April 25, 2024

బాగుందనీ …

రచన: పంతుల ధనలక్ష్మి.

 

 

అది ఒక పెద్దహాలు. అందరూ హడావుడిగా తిరుగుతున్నారు.

కళాశాలలో పదవీ విరమణ మహోత్సవం.

ఆ కాలేజీలో సివిక్సు లెక్చరర్. ఆవిడ పాటలు బాగా పాడుతుంది. వారంలో కొత్తగా చేసిన వంటలు బాక్సులో స్పెషల్ గా సరదాగా లంచ్ టైమ్ లో అందరికీ పెడుతుంది.

ఆవిడ అసలు పేరు వదిలేసి  అందరూ ” అన్నపూర్ణ గారు రాలేదా? వచ్చేరా?” అనేవారు.

ఇవాళ ఆవిడ రిటైర్మెంట్. అందరికీ ఆవిడే లంచ్ పెట్టింది.

సాయంత్రం ఫంక్షను. అందరూ ఆవిడ వంటల గురించి, పాటలు, ఆవిడ వేసిన జోక్స్ చెబుతున్నారు.

ఆవిడని ప్రత్యేకంగా కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పి, ఆనవాయితీ ప్రకారం ఓ బంగారం ఉంగరం, ఓ పట్టుచీర, పూలగుత్తి ఇచ్చి చిన్నవాళ్ళందరూ పాద నమస్కారాలు చేస్తున్నారు. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తోంది.

ఓ పక్క కళ్ళనీళ్ళు, ఋణం తీరిపోయిందంటూ.

కాలేజీలో తెలుగు కాంట్రాక్ట్ బేసిస్ పై పనిచేసే ఓ లెక్చరర్ ఉన్నాడు . గొంతు మంచి గంభీరంగా ఉంటుంది. ఘంటసాల పాటలు గట్టిగా పాడతాడు.

కొంచెం ఆకర్షణీయంగా కనపడాలని ప్రయత్నిస్తుంటాడు.

సినిమా డైలాగులు  మైకు పట్టుకుంటే  మైకాసురుడే.

ఆవిడ గురించి తెలుగు కదాని ఒక సన్మానపత్రం వ్రాయమన్నారు.

సన్మాన పత్రం మొదలెట్టేడు.

మొదట చాలాచోట్ల చూసి నోట్ చేసుకున్న

“అభినందన మందారమాల”  ఇలా చెబుతూ ఆవిడ గొప్పతనాన్ని,  జ్ఞానాన్ని చెబుతూ ” ఆవిడ కేంటండీ? ఆవిడ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ ” పాటలరాణి, మాటలవాణి ,అంటూ” పుంభావ సరస్వతి”.  అన్నాడు.

అర్థం తెలిసినవాళ్ళు చప్పట్లు కొట్టి నవ్వేరు.

ఆవిడకి పాపం దాని అర్థం తెలుసు .

మొహం ముడుచుకూచుంది. ఇంకా ఆపలేదు. ఆఖరున “సన్మాన గ్రహీత మాట్లాడాలి” అన్నారు.

ఆవిడ లేచి మాట్లాడుతూ “ఈ తెలుగు సారు నన్ను సార్ ని చేసేసారు” అన్నారు.

అందరూ గొల్లుమని నవ్వేరు.

“నేను మగవాని రూపంలో ఉన్న సరస్వతిని అన్నారు కదా!”

అప్పుడు గానీ ఆ తెలుగు మాస్టారికి అర్థం కాలేదు.

ఇంకో ఆయన అడిగారు. ” ఏమయ్యా! నువ్వు…”

“సారీ మాస్టారూ!  పదం చాలా బావుందని వాడేను. పదంలో సరస్వతీదేవి ఉంది కదా! అనుకున్నాను”.

“గొప్పవాడివయ్యా మగవాళ్ళు మంచి పండితులు జ్ఞానవంతులు అయితే పుంభావసరస్వతి అంటే పురుష రూపంలో ఉన్న సరస్వతి అని పొగుడుతారు!!!

నువ్వేమో ఇలా!!”

 

 

*****************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *