March 4, 2024

మా చెల్లీ… బంగారుతల్లీ..

రచన: జి.ఎస్. లక్ష్మి

 

“మామ్…నువ్వు మళ్ళీ నా మొబైల్ చెక్ చేసేవా..” రూమ్ లోంచి గట్టిగా అరిచింది నీరజ.

టిఫిన్ బాక్స్ లు సద్దుతున్న మాలతి ఒక్కసారి ఉలిక్కిపడింది.

“నీదేకాదు చెల్లాయ్.. నాదీ చెక్ చేసింది..” నవ్వుతూ తన రూమ్ లోంచి బైటకొస్తూ అన్నాడు రఘు.

“నువ్విలా అస్తమానం నా మొబైల్ చెక్ చేస్తుంటే నేను దీనికి పాస్ కోడ్ పెట్టేసుకుంటాను..” బెదిరిస్తున్నట్టు అంటూ హాల్లో కొచ్చింది నీరజ.

“ఆ పని చెయ్యి. అప్పుడు మామ్ నీ మొబైల్ చెక్ చెయ్యదు. నిన్ను చెక్ చెయ్యడానికి నీ వెనకాలే వస్తుంది..” తల్లి గురించి బాగా తెలిసిన రఘు చెప్పేడు చెల్లెలికి.

“ఏంటి మామ్.. నీ పిల్లల మీద నీకంత అనుమానమేంటీ!” అప్పుడే టిఫిన్ బాక్సులు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్న తల్లిని సూటిగా అడిగేసింది నీరజ.

“అనుమానం నా పిల్లలమీద కాదు. ఈ రోజులని చూస్తుంటే వచ్చిన భయం..”

“అయినా నువ్వన్నట్టు రోజులని బట్టే అయితే ఇంకా చిన్నపిల్ల, ఆడపిల్ల అయిన నీరజ గురించి ఆ మాత్రం భయపడ్డానికి అర్ధం వుంది. కానీ మగపిల్లాణ్ణి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న నామీద కూడా యేంటమ్మా నీ నిఘా!..” అర్ధంకాక అడిగేడు రఘు.

“నేనేం చిన్నపిల్లని కాదు. ఆల్రెడీ కాంపస్ ఇంటర్వ్యూలో సెలక్టయ్యేను. ఇంకో ఆర్నెలల్లో నేనూ సంపాదిస్తాను. అయినా సరే యేంటో ఈ మామ్.. అస్సలు అర్ధం కాదు..” విసుక్కుంది.

“మీ కర్ధం కాకపోతే నా కొచ్చిన నష్టం యేమీ లేదు కానీ…మీకు టైమైపోతోంది.. బయల్దేరండి..” అంటూ ఆ సంభాషణని అంతటితో ఆపేసింది మాలతి.

భర్త రామేశం, కొడుకు రఘు ఆఫీసులకీ, కూతురు నీరజ కాలేజీకీ వెళ్ళేక మిగిలిన పనులన్నీ ముగించుకుని నీరసంగా హాల్లో సోఫాలో కూలబడింది మాలతి. ఈ నీరసం పని ఒత్తిడి వల్ల వచ్చింది కాదు.. మనసులో వున్న ఆరాటం వల్ల వచ్చింది. నిన్న రాత్రి టీవీ న్యూస్ లో చూపించిన ఆ అమ్మాయిని తల్చుకున్నకొద్దీ కడుపులోంచి దుఃఖం ఎగతన్నుకు వచ్చేస్తోంది మాలతికి. ఆ అమ్మాయి పాపం క్లాస్ మేట్స్ తో కలిసి సరదాగా పార్టీకి వెళ్ళింది. వాళ్లని నమ్మింది. ఆ నమ్మకమే కొంప ముంచింది. ఆ ముగ్గురబ్బాయిలూ కూల్ డ్రింక్ లో ఏదో మత్తుమందు కలిపేసి ఆ అమ్మాయి ఫొటోలు అసభ్యకరంగా తీసేరుట. ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన విధానం, హత్య చేసిన తీరు చూపించిందే చూపించేరు టీవీలో. అది చూసినప్పట్నించీ మాలతికి ఎక్కడలేని భయం పట్టుకుంది. అసలే నీరజ అమాయకురాలు. అందరూ మంచివాళ్ళే అనుకుంటుంది. పైకి అందరూ మంచిగానే కనిపిస్తారు. ఎవరెలాంటివాళ్ళో వాళ్ల మనసులు మనకి కనిపించవు కదా!

ఆలోచనలతో అలిసిపోతున్న మాలతి ఫోన్ శబ్దంతో ఈ లోకంలోకి వచ్చింది. అది మాలతి ఫ్రెండ్ సుకన్య నుంచి వచ్చిన ఫోన్. హమ్మయ్య.. కాస్త సుకన్యతో మాట్లాడితే మనసు నెమ్మదిస్తుంది అనుకుంటూ “ఏంటే సుకూ.. ఎలా ఉన్నావ్..” అనడిగింది.

“మాలా..వర్షని చూస్తుంటే నాకేదో భయమేస్తోందే.. “ అంది సుకన్య అవతల్నించి.

ఒక్కసారిగా కుర్చీలో నిటారుగా అయ్యింది మాలతి.

“ఏమైందే!” అన్న మాలతి ప్రశ్నకి “ ఏమోనే..ఈమధ్య మొహంలో ఖంగారు, మాటల్లో తడబాటూ కనపడుతుంటే సంగతేవిటని చాలాసార్లు అడిగేను. మాట దాటేసింది కానీ ఎంత అడిగినా ఏమీ చెప్పకపోతే పోనీ దాని మొబైల్ చూస్తే ఏమైనా మెసేజ్ లుంటే తెలుస్తాయని మొబైల్ చూస్తే ఎప్పుడూ లేనిది దానికి పాస్ కోడ్ పెట్టేసుకుంది. అంటే దాని మెసేజ్ లు ఎవరూ చూడకూడదనే కదా! ఇప్పుడేం చెయ్యనే!”

“మీ ఆయనకి చెప్పేవా!”

“చెప్పేను.. తొందరపడకు.. నెమ్మదిగా అడుగుదాం అంటున్నారు. నాకేంటో గాభరాగా ఉందే..”

మాలతికి కూడా ఏం చెప్పాలో తెలీలేదు. “ఖంగారు పడకు. దాన్నేమీ కేకలెయ్యకు. ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు. నీరజ వచ్చేక వర్ష గురించి దానికేవైనా తెల్సేమో అడుగుతాను. నువ్వు దానితో మామూలుగానే మాట్లాడుతుండు.” అని చెప్పి ఫోన్ పెట్టేసింది మాలతి.

సుకన్య కయితే ఏదో సలహాలాంటిది చెప్పింది కానీ మాలతి మనసులో ఆరాటం మటుకు తగ్గటంలేదు. ఎలా ఈ పిల్లల్ని పెంచడం.. వీళ్ళు పెద్దవాళ్ళయ్యారనుకోవాలా.. లేక ఇంకా చిన్నతనం పోలేదనుకోవాలా!.. లేక ఈ రోజుల్ని చూసి భయపడాలా!

ఇదివరకులా ఆడపిల్లల్ని పెళ్ళీ పిల్లలూ అని కాకుండా చదువూ, ఉద్యోగం అంటూ పెంచుతున్నారు. టెక్నాలజీ ఊపందుకోవడంవల్ల చాలామందికి ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చేయి. జీవన సరళి మారింది. లైఫ్ స్టైల్ మెరుగయింది. ఇదివరకు లగ్జరీలుగా అనుకునేవన్నీ యిప్పుడు కనీసావసరాలయి కూర్చున్నాయి. ఇంట్లో ప్రతి మనిషికీ ఒకొక్క మొబైల్. కాస్త బిజినెస్ గట్రా వున్నవాళ్ళకయితే రెండూ, మూడూ కూడా మొబైల్స్ వాడుతున్నారు. బాగానేవుంది. చెప్పుకోదగ్గ అభివృధ్ధే మరి. కానీ దానికి తగ్గట్టు మనిషిలో వుండే మానవత్వం ఎదగాలి కదా! అది మటుకు ఎక్కడికి పోయిందో ఎక్కడ చూసినా విపరీతమైన వార్తలే.

ఎందుకిలా జరుగుతోందని ఎవరిని అడిగినా ప్రస్తుతం యువత మాదకద్రవ్యాలకు బాగా అలవాటు పడ్డారనీ, ఆ మత్తులో వాళ్ళేం చెస్తున్నారో వాళ్ళకే తెలీటంలేదనీ అంటున్నారు. అలా ఎలా అలవాటు పడతారూ! ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలేం చేస్తున్నారో చూసుకోరా! అదిగో.. అలా తను చూస్తున్నందుకే రఘు తనని ఎత్తి చూపిస్తున్నాడు. నీరజ తన మీద విసుక్కుంటోంది. మళ్ళీ నీరజ ఫోన్ చెక్ చేస్తే నిజంగానే పాస్ కోడ్ పెట్టేసుకుంటుందేమో.. అంటే తను పెంచిన పిల్లని తనే అనుమానించే స్థితికి తీసుకొచ్చిన ఈ సమాజధోరణికి విస్తుపోయింది మాలతి.. ఇప్పుడు తనేం చెయ్యాలి.. ఇంతకీ పాపం వర్ష సంగతి యేమిటో.. సుకన్యని జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యమని చెప్పాలి. అంటే ఏం చెయ్యాలీ… ఆలోచించి ఆలోచించి మాలతికి అలసట వచ్చేసింది.

ఆ రాత్రి భోజనాలయ్యేక నీరజ గదిలోకి వచ్చి పని చేసుకుంటున్న నీరజ పక్కకొచ్చి నిలబడింది మాలతి. “ఏం కావాలమ్మా..” అని అడిగిన నీరజతో, “ఈమధ్య వర్షతో మాట్లాడేవా!” అని సూటిగా అడిగేసింది. సీరియస్ గా పని చేసుకుంటున్న నీరజ తల్లి వైపు తిరిగి “ఏమైంది వర్షకీ!” అనడిగింది. ఒక్కసారి మంచం మీద కూలబడి, “మధ్యాహ్నం సుకన్యాంటీ ఫోన్ చేసింది. ఈ మధ్య వర్ష ఇదివరకులా లేదుట..తన ఫోన్ కూడా లాక్ చేసేసుకుంటోందిట. ఆంటీ అడిగినా ఏమీ చెప్పటంలేదుట. సుకన్య భయపడుతూ నాకు ఫోన్ చేసింది..” అంది మాలతి నెమ్మదిగా.

నీరజ ఒక్కసారిగా లేచి మాలతి దగ్గరికి వచ్చి, “ అమ్మా, ఖంగారు పడకు.. నేను కనుక్కుంటాను..” అంటూ “అన్నయ్యా..” అంటూ రఘూ రూమ్ లోకి వెళ్ళింది. వెనకాలే మాలతి కూడా వెళ్ళింది.

“అన్నయ్యా, సైబర్ క్రైమ్ చూసేవాళ్ళలో నీ ఫ్రెండెవరో ఉన్నారన్నావు కదూ..ఇప్పుడిక్కడే వున్నాడా ఆ ఫ్రెండ్?” అనడిగింది.

“ఎందుకు.. ఏవయిందీ” అన్న రఘు ప్రశ్నకి సమాధానంగా తల్లికీ, అన్నయ్యకీ నీరజ వర్ష గురించి తనకి తెలిసున్నదంతా చెప్పింది.

వర్ష ప్రమోద్ అనే అబ్బాయితో చాలా స్నేహంగా వుండేది. ఏదో ఆఫీసులో మాట్లాడుకోవడం కాకుండా అతనితో కలిసి పార్టీలకి కూడా వెళ్ళేది. నీరజ హెచ్చరిస్తే కూడా వినిపించుకోలేదు. పదిరోజులక్రితం ప్రమోద్ ఫ్రెండ్స్ కలిసి రిసార్ట్ కి వెడుతున్నారనీ, తనని కూడా రమ్మన్నారనీ, తనకి సాయంగా నీరజని కూడా రమ్మని పిలిచిందిట వర్ష. కానీ నీరజ తను రానని చెప్పడమే కాకుండా వర్షని కూడా వెళ్ళడం మంచిదికాదని చెప్పిందిట. అప్పటికి వెళ్ళననే చెప్పిందిట నీరజకి. కానీ వర్ష ప్రమోద్ తో కలిసి రిసార్ట్ కి వెళ్ళినట్టు తర్వాత తెలిసిందిట. అప్పట్నించీ వర్ష నీరజని తప్పించుకు తిరుగుతోందిట. ఇప్పుడు మాలతి చెప్పిన సంగతి విన్నాక ఆ ప్రమోద్ వర్షని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడేమోనంటూ ముగించింది నీరజ.

వింటున్న శ్రోత లిద్దరూ దిగ్భ్రాంతులయ్యేరు. కాసేపటికి తేరుకున్న మాలతి “అయ్యో.. మరిప్పుడెలాగే.. ఆ వర్ష ఏమైపోతుందిప్పుడూ! ఆ యింటి పరువూ మర్యాదా..” అంటున్న మాలతితో

“నువ్వు ఖంగారు పడకమ్మా. నా ఫ్రెండ్ విరించి వున్నాడు.. వర్ష పేరు బయటికి రాకుండా వాడిలాంటివి బాగా ట్యాకిల్ చేస్తాడు. వర్ష కేమీ భయం లేదు.. “ అంటూ తల్లికి ధైర్యం చెప్పి,

“చెల్లాయ్, పద.. సుకన్యాంటీ ఇంటికి వెడదాం.” అంటూ నీరజని బయల్దేరదీసేడు.

“నువ్వు వెడతావా..” అంది మాలతి ఆశ్చర్యంగా.

“అమ్మా, వర్ష కూడా నాకు నీరజలాంటిదే.. ఇలాంటి ఆపద మన నీరజ కొస్తే నేనూరుకుంటానా..” అంటున్న రఘు మాటలు మాలతి మనసుకి మంచిగంధంపూతలా అనిపించేయి.

ఆ తర్వాత విషయాలన్నీ వరసగా జరిగిపోయేయి. నీరజని వర్షకి తోడుగా వాళ్ళింట్లో అట్టిపెట్టి వర్ష మొబైల్ తీసుకుని తన ఫ్రెండ్ విరించి దగ్గరికి వెళ్ళేడు రఘు. మాయమాటలు చెప్పి పార్టీలంటూ పిలిచి, ఆడపిల్లల ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆ సైబర్ దుర్మార్గుల్ని శోధించి పట్టుకునే పని పోలీసులకి అప్పగించి, వర్షకి సాయంగా కూర్చున్న నీరజని తీసుకుని యింటికి వచ్చేడు రఘు. అప్పటికే సుకన్య మాలతికి ఫోన్ చేసి రఘూకి లెక్కెలేనన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పమని చెప్పింది.

ఇంటికి వచ్చిన పిల్లలిద్దర్నీ చూసిన మాలతి మనసు ఏదో తెలీని భావోద్వేగంతో నిండిపోయింది. “మామ్, ఇంకా వెధవల పని పోలీసులు చూసుకుంటారు. నువ్వు హాయిగా నిద్రపో..” నవ్వుతూ అన్నాడు రఘు బూట్లు విప్పుకుంటూ..

“సుకన్యాంటీ నీకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పమందిరా..” అంది మాలతి.

“ఇందులో కృతజ్ఞత లెందుకమ్మా! మన నీరజలాగే వర్షకూడా నాకు చెల్లెల్లాంటిదే కదా!” అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయేడు.

మాలతి మనసు పదే పదే రఘు మాటలనే మననం చేసుకుంటోంది. “నీరజలాగే వర్షకూడా చెల్లెల్లాంటిదే..” అని రఘు మామూలుగా అన్నమాట మాలతిలోని సంఘర్షణకు సమాధానంగా అనిపించింది.

తన కాలేజీరోజులు గుర్తొచ్చేయి.అవును..తను కాలేజీలో చదువుకునేటప్పుడు సుకన్యా తనూ బాగా క్లోజ్ గా వుండేవారు. ఇద్దరూ కలిసే అన్నిచోట్లకీ తిరిగేవారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళే టైమ్ కి చీకటి పడితే ఆ టైమ్ కి వాళ్ళింట్లో వుంటే సుకన్యా వాళ్లన్నయ్య తనని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేవాడు. ఒకవేళ సుకన్య కనక తమింట్లో వుంటే రవన్నయ్య సుకన్యని జాగ్రత్తగా వాళ్ళింట్లో దింపి వచ్చేవాడు. ఎందుకనీ అని ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది.. ఆ అమ్మాయి కూడా తన చెల్లెలు లాంటిదే అనే భావనే వాళ్లని అలా జాగ్రత్తగా దింపేలా చేసింది.

అలాగే ప్రతి మగవాడూ ఆడపిల్లల్ని తమ తోబుట్టువుల్లా భావిస్తే ఇంక ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయీ! ఎక్కడో మాదకద్రవ్యాలకి అలవాటు పడినవాళ్ల గురించి వదిలేస్తే రోజూ మన చుట్టూ తిరుగుతూ, మన చుట్టాల్లో, స్నేహితుల్లో ఇలా ప్రతి అమ్మాయీ తన తోబుట్టువే అనే భావన కలిగితే ఇలాంటి అఘాయిత్యాలు జరగవుకదా! మగపిల్లలందరూ అలా అనుకోవాలంటే ఏం చెయ్యాలీ.. మగపిల్లల్ని ఎలాపెంచితే అలా భావిస్తారూ.. ఆలోచిస్తుంటే ఈ సమస్యకు పరిష్కారం తల్లితండ్రులు పిల్లలకు నేర్పే విలువల మీదే వుందనిపించింది. ఒకసారి మంచి విలువలని పిల్లలకి నేర్పిస్తే అది ఆ పిల్లలకీ, తల్లితండ్రులకీ, కుటుంబానికే కాదు..సమాజానికే మంచి జరుగుతుందనిపించింది. ఆడపిల్లలకీ, మగపిల్లలకీ కూడా అలాంటి విలువలు తల్లితండ్రులు నేర్పడానికి సమాజాన్ని యెలా చెతన్య పరచాలా అని ఆలోచన మొదలెట్టింది మాలతి.

*****

 

2 thoughts on “మా చెల్లీ… బంగారుతల్లీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *