March 30, 2023

ఔషధ విలువల మొక్కలు – 5

రచన: నాగమంజరి గుమ్మా

 

 

 

. *జాజి పత్రం*

కనులకు చలువను గూర్చుచు*
మనముల హాయి కురిపించు మధు వీచికలన్*
సన సన్నగ జాల్వార్చెడి*
వినాయకుని పూజ పత్రి విను జాజి యిదే*

జాజి పత్రి శ్రీ గణేశుని పూజా పత్రులలో ఒకటి. ఆకులు, పూవులు కూడా కళ్ళకు చలువను కూర్చుతాయి. ఆకులను నూరి కళ్ళు మూసికొని పై రెప్పలపై కాసేపు ఉంచినా, పువ్వులను యధాతధంగా కంటి రెప్పలపై పరచినా క్షణాల్లో అలసిన కనులు సేదతీరుతాయి. ఇక ఈ పూల సువాసన సంగతి చెప్పేదేముంది? ఇంటి ముందు కాసింత స్థలం ఉంటే జాజి తీగ పాకించని దెవరని???

*గండకి పత్రం*

గండకి యను పేర నిలచి*
గండములను తీర్చు సామి కాళ్లకు మొక్కన్*
మెండుగ నిలిచిన పత్రిది*
రండో విఘ్నేశ్వరునికి ప్రార్ధన సేయన్*

గండకీపత్రం దీనిని తీగగరిక అని కూడా పిలుస్తారు. దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాన్ని మూర్ఛలను తగ్గిస్తుంది. నులి పురుగుల్ని, వాటి వలన వచ్చే వ్యాధులను కూడా తగ్గిస్తుంది. శ్రీ గణేశుని పూజా పత్రాలతో గండకి పత్రం ఒకటి.

 

 

. *అశ్వత్థ పత్రం*

మూల బ్రహ్మ, విష్ణుమూర్తి మధ్య చివర*
శివుడు గల పవిత్ర చెట్టు రావి*
విఘ్ననాయకునకు వినయంపు పత్రమై*
పూజ సేయ వచ్చె రాజతరువు*

విశ్వరూప సందర్శనంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు “వృక్షాల లోకెల్ల విశేషమైన అశ్వత్థ వృక్షమును అర్జునా నేను” అని తెలియజేసారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటపుడు “మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః” అని శ్లోకం చదువుకోవడం కూడా పరిపాటి. అంత గొప్ప వృక్షం కూడా శ్రీ గణేశుని పూజలో పత్రమై వినయంగా ఒదిగిపోయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నది రావి చెట్టు.
ఆయుర్వేదం లో శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో రావి ఆకులను, విత్తులను, మండలను (చిన్న , లేత కొమ్మలు) ఉపయోగిస్తారు.

 

 

*అర్క పత్రం*

హాలాహల బిందువొకటి*
పాలకడలి నురుగుల బడ పాషాణమయెన్*
లీలను అర్కంబుగ నా*
నీలగ్రీవు తనయుండు నేలను చేర్చెన్*

పాలసముద్రాన్ని మధించి నపుడు హాలాహలం ఉద్భవించడం, శివుడు ఆ గరళాన్ని గ్రోలి తన కంఠాన దాల్చడం అందరూ ఎరిగినదే… ఆ గరళం లోని ఒక చుక్క పాలసముద్రంలో పడగా, చిలుకుతున్న నురుగులో కలిసి సముద్ర జీవులన్ని మరణిస్తున్నాయట. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ నురుగను ఒడ్డుకు మళ్లించగా ఒక మొక్కగా రూపు దాల్చింది. (ఇప్పటికీ జిల్లేడు విత్తనం నీటి బొట్టు ఆకారంలో ఉండటం మనం గమనించవచ్చు). జీవులకు హాని చేయవద్దని దానికి చెప్పి, సూర్యకిరణాలతో ఆ విషాన్ని విరిచి, పూజార్హత కల్పించాడట గణేశుడు. అంతే కాకుండా వైద్యానికి పనికి వచ్చే విధంగానూ, ముదిరిన జిల్లేడు వేరులో తన రూపు వచ్చే విధంగానూ, తనకు నచ్చిన ఉండ్రాళ్ళను జిల్లేడు కాయల ఆకారంలో చేసి నైవేద్యం పెట్టే విధంగా అనుగ్రహించాడట. సూర్యుడు కూడా రధసప్తమి నాడు జిల్లేడు ఆకులు తలపై దాల్చి, స్నానం చేసిన వారికి ఆయురారోగ్యాలు సమకూరుతాయని వరమిచ్చాడట. ఆనాటి ఆ అర్కమే నేటి జిల్లేడు. (ఇంటి పరిసరాలలో జిల్లేడు మొక్క నలుపైనా, తెలుపైనా పెరిగితే, ఇంటికి అడ్డం అనిపిస్తే, సమూలం కొట్టివేయవద్దు. కొమ్మలు కత్తిరించి మొక్క పెద్దగా ఎదగనివ్వకుండా చూడండి. కొన్ని సంవత్సరాలు అలాగే చేయండి. దాదాపు పది/పదిహేను సంవత్సరాలు పోయిన తర్వాత తిథి, వార, నక్షత్రాలు చూసుకుని, ముందురోజు చెట్టు మొదట్లో పాలుపోసి నమస్కరించి, మర్నాడు కొట్టబోతున్నామని అనుమతి అడగండి. సూర్యోదయం కాగానే దోసెడు నీళ్లుపోసి పసుపు కుంకుమలతో పూజించి వేరుకు తగలకుండా జాగ్రత్తగా తవ్వి తీస్తే విఘ్నేశ్వరుని రూపు ఆ వేరుపై కనిపిస్తుంది. జాగ్రత్తగా కడిగి, నీడన ఆరబెట్టి పచ్చి పోయిన తర్వాత ఆకారం వరకు కత్తిరించి బీరువాలో భద్రపరచుకోవచ్చు. లేదా పూజస్థలంలో పెట్టుకోవచ్చు)

 

 

కరివేపాకు

వేపకాదిది కరివేప కమ్మని రుచి*
తీసివేయ వద్దు తినగ ముద్దు*
ఏ విటమిను నిచ్చు నేది సాటికి రాదు*
పోపు ఘుమఘుమలను పోల్చి చూడు*

పేరు లో మాత్రమే వేప. చేదు ఉండదు పైగా కమ్మని సువాసన, రుచి కూడా… అదేనండి కరివేపాకు. కూరల్లో వేస్తాము, కానీ తినేటప్పుడు తీసిపారేస్తాము. అలా చేయకూడదు. ఏ విటమిను అధికంగా ఉంటుంది. కంటికి, గోళ్లకు, జుట్టుకు చాలా మంచిది. చారుకు, పులిహారకు కరివేపాకు లేకుండా తాలింపు ఉహించగలమా? పచ్చడి చేసినా, పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నా… అబ్బో….

 

 

కొత్తిమీర పత్రం

కొత్తిమీర చూడ ఘుమఘుమలు రుచియే*
ధనియపాకు లివియె కనగ మంచి*
కూర పచ్చడులకు కొండంత రుచినిచ్చు*
కడుపు శుభ్రపరచు కాంతి పెంచు

 

 

. *నేల వేము*

పేరు పోలికొకటి తీరు దానిని మించి*
ఒక్క ఆకు చాలు మొక్క నుండి*
చంటి పిల్లలకును సామాన్య రోగాల*
అంతు చూచి వదలు అమృత పత్రి*

పల్లెల్లో నివసించేవారు చిన్నతనం నుంచి శారీరక దృఢత్వం కోసం అనేక మందులు తినిపిస్తారు. వాటిలో ఒకటి ఈ నేలవేము. చూడటానికి చిన్న మొక్కలా ఉంటుంది. ఒక్క ఆకు తీసి నోట పెట్టుకుంటే భరించలేని చేదు. నేలవేము , పసుపు కలిపి నూరి ప్రతిశనివారం పిల్లలకి దాదాపు పది సంవత్సరాలు వయసు వచ్చేవరకు తాగిస్తారు. *చేదు* అంటారు. జీర్ణవ్యవస్థ లోని ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.

 

 

. *మునగ పత్రం*

మునగ ఔషధమ్ము మున్నూరు రోగాల*
మునగ తినిన చాలు ముదిమి రాదు*
మునగ కాయ, జిగురు పువ్వులు మందులే*
మునగ నెక్కరాదు మూతి పగులు*

మునగ ఆకులు చాలా బలమైన ఆహారం. వేర్లు, ఆకులు, కాయలు, జిగురు, విత్తనాలు వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా ఎరువుగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 శాతం వరకు పెరుగుతుంది

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కంటిచూపు తగ్గినా, అల్జీమర్స్, ఎముకల, కీళ్ల నొప్పులు , స్త్రీల వ్యాధులు, రక్తహీనత ఇంకా ఎన్నో కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.

ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్ వెరైటీలూ కోఫ్తాలూ… అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో… ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ.

ఈ ఆషాఢ మాసంలో మునగాకు, తెలకపిండి (నువ్వుల నూనె గానుగలో ఆడగా వచ్చే పిండి) , వెల్లుల్లి కలిపి కూరగా చేసుకుని ఒక్కసారైనా తినాలంటారు. ఇన్ని విశేషాలు ఎందుకు… మునగ తింటే మూడు వందల రకాల జబ్బులు పరార్…
*మునగ విషయంలో చేయకూడనిది ఒక్కటే… మునగచెట్టు ఎక్కడం. చెట్టు పెళుసు. ఎక్కితే కొమ్మ విరిగి , మూతి పగలవచ్చు. ఇంకేదైనా కూడా అవవచ్చు*

 

 

 

. *రణపాల పత్రం*

పర్ణబీజమనుచు ప్రఖ్యాతి నొందిన*
పత్రమిదని తెలియ చిత్రమగును*
బాహ్య వర్తనమున పరమౌషధ మిదియే*
మందమగు దళములు సుందరమ్ము*

***నాగమంజరి గుమ్మా***

రణపాల.. నామ సార్ధక్యము తెలియదు కాని, ఆకు చివరల నున్న కణుపుల నుండి కొత్త మొక్కలు పుడతాయి కనుక *పర్ణబీజ* మయ్యింది. ఇక లోపలికి కషాయం గా తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి అన్న విషయానికి *ఆయుర్వేద నిరూపణ లేదు* కానీ సెగ గడ్డలు, పొత్తికడుపు నొప్పులకు మాత్రం ఆకును కాస్త వేడి చేసి, ఆముదం రాసి సెగ గడ్డపై లేదా పొత్తికడుపుపై వేసి కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దళసరిఆకులు, ఎర్రని చిన్న పువ్వులు కలిగి అలంకరణ మొక్కలుగా కూడా బావుంటాయి. ఇంట్లో కుండీలో పెంచుకోదగిన మొక్కల్లో ఇది ఒకటి.

 

 

 

*చింత*

లేత చింత చిగురు, పూత, కాయలు, పండు*
మాను తదితరములు మంచి మందు*
సీ విటమిను ప్రోవు చింతయే యెరుగుము*
రోజు తీసుకున్న రోగముడుగు*

రోగనిరోధక శక్తి కలిగించే సి విటమిన్ ఎక్కువగా కలిగింది చింత. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2021
M T W T F S S
« Nov   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031