని చిన్న నాన్న ను మరాఠీ లో సంభోధిస్తారు సార్

  6. Thank you kiran vibhavari garu. I respect your eagerness regarding my story. Please give your phone number.

  7. ఈ శీర్షిక కోసమే ప్రతి నెలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నా సర్.. ఎప్పటిలాగే ఈ కథా పిపాసి కరువు తీర్చారు.

Leave a Reply to chandra pratap kanteti Cancel reply

Your email address will not be published. Required fields are marked *