August 11, 2022

అమ్మమ్మ – 30

రచన: గిరిజ పీసపాటి

బిఎడి లో మంచి రాంక్ రావడంతో “టీచర్ ట్రైనింగ్ కోసం విజయనగరం వెళ్ళి జాయిన్ అవనా?!” అని నాగ అడగగానే “ఇక్కడ నన్ను, పిల్లల్ని వదిలేసి నువ్వు విజయనగరం వెళిపోతే ఎలా?” అంటూ ఎదురు ప్రశ్న వేసాడు పెదబాబు.
“సీజన్ పాస్ తీసుకుని, రోజూ ఉదయం వెళ్ళి, సాయంత్రానికల్లా వచ్చేస్తానండీ. ఎలాగూ వసంత, గిరిజ ఉదయం ఏడు గంటలకే కాలేజ్ కి వెళిపోతున్నారు. మీరు నాని కూడా తొమ్మిది గంటలకల్లా వెళిపోతారు.”
“మీరందరూ తిరిగి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతోంది. ఉదయం వంట చేసి వెళిపోతాను. తిరిగి వచ్చాక రాత్రి వంట చేసేస్తాను. మిగిలిన పనులు ఎలాగూ ఆడపిల్లలు చూసుకుంటున్నారు కదా!” అంది నాగ బతిమిలాడుతున్న ధోరణిలో.
“చూద్దాం లే!” అని అక్కడికా టాపిక్ కట్ చేసి వెళిపోయాడు పెదబాబు. జాయినింగ్ డేట్ దగ్గర పడుతుండడంతో మళ్ళీ మళ్ళీ భర్తను అడగడం, అతను సమాధానం కూడా ఇవ్వకుండా మౌనంగా ఉండిపోవడం జరగసాగింది.
మర్నాడు ఉదయం వెళ్ళి జాయిన్ అవాల్సి ఉండడంతో ఆరోజు ఏ విషయం ఖచ్చితంగా చెప్పమని నిలదీసింది నాగ. “నేను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నానంటే నాకిష్టం లేదని అర్థం. మరోసారి ఈ విషయం నా దగ్గర ప్రస్తావించకు” అన్న భర్త మాటలకు నిశ్చేష్టురాలై మ్రాన్పడి కూలబడిపోయింది.
కాసేపు స్తబ్దుగా ఉండిపోయిన నాగ మనసులో సంఘర్షణ మొదలైంది. ‘ఈయనని అడిగే కదా ఎగ్జామ్ రాసాను. మంచి రాంక్ కూడా వచ్చి పక్క ఊరిలోనే సీటు వస్తే కూడా పంపనంటున్నారెందుకు? తన స్నేహితురాలి భర్త ఏకంగా తిరుపతి పంపించాడు.’
‘డెబ్భై ఏడు సంవత్సరాల వయసులో విశ్రాంతి తీసుకుంటూ, శేష జీవితం గడపాల్సిన తన తల్లి బరువైన గుండిగలు ఎత్తి అన్నం వారుస్తూ, మండుటెండలో గాడిపొయ్యి వేడిని భరించి మరీ కష్టపడి వంట చేసి సంపాదిస్తోంది.’
‘తన రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముని తన చదువు కోసం పంపింది. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చంతా వృధా అయిపోయినట్లేగా! ఈయనకి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా!’ అనుకుని బాధ పడసాగింది.
తల్లికీ విషయం తెలిస్తే బాధ పడుతుందని ఉత్తరం కూడా రాయలేదు. ఇంత బాధను అనుభవిస్తున్నా నాగ కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రానియ్యలేదు. ఇంట్లో రొటీన్ గా ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు తప్ప ఎవరూ మునుపటిలా హుషారుగా లేరు.
వారం రోజుల్లో అమ్మమ్మ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ‘నాగ ఉత్తరం కోసం ఎదురు చూసానని, రోజూ ట్రైనింగ్ కి వెళ్ళి వస్తుండడంతో బహుశా తీరిక లేక రాయలేదేమోనని ఇక ఆగలేక తనే రాస్తున్నానని, ట్రైనింగ్ ఎలా సాగుతోందో తెలియజేయమని, బస్ పాస్ కి, ఇతర ఖర్చులకు డబ్బు అవసరమైతే తను పంపుతానని’ రాసింది.
ఇక తప్పక జరిగిన విషయం చెప్తూ ఉత్తరం రాసింది నాగ. అది చదివిన అమ్మమ్మ కూడా చాలా బాధ పడింది. అయినా ‘జరిగిందేదో జరిగింది. జరిగిన విషయానికి బాధపడుతూ నీ ఆరోగ్యం పాడుజేసుకోకు. పిల్లలను బాగా చదివించు. నీ కలలు వారి ద్వారా నెరవేర్చుకో’ అని హితవు పలుకుతూ జవాబు ఇచ్చింది కూతురికి.
ఆడపిల్లలిద్దరూ ఒక్కోరోజు బస్ టికెట్ కొనడానికి కూడా డబ్బు లేక, అక్కయ్యపాలెం నుండి AVN కాలేజి కి నడుచుకుంటూ వెళ్ళాల్సి రావడంతో ఉదయం ఆరుగంటలకే ఇంటినుండి బాయలుదేరాల్సి వచ్చేది. ఉదయం టిఫిన్ తినే అలవాటు ఎప్పుడూ లేదు.
ఉదయం ఏడు గంటలకు కాని ఆరోజు కూర కొనడానికి కావలసిన డబ్బు (ఐదు రూపాయలు) పెదబాబు ఇచ్చేవారు కాదు. దాంతో వంట అవక లంచ్ కూడా పట్టుకెళ్ళక ఇద్దరూ రోజూ రాత్రి ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు. ఉదయం పూట కాఫీ మాత్రం తాగి వెళ్ళేవారు.
దాంతో షగర్ పేషెంట్ అయిన వసంత, అసలే బక్క ప్రాణి అయిన గిరిజ ఇంకా నీరసించిపోసాగారు. మొత్తానికి ఆడపిల్లలిద్దరూ ఇంటర్ సెకెండ్ ఇయర్ కి, నాని టెన్త్ క్లాస్ కి వచ్చారు. తిరిగి కాలేజి రీ ఓపెన్ అవడానికి నెల రోజులు సమయం ఉందనగా వసంత తండ్రితో “కాలేజీకి దగ్గరలో ఇల్లు తీసుకుందాం నాన్నా!” అంది.
“ఇంత తక్కువ ధరలో ఆ ఏరియాలో ఇల్లు దొరకదు. అయినా ఇది బాగానే ఉంది కదా! అన్నాడాయన. “మీరు, తమ్ముడు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి కేరేజి తీసుకుని, సైకిల్ మీద వెళతారు కనుక మీకు బానే ఉంటుంది.
నేను, చెల్లి నడుచుకుంటూ వెళ్ళి, ఆకలితో నడుచుకుంటూ తిరిగి వచ్చేసరికి ప్రాణాలు కడబట్టిపోతున్నాయి. ఇల్లైనా మార్చండి. లేదా మర్నాటి కూర డబ్బులు ముందురోజే ఇచ్చి, మా బస్ ఛార్జి కి కూడా డబ్బులివ్వండి. రెండిట్లో ఏదనేది మీరే నిర్ణయించుకోండి” అంటూ తెగేసి చెప్పింది.
ఆ ఇంట్లో తండ్రితో ధైర్యంగా మాట్లాడగలిగేది వసంత మాత్రమే. నాగ కూడా భర్త మాటకు ఎదురు చెప్పదు. కాకపోతే భర్త మూడ్ బాగుంటే అప్పుడప్పుడు సెటైర్స్ వేస్తుందంతే. వసంత గట్టిగా చెప్పడంతో ఇల్లు మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పెదబాబు. ప్రభాత్ థియేటర్ కు దగ్గరగా, కాలేజీకి కిలోమీటర్ దూరంలోకి ఇల్లు మార్చారు.
ఇంతలో పెదబాబుకి బావగారి వరసయ్యే ఒకతను వీళ్ళ ఇంటికి వచ్చి “నేను, నా ఫ్రెండ్స్ మరో ముగ్గురం కలిసి హోల్ సేల్ మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా అందులో కొంత పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు, నాని చదువు ఇలా దేనికీ ఇబ్బంది పడక్కరలేదు” అని నచ్చచెప్పాడు.
“నువ్వు చెప్పింది బాగానే ఉందన్నయ్యా. కానీ మా ఆర్ధిక పరిస్థితి నీకు తెలియనిది కాదు. ఇంట్లో చిన్న చిన్న ఖర్చులనే తట్టుకోలేకపోతున్నాం. ఇక బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం అంటే మా వల్ల కాదన్నయ్యా!” అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది నాగ
“మీ మామగారిని అడిగితే ఇస్తారుగా. పెద్ద అమౌంట్ కాదు. పదివేల రూపాయలు మాత్రమే” అన్నాడాయన. “అమ్మో! పదివేలే!? నేనడగను” అన్నాడు పెదబాబు. “నువ్వడగొద్దు. నేనే ఆయనని అడిగి ఒప్పిస్తాను. కాకపోతే నువ్వు నా పక్కన ఉండు చాలు” అని చెప్పడంతో సరేనన్నాడు పెదబాబు.
ఈ బంధువు మాటంటే పీసపాటి తాతకి‌ కూడా బాగా గురి. దాంతో ఆయన పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా వెంటనే ఒప్పుకుని, అవసరమైన పదివేల రూపాయలు అతని చేతిలో పెట్టి, డాక్యుమెంట్ రాయించారు.
వెంటనే వైజాగ్ లో హోల్ సేల్ మెడికల్ షాప్ ను నిరాడంబరంగా పూజ చేసి ఓపెన్ చేసారు. వీళ్ళ చేత పెట్టుబడి పెట్టించిన బంధువు మేనిజింగ్ పార్ట్నర్ గాను, మిగిలిన వాళ్ళంతా స్లీపింగ్ పార్ట్నర్స్ గానూ ఉండేవారు.
పార్టనర్స్ లో ఒకతను ఆడిటర్ కూడా కావడంతో అకౌంట్స్, టాక్స్ లకు సంబంధించిన పనులన్నీ ఆయన చూసుకునేవారు. స్టాక్ డెలివరీకి, కలెక్షన్లు వసూలు చేయడానికి ఇద్దరు బాయ్స్ ని అపాయింట్ చేసారు.
అయితే రెండు సంవత్సరాలు ఆగితే తప్ప లాభం ఎంతొచ్చిందో తెలియదు కనుక అంతవరకు షాప్ లో పెట్టిన పెట్టుబడి మీద రిటర్న్స్ ఆశించొద్దని ఖచ్చితంగా చెప్పాడా బంధువు.
ఇంతలో షాప్ లో పెట్టుబడి పెట్టిన ఒకాయనకు బైపాస్ సర్జరీ చెయ్యాల్సిరావడంతో ఆయన తన పదివేల రూపాయలను వెనక్కు తీసేసుకున్నారు.

***** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *