June 19, 2024

చంద్రోదయం 22

రచన: మన్నెం శారద

“అయితే మీ ఆవిణ్ని తీసుకొచ్చే ప్రయత్నం యిప్పుడప్పుడే లేదంటావు” అని అపరిచితమైన కంఠం.
“ఆవిడ నేనడిని కట్నం పూర్తిగా తీసుకొస్తేనే నా గడప తొక్కేది. అంతవరకూ రానిచ్చే ప్రసక్తి లేనే లేదు” అది మోహన్ కంఠం.
“చాలా అన్యాయంరా!”
మోహన్ గట్టిగా నవ్వేడు. “ఏది అన్యాయం. ఇస్తానన్న కట్నం ఎగ్గొట్టి పిల్లని నా గొంతుకి కట్టి పంపటమా?”
“పాపం. ఆయన సర్దుకోలేకపోయేడు. మధ్యలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది”
“ఆడపుటక పుట్టినందుకు అనుభవిస్తుంది”
“మరీ సంగతేవిటి? ఎవరో విడోతో ప్రేమాయణం సాగిస్తున్నావని విన్నాను.”
బదులుగా మోహన్ నవ్విన నవ్వుకి ఆ గది ప్రతిధ్వనించింది.
“అవును. కథ క్లైమాక్సుకి వచ్చేసింది. ఈవేళో, రేపో పిట్ట నా వడిలో వాలబోతోంది. పని జరిగేక ఫ్రెండ్‌షిప్ కట్.”
“ఆ చిన్న నీచమైన కోరిక కోసం జీవితాలతో నాటకం ఆడటం తప్పుకదూ!”
“చిన్నది, నీచమైందా? నీకేం తెలుసు బ్రదర్ అందులో థ్రిల్. ఇలా నమ్మించి మోసం చేయకపోతే అది నా కోరిక తీరుస్తుందా. ఎన్నాళ్లనుంచి కష్టపడుతున్నానో తెలుస ఈవిడగారికోసం. నా పనులన్నీ వదలుకొని దాని కొడుకు మీద ప్రేమ నటించి, దానికి తియ్యని కబుర్లు చెప్పి… అబ్బా! ఎంత కష్టం!”
నాకు మతిపోయింది.
కాళ్లకింద భూమి కదలుతున్నట్లుగా వుంది.
నా ఒంట్లో రక్తమంతా మరిగి ఆవిరై నాలోంచి కోపం రూపంలో సెగలు గక్కుతూ బయటకొచ్చేస్తోంది.
ఆ క్షణం ఏం చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో నాకు తెలియదు.
తలుపు భళ్ళున తన్నేను.
వాళ్లిద్దరూ ఉలిక్కిపడి నిలబడ్డారు.
నా ఉగ్రరూపం చూసి వాళ్లు భయపడినట్టుగా తోచింది.
నేను మోహన్‌ని లాగి లెంపకాయ కొట్టేను.
అనుకోని ఈ పరిణామానికి వాడి వంట్లో రక్తం విరిగిపోయినట్లు తెల్లముఖం వేశాడు.
“రాస్కెల్! నీ నిజరూపం ఈ రోజున చూశానురా. ఒక ఆడదాని పొందుకోసం, నీ క్షణికమైన సరదాకోసం ఇంత నాటకం ఆడాలా? ఇంత దగా చెయ్యాలా? ఎక్కడో, ఏ మూలో బ్రతుకున్న అభాగ్యుల జీవితాలతో ఆటలాడు కునేందుకు నీకు మనసెలా ఒప్పింది? నీకసలు మనసనేది వుందా? అటు చూడు. ఆ బురదలో రోజూ వేలకువేలు పురుగులు పుడతాయి. చస్తాయి. వాటికన్నా ఎక్కువది కాదురా నీ జన్మ. మనుషుల్ని మంచితనంతో వంచింది బ్రతికే నువ్వు చివరికి కుష్టువ్యాధి సోకి రోడ్ల మీద దేకుతావు. నేను చిన్నప్పుడు మిత్రలాభం చదువుకున్నాను. చాలా బాగుందనుకున్నాను. కాని అందులో మార్జాలం లాంటి మనుషులుంటారని, వాళ్ల బారినుంచి రక్షించు కునేందుకే అలాంటి పాఠాలు పాఠ్యభాగంలో పెట్టేరని తెలీలేదు. దేవుడు కరుణించబట్టి నీ దుర్మార్గం ముందే బయటపడింది.” అంటూ ఏడుస్తూ అదే వూపుతో యింటికొచ్చి పడ్డాను.
నిలువునా వణికిపోతున్న నన్ను చూసి భయపడ్డాడు నానీ. వాణ్ని కావలించుకుని బావురుమని ఏడ్చేను.
శేఖర్ పోయిన తర్వాత అంత ఉద్వేగంతో ఏడవటం అదే మొదటిసారి.
యేడుపు ఆపుకోవాలని నేను ప్రయత్నించలేదు.
“మోసగింపబడ్డాను” అనే బాధ నన్ను నిలువునా వణికింపచేసింది. వ్రేళ్లతో సహా పెకిలింపబడ్డ మొక్కలా మొదలంటా కూలిపోయేను.
శేఖర్ పోయిన దుఃఖాన్ని దిగమ్రింగి, ఆ గాయం మాని బ్రతుకుతున్న నేను నాకంటూ ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి చేతిలో ఇరుక్కుని నిలువునా దగా చేయబడ్డాను.
ఎన్నాళ్లకి ఈ గాయం మానుతుంది.
ఎన్నాళ్లకి తిరిగి నేను మనిషిని కాగలను.
నాకు కళ్లు తిరిగి అంతా చీకటైపోయింది.
నేను కళ్లు తెరిచేసరికి ఎదురుగా జానకమ్మ నిలబడి వుంది.
“కొంచం ఈ హార్లిక్స్ తాగు” ఆమె నా నోటికి గ్లాసు అందించింది.
నేను దుఃఖాతిశయంతో ఆమెని కావలించుకుని వెళ్ళెక్కి ఏడ్చేసేను.
ఆమె అశ్చర్యంగా నావేపు చూసింది.
ఆ తర్వాత అర్ధమైనట్లుగా తల పంకించి తలుపు దగ్గరగా వేసి వచ్చింది.
“నానీ ఏడీ?” అన్నాను వెక్కుతూ.
“నీ ఏడుపు చూసి బెదిరిపోయి క్రిందకు పరిగెత్తుకువచ్చేడు. తీరా వచ్చి చూద్దునా. నీ వంటిమీద స్పృహ వుంటేనా? కాస్త నీళ్ళు చిలకరించి విసురుతూ కూర్చున్నా. వాడికేం ఫర్వాలేదులే. క్రింద మా కోడలు అన్నం పెట్టింది. మావాళ్ళతో పాటు పడుకున్నాడు” అంది.
నేను గోడవైపు చూస్తూ పడుకున్నాను. చెంపలమీదుగా కన్నీళ్ళు ధారాపతంగా జారిపోతున్నాయి.
ఆవిడ నావంక తదేకంగా చూసింది.
“వాడు దగా చేసి పోయేడు కదూ?” అడిగింది.
నేను మాట్లాడలేదు. నా దుఃఖం ఇంకా పొంగిపోరలింది. “నేనప్పుడే అనుకున్నా. నువ్వు మీ ఆయన పోయినప్పుడు కూడా ఇంతలా ఏడ్వలేదు. ఆడది మోసపోయినప్పుడే ఇలా గుండెపగిలిపోయి ఏడుస్తుంది. నాకు తెలుసు . నువ్వు నన్ను తీసిపారేస్తావు గాని నేను ఆనాడే అనుకున్నాను. ఎవరైతే అతి మంచితనం నటించి అతి తక్కువ కాలంలో దగ్గరవుతాడో వాడు నమ్మదగ్గవాడు కాదని. పాఠాల్లో చదువుకోలేదూ. నీచులతో స్నేహం ఉదయపు వేళ నీరెండలాంటిదని. ఇహ ఏడ్చింది చాలు. ఎవరైనా వింటే సిగ్గుచేటు. ఈ పనికిమాలిన స్నేహాలు మాని ఇహ పిల్లవాణ్ని జాగ్రత్తగా చూసుకో.” అని మందలించింది.
పెద్దతరహాలో విరిచినట్లు మాట్లాడినా ఆమె మాటల్లో నిజం ద్యోతకమైంది.
కాని ఆమె చెప్పినంత తేలిగ్గా నేను మనిషిని కాలేకపోయేను. మోహన్ నా గుండెలో లోతుగా చేసిన గాయం అంత త్వరగా మానలేదు.
క్షణక్షణం అతను వంచన చేస్తూ మాట్లాడిన ప్రతి మాటా, చూపిన నటన గుర్తొచ్చి నా హృదయం పెట్రోలు పోసి అంటించినట్లుగా భగ్గుమనేది.
ఆ బాధ భరించలేక మంచమెక్కేను.
చివరికి అది టైఫాయిడ్‌లోకి దింపింది.
ఆ సమయంలో మాటతీరు ఎలాంటిదైనా జానకమ్మ చేసిన సాయం నేను మరిచిపోలేనిది. అందుకే ఆమెంత పొరబాటుగా మాట్లాడినా నేను ఏమీ అనలేను.
తర్వాత నా జబ్బు సంగతి తెలిసి మీరు రావడం, నాకు సేవ చేయడం, ఆ సేవలలో నా బాధల్ని మరచి నేను మీకు దగ్గర కావటం, అన్నీ మీకు తెలిసినవే.
ఒంటరితనం భరించలేక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోటానికి అంగీకరించినా మోహన్ చేసిన మోసం నా గుండెలో ఏదో భయాన్ని సృష్టించింది. అందుకే నేను మీకు అన్నివిధాలా దగ్గర కాలేక, కాలేకుండా వుండలేక నలిగిపోయిన వేదనతో కుమిలిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి నా అనుమానాలు నిరాధారమైనవేనా? నా భయాలు కేవలం నేనూహించుకున్నవేనా?” స్వాతి కన్నీళ్లతో సారధిని ప్రశ్నించింది.
సారధి కాసేపు మాటలాడలేనట్లు చూసేడు. మొదటిసారిగా ఆమె తన ఎదురుకొచ్చి అంతసేపు మాట్లాడింది. మనసు విప్పి భయాలని బయటపెట్టింది.
ఆ విషయం అతనికి ఆనందం కలిగించింది. ఆ తర్వాత ఆమెని బుజ్జగిస్తున్నట్లు ఆమె వీపు నిమిరి లోపలికి తీసుకెళ్ళేడు సారధి.
ఆమెను మంచం మీద పడుకోబెట్టి “పడుకో! నీ మీద నాకేం కోపం లేదు. నీ బాధ నాకర్ధమైంది. నానీకి తండ్రిని నేనే అనుకుంటే నీకెలాంటి భయాలు వుండవు. ఈ రోజునుంచి గతాన్ని సమాధి చేసి కేవలం భవిష్యత్తు మీద ఆశతో ఆనందంగా బ్రతకడం నేర్చుకో. నన్ను నమ్ము” అతడు ఆమెని దుప్పటి కప్పి పక్క గదిలోకి వెళ్లిపోయాడు.
అతన్ని అల్లుకుపోయి అతని గుండెలో ధైర్యంగా ఒదిగిపొవాలన్న ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది.
ఆమె గాఢంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *